Sunday, July 7, 2019

వాడ్రేవు : కబీర్ అనువాదం: నా స్పందన

మన లాగో యార్ కబీరీమే

(గమనిక:ఇది పుస్తకసమీక్ష కాదు.)

వర్షంలో తడవని వాడు, కబీరు దోహా నాలుకమీద ఆడనివాడు ఉండడు. (నాలుక మీద నిలిచినా చాలు.అంతకంటే లోతుకు ఎలాగూ దిగదు. "జీభ్ ఫిరే ముఖ మాహీ", అంటే అననీ కబీర్.)

ఈ కబీర్ కు రెండో చూపు అక్కరలేదు.మొదటి తూపుతోనే 'ముక్కలై' పోతాడు, ఎవడైనా.మొదటి దోహాతో అంటుకుంటున్న అంగీ, ఆ తరువాత ఎంత కాలం పీకినా వదలదు. "అంగీ" అన్నానా? ఈ ఎలియట్ ఎప్పుడూ యింతే, మనమేదో మాట్లాడుకుంటుంటామా, నేనున్నానంటూ  వచ్చేస్తాడు, పిలవని పార్టీకి వచ్చిన వి ఐ పి లాగా.

"Love is the unfamiliar Name�Behind the hands that wove�The intolerable shirt of flame
Which human power cannot remove."(L.G.)

(ఎలియట్ సాలెనేత ("wove/The intolerable shirt") గురించి మాట్లాడుతున్నాడు. అందుకే వచ్చేశాడు, పాపం.)

అంటుకున్న  అంగీ అలాగే అతుక్కుపోయింది.నేను దాన్ని పీకలేను. (అదీ నన్నేమీ పీకలేదు.)

ఒక రోజు, వేటూరి సుందరరామమూర్తి  పాటలు "రాసుకునే" రోజుల్లో, (డిక్టేటర్ కాకముందు,) 'నాలుగు నిమిషాలయ్యా. మూడురోజులనుంచీ వెంటపడుతున్నారు.ఇది రాసి పడేసివచ్చేస్తా.బయటికి వెళదాం', అన్నాడు. సరే రాసుకో అన్నాను.ఊరకే కూచుంటే నా నాలుక ఊరుకోదు కదా. "జీభ్ ఫిరే ముఖ మాహీ". కబీరు దోహాలు నాకు నేను చదువుకొంటున్నాను. అతడు పాట రాయడం లేదు. దోహాలు వింటున్నాడు. బాణం తగిలినట్టుంది. పెన్ నొక్కి జేబులో పెట్టుకొని, pad పక్కన పెట్టేశాడు.  దోహాలు నాకు వచ్చినవి చదివేశాను. నా దగ్గర సరుకైపోయింది. 'కబీర్ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి?', అన్నాడు.టి నగర్ లో దక్షిణభారతహిందీ ప్రచారసభకు వెళ్ళాం. రెండు పుస్తకాలు కొన్నాడు. ఆ రెండూ కూడా అతడు చదవలేదని గ్యారంటీగా చెప్పగలను. చదవడం అతని బలహీనతలలో ఒకటి కాదు. మరి ఆ పాటలు ఎట్లా రాస్తాడు అని అడగకండి. ఆ తరువాత కేవలం తను రాసిన కబీర్ గీతాల కోసం "గీతాంజలి" అని ఒక కాసెట్ కంపెనీ పెట్టి, కంపెనీ పెట్టాడు కనక మరి కొన్ని పాటలు రాసి, (అయ్యప్ప మీద ఆంజనేయుడు మీద, యిలా ఏవో  ) కాసెట్లు రిలీజ్ చేశాడు. లక్షల ఖర్చు( ఆ రోజులలో!) 'కబీర్ బాణం' తగిలి ముక్కలైపోయాయి . (గాంధీ తెలివైనవాడు, రూపాయి విలువ తెలిసినవాడు. పాపం, టాగోర్ కొంచెం వేటూరి టైపే.) ఇదిగో, యిప్పుడు మళ్ళీ యీ వీరభద్రుడు.
    కబీర్ దోహాలు నాలుకకు తాకాయో,  మూగ అయినా వాగవలసిందే. నన్ను కూడా మూగ అనే అంటారు తెలిసినవాళ్ళు. కాని  కబీరు పలకరిస్తే, ఎలా ఊరుకోను? లాడూ ఎంత తీపో లడ్డూ కూడ అంతే కదా!
     కబీరును తెలుగులో యింతవరకు చదవలేదు నేను. అనువాదాలు చాలా లేవు కూడా.కారణం తెలియదు. (టాగోర్ గీతాంజలిని  తెలుగుచేయని వాడు ఎవడైనా ఉన్నాడా అని అడగాలి.గజనీ మహమ్మద్ మన దేశంపై ఎన్ని సార్లు దాడి చేశాడు, పాపం! ఊరకే ఆయనను ఆడిపోసుకొంటారు!టాగోరు అప్పటికి ఉండి ఉంటే, ఆలయాల  జోలికి వెళ్ళిఉండేవాడు కాదు.గీతాంజలి అనువాదం చేసుకుంటూ ఉండిపోయేవాడేమో, పద్ధెనిమిదో సారి!)
     కబీర్ కవితపై యింతగా దాడులు జరక్కపోవడానికి  రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, మూలంలోని  ఆ చురుకు చూసి గుండె జారిపోతుంది. తెలుగులో తేవడం అసంభవం అన్నదాంట్లో అనుమానం రాదు.రెండు, హిందీ తక్కిన భారతీయభాషలకంటే, మరాఠి బెంగాలీ, కొంత ఎక్కువ అర్థమవుతున్నట్టనిపించడం. (కబీర్ భాష , హిందీలా ఉంటుంది కనుక.)
   సాహసం కాదు, సాధ్యమే, అన్న విశ్వాసం ఉన్నవాడే  ఆ పనికి పూనుకొని సమర్థంగా నిర్వహించగలడు.వీరభద్రుడికి సాధ్యం కాకపోతే  నాకు తెలిసి మరొకరికి అవుతుందనుకోను. ఆ విశ్వాసాన్ని ముందుగా అభినందించాలి.
    విశ్వాసం మరో అర్థంలో కూడా. ఎనిమిదో తరగతిలో , బాణమో ప్రాణమో తెలియని వయసులో, ఒక  కరెంటులేని చీకటి రాత్రి, అశరీరవాణిలా, కనిపించకుండా వినిపించిన "గురుబాణి" కరెంటుషాకుకు మంత్రముగ్ధుడై,   ఆ అనుభూతికి బదులిచ్చుకోవలెనన్న తపన వదలక వెంటాడుతునే ఉండి ఉంటుంది. ఇది ఆ బదులు.
    
    కబీరు కవిత్వజీవితంలో ఆరు దశలున్నట్టే, పాఠకుడికి కూడా అన్ని కాకపోయినా, కొన్ని దశలుంటాయి. మొదటిది కుర్రదశ, తిరుగుబాటులో ఆకర్షణ.అమితాభ్ బచ్చన్, చారు మజుమ్ దార్ పుట్టని రోజులలో ఆ కొరతను పూరించినవాడు కబీర్. ( దీవార్ సినిమాలో ఆమితాభ్ తల్లిని గుడికి తీసుకెళ్లి , తాను బయట కాచుకుంటాడు.అదే సినిమాలో ఆ తరువాత మరో సీనులో అదే హీరో గుడిలోపల అదే రాతిబొమ్మను  నిలదీస్తాడు.అదొక విధమైన కుర్రప్రార్థన!"దుఖ్ మే సుమిరన్ సబ కరై,సుఖ్ మే కరై న కోయ్.") నిరసన ఒకటే ఆ వయసులో అర్థమయేది, ఆకర్షించేది.
    రెండవ దశ.సాహిత్య దశ.కబీర్ అన్న  మాటలు మరెవరన్నారు? అలా వెదుక్కోవడం అదొక సాహిత్యక్రీడ, అంత్యాక్షరి వంటిది.
-'మూగవాడు తిన్న చక్కెర'.తులసీదాసు కూడా యిటువంటిదేదో అన్నట్టున్నాడు కదూ? 'గిరా అనయన, నయన బిను బాణీ.'
-'యుగాలు పట్టే దారి, క్షణంలో దాటించేస్తాడు.' అవును, దాటితే క్షణంలోనే దాటవలె, రెండో క్షణం లేదన్నట్టు. ఒక చైనీస్ వాక్యార్థం:'You cannot cross a chasm in two steps.'
-'భయపడను.భయపెట్టను.'గీతావాక్యం గుర్తు రాకుండా ఉంటుందా? 'యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ య:'.
-'ఏడు సముద్రాల్ని సిరాగా మార్చి, .....' దీనికి  వెదకనక్కర లేదు.తెలిసిందే. 'అసితగిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే,సురతరువరశాఖా లేఖనీ పత్రముర్వీ....'
-'చంద్రుడు మరణిస్తాడు సూర్యుడు మరణిస్తాడు...' 'న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం...'
-'కమ్మరికొలిమిలో తిత్తులు చూడు, ఊపిరి తీస్తాయి, ప్రాణముండదు.' పోతన "చర్మభస్త్రి"గుర్తు రాకుండా ఉండదు.
-'తనువు పులకించినప్పుడే ఇద్దరున్నారనిపిస్తుంది, ఎరుక కలగ్గానే  ఉన్నదొకరే అని అర్థమవుతుంది.' జ్ఞానేశ్వర్ 'అమృతానుభవం' లా ఉంది.
-'జాత్ న పూఛో'. ప్రతివాడు యిదే అంటాడు. కాని ప్రతివాడు ముందు అడిగేదిదే, జాతి కులము. 'అనాది గా చెబుతూనే ఉన్నారు.'న వర్ణో న వర్ణాశ్రమాచారధర్మో...', అని.
       ఈ ఆట ఒక దశ.బహుశా, మూడవ దశ లేదేమో! ఇలా పరిచయవాక్యాలు వెతుక్కోవడంలో  జీవితం వెళ్ళిపోతుంది.
   వ్యక్తిలో లాగానే సమాజంలో కూడా , నిర్గుణానికి సగుణానికి మధ్య యీ ఊగులాట ఉంటుంది. విధ్వంసం ఆకర్షించినంతగా విగ్రహం ఆకర్షించదు. కబీరు గ్రహించి ఉంటాడు, ఈ  లోకం సాధువులకోసం సృష్టించబడలేదని.బాణం బలంగా తగలవలెనంటే, ఒక అడుగు వెనక్కు తీసుకొని సంధించాలి. ఆ వెనుక అడుగే, శిరిడీ సాయి. నాది కబీరు మతమంటూనే, శిరిడీలోని పాడుబడిన ఆలయాలనన్నిటినీ పునరుద్ధరించాడు.
     ఇప్పుడు మనం నిర్భయంగా  నిర్గుణభజన చేయవచ్చు. వీరభద్రుడి అనువాదం ఆస్వాదించ వచ్చు.

     అనువాదం గురించి అనేక వాదాలు విన్నాం. మరొకటి విందాం.   Jorges Luis Borges (Conversations -vol.1) లో అంటాడు:'కిప్లింగ్ దో, లేక తనకు తెలిసిన ఏ భారతీయకవిదో, సరిగా గుర్తులేదు.అతడి కథ ఒకదానిలో వాక్యం: 'If I hadn't been  told this was love, I would have believed that it was a naked sword.' (ఇది ఏదో ఉర్దూ గజల్ లో వాక్యమో అయి ఉండవచ్చు.కబీర్ అని ఉండవచ్చు కూడా. ) ఈ వాక్యంలో అద్భుతమేమిటంటే, దాని రూపము, వాక్యనిర్మాణము, అంటాడు బోర్హెస్. ఈ వాక్యాన్ని  మరో విధంగా చెప్పలేము. 'ప్రేమ కత్తిలాంటిది, కోసేదాకా తెలీదు'; 'మొదట అది కత్తి అనుకున్నాను, తరువాత తెలిసింది అది ప్రేమని.' ఇలా ఎన్ని విధాలుగానైనా చెప్పవచ్చు.కాని ఆ బలం రాదు. గమనించవలసిందేమంటే, యీ వాక్యం అనువాదం చేయడం కష్టం కాదు, వాక్యరూపం అనుసరించగలిగితే. వీరభద్రుడు యీ రూపాన్ని  యీ వాక్యనిర్మాణాన్ని పట్టుకున్నాడు. అన్నీ ఉదాహరించలేను.ఒకటి రెండు.

'సాధువు కనిపిస్తే జాతి అడక్కు.జ్ఞానం అడుగు.బేరమాడవలసింది పిడిని కాదు, కత్తిని.'

'విల్లుకి బాణం తగిలించకుండానే గురువాక్యం ప్రపంచాన్ని ఛేదించింది.గాలిపటాన్ని నాలుగు దిక్కులా ఆడించినా దారం మాత్రం ప్రేమహస్తాల్లో నిశ్చలం.'

'రత్నం దొరికింది, కొంగున ముడేసుకున్నావు.మాటిమాటికీ తెరిచి చూస్తావెందుకు?'(సంశయం నశించదు. మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతుంది.)

   అనువాదం అతిసులభం.కనుక అతిజాగ్రతతో చదవాలి.
'నా గురువు గొప్ప భ్రమరం.నాలాంటి కీటకానికి తన రంగులద్దుతాడు. ....కొత్త కాళ్ళు  కొత్త రెక్కలు కొత్త రంగులు...'
ఏ రంగులు? మొదటి పాదంలోని యీ రంగులేమిటో చివరిపాదంలో తెలుస్తాయి. 'రామరాగరంజితుణ్ణి చేశాడు'.
  కనుక, జాగ్రత్త.
జాగ్రత! ఇక ముందు కబీరు 'సునో భయ్ సాధో' అననక్కర లేదు.తెలుగులో కూడా సాధువులను పలకరించవచ్చు.

No comments:

Post a Comment