Friday, July 26, 2019

నీచ- 7/7

అస్తిత్వవాదసాహిత్యం-4
నీచ-7/7

సముల్లాసశాస్త్రం
( Preludes to The Gay Science or The Joyful Wisdom ( La Gaya Scienza)

[అనువాదకుని ముందుమాట

నీచ పద్యాలలో కంటే అతని వచనంలో ఎక్కువ కవిత్వపటుత్వం కనిపిస్తుందనేది సాధారణ భావం. కాని అతడి పద్యాలు ఉపేక్షించదగినవి కావు. ముక్తకాలలో ఉండవలసిన క్లుప్తత, కొద్ది పదాలలో దట్టించిన అర్థం వాటికి కావ్యగౌరవం కలిగిస్తాయి. రెండు అనువాదాలలో  (జర్మన్, ఇంగ్లీషు )  వడగట్టిన కవిత, ఎక్కువ మిగలకపోవచ్చు. మిగిలిందే దక్కుదల.

నా తెలుగు అనువాదానికి నేను అనుసరించిన రెండు ఆంగ్లానువాదాలు, ఒకటి Adrian Del  Caro చేసింది; రెండవది  Walter Kaufman చేసింది. వారికి నేను ఋణస్థుణ్ణి.

నీచ తన The Gay Science కు ఆ పేరు పెట్టడంలో ఏం చెప్పదలచుకున్నాడు? ముందు Gay అన్న పదం, Science అన్న పదం విరుద్ధార్థలను చెప్పేవి కదా అన్న ఆభాస కలుగుతుంది. నీచకు జర్మనుల తాత్త్వికగాగాంభీర్యం యిష్టం లేదు. అతడికి  ప్రొవెన్సల్ (Provençal, ఫ్రాన్స్ లోని దక్షిణభాగం) సంస్కృతి యిష్టం.  ఈ సంస్కృతిని  కీట్స్ కూడా స్మరించాడు తన ప్రసిద్ధకవితలో.

O, for a draught of vintage! that hath been
         Cool'd a long age in the deep-delved earth,
Tasting of Flora and the country green,
         Dance, and Provençal song, and sunburnt mirth!
O for a beaker full of the warm South,
         Full of the true, the blushful Hippocrene,...( Keats: Ode to a Nightingale)

విజ్ఞానశాస్త్రం (Science) లో జ్ఞానానికి ( Apollonian) తప్ప ఆనందానికి ((Dionysian) ఆస్కారం లేదన్నది సాధారణభావం.ఆ రెంటినీ కలపడమే నీచ జీవనదర్శనం.]

                                                    ***

సముల్లాసశాస్త్రం
( Preludes to The Gay Science or The Joyful Wisdom ( La Gaya Scienza) Nietzsche)

1.ఆహ్వానం

వాడి చూడండి,మీ ముందుంచుతున్న సరుకు~
నా వాగ్దానం, యిది మీకు నచ్చుతుంది
ఈ వేళ కాకుంటే రేపు, యీ రోజుకంటే రేపు.
అప్పుడు మీరు  మరికొంత కోరితే,
ఈ విజయం నాకిచ్చే  ధైర్యంతో  సరికొత్త సరుకు అరువు తెచ్చి మీముందుకొస్తాను.

2.నా అదృష్టం.

వెదకి విసిగిపోయాను.
కాదని, కనుగొనడం నేర్చుకున్నాను.
ఒక గట్టి గాలి కొట్టి వెనక్కు విసిరేసింది,
ఇక యిప్పుడు గాలి ఎటు విసిరితే అటు.

( గాలిలో అవశమై  ఎగిరే ఎండుటాకును చెబుతున్నాడా? కాదు. సిద్ధాంతాల కట్టుబడినుండి విడివడి స్వేచ్ఛ పొందడం మొదటి మెట్టు.ఇక్కడ రెండు పదాలు కీలకం: “వెదకి”, “కనుగొను” . మొదటిది వెదకడం, “వాడేం చెప్పాడు,వీడేం చెప్పాడు”,అని. దానిలో విసుగు తప్ప వెలుగు కలగదు. వెదకడం ఆపితే, తనకే తెలుస్తుంది.ఇది అస్తిత్వవాదంలో మూలతత్త్వం. ఎవడు కనుగొన్న సత్యం వాడికి మాత్రమే సత్యం, మరొకడికి పనికిరాదు.( “I must find a truth that is true for me.” (Kierkegaard: Journal entry, Gilleleie : 1 August 1835) ఇది వైయక్తికత కాదు, ఆత్మత. (అస్తిత్వవాదం వ్యక్తి ఆత్మను (Individual Self) ఆవిష్కరిస్తుంది. కాని ప్రాథమ్యం,వ్యక్తిపై (Individual) కాదు, ఆత్మపై (Self).

తరువాత, “యిప్పుడు, గాలి ఎటు విసిరితే అటు”, ఏ సిద్ధాంతానికీ  విముఖత లేకుండా అన్నిటితో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళడం, చివరకు  తన సిద్ధాంతాలైనా చివరివరకూ అంటిపెట్టుకోరాదు. నీచ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకొంటూ వెళ్ళాడు.నావి కదా అని గుండెలకు హత్తుకోలేదు.అది స్వేచ్ఛాస్వరూపం, ప్రయోజనం.)

3.ధృతి

నీవున్నచోట లోతుగా తవ్వి చూడు! నీ కింద ఉన్నది నుయ్యి!
మూఢులను  ఏడవనీ: “కింద ఉండేది గొయ్యి”.అని .

(ఈ పద్యంలో నీచ ప్రసిద్ధభావాలు రెండు వ్యక్తమయ్యాయి. నీచ ద్వంద్వాలను (binaries) ఒప్పుకోడు. మంచి చెడు, పుణ్యం పాపం, స్వర్గం నరకం అనేవి విరుద్ధాలు కావు. తారతమ్యాలు అంటాడు నీచ.

కింద, పైన అనేవి కూడా అటువంటి ద్వంద్వమే. ‘పైన’ నుయ్యి, ‘కింద’ గొయ్యి.  అనే సాధారణభావాన్ని కాదంటున్నాడు.

“న చోర్ధ్వం న చాధః”(దశశ్లోకీ”).గీతగీచుకుంటే ఆద్యంతాలు, అధోర్ధ్వాలు. గీత తుడిచేస్తే లేవు ద్వంద్వాలు.

లోపలికి దిగడమంటే గొయ్యిలో పడిపోవడం కాదు, ఊట బావిలోని జీవజలాలను చేరడం.

“జారతూస్ట్ర” ప్రారంభభాగంలో కూడా యీ “కిందికి దిగిపోవడం” గురించి చెబుతాడు:

“అతడు (జారతూస్ట్ర ఊరు విడిచి ఊరి సరసును విడిచి కొండల్లోకి నడిచి) సూర్యుడికి ఎదురుగా నిలిచి యిలా అన్నాడు: ... “నేను అపరాంబుధిలోకి అస్తమిస్తాను, సాయంకాలం నీవు సముద్రం వెనుక దిగిపోయి అధోలోకాలకు వెలుగునిచ్చినట్టు, ఓ ఉత్సాహభరితనక్షత్రమా!కనుక నీలాగా నేనూ దిగిపోతాను.అంటుంటారే, ఎవరికోసం అవతరిస్తారో వారి ముందు...అలా జరిగింది జారాతూస్ట్ర దిగిపోవడం.” (జార.1.1.)

మనిషిని ఉద్ధరించవలె అనుకుంటే, దేవుడు మనిషిగా “దిగి” వస్తాడు.) నీవు దేవుడికంటే గొప్పవాడివి కావు కదా!

4.సంభాషణ

నాకు జబ్బు చేసిందా? కోలుకున్నానా?
నా వైద్యుడెవరో కనుక్కొన్నారా?
ఎలా మరచిపోయాను అంతా?

ఇప్పుడు నీవు కోలుకున్నావు:
మరచినవాడు స్వస్థుడు.

(మన సంభాషణలలో తరచు విషయం మన ప్రియమైన అస్వస్థత. ఎంత చెప్పినా తనివితీరదు. అస్వస్థత మన ఘనత  కాదు, పదిలపరచుకొని పదేపదే నలుగురితో పలవరించడానికి.)

5.సత్పురుషుడు

మన సుగుణాలు హుషారుగా అడుగులు వేయాలి యిటు అటు:
హోమర్ చరణాల లయలా, వస్తూ పోతూ.

(“ సత్పురుషుడు హుషారుగా ఉండరాదు, ఎప్పుడూ గంభీరముద్రతో ఉండవలెను”, అనే అభిప్రాయాన్ని కాదంటున్నాడు. సత్పురుషుడు వేసిన ప్రతి అడుగులో ఆనందం ప్రకటం కావాలి, హోమర్ కవితలోలాగా.)

6.లౌక్యం

పల్లపుప్రాంతాలలో యిల్లు కట్టుకోకు!
ఆకాశంలో మేడలు కట్టకు!
మధ్య భూమిలో నిలబడి చూడు
లోకం ఆలోకనీయం!

( పైకి కిందికీ, అంటే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు, చూడకు.ఈ భూమిమీద ఉన్నావు. దీనిపై చూపు నిలుపు.)

7.కరపుస్తకం

( మూలంలో  శీర్షిక “vade mecum”,అంటే “నాతో రా” అని అర్థం. Handbook, guide )

నా దారి,  నా మాట నచ్చాయి నీకు. నన్ననుసరిస్తావా?
నీ దారిని నమ్మి నడువు : నా దారికొస్తావు.

( సత్యం ఏకమే అయినా, ఎవడి సాధన శోధన వాడిదే.( “I want to find out the truth that is true only for me.” Kierkegaard) గమ్యం ఒకటే అయినా, ఎవడి దారి వాడు చేసుకోవలసిందే.ఒకడు చేసిన దారి మరొకడికి పనికిరాదు.కాని,  ‘ఎవడి దారి వాడిది’, అన్న అనైక్యం  కాదు దీని అర్థం.
ఇది నీచ విషయంకూడా.అతడు చెప్పింది చెప్పినట్టు వేదవాక్యమని స్వీకరించనవసరం లేదు.)

8.మూడవ కుబుసం

నా చర్మం పగులుతోంది
నాలోపల పాము కోరికతో రగులుతోంది,
తిన్న మట్టి  ఆకలి రేపింది.
మరింత  మట్టికై  దాహం.
పొదలకు ప్రవాహానికి మధ్య పాకిపోతుంటాను.
దహించే ఆకలి, అయినా ఉత్సాహంతో
తిన్నదే తింటూ: ఓ! మట్టీ! పాముకు పుష్టి!

( మన్నుతిన్న పామును  స్తబ్ధతకు చెబుతారు. కాని,నీచ ఆ మట్టి చాలు అంటున్నాడు. మట్టి యిక్కడ అంటే పృథివీతత్త్వం చెబుతున్నాడనుకోవలె.
 మట్టి నాకు పుష్టి అంటాడు. ఈ ప్రపంచం తినుచున్న ‘మట్టినే’  తినుచూ హాయిగా బతకొచ్చు, “ఎందుకు సణుగుతావు?”, అంటాడు నీచ. ఏ విషయంలోనూ లోకం గురించి సణగవద్దు గొణగవద్దు అనేది నీచ జీవితదృక్పథం.ఉన్నదానితో సరిపెట్టుకో అని అనడం లేదు. ఉన్నదానితో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించు అంటాడు.)

9. నా గులాబీలు

అవును! మీ వినోదం కొరకు నా ఆనందం.
ఏ ఆనందానికైనా  అదే ధ్యేయం.
 నా గులాబీని, ఆనందాన్ని తుంచేస్తావా?

ఇరుకు దారుల్లో వంగి వెదకాలి,
ముళ్ళ కంచెల్లో  తొంగి చూడాలి,
మెడలు సాచాలి.

పిచ్చెక్కించడం నా ఆనందం.
పైశునం నా గుణం.
నా గులాబీని, ఆనందాన్ని తుంచేస్తావా?

10.తిరస్కారం

చాలానే ఒలికిస్తాను నేను.
తిరస్కారమనుకుంటారు మీరు.
మీ పానపాత్ర నిండినపుడు
చాలానే ఒలుకుతుంది.
మద్యాన్ని నిందించరు.

11.నా నుడి.

సునిశితము సున్నితము, మందము తీక్ష్ణము, అపరిచితము సుపరిచితము.
పండితుడు పామరుడు కలుసుకునే చోటు.
ఇదీ నేను. మొదటినుండి నేనిలా-
నాలోపల పాము, పావురము, సూకరము సహజీవనం.

( ద్వంద్వాలను అంగీకరించడు  నీచ.పండితుడు పామరుడు విరుద్ధాలు కారు.వారు ఒకే తాటికి రెండు కొనలు.)

12.వెలుగు చెలికాడు

నీ కళ్ళు, మనసు భద్రం.
నీడలో నడుస్తూ సూర్యుణ్ణి అనుసరించు

( సూర్యుణ్ణి అనుసరించడమంటే విజ్ఞానం (Apollo)  అవసరమే. కాని సూర్యుణ్ణి నేలమీదకు దించితే బతుకు మాడిపోతుంది. ఆ వెలుగులో యీ బతుకు బతుకు.ఈ లోకం, యీ నేల నీవి. “కళ్ళు, మనసు”,భౌతికం, బౌద్ధికం.)

13.నర్తకులకు

జారుడు  మంచు
స్వర్గం,
నేర్చిననర్తకులకు.

భద్రత  అవసరంలేనివాడే నిజంగా భద్రుడు.

ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా  తేవాలంటే, “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు (“జారుడు మంచు కైలాసం”). మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు ! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది,ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర  ఆహార అభద్రతకు ప్రతీక.(food security కాదు, insecurity లో సంతృప్తి ఉంది అంటాడు నీచ.) జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం,  జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో  ఆనందం ఉంది.రవీంద్రభారతిరంగస్థలంపై  దొరకని ఆనందం.

అభద్రతలోని ఆనందాన్ని కోరుకో.ప్రమాదాలను ఎదిరించే సాహసజీవితం కోరుకో.
జీవితంలో భద్రతను కోరకు,అంటాడు నీచ. భద్రత కావాలంటే స్వేచ్ఛను పణంగా పెట్టాలి.
ఈ నాటి రాజకీయంలో జరుగుతున్నది అదే, భద్రతకోసం జనం స్వేచ్ఛను పణంగా పెడుతున్నారు.

“దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు, కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇంతకాలానికి, మా నావలు బయలుదేరగలుగుతున్నాయి,ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాయి.ఇప్పుడు జ్ఞానాన్వేషణాప్రియులు చేయరాని సాహసం లేదు. సముద్రం, మన సముద్రం, మళ్ళీ  పిలుస్తోంది,ఏదీ దాచుకోకుండా. ఇంత స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం బహుశా మునుపెన్నడూ ఉండి ఉండదు.( స.శా.5.343)

సముద్రం స్వచ్ఛంగా ఉంది.ప్రయాణానికి స్వేచ్ఛ ఉంది మనిషికి. కాని మునుపటి ప్రమాదాలు అలాగే ఉన్నాయి.లేకపోతే అది సముద్రప్రయాణం ఎట్లా అవుతుంది? అందులో సాహసమేముంది? సముల్లాసమేముంది?

జీవితం మంచుకొండ, మహాసముద్రం. ఎదురించి జీవించడమే జీవితం.అదే సముల్లాసం.)

14. మంచి మనిషి

బాహాటపు పోరాటం మేలు
అతుకుల స్నేహం కన్నా.

15.తుప్పు

కొంచెం తుప్పు తగిలించు.మరీ పదునైతే పనిచేయదు.”ఇంకా కుర్రతనం, బిర్రు తగ్గలే”దంటారు.

16.పైకి

“ఈ కొండ ఎక్కడమెలా?”
 “ఎక్కు , ఆలోచించకు.ఏమో! ఎక్కినా ఎక్కగలవు.”

17. పశుసూత్రం

ఎన్నడూ అడుక్కోకు- అది నా కసహ్యం.తీసేసుకో, దయచేసి.
అందరి మనసులు నేనెరుగుదును;
నేనెవరో , నాకు తెలియదు.

18. సంకుచితులు

సంకుచితులను భరించలేను,
చెడు లేదు మంచి లేదు యించుమించు.

19.

అసంకల్పిత కాముకుడు
వఠ్ఠిమాటొకటి విసిరాడు శూన్యంలోకి,
ఒక స్త్రీ రాలి పడింది.

( నీచకు స్తీలపట్ల గొప్ప సద్భావం లేదనేది తెలిసిందే. అతడి మీసాలు చూసి అమ్మాయిలు పారిపోయి ఉంటారు.)

20.ఆలోచించు

జంట బాధ మేలు ఒంటి బాధ కన్నా.
అంగీకరించగలవా నా ఆహ్వానం?

21.అహంకారం

అహాన్ని మరీ ఊదకు.
అది సూది మొన తాకుకే  శూన్యం.

22.పురుషుడు,స్త్రీ

నచ్చిందా ఆడది,దోచెయ్, అంటాడు మగాడు.
ఆడది దోచదు,దొంగిలిస్తుంది.

23.విశ్లేషణ

నా రచనలు నేను చదివితే
నన్ను నేను చదువుతా.
మరొకడు చదివితే,
వాడు నన్ను  మోస్తూ నడుస్తాడు
భళ్ళున తెల్లారేవరకు.

24.నిరాశావాదులకు మందు

నీకేదీ రుచించడం లేదా, మిత్రమా? నీ కడుపునొప్పితో విసుగొస్తోంది నాకు.
నీ తిట్లకు దుర్భాషలకు థూత్కారాలకు అంతులేదు.
నా ఓపిక నశిస్తోంది.నా గుండెలు పగులుతున్నాయి.నాదొక మందుంది, నే చెప్పింది చెయ్.
కలుగుతుంది తప్పక సత్ఫలితం.
ఒక కప్పను మింగు, నీ అజీర్తి మాయం.

(నీచ వచనాలను జీర్ణంచేసుకోవడం కష్టమే. సిద్ధమైతేనే చదవాలి.)

25.నాకు పరుడి తలపు తెలుసు,నేనెవరో నేనెరుగ.
నేను చూచింది  చూస్తున్నది నేను కాదు.
నాకు నేను దూరంగా వెళ్ళగలిగితే, నాకు మేలు.
కాని , మరీ దూరం కాదు, నా శత్రువులంత.నాకు అతి దగ్గరి మిత్రుడు చాలా దూరం.ఉహూ,
మధ్యేమార్గం మేలు! నేననేది అర్థమవుతుందా నీకు?

26. నా  కాఠిన్యం

వంద మెట్లు ఎక్కాలి నేను.
పైకెళ్ళాలి  ,కాని మీ మూలుగు  వింటున్నా:
"క్రూరుడవు!  మేమేమీ  బండలమా? "
వంద మెట్లు ఎక్కాలి  నేను:
మెట్టునౌతానని ఎవడంటాడు?ఒక్కడూ  అనడు.

(అలెక్సాండరు, నెపోలియను, హిట్లరు ఎంతమంది మీద నడిచి వెళ్ళాలి! మెట్లు మూలుగుతాయి. అంతకంటే ఏం చేయగలవు? మెట్ల అనుమతి తీసుకుని ఎవడూ హిట్లర్ కాడు.కాగలిగితే ఏ మెట్టూ మెట్టుగా ఉండి పోదు. మనిషిలో ఒక హిట్లర్ దాగి ఉంటాడు. చేతకానివాడు వాడికి జోలపాడుతూ ఉంటాడు. నీచ ప్రకృతిని చెబుతున్నాడు. ఇదీ ప్రకృతి. హిట్లర్ అయిపో, అనడంలేదు.ఇతరేతరశక్తులవల్ల యీ అతిమానవులు ఆవిర్భవిస్తారు. అతిమానవులు హిట్లర్లే కానవసరం లేదు. ఏ రంగంలోనైనా “సగటుమనిషి”ని అతిశయించినవాడు, ఒక వాల్మీకి  ఒక హోమర్ ఒక మైకెలేంజిలో , అతిమానవుడే.
తరువాత ఒక పద్యంలో నీచ తన గురించి చెప్పుకున్నాడు:
“33.అనుసరించడం  నాయకుణ్ణై నడిపించడం/రెండూ  నాకు కావు.”)

27.పథికుడు

"దారి లేదు,అగాథాలు,చావు యింత  మూగది కాదు!
నీవు కోరుకున్నదే,దారి వదిలి కోరి వచ్చావు.
పరదేశీ! ప్రశాంతంగా ఉండు,స్పష్టతతో.
నీకు భయపడడం తెలుసా, అయితే అయిపోయావు.

28.పందులమధ్య పిల్ల

ఆ పిల్లను చూడు, పందులమధ్య, నిస్సహాయంగా, సుద్దముద్దలా  పాలిపోయిన ముఖం.
ఎప్పుడు చూడు  ఏడుపు.
ఎప్పటికైనా లేచి నడుస్తుందా?
నిరాశ చెందకు! నిట్టూర్పులు ఆపు! త్వరలో నృత్యం చేస్తుంది చూడు, పగలూ రాత్రీ.
కాళ్ళు పనిచేస్తాయని తెలిసింది, యిక తలపై నిలబడి  నిన్ను చూసి నవ్వుతుంది.

29.తారలనంటే అహం

గుండ్రటి పీపా నేను, ఆగకుండా దొర్లకపోతే,
మండే సూర్యుడి వెంటబడే నేను, ఎలా మండకుండా ఉండగలను?

30.అతిసన్నిహితుడు

మరీ దగ్గర వాణ్ణి ప్రేమించను.
దూరంగా పైపైకి జరుగుతాను.
మరి అతడెలా ఔతాడు నా సుదూరతార?

(పొరుగువాణ్ణి ప్రేమించడం , (Love thy neighbor) కష్టం. నిద్రలేస్తే పక్క ఫ్లాట్ వాడితో ఉండే సమస్యలు నక్షత్రాలతో ఉండవు.)

31.ముసుగులో మహాత్ముడు

నీ ఆనందం భరించలేము
దయ్యంలా జడలు ధరించు
దయ్యంలా  మాటాడు  దయ్యంలా వెయ్యి వేషం.
ఎన్ని వేషాలు వేసినా ఏం లాభం?
నీ చూపులో  వేలుపుల  వెలుగు.

( సిద్ధులు కొందరు బాలోన్మత్తపిశాచవేషాలలో తమను తాము దాచుకుంటారు. జనసామాన్యంనుండి కాచుకుంటారు. ఎంత దాచినా దాగని వెలుగు వారి చూపులలో చూస్తూనే ఉంటుంది.)

32.బద్ధుడు

ఆగి చెవి ఒగ్గుతాడు:ఏమి వినబడుతోంది వాడికి?
వాడి చెవుల్లో  ఏమిటా  రొద?
ఎందుకలా పడిపోయాడు? ఏమిటా చచ్చే భయం?
ఒకసారి  వాడు సంకెళ్ళు మోస్తే,  వాడి వెనుక ఎప్పుడూ సంకెళ్ళ  చప్పుడు

33.ఒంటరి

అనుసరించడం  నాయకుణ్ణై నడిపించడం
రెండూ  నాకు కావు.
సేవించడమా? ఓహ్,కాదు.శాసించడమా?అసలే కాదు.
భయపడేవాడే భయపెడతాడు.
భయపెట్టేవాడే నడిపించగలడు.
నేనే వడిగా  నడవలేను.
కొంత సేపు తప్పిపోవాలని ఉంది,
అడవిలో  కడలిలో ప్రాణుల్లా,

34.సెనెకా,ఆయనలాంటివారు

వాళ్ళు రాస్తూ రాస్తూ ఉంటారు వారి దుర్భరమైన మేధామలం
ముందు రాసెయ్, తరువాత చెప్పొచ్చు ఏదో ఒక తాత్త్వికతాత్పర్యం.

( తరువాత ఎవడో ఒకడు ఏదో ఒక అర్థం చెప్పకపోతాడా అని అర్థంలేని రాతలు రాసే రచయితలగురించి.)

35.మంచుముద్దలు

అవును, అప్పుడప్పుడు మంచుముద్దలు చేస్తాను.జీర్ణానికి మంచిది.
నీకు  బాగా అజీర్ణమా ? అయితే, నా మంచుముద్దలు నీకు ముద్దు.

36.కుర్రతనం

నా కుర్రతనపు అ, అః, మళ్ళీ వినిపించాయి.పండిన జ్ఞానం కాదు, దుఃఖమయం.
చిన్ననాటి  హా, ఓహ్, నా చెవుల మారుమోగుతూ.

( “అ నుండి అః” అంటే ఆంగ్లంలో A to z అన్నట్టు.)

37.హెచ్చరిక

కొత్తవాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, క్షేమం కాదు.
తెలివైనవాడివా? మరింత ప్రమాదం.
వలచి వలలో వేసుకుంటారు, వలపులో నిన్ను చీల్చిచెండాడుతారు.
వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ, విజ్ఞానం తక్కువ.

( సముల్లాసజీవనవిధానాన్ని అవలంబించే సంస్కృతులు నీచకు యిష్టం అని చెప్పుకున్నాం.(Provençal, the warm South.) “వాళ్ళకు ఉత్సాహం ఎక్కువ, విజ్ఞానం తక్కువ.” “విజ్ఞానవంతులను”  ఆ ప్రాంతాలకు వెళ్ళవద్దని హెచ్చరిస్తున్నాడు, అక్కడ మీకు ప్రమాదమని.Apollonian and Dionysian “regions”.)

38.పుణ్యాత్ముడంటాడు

భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని సృష్టించాడు కనుక.
“మనిషి సృష్టించాడు దేవుణ్ణి”, అంటాడు చదువుకున్నవాడు.
తాను కల్పించిన దేవుణ్ణి తను ప్రేమించవద్దా?
తను కల్పించినవాడు కనుక, తాననవచ్చు “దేవుడు లేడని”.
ఈ తర్కంలో ఏదో తిరకాసు.

39.వేసవిలో

చెమటలు పట్టిన శ్రమలో, ఏమీ తినవద్దంటాడు తెలిసిన వైద్యుడు.
మిణుకుతూ కనుగీటు కృత్తిక  ఏమంటోంది ?
మద్యం చుక్కతో సేదదీరమంటోంది.

40.అనసూయ

అతడి చూపులో అసూయ లేదు:  అందుకు నీవతన్ని మెచ్చుకుంటావు.
నీ మెప్పు అతనికి పట్టదు.
అతడిది గద్ద చూపు దూరపు  వస్తువుపై.
నిన్ను చూడడు.నక్షత్రాలపై అతడి దృష్టి.

41.హెరాక్లిటస్ తత్త్వం

సంతోషానికి  పురిటినేల  యుద్ధభూమి.
మందుగుండును మించి  స్నేహానికి  లేదు మందు.
నలుగురిలో ముగ్గురుమిత్రులు, ఆపదలో ఆప్తులు,
పగవాడితో పోరులో  ఒక్కటవుతారు.
మృత్యుముఖంలో ముక్తులు.

42.నాగరికసూత్రం

మునికాళ్ళపై నిలిచి చూడు, మోకాళ్ళపై పాకకు.
తాళరంధ్రంలోంచి గమనించు, తెరచిన తలుపులోంచి కాదు.

43.కీర్తి వెల

నీకు కావలసిందికీర్తి.దాని వెల చెబుతా, విను.
అనుమానం లేదు, మానం వదిలెయ్.

44.వేళ్ళూనినవాడు

పండితుణ్ణంటారా? నా కటువంటి ప్రతిభ లేదు.
నేను కొంచెం బరువు, అంతే.
నేను పడిపోతుంటాను, పడిపోయి పడిపోయి అట్టడుగును అందుకుంటాను.

45.ఎప్పటికీ

“ఈవేళ రావాలనిపించింది, వచ్చాను”. ఇదే అంటాడు ఉండిపోవాలని వచ్చిన ప్రతి ఒక్కడూ.
లోకం ముందొచ్చావననీ, ఆలస్యంచేశావననీ, లక్ష్యం చేయడు.

(అతిమానవుడి అవతరణం చెబుతున్నాడు. అతడు సమాజం ప్రయత్నించి సిద్ధంచేయగల వస్తువు కాదు.అది ప్రాకృతికచర్య.యుగాలుగా పేరుకున్న శక్తి వ్యక్తిరూపంలో విస్ఫోటనమవుతుంది.)

46.అలసుల తీర్పులు

అలసులు సూర్యుని సహించరు, ఎక్కడం కష్టం.
దేవుడు చెట్లనిచ్చాడు వారి నీడకొరకు.

47.పతనం

“వాడు కుంగుతున్నాడు, పడిపోతున్నాడు”,అంటావు  అపహసిస్తూ.
జాగ్రత్తగా చూడు. నీవున్న చోటుకే నడుస్తున్నాడు వాడు.
అమితానందభారంతో దిగుతున్నాడు.అతడి అమితప్రకాశంలో  నీ చీకటి  చెల్లాచెదురు.

(నీచ రచనల్లో తరచు పలకరించే భావం, పతనం అంటే క్షయంకాదు.లోతులకు వెళ్ళడం. జారతూస్ట్ర మొదటి వచనంలో (Aphorism) “అలా మొదలైంది జారతూస్ట్ర అవతరణం” “Thus began Zarathustra's down- going.”) పడిపోవడం అన్ని వేళలా ఒక అర్థంలో. కాదు. సూర్యుడు పడమటిసముద్రంలో “పడిపోతాడు”, అధోలోకాలకు వెలుగునివ్వడానికి.సూర్యుడు ఉదయించినా అస్తమించినా, సముద్రంలో పడిపోయినా లేచినా, మనిషికోసమే.)

48.చట్టానికి ఎదురు

ఇది మొదలు, నేను వేలాడుతుంటాను, కాలం నా కంఠాన్ని చుట్టిన కేశం.
ఇది మొదలు, నక్షత్రాలు సూర్యుడు కొక్కొరకోడి నీడలు ముగిసిపోతాయి.
కాలాన్ని చెప్పేవన్నీ మూకాంధబధిరాలు.
ఉన్నాయి, నాలో  ప్రకృతి  నిశ్చలంగా ఎదురునిలిచింది, నడుస్తున్న గడియారపు ముళ్ళకు , నడిచొస్తున్న  చట్టాలకు

49.జ్ఞాని మాట

జనాలకు నేను తెలియను, కాని పనికొస్తాను వారికి.
దారి చూపిస్తాను, ఎండ కానీ మబ్బు కానీ-
ఎప్పుడూ జనాలకందని ఎత్తులో.

50.మతిపోయింది

ఆమెకు బుర్రుంది- ఆమెకెలా తెలిసింది? ఆమె వల్ల ఒకడికి  మతి చెడింది.
ఈ ప్రమాదానికి ముందు వాడి బుర్ర పనిచేసేది.
ఇపుడు వాడి తల నేరుగా నరకానికెళ్ళింది, కాదు కాదు, ఆమె దగ్గరకెళ్ళింది.

51.సాధుకామనలు

“తాళపుచెవులన్నీ మాయమవాలి, వెంటనే. ప్రతి  తాళరంధ్రంలో  తిరగాలి ఒక కంకాళం.”
ఇది అనాదిగా ముఖ్యులమనుకొనేవారి అభిరుచి.
ఎందుకంటే వారెప్పుడో గతించినవారు.

(Dietrich ('కంకాళం') in German is a skeleton key, or combination key capable of opening any Jock.
 It is also a common given name for males.)

52.పదరచయితలు

నేను చేత్తో మాత్రమే రాయను.
నేనూ ఓ చేయి వేస్తానంటుంది,నా కాలు.
స్థిరంగా స్వేచ్ఛగా నా పాదాలు ధైర్యంగా పరుగెత్తుతాయి
పుటలపై పచ్చికపొలాలపై.

53.మానవసహజం.ఒక పుస్తకం

గతంలోకి చూచినపుడు ఉత్సాహం బలం తగ్గిపోతాయి. భవిష్యత్తులోకి చూచినపుడు నీమీద నీకు నమ్మకం.
 పక్షీ, గృధ్రజాతివా?లేక  జ్ఞానసరస్వతి గుడ్లగూబవా?

( మినర్వా  రోమన్ దేవత (మన చదువులసరస్వతి, గ్రీకుల ఏథిని.గుడ్లగూబకు యీ దేవతతో అనుబంధం.)

54.నా పాఠకుడికి

నేను వంటవాణ్ణి.
నీకు దంతసిరి జీర్ణశక్తి ఉన్నవా?ఒకసారి నా పుస్తకం నీ చేతిలోకి వచ్చిందా, నేను నీకు నచ్చుతాను.

55.వాస్తవచిత్రకారుడు

“ప్రకృతి పట్ల సత్యనిష్ఠ, సమగ్రసత్యం.కళ అంటే అది.”
ఈ పవిత్రభావం పిల్లలకథ.
సృష్టిలో అణువణువూ అనంతం.
వాళ్ళు చిత్రిస్తారు వారికి కలిగిన ఆనందం.
ఏది యిస్తుంది వారికానందం?
వారేది గీయగలిగితే అది.

56.కవి స్వాతిశయం

బంక  ఉంటే యివ్వు ? కట్టెలు నేను తెచ్చుకుంటా, అతికించి మోపుచేస్తా.
వ్యర్థప్రాసలకట్టెలమోపులో అర్థాన్ని దూర్చి, గర్వంగా చూస్తాను.

57.సూక్ష్మ అభిరుచి

నన్నడిగితే స్వర్గంలో ఒక సుఖమైన స్థలం కోరుకుంటా.
ప్రధానద్వారం వెలుపల అయితే మరీ మంచిది.

58.వంకర ముక్కు

ఉబ్బిన ముక్కుపుటాలతో  ధిక్కారపు ముక్కు.
కొమ్ములేని ఖడ్గమృగం నీవు,పొగరుగా ముందుకు దూకుతావు.
దాగని పొగరు, వంకరముక్కుతో   కలిసే ఎదుగుతుంది.

59. కలం గీకుతుంది

నా కలం ఏదో గీకుతూనే ఉంటుంది.నరకం!
ఇలా గీకుతూ ఉండడం నా విధిరాతా?
ధైర్యంగా బుడ్డిలో ముంచి పెద్ద పెద్ద ఏరులు రాసేస్తా.
చూడు! ఎలా నిండుగా  స్వచ్ఛంగా పారుతోందో!
నేను గీచిన ప్రతి గీతా ఎలా సఫలమవుతోందో చూడు!
రచన స్పష్టంగా లేదు, నిజమే-
అయితేనేం? నేను రాసింది ఎవడూ చదవడుగా!

60.ఉన్నతులు

అతడు చాలా పైకి ఎక్కాడు.మెచ్చుకోవలసిందే.
కాని, ఆ యింకొకడున్నాడు, అతడు పైనుంచే వస్తాడు.
నీ మెప్పు అంత పైకి వెళ్ళి అతన్ని అందుకోలేదు.
అతడు తరణికిరణం!

61.నిత్యశంకితుడు

నీ  జీవితం సగం ముగిసింది.
గడియారం ముల్లు కదులూతూనే ఉంది.
చాలా తిరిగావు, ఎంతో వెదికావు.ఏమీ దొరకలేదు-
నీ ఆత్మ వణుకుతోంది ! యిప్పుడీ విచికిత్స.
నీ  జీవితం సగం ముగిసింది.బాధలో తప్పటడుగుల్లో ఎలా కాలం పాకింది!
ఎందుకు వదిలెయ్యలేవు?
సరిగ్గా అదే తెలియాలి నేను. ఇదంతా ఎందుకు?

62.చూడండి యీ మనిషిని

అవును! నాకు తెలుసు నేనెక్కడి వాడినో!
ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ  వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు, నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు.

(జర్మన్ మూలంలో  యీ పద్యానికి శీర్షిక “Ecce homo”  ("behold the man", Classical Latin: [ˈɛkkɛ ˈhɔmoː]) జీసస్ ను శిలువ వేసేముందు, అతని తలపై ముళ్ళకిరీటం ఉంచి, జనాలకు ఆయనను చూపిస్తూ,  పోంటియస్ పైలెట్ అన్న మాటలు. )

63.తారల నీతి

తారాపథంలో తిరగాలని నీకాదేశం. నీకెందుకు చీకటి చింత?
బ్రహ్మానందంలో సాగనీ నీ భ్రమణం,  మా మానవ జీవితాల దుఃఖాలు యిలా సాగనీ.
సుదూరలోకాలకు పంచు నీ ప్రకాశం.
జాలి పనికిరాదు నీకు, పాపాన్ని   ఉచ్చాటన చేసినట్టు చెయ్.
కాని, ఒక తప్పరాని నియమం,  స్వచ్ఛంగా ఉండు.

( స్వచ్ఛత నీచ స్వభావం. “Pure is his eye.” ( Zarathustra: Prologue 1)

                                            ***

No comments:

Post a Comment