Sunday, November 1, 2020

 

Just come out! 

అవీ యివీ ముచ్చట్లు

 అవీ యివీ ముచ్చట్లు : 


షేక్స్ పియర్ , డాంటేలు యూరపును  పంచేసుకున్నారు, అన్నాడు ఎలియట్ . యుగాలముందే, వాల్మీకి,  వ్యాసుడు (వ్యాసవాల్మీకులు అనికూడా కొందరంటారు) భరతవర్షాన్ని ఆక్రమించుకున్నారు. తులసీదాసు, ఉత్తరభారతాన్ని  తుంచుకున్నాడు . పోతన తెలుగునాట నాటుకున్నాడు. ఆంధ్రమహాభారతం మాత్రం తెలుగుదేశంలో  మూలల్లో దాగి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నది, మళ్లీ మళ్లీ వ్రతభంగమైనట్టు . 


కొంతసేపు పడమటికి తిరిగి దణ్ణం పెడదాం. ఇంగ్లీషు తెలిసినవాడెవడైనా షేక్స్ పియర్  చదవవచ్చు. పాండిత్యం అవసరం లేదు. రసజ్ఞత చాలు. డాంటేను చదవాలంటే, ఒక గ్రంథాలయమే అవసరం. చాలా కావాలి. మధ్యయుగపు చరిత్ర, భూగోళం, ఖగోళం, కవి చేసిన విచిత్రవిశ్వనిర్మాణం, క్రైస్తవమతశాఖలు, పోపుల రాజుల వివాదాలు, గ్రీకు యితిహాసము, యివి కాక  డాంటే కాలపు కవులు చిత్రకారులు, డాంటే అభిమానకవులు, ఆనాటి రాజకీయాలు, సాధారణపౌరుల ప్రేమకథలు , హత్యలు మోసాలు, యింకా ఎన్నో . వింటుంటే గుండె జారిపోతుంది.  ఎన్ని పాత్రలు! ఒక్కొక లోకంలో ఎన్ని వలయాలు, మండలాలు, ప్రాంతాలు ! ఏ వర్జిల్ లాంటివాడో  “సాహసం శాయరా డింభకా” అంటున్నా పాఠకుడు  ముందుకు సాగ లేడు .  డాంటేను మెచ్చుకోని వారుండరు  . సాంతం చదివిన వారూ ఉండరు. “ ఇన్ఫెర్నో” లో సుఖంగా ఆగిపోతారు. వాళ్ళ వర్జిల్ వాళ్ళను అక్కడే వదిలేసి వెళ్ళి పోతాడేమో, మీకిది చాలని  ! విక్టర్ హ్యూగో అన్నాడు  “డివైన్ కామెడీ” గురించి : “మానవుడి కళ్ళు చూడగలిగిన దృశ్యాలు కావవి , చివరి రెండు భాగాలు. చీకటి విరిసి పోయే కొద్దీ వెలుగు పెరిగే కొద్దీ, పాఠకుడి కళ్ళు చదువలేవు, అలవాటులేని కాంతికి కళ్ళు మూసుకుపోతాయి.”  


“ ద డివైన్ కామెడీ” సాంతం చదవగలగడమెలా అనే దానిమీద అనేక సూచనలున్నాయి. “పైరడైసో ”తో మొదలుపెట్టి , “ఇన్ఫెర్నో” ఆ తరువాత, చివరగా  “ పర్గటోరియో” చదవాలి అంటాడు ఎలియట్ . “ డివైన్ కామెడీ” లో వందల పాత్రలు ఉన్నమాట నిజమే. ( కాని అవి మహాభారతంలోని పాత్రల్లో శతాంశం.) “కామెడీ” లో ఎన్ని వందల పాత్రలున్నా, ముఖ్యపాత్ర ఒక్కటే, డాంటే. తక్కిన పాత్రలు ఆ పాత్రగతిచిత్రణకు ఉపకరణాలు మాత్రమే. ఉదాహరణకు, “ఇన్ఫెర్నో” లో ఫ్రాన్సెస్కా , పావ్లో ల అక్రమప్రేమకథ ( అయిదవ సర్గ, canto 5 ) చాలా ప్రసిద్ధం. మన దృష్టి  ప్రేమికులపై ఉండడం సహజం. కాని, డాంటేపై దృష్టి నిలిపి ఆ కథ చదవాలి.అలా చదివితే కాని ఆ కథ ప్రాముఖ్యం అర్థం కాదు. ఈ విషయానికి తరువాత వద్దాం. 


మన మహాభారతానికి వద్దాం. ఒక విధంగా, తెలుగునాట  సదాశరత్తు. ఒక శారదరాత్రి, శరద్భయంతో నేలమీదకు దిగివచ్చిన మహాభారతపర్వప్రావృట్పయోదాలు  నీరవనీరదాలుగా, అరణ్యవాసము అజ్ఞాతవాసము చేస్తున్నాయి, సుమారు వేయిసంవత్సరాలుగా. ఇది ఒక్క తెలుగునాట మాత్రమే సాధ్యం.  కవిత్రయభారతాన్ని సాధారణపాఠకుడికి చేరవేసే ప్రయత్నం ఒకే ఒక్క సారి జరిగింది ,  తి.తి.దే. పుణ్యమా అని. తితిదే ప్రతిలోని వివరణ ఎక్కడైనా సరిలేదనిపిస్తే మరో గతి లేదు. ( తితిదే అచ్చు ప్రతులు దొరకడం లేదు. ఇ-బుక్ ఎంతకూ డౌన్లోడ్ కాదు. నా దగ్గర వావిళ్ళ ముద్రణ ఉంది, (1972).  దానితో సరిపెట్టుకుంటున్నాను. నా చిన్నతనంలో మా పెదనాన్న గారింట్లో కొన్ని పర్వాలు మాత్రం ఉండేవి, ఒక్కొక పర్వం ఒక వాల్యూము. ఎవరి ముద్రణో గుర్తు లేదు. ) మరో భాషలో యీ కవిత్రయం రాసి ఉంటే, యిప్పటికి వందల ప్రతులు, వ్యాఖ్యలు, విమర్శ వచ్చి ఉండేది. వారి పేరుతెలియని  ఊరు ఉండేది కాదు. 


కవిత్రయరచనను మెచ్చుకోని వాడుండడు, సాంతం చదివినవాడూ…  ? “ శ్రీవాణీ ” దగ్గర మొదలుపెట్టి  “శిక్షితచిత్తులార శుభసిద్ధులు పొందుననేకజన్మపాపక్షపణంబునన్ వెలుగు భారతసంహితకెల్ల వాసుదేవు ప్రకటార్థముగా గొని విన్న మానవుండు… శశ్వదుల్లాసముఖానుభూతినచలస్థితినొప్పునతండుదాత్తుడై” వరకు ( భారతంలో చివరి రెండు పద్యాలు .) ఎంతమంది చదివారు ? చాలామంది చదివి ఉండరు. దీనికి కారణం లేకపోలేదు. “డివైన్ కామెడీ” భారతంలో శతాంశం ఉంటుంది. భారతంలో లేని శాస్త్రం లేదు. వ్యాసుడన్నాడు కదా: "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - ("ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు") అంతకాకున్నా, తెలుగులోని కవిత్రయభారతం కూడా “డివైన్ కామెడీ”తో పోలిస్తే ఒక్క పరిమాణంలోనేకాదు చాలా విషయాలలో చాలా పెద్దది. కనుక సాంతం చదవడం సులభం కాదు అని ఒప్పుకోడంలో కష్టం లేదు. 


ఇక, “కామెడీ” విషయంలోలాగా, భారతం  ఎలా చదవాలి అన్న చర్చ జరగలేదు, సాంతం చదవలేదు అని ఒప్పుకోడం యిష్టం ఉండదు కనుక . ఆ చర్చ అవసరమా అనిపించవచ్చు. చేయడంవల్ల ప్రయోజనం ఉండవచ్చు. అయినా యిదే క్రమంలో చదవాలి అనడం లేదు. కాని ఒక సూచన. శాంతి పర్వంతో మొదలుపెట్టి , ఆనుశాసనికస్త్రీపర్వాలు  ముగించి , ఆదిపర్వానికి రావడంలో కొంత ప్రయోజనం ఉంది. తిరిగి, చివరి పర్వాలతో ముగించవచ్చు . ఎందుకు? 


వచ్చే వారం మరికొంత ముచ్చట.