Saturday, July 13, 2019

నీచ-5/7


అస్తిత్వవాదసాహిత్యం:
ఒక భారతీయదర్శనం-4
నీచ-5/7

ఇచ్ఛాశక్తి
(Will to power)



“మీకు తెలుసా యీ ప్రపంచం నాకెట్లా కనిపిస్తోందో? నా అద్దంలో దాన్ని మీకు చూపించమంటారా? ఈ ప్రపంచం: ఒక రాక్షసశక్తి.ఆది లేదు, అంతం లేదు….ఈ ప్రపంచం మహాశక్తిసంపన్నం కావాలన్న కోరిక.మీరు, మీరు కూడా ఆ యిచ్ఛాశక్తి రూపాలే తప్ప మరేమీ కారు.”
                                                                                     (నీచ:The Will to Power)

“పావురంలా మెత్తని పాదాలతో అవతరిస్తాడు అతిమానవుడు.”(నీచ) 
.



                                                                ***

నీచ ఆలోచనలను   నాజీతత్త్వానికి (Nazism) ముడిపెట్టిన  విషయం ప్రసిద్ధమే. అందుకు ప్రధానకారణం అతడి సోదరి.ఆమె భర్త యూదుద్వేషి. నీచ మరణానంతరం ఆమె నీచ రచనలను స్వాధీనం చేసుకొని, కొన్ని  మార్పులు చేసి, కొంత అపవ్యాఖ్య చేసి, నీచ భావాలు నాజీతత్త్వానికి ప్రోత్సాహకాలు అన్న అపోహ కలిగించింది. కాని నీచ నాజీ తత్త్వాన్ని ఆమోదించాడనడం వాస్తవవిరుద్ధం. అతని నాజీ అభిమానం నిజం కాదు. నిజం కాకున్నా, అసలు అటువంటి అపోహలు కలగడానికి అతని రచనల్లో అవకాశమిచ్చిన రచనాభాగాలను పరిశీలించడం అవసరం. (దురదృష్టమేమంటే యీ “పిచ్చివాడు”( GS.125)  రాసిన నీచ, తన చివరి రోజులలో నిజంగా పిచ్చివాడైపోయాడు, పిచ్చాసుపత్రిలోనే పోయాడు.( అతడి మతి చలించడానికి కారణం ఒక గుర్రాన్ని హింసిస్తున్న దృశ్యం చూడడమట.)  

నీచ భావాలలో నాజీతత్త్వం అనుమానించగలగడానికి కారణం ఇచ్ఛాశక్తి (Will to power) గురించి అతడి భావాలు.అతడు చెప్పిన  ఇచ్ఛాశక్తి మరొకడిని లొంగదీసుకోడానికి కాదు. తాను ఎదగడానికి. మందలో మందతో ఉండిపోకుండా, ఆ మందను అతిక్రమించడానికి. కీర్క్ గార్డ్ కూడా మందతత్త్వాన్ని కాదంటాడు. అతడి ప్రసిద్ధవాక్యం “అసత్యం మంద”(“ Crowd is the untruth”).అయితే, యీ యిద్దరూ కూడా   మందపై ఆధిక్యం కోరలేదు. మనిషి తనను తాను అధిగమించడానికి ప్రయత్నించవలె అంటారు. ఈ విషయం “అతిమానవుడు” (Ubermensch,Superman) చర్చలో చూచాం. ఇతరులపై ఆధిక్యం పొందవలె, యితరులను తన బానిసలుగ చేసుకోవలె అనుకునేవాడు అతిమానవుడు కాడు. “పావురంలా మెత్తని పాదాలతో అవతరిస్తాడు అతిమానవుడు”, అంటాడు కదా! పావురంగా పసిపాపలా మెత్తని అడుగులు చాలా అతిమానుషమైన ఆత్మబలంతో మాత్రమే కలుగుతాయి. దానినే నీచ ఇచ్ఛాశక్తి (Will to Power) అన్నాడు. ఒకడు మరొకణ్ణి అనుసరించడమే అంగీకరించని నీచ, మరొకడిపై ఆధిక్యాన్ని ఎలా ఆమోదిస్తాడు? “నన్ను  అనుసరించ వద్దు”, అనే ఏ ప్రవక్త అయినా చెబుతాడు. కాని ఎవరూ వినరు.జిడ్డు కృష్ణమూర్తి అన్నాడు, బుద్ధుని అనుసరించేవాడు బౌద్ధుడు కాడు అని. నిన్ను నీవు అనుసరించు, నీవు బుద్ధుడవు. నీచ అదే అంటాడు:

-“కరపుస్తకం (vade mecum) 

నా దారి,  నా మాట నచ్చాయి నీకు. నన్ననుసరిస్తావా?
నీ దారిని నమ్మి నడువు : నా దారికొస్తావు.”
          ( సముల్లాసశాస్త్రం:GS. Preludes 7 కు నా అనువాదం) 

“నా  యిచ్ఛాశక్తి  నీ సత్యాన్వేషణతో అడుగులు కలిపి  నడుస్తుంది.” అది శత్రువుపై బాంబులు కురిసే యుద్ధవిమానంలా  రాదు. “లోకాన్ని నడిపించే ఆ శక్తి, కపోతంలా మృదుపాదాలతో నడిచివస్తుంది. తుఫానును మోసుకొచ్చేది  మెత్తనిమాట.” (Z: Part II, Chapter 44,)

కనుక,అతని యిచ్ఛాశక్తి, (షోపెన్ హోవర్ ప్రభావంలో వచ్చిందే) , వ్యక్తిగతం, స్వవిషయం. వ్యక్తి తనను పైకి నడిపించుకునే శక్తి. ఈ  శక్తితో కలిసి ఊర్ధ్వాధ్వగమనం “ఉత్సాహవంతుడు” ( Dionysian Man) చర్చలో చూశాం.(“నీత్వా తాం కులకుండలీం లయవశాత్ జీవన సార్ధం హృది”)

అయితే, అసలు అతిమానవులు అనే వాళ్ళు లేనేలేరా? నెపోలియన్ వంటివారి గురించి నీచ ఏమంటున్నాడు?

“ ప్రతిభావంతుల గురించి— మహాపురుషులు, మహాయుగాలవలెనే, విస్ఫోటనపదార్థాలు. వారిలో మహాశక్తి పేరుకుని ఉంటుంది.చారిత్రకంగా మానసికంగా కొన్ని యుగాలపాటు జరిగిన ప్రక్రియాఫలితమే వారి ఆవిర్భావం. శక్తిని కూర్చి పేర్చి పొదుపుచేసి నిలువచేసిన శక్తి ఆ మహావ్యక్తి, యుగాలుగా విస్ఫోటనోన్ముఖమైన శక్తికి అభివ్యక్తి . ఆ శక్తి అపరిమితంగా పేరుకున్నపుడు, ఏ చిన్న కారణమైనా చాలు ఒక  ఘనుడో, ఒక ఘనకార్యమో, లేక మహాభాగ్యమో కలగడానికి.పరిస్థితులు, కాలము, యుగధర్మము- యివేవీ లెక్కకు రావు...మహానుభావులు అవసరం, వాళ్ళు అవతరించే యుగం యాదృచ్ఛికం.”
                             (నీచ: “Expeditions of an Untimely Man,” )

నీచ యిక్కడ ఏమంటున్నాడు? గొప్పవాడు అంటే లక్షలమంది మనుషులను బలితీసుకునే  యుద్ధవీరుడు, నాయకుడు మాత్రమే కాదు. ఏ రంగంలోనైనా గొప్పవారు అవసరమే, సంగీతంలో, సాహిత్యంలో, పరిపాలనలో యింకా అనేక రంగాలలో. అటువంటి మహాత్ముడు తన  రంగంలో మందకు వెలుపలే ఉంటాడు. మందికంటే ఎత్తులోనే ఉంటాడు. అసమానత అనివార్యం. వాడెప్పుడూ ఒంటరే. ( ఇబ్సెన్ నాటకం , The Enemy Of the People: “The strongest man in the world is he who stands most alone.”) ఇదొక పార్శ్వం. 

కాని అటువంటి అతిమానవుల ఆవిర్భావానికి మనం చేయగలిగిందేమీ లేదు అంటున్నాడు. చేయగలిగింది ఎవరు, ఏది? అదే ఇచ్ఛాశక్తి (Will to power). భారతీయదర్శనాలలో యీ శక్తిని త్రివిధమైనదిగా చెప్పారు—ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి.ముందు కోరిక కలుగుతుంది, “సోఽకామయత” ( బృ.ఉప.) “తదైక్షత”, కోరిక సిద్ధించాలంటే ఏం చేయాలి? ఈక్షణం అంటే యిక్కడ చూడడం కాదు. ఆ దశలో , సృష్టికి పూర్వం చూడడానికి ఏ వస్తువూ లేదు.కనుక యిక్కడ చూడడమంటే ఊహ చేయడం, “ఏం చెయ్యడమా అని ‘చూస్తు’న్నా”, అంటాం.ఆ “చూడడం”. ఒక కుర్చీ చేయదలచినవాడు, చేయడానికి ముందు దాన్ని తన ఊహలో  చూస్తాడు. ఇది జ్ఞానశక్తి. దీని తరువాత క్రియాశక్తి. చేయవలసింది చేయడం , “ఆత్మానం ద్వేధాపాతయత్”. (“తనను రెండుగా , స్త్రీపురుషులుగా చేసుకొనెను.”) ఇపుడు ప్రశ్న, యీ శక్తి ఎక్కడ ఉంటుంది? మనిషిలోనా మనిషి వెలుపలనా?ఇక్కడ ఉపనిషత్తులను ఆశ్రయించవలె. ఈ శక్తికి లోపల వెలుపల అన్న ద్వైవిధ్యం లేదు. ఈ శక్తిలోనుండి సృష్టి వచ్చింది అంటే, మనిషికూడా సృష్టిలో భాగమే కనుక, మనిషికి వెలుపలదే అయియుండవలె శక్తి. కాని లోపల అదే శక్తి. నదిలో ముంచిన కుండకు నీరు వెలుపలా? లోపలా? శక్తి అభివ్యక్తికి ఒక మాధ్యమం కావలె కదా? ఆ మాధ్యమం మనిషి. కాని మనిషి ఒక్కడే మాధ్యమం కాదు. ప్రతి వస్తువు ఏర్పడడము, పనిచేయడము కేవలం ఆ శక్తి యొక్క అభివ్యక్తి.

షోపెన్హోవర్ యీ ఉపనిషత్తులు చెప్పిన శక్తిని తన భాషలో : “ఈ సృష్టి నా కల్పన” , అన్నాడు (“The world is my representation." ) 

నీచతో వచ్చే పేచీ ఏమంటే, యితడు దేవుడి దగ్గరనుండీ అన్నీ “లేవు లేవు” అనే శూన్యవాదిగానే పేరుపడి పోయాడు. ఈ యిచ్ఛాశక్తిని, దీనిప్రభావాన్ని  “అవు”నంటున్నాడు. ఎలా సమన్వయించడం? ఈ అవుననడం అర్థం చేసుకుంటే, అతడు కాదన్నదేదో, ఎందుకో సరిగా అర్థమవుతుంది. మనిషి శక్తిని అవుననడమే నీచ కాదనడంలోని పరమార్థం. పందొమ్మిదవ శతాబ్దపు ప్రయోజనవాదాల (utilitarianism) వంటివి శూన్యవాదానికి సరి అయిన సమాధానాలు కావు. శక్తిని పెంచుకోవలె  అన్నది మనిషిలోని అతి సాధారణము అతి సహజము అయిన కోరిక.ఈ యిచ్ఛమాత్రమే శూన్యవాదానికి సరి అయిన సమాధానం.


“ ...ఇతరులపై మనం ఆధిక్యశక్తిని ఎందుకు ప్రయోగిస్తాం? పరులకు కష్టమో నష్టమో కలిగించడానికి.  వీటికోసం మనం త్యాగాలుచేయవలసికూడా రావచ్చు.అయినా మన త్యాగం వల్ల స్వలాభము మన పరపీడన గొప్పవి అయిపోవు.చివరకు ప్రాణత్యాగం చేసినా, మతంకోసం కొందరు చేసినట్టు, ఆ త్యాగంకూడా మన ఆధిక్యశక్తిని సంతృప్తిపరచడానికే….ఇతరులను మనం బాధపెట్టడంలోను, యితరులకు  ఉపకారం చేయడంలోను — [ రెంటిలోను] మన ఆధిక్యశక్తిని సంతృప్తిపరచడమే ప్రేరణ….”.(Book One of the The Gay Science aphorism 13)

కనుక ఆధిక్యతసంపాదించాలి అన్న కోరిక  ప్రాణిసహజం. హింసలో ఎంత ఆధిక్యత ఉందో, త్యాగంలో అంతకంటే తక్కువ లేదు. నాకు శక్తి వద్దు,  బలం వద్దు అనడంకూడా ఒక విధంగా ఆధిక్యతకోరడమే. ఈ సహజప్రేరణను గురించే నీచ చెబుతున్నది.నీచ శక్తిని విధించడంలేదు, వర్ణిస్తున్నాడు ( descriptive,not prescriptive) .ఈ శక్తిని పెంచుకోమంటున్నాడు ఆత్మోద్ధరణకు.ఇంతకు ముందు కాదన్న పారలౌకికవిలువలను నీచ యీ యిచ్ఛాశక్తితో పొందవలెనంటాడు.

ఏ గుణమైనా మంచిదా కాదా అన్నది నిర్ణయించే కొలత ఏది? 

“ఏది మంచి?  ఆధిక్యతాభావాన్ని , శక్తిని పెంచుకోవలె అన్న సంకల్పాన్ని , బలాన్ని పెంచే ప్రతిదీ మంచి.ఏది చెడు? బలహీనతకు కారణమైనది ప్రతిదీ.ఏది సంతుష్టి? శక్తి పెరుగుతున్నది అన్న భావన. ప్రతికూలశక్తిని అధిగమించాను అన్న భావం.”( The Anti-Christ:Aphorism 2)

విషానికి విరుగుడు మహావిషం.కాలానలహాలాహలపానం.

“ఒక రోజు జారతూస్ట్ర ఎండలో అలిసి అత్తిచెట్టు కింద నిద్రపోతున్నాడు, ముఖంమీద చేయివేసుకుని.ఒక పాము వచ్చి అతన్ని మెడపై  కాటువేసింది.జారతూస్ట్ర బాధతో పెద్దగా అరిచాడు.ముఖంమీద చేయితీసి పామును చూచాడు.పాము అప్పుడు చూసింది అతని కళ్ళని.వణికింది. జరజర పాకి  పోవాలని చూసింది. జారతూస్ట్ర, “ ఆగు! నేను నీకు కృతజ్ఞతలు చెప్పనే లేదు!”, అన్నాడు.నన్ను సకాలంలో లేపావు.నా ప్రయాణం యింకా చాలా ఉంది.” పాము విచారంతో అన్నది, “ నీ ప్రయాణం ఎంతో లేదు.ప్రాణాంతకం నా విషం.”  జారతూస్ట్ర నవ్వి, “పాము విషం మహాసర్పాన్ని (dragon) చంపగలగడమా! అయినా, నీ విషం నీవు వెనక్కు తీసేసుకో.నాకు యివ్వగలిగినంత విషం నీ దగ్గర లేదు.”అప్పుడు పాము అతని మెడపై పడి అతని గాయాన్ని నాకింది….”(పాముకాటు (Bite of the Adder: Zara.)

“మెడపై పడి అతని గాయాన్ని నాకింది….”నీచ పాములు మెడకు చుట్టుకున్న శివదర్శనం చేశాడు.

కాలాహి కంఠాభరణమైనవాడిని బురదపాములేం  చేయగలవు?

నీచ చెప్పే యిచ్ఛాశక్తి ఆత్మోద్ధరణకు.“నాయమాత్మా బలహీనేన లభ్యతే.” బలమంటే, బలహీనపరచే నమ్మకాలను ఎన్నిటినో వదిలించుకోగలిగిన బలం. బలం సంపాదించుకొనేది కాదు.బలహీనతలను వదిలించుకోడమే నిజమైన త్యాగం, నిజమైన బలం. 

“జీవితం నా చెవిలో ఒక  రహస్యం ఊదింది: ఏది తనను తాను అధిగమిస్తుందో అది నేను.” (Zara) 


                                                         ***




























No comments:

Post a Comment