Friday, July 5, 2019

నీచ-4/7 ఉత్సాహవంతుడు


                             అస్తిత్వవాదసాహిత్యం-4:నీచ-4/7:
                          ఉత్సాహవంతుడు (Dionysian Man)



O, for a draught of vintage! that hath been
        Cool'd a long age in the deep-delved earth,
Tasting of Flora and the country green,
        Dance, and Provençal song, and sunburnt mirth!
O for a beaker full of the warm South,
        Full of the true, the blushful Hippocrene,...( Keats: Ode to a Nightingale)

   కీట్స్ కోరిన దక్షిణయూరప్ “వెచ్చని”  సంస్కృతి (“ warm South”,Provençal song, and sunburnt mirth!) నీచకు కూడా చాలా యిష్టం.చాలామంది కవులకు, వాన్ గో (Van Gogh) వంటి చిత్రకారులకు యిష్టమైన ప్రాంతం ఫ్రాన్సులోని యీ దక్షిణప్రాంతం. Provençe ఫ్రాన్సులో దే అయినా, Provençal అన్న పదం మరింత విస్తృతమైన (-ఫ్రాన్సు , స్పెయిన్, ఇటలీ- అన్న) అర్థంలో వాడుకలో ఉంది. జర్మనుల తాత్త్వికగాంభీర్యం నీచకు నచ్చదు. Provençal సంస్కృతి తనకు యిష్టమని తన ఉత్తరాలలో రాసుకున్నాడు నీచ.ముఖ్యంగా అక్కడి జానపదుల నటగాయకబృందాల (troubadours ) ఆటపాటలు అతడికి యిష్టం.తన రచన The Gay Science,సముల్లాసశాస్త్రం, ఆ స్ఫూర్తితో రాసిందే. Science కు ఉండవలసిన లక్షణం సముల్లాసమని (Gay) నీచ భావం. భౌతికశాస్త్రమే శాస్త్రం కాదు. నాట్యమూ శాస్త్రమే, నిజానికి జీవితాన్ని ఆనందమయంచేసే శాస్త్రం.)

                                                     ***

   సత్తుకు రెండు ముఖాలు, చిత్తు ఆనందము. అవి మనిషి మనసులో కుడి ఎడమలు. కాలచక్రంలో రెండు యుగాలు. ఏకకాలంలో  రెండు సంస్కృతులు. ఒక సంస్కృతిలో, ఒక దానికి అపోలో (Apollo) అధిదైవం; మరొకదానికి డయొనీసియస్ (Dionysius) అధిదైవం. యూరపులో  ఒకదానికి సోక్రటీస్, మరొకదానికి ఎపిక్యూరస్ ప్రవక్తలు.

  ఇది క్రీస్తుపూర్వవిషయం. క్రీస్తుశకంతో  శోకయుగం మొదలయింది అంటాడు నీచ. క్రైస్తవమతసందేశం  పాపము శోకము త్యాగము దాస్యము, అన్నది ప్రబలమైన అభిప్రాయం. “ఆనందంగా ఉండండి” (St.Paul:“Rejoice always.”1 Thessalonians 5:16) వంటి వాక్యాలు వినిపిస్తున్నా,  అవి శోకాన్ని అధఃకరించి, క్రైస్తవధర్మలక్షణంగా పైకి రాలేదు. వైదికధర్మంలోనూ పాపస్మరణ నిత్యమూ చేసేదే .“పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః” అని సంధ్యావందనసమయంలో నిత్యము స్మరించినా, పాపభావం యీ సమాజంలో ప్రబలం కాలేదు. ఇక్కడ ప్రాబల్యం “హే అమృతస్య పుత్రాః” అన్న ఉపనిషద్వాక్యానికే . క్రైస్తవమతజీవితంలో ఆనందం ప్రధానం కాదు. “శోకము దాస్యము జీవితంలో విధించబడినవి, కనుక వాటిని మనం గుర్తించి వర్తించడం విజ్ఞత”,  అనదు క్రైస్తవమతం . ఆ గుణాలను ఉత్తమమైన ఆదర్శాలుగా ప్రబోధిస్తుంది. ఈ క్రైస్తవనిరానందాన్ని నీచ నిరాకరిస్తాడు. వినయము విధేయత వ్యథ , యివన్నీ బలహీనులు తమ దౌర్బల్యాలను సుగుణాలుగా ఎత్తేయడానికి అనుసరించే విధానం అంటాడు . (గమనించ వలసింది ఏమంటే, బలవంతులు బలహీనులను తమ దాసులుగా చేసుకోవడానికి పన్నిన కుట్ర అనడంలేదు నీచ. బలహీనులు తమ బలహీనతలను గొప్పచేసుకోవడంలో, తమను తాము గొప్పచేసుకునే ఆశయం కప్పిపెట్టుకుంటారు, అంటాడు.”He who humbles himself wants to be exalted.” Nietzsche:Human all too Human.) ప్రాచ్యసంస్కృతులలో యీ వైరుధ్యం తక్కువ. ఐహికాన్ని కాదనకుండా  ఆముష్మికాన్ని పట్టుకునే మార్గం యిక్కడి సంస్కృతులు. ఆముష్మికం మాట ఎలా ఉన్నా, నీచ ప్రాచ్యంలోని యీ ఐహికప్రాముఖ్యాన్ని గుర్తించాడు. అందుకే తన నిరానందనిరసనకు ప్రతినిధిగా జారతూస్ట్రను, గ్రహించాడు. “జారతూస్ట్రఉవాచ” యీ ఆశావహ అరుణారుణ ఉషోదయంతో మొదలవుతుంది. …(“rising one morning with the rosy dawn, he went before the sun, and spake thus unto it…”: Zara.Pr.1.)

   సాధారణంగా ప్రవక్తలందరూ యిహం అశాశ్వతము తుచ్ఛము, పరమే పరమము అని ప్రవచిస్తూ వచ్చారు.దానికి విరుద్ధంగా  అస్తిత్వవాదం ఐహికజీవనామోదాన్ని చెబుతుంది. “పరమొ గిరమ్మొ దాని తలపైనొక దోసెడు మన్ను చల్లు”, (‘పానశాల’) అనగలగడం ప్రాచ్యంలో సాధ్యమైనట్టు పాశ్చాత్యంలో కాలేదు. ఈ ఐహికవాదం ప్రాచ్యసంస్కృతులలో అనాదిగా ఆముష్మికంతో కలిసిఉండినదే. నీచ జారతూస్ట్రను తన ప్రవక్తగా గ్రహించడంలో యీ ప్రాచ్యవాస్తవికతను గుర్తించడం తెలుస్తుంది. ఇక్కడ, యిహపరాలు “ఇదో/అదో” (Either/Or) కావు.వాటి మధ్య సమన్వయం ఉన్నంతగా సంఘర్షణ లేదు. (అయితే యీ సమన్వయం,  దర్శనంలో ఉన్నంత ఆచరణలో లేదన్నది వాస్తవమే. కనుక, యిక్కడకూడా సమన్వయం గుర్తుచేయగల ప్రవక్త అప్పుడప్పుడూ అవసరమవుతూనే ఉంటాడు.)

   నీచ అంటాడు, యింతకాలంగా యిన్ని విధాలుగా తాత్త్వికులు సృష్టికి  యిలా స్పందించారు కాని,సృష్టిని నిందించని తాత్త్వికుడూ ఒక్కడూ లేడా? ఈ సృష్టిలో ఆనందంగా బతుకవచ్చు అన్నవాడొక్కడూ లేడా? ఎప్పుడో తత్త్వశాస్త్రం పుట్టకముందు, ఎపిక్యూరస్ అన్నాడు. ఎపిక్యూరస్ గురించి సాధారణ అభిప్రాయం, “ తిను తాగు సుఖమనుభవించు” అన్నది అతని వేదాంతమని. ఇది అతని తత్త్వాన్ని గురించిన దుష్ప్రచారం,  వాస్తవం కాదు. వేదాంతి అంటే సోక్రటీస్ లా విషమో ఆముదమో తాగిన ముఖం వేసుకుని కూర్చునేవాడేనా? ప్రవక్త అంటే రక్తం ఓడుతూ శిలువమీద నిలిచేవాడేనా? జీవితమంటే శోకము దైన్యము దాస్యమేనా? ఏడుపు ముఖం యీడుపు కాళ్ళా? వేదాంతంలో నవ్వుపై నిషేధమా? జీవితంలో అంతా సుఖము సంతోషము అనడంలేదు నీచ. విషాదం ఉంది. ఆ విషాదాన్ని ఆనందంగా మలచుకోవలె అంటాడు.
నీచ జీవితాన్ని ఒక విషాదాంతనాటకంగా భావించమంటాడు. జీవితనాటకం ఎప్పుడూ మరణాంతమే కదా! అయితే,విషాదాంతనాటకం ఆనందరసానుభూతికి  అత్యంతము దోహదంచేస్తుంది. నాటకంలో నటులకు కథారచనలో స్వాతంత్ర్యం ఉండదు. కాని, కథలోని కష్టసుఖాలతో సంబంధంలేకుండా,నటిస్తారు. నటనలో ఆనందంపొందుతారు. (ఇది ప్రేక్షకులు పొందే క్షాళనంకాదు , Aristotelian catharsis ) జీవితాన్ని  కళాత్మకము రసమయము చేసుకుంటారు. మనిషి అలాగే జీవించాలి, అంటాడు నీచ.
    
  అయితే యింతకాలంగా వచ్చిన తాత్త్వికులందరికీ, ఆనందంగా జీవించడం సాధ్యమే అన్న ఆలోచన ఎందుకు కలగలేదు? వారందరిదీ ద్వైతదర్శనం. “నేను వేరు, యీ సృష్టి వేరు. దీన్ని వేరెవడో  సృష్టించి నా మీద ప్రయోగిస్తున్నాడు”, అన్నపుడు, కోపము, బాధ, నిరాశ కలుగుతాయి. నీచకు కలగక పోవడానికి కారణం, అతడిది ద్వైతదర్శనం కాదు.అతడు అద్వైతి.ఈ సృష్టి ఒక కల. నీ కల, (“నిజాంతర్గతం”),మరొకడి సృష్టి కాదు. నీ కల లోని కష్టసుఖాలు స్వయంకృతాలు, వాటికి వేరెవరో కారణం కాదు.

   ఇక నీచ అతిమానవుడిగురించి.నీచ పాశ్చాత్యాన్ని కాదు నిరసించింది, క్రైస్తవపాశ్చాత్యాన్ని.అంటే అతడు ఆకర్షించబడింది తూర్పు సంస్కృతికి కాదు. అతడు చూచింది ప్రాక్పశ్చిమభేదం కాదు, ప్రాచీన అర్వాచీన భేదాలు. వైవిధ్యాన్ని పొదువుకొన్న ప్రాచీనజీవితదృక్పథము, వైవిధ్యాన్ని దున్ని చదునుచేసే అర్వాచీనసాంకేతికతా మనస్తత్త్వము-  యీ రెంటిలో అతడు ప్రాచీనానికే మొగ్గుచూపాడు. కనుకనే, జారతూస్ట్రలో తను కోరుకున్న ఐహికం చూచినట్లే, డయొనీసియస్ లో కూడా తన ఆత్మను చూశాడు. తన రచనలను వీరిద్దరి ఆత్మ పరచుకొని ఉంది అని చెప్పవచ్చు.

   అసలు అతిమానవుడు అంటే ఎట్లా ఉండవలెనని, ఎట్లా ప్రవర్తించవలెనని నీచ అభిప్రాయం? అతిమానవుడంటే అతిలోకశక్తిసామర్థ్యం ఉన్నవాడు కాదు.స్వేచ్ఛగా ఆనందంగా మనిషిగా బతుకగలిగినవాడు. అంటే దుఃఖంలేని జీవితమా? దుఃఖంలేని జీవితం ఉండదు.ఉంటుందన్న ఊహే నిరాశావాదానికి ఆధారం. షోపెన్ హోవర్ నిరాశాదృక్పథానికి కారణం అతడికి దుఃఖం అనుభవంకాలేదు కనుక అంటాడు నీచ. గ్రీకులు నిరాశను నిస్పృహను ఎలా జయించారు? వారి విషాదాంతనాటకాలచేత. దుఃఖస్పర్శలేని జీవితాన్ని ఆశించడమే నిరాశకు నిస్పృహకు నిజమైన కారణం అంటాడు నీచ. ఈ దుఃఖానికి మందు దుఃఖమే. (“Well, the recipe against this "misery" is misery.”GS:48.ఇదేదో హోమియో వైద్యసూత్రంలాగా ఉంది.Similia similibus curantur ! ) మనిషి కోరుకోవలసింది దుఃఖంలేని జీవితంకాదు.బాధే సౌఖ్యమని భావించడమూ  కాదు.దుఃఖాన్ని జీవితంలో భాగంగా స్వీకరించవలె అంటాడు నీచ. సుఖదుఃఖాలకు అతీతమైనది ఆనందం. నీచ చెప్పేది యీ ఆనందం. రాజకీయనాయకులు మాత్రమే కాదు, నాయకులందరూ జనాలను మోసంచేస్తున్నారు యీవిషయంలో. దుఃఖం జీవితంలో భాగం అని చెప్పగలిగిన నాయకుడు లేడు. చెప్పగలిగినవాడు నాయకుడు కాడు,వాడు ప్రవక్త.

    పాశ్చాత్యదేశాలలో యీ ఐహికప్రాముఖ్యం లేనే లేదా? ఉండేది. సనాతన సంస్కృతులన్నీ,  ప్రాచ్యమైనా పాశ్చాత్యమైనా. అయితే అక్కడా యిక్కడ కూడా ఆముష్మికాదర్శం ప్రబలమవుతూ ఉంటుంది. వాస్తవానికంటే అవాస్తవిక ఆదర్శం జనాలను సైద్ధాంతికంగా ఆకర్షిస్తుంది. యూరప్ లో కూడా యిది జరిగింది. ఎపిక్యూరస్ రాతలకంటే సోక్రటీస్ మాటలకు ప్రచారం కలిగేది. ఎపిక్యూరస్ దైవం డయొనీసియస్, సోక్రటీస్ దైవం అపోలో. ఒకరిది ఆనందము, మరొకరిది జ్ఞానము. ఐహికాముష్మికసమన్వయం ప్రతియుగంలో  చేసుకుంటూనే సాగవలె. ఈ యుగంలో అది చేయటానికి ప్రయత్నించిన “ప్రతిప్రవక్త” ( Antichrist ) నీచ.

   నీచ దర్శించిన ఆనందమయజీవితస్వరూపం ఏమిటి? “తిను తాగు యథేచ్ఛగ సుఖమనుభవించు”, కాదు. సులభము సుఖమయము అయినజీవితం జీవితమే కాదంటాడు నీచ. నీచ మాత్రమే కాదు, అస్తిత్వవాదులంతా అదే అంటారు. (“సుఖజీవనం బానిసల ప్రత్యేకహక్కు.” కీర్క్ గార్డ్.”Easy life is the privilege of the slave.”) అన్నిసామాజికవర్గాలు ఆశించే, ఆశచూపే, సుఖజీవనం జీవనం కాదంటాడు నీచ. భద్రత కోరుతారు జనం. నీచ చెప్పేది అభద్రతలో ఆనందం. జారుడు మంచుపై నృత్యం చేయగలగడంలో ఉన్న ఆనందం సిద్ధంచేసిన రంగస్థలంపై ఉండదు.ఇటువంటి క్షణక్షణజీవితం మళ్ళీ మళ్ళీ (“eternal recurrence.”) జీవించాలన్న  కోరిక, అందులోని ఆనందం -యిది డయొనీసియస్ లో నీచకు నచ్చింది. అభద్రత , అభద్రతలోని వ్యగ్రత, జీవలక్షణం అన్నది అస్తిత్వవాదమూలమంత్రం. ఈ వ్యగ్రతకు ఒక్కొకరు ఒక్కొక పేరు పెట్టారు. కీర్క్ గార్డ్ ‘భయము’, నీచ ‘అభద్రత’, హైడెగర్ ‘ఆదిమభయము’ (primordial dread,angst) , సార్త్ర్ ‘వికారము’ (nausea)- యిలా పేర్లు పెట్టుకున్నారు. ఒకే పదానికి పర్యాయపదాలే అయినా, యివన్నీ వేరువేరు అని వాదించారు కూడా. కీర్క్ గార్డ్ భయము, తన భయము ఒకటికావని హైడెగర్ అంటాడు. హైడెగర్ భయము, తన వికారము ( Nausée ) ఒకటి కావంటాడు సార్త్ర్.ఒక్క విషయం గమనించవలసింది ఏమంటే, యివన్నీ బుద్ధినుండి (cognitive) మనసువైపుకు ( emotive,affective) మరలడం సూచిస్తున్నాయి. ఆలోచిస్తే ఏదీ అర్థంకాదు అని అర్థమయింది అస్తిత్వవాదులందరికీ. ఆలోచన ఆగితే కాని అర్థమవడం మొదలవదు. ఈ చిత్తవృత్తినిరోధం  హైడెగర్ లో ప్రధానవిషయంగా తెలుస్తుంది, “అవస్తువు”(Nothing.”) ఆవిష్కరిండంలో. (“Dread reveals Nothing.”:(Heidegger : “What is Metaphysics?”)

-సచేతనమాయ:

“జగత్తు మిథ్యంటావా? కానివ్వు. ఈ మిథ్య నాకు సచేతనం”, అంటాడు నీచ. (G.S.54.Consciousness of Appearance; “మమ మాయా”: గీత.7: 14.) తాడు పాముగా కనిపించడం సద్గుణమే. తాడు (సత్) ఉన్నది కనుక పాము కనిపిస్తోంది. అలాగే  కలలాంటి జీవితం కూడా.నీచ అంటాడు మాయయే సత్యం.మాయకంటే పరమైన సత్యం లేదు. పరాపరప్రకృతులు నేనే అన్నాడు కదా గీతాచార్యుడు. “...మే భిన్నా ప్రకృతిరష్టధా...అన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్…”7.4-5)

   “దృశ్యజగత్తు నాకు  సజీవము, వాస్తవము. ఎంత వాస్తవమంటే, “యిది కల, భ్రాంతి, నీడల నృత్యం మాత్రమే”, అని నాకు తెలిసిపోయేటంతగా  అది తనను తాను ప్రకటించుకుంటుంది. ఈ స్వప్నంలోని వాళ్ళలాగ నేనూ ఒక స్వప్నపురుషుణ్ణి, యిది కల అని తెలిసినవాణ్ణి, నేనూ వారితో కలిసి నృత్యం చేస్తున్నాను; కల అని తెలిసినవాడు కూడా  భూమిపై యీ కల కొనసాగడానికి కారణం.ఇలా తెలిసినవాడు, అస్తిత్వమనే ఉత్సవానికి ప్రయోక్తలలో ఒకడు.వ్యావహారికజ్ఞానంలోని యీ పారస్పర్యం, యీ విశ్వస్వప్నాన్ని నిలిపిఉంచడానికి, కలగనే అందరి పరస్పరావగాహనకు, కల కొనసాగడానికి   అత్యుత్తమసాధనం.” (G.S.54.Consciousness of Appearance).
   నీచ జగన్మిథ్యాత్వాన్ని కాదనడం లేదు.జగత్తు మిథ్యే.అయితే ఏమిటట? విశ్వం నీ కల.అందమైన కల.  నీ కల మరొకడి సృష్టి కాదు. నీ కల నీవే కంటావు.దానిలోని కష్టసుఖాలు స్వయంకృతాలు, వాటికి వేరెవరో కారణం కాదు. వేరెవరినీ నిందించలేవు. మనకు వెంటనే గుర్తు వచ్చేది “విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా…”. ఈ సృష్టి ఒక కల వంటిది.మన లోపలిది, “నిజాంతర్గతం”. మనకు తెలియని మన పూర్వవాసనలే దీనిని కల్పించాయి. ఈ సృష్టి వాడెవడో మనపై కసితో సృష్టించి మనపై విసిరేసిన దారుణాస్త్రం కాదు.  ఇది కల అని తెలిసికూడా, మనం కల కనవలసిందే, కలను కళగా భావించి.ఈ కల, కాంట్ ( Kant) అన్న ట్టు, ఒక తెర కాదు, తెర తొలగించి దాని వెనుక వాస్తవమేదో ( thing-in- itself) దర్శించడానికి. తెరమీదిదే వాస్తవం. జీవితం అశాశ్వతం అని తెలిసి, అభద్రతలో ఆనందంగా జీవించడమే నిరర్థకజీవితాన్ని సార్థకం చేసేది, అన్నది నీచ జీవితదర్శనం.

  నీచకు ఆరాధ్యుడు డయోనీసియస్ (Dionysius). ప్రాచీనకాలంలో గ్రీకులు ప్రకృతిలో కలిసిపోయేవిధంగా  నాటకాలు ప్రదర్శించి, ప్రకృతితో ఒకటైపోయేవారు. అటువంటి రసానుభవం నీచ భావించాడు. ఈ విధంగా జీవితాన్ని ఒక కళగా భావించినపుడు, ఆ ప్రదర్శనలోని సుఖదుఃఖాలు మనం సృష్టించుకున్నవే అవుతాయి. ఏ దేవుణ్ణీ నిందించవలసిన అవసరం ఉండదు. అప్పుడు “విధిరాత” మన రాతగా మారిపోతుంది. మనం రాసుకున్న నాటకం కష్టమైనా మనకిష్టమే. విషాదంకూడా రసానందమే. కళలో కష్టంకూడా యిష్టమవుతుంది.(నాట్యకళను ఒక యోగంగా భారతీయఆలంకారికులుకూడా భావించారు. సంగీతంకూడా ఒక అతిమానుషఆనందస్థితిని కలిగిస్తుందని నీచ భావించాడు. నీచ వేగ్నర్ సంగీతంలో సమ్మోహితుడైన కాలంలో సంగీతజ్ఞానము వినా సన్మార్గము కలదా అనుకున్నాడు.) ఆ రసానందస్థితిలో, సృష్టి సమస్తము ఆత్మలీల. జీవితంలో ఎవరియందు దేనియందు వ్యతిరేకభావం ఉండదు. మన విధి (fate)కి మనం కర్తలం, కనుక  మనం ప్రేమిస్తాం (amor fati, love fate) ).సణుగుడు అణగిపోతుంది.

   అతిమానవుడిగా ఎదగడం ఒక నర్తనం, అతిమానవవర్తనం.కాని, ఆ కళ ఎటువంటిది?  కత్తి అంచుమీద నడవడం లాంటిది. కలలు, కలలో కల్లోలము ఉండాలి. “నీ కలల కల్లోలంలో నుండి మాత్రమే  ఒక తార నాట్యంచేస్తూ ఆవిర్భవించగలదు”, అంటాడు నీచ. జీవితం కత్తి అంచుమీద నడవడం ( “క్షురస్యధారా” ) అనడు నీచ.కాని, రెండు కొండకొమ్ములను కలుపుతూ కట్టిన తాడుపై  నడవడం వర్ణిస్తాడు(rope dancer: Z: Pr.3). ఆ కళాత్మకజీవితంలో అడుగడుగున నీ కాళ్ళ కింద ఒక అగాధం నోరు తెరచుకొని ఉంది. ఆ తాడుమీద లయాన్వితంగా అడుగులు వేయగలిగినవాడే అతిమానవుడు.

నీచ దర్శించిన అతిమానవుడులో ప్రధానలక్షణం లయ.తాంత్రికులభాషలో కూడా యీ లయ రెండు అర్థాలలో  కనిపిస్తుంది.కుండలినీశక్తిని మూలాధారంనుండి సహస్రారానికి , జీవుణ్ణి శివుడివద్దకు, మానవుణ్ణి అతిమానవస్థితికి, లయాన్వితంగా నడిపించడం చెబుతారు, (”నీత్వా తాం కులకుండలీం లయవశాజ్జీవేన సార్థం హృది…”: “షట్చక్ర నిరూపణం”.)  

నీచ చెప్పిన అతిమానవుడు నాట్యంచేయగల నేర్పు సాధించినవాడు. ఎక్కడ ? రంగస్థలంమీద నాట్యం నేర్పు కాదు, జారుడు మంచుపై నాట్యంలో నేర్పు.

“నర్తకులకు:

జారుడు  మంచు
స్వర్గం,
నేర్చిననర్తకులకు.”  (13.GS. నా అనువాదం: “సముల్లాసశాస్త్రం”)  

అనుక్షణం ఆనంద తాండవం చేసే దేవుణ్ణి మాత్రమే నేను నమ్ముతాను, అంటాడు నీచ. ( “I would only believe in a God that knows how to dance.” Zarathustra Part I, Chapter 7)

  ఇదీ, నీచ నిరీశ్వరనైరాశ్యంలోని చిదంబర రహస్యం.కైలాసశిఖరం కొండకొమ్ముపై  ఒళ్ళుమరచి ఆనందంగా నృత్యం చేయి. పాదం తడబడితే పాతాళంలో పడిపోతావా? భయమెందుకు? అదీ శివమే. “ఆపాతాళ నభస్స్థలాంత భువనబ్రహ్నాండ”మంతా శివమయమైనవాడికి భయమెందుకు? భద్రత దేనినుండి? అభద్రతే జీవితం.(“Vulnerability is what life is.”J.K. “Commentaries on Living” ).అభద్రతే ఆనందం.

   జారుడుమంచుకొండకొనపై,అభద్రతాశిఖరంపై,  నాట్యంచేయగల నటరాజు నీచకు దేవుడు. ఎవరన్నారు, “దేవుడు మరణించా”డని (“ God is dead.”)?

                                                 ***


No comments:

Post a Comment