Sunday, November 1, 2020

 

Just come out! 

అవీ యివీ ముచ్చట్లు

 అవీ యివీ ముచ్చట్లు : 


షేక్స్ పియర్ , డాంటేలు యూరపును  పంచేసుకున్నారు, అన్నాడు ఎలియట్ . యుగాలముందే, వాల్మీకి,  వ్యాసుడు (వ్యాసవాల్మీకులు అనికూడా కొందరంటారు) భరతవర్షాన్ని ఆక్రమించుకున్నారు. తులసీదాసు, ఉత్తరభారతాన్ని  తుంచుకున్నాడు . పోతన తెలుగునాట నాటుకున్నాడు. ఆంధ్రమహాభారతం మాత్రం తెలుగుదేశంలో  మూలల్లో దాగి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నది, మళ్లీ మళ్లీ వ్రతభంగమైనట్టు . 


కొంతసేపు పడమటికి తిరిగి దణ్ణం పెడదాం. ఇంగ్లీషు తెలిసినవాడెవడైనా షేక్స్ పియర్  చదవవచ్చు. పాండిత్యం అవసరం లేదు. రసజ్ఞత చాలు. డాంటేను చదవాలంటే, ఒక గ్రంథాలయమే అవసరం. చాలా కావాలి. మధ్యయుగపు చరిత్ర, భూగోళం, ఖగోళం, కవి చేసిన విచిత్రవిశ్వనిర్మాణం, క్రైస్తవమతశాఖలు, పోపుల రాజుల వివాదాలు, గ్రీకు యితిహాసము, యివి కాక  డాంటే కాలపు కవులు చిత్రకారులు, డాంటే అభిమానకవులు, ఆనాటి రాజకీయాలు, సాధారణపౌరుల ప్రేమకథలు , హత్యలు మోసాలు, యింకా ఎన్నో . వింటుంటే గుండె జారిపోతుంది.  ఎన్ని పాత్రలు! ఒక్కొక లోకంలో ఎన్ని వలయాలు, మండలాలు, ప్రాంతాలు ! ఏ వర్జిల్ లాంటివాడో  “సాహసం శాయరా డింభకా” అంటున్నా పాఠకుడు  ముందుకు సాగ లేడు .  డాంటేను మెచ్చుకోని వారుండరు  . సాంతం చదివిన వారూ ఉండరు. “ ఇన్ఫెర్నో” లో సుఖంగా ఆగిపోతారు. వాళ్ళ వర్జిల్ వాళ్ళను అక్కడే వదిలేసి వెళ్ళి పోతాడేమో, మీకిది చాలని  ! విక్టర్ హ్యూగో అన్నాడు  “డివైన్ కామెడీ” గురించి : “మానవుడి కళ్ళు చూడగలిగిన దృశ్యాలు కావవి , చివరి రెండు భాగాలు. చీకటి విరిసి పోయే కొద్దీ వెలుగు పెరిగే కొద్దీ, పాఠకుడి కళ్ళు చదువలేవు, అలవాటులేని కాంతికి కళ్ళు మూసుకుపోతాయి.”  


“ ద డివైన్ కామెడీ” సాంతం చదవగలగడమెలా అనే దానిమీద అనేక సూచనలున్నాయి. “పైరడైసో ”తో మొదలుపెట్టి , “ఇన్ఫెర్నో” ఆ తరువాత, చివరగా  “ పర్గటోరియో” చదవాలి అంటాడు ఎలియట్ . “ డివైన్ కామెడీ” లో వందల పాత్రలు ఉన్నమాట నిజమే. ( కాని అవి మహాభారతంలోని పాత్రల్లో శతాంశం.) “కామెడీ” లో ఎన్ని వందల పాత్రలున్నా, ముఖ్యపాత్ర ఒక్కటే, డాంటే. తక్కిన పాత్రలు ఆ పాత్రగతిచిత్రణకు ఉపకరణాలు మాత్రమే. ఉదాహరణకు, “ఇన్ఫెర్నో” లో ఫ్రాన్సెస్కా , పావ్లో ల అక్రమప్రేమకథ ( అయిదవ సర్గ, canto 5 ) చాలా ప్రసిద్ధం. మన దృష్టి  ప్రేమికులపై ఉండడం సహజం. కాని, డాంటేపై దృష్టి నిలిపి ఆ కథ చదవాలి.అలా చదివితే కాని ఆ కథ ప్రాముఖ్యం అర్థం కాదు. ఈ విషయానికి తరువాత వద్దాం. 


మన మహాభారతానికి వద్దాం. ఒక విధంగా, తెలుగునాట  సదాశరత్తు. ఒక శారదరాత్రి, శరద్భయంతో నేలమీదకు దిగివచ్చిన మహాభారతపర్వప్రావృట్పయోదాలు  నీరవనీరదాలుగా, అరణ్యవాసము అజ్ఞాతవాసము చేస్తున్నాయి, సుమారు వేయిసంవత్సరాలుగా. ఇది ఒక్క తెలుగునాట మాత్రమే సాధ్యం.  కవిత్రయభారతాన్ని సాధారణపాఠకుడికి చేరవేసే ప్రయత్నం ఒకే ఒక్క సారి జరిగింది ,  తి.తి.దే. పుణ్యమా అని. తితిదే ప్రతిలోని వివరణ ఎక్కడైనా సరిలేదనిపిస్తే మరో గతి లేదు. ( తితిదే అచ్చు ప్రతులు దొరకడం లేదు. ఇ-బుక్ ఎంతకూ డౌన్లోడ్ కాదు. నా దగ్గర వావిళ్ళ ముద్రణ ఉంది, (1972).  దానితో సరిపెట్టుకుంటున్నాను. నా చిన్నతనంలో మా పెదనాన్న గారింట్లో కొన్ని పర్వాలు మాత్రం ఉండేవి, ఒక్కొక పర్వం ఒక వాల్యూము. ఎవరి ముద్రణో గుర్తు లేదు. ) మరో భాషలో యీ కవిత్రయం రాసి ఉంటే, యిప్పటికి వందల ప్రతులు, వ్యాఖ్యలు, విమర్శ వచ్చి ఉండేది. వారి పేరుతెలియని  ఊరు ఉండేది కాదు. 


కవిత్రయరచనను మెచ్చుకోని వాడుండడు, సాంతం చదివినవాడూ…  ? “ శ్రీవాణీ ” దగ్గర మొదలుపెట్టి  “శిక్షితచిత్తులార శుభసిద్ధులు పొందుననేకజన్మపాపక్షపణంబునన్ వెలుగు భారతసంహితకెల్ల వాసుదేవు ప్రకటార్థముగా గొని విన్న మానవుండు… శశ్వదుల్లాసముఖానుభూతినచలస్థితినొప్పునతండుదాత్తుడై” వరకు ( భారతంలో చివరి రెండు పద్యాలు .) ఎంతమంది చదివారు ? చాలామంది చదివి ఉండరు. దీనికి కారణం లేకపోలేదు. “డివైన్ కామెడీ” భారతంలో శతాంశం ఉంటుంది. భారతంలో లేని శాస్త్రం లేదు. వ్యాసుడన్నాడు కదా: "యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్" - ("ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు") అంతకాకున్నా, తెలుగులోని కవిత్రయభారతం కూడా “డివైన్ కామెడీ”తో పోలిస్తే ఒక్క పరిమాణంలోనేకాదు చాలా విషయాలలో చాలా పెద్దది. కనుక సాంతం చదవడం సులభం కాదు అని ఒప్పుకోడంలో కష్టం లేదు. 


ఇక, “కామెడీ” విషయంలోలాగా, భారతం  ఎలా చదవాలి అన్న చర్చ జరగలేదు, సాంతం చదవలేదు అని ఒప్పుకోడం యిష్టం ఉండదు కనుక . ఆ చర్చ అవసరమా అనిపించవచ్చు. చేయడంవల్ల ప్రయోజనం ఉండవచ్చు. అయినా యిదే క్రమంలో చదవాలి అనడం లేదు. కాని ఒక సూచన. శాంతి పర్వంతో మొదలుపెట్టి , ఆనుశాసనికస్త్రీపర్వాలు  ముగించి , ఆదిపర్వానికి రావడంలో కొంత ప్రయోజనం ఉంది. తిరిగి, చివరి పర్వాలతో ముగించవచ్చు . ఎందుకు? 


వచ్చే వారం మరికొంత ముచ్చట.

Friday, August 23, 2019

కాఫ్కా-4

అస్తిత్వవాదసాహిత్యం-5
ఒక భారతీయపరిచయం:
కాఫ్కా -4
                                                     తీర్పు

“తీర్పు” లో నీవు ఏదైనా అర్థం  కనిపెట్టగలవా-, సంగతమైన, సూటి అయిన,  అందుకోగల అర్థం ? నాకేమీ కనిపించడంలేదు.  అందులో దేనినీ నేను వివరించలేను.” (తనతో పెళ్ళి నిశ్చయమైన ఫెలిస్ బోవర్ కు కాఫ్కా ఉత్తరం.జూన్ 2,1913.ప్రేమలేఖలు యిట్లాకూడా ఉంటాయన్నమాట ! రెండు సార్లు నిశ్చయమైన పెళ్ళి ఆగిపోవడంలో ఆశ్చర్యం లేదు. )

***

“గమ్యం ఉంది, దారి లేదు.” కాఫ్కా.

***
“ఇంతవరకు నీకు నీవు మాత్రమే తెలుసు! నిజానికి నీవు ఒక అమాయకపు పిల్లవాడివి, కాని అంతకంటే నీవొక దయ్యపు మనిషివి.”

తండ్రి కొడుకుతో అన్న యీమాట గురించి కొంత చెప్పుకున్నాం. నిజానిజాల కల్తీయే జీవితం. ఇది తప్పు అనే లోపల, తప్పు కాదేమో అన్న మాట కూడా వినిపిస్తుంది. వీడు అపరాధి అనే లోపల, తీర్పు చెప్పిన న్యాయాధిపతి మాటేమిటి, అంటుంది?

ఈ తప్పొప్పులకు తిరిగి వద్దాం. ప్రస్తుతం కథ మొదటికి వెళదాం మరొకసారి.

****
కాఫ్కా కథలు, -అతనివి అన్నీ కథలే, పెద్దవి చిన్నవి, నీతికథలు పొడుపుకథలు- అర్థమయేవి కావు అన్న ఒక  అపప్రథ ఉంది. నిజానికి అది  ప్రథ అనే అనవలె. ప్రథ అని తెలియవలె. అర్థం కాకపోవడంలోని పరమార్థం తెలుసుకుంటే, కాఫ్కా సాహిత్యప్రయోజనం  అర్థమవుతుంది.కాఫ్కా సాహిత్యం అర్థమవడం అంటే, అవి  అర్థంచేసుకోవలసినవి కావు అని అర్థమవడమే. అది ఎలా అర్థమవుతుంది? అతడి రచనల్లో ప్రతివాక్యము ఒక యక్షప్రశ్న. “అర్థం చెప్పుకో చూద్దాం” అంటుంది. కాని, ఏ అర్థం చెప్పినా కాదనదు కాని , “మరో అర్థం కూడా ఉందేమో చూడు”, అంటుంది. ముందు చెప్పిన అర్థానికి విరుద్ధార్థం మన చేత చెప్పించేవరకు వదలదు. అంటే, మన నోటనే మన మాటను కాదనిపించి, ఏదీ సరి అయిన సమాధానం కాదు  అనిపించి వదులుతుంది. ఆ అనుభవం కలిగించడమే  కాఫ్కా  సాహిత్యప్రయోజనం. జీవితంలో ప్రశ్నలకు సమాధానాలుండవు అన్న  సత్యం అనుభవంగా అందిస్తుంది కాఫ్కా కథనవిధానం.

అస్తిత్వవాదం తర్కమనే దుర్గంపై దాడి .ఈ కాలంలో  కీర్క్ గార్డ్ దీనిని మొదలుపెట్టాడు . అయితే, అతడు దుర్గం వెలుపలనుండి వ్యంగ్యాస్త్రాలతో దాడి చేశాడు.నీచ చేసిన దాడి కూడా బాహాటము, బహిరంగము. బస్తీమే సవాల్. డోస్టోవ్ స్కీ  రెండువైపుల ముట్టడించాడు. వీరందరికీ భిన్నంగా, కాఫ్కా కోటలో చేరిపోయాడు. కాని , లోపలనుండి దానిని కూల్చడు. పాఠకుణ్ణి తనతో లోపలికి తీసుకెళుతాడు. దాని అనుభవం లోపల్నుండి కలిగిస్తాడు. ఇది ఒక విధమైన VR (Virtual Reality ) అనుభవం. తర్కంపై దాడి కాదు.తర్కం వలన కలిగే సమస్యలను పాఠకుడు అనుభవంగా , తెలుసుకుంటాడు. తర్కంలో దారి తప్పాననుకుంటాడు కాఫ్కా పాత్ర. అది ప్రారంభం. దారి లేదు అన్న తెలివితో కథ అర్థాంతరంగా ఆగిపోతుంది. ముగింపు ఉండదు.

ఈ “తీర్పు”కథపై వచ్చినంత విశ్లేషణ కాఫ్కా రాసిన ఏ కథపై రాకపోవడానికి యిందులో ఏ గుణం ఉంది?

“ఆదివారం ఉదయం.చక్కటి  వసంతకాలం. జెవోర్గ్  బెండెర్ మన్ యువకుడు. వ్యాపారం చేస్తాడు. నది ఒడ్డున యిళ్ళ వరస. మధ్యతరగతి యిళ్ళు. అన్నీ యించుమించు ఒకలాగే ఉంటాయి. ఆ వరసలో అతడి యిల్లు. మేడమీద తనగదిలో ఉత్తరం రాయడం ముగించాడు, ప్రస్తుతం రష్యాలో  ఉన్న తన చిన్ననాటి స్నేహితుడికి. ఉత్తరం కవర్ లో పెట్టి, అంటించాననిపించి, టేబుల్ మీద మోచేతులుంచి, కిటికీలోనుండి కనిపిస్తున్న నదిని, నదిమీద వంతెనను, వంతెనకు అవతల కొండలమీద పచ్చని చెట్లను చూస్తున్నాడు.
...చేతిలో ఉత్తరం పట్టుకొని టేబుల్ దగ్గరే కూచున్నాడు చాలాసేపు, కిటికీవైపు చూస్తూ. తెలిసినవాడొకడు  వీథిలో పోతూ  కిటికీలోనుండి  తనను పలకరించాడు. తను ఎక్కడో ఆలోచిస్తూ ఒక శూన్యపు నవ్వు నవ్వాడు జవాబుగా.”

కాఫ్కా కథలలో, ముఖ్యంగా యీ కథలో, ఒక్క వాక్యం కాదు ఒక్క పదం కూడా వ్యర్థమైనది ఉండదు. పై కథాప్రారంభంలో ఉత్తరం రాయడం ముగించి, జెఓర్గ్ కిటికీలోనుండి బయటకు చూస్తున్నాడు. ఉత్తరం రాసినవాడు ఆ ఉత్తరం చేతిలో పట్టుకుని,కిటికీనుండి బయటకు చూడడమెందుకు? ఆదివారం కదా తొందరలేదు అని అర్థమా?

కాఫ్కా కథలలో తరచు తెరచి కనబడే కిటికీ ఒక సంకేతం. ఇక్కడ జెఓర్గ్ అంతరంగానికి అది ఒక కిటికీ. ఉత్తరం మనసు పంచుకోడానికి. ఇక్కడ ఉత్తరం మనసు దాచడానికి. జెఓర్గ్ తన మనసులోని మాటను చెప్పలేకపోతున్నాడు. బయటిప్రపంచంతో మమేకం కాలేకపోతున్నాడు. ఎవడో  పరిచితుడు కిటికీ వెలుపలనుండి తనను పలకరిస్తే, అతడు ఒక అర్థంలేని నవ్వుతో  బదులు పలికాడు.

నిజమైన ఉత్తరం రాయడం ఎంత కష్టమో, బయటిప్రపంచంతో మాట్లాడడం ఎంత కష్టమో, మన ఉత్తరాలు ఉత్తుత్తి కబుర్లేనని ఆ కిటికీ చెబుతుంది.

ఈ మూసిన మనసులు తెరచిన కిటికీలు తరువాతి కథలో ప్రధానవిషయం.
ఇలా ప్రతివాక్యము పదము తరచి చూచుకొంటూ వెళ్ళవలె.

కాఫ్కా-3

అస్తిత్వవాదసాహిత్యం-5
ఒక భారతీయపరిచయం:
కాఫ్కా -3
                                                     తీర్పు

కాఫ్కా కథలు  సాధారణంగా  అసహజము అనూహ్యము అవాస్తవము  అయిన సంఘటనలతో  ప్రారంభమవుతాయి అనేది ప్రసిద్ధమే. ఉదాహరణకు, “నేరవిచారణ” ( The Trial), “విపరిణామము” (Metamorphosis) . “ తీర్పు” కథ అందుకు విపర్యయం. ఇందులో ప్రారంభం అతిసహజము వాస్తవము,  ముగింపు అసహజము అనూహ్యము.

కాఫ్కా కథలు అవాస్తవికాలు. కాని అవి మనల్ని ఎందుకు పట్టుకుంటున్నాయి? అవి మన మనసుల’లోని’  వాస్తవాలను పట్టుకుంటున్నాయి కనుక. మనకు తెలియకుండా మనలో దాగిన వాస్తవాలను, అంతరంగపు బావిలోకి అవాస్తవాల గాలంవేసి బయటకులాగుతాడు కాఫ్కా. అప్పుడవి ఉబ్బిన శవాల్లా  బయటపడతాయి. అవి “మన” శవాలు కనుక, మనల్ని వదలవు. “శవాలు” కనుక మనల్ని బాధపెడుతూనే ఉంటాయి.వాటిని బావిలోకి తోసేసింది మనమే కనుక,చేసిన హత్య మనల్ని వదలక వెంటాడుతూనే ఉంటుంది.  ఈ అతివాస్తవికశిల్పమే మనల్ని మనకు దగ్గరచేస్తుంది.

“తీర్పు” లో తీర్పు అన్యాయమే. కథ ముగింపు స్థూలంగా అసహజమే. కాని, దాని వాస్తవస్వరూపమేమిటి?

ఈ కథలో  కామం ప్రధానవస్తువు. ప్రాణికి మూలప్రచోదనశక్తి లైంగికమే (libidinal energy).దానికి అంగం అర్థం . సంస్కృతంలో “కామం” అర్థకామాలను రెంటినీ చెబుతుంది. భారతీయసంస్కృతిలో  ప్రేమ లేదు, కామమే ఉంది. అది వ్యక్తమయ్యే రూపంలో కామమో ప్రేమో అవుతుంది. ఉపనిషద్దర్శనం కామంతోనే మొదలవుతుంది.(“సోఽకామయత”;”ఏకాకీ నరమతే”, “ స ద్వితీయమైచ్ఛత్”. (ఆదిపురుషుడు, ప్రజాపతి) కామించెను (కోరెను) ; ఏకాకి రమించలేడు ; అతడు జంటను కోరెను.)

స్త్రీ పక్కన లేకపోతే బోర్ కొడుతుంది, “న రమతే” .  పక్కకొచ్చిన తరువాత కాని ఏం కొడుతుందో తెలియదు పాపం, ఆదిపురుషుడికిగాని అధునాతనపురుషుడికిగాని .ఇది అనాదిద్వైవిధ్యం. స్త్రీ కావలె.కాని స్త్రీ ఊరక రాదు. ఆమె కొరకు తాను ఏదీ వదలుకోలేడు. మనిషి లోని యీ నిత్యద్వైవిధ్యమే “తీర్పు” కథలోనే కాదు, కాఫ్కా రచనలంతటా కనిపిస్తుంది. ఈ  అనాదికామద్వైవిధ్యమే  మనిషి ఆదిపాపం (original sin).

“తీర్పు” కథ కాఫ్కా “ఎఫ్ కు” ,“For F” (Felice Bauer ) అంకితమిచ్చాడు.కాఫ్కా యీ కథ రాయడానికి ఆరువారాలముందు ఫెలిస్ బోవర్ ను కలిశాడు, తన స్నేహితుడు మేక్స్  బ్రాడ్ (Max Brod) యింట్లో. ఆమెను కలిసి ఉండక పోయిఉంటే యీ కథ రాసిఉండేవాణ్ణి కాదన్నాడు కాఫ్కా. ఆమెతో కాఫ్కా వివాహం రెండుసార్లు నిశ్చయమై, రెండుసార్లు భగ్నం చేసుకున్నాడు. అతడు ఆమెకు చెప్పిన కారణం, తనతో ఆమె సుఖంగా జీవించలేదు. తనకు చెప్పుకున్న కారణం తనకు సాహిత్యంతో నిశ్చయమే కాదు వివాహంకూడా జరిగిపోయింది. సాహిత్యపు  కౌగిలిలో బందీ అయి ఉన్నాడు. విడిపించుకోలేడు . ప్రేమకథలో విలన్ కూడా ఉండకపోతే కథ రక్తి కట్టదు. ఈ కథలో విలన్ రచయితే. కథ రచనతోనే మొదలవుతుంది, రాసేది ఉత్తరమే, అయినా రచనే కదా?

కథలు రాయని జీవితమా, రమణి చనుమొనలమీద రాయని జీవితమా? ఈ సంఘర్షణ కాఫ్కా జీవితంలో  బలంగానే ఉండింది. “తీర్పు” లో కూడా యీ  సంఘర్షణ  ప్రముఖం.

 జి ఓర్గ్, రష్యాలో ప్రవాసి అయిన అతడి మిత్రుడు యిద్దరూ వ్యాపారులే. ఏం వ్యాపారమో కథలో ఎక్కడా చెప్పలేదు. మనకు తెలిసి యిద్దరిదీ రచనావ్యాపారమే.ఇద్దరూ ఉత్తరప్రత్యుత్తరాలు మాత్రం రాసుకుంటారు.ఈ కథలో,  ఉత్తరాలు రాసుకోడం  రచనాప్రవృత్తికి ప్రతీకగా గ్రహించవచ్చు మనం.

కథ  అర్థకామాలతోనే మొదలవుతుంది. “మంచి వసంతకాలం.జిఓర్గ్ యువకుడు. వ్యాపారి.” (“the most beautiful time in spring. George Benderman, a young merchant, tr. Ian Johnston) అర్థకామాలకు అనువైన సమయం.వసంతంతో పాటు కథలో విలన్ కూడా ప్రవేశిస్తాడు, అదృశ్యంగా, ఉత్తరరచనరూపంలో.

నిజమే.  కథలో  కాదు కాని, కథ వెలుపల కొంత కథ ఉంది. అది కథారచనాసందర్భానికి సంబంధించింది. కాఫ్కా యీ కథను Yom Kippur రాత్రి రాశాడు. Yom Kippur యూదులకు పశ్చాత్తాప పర్వదినం. ఆ రోజు వారు ఉపవాసము, బ్రహ్మచర్యము పాటిస్తారు. ఈ సందర్భప్రాధాన్యం కథలో ఎక్కడైనా ప్రతిఫలించిందా ? అర్థకామాలకు అనువైన సమయం  వసంతప్రస్తావనతో ప్రారంభమైన కథలో,  వ్యక్తమైన ఆ  అర్థకామాలకు అడుగున అవ్యక్తంగా ఉన్న వాటి ప్రతిరోధకశక్తిని, ఉపవాసబ్రహ్మచర్యాలను, కథ ఏవిధంగానైనా వాడుకుందా?

ఈ కథను అనేకకోణాలనుండి పరిశీలించారు- ఫ్రాయిడ్ చెప్పిన మానసికలైంగికకోణం (psychosexual),యూదు క్రైస్తవ కోణం, సామాజికకోణం, యింకా అనేకానేకం. వీటన్నిటినీ అవసరమున్న చోట అవసరమున్నంతవరకు మాత్రమే స్పృశిస్తూ వెళదాం.

మొదటి సారి యీ కథ చదివినపుడు, మన తీర్పు తండ్రికి వ్యతిరేకం. ఇది సరి అయిన తీర్పేనా? ఇప్పుడు కొడుకు కథ చూద్దాం. కొడుకుకు వ్యతిరేకంగా సాక్ష్యం సేకరించగలమా? పాఠకుడు యిరుపక్షాల వాదనలు వినవలె కదా?

ఈ కథలో ప్రత్యక్షపాత్రలు రెండు, పరోక్షంలో రెండు అనుకున్నాం. పరలోకంలోని “ మన అమ్మ” “our mother” కూడా ఒక ప్రధాన పాత్ర. (కథలో తండ్రి,   చనిపోయిన తన భార్యను గురించి కొడుకుతో మాట్లాడుతూ, “మీ అమ్మ” అనడు,“our mother” అంటాడు. ఇది కీలకమైన అంశమే, ఇడిపస్ కాంప్లెక్సు లో.  ఈ నాలుగు పాత్రల లెక్క సరి అయినదా? మరొకసారి చూద్దాం. ముందు, రష్యాలో మిత్రుడి విషయం చూద్దాం. ఇతన్ని పరిశీలిస్తే, జిఓర్గ్ పాత్ర స్వరూపం మరింత స్పష్టమవుతుంది.

రష్యాలో ఉన్న మిత్రుడికి ఉత్తరం రాయడంతో  మొదలవుతుంది కథ. ఉత్తరం  మిత్రుడికేనా? జిఓర్గ్ తను రాసిన ఉత్తరం గురించి తండ్రికి చెప్పడానికి ఆయన గదికి వెళ్ళి ఏమన్నాడు? పీటర్స్ బర్గ్ కు ఉత్తరం రాశానన్నాడు. ఊళ్ళకు ఉత్తరాలు రాయం. వ్యక్తులకు రాస్తాం. సహజంగానే తండ్రి యీ అసహజతను గుర్తించడమే కాక, గుర్తించినట్టు కొడుక్కు ప్రకటిస్తాడు, “పీటర్స్ బర్గ్?”. ఇంక కొంత సంభాషణ సాగాక, “ నీకు పీటర్స్ బర్గ్ లో ఒక మిత్రుడున్నాడా?”, అని ఆశ్చర్యం ప్రకటిస్తాడు. తండ్రి పెద్దవాడైనాడు, మతిమరుపు, అనుకున్నాడు కొడుకు. అతన్ని గుర్తు తెప్పించడానికి ప్రయత్నిస్తాడు. కొంత సేపటికి తండ్రి,  కుండ బద్దలు కొట్టినట్టు, “ నా దగ్గర నాటకాలాడకు. నీకు పీటర్స్ బర్గ్ లో మిత్రుడే లేడు” , అంటాడు. ఇంక కొంత సేపటికి, వాడు నీకు మిత్రుడు కాదు, అంటాడు. నీవే వాణ్ణి పరదేశానికి తరిమేశావంటాడు. నీ పెళ్ళివిషయం, వ్యాపారం వాడికి తెలియకుండా దాచి, వాణ్ణి వంచిస్తున్నావంటాడు. “అతడు నాకు కొడుకులాంటివాడు, నీకంటే నాకు యిష్టమైన కొడుకు అయ్యేవాడు”. ఇది తండ్రి తన కొడుకు మిత్రుణ్ణి గురించి అన్న మాటలు. దీన్ని బట్టి మనమేమి అర్థం చేసుకోవలె? ఆ మిత్రుడసలున్నాడా? లేకపోతే, లేని మిత్రుణ్ణి తన కొడుకు మోసంచేయడమేమిటి? పైగా, “నీవు వాడికి ఉత్తరాలు రాయడడమేమిటి? నేను వాడికి ఉత్తరాలు ఎప్పటికప్పుడు రాస్తూనే ఉన్నాను.వాడికంతా తెలుసు. అసలు నీవు రాసే అబద్ధాలు వాడు చదువుతాడనుకుంటున్నావా? నీవుత్తరాలు ఎడంచేత్తో నలిపేస్తూ, కుడిచేత్తో నా ఉత్తరాలు పట్టుకుని చదువుతాడు”, అంటాడు.

ఇక జిఓర్గ్ ఏమంటాడో చూద్దాం. అతని మాటల్లోనే, అతడు మిత్రుడికి రాసిన ఉత్తరాలలో రాయవలసిన విషయాలేవో రాస్తూ వచ్చాడు. మూడు ఉత్తరాలలో, ఊళ్ళో ఎవరెవరివో పెళ్ళిళ్ళ గురించి రాశాడు కాని, తన పెళ్ళి గురించి రాయలేదు. ఈ ఉత్తరంలో కూడా తన పెళ్ళి ప్రధానవిషయం కాదు. చివరి వరకు దాచిన పెళ్ళి వార్త, ఉత్తరంలో కూడా చివరవరకు వాయిదావేసి, చివర రాశాడు.ఇది వంచన అంటాడు తండ్రి. కొడుకు,  మిత్రుణ్ణి బాధపెట్టకూడదని యింతవరకు దాచానంటాడు.

ఈ మిత్రుడి విషయంలో మరో సాక్షిని కూడా ప్రశ్నించాలి. ఫ్రీడా “ నీ. మిత్రుడు రాకుండా నీవు పెళ్ళెలా చేసుకుంటావు? ”, అంటుంది. అంతే కాదు, నీ మిత్రుడు ఆ పరిస్థితిలో ఉంటే, నీవసలు పెళ్ళి చేసుకోకూడదు”, అంటుంది.ఇది మరీ ఆశ్చర్యం. ఏ వధువైనా, ఎంత సౌజన్యమూర్తి అయినా,   యిలా అంటుందా? అసలెవడు యీ మిత్రుడు ? అతని విషయంలో ఆమె కెందుకంత ఆసక్తి? అపార్థం చేసుకోకండి.ఆమె ఆసక్తి మిత్రుడి గురించి కాదు,  కాబోయే భర్తకు తనయందు  నిబద్ధతత గురించి.పెళ్ళి అయిననతరువాత తనతో కూడా దాపరికంలేకుండా ఉంటాడా? మిత్రుడి దగ్గర యిన్ని విషయాలు దాచినవాడు, ఏ కారణమైనా చెప్పొచ్చు, రేపు తన దగ్గర దాచడా?

ఈ ప్రవాసమిత్రుడు, తండ్రికి చాలా యిష్టమట.నిజమా? కొడుకు అందుకు విరుద్ధంగా, నీకు నా మిత్రుడంటే యిష్టం ఉండదు. అందుకే నీ దగ్గర దాచానంటాడు. దానికి విరుద్ధంగాకూడా అంటాడు కొడుకు, “ నీవు అతనితో బాగా మాట్లాడేవాడివి కూడా”, అని. తండ్రి అంటాడు, “అతడికోసం నేను ఏడవలేదనుకుంటున్నావా?” ( “Do you imagine I didn't cry over him?)
ఆ మిత్రుడు చచ్చిపోయాడు, వాడికోసం నేను ఏడ్చాను కూడా అంటున్నాడు.  అంటే ఏమిటి అర్థం? నీలోని రచయితను నేను ఆమోదించలేనని, ఆమోదించలేదని నీ అభియోగం.అది సరికాదు.

ఇంతకూ యీ ప్రవాసమిత్రుడి విషయం తేల్చవలసిందే. ఇతడు వాస్తవంగా లేడు. తండ్రి చెప్పిందే నిజం. జిఓర్గ్ తనలోని  ఒక భాగాన్ని , తనకు దూరంగా , పరదేశానికి ప్రవాసం పంపాడు. అతణ్ణి ఆమోదించలేడు. తనకు జీవితంలో స్థిరపడాలని, వ్యాపారంలో వృద్ధిచెందాలని, పెళ్ళి చేసుకోవాలని ఉంది. తనలోని ఆ “మిత్రుడు” తనకు అమిత్రుడు.అందుకే అతడికి ప్రవాసం. అక్కడ అతడూ “వ్యాపారం” చేస్తున్నాడు. అతడిది రచనావ్యాపారం.

తనలోని రచయితకు తనకు జరిగే ఘర్షణలో జిఓర్గ్ తండ్రి , కాబోయే భార్య నష్టపోతారు. కష్టానికి నష్టానికి తాను కారకుడు. కనుక శిక్షార్హుడు.

ఇంతకూ, తేలిందేమిటంటే, కథలో ఒక పాత్ర తగ్గిపోయాడు.ప్రవాసమిత్రుడు  లేడు, తిరిగిరాడు. నలుగురు ముగ్గురైనారు. చివరకు కథలో ఎందరు మిగులుతారో చూద్దాం.

రచనావ్యాసంగానికి  పెళ్ళికి  యీ కథలో ఉన్నంత వైరుద్ధ్యం, ఎన్నికలో యింత ఘర్షణ  అవసరమా? ఈ రెంటిలో ఏదో ఒక దానినే ఎన్నుకొన తీరాలా? కీర్క్ గార్డ్, కాఫ్కాలవంటివారికి ప్రత్యేకమనదగినదా? లేక వారి అనిర్దిష్టమైన లైంగికసమస్యను దాచడానికి ఇది ఒక నెపమా? ఫ్రాయిడ్ సిద్ధాంతందృష్టిలో దీనిని పరిశీలించవచ్చు. తండ్రికొడుకులకు మధ్య తల్లివిషయంలో స్పర్ధగా మొదలై తాదాత్మ్యతగా ( identity) పరిణమిస్తుందన్నది ఆ సిద్ధాంతం. అది కథలో స్పష్టమే. ఆ స్పర్థలో కలిగిందే జిఓర్గ్ వివాహవైముఖ్యం కావచ్చు. ఆ అపరాధభావం కథ ముగింపుకు కారణం కావచ్చు.  తండ్రి కొడుకును చాలా తీవ్రమైన నిందచేస్తాడు కొడుకు, శీలంలేని స్త్రీవలలో పడి తల్లి స్మృతిని అపవిత్రం చేస్తున్నాడని. నేరం యిద్దరిదీ. కనుక యిద్దరూ పంచుకున్నారు. తండ్రి తీర్పు మాత్రమే చెప్పాడు. దాని అమలు చేయవలసిన అవసరం లేదు కొడుకుకు. తండ్రి ఫ్రాయిడ్ దృష్టిలో సూపర్ యీగో (superego). అది ఎప్పుడూ అతి కఠినంగానే తీర్పు యిస్తుంది. కాని యీగో  ( ego) దానిని సమన్వయించుకోవలె. జి ఓర్గ్ ఆ సమన్వయం చేసుకోలేదు. ( భారతీయభావనలో ఫ్రాయిడ్ చెప్పిన ఇడ్, యీగో,సూపర్ యీగోలకు సమానార్థకాలు కాకపోవచ్చు.కాని యింద్రియాలు, మనసు, బుద్ధి యీ పనులు చేస్తాయి. బుద్ధి ఒక్కొక సారి అతిగా బుద్ధి చెప్పాలని చూస్తుంది. మనసు యింద్రియబుద్ధులను. సమన్వయపరచాలి.బుద్ధికి కూడా బుద్ధి చెప్పవలసి ఉంటుంది. అలా జరగలేదు కాఫ్కా కథలో. తండ్రి కొడుకులిద్దరూ తప్పు చేశారు.( ఈ తప్పుకు  పరిష్కారం కాఫ్కా ఎలా చేశాడో చివర చూద్దాం.)
ఇప్పుడు మరో పాత్ర కూడా నిష్క్రమించాడు. తండ్రి కూడా లేడు . అతడు జిఓర్గ్ బుద్ధి (superego).

ఇద్దరు మిగిలారు.జిఓర్గ్, ఫ్రీడా. జిఓర్గ్ నలుగురిలా సుఖజీవనం, జీవనసుఖం కోరుకున్నాడు.  
అతడు కోరిన “సాధారణ” జీవితానికి ప్రతీక ఫ్రీడా.అది అందదేమోనని అతడి ఆందోళన, అతనిలో ఘర్షణ. అతడి ఆత్మహత్యలో కూడా లైంగికస్ఫురణ. ( “నీళ్ళలో మునిగి చావు” అన్నది తండ్రి విధించిన శిక్షారూపం. “నీళ్ళలో మునగడం” రతిస్ఫురణ.  కాఫ్కా వాడిన జర్మన్ పదం (Verkehr) రెండర్థాలనిస్తుంది. ఈ కథ ముగింపులో నది వంతెనపై ట్రాఫిక్ ను , లైంగికక్రియను కూడా స్ఫురించే పదం వాడాడు కాఫ్కా. ( Verkehr - traffic or transport, but also association, communication, dealings (in a commercial sense) or intercourse (in all meanings of the term).వంతెన కడ్డీ పట్టుకుని వేలాడుతున్నవాడు, ట్రాఫిక్ రొదకోసం ఆగి, అప్పుడు చేతులు వదిలేశాడు. రొద ఎందుకు అవసరం? నది చేసే రతికూజితాలు రొదలో మునిగిపోడానికి.(“his hands were getting weak. Between the posts he spotted an autobus that would easily drown out his fall.”)

అంటే, తీర్పు, అమలు రెండు కూడా వాస్తవాలు కావు, ప్రతీకలు.

తీర్పుకు తిరిగి చేరుకుందాం. తండ్రి కొడుకులు యిద్దరూ తప్పు చేశారు. ఆ తప్పులను కాఫ్కా ఎలా పరిష్కరించాడు?  కుటుంబంలో కాదు, లోకంలో కాదు,  తప్పు లేకుండా ఒప్పు ఉండదు.అన్యాయం లేకుండా న్యాయం ఉండదు. అసత్యం లేకుండా  సత్యం ఉండదు. ఇది కల్తీ లోకం. ఈ కల్తీ అస్తిత్వవాదసత్యం.ఈ సత్యాన్ని యీ కథలో కాఫ్కా ఎలా చెప్పాడో చూద్దాం.

జిఓర్గ్ చాలా పశ్చాత్తాపం పొందాడు, పెద్దవాడైన తండ్రిని శ్రద్ధగా చూచుకోలేదని. ఆయనను తన చేతుల్లోకి తీసుకుని తన గదిలో తన పక్కమీద పడుకోబెట్టడానికి తీసుకెళుతున్నాడు. తీసుకెళుతున్నపుడు, తండ్రి తన గుండెపైన వేలాడుతున్న గడియారపుగొలుసుతో ఆడుకుంటున్నట్టు అనిపించింది. గొలుసు విడిపించి ఆయనను పక్కమీద పడుకోబెట్టడం కష్టమయింది.

“the father was playing with his watch chain. He held the chain so firmly that he could not immediately lay him onto the bed.”

“his father was playing with his watch chain on his chest”

“the old man on his breast was playing with his watch chain”

ఇన్ని విధాల అనువాదాలు చేశారు యింగ్లీషులో. ఇందులో ఒకటి సరి అయిన అనువాదం కాదు. తప్పు  అనువాదం కూడా. కాని ఆ తప్పు నాకు నచ్చింది.”the old man on his breast” సరి అయిన అనువాదం కాదు. కాని ఆ తప్పు,  ముసలి తండ్రిని కొడుకు గుండెలపై చంటివాణ్ణి చేసింది. కొడుకు గుండెపై జేబుగడియారపు గొలుసు వేలాడుతూంది.ఆ గొలుసుతో ఆడుతున్నాడు ముసలాడు. (“an seiner Brust der Vater mit seiner Uhrkette spiele”)

తండ్రిని చేతులమీదనుండి తీసి పక్కపై పడుకోబెట్టడం “కష్టమయింది”.ఏమిటా కష్టం? బృహత్కాయుడు తండ్రి (“ still a giant!”). తండ్రి బరువైనాడా? లేక అతడు బలంగా పట్టుకున్న గొలుసు విడిపించడం కష్టమైందా ? ఏ తల్లినడిగినా చెబుతుంది ఆ కష్టమేమిటో? చంటివాణ్ణి ఒడిలోనుండి తీసి పక్కపై పడుకోబెట్టబోతుంటే,  బుల్లి చేతులతో వాడు తన మెడలోని మంగళసూత్రంతోనో చంద్రహారంతోనో ఆడుకుంటుంటాడు. ఆ చిన్న చేతులనుండి “గొలుసు”  విడిపించడం సులభమేమీ కాదు, యిద్దరికీ . కథలో తండ్రి చంటివాడైనాడు. కొడుకు తల్లి అయ్యాడు. (“అతడికోసం నేను ఏడవలేదనుకుంటున్నావా?” “Do you imagine I didn't cry over him?” అంటాడు తండ్రి తన “ప్రవాసికొడుకు” గురించి .) ఈ గొలుసు, యీ కథలో ప్రాణభూతమైన ప్రతీక. తండ్రికొడుకులు యిద్దరిలో లోపాలుంటాయి.కాని బంధం ఏమవుతుంది? తండ్రికొడుకులబంధమే కాదు, ఏ బంధమైనా విడిపించడం సులభంకాదు. తండ్రి ప్రేమ నిజం, స్వార్థమూ  నిజం. అట్లాగే కొడుకు ప్రేమ నిజం, స్వార్థమూ  నిజం . బంగారమే కాదు, ప్రేమ కూడా కల్తీ. రాగి కలిస్తేనే బంగారం గొలుసు లాగినా తెగదు .

కాఫ్కా బంధాలగురించి చెప్పడంలేదు. లోకంలోని కల్తీ అనే అస్తిత్వవాదసత్యం గురించి చెబుతున్నాడు.

'There are only two things. Truth and lies. Truth is indivisible, hence it cannot recognize itself; anyone who wants to recognize it has to be a lie.' (Kafka: Notebooks)

సత్యాసత్యాలు, న్యాయాన్యాయాలు ద్వంద్వాలు. ఒకటి లేకుండా మరొకటి ఉండదు. కల్తీలేని సత్యము, కల్తీలేని న్యాయము  లోకంలో దొరకదు. ఇదే తండ్రి కొడుకుతో కోపంలో పలికిన నిజం:

“ఇంతవరకు నీకు నీవు మాత్రమే తెలుసు! నిజానికి నీవు ఒక అమాయకపు పిల్లవాడివి, కాని అంతకంటే నీవొక దయ్యపు మనిషివి.”

ఇదీ అసలు తీర్పు.


****

Saturday, August 3, 2019

కాఫ్కా-1


అస్తిత్వవాదసాహిత్యం-5
ఒక భారతీయపరిచయం:
కాఫ్కా-1
(కాఫ్కా కథకు సంక్షేప అనువాదం) 



తీర్పు (“Das Urteil": "The Judgment", ) 
(కాఫ్కా కథకు సంక్షేప అనువాదం) 


ఆదివారం ఉదయం.వయసొచ్చిన  వసంతకాలం. జెవోర్గ్ యువకుడు. వ్యాపారి.
మేడమీద తనగదిలో ఉత్తరంరాయడం ముగించాడు,ప్రస్తుతం రష్యాలో  ఉన్న తన చిన్ననాటి స్నేహితుడికి.ఉత్తరం కవర్ లో పెట్టి, టేబుల్ అంచున కూర్చొని, కిటికీలోనుండి కనిపిస్తున్న నదిని, నదిమీద వంతెనను, వంతెనకు అవతల పచ్చటి తీరప్రాంతాన్ని చూస్తున్నాడు. 
తన మిత్రుడు చాలాకాలం యిక్కడ ఏ పనిలోనూ ముందుకు పోలేక, రష్యా వెళ్ళిపోయి, పీటర్స్ బర్గ్ లో ఏదో వ్యాపారంలో బాగా స్థిరపడ్డాడు.కాని కొంతకాలం తరువాత వ్యాపారంలో ఎదుగు లేదు. ఇక్కడికి  రాకపోకలు బాగా తగ్గిపోయాయి. వచ్చినపుడు తనతో కష్టాలు చెప్పుకునే వాడు.

దూరదేశంలో భారంగా బతుకు లాగుతున్నాడు.అలవాటులేని గడ్డం పెంచినా, ముఖంలో కుర్రవయసు కనిపిస్తూనే ఉంది.కాని లోపల ఏదో  జబ్బు తనతోపాటు ముదురుతున్నట్టు కూడా తెలుస్తోంది. పరాయిదేశంలో పరిచయాలుతక్కువ.స్వదేశంలో సంబంధాలు తెగిపోయాయి.ఈ జన్మకు పెళ్ళి ఆలోచన వదిలేశాడు. 

అటువంటివాడికి ఏమిటి రాయడం? జాలిపడవచ్చు.అంతకుమించి చేయగలిగింది లేదు.”మన దేశానికి వచ్చెయ్, యిక్కడ మనవాళ్ళు నీవు స్థిరపడడానికి ఏదో ఒకటి చేస్తారు”, అని చెప్పవచ్చు.
కాని, అలా చెప్పడమంటే తన వైఫల్యాన్ని గుర్తుచేసి అతన్ని గుచ్చడమే కదా? అదీ కాక, తీరా వాణ్ణి యిక్కడి రమ్మని, యిక్కడి వాళ్ళు వాడికి చేయవలసిన సహాయం చేయలేక, అతడు యిక్కడా అదే స్థితిలోకి జారితే? 

పైగా అతడే అన్నాడు, ‘నేనిపుడు అక్కడకు వచ్చినా, అక్కడా నేను పరాయివాణ్ణే’, అని.
ఇక్కడకు వచ్చి మరొక్కసారి విఫలమయేకంటే, అక్కడే తన పాట్లేవో తనుపడడం మేలుకదా? 
వాడు యిక్కడికి వచ్చి మూడేళ్ళయింది. రాకపోవడానికి కారణం అక్కడి రాజకీయవాతావరణం అన్నాడు.తనలాంటి చిల్లరవ్యాపారి కొద్దిరోజులు కూడా దేశం వదిలి వెళ్ళడం మంచిదికాదు.

ఇక యిక్కడ తన విషయం. ఈ మూడేళ్ళలో తన వ్యాపారం బాగా వృద్ధిచేసుకున్నాడు.రెండేళ్ళక్రితం తన మిత్రుడికి జెవోర్గ్ తల్లి పోయినట్టు తెలిసింది.సంతాపసందేశం పంపాడు. పొడి మాటలు.

ఇక్కడ జిఓర్గ్ తల్లి పోయినతరువాత అతడి వ్యాపారకౌశలంకూడా చాలా పెరిగింది.తల్లి ఉండగా, అంతా తండ్రి చూచుకునేవాడు. తనను వేలు పెట్టనిచ్చేవాడు కాదు.తల్లి పోయిన తరువాత, తండ్రి ఎక్కువగా కలగజేసుకోడం లేదు. ఏమైనా వ్యాపారం ఊహించనంతగా పెరిగింది, యింకా పెరుగుతుంది.

ఇదంతా తన మిత్రుడికేమీ తెలియదు.తన తల్లిపోయినపుడు తనకు రాసిన సంతాపలేఖ చివర, “ నీవూ యిక్కడికి వచ్చెయ్, నీవు చేస్తున్న వ్యాపారానికి యిక్కడ యింకా మెరుగైన అవకాశాలున్నాయి”, అని రాశాడు.

కాని తను మాత్రం తన వ్యాపారం యిక్కడ బాగున్నదని అతడికి రాయలేదు.ఎప్పుడైనా రాస్తే, ఏవో ఊళ్ళో ముచ్చట్లు, అప్పటికి గుర్తొచ్చినవి రాసేవాడు. తన ఊళ్ళో ఎవడికో  ఎవరో అమ్మాయితో పెళ్ళి నిశ్చయమయిందని మూడు సార్లు రాసిన మూడు ఉత్తరాలలో రాశాడు కాని, తన పెళ్ళి ఒక ధనవంతుల పిల్లతో ( ఫ్రీడా బ్రాండ్డెన్ ఫెల్డ్ ) నిశ్చయమయిందని రాయలేదు.
తన మిత్రుడిగురించి, తనకు అతడికి నడిచే ఉత్తరాల గురించి పెళ్ళికూతురికి చెప్పాడు.  ఆ అమ్మాయి, “ అయితే, మీ మిత్రుడు మన పెళ్ళికి రాడా మరి? అదెలా? నీ స్నేహితులందరూ నాకు తెలియాలి”, అంది.

“ నాకు అతన్ని యిబ్బంది పెట్టడం యిష్టం లేదు.నన్ను సరిగా అర్థం చేసుకో. వాడు వస్తే రావచ్చు. నాకా నమ్మకం ఉంది.కాని వాడు యిబ్బంది  పడతాడు, బాధపడతాడు.నన్నుచూసి వాడు అసూయపడవచ్చు.అసంతుష్టుడై ఒంటరిగా తిరిగి వెళ్ళిపోతాడు. అర్థమౌతోందా?” 

“ అవుతోంది.కాని,మన పెళ్ళి విషయం ఆయనకు తెలియకుండానే ఉంటుందా? “

“నేనెలా అడ్డుపడను? కాని తెలియడానికి అవకాశం లేదు.“

 “ అటువంటి స్నేహితుడున్నపుడు నీవసలు పెళ్ళికి  సిద్ధమై ఉండకూడదు.”

 “నిజమే.ఆతప్పు మనిద్దరిదీ. కాని, యిది మరోలా జరగాలని నేను యిప్పుడుకూడా అనుకోడం లేదు.”

అతడి ముద్దులమధ్య ఊపిరి తీసుకుంటూ, ఫ్రీడా, “ ఏమైనా, నాకు బాధగానే ఉంది”, అన్నపుడు, అతడికి అనిపించింది, మిత్రుడికి చెప్పినందువల్ల నష్టమేమీ ఉండకపోవచ్చని. “అది నా దారి.అతడు అలానే నన్ను ఆమోదించాలి”, అని. నా మిత్రుడికి ఆమోదదయోగ్యమయేవిధంగా బతకలేను.నాకు కావలసిన బతుకు నేను బతుకుతాను.”

ఈ ఆదివారం రాసిన సుదీర్ఘమైన ఉత్తరంలో తన పెళ్ళినిశ్చయం ప్రకటించాడు: “ అతి ముఖ్యమైన విషయం చివరివరకు వాయిదా వేశాను.కుమారి ఫ్రీడా బ్రెండెన్ ఫీల్డ్ తో నా పెళ్ళి నిశ్చయమయింది.అమ్మాయిది  బాగా ఉన్నవాళ్ళ కుటుంబం.నీవు యిక్కడనుంచి వెళ్ళిపోయాక వాళ్ళు యిక్కడకు వచ్చి స్థిరపడ్డారు.ముందు ముందు ఆమె గురించి యింకా చెబుతుంటాను.నేను చాలా సంతోషంగా ఉన్నాను.పెళ్ళికూతురు నీకు శుభాకాంక్షలు తెలుపుతోంది. ఉత్తరం కూడ రాస్తుంది.నీకు ఒక మంచి మిత్రురాలు దొరుకుతుంది. ఒక బ్రహ్మచారికి  మంచి విషయమే కదా! నా పెళ్ళికంటే నీకు మంచి అవకాశం ఏముంటుంది? అన్ని సమస్యలు పక్కకు పెట్టి వచ్చెయ్. అయినా నీ యిష్టం, నీ బాగోగులు ఆలోచించుకో. ”

కాసేపు కిటికీ లోనుంచి శూన్యపుచూపులు చూసి, ఉత్తరం జేబులో పెట్టుకుని, తండ్రి గదిలోకి వెళ్ళాడు.కొన్ని నెలలయింది ఆ గదిలోకి అడుగుపెట్టి.వెళ్ళవలసిన అవసరం కూడా లేకుండింది.వ్యాపారవిషయాలలో కలుస్తూనే ఉండేవాళ్ళు.  మధ్యాహ్నం యిద్దరూ బయటకు వెళ్ళి తినేవారు.రాత్రి ఎవరికి కావల్సింది వారు వడ్డించుకుని తినేవారు.

హాల్లో యిద్దరూ కలిసి కూర్చొనేవారు, ఎవరి వార్తాపత్రిక వాళ్ళు చదువుతూ.ఒక్కోసారి కొడుకు బయటకు వెళ్ళేవాడు, స్నేహితుల్నో,  ఫ్రీడానో కలవడానికి.

జిఓర్గ్ కు ఆశ్చర్యమేసింది, తండ్రి గది యింత చీకటిగా ఉందా! తండ్రి కిటికీ దగ్గర కూర్చున్నాడు.ఆయన భార్య జ్ఞాపకాల వస్తువులేవో ఉన్నాయక్కడ.చూపు సరిగా లేదేమో, పేపర్ కంటికి దగ్గరగా ఉంచుకొని చదువుతున్నాడు. టేబుల్ మీద తినగా మిగిలిన, ఉదయాహారం ఉంది.తిన్నదానికంటే వదిలిందే ఎక్కువ.

“ఆహ్, జిఓర్గ్!”, అంటూ తండ్రి కొడుకు దగ్గరకు వచ్చాడు.లేచి వస్తున్న తండ్రిని చూస్తూ, “ఆహ్ ! మా నాయనది   యిప్పటికీ పెద్దశరీరమే”, అనుకున్నాడు. “ఇక్కడ చీకటి దుర్భరం”, అన్నాడు. 

తండ్రి, “ అవును, చీకటే.” 

“కిటికీ మూశావా?”

“నాకు అదే యిష్టం.”

“బయట వెచ్చగా ఉంది.”

టేబుల్ మీద ప్లేట్లు తీసి పక్కనున్న కబర్డ్ లో పెట్టాడు తండ్రి. 

“ ఏం లేదూ. నా పెళ్ళి విషయం పీటర్స్ బర్గ్ కు చెప్పాను.”

 “పీటర్స్ బర్గ్ ?”

“అదే, నా ఫ్రెండ్.”

“అవునవును. నీ ఫ్రెండ్.”  

“నాన్నా! నీకు గుర్తుందా? ఈ విషయం వాడికి చెప్పవద్దనుకున్నాను. కేవలం వాడి గురించి ఆలోచించి. నీకు తెలుసు కదా?  అతడితో కష్టం. నా పెళ్ళి గురించి మరెవరిద్వారానో తెలుసుకోనీ, అనుకున్నాను. వాడికి పరిచయాలు తక్కువ కనుక, అదికూడా జరగదు.కాని నేను మాత్రం చెప్పవద్దు అనుకున్నాను.”


“అయితే, మనసు మార్చుకున్నావు? “

“అవును. ఆలోచించాను.అతడు మంచి స్నేహితుడైతే, నా పెళ్ళి అతడికి కూడా మంచిదే కావలె. కాని ఉత్తరం వేసేముందు నీతో చెబుదామనుకున్నాను.”

బోసినోరు పెద్దది చేస్తూ అన్నాడు తండ్రి: “జిఓర్గ్! చూడు! ఈ విషయం చర్చించడానికి వచ్చావు నా దగ్గరికి. అది నాకు పెద్ద మన్నన.కాని పూర్తి విషయం చెప్పకపోతే, చెప్పి ఏం లాభం?   ఈ సందర్భానికి సంబంధించని విషయాలు కదిలించడం నాకిష్టం లేదు.అమ్మ పోయినప్పటినుండి కొన్ని జరగకూడనివి జరుగుతున్నాయి.వ్యాపారంలో నాకు తెలియకుండా ఏవో జరుగుతున్నాయి.కావాలని నా వెనకాతల ఏదో జరుగుతోందని అనుకోడం నాకిష్టం లేదు.
వెనకలాగ యిప్పుడు  నాకు ఓపిక ఉండడం లేదు.మతిమరుపు. కొంత పెత్తనం.కొంత అమ్మపోవడం.అది నీ కంటే నన్ను బాగా కుంగదీసింది.ప్రస్తుతం యీ ఉత్తరం విషయం. జిఓర్గ్! దయచేసి నన్ను నిరాశపరచొద్దు.చాలా చిన్న విషయం.నీకసలు నిజంగా ఒక మిత్రుడున్నాడా, పీటర్స్ బర్గ్ లో? “

జిఓర్గ్ తడబడ్డాడు.లేచి నిలబడ్డాడు. “ నా స్నేహితుల్ని వదిలెయ్. వెయ్యిమంది స్నేహితులైనా మా నాన్నకు సమానం కారు.నాకేమనిపిస్తోందో తెలుసా ? నీ విషయం నీవు ఏమాత్రం పట్టించుకోడం లేదు. వయసు పైబడుతోంది. దాన్ని గుర్తించాలి కదా? వ్యాపారంలో నీవు నాకు చాలా అవసరం.కాని నీ ఆరోగ్యం? రేపు మొత్తం మూసేస్తాను.ఇలా జరక్కూడదు.మరో మార్గం చూడాలి. నేలమట్టంనుండి.ఇక్కడ యీ చీకటిగదిలో కూర్చుంటావు.హాల్లో వెలుతురుంటుంది కదా? పొద్దున టిఫిన్ ఏదో తిన్నాననిపిస్తావు.కిటికీమూసి మూల కూర్చుంటావు.ఇలా కాదు.రేపు డాక్టర్ ను పిలుస్తాను.ఈ చీకటిగదిలోనుండి ముందుగదిలోకి మారు. సరే అవన్నీ నిదానంమీద.ముందు పడుకో, విశ్రాంతి తీసుకో.ఉండు, బట్టలు మారుస్తా,  పడుకుందువు.నేను మార్చగలను.లేదు, యిప్పుడే ముందుగదిలోకి మారుతావా? నా పక్కమీద పడుకో ప్రస్తుతానికి. అదే మంచిది.”

జిఓర్గ్ తండ్రి పక్కన నిలబడ్డాడు.తండ్రి అతడి రొమ్ముకు తల ఆన్చాడు. “జిఓర్గ్! “ అని ఏదో చెప్పబోతున్నాడు. జిఓర్గ్ వెంటనే  తండ్రి పక్కనే మోకరిల్లాడు,వినడానికి. “ జిఓర్గ్! నీకు పీటర్స్ బర్గ్ లో స్నేహితుడెవడూ లేడు.నీవు మొదటినుండీ జోకరువి. నాకు కూడా కాకమ్మ కబుర్లు చెబుతావు.పోయి పోయి పీటర్స్ బర్గ్ లో నీకు స్నేహితుడు! నేను నమ్మను.”

“నాన్నా ! గుర్తు తెచ్చుకో.మూడు సంవత్సరాల కింద మన యింటికి వచ్చాడు. నీకంత యిష్టం లేదు వాడంటే.అందుకనే వాడు నా గదిలోనే ఉంటున్నా నీకు చెప్పలేదు నేను. వాడిని యిష్టపడడం కష్టమే, నాకు తెలుసు. కాని అతడితో నీవు బాగానే మాట్లాడేవాడివి.గట్టిగా ప్రయత్నంచెయ్, గుర్తొస్తాడు.రష్యన్ విప్లవంగురించి నమ్మలేని కథలు చెప్పేవాడు.ఆ కథ ! అతడొకసారి కీవ్ ( Kiev) వెళ్ళినపుడు ఒక పూజారి ( priest) కత్తితో తన చేతిని కోసుకుని, ఆ చేయి చూపుతూ జనాలకు ప్రవచనం చేశాడు. నీవే ఎన్నోసార్లు యీ కథ  జనాలకు చెప్పేవాడివి.” 

జిఓర్గ్ యీ మాటలు చెబుతూనే, తండ్రిని పడుకోబెట్టటానికి  ఆయన జెర్సీ ట్రౌజర్స్ లాగేశాడు. లోపలి చెడ్డీ మురికి పట్టి ఉంది.జిఓర్గ్ తనను తాను నిందించుకున్నాడు తండ్రి అవసరాలు యింతకాలం పట్టించుకోకపోయినందుకు.పెళైనతరువాత తన తండ్రిని ఎలా చూచుకోవాలో ఫ్రీడాతో యింతవరకూ మాట్లాడలేదు.ఎందుుకంటే, తమ పెళ్ళి అయి యిల్లు మారినపుడు, తండ్రి పాత యింటిలోనే ఉండిపోతాడనుకున్నారు.

తండ్రిని తన చేతులలోకి ఎత్తుకొని తీసుకెళ్లి పక్కమీద పడుకోబెట్టాడు.అలా తీసుకెళుతున్నపుడు,తండ్రి తన చేతి గడియారం గొలుసుతో  ఆడుకుంటున్నట్టు అనిపించింది. గొలుసు గట్టిగా పట్టుకోడంతో ఆయనను విడిపించి పక్కమీద పడుకోబెట్టడం అంత సులభం కాలేదు.కాని పడుకోగానే ఆయన మామూలైపోయాడు.బుజాలపైకి దుప్పటి లాగి కప్పుకున్నాడు.చూపులో అప్రసన్నత  లేదు.

“గుర్తొచ్చాడు కదూ? “, అన్నాడు జిఓర్గ్.

“బాగా కప్పుకున్నానా?”,అని అడిగాడు తండ్రి, పాదాలు కనిపించడం లేదన్నట్టు.

“చూశావా? పడుకుంటే హాయిగా ఉందికదూ?”,అన్నాడు జిఓర్గ్, దుప్పటి బాగా కప్పుతూ.

“ పూర్తిగా కప్పావా?”, అడిగాడు తండ్రి.

“పూర్తిగా కప్పాను.హాయిగా పడుకో.”

“ ఊహూ!”, అంటూ ఒక పెద్ద కేకవేసి, కప్పిన దుప్పటి లాగి పైకి విసిరేస్తూ, లేచి నిలబడ్డాడు, బృహత్కాయుడు. కోపవేగంలో తూలి, తట్టుకొని నిలబడ్డాడు. “నాకు తెలుసు, నీవు నన్ను కప్పెట్టెయ్యాలని చూస్తున్నావు.అది నీ వల్ల కాదు. నీ స్నేహితుడు నాకు బాగా తెలుసు.అతడు నా  కొడుకు అయి ఉంటే నేను యిష్టపడేవాడిని. అందుకే యిన్నాళ్ళూ నీవతన్ని వంచించావు. అందుకు కాక మరెందుకు? అతడికోసం నేను కన్నీరు కార్చలేదనుకుంటున్నావా? అందుకే నీవు నీ గదిలో కూర్చుని, -అయ్యగారు మహా బిజీ కదా! -తలుపులు మూసుకొని, నీ రష్యా మిత్రుడికి దొంగ ఉత్తరాలు రాసుకున్నావు. వాణ్ణి కిందకు లాగి, వాడి పైకెక్కి కూర్చొని, కదలకుండా చేయడానికే కదా, నా సుపుత్రుడు పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు! “

జిఓర్గ్ తండ్రి ఉన్న భయంకరమైన స్థితిని చూస్తూ ఉండిపోయాడు.తన మిత్రుడు మునుపెన్నడూ. లేనంత గట్టిగా పట్టుకున్నాడు తనను.అంత దూరం ఎందుకు వెళ్ళిపోయాడు? అతడు, అతడి వ్యాపారం అంతా సర్వనాశనం. తన కళ్ళముందు కరిగిపోతున్న కల.

“ ఇదిగో !  యిటు చూడు! ఆ వగలమారి వయ్యారి, పావడా పైకెత్తి, యిదిగో యిట్లా పైకెత్తి పైకెత్తి నిన్ను తన వెంట తిప్పుకొంది. దానికోసం నీ మిత్రుడికి ద్రోహం చేశావు, ఏ అడ్డు లేకుండా దాంతో కులకొచ్చని.నీ తల్లి పవిత్రాత్మ స్మృతిని అపవిత్రం చేస్తున్నావు.నీ తండ్రిని కప్పెట్టేస్తున్నావ్, కదలకుండా. కాని, కదులుతాడు. చూడు! “, అంటూ అన్నీ వదిలించుకొని లేచి నిలబడ్డాడు.

“ఇప్పుడు ఆ స్నేహితుడు వంచించబడలేదు”, అని, తన తర్జని ఊపుతూ, “నేను అతడి ప్రతినిధిని.” 

“కామెడీ! “ అని అప్రయత్నంగా అనేశాడు జిఓర్గ్.

“అవును.కామెడీ! పెళ్ళాం పోయిన ముసలాడి బతుక్కి కామెడీ కాక ఏముంటుంది? అంగడి  వెనకగదిలో మగ్గిపోతూ, వ్యాపారం పెంచుతూంటే , నా కొడుకు జల్సాలు చేశాడు.నీవంటే నాకు ప్రేమ లేదంటావ్! 

“ఇప్పుడు ముందుకు వంగి పడిపోబోతాడు”, అనుకున్నాడు జిఓర్గ్. 
తండ్రి ముందుకు వంగాడు,, కాని పడిపోలేదు.కొడుకు ముందుకు దూకలేదు పడిపోబోతున్న తండ్రిని పట్టుకోడానికి. పడిపోబోయిన తండ్రి నిటారుగా నిలుచున్నాడు.

“ఆగు! నీ అవసరం లేదు! నేనింకా నీకంటే బలమైనవాడిని.నీ మిత్రుడితో నేను సుఖంగా ఉండగలను.అమ్మ నాకు ఆ శక్తినిచ్చింది.నీ మిత్రుడు యిప్పుడు నా జేబులో ఉన్నాడు. నాతో. నాటకాలాడుతావా,నీ ఫ్రెండ్ కు ఉత్తరం రాస్తావా నీ పెళ్ళి గురించి? వాడికంతా ఎప్పుడో తెలుసు.నేను రాశాను  వాడికి. నీవు కాగితం కలం లాగేసుకోడం మర్చిపోయావు కదా! నీ ఉత్తరాలు. ఎడంచేత్తో నలిపేస్తూ, కుడిచేత్తో నా ఉత్తరాలు పట్టుకొని చదువుతాడు. కొన్నేళ్ళుగా ఎదురుచూస్తున్నా, యీ ప్రశ్నతో నా దగ్గరకొస్తావని! నేను పేపర్లు చదువుతానని తెలుసా? “, అంటూ, ఒక పాత పత్రిక తనముందుకు తోశాడు. “ ఎంతకాలం పడుతుంది నీకు ఎదగడానికి? తల్లి చనిపోవాలి.ఎదిగిన కొడుకును చూసుకునే అదృష్టం లేదు ఆమెకు.మిత్రుడు రష్యాలో నష్టమైపోతున్నాడు.ఇక నేను! చూస్తున్నావు కదా! ఏమై పోతున్నానో? కళ్ళున్నాయి కదా? చూడు!

జిఓర్గ్ అన్నాడు: “నా కోసం కాచుక్కూచున్నావన్నమాట! “

జాలిగా అన్నాడు తండ్రి, “ బహుశా యీ మాట ముందే అందామనుకొని ఉంటావు.కాని యిప్పుడు ఆ మాట అతకదు.”  గొంతు పెంచుతూ యింకా అన్నాడు: “ నీ వెలుపల ఏముండిందో నీకు తెలుసా? ఇంతవరకు నీకు నీవు మాత్రమే తెలుసు! నిజానికి నీవు ఒక అమాయకపు పిల్లవాడివి, కాని అంతకంటే నీవొక దయ్యపు మనిషివి. కాబట్టి, విను! నీకు నేను నీటిలో మునిగి చావమని మరణదండన విధిస్తున్నాను! “

జిఓర్గ్ కు  తనను గదిలోనుండి తండ్రి తరిమేసినట్టనిపించింది.వెళ్ళిపోతున్నపుడు అతనికి తన తండ్రి పక్కపై కూలిపోయినట్టనిపించింది.మెట్లు దిగుతున్నపుడు జారుడుబండమీద కిందికి పోతున్నట్టనిపించింది. మెట్లమీద ఎదురొస్తున్న పనిమనిషి అతణ్ణి చూసి, “జీసస్”, అని ఒక కేక వేసింది.అతడు యిల్లు దాటి నదివైపు పరుగెత్తాడు.వంతెన కడ్డీ పట్టుకున్నాడు.నదివైపుకి దూకి వేలాడాడు, ఒకప్పుడు తన తల్లిదండ్రులు తనను చూచి గర్వపడిన మంచి క్రీడాకారుడి లాగా. నదివైపు కడ్డీ పట్టుకుని వేలాడుతూ, నదిలోకి పడిపోతూ, “ నా తల్లిదండ్రులారా! నేను మిమ్మల్ని ఎప్పుడూ  ప్రేమించాను”, అంటూ కడ్డీ వదిలేశాడు.

*****
కథ గురించి, కాఫ్కా గురించి వచ్చే వారం.

Friday, July 26, 2019

నీచ- 7/7

అస్తిత్వవాదసాహిత్యం-4
నీచ-7/7

సముల్లాసశాస్త్రం
( Preludes to The Gay Science or The Joyful Wisdom ( La Gaya Scienza)

[అనువాదకుని ముందుమాట

నీచ పద్యాలలో కంటే అతని వచనంలో ఎక్కువ కవిత్వపటుత్వం కనిపిస్తుందనేది సాధారణ భావం. కాని అతడి పద్యాలు ఉపేక్షించదగినవి కావు. ముక్తకాలలో ఉండవలసిన క్లుప్తత, కొద్ది పదాలలో దట్టించిన అర్థం వాటికి కావ్యగౌరవం కలిగిస్తాయి. రెండు అనువాదాలలో  (జర్మన్, ఇంగ్లీషు )  వడగట్టిన కవిత, ఎక్కువ మిగలకపోవచ్చు. మిగిలిందే దక్కుదల.

నా తెలుగు అనువాదానికి నేను అనుసరించిన రెండు ఆంగ్లానువాదాలు, ఒకటి Adrian Del  Caro చేసింది; రెండవది  Walter Kaufman చేసింది. వారికి నేను ఋణస్థుణ్ణి.

నీచ తన The Gay Science కు ఆ పేరు పెట్టడంలో ఏం చెప్పదలచుకున్నాడు? ముందు Gay అన్న పదం, Science అన్న పదం విరుద్ధార్థలను చెప్పేవి కదా అన్న ఆభాస కలుగుతుంది. నీచకు జర్మనుల తాత్త్వికగాగాంభీర్యం యిష్టం లేదు. అతడికి  ప్రొవెన్సల్ (Provençal, ఫ్రాన్స్ లోని దక్షిణభాగం) సంస్కృతి యిష్టం.  ఈ సంస్కృతిని  కీట్స్ కూడా స్మరించాడు తన ప్రసిద్ధకవితలో.

O, for a draught of vintage! that hath been
         Cool'd a long age in the deep-delved earth,
Tasting of Flora and the country green,
         Dance, and Provençal song, and sunburnt mirth!
O for a beaker full of the warm South,
         Full of the true, the blushful Hippocrene,...( Keats: Ode to a Nightingale)

విజ్ఞానశాస్త్రం (Science) లో జ్ఞానానికి ( Apollonian) తప్ప ఆనందానికి ((Dionysian) ఆస్కారం లేదన్నది సాధారణభావం.ఆ రెంటినీ కలపడమే నీచ జీవనదర్శనం.]

                                                    ***

సముల్లాసశాస్త్రం
( Preludes to The Gay Science or The Joyful Wisdom ( La Gaya Scienza) Nietzsche)

1.ఆహ్వానం

వాడి చూడండి,మీ ముందుంచుతున్న సరుకు~
నా వాగ్దానం, యిది మీకు నచ్చుతుంది
ఈ వేళ కాకుంటే రేపు, యీ రోజుకంటే రేపు.
అప్పుడు మీరు  మరికొంత కోరితే,
ఈ విజయం నాకిచ్చే  ధైర్యంతో  సరికొత్త సరుకు అరువు తెచ్చి మీముందుకొస్తాను.

2.నా అదృష్టం.

వెదకి విసిగిపోయాను.
కాదని, కనుగొనడం నేర్చుకున్నాను.
ఒక గట్టి గాలి కొట్టి వెనక్కు విసిరేసింది,
ఇక యిప్పుడు గాలి ఎటు విసిరితే అటు.

( గాలిలో అవశమై  ఎగిరే ఎండుటాకును చెబుతున్నాడా? కాదు. సిద్ధాంతాల కట్టుబడినుండి విడివడి స్వేచ్ఛ పొందడం మొదటి మెట్టు.ఇక్కడ రెండు పదాలు కీలకం: “వెదకి”, “కనుగొను” . మొదటిది వెదకడం, “వాడేం చెప్పాడు,వీడేం చెప్పాడు”,అని. దానిలో విసుగు తప్ప వెలుగు కలగదు. వెదకడం ఆపితే, తనకే తెలుస్తుంది.ఇది అస్తిత్వవాదంలో మూలతత్త్వం. ఎవడు కనుగొన్న సత్యం వాడికి మాత్రమే సత్యం, మరొకడికి పనికిరాదు.( “I must find a truth that is true for me.” (Kierkegaard: Journal entry, Gilleleie : 1 August 1835) ఇది వైయక్తికత కాదు, ఆత్మత. (అస్తిత్వవాదం వ్యక్తి ఆత్మను (Individual Self) ఆవిష్కరిస్తుంది. కాని ప్రాథమ్యం,వ్యక్తిపై (Individual) కాదు, ఆత్మపై (Self).

తరువాత, “యిప్పుడు, గాలి ఎటు విసిరితే అటు”, ఏ సిద్ధాంతానికీ  విముఖత లేకుండా అన్నిటితో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళడం, చివరకు  తన సిద్ధాంతాలైనా చివరివరకూ అంటిపెట్టుకోరాదు. నీచ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకొంటూ వెళ్ళాడు.నావి కదా అని గుండెలకు హత్తుకోలేదు.అది స్వేచ్ఛాస్వరూపం, ప్రయోజనం.)

3.ధృతి

నీవున్నచోట లోతుగా తవ్వి చూడు! నీ కింద ఉన్నది నుయ్యి!
మూఢులను  ఏడవనీ: “కింద ఉండేది గొయ్యి”.అని .

(ఈ పద్యంలో నీచ ప్రసిద్ధభావాలు రెండు వ్యక్తమయ్యాయి. నీచ ద్వంద్వాలను (binaries) ఒప్పుకోడు. మంచి చెడు, పుణ్యం పాపం, స్వర్గం నరకం అనేవి విరుద్ధాలు కావు. తారతమ్యాలు అంటాడు నీచ.

కింద, పైన అనేవి కూడా అటువంటి ద్వంద్వమే. ‘పైన’ నుయ్యి, ‘కింద’ గొయ్యి.  అనే సాధారణభావాన్ని కాదంటున్నాడు.

“న చోర్ధ్వం న చాధః”(దశశ్లోకీ”).గీతగీచుకుంటే ఆద్యంతాలు, అధోర్ధ్వాలు. గీత తుడిచేస్తే లేవు ద్వంద్వాలు.

లోపలికి దిగడమంటే గొయ్యిలో పడిపోవడం కాదు, ఊట బావిలోని జీవజలాలను చేరడం.

“జారతూస్ట్ర” ప్రారంభభాగంలో కూడా యీ “కిందికి దిగిపోవడం” గురించి చెబుతాడు:

“అతడు (జారతూస్ట్ర ఊరు విడిచి ఊరి సరసును విడిచి కొండల్లోకి నడిచి) సూర్యుడికి ఎదురుగా నిలిచి యిలా అన్నాడు: ... “నేను అపరాంబుధిలోకి అస్తమిస్తాను, సాయంకాలం నీవు సముద్రం వెనుక దిగిపోయి అధోలోకాలకు వెలుగునిచ్చినట్టు, ఓ ఉత్సాహభరితనక్షత్రమా!కనుక నీలాగా నేనూ దిగిపోతాను.అంటుంటారే, ఎవరికోసం అవతరిస్తారో వారి ముందు...అలా జరిగింది జారాతూస్ట్ర దిగిపోవడం.” (జార.1.1.)

మనిషిని ఉద్ధరించవలె అనుకుంటే, దేవుడు మనిషిగా “దిగి” వస్తాడు.) నీవు దేవుడికంటే గొప్పవాడివి కావు కదా!

4.సంభాషణ

నాకు జబ్బు చేసిందా? కోలుకున్నానా?
నా వైద్యుడెవరో కనుక్కొన్నారా?
ఎలా మరచిపోయాను అంతా?

ఇప్పుడు నీవు కోలుకున్నావు:
మరచినవాడు స్వస్థుడు.

(మన సంభాషణలలో తరచు విషయం మన ప్రియమైన అస్వస్థత. ఎంత చెప్పినా తనివితీరదు. అస్వస్థత మన ఘనత  కాదు, పదిలపరచుకొని పదేపదే నలుగురితో పలవరించడానికి.)

5.సత్పురుషుడు

మన సుగుణాలు హుషారుగా అడుగులు వేయాలి యిటు అటు:
హోమర్ చరణాల లయలా, వస్తూ పోతూ.

(“ సత్పురుషుడు హుషారుగా ఉండరాదు, ఎప్పుడూ గంభీరముద్రతో ఉండవలెను”, అనే అభిప్రాయాన్ని కాదంటున్నాడు. సత్పురుషుడు వేసిన ప్రతి అడుగులో ఆనందం ప్రకటం కావాలి, హోమర్ కవితలోలాగా.)

6.లౌక్యం

పల్లపుప్రాంతాలలో యిల్లు కట్టుకోకు!
ఆకాశంలో మేడలు కట్టకు!
మధ్య భూమిలో నిలబడి చూడు
లోకం ఆలోకనీయం!

( పైకి కిందికీ, అంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు, చూడకు.ఈ భూమిమీద ఉన్నావు. దీనిపై చూపు నిలుపు.)

7.కరపుస్తకం

( మూలంలో  శీర్షిక “vade mecum”,అంటే “నాతో రా” అని అర్థం. Handbook, guide )

నా దారి,  నా మాట నచ్చాయి నీకు. నన్ననుసరిస్తావా?
నీ దారిని నమ్మి నడువు : నా దారికొస్తావు.

( సత్యం ఏకమే అయినా, ఎవడి సాధన శోధన వాడిదే.( “I want to find out the truth that is true only for me.” Kierkegaard) గమ్యం ఒకటే అయినా, ఎవడి దారి వాడు చేసుకోవలసిందే.ఒకడు చేసిన దారి మరొకడికి పనికిరాదు.కాని,  ‘ఎవడి దారి వాడిది’, అన్న అనైక్యం  కాదు దీని అర్థం.
ఇది నీచ విషయంకూడా.అతడు చెప్పింది చెప్పినట్టు వేదవాక్యమని స్వీకరించనవసరం లేదు.)

8.మూడవ కుబుసం

నా చర్మం పగులుతోంది
నాలోపల పాము కోరికతో రగులుతోంది,
తిన్న మట్టి  ఆకలి రేపింది.
మరింత  మట్టికై  దాహం.
పొదలకు ప్రవాహానికి మధ్య పాకిపోతుంటాను.
దహించే ఆకలి, అయినా ఉత్సాహంతో
తిన్నదే తింటూ: ఓ! మట్టీ! పాముకు పుష్టి!

( మన్నుతిన్న పామును  స్తబ్ధతకు చెబుతారు. కాని,నీచ ఆ మట్టి చాలు అంటున్నాడు. మట్టి యిక్కడ అంటే పృథివీతత్త్వం చెబుతున్నాడనుకోవలె.
 మట్టి నాకు పుష్టి అంటాడు. ఈ ప్రపంచం తినుచున్న ‘మట్టినే’  తినుచూ హాయిగా బతకొచ్చు, “ఎందుకు సణుగుతావు?”, అంటాడు నీచ. ఏ విషయంలోనూ లోకం గురించి సణగవద్దు గొణగవద్దు అనేది నీచ జీవితదృక్పథం.ఉన్నదానితో సరిపెట్టుకో అని అనడం లేదు. ఉన్నదానితో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించు అంటాడు.)

9. నా గులాబీలు

అవును! మీ వినోదం కొరకు నా ఆనందం.
ఏ ఆనందానికైనా  అదే ధ్యేయం.
 నా గులాబీని, ఆనందాన్ని తుంచేస్తావా?

ఇరుకు దారుల్లో వంగి వెదకాలి,
ముళ్ళ కంచెల్లో  తొంగి చూడాలి,
మెడలు సాచాలి.

పిచ్చెక్కించడం నా ఆనందం.
పైశునం నా గుణం.
నా గులాబీని, ఆనందాన్ని తుంచేస్తావా?

10.తిరస్కారం

చాలానే ఒలికిస్తాను నేను.
తిరస్కారమనుకుంటారు మీరు.
మీ పానపాత్ర నిండినపుడు
చాలానే ఒలుకుతుంది.
మద్యాన్ని నిందించరు.

11.నా నుడి.

సునిశితము సున్నితము, మందము తీక్ష్ణము, అపరిచితము సుపరిచితము.
పండితుడు పామరుడు కలుసుకునే చోటు.
ఇదీ నేను. మొదటినుండి నేనిలా-
నాలోపల పాము, పావురము, సూకరము సహజీవనం.

( ద్వంద్వాలను అంగీకరించడు  నీచ.పండితుడు పామరుడు విరుద్ధాలు కారు.వారు ఒకే తాటికి రెండు కొనలు.)

12.వెలుగు చెలికాడు

నీ కళ్ళు, మనసు భద్రం.
నీడలో నడుస్తూ సూర్యుణ్ణి అనుసరించు

( సూర్యుణ్ణి అనుసరించడమంటే విజ్ఞానం (Apollo)  అవసరమే. కాని సూర్యుణ్ణి నేలమీదకు దించితే బతుకు మాడిపోతుంది. ఆ వెలుగులో యీ బతుకు బతుకు.ఈ లోకం, యీ నేల నీవి. “కళ్ళు, మనసు”,భౌతికం, బౌద్ధికం.)

13.నర్తకులకు

జారుడు  మంచు
స్వర్గం,
నేర్చిననర్తకులకు.

భద్రత  అవసరంలేనివాడే నిజంగా భద్రుడు.

ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా  తేవాలంటే, “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు (“జారుడు మంచు కైలాసం”). మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు ! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది,ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర  ఆహార అభద్రతకు ప్రతీక.(food security కాదు, insecurity లో సంతృప్తి ఉంది అంటాడు నీచ.) జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం,  జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో  ఆనందం ఉంది.రవీంద్రభారతిరంగస్థలంపై  దొరకని ఆనందం.

అభద్రతలోని ఆనందాన్ని కోరుకో.ప్రమాదాలను ఎదిరించే సాహసజీవితం కోరుకో.
జీవితంలో భద్రతను కోరకు,అంటాడు నీచ. భద్రత కావాలంటే స్వేచ్ఛను పణంగా పెట్టాలి.
ఈ నాటి రాజకీయంలో జరుగుతున్నది అదే, భద్రతకోసం జనం స్వేచ్ఛను పణంగా పెడుతున్నారు.

“దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు, కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇంతకాలానికి, మా నావలు బయలుదేరగలుగుతున్నాయి,ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాయి.ఇప్పుడు జ్ఞానాన్వేషణాప్రియులు చేయరాని సాహసం లేదు. సముద్రం, మన సముద్రం, మళ్ళీ  పిలుస్తోంది,ఏదీ దాచుకోకుండా. ఇంత స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం బహుశా మునుపెన్నడూ ఉండి ఉండదు.( స.శా.5.343)

సముద్రం స్వచ్ఛంగా ఉంది.ప్రయాణానికి స్వేచ్ఛ ఉంది మనిషికి. కాని మునుపటి ప్రమాదాలు అలాగే ఉన్నాయి.లేకపోతే అది సముద్రప్రయాణం ఎట్లా అవుతుంది? అందులో సాహసమేముంది? సముల్లాసమేముంది?

జీవితం మంచుకొండ, మహాసముద్రం. ఎదురించి జీవించడమే జీవితం.అదే సముల్లాసం.)

14. మంచి మనిషి

బాహాటపు పోరాటం మేలు
అతుకుల స్నేహం కన్నా.

15.తుప్పు

కొంచెం తుప్పు తగిలించు.మరీ పదునైతే పనిచేయదు.”ఇంకా కుర్రతనం, బిర్రు తగ్గలే”దంటారు.

16.పైకి

“ఈ కొండ ఎక్కడమెలా?”
 “ఎక్కు , ఆలోచించకు.ఏమో! ఎక్కినా ఎక్కగలవు.”

17. పశుసూత్రం

ఎన్నడూ అడుక్కోకు- అది నా కసహ్యం.తీసేసుకో, దయచేసి.
అందరి మనసులు నేనెరుగుదును;
నేనెవరో , నాకు తెలియదు.

18. సంకుచితులు

సంకుచితులను భరించలేను,
చెడు లేదు మంచి లేదు యించుమించు.

19.

అసంకల్పిత కాముకుడు
వఠ్ఠిమాటొకటి విసిరాడు శూన్యంలోకి,
ఒక స్త్రీ రాలి పడింది.

( నీచకు స్తీలపట్ల గొప్ప సద్భావం లేదనేది తెలిసిందే. అతడి మీసాలు చూసి అమ్మాయిలు పారిపోయి ఉంటారు.)

20.ఆలోచించు

జంట బాధ మేలు ఒంటి బాధ కన్నా.
అంగీకరించగలవా నా ఆహ్వానం?

21.అహంకారం

అహాన్ని మరీ ఊదకు.
అది సూది మొన తాకుకే  శూన్యం.

22.పురుషుడు,స్త్రీ

నచ్చిందా ఆడది,దోచెయ్, అంటాడు మగాడు.
ఆడది దోచదు,దొంగిలిస్తుంది.

23.విశ్లేషణ

నా రచనలు నేను చదివితే
నన్ను నేను చదువుతా.
మరొకడు చదివితే,
వాడు నన్ను  మోస్తూ నడుస్తాడు
భళ్ళున తెల్లారేవరకు.

24.నిరాశావాదులకు మందు

నీకేదీ రుచించడం లేదా, మిత్రమా? నీ కడుపునొప్పితో విసుగొస్తోంది నాకు.
నీ తిట్లకు దుర్భాషలకు థూత్కారాలకు అంతులేదు.
నా ఓపిక నశిస్తోంది.నా గుండెలు పగులుతున్నాయి.నాదొక మందుంది, నే చెప్పింది చెయ్.
కలుగుతుంది తప్పక సత్ఫలితం.
ఒక కప్పను మింగు, నీ అజీర్తి మాయం.

(నీచ వచనాలను జీర్ణంచేసుకోవడం కష్టమే. సిద్ధమైతేనే చదవాలి.)

25.నాకు పరుడి తలపు తెలుసు,నేనెవరో నేనెరుగ.
నేను చూచింది  చూస్తున్నది నేను కాదు.
నాకు నేను దూరంగా వెళ్ళగలిగితే, నాకు మేలు.
కాని , మరీ దూరం కాదు, నా శత్రువులంత.నాకు అతి దగ్గరి మిత్రుడు చాలా దూరం.ఉహూ,
మధ్యేమార్గం మేలు! నేననేది అర్థమవుతుందా నీకు?

26. నా  కాఠిన్యం

వంద మెట్లు ఎక్కాలి నేను.
పైకెళ్ళాలి  ,కాని మీ మూలుగు  వింటున్నా:
"క్రూరుడవు!  మేమేమీ  బండలమా? "
వంద మెట్లు ఎక్కాలి  నేను:
మెట్టునౌతానని ఎవడంటాడు?ఒక్కడూ  అనడు.

(అలెక్సాండరు, నెపోలియను, హిట్లరు ఎంతమంది మీద నడిచి వెళ్ళాలి! మెట్లు మూలుగుతాయి. అంతకంటే ఏం చేయగలవు? మెట్ల అనుమతి తీసుకుని ఎవడూ హిట్లర్ కాడు.కాగలిగితే ఏ మెట్టూ మెట్టుగా ఉండి పోదు. మనిషిలో ఒక హిట్లర్ దాగి ఉంటాడు. చేతకానివాడు వాడికి జోలపాడుతూ ఉంటాడు. నీచ ప్రకృతిని చెబుతున్నాడు. ఇదీ ప్రకృతి. హిట్లర్ అయిపో, అనడంలేదు.ఇతరేతరశక్తులవల్ల యీ అతిమానవులు ఆవిర్భవిస్తారు. అతిమానవులు హిట్లర్లే కానవసరం లేదు. ఏ రంగంలోనైనా “సగటుమనిషి”ని అతిశయించినవాడు, ఒక వాల్మీకి  ఒక హోమర్ ఒక మైకెలేంజిలో , అతిమానవుడే.
తరువాత ఒక పద్యంలో నీచ తన గురించి చెప్పుకున్నాడు:
“33.అనుసరించడం  నాయకుణ్ణై నడిపించడం/రెండూ  నాకు కావు.”)

27.పథికుడు

"దారి లేదు,అగాథాలు,చావు యింత  మూగది కాదు!
నీవు కోరుకున్నదే,దారి వదిలి కోరి వచ్చావు.
పరదేశీ! ప్రశాంతంగా ఉండు,స్పష్టతతో.
నీకు భయపడడం తెలుసా, అయితే అయిపోయావు.

28.పందులమధ్య పిల్ల

ఆ పిల్లను చూడు, పందులమధ్య, నిస్సహాయంగా, సుద్దముద్దలా  పాలిపోయిన ముఖం.
ఎప్పుడు చూడు  ఏడుపు.
ఎప్పటికైనా లేచి నడుస్తుందా?
నిరాశ చెందకు! నిట్టూర్పులు ఆపు! త్వరలో నృత్యం చేస్తుంది చూడు, పగలూ రాత్రీ.
కాళ్ళు పనిచేస్తాయని తెలిసింది, యిక తలపై నిలబడి  నిన్ను చూసి నవ్వుతుంది.

29.తారలనంటే అహం

గుండ్రటి పీపా నేను, ఆగకుండా దొర్లకపోతే,
మండే సూర్యుడి వెంటబడే నేను, ఎలా మండకుండా ఉండగలను?

30.అతిసన్నిహితుడు

మరీ దగ్గర వాణ్ణి ప్రేమించను.
దూరంగా పైపైకి జరుగుతాను.
మరి అతడెలా ఔతాడు నా సుదూరతార?

(పొరుగువాణ్ణి ప్రేమించడం , (Love thy neighbor) కష్టం. నిద్రలేస్తే పక్క ఫ్లాట్ వాడితో ఉండే సమస్యలు నక్షత్రాలతో ఉండవు.)

31.ముసుగులో మహాత్ముడు

నీ ఆనందం భరించలేము
దయ్యంలా జడలు ధరించు
దయ్యంలా  మాటాడు  దయ్యంలా వెయ్యి వేషం.
ఎన్ని వేషాలు వేసినా ఏం లాభం?
నీ చూపులో  వేలుపుల  వెలుగు.

( సిద్ధులు కొందరు బాలోన్మత్తపిశాచవేషాలలో తమను తాము దాచుకుంటారు. జనసామాన్యంనుండి కాచుకుంటారు. ఎంత దాచినా దాగని వెలుగు వారి చూపులలో చూస్తూనే ఉంటుంది.)

32.బద్ధుడు

ఆగి చెవి ఒగ్గుతాడు:ఏమి వినబడుతోంది వాడికి?
వాడి చెవుల్లో  ఏమిటా  రొద?
ఎందుకలా పడిపోయాడు? ఏమిటా చచ్చే భయం?
ఒకసారి  వాడు సంకెళ్ళు మోస్తే,  వాడి వెనుక ఎప్పుడూ సంకెళ్ళ  చప్పుడు

33.ఒంటరి

అనుసరించడం  నాయకుణ్ణై నడిపించడం
రెండూ  నాకు కావు.
సేవించడమా? ఓహ్,కాదు.శాసించడమా?అసలే కాదు.
భయపడేవాడే భయపెడతాడు.
భయపెట్టేవాడే నడిపించగలడు.
నేనే వడిగా  నడవలేను.
కొంత సేపు తప్పిపోవాలని ఉంది,
అడవిలో  కడలిలో ప్రాణుల్లా,

34.సెనెకా,ఆయనలాంటివారు

వాళ్ళు రాస్తూ రాస్తూ ఉంటారు వారి దుర్భరమైన మేధామలం
ముందు రాసెయ్, తరువాత చెప్పొచ్చు ఏదో ఒక తాత్త్వికతాత్పర్యం.

( తరువాత ఎవడో ఒకడు ఏదో ఒక అర్థం చెప్పకపోతాడా అని అర్థంలేని రాతలు రాసే రచయితలగురించి.)

35.మంచుముద్దలు

అవును, అప్పుడప్పుడు మంచుముద్దలు చేస్తాను.జీర్ణానికి మంచిది.
నీకు  బాగా అజీర్ణమా ? అయితే, నా మంచుముద్దలు నీకు ముద్దు.

36.కుర్రతనం

నా కుర్రతనపు అ, అః, మళ్ళీ వినిపించాయి.పండిన జ్ఞానం కాదు, దుఃఖమయం.
చిన్ననాటి  హా, ఓహ్, నా చెవుల మారుమోగుతూ.

( “అ నుండి అః” అంటే ఆంగ్లంలో A to z అన్నట్టు.)

37.హెచ్చరిక

కొత్తవాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, క్షేమం కాదు.
తెలివైనవాడివా? మరింత ప్రమాదం.
వలచి వలలో వేసుకుంటారు, వలపులో నిన్ను చీల్చిచెండాడుతారు.
వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ, విజ్ఞానం తక్కువ.

( సముల్లాసజీవనవిధానాన్ని అవలంబించే సంస్కృతులు నీచకు యిష్టం అని చెప్పుకున్నాం.(Provençal, the warm South.) “వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ, విజ్ఞానం తక్కువ.” “విజ్ఞానవంతులను”  ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాడు, అక్కడ మీకు ప్రమాదమని.Apollonian and Dionysian “regions”.)

38.పుణ్యాత్ముడంటాడు

భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని సృష్టించాడు కనుక.
“మనిషి సృష్టించాడు దేవుణ్ణి”, అంటాడు చదువుకున్నవాడు.
తాను కల్పించిన దేవుణ్ణి తను ప్రేమించవద్దా?
తను కల్పించినవాడు కనుక, తాననవచ్చు “దేవుడు లేడని”.
ఈ తర్కంలో ఏదో తిరకాసు.

39.వేసవిలో

చెమటలు పట్టిన శ్రమలో, ఏమీ తినవద్దంటాడు తెలిసిన వైద్యుడు.
మిణుకుతూ కనుగీటు కృత్తిక  ఏమంటోంది ?
మద్యం చుక్కతో సేదదీరమంటోంది.

40.అనసూయ

అతడి చూపులో అసూయ లేదు:  అందుకు నీవతన్ని మెచ్చుకుంటావు.
నీ మెప్పు అతనికి పట్టదు.
అతడిది గద్ద చూపు దూరపు  వస్తువుపై.
నిన్ను చూడడు.నక్షత్రాలపై అతడి దృష్టి.

41.హెరాక్లిటస్ తత్త్వం

సంతోషానికి  పురిటినేల  యుద్ధభూమి.
మందుగుండును మించి  స్నేహానికి  లేదు మందు.
నలుగురిలో ముగ్గురుమిత్రులు, ఆపదలో ఆప్తులు,
పగవాడితో పోరులో  ఒక్కటవుతారు.
మృత్యుముఖంలో ముక్తులు.

42.నాగరికసూత్రం

మునికాళ్ళపై నిలిచి చూడు, మోకాళ్ళపై పాకకు.
తాళరంధ్రంలోంచి గమనించు, తెరచిన తలుపులోంచి కాదు.

43.కీర్తి వెల

నీకు కావలసిందికీర్తి.దాని వెల చెబుతా, విను.
అనుమానం లేదు, మానం వదిలెయ్.

44.వేళ్ళూనినవాడు

పండితుణ్ణంటారా? నా కటువంటి ప్రతిభ లేదు.
నేను కొంచెం బరువు, అంతే.
నేను పడిపోతుంటాను, పడిపోయి పడిపోయి అట్టడుగును అందుకుంటాను.

45.ఎప్పటికీ

“ఈవేళ రావాలనిపించింది, వచ్చాను”. ఇదే అంటాడు ఉండిపోవాలని వచ్చిన ప్రతి ఒక్కడూ.
లోకం ముందొచ్చావననీ, ఆలస్యంచేశావననీ, లక్ష్యం చేయడు.

(అతిమానవుడి అవతరణం చెబుతున్నాడు. అతడు సమాజం ప్రయత్నించి సిద్ధంచేయగల వస్తువు కాదు.అది ప్రాకృతికచర్య.యుగాలుగా పేరుకున్న శక్తి వ్యక్తిరూపంలో విస్ఫోటనమవుతుంది.)

46.అలసుల తీర్పులు

అలసులు సూర్యుని సహించరు, ఎక్కడం కష్టం.
దేవుడు చెట్లనిచ్చాడు వారి నీడకొరకు.

47.పతనం

“వాడు కుంగుతున్నాడు, పడిపోతున్నాడు”,అంటావు  అపహసిస్తూ.
జాగ్రత్తగా చూడు. నీవున్న చోటుకే నడుస్తున్నాడు వాడు.
అమితానందభారంతో దిగుతున్నాడు.అతడి అమితప్రకాశంలో  నీ చీకటి  చెల్లాచెదురు.

(నీచ రచనల్లో తరచు పలకరించే భావం, పతనం అంటే క్షయంకాదు.లోతులకు వెళ్ళడం. జారతూస్ట్ర మొదటి వచనంలో (Aphorism) “అలా మొదలైంది జారతూస్ట్ర అవతరణం” “Thus began Zarathustra's down- going.”) పడిపోవడం అన్ని వేళలా ఒక అర్థంలో. కాదు. సూర్యుడు పడమటిసముద్రంలో “పడిపోతాడు”, అధోలోకాలకు వెలుగునివ్వడానికి.సూర్యుడు ఉదయించినా అస్తమించినా, సముద్రంలో పడిపోయినా లేచినా, మనిషికోసమే.)

48.చట్టానికి ఎదురు

ఇది మొదలు, నేను వేలాడుతుంటాను, కాలం నా కంఠాన్ని చుట్టిన కేశం.
ఇది మొదలు, నక్షత్రాలు సూర్యుడు కొక్కొరకోడి నీడలు ముగిసిపోతాయి.
కాలాన్ని చెప్పేవన్నీ మూకాంధబధిరాలు.
ఉన్నాయి, నాలో  ప్రకృతి  నిశ్చలంగా ఎదురునిలిచింది, నడుస్తున్న గడియారపు ముళ్ళకు , నడిచొస్తున్న  చట్టాలకు

49.జ్ఞాని మాట

జనాలకు నేను తెలియను, కాని పనికొస్తాను వారికి.
దారి చూపిస్తాను, ఎండ కానీ మబ్బు కానీ-
ఎప్పుడూ జనాలకందని ఎత్తులో.

50.మతిపోయింది

ఆమెకు బుర్రుంది- ఆమెకెలా తెలిసింది? ఆమె వల్ల ఒకడికి  మతి చెడింది.
ఈ ప్రమాదానికి ముందు వాడి బుర్ర పనిచేసేది.
ఇపుడు వాడి తల నేరుగా నరకానికెళ్ళింది, కాదు కాదు, ఆమె దగ్గరకెళ్ళింది.

51.సాధుకామనలు

“తాళపుచెవులన్నీ మాయమవాలి, వెంటనే. ప్రతి  తాళరంధ్రంలో  తిరగాలి ఒక కంకాళం.”
ఇది అనాదిగా ముఖ్యులమనుకొనేవారి అభిరుచి.
ఎందుకంటే వారెప్పుడో గతించినవారు.

(Dietrich ('కంకాళం') in German is a skeleton key, or combination key capable of opening any Jock.
 It is also a common given name for males.)

52.పదరచయితలు

నేను చేత్తో మాత్రమే రాయను.
నేనూ ఓ చేయి వేస్తానంటుంది,నా కాలు.
స్థిరంగా స్వేచ్ఛగా నా పాదాలు ధైర్యంగా పరుగెత్తుతాయి
పుటలపై పచ్చికపొలాలపై.

53.మానవసహజం.ఒక పుస్తకం

గతంలోకి చూచినపుడు ఉత్సాహం బలం తగ్గిపోతాయి. భవిష్యత్తులోకి చూచినపుడు నీమీద నీకు నమ్మకం.
 పక్షీ, గృధ్రజాతివా?లేక  జ్ఞానసరస్వతి గుడ్లగూబవా?

( మినర్వా  రోమన్ దేవత (మన చదువులసరస్వతి, గ్రీకుల ఏథిని.గుడ్లగూబకు యీ దేవతతో అనుబంధం.)

54.నా పాఠకుడికి

నేను వంటవాణ్ణి.
నీకు దంతసిరి జీర్ణశక్తి ఉన్నవా?ఒకసారి నా పుస్తకం నీ చేతిలోకి వచ్చిందా, నేను నీకు నచ్చుతాను.

55.వాస్తవచిత్రకారుడు

“ప్రకృతి పట్ల సత్యనిష్ఠ, సమగ్రసత్యం.కళ అంటే అది.”
ఈ పవిత్రభావం పిల్లలకథ.
సృష్టిలో అణువణువూ అనంతం.
వాళ్ళు చిత్రిస్తారు వారికి కలిగిన ఆనందం.
ఏది యిస్తుంది వారికానందం?
వారేది గీయగలిగితే అది.

56.కవి స్వాతిశయం

బంక  ఉంటే యివ్వు ? కట్టెలు నేను తెచ్చుకుంటా, అతికించి మోపుచేస్తా.
వ్యర్థప్రాసలకట్టెలమోపులో అర్థాన్ని దూర్చి, గర్వంగా చూస్తాను.

57.సూక్ష్మ అభిరుచి

నన్నడిగితే స్వర్గంలో ఒక సుఖమైన స్థలం కోరుకుంటా.
ప్రధానద్వారం వెలుపల అయితే మరీ మంచిది.

58.వంకర ముక్కు

ఉబ్బిన ముక్కుపుటాలతో  ధిక్కారపు ముక్కు.
కొమ్ములేని ఖడ్గమృగం నీవు,పొగరుగా ముందుకు దూకుతావు.
దాగని పొగరు, వంకరముక్కుతో   కలిసే ఎదుగుతుంది.

59. కలం గీకుతుంది

నా కలం ఏదో గీకుతూనే ఉంటుంది.నరకం!
ఇలా గీకుతూ ఉండడం నా విధిరాతా?
ధైర్యంగా బుడ్డిలో ముంచి పెద్ద పెద్ద ఏరులు రాసేస్తా.
చూడు! ఎలా నిండుగా  స్వచ్ఛంగా పారుతోందో!
నేను గీచిన ప్రతి గీతా ఎలా సఫలమవుతోందో చూడు!
రచన స్పష్టంగా లేదు, నిజమే-
అయితేనేం? నేను రాసింది ఎవడూ చదవడుగా!

60.ఉన్నతులు

అతడు చాలా పైకి ఎక్కాడు.మెచ్చుకోవలసిందే.
కాని, ఆ యింకొకడున్నాడు, అతడు పైనుంచే వస్తాడు.
నీ మెప్పు అంత పైకి వెళ్ళి అతన్ని అందుకోలేదు.
అతడు తరణికిరణం!

61.నిత్యశంకితుడు

నీ  జీవితం సగం ముగిసింది.
గడియారం ముల్లు కదులూతూనే ఉంది.
చాలా తిరిగావు, ఎంతో వెదికావు.ఏమీ దొరకలేదు-
నీ ఆత్మ వణుకుతోంది ! యిప్పుడీ విచికిత్స.
నీ  జీవితం సగం ముగిసింది.బాధలో తప్పటడుగుల్లో ఎలా కాలం పాకింది!
ఎందుకు వదిలెయ్యలేవు?
సరిగ్గా అదే తెలియాలి నేను. ఇదంతా ఎందుకు?

62.చూడండి యీ మనిషిని

అవును! నాకు తెలుసు నేనెక్కడి వాడినో!
ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ  వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు, నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు.

(జర్మన్ మూలంలో  యీ పద్యానికి శీర్షిక “Ecce homo”  ("behold the man", Classical Latin: [ˈɛkkɛ ˈhɔmoː]) జీసస్ ను శిలువ వేసేముందు, అతని తలపై ముళ్ళకిరీటం ఉంచి, జనాలకు ఆయనను చూపిస్తూ,  పోంటియస్ పైలెట్ అన్న మాటలు. )

63.తారల నీతి

తారాపథంలో తిరగాలని నీకాదేశం. నీకెందుకు చీకటి చింత?
బ్రహ్మానందంలో సాగనీ నీ భ్రమణం,  మా మానవ జీవితాల దుఃఖాలు యిలా సాగనీ.
సుదూరలోకాలకు పంచు నీ ప్రకాశం.
జాలి పనికిరాదు నీకు, పాపాన్ని   ఉచ్చాటన చేసినట్టు చెయ్.
కాని, ఒక తప్పరాని నియమం,  స్వచ్ఛంగా ఉండు.

( స్వచ్ఛత నీచ స్వభావం. “Pure is his eye.” ( Zarathustra: Prologue 1)

                                            ***

Saturday, July 20, 2019

Write poetry?

Write poetry?

Look back

Sweat and red riot
Rage and regret

Or
Turn the past on its head
And look ahead
Fool the future

The moment under your feet groans