Friday, August 23, 2019

కాఫ్కా-4

అస్తిత్వవాదసాహిత్యం-5
ఒక భారతీయపరిచయం:
కాఫ్కా -4
                                                     తీర్పు

“తీర్పు” లో నీవు ఏదైనా అర్థం  కనిపెట్టగలవా-, సంగతమైన, సూటి అయిన,  అందుకోగల అర్థం ? నాకేమీ కనిపించడంలేదు.  అందులో దేనినీ నేను వివరించలేను.” (తనతో పెళ్ళి నిశ్చయమైన ఫెలిస్ బోవర్ కు కాఫ్కా ఉత్తరం.జూన్ 2,1913.ప్రేమలేఖలు యిట్లాకూడా ఉంటాయన్నమాట ! రెండు సార్లు నిశ్చయమైన పెళ్ళి ఆగిపోవడంలో ఆశ్చర్యం లేదు. )

***

“గమ్యం ఉంది, దారి లేదు.” కాఫ్కా.

***
“ఇంతవరకు నీకు నీవు మాత్రమే తెలుసు! నిజానికి నీవు ఒక అమాయకపు పిల్లవాడివి, కాని అంతకంటే నీవొక దయ్యపు మనిషివి.”

తండ్రి కొడుకుతో అన్న యీమాట గురించి కొంత చెప్పుకున్నాం. నిజానిజాల కల్తీయే జీవితం. ఇది తప్పు అనే లోపల, తప్పు కాదేమో అన్న మాట కూడా వినిపిస్తుంది. వీడు అపరాధి అనే లోపల, తీర్పు చెప్పిన న్యాయాధిపతి మాటేమిటి, అంటుంది?

ఈ తప్పొప్పులకు తిరిగి వద్దాం. ప్రస్తుతం కథ మొదటికి వెళదాం మరొకసారి.

****
కాఫ్కా కథలు, -అతనివి అన్నీ కథలే, పెద్దవి చిన్నవి, నీతికథలు పొడుపుకథలు- అర్థమయేవి కావు అన్న ఒక  అపప్రథ ఉంది. నిజానికి అది  ప్రథ అనే అనవలె. ప్రథ అని తెలియవలె. అర్థం కాకపోవడంలోని పరమార్థం తెలుసుకుంటే, కాఫ్కా సాహిత్యప్రయోజనం  అర్థమవుతుంది.కాఫ్కా సాహిత్యం అర్థమవడం అంటే, అవి  అర్థంచేసుకోవలసినవి కావు అని అర్థమవడమే. అది ఎలా అర్థమవుతుంది? అతడి రచనల్లో ప్రతివాక్యము ఒక యక్షప్రశ్న. “అర్థం చెప్పుకో చూద్దాం” అంటుంది. కాని, ఏ అర్థం చెప్పినా కాదనదు కాని , “మరో అర్థం కూడా ఉందేమో చూడు”, అంటుంది. ముందు చెప్పిన అర్థానికి విరుద్ధార్థం మన చేత చెప్పించేవరకు వదలదు. అంటే, మన నోటనే మన మాటను కాదనిపించి, ఏదీ సరి అయిన సమాధానం కాదు  అనిపించి వదులుతుంది. ఆ అనుభవం కలిగించడమే  కాఫ్కా  సాహిత్యప్రయోజనం. జీవితంలో ప్రశ్నలకు సమాధానాలుండవు అన్న  సత్యం అనుభవంగా అందిస్తుంది కాఫ్కా కథనవిధానం.

అస్తిత్వవాదం తర్కమనే దుర్గంపై దాడి .ఈ కాలంలో  కీర్క్ గార్డ్ దీనిని మొదలుపెట్టాడు . అయితే, అతడు దుర్గం వెలుపలనుండి వ్యంగ్యాస్త్రాలతో దాడి చేశాడు.నీచ చేసిన దాడి కూడా బాహాటము, బహిరంగము. బస్తీమే సవాల్. డోస్టోవ్ స్కీ  రెండువైపుల ముట్టడించాడు. వీరందరికీ భిన్నంగా, కాఫ్కా కోటలో చేరిపోయాడు. కాని , లోపలనుండి దానిని కూల్చడు. పాఠకుణ్ణి తనతో లోపలికి తీసుకెళుతాడు. దాని అనుభవం లోపల్నుండి కలిగిస్తాడు. ఇది ఒక విధమైన VR (Virtual Reality ) అనుభవం. తర్కంపై దాడి కాదు.తర్కం వలన కలిగే సమస్యలను పాఠకుడు అనుభవంగా , తెలుసుకుంటాడు. తర్కంలో దారి తప్పాననుకుంటాడు కాఫ్కా పాత్ర. అది ప్రారంభం. దారి లేదు అన్న తెలివితో కథ అర్థాంతరంగా ఆగిపోతుంది. ముగింపు ఉండదు.

ఈ “తీర్పు”కథపై వచ్చినంత విశ్లేషణ కాఫ్కా రాసిన ఏ కథపై రాకపోవడానికి యిందులో ఏ గుణం ఉంది?

“ఆదివారం ఉదయం.చక్కటి  వసంతకాలం. జెవోర్గ్  బెండెర్ మన్ యువకుడు. వ్యాపారం చేస్తాడు. నది ఒడ్డున యిళ్ళ వరస. మధ్యతరగతి యిళ్ళు. అన్నీ యించుమించు ఒకలాగే ఉంటాయి. ఆ వరసలో అతడి యిల్లు. మేడమీద తనగదిలో ఉత్తరం రాయడం ముగించాడు, ప్రస్తుతం రష్యాలో  ఉన్న తన చిన్ననాటి స్నేహితుడికి. ఉత్తరం కవర్ లో పెట్టి, అంటించాననిపించి, టేబుల్ మీద మోచేతులుంచి, కిటికీలోనుండి కనిపిస్తున్న నదిని, నదిమీద వంతెనను, వంతెనకు అవతల కొండలమీద పచ్చని చెట్లను చూస్తున్నాడు.
...చేతిలో ఉత్తరం పట్టుకొని టేబుల్ దగ్గరే కూచున్నాడు చాలాసేపు, కిటికీవైపు చూస్తూ. తెలిసినవాడొకడు  వీథిలో పోతూ  కిటికీలోనుండి  తనను పలకరించాడు. తను ఎక్కడో ఆలోచిస్తూ ఒక శూన్యపు నవ్వు నవ్వాడు జవాబుగా.”

కాఫ్కా కథలలో, ముఖ్యంగా యీ కథలో, ఒక్క వాక్యం కాదు ఒక్క పదం కూడా వ్యర్థమైనది ఉండదు. పై కథాప్రారంభంలో ఉత్తరం రాయడం ముగించి, జెఓర్గ్ కిటికీలోనుండి బయటకు చూస్తున్నాడు. ఉత్తరం రాసినవాడు ఆ ఉత్తరం చేతిలో పట్టుకుని,కిటికీనుండి బయటకు చూడడమెందుకు? ఆదివారం కదా తొందరలేదు అని అర్థమా?

కాఫ్కా కథలలో తరచు తెరచి కనబడే కిటికీ ఒక సంకేతం. ఇక్కడ జెఓర్గ్ అంతరంగానికి అది ఒక కిటికీ. ఉత్తరం మనసు పంచుకోడానికి. ఇక్కడ ఉత్తరం మనసు దాచడానికి. జెఓర్గ్ తన మనసులోని మాటను చెప్పలేకపోతున్నాడు. బయటిప్రపంచంతో మమేకం కాలేకపోతున్నాడు. ఎవడో  పరిచితుడు కిటికీ వెలుపలనుండి తనను పలకరిస్తే, అతడు ఒక అర్థంలేని నవ్వుతో  బదులు పలికాడు.

నిజమైన ఉత్తరం రాయడం ఎంత కష్టమో, బయటిప్రపంచంతో మాట్లాడడం ఎంత కష్టమో, మన ఉత్తరాలు ఉత్తుత్తి కబుర్లేనని ఆ కిటికీ చెబుతుంది.

ఈ మూసిన మనసులు తెరచిన కిటికీలు తరువాతి కథలో ప్రధానవిషయం.
ఇలా ప్రతివాక్యము పదము తరచి చూచుకొంటూ వెళ్ళవలె.

No comments:

Post a Comment