అస్తిత్వవాదసాహిత్యం-5
ఒక భారతీయపరిచయం:
కాఫ్కా-1
(కాఫ్కా కథకు సంక్షేప అనువాదం)
తీర్పు (“Das Urteil": "The Judgment", )
(కాఫ్కా కథకు సంక్షేప అనువాదం)
ఆదివారం ఉదయం.వయసొచ్చిన వసంతకాలం. జెవోర్గ్ యువకుడు. వ్యాపారి.
మేడమీద తనగదిలో ఉత్తరంరాయడం ముగించాడు,ప్రస్తుతం రష్యాలో ఉన్న తన చిన్ననాటి స్నేహితుడికి.ఉత్తరం కవర్ లో పెట్టి, టేబుల్ అంచున కూర్చొని, కిటికీలోనుండి కనిపిస్తున్న నదిని, నదిమీద వంతెనను, వంతెనకు అవతల పచ్చటి తీరప్రాంతాన్ని చూస్తున్నాడు.
తన మిత్రుడు చాలాకాలం యిక్కడ ఏ పనిలోనూ ముందుకు పోలేక, రష్యా వెళ్ళిపోయి, పీటర్స్ బర్గ్ లో ఏదో వ్యాపారంలో బాగా స్థిరపడ్డాడు.కాని కొంతకాలం తరువాత వ్యాపారంలో ఎదుగు లేదు. ఇక్కడికి రాకపోకలు బాగా తగ్గిపోయాయి. వచ్చినపుడు తనతో కష్టాలు చెప్పుకునే వాడు.
దూరదేశంలో భారంగా బతుకు లాగుతున్నాడు.అలవాటులేని గడ్డం పెంచినా, ముఖంలో కుర్రవయసు కనిపిస్తూనే ఉంది.కాని లోపల ఏదో జబ్బు తనతోపాటు ముదురుతున్నట్టు కూడా తెలుస్తోంది. పరాయిదేశంలో పరిచయాలుతక్కువ.స్వదేశంలో సంబంధాలు తెగిపోయాయి.ఈ జన్మకు పెళ్ళి ఆలోచన వదిలేశాడు.
అటువంటివాడికి ఏమిటి రాయడం? జాలిపడవచ్చు.అంతకుమించి చేయగలిగింది లేదు.”మన దేశానికి వచ్చెయ్, యిక్కడ మనవాళ్ళు నీవు స్థిరపడడానికి ఏదో ఒకటి చేస్తారు”, అని చెప్పవచ్చు.
కాని, అలా చెప్పడమంటే తన వైఫల్యాన్ని గుర్తుచేసి అతన్ని గుచ్చడమే కదా? అదీ కాక, తీరా వాణ్ణి యిక్కడి రమ్మని, యిక్కడి వాళ్ళు వాడికి చేయవలసిన సహాయం చేయలేక, అతడు యిక్కడా అదే స్థితిలోకి జారితే?
పైగా అతడే అన్నాడు, ‘నేనిపుడు అక్కడకు వచ్చినా, అక్కడా నేను పరాయివాణ్ణే’, అని.
ఇక్కడకు వచ్చి మరొక్కసారి విఫలమయేకంటే, అక్కడే తన పాట్లేవో తనుపడడం మేలుకదా?
వాడు యిక్కడికి వచ్చి మూడేళ్ళయింది. రాకపోవడానికి కారణం అక్కడి రాజకీయవాతావరణం అన్నాడు.తనలాంటి చిల్లరవ్యాపారి కొద్దిరోజులు కూడా దేశం వదిలి వెళ్ళడం మంచిదికాదు.
ఇక యిక్కడ తన విషయం. ఈ మూడేళ్ళలో తన వ్యాపారం బాగా వృద్ధిచేసుకున్నాడు.రెండేళ్ళక్రితం తన మిత్రుడికి జెవోర్గ్ తల్లి పోయినట్టు తెలిసింది.సంతాపసందేశం పంపాడు. పొడి మాటలు.
ఇక్కడ జిఓర్గ్ తల్లి పోయినతరువాత అతడి వ్యాపారకౌశలంకూడా చాలా పెరిగింది.తల్లి ఉండగా, అంతా తండ్రి చూచుకునేవాడు. తనను వేలు పెట్టనిచ్చేవాడు కాదు.తల్లి పోయిన తరువాత, తండ్రి ఎక్కువగా కలగజేసుకోడం లేదు. ఏమైనా వ్యాపారం ఊహించనంతగా పెరిగింది, యింకా పెరుగుతుంది.
ఇదంతా తన మిత్రుడికేమీ తెలియదు.తన తల్లిపోయినపుడు తనకు రాసిన సంతాపలేఖ చివర, “ నీవూ యిక్కడికి వచ్చెయ్, నీవు చేస్తున్న వ్యాపారానికి యిక్కడ యింకా మెరుగైన అవకాశాలున్నాయి”, అని రాశాడు.
కాని తను మాత్రం తన వ్యాపారం యిక్కడ బాగున్నదని అతడికి రాయలేదు.ఎప్పుడైనా రాస్తే, ఏవో ఊళ్ళో ముచ్చట్లు, అప్పటికి గుర్తొచ్చినవి రాసేవాడు. తన ఊళ్ళో ఎవడికో ఎవరో అమ్మాయితో పెళ్ళి నిశ్చయమయిందని మూడు సార్లు రాసిన మూడు ఉత్తరాలలో రాశాడు కాని, తన పెళ్ళి ఒక ధనవంతుల పిల్లతో ( ఫ్రీడా బ్రాండ్డెన్ ఫెల్డ్ ) నిశ్చయమయిందని రాయలేదు.
తన మిత్రుడిగురించి, తనకు అతడికి నడిచే ఉత్తరాల గురించి పెళ్ళికూతురికి చెప్పాడు. ఆ అమ్మాయి, “ అయితే, మీ మిత్రుడు మన పెళ్ళికి రాడా మరి? అదెలా? నీ స్నేహితులందరూ నాకు తెలియాలి”, అంది.
“ నాకు అతన్ని యిబ్బంది పెట్టడం యిష్టం లేదు.నన్ను సరిగా అర్థం చేసుకో. వాడు వస్తే రావచ్చు. నాకా నమ్మకం ఉంది.కాని వాడు యిబ్బంది పడతాడు, బాధపడతాడు.నన్నుచూసి వాడు అసూయపడవచ్చు.అసంతుష్టుడై ఒంటరిగా తిరిగి వెళ్ళిపోతాడు. అర్థమౌతోందా?”
“ అవుతోంది.కాని,మన పెళ్ళి విషయం ఆయనకు తెలియకుండానే ఉంటుందా? “
“నేనెలా అడ్డుపడను? కాని తెలియడానికి అవకాశం లేదు.“
“ అటువంటి స్నేహితుడున్నపుడు నీవసలు పెళ్ళికి సిద్ధమై ఉండకూడదు.”
“నిజమే.ఆతప్పు మనిద్దరిదీ. కాని, యిది మరోలా జరగాలని నేను యిప్పుడుకూడా అనుకోడం లేదు.”
అతడి ముద్దులమధ్య ఊపిరి తీసుకుంటూ, ఫ్రీడా, “ ఏమైనా, నాకు బాధగానే ఉంది”, అన్నపుడు, అతడికి అనిపించింది, మిత్రుడికి చెప్పినందువల్ల నష్టమేమీ ఉండకపోవచ్చని. “అది నా దారి.అతడు అలానే నన్ను ఆమోదించాలి”, అని. నా మిత్రుడికి ఆమోదదయోగ్యమయేవిధంగా బతకలేను.నాకు కావలసిన బతుకు నేను బతుకుతాను.”
ఈ ఆదివారం రాసిన సుదీర్ఘమైన ఉత్తరంలో తన పెళ్ళినిశ్చయం ప్రకటించాడు: “ అతి ముఖ్యమైన విషయం చివరివరకు వాయిదా వేశాను.కుమారి ఫ్రీడా బ్రెండెన్ ఫీల్డ్ తో నా పెళ్ళి నిశ్చయమయింది.అమ్మాయిది బాగా ఉన్నవాళ్ళ కుటుంబం.నీవు యిక్కడనుంచి వెళ్ళిపోయాక వాళ్ళు యిక్కడకు వచ్చి స్థిరపడ్డారు.ముందు ముందు ఆమె గురించి యింకా చెబుతుంటాను.నేను చాలా సంతోషంగా ఉన్నాను.పెళ్ళికూతురు నీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఉత్తరం కూడ రాస్తుంది.నీకు ఒక మంచి మిత్రురాలు దొరుకుతుంది. ఒక బ్రహ్మచారికి మంచి విషయమే కదా! నా పెళ్ళికంటే నీకు మంచి అవకాశం ఏముంటుంది? అన్ని సమస్యలు పక్కకు పెట్టి వచ్చెయ్. అయినా నీ యిష్టం, నీ బాగోగులు ఆలోచించుకో. ”
కాసేపు కిటికీ లోనుంచి శూన్యపుచూపులు చూసి, ఉత్తరం జేబులో పెట్టుకుని, తండ్రి గదిలోకి వెళ్ళాడు.కొన్ని నెలలయింది ఆ గదిలోకి అడుగుపెట్టి.వెళ్ళవలసిన అవసరం కూడా లేకుండింది.వ్యాపారవిషయాలలో కలుస్తూనే ఉండేవాళ్ళు. మధ్యాహ్నం యిద్దరూ బయటకు వెళ్ళి తినేవారు.రాత్రి ఎవరికి కావల్సింది వారు వడ్డించుకుని తినేవారు.
హాల్లో యిద్దరూ కలిసి కూర్చొనేవారు, ఎవరి వార్తాపత్రిక వాళ్ళు చదువుతూ.ఒక్కోసారి కొడుకు బయటకు వెళ్ళేవాడు, స్నేహితుల్నో, ఫ్రీడానో కలవడానికి.
జిఓర్గ్ కు ఆశ్చర్యమేసింది, తండ్రి గది యింత చీకటిగా ఉందా! తండ్రి కిటికీ దగ్గర కూర్చున్నాడు.ఆయన భార్య జ్ఞాపకాల వస్తువులేవో ఉన్నాయక్కడ.చూపు సరిగా లేదేమో, పేపర్ కంటికి దగ్గరగా ఉంచుకొని చదువుతున్నాడు. టేబుల్ మీద తినగా మిగిలిన, ఉదయాహారం ఉంది.తిన్నదానికంటే వదిలిందే ఎక్కువ.
“ఆహ్, జిఓర్గ్!”, అంటూ తండ్రి కొడుకు దగ్గరకు వచ్చాడు.లేచి వస్తున్న తండ్రిని చూస్తూ, “ఆహ్ ! మా నాయనది యిప్పటికీ పెద్దశరీరమే”, అనుకున్నాడు. “ఇక్కడ చీకటి దుర్భరం”, అన్నాడు.
తండ్రి, “ అవును, చీకటే.”
“కిటికీ మూశావా?”
“నాకు అదే యిష్టం.”
“బయట వెచ్చగా ఉంది.”
టేబుల్ మీద ప్లేట్లు తీసి పక్కనున్న కబర్డ్ లో పెట్టాడు తండ్రి.
“ ఏం లేదూ. నా పెళ్ళి విషయం పీటర్స్ బర్గ్ కు చెప్పాను.”
“పీటర్స్ బర్గ్ ?”
“అదే, నా ఫ్రెండ్.”
“అవునవును. నీ ఫ్రెండ్.”
“నాన్నా! నీకు గుర్తుందా? ఈ విషయం వాడికి చెప్పవద్దనుకున్నాను. కేవలం వాడి గురించి ఆలోచించి. నీకు తెలుసు కదా? అతడితో కష్టం. నా పెళ్ళి గురించి మరెవరిద్వారానో తెలుసుకోనీ, అనుకున్నాను. వాడికి పరిచయాలు తక్కువ కనుక, అదికూడా జరగదు.కాని నేను మాత్రం చెప్పవద్దు అనుకున్నాను.”
“అయితే, మనసు మార్చుకున్నావు? “
“అవును. ఆలోచించాను.అతడు మంచి స్నేహితుడైతే, నా పెళ్ళి అతడికి కూడా మంచిదే కావలె. కాని ఉత్తరం వేసేముందు నీతో చెబుదామనుకున్నాను.”
బోసినోరు పెద్దది చేస్తూ అన్నాడు తండ్రి: “జిఓర్గ్! చూడు! ఈ విషయం చర్చించడానికి వచ్చావు నా దగ్గరికి. అది నాకు పెద్ద మన్నన.కాని పూర్తి విషయం చెప్పకపోతే, చెప్పి ఏం లాభం? ఈ సందర్భానికి సంబంధించని విషయాలు కదిలించడం నాకిష్టం లేదు.అమ్మ పోయినప్పటినుండి కొన్ని జరగకూడనివి జరుగుతున్నాయి.వ్యాపారంలో నాకు తెలియకుండా ఏవో జరుగుతున్నాయి.కావాలని నా వెనకాతల ఏదో జరుగుతోందని అనుకోడం నాకిష్టం లేదు.
వెనకలాగ యిప్పుడు నాకు ఓపిక ఉండడం లేదు.మతిమరుపు. కొంత పెత్తనం.కొంత అమ్మపోవడం.అది నీ కంటే నన్ను బాగా కుంగదీసింది.ప్రస్తుతం యీ ఉత్తరం విషయం. జిఓర్గ్! దయచేసి నన్ను నిరాశపరచొద్దు.చాలా చిన్న విషయం.నీకసలు నిజంగా ఒక మిత్రుడున్నాడా, పీటర్స్ బర్గ్ లో? “
జిఓర్గ్ తడబడ్డాడు.లేచి నిలబడ్డాడు. “ నా స్నేహితుల్ని వదిలెయ్. వెయ్యిమంది స్నేహితులైనా మా నాన్నకు సమానం కారు.నాకేమనిపిస్తోందో తెలుసా ? నీ విషయం నీవు ఏమాత్రం పట్టించుకోడం లేదు. వయసు పైబడుతోంది. దాన్ని గుర్తించాలి కదా? వ్యాపారంలో నీవు నాకు చాలా అవసరం.కాని నీ ఆరోగ్యం? రేపు మొత్తం మూసేస్తాను.ఇలా జరక్కూడదు.మరో మార్గం చూడాలి. నేలమట్టంనుండి.ఇక్కడ యీ చీకటిగదిలో కూర్చుంటావు.హాల్లో వెలుతురుంటుంది కదా? పొద్దున టిఫిన్ ఏదో తిన్నాననిపిస్తావు.కిటికీమూసి మూల కూర్చుంటావు.ఇలా కాదు.రేపు డాక్టర్ ను పిలుస్తాను.ఈ చీకటిగదిలోనుండి ముందుగదిలోకి మారు. సరే అవన్నీ నిదానంమీద.ముందు పడుకో, విశ్రాంతి తీసుకో.ఉండు, బట్టలు మారుస్తా, పడుకుందువు.నేను మార్చగలను.లేదు, యిప్పుడే ముందుగదిలోకి మారుతావా? నా పక్కమీద పడుకో ప్రస్తుతానికి. అదే మంచిది.”
జిఓర్గ్ తండ్రి పక్కన నిలబడ్డాడు.తండ్రి అతడి రొమ్ముకు తల ఆన్చాడు. “జిఓర్గ్! “ అని ఏదో చెప్పబోతున్నాడు. జిఓర్గ్ వెంటనే తండ్రి పక్కనే మోకరిల్లాడు,వినడానికి. “ జిఓర్గ్! నీకు పీటర్స్ బర్గ్ లో స్నేహితుడెవడూ లేడు.నీవు మొదటినుండీ జోకరువి. నాకు కూడా కాకమ్మ కబుర్లు చెబుతావు.పోయి పోయి పీటర్స్ బర్గ్ లో నీకు స్నేహితుడు! నేను నమ్మను.”
“నాన్నా ! గుర్తు తెచ్చుకో.మూడు సంవత్సరాల కింద మన యింటికి వచ్చాడు. నీకంత యిష్టం లేదు వాడంటే.అందుకనే వాడు నా గదిలోనే ఉంటున్నా నీకు చెప్పలేదు నేను. వాడిని యిష్టపడడం కష్టమే, నాకు తెలుసు. కాని అతడితో నీవు బాగానే మాట్లాడేవాడివి.గట్టిగా ప్రయత్నంచెయ్, గుర్తొస్తాడు.రష్యన్ విప్లవంగురించి నమ్మలేని కథలు చెప్పేవాడు.ఆ కథ ! అతడొకసారి కీవ్ ( Kiev) వెళ్ళినపుడు ఒక పూజారి ( priest) కత్తితో తన చేతిని కోసుకుని, ఆ చేయి చూపుతూ జనాలకు ప్రవచనం చేశాడు. నీవే ఎన్నోసార్లు యీ కథ జనాలకు చెప్పేవాడివి.”
జిఓర్గ్ యీ మాటలు చెబుతూనే, తండ్రిని పడుకోబెట్టటానికి ఆయన జెర్సీ ట్రౌజర్స్ లాగేశాడు. లోపలి చెడ్డీ మురికి పట్టి ఉంది.జిఓర్గ్ తనను తాను నిందించుకున్నాడు తండ్రి అవసరాలు యింతకాలం పట్టించుకోకపోయినందుకు.పెళైనతరువాత తన తండ్రిని ఎలా చూచుకోవాలో ఫ్రీడాతో యింతవరకూ మాట్లాడలేదు.ఎందుుకంటే, తమ పెళ్ళి అయి యిల్లు మారినపుడు, తండ్రి పాత యింటిలోనే ఉండిపోతాడనుకున్నారు.
తండ్రిని తన చేతులలోకి ఎత్తుకొని తీసుకెళ్లి పక్కమీద పడుకోబెట్టాడు.అలా తీసుకెళుతున్నపుడు,తండ్రి తన చేతి గడియారం గొలుసుతో ఆడుకుంటున్నట్టు అనిపించింది. గొలుసు గట్టిగా పట్టుకోడంతో ఆయనను విడిపించి పక్కమీద పడుకోబెట్టడం అంత సులభం కాలేదు.కాని పడుకోగానే ఆయన మామూలైపోయాడు.బుజాలపైకి దుప్పటి లాగి కప్పుకున్నాడు.చూపులో అప్రసన్నత లేదు.
“గుర్తొచ్చాడు కదూ? “, అన్నాడు జిఓర్గ్.
“బాగా కప్పుకున్నానా?”,అని అడిగాడు తండ్రి, పాదాలు కనిపించడం లేదన్నట్టు.
“చూశావా? పడుకుంటే హాయిగా ఉందికదూ?”,అన్నాడు జిఓర్గ్, దుప్పటి బాగా కప్పుతూ.
“ పూర్తిగా కప్పావా?”, అడిగాడు తండ్రి.
“పూర్తిగా కప్పాను.హాయిగా పడుకో.”
“ ఊహూ!”, అంటూ ఒక పెద్ద కేకవేసి, కప్పిన దుప్పటి లాగి పైకి విసిరేస్తూ, లేచి నిలబడ్డాడు, బృహత్కాయుడు. కోపవేగంలో తూలి, తట్టుకొని నిలబడ్డాడు. “నాకు తెలుసు, నీవు నన్ను కప్పెట్టెయ్యాలని చూస్తున్నావు.అది నీ వల్ల కాదు. నీ స్నేహితుడు నాకు బాగా తెలుసు.అతడు నా కొడుకు అయి ఉంటే నేను యిష్టపడేవాడిని. అందుకే యిన్నాళ్ళూ నీవతన్ని వంచించావు. అందుకు కాక మరెందుకు? అతడికోసం నేను కన్నీరు కార్చలేదనుకుంటున్నావా? అందుకే నీవు నీ గదిలో కూర్చుని, -అయ్యగారు మహా బిజీ కదా! -తలుపులు మూసుకొని, నీ రష్యా మిత్రుడికి దొంగ ఉత్తరాలు రాసుకున్నావు. వాణ్ణి కిందకు లాగి, వాడి పైకెక్కి కూర్చొని, కదలకుండా చేయడానికే కదా, నా సుపుత్రుడు పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు! “
జిఓర్గ్ తండ్రి ఉన్న భయంకరమైన స్థితిని చూస్తూ ఉండిపోయాడు.తన మిత్రుడు మునుపెన్నడూ. లేనంత గట్టిగా పట్టుకున్నాడు తనను.అంత దూరం ఎందుకు వెళ్ళిపోయాడు? అతడు, అతడి వ్యాపారం అంతా సర్వనాశనం. తన కళ్ళముందు కరిగిపోతున్న కల.
“ ఇదిగో ! యిటు చూడు! ఆ వగలమారి వయ్యారి, పావడా పైకెత్తి, యిదిగో యిట్లా పైకెత్తి పైకెత్తి నిన్ను తన వెంట తిప్పుకొంది. దానికోసం నీ మిత్రుడికి ద్రోహం చేశావు, ఏ అడ్డు లేకుండా దాంతో కులకొచ్చని.నీ తల్లి పవిత్రాత్మ స్మృతిని అపవిత్రం చేస్తున్నావు.నీ తండ్రిని కప్పెట్టేస్తున్నావ్, కదలకుండా. కాని, కదులుతాడు. చూడు! “, అంటూ అన్నీ వదిలించుకొని లేచి నిలబడ్డాడు.
“ఇప్పుడు ఆ స్నేహితుడు వంచించబడలేదు”, అని, తన తర్జని ఊపుతూ, “నేను అతడి ప్రతినిధిని.”
“కామెడీ! “ అని అప్రయత్నంగా అనేశాడు జిఓర్గ్.
“అవును.కామెడీ! పెళ్ళాం పోయిన ముసలాడి బతుక్కి కామెడీ కాక ఏముంటుంది? అంగడి వెనకగదిలో మగ్గిపోతూ, వ్యాపారం పెంచుతూంటే , నా కొడుకు జల్సాలు చేశాడు.నీవంటే నాకు ప్రేమ లేదంటావ్!
“ఇప్పుడు ముందుకు వంగి పడిపోబోతాడు”, అనుకున్నాడు జిఓర్గ్.
తండ్రి ముందుకు వంగాడు,, కాని పడిపోలేదు.కొడుకు ముందుకు దూకలేదు పడిపోబోతున్న తండ్రిని పట్టుకోడానికి. పడిపోబోయిన తండ్రి నిటారుగా నిలుచున్నాడు.
“ఆగు! నీ అవసరం లేదు! నేనింకా నీకంటే బలమైనవాడిని.నీ మిత్రుడితో నేను సుఖంగా ఉండగలను.అమ్మ నాకు ఆ శక్తినిచ్చింది.నీ మిత్రుడు యిప్పుడు నా జేబులో ఉన్నాడు. నాతో. నాటకాలాడుతావా,నీ ఫ్రెండ్ కు ఉత్తరం రాస్తావా నీ పెళ్ళి గురించి? వాడికంతా ఎప్పుడో తెలుసు.నేను రాశాను వాడికి. నీవు కాగితం కలం లాగేసుకోడం మర్చిపోయావు కదా! నీ ఉత్తరాలు. ఎడంచేత్తో నలిపేస్తూ, కుడిచేత్తో నా ఉత్తరాలు పట్టుకొని చదువుతాడు. కొన్నేళ్ళుగా ఎదురుచూస్తున్నా, యీ ప్రశ్నతో నా దగ్గరకొస్తావని! నేను పేపర్లు చదువుతానని తెలుసా? “, అంటూ, ఒక పాత పత్రిక తనముందుకు తోశాడు. “ ఎంతకాలం పడుతుంది నీకు ఎదగడానికి? తల్లి చనిపోవాలి.ఎదిగిన కొడుకును చూసుకునే అదృష్టం లేదు ఆమెకు.మిత్రుడు రష్యాలో నష్టమైపోతున్నాడు.ఇక నేను! చూస్తున్నావు కదా! ఏమై పోతున్నానో? కళ్ళున్నాయి కదా? చూడు!
జిఓర్గ్ అన్నాడు: “నా కోసం కాచుక్కూచున్నావన్నమాట! “
జాలిగా అన్నాడు తండ్రి, “ బహుశా యీ మాట ముందే అందామనుకొని ఉంటావు.కాని యిప్పుడు ఆ మాట అతకదు.” గొంతు పెంచుతూ యింకా అన్నాడు: “ నీ వెలుపల ఏముండిందో నీకు తెలుసా? ఇంతవరకు నీకు నీవు మాత్రమే తెలుసు! నిజానికి నీవు ఒక అమాయకపు పిల్లవాడివి, కాని అంతకంటే నీవొక దయ్యపు మనిషివి. కాబట్టి, విను! నీకు నేను నీటిలో మునిగి చావమని మరణదండన విధిస్తున్నాను! “
జిఓర్గ్ కు తనను గదిలోనుండి తండ్రి తరిమేసినట్టనిపించింది.వెళ్ళిపోతున్నపుడు అతనికి తన తండ్రి పక్కపై కూలిపోయినట్టనిపించింది.మెట్లు దిగుతున్నపుడు జారుడుబండమీద కిందికి పోతున్నట్టనిపించింది. మెట్లమీద ఎదురొస్తున్న పనిమనిషి అతణ్ణి చూసి, “జీసస్”, అని ఒక కేక వేసింది.అతడు యిల్లు దాటి నదివైపు పరుగెత్తాడు.వంతెన కడ్డీ పట్టుకున్నాడు.నదివైపుకి దూకి వేలాడాడు, ఒకప్పుడు తన తల్లిదండ్రులు తనను చూచి గర్వపడిన మంచి క్రీడాకారుడి లాగా. నదివైపు కడ్డీ పట్టుకుని వేలాడుతూ, నదిలోకి పడిపోతూ, “ నా తల్లిదండ్రులారా! నేను మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమించాను”, అంటూ కడ్డీ వదిలేశాడు.
*****
కథ గురించి, కాఫ్కా గురించి వచ్చే వారం.