Friday, July 19, 2019

నీచ-6/7



అస్తిత్వవాద సాహిత్యం-4
:ఒక భారతీయదృక్పథం
నీచ-6/7
          
                         

కాలచక్రం(Eternal Recurrence)


“కాలం 
ఒక విషవలయం.
కొందరికది  రంగులరాట్నం.

కాలం
విడిచిన బాణం.
కొందరికది పరిభ్రమద్గ్రహగానం.”

                                                               ***

కాలం సరళరేఖలా సాగదని, చక్రంలా తిరుగుతుందని, జరిగిందే తిరిగి జరుగుతుందని భారతీయదృక్పథం.యుగాలు కల్పాలు పునరావృతమౌతాయని పురాణాలు చెబుతాయి.  అనేక కృతయుగాలు గడిచాయి. అనేక ద్వాపరాలు, అనేక రామావతరాలు, రామరావణయుద్ధాలు. యుద్ధపరిశ్రాంతుడు పునరుత్సాహవంతుడై యుగయుగాలుగా యుద్ధం గతంలో చేశాడు, రాబోయే యుగాలలో చేస్తూనే ఉంటాడు. అదే రాముడు కాదు. అలాంటి రాముడు. (similar not identical) .మన పురాణాలలో రామకథలలోని కొన్ని వైరుద్ధ్యాలకు సమాధానంగా యీ యుగభేదాలు కారణం అంటారు.  ప్రతిక్షణమూ, ఎన్నో యుగాల కణాలను తనలో దాచుకుని వస్తుంది.

కాలం వలయంలా తిరిగి తిరిగి వస్తుందనేది భారతీయదృక్పథం మాత్రమే కాదు.అనేక ప్రాచీన సంస్కృతులలో యీ విశ్వాసం ఉన్నది. (బౌద్ధదర్శనంలో కాలచక్రం ప్రసిద్ధమే.) మరి నీచ కొత్తగా చెబుతున్నదేమిటి? ఈ కాలచక్రగమనాన్ని  నీచ అస్తిత్వవాదదృష్టితో చూస్తున్నాడు. 

మనిషి జీవితాన్ని నిజంగా ప్రేమిస్తున్నాడా, లేక పరలోకానికి అమ్మేసుకున్నాడా? సుఖజీవితాన్ని ప్రేమించడం నిజంగా జీవితాన్ని ప్రేమించడం కాదు. కష్టమూ సుఖమూ అన్నీ కలిసే వస్తాయి జీవితంలో. ఏది వచ్చినా ఉత్సాహంగా జీవించగలడా? జీవితాన్ని నిజంగా ప్రేమించినవాడు మాత్రమే యీ జీవితం నాకు మళ్ళీ మళ్ళీ కావాలి అనగలడు.అతిమానవుడుగా ఎదగడానికి, అంటే ఆత్మోద్ధరణకు, పునర్జన్మలు అవకాశాలు. నీచ భావాలన్నీ మనిషి అతిమానవుడుగా (Ubermensch) ఎదగడమనే భావంలో అంతర్భవించినవే. 

కాలచక్రం నీచ దర్శనంలో చాలా వివాదాస్పదాంశమైంది. అంతవరకు నీచ ప్రకటించిన భావాలకు విరుద్ధమని కూడా చాలామంది వ్యాఖ్యాతలు భావించారు. ఇది సరి అయిన విమర్శ కాదు.  నీచ దర్శనంలో యీ కాలచక్రభావన యిచ్ఛాశక్తిభావనకు కూడా అనుబంధించిందే. కాలమే సుడులు తిరిగే ఆ “రాక్షసశక్తి” (“monstrous energy“).మహాకాలలీల. నీచకు యీ మహాకాలదర్శనం ఉపనిషత్తులలోనో, భగవద్గీతలోనో కలగలేదు. అతని జీవితంలోనే ఒక అనుభవరూపంలో కలిగింది.( అరవిందుడికి శ్రీకృష్ణజన్మస్థానంలో కృష్ణదర్శనమైనట్టు.) స్విజర్లండ్ లో ఒకసారి సిల్వప్లానా ( Silvaplana) సరసు దగ్గర ఒక  మహాశిలను (boulder) చూచాడట. వెంటనే జేబులో ఉన్న ఒక కాగితం ముక్క తీసుకొని, దానిపై రాశాడట:”మనిషికి కాలానికి ఆరువేల అడుగుల పైన”,అని.ఆ శిల కేవలం నిమిత్తం. నీచకు ఆ సందర్భంలో కలిగింది మహాకాలదర్శనం. 

మరి నీచ యీ కాలచక్రం గురించి ఏమంటున్నాడు? కాలం క్రైస్తవమతంతో పుట్టలేదు. నీచ దర్శనమంతా క్రీస్తుపూర్వపు యుగాలజీవనదృక్పథాలే. నీచ రచనల్లో ప్రతి వాక్యము క్రైస్తవవిశ్వాసాలకంటె వెనక్కు తీసుకెళుతుంది. క్రైస్తవమతం యీ జన్మకు ఒక అస్తిత్వం ఒప్పుకోదు.అది కేవలం పరలోకప్రాప్తికి సాధనం.ఈలోకంలో బతకడం చేతగానివాడు  పరలోకాన్ని గురించి ఆలోచిస్తాడు. నీచకు యీ జన్మ ముఖ్యం. ఈ లోకమే ఉంది. ఇది తప్ప మరో లోకం లేదు. జన్మ ఉంటే యిక్కడే ఉండనీ. ఈ జన్మ మళ్ళీ మళ్ళీ నాకు కావాలి. ఇదే జీవితం. ఇవే కష్టాలు. ఇదే అభద్రత. బతుకును ప్రేమించనివాడు, బతకడం చేతగానివాడు బతుకుకు భయపడే వాడు జన్మరాహిత్యం కోరుతాడు. బతకడం తెలిసినవాడికి జీవితం ఒక సాహసక్రీడ. ఒక సంతృప్తి. ఒక గర్వం. విధిరాతను కష్టంగా కాక యిష్టంగా అనుసరించడం (amor fati:love of fate) చెబుతాడు నీచ.

తిరిగి తిరిగి అదే బతుకు బతకడమంటే గానుగెద్దులాగానా? లేక, తినుచున్న అన్నమే తింటూనా?  కాలం తిరిగి తిరిగి నీ కాళ్ళదగ్గరకు ఎందుకు వస్తుంది? ఈ సారైనా మెరుగైన బతుకు బతకమని.మనిషి తనను తాను అధిగమించడానికి కాలం అవకాశాలు యిస్తూనే ఉంటుంది. అనంతకాలసముద్రం మళ్ళీ  మళ్ళీ మరో జీవితం అలలపై మోసి తెచ్చి పడేస్తుంది నీ పాదాల దగ్గర. నీవంటే భగవంతుడికి అంత ప్రేమ! 

“బరువులలో పెద్దబరువు.—ఒక వేళ, ఏ రాత్రో పగలో,  నీ అత్యంత ఏకాంతంలోకి ఒక రాక్షసి రహస్యంగా వచ్చి నీతో అన్నదనుకో: “ఇప్పుడు నీవు జీవిస్తున్న యీ జీవితం, యింతవరకు జీవించినది, నీవు మరొక్కసారి, కాదు మళ్ళీ మళ్ళీ,   జీవించవలసి ఉంటుంది.కాని అందులో ఏదీ కొత్తది ఉండదు.ప్రతి కష్టము సంతోషము ప్రతి ఆలోచన ప్రతి నిట్టూర్పు, అత్యల్పవిషయంనుండి అతిముఖ్యమైనదానివరకు తిరిగి వస్తాయి నీ జీవితంలో.ఇదే వరుసలో— యీ సాలీడు, యీ చెట్లసందులలోనుండి వచ్చే వెన్నెల కూడా. శాశ్వతమైన  యీ అస్తిత్వపు యిసుకగడియారం తిరిగి తిరిగి తలకిందులుగ తిప్పి నిలబెట్టబడుతుంది.దానితో, అందులో యిసుకరేణువైన నీవూను!” (GS 341).

ఈ ఆవర్తనకు  ప్రతీకాత్మకంగా, నీచ తన Gay Science లోని  చివరివచనం (Aphorism 342) తో దాని తరువాతి రచన అయిన Thus Spake Zarathustra ప్రారంభిస్తాడు.ఒక గ్రంథం ముగింపు తరువాతి గ్రంథారంభం. ఒక జీవితం ముగింపు మరో జీవితానికి మొదలు.( ఈ విధంగా వెనుకటి గ్రంథం ముగింపుతో “జారతూస్ట్ర”  ప్రారంభించడం , “జారతూస్ట్ర” లో ప్రధానవిషయం కాలపునరావర్తనం అని సూచించడానికి కూడా .అంటే కాలపునరావర్తాన్ని కేవలం GS 341 ఆధారంగా అర్థం చేసుకోడం సరికాదు, “జారతూస్ట్ర” సాంతము చదవవలసి ఉంటుంది అన్న సూచన ఉంది.) ఈ పునరావర్తనజీవితాలకు మనిషి ఏ మనస్థితిని సిద్ధం చేసుకోవలె? ఇదొక విధమైన విధి. ఇంతవరకు తాను తిరస్కరించిన  విధిని ( “దేవుడు మరణించాడు”) నీచ ఎలా తిరిగి ఆమోదిస్తాడు? ఈ కాలావర్తనరూపమైన విధిని కూడా నీచ స్వేచ్ఛావర్తనానికి మాధ్యమంగా మనిషి మార్చుకోవలె అంటాడు.నిజానికి అతని స్వేచ్ఛ అప్పుడే నిజమైన స్వేచ్ఛ.

“ ఏది అనివార్యమో దానిలో అధికాధికమైన అందం చూడగలగడం నేర్చుకోవలె.అప్పుడు నేను జీవితాన్ని అందంగా మలచినవాణ్ణవుతాను.విధిని ప్రేమించు:(amor fati )ఇకపై అది నా ప్రేమ.” (GS.Book Four) 

పేకాటలో నీకు పంచిన ముక్కలతో ఆడడమే నైపుణ్యం. నీకు కావలసి ముక్కలు నీవు పంచుకుని నీ ఆట నీవు ఆడుకోడంలో అందమేముంది? 

సాధారణంగా యీ కాలచక్రము పునరావర్తనము చర్చించే సందర్భంలో GS Aphorism 341 మాత్రమే చూస్తారు. దానికిముందు Aphorism 340 కూడా చూచినప్పుడుగాని దాని పూర్తి తత్త్వం అర్థంకాదు.దాన్ని చూద్దాం: 

“చనిపోతున్న  సోక్రటీస్: 

సోక్రటీస్ ధైర్యాన్ని వివేకాన్ని నేను మెచ్చుకుంటాను, ఆయన  చేసిన ప్రతిదీ చెప్పిన ప్రతిదీ- చెప్పనిదీ కూడా . ఎగతాళి చేస్తూ ఎలుకలు పట్టే యీ  ఏథెన్స్ రసికరాక్షసుడు, పెంకికుర్రాళ్ళను వణికించి కన్నీళ్ళు కార్పించిన సోక్రటీస్, అతివివేకవంతుడైన వాగుడుకాయ.కాని అతడి మౌనంలోనూ అంతే గొప్ప. నాకనిపిస్తుంది, ఆయన తన చివరి క్షణాలలో మౌనంగా ఉండవలసింది, అని—బహుశా అప్పుడు ఆయన యింకా గొప్పమేధావుల జాబితాలోకి చేరిపోయేవాడు. మృత్యువో, విషమో, సాధుత్వమో, దుర్మార్గమో- ఏదో కాని, ఆ క్షణంలో అతని నోరు మూసుకోనివ్వలేదు.అన్నాడు: “క్రీటో! ఏస్లీపియస్ కు నేనొక కోడిపుంజును ఋణపడి ఉన్నాను.”చెవులున్నవాడికెవడికైనా యీ మాటకు అర్థం, “ జీవితం ఒక దీర్ఘవ్యాధి”, అని.అవునా! జీవితమంతా  చిరునవ్వుతో గడిపినవాడు, యోధుడిలా అనిపించినవాడు—ఒక నిరాశావాదా ! జీవితమంతా తన నిజమైన ప్రగాఢవిశ్వాసాన్ని తుది తీర్పును కప్పిపుచ్చి, ఒక సాధువైఖరి ప్రదర్శించాడా! సోక్రటీస్, సోక్రటీస్ జీవితాన్ని సహించాడు! అతడు కూడా జీవితంపై పగ తీర్చుకున్నాడు—ఆ ముసుగేసుకున్న, భయంకరమైన,పవిత్రమైన, దైవదూషణయుతమైన, వాక్యంతో! సోక్రటీస్ కు కూడా పగ అవసరమా! అతని అపారమైన సద్గుణంలో , అణువంత ఔదార్యం లేకపోయిందా? హా! నా మిత్రులారా! మనం గ్రీకులను కూడా దాటి వెళ్లాలి!(GS: Aphorism 340) 

ఈ నీచ వచనం (340 ) అతడి GS లో  చివరినుండి మూడవది.అంటే సాధారణంగా “కాలచక్రం” లేక “ శాశ్వతపునరావర్తనం” ( Eternal Recurrence) కు ప్రధాన ఆధారంగా గ్రహించే 341 కి ముందుది. ఈ ముందు వచనంలో విషయం వేరు, యిందులో విషయం సోక్రటీస్ చివరిక్షణాలు. దీని తరువాతి వచనంలో విషయంతో సంబంధించనిది అనుకుంటాం. నీచ ఉద్దేశించింది వేరు. “ శాశ్వతపునరావర్తనం” ( Eternal Recurrence) తో గ్రంథం ముగిస్తూ, దాని ముందు వచనంలో సోక్రటీస్ మరణప్రసక్తి (Plato’s Phaedo) ఊరకే చేయడంలేదు.శాశ్వతపునరావర్తనంలో ప్రధానాంశాన్ని ప్రస్తావన చేస్తున్నాడు.ఏమిటా ప్రధానాంశం? జీవితం ఒక దీర్ఘవ్యాధి కాదు. అది మళ్ళీ మళ్ళీ  మలేరియాలా తిరిగి వస్తుందని వణికిపోరాదు. ఈ జీవితం బలి యివ్వవలసిన కోడి కాదు . ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకోవాలి.కష్టము సుఖము కలిసివస్తాయి. ధైర్యంతో ఉత్సాహంతో బతకాలి. బతుకును ప్రతి ఆవర్తనంలో అంతకంతకూ మెరుగుపరచుకోవాలి. అలా మెరుగుపరచుకోడానకి అవకాశంగా కాలచక్రతత్త్వాన్ని దర్శించాలి.

“ నేననుకుంటాను, ఏరాత్రి మనిషి కలలు లేని గాఢనిద్ర పోతాడో, తక్కిన పగలు రాత్రులు అన్నీ దాని పక్కనే ఉంచి పోల్చి చూస్తే, ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు ఆ రాత్రి కంటే ఎక్కువ ఆనందంగా ఉండినవి?”( సోక్రటీస్) 

సోక్రటీస్ యిక్కడ స్పష్టంగా వేదాంతపరిభాషలో సుషుప్తిని ప్రస్తావిస్తున్నాడు. (“యత్రసుప్తో న కంచన కామం కామయతే, న కంచన స్వప్నం పశ్యతి తత్‌ సుషుప్తం, సుషుప్తస్థాన ఏకీభూత: ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో హి ఆనందభుక్‌ …”.మాండూక్యోపనిషత్తు.) కలలు లేని నిద్ర ఆనందమయం. బ్రహ్మానందం కాదు కాని,  ఆనందమయం. (ఇక్కడి ‘మయట్’ ప్రత్యయం, ఆనందాన్ని ఆనందమయతను వేరుచేసి చెబుతోంది.) 

సోక్రటీస్ వర్ణిస్తున్న సుషుప్తి ప్రసక్తి ప్రయోజనమేమిటి? ప్లేటో వర్ణనలో, సోక్రటీస్ ఆత్మ , జీవితమనే యీ దీర్ఘవ్యాధినుండి కోలుకొనడమే కాదు, యీ బతుకు ఒక పీడకల, కలలు లేని నిద్ర కావలె అన్న భావం ఉంది. సోక్రటీస్ (ప్లేటో నోట) యీ చివరి మాటను జారతూస్ట్ర మాటతో పోల్చడం నీచ ఉద్దేశం.జారతూస్ట్ర ఏమంటున్నాడు? 

[Thus Spake Zarathustra నుండి]:

“ఊహాదర్శనం, చిక్కుముడి” (On the Vision and the Riddle):


“నా దయ్యం, నా పరమశత్రువు, సగం మరుగుజ్జు, గూఢచారి, ... కరిగిన సీసంలాంటి మాటలు నా చెవిలో వంచుతూ అన్నాడు, ఒక్కొక అక్షరాన్ని తిరస్కారంతో నింపుతూ: 

ఓ ! జారతూస్ట్ర ! తెలివిగల రాయి ! నిన్ను నీవు పైకి ఎగరేసుకున్నావు.కాని, పైకి ఎగరేసిన ప్రతి రాయి కింద పడితీరాలి! 
ఓ ! జారతూస్ట్ర ! ...నీకు నీవే విధించుకున్న శిక్ష, నీపై నీవు  రాళ్ళు విసిరే శిక్ష! 
ఓ ! జారతూస్ట్ర ! నీవు విసిరావు రాయి.అది వెనక్కు వచ్చి నీ మీద పడుతుంది ! “

మరుగుజ్జు మౌనంగా ఉండిపోయాడు.ఆ మౌనం చాలాకాలం సాగింది.కాని అతని మౌనం నాకు దుస్సహహమైంది….ఎక్కాను, ఎక్కాను, కలగన్నాను, ఆలోచించాను—కాని ప్రతిదీ దుస్సహమైంది.
కాని ధైర్యమంటారే, అది ఉంది నాలో. పిరికితనాన్ని ఎప్పటికప్పుడు కోసేస్తుంటాను.చివరకు ఆ ధైర్యంతోనే లేచి నిలబడ్డాను: “ఒరేయ్ , మరుగుజ్జోడా ! నీవో ,నేనో !” అన్నాను….ధైర్యం దేన్నైనా హతమార్చగలదు, దయను కూడా. ...చావును కూడా చంపేస్తుంది ధైర్యం. అంటుంది: “అదా జీవితం? సరే రానీ ! మరోసారి!” 

ఆ మాటలో భేరీమోత వినిపిస్తుంది.”

“నేనన్నాను: “ మరుగుజ్జూ! ఆపు! నీవో- నేనో! కాని యిద్దరిలో నా బలం ఎక్కువ. నా అగాధంలో ఆలోచన నీకు తెలియదు! అది— నీవు భరించలేవు!...ఈ ముఖద్వారం చూడు! దీనికి రెండు ముఖాలు.రెండు దారులు కలుస్తాయి యిక్కడ; వీటి చివరవరకు. ఎవడూ నడవలేదు యింతవరకు.ఈ పొడుగు వెనుకదారి: యిది ఒక శాశ్వతకాలం పడుతుంది.ఆ ముందు దారి: అది మరో శాశ్వతకాలం.అవి ఒకదానికొకటి విరుద్ధం—కాని అవి కలిసేది యిక్కడ.ఈ ముఖద్వారం పేరు దాని పైన రాసి ఉంది: ‘క్షణం.’
కాని ఎవడు కాని యీ రెంటిలో ఏదారినైనా యింకా ముందుకు ముందుకు చివరివరకు నడిస్తే — యీ దారులు శాశ్వతంగా ఒకదానికొకటి విరుద్ధమని నీకు తెలుసా మరుగుజ్జూ? 
“ తిన్ననిది ప్రతిదీ అబద్ధం,”, సణిగాడు మరుగుజ్జు తిరస్కారపూర్వకంగా. “ నిజం ఎప్పుడూ వక్రం, కాలమే చక్రం.”

***
వివరణ:

-“నా దయ్యం, నా పరమశత్రువు, సగం మరుగుజ్జు, గూఢచారి, ..”

ఎవడీ మరుగుజ్జు? నా లోపలి దయ్యం.నా అంతరాంతరాలలో దాగిన భయాలు బలహీనతలు రహస్యంగా గమనిస్తూ ఉండే “గూఢచారి”.”నా పరమశత్రువు”,నా రహస్యాలు గమనించే వాడికంటే నాకు శత్రువు ఎవడుంటాడు? వాడి రూపం? నా భయాలు బలహీనతలు గమనించేవాడు నిర్భయుడు బలవంతుడు ఎలా అవుతాడు? వాడు నా లోపల కూర్చునే పిరికిమందు నూరుతుంటాడు.వాడు పిరికివాడు, మరుగుజ్జు. “వస్తే రానీ, కష్టాల్ నష్టాల్”,అనలేడు. అననివ్వడు.ఈ మరుగుజ్జుతో పోరాటం, “ నీవో, నేనో!” 

-“అదా జీవితం? సరే రానీ ! మరోసారి!” ఈ మరుగుజ్జు జీవితాన్ని గురించి భయంకరమైన చిత్రం గీస్తుంది. బతుకు భయం అంటుంది.జారతూస్ట్ర ఆ భయాన్ని తిరస్కరిస్తాడు. “రానీ ! మరోసారి!”అది ఎంత భయంకరమైనదైనా సరే, రానీ. ఎన్ని సార్లైనా రానీ, బతికేస్తానంటాడు.సోక్రటీస్ లా తనకు బతుకు ఒక జ్వరం కాదు, దీర్ఘవ్యాధి కాదు.పీడకల కాదు. ఈ జీవితం తిరిగి రాకూడదని కోరుకోడు జారతూస్ట్ర. 

-రెండు దారులు, ఒక ద్వారము : రెండుదారులు చెబుతున్నాడు.ధూమమార్గము,  జ్యోతిర్మార్గము కావవి. ఆనాకమో ఆనరకమో తీసుకెళ్లే దారులు కూడా కావు. ఒకటి సముల్లాసజీవనమార్గము (Dionysian), మరొకటి పునరావృత్తిరహితశాశ్వతసాయుజ్యం కోరిన క్లేశపూరితమార్గం (Apollonian). పైకి విసిరిన రాయి నీ నెత్తిమీద వచ్చి పడ్డట్టు,అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించినట్టు, నీ బతుకు తిరిగి నీ వద్దకే వస్తుంది, మళ్ళీ మళ్ళీ.( Eternal Recurrence)

ఏ దారిన నడిచినా తిరిగి చేరేది ‘ యీ ముఖద్వారమే.’ వృత్తంలో ఎటు నడిచినా తిరిగి ఒకే బిందువును చేరుతాం.వర్తులమార్గంలోనూ అంతే, ఎటు నడిచినా చేరేది ఒకే ద్వారంవద్దకు.నీవనుకున్న జ్ఞానమార్గంలో (Apollonian) నడిచినా, నేను చెబుతున్న ఆనందమార్గంలో (Dionysian) నడిచినా, తిరిగి నీవు వచ్చేది యీ లోకానికే, యీ ‘ముఖద్వారం’ వద్దకే. మరో లోకం లేదు. 

-“ తిన్ననిది ప్రతిదీ అబద్ధం,”, సణిగాడు మరుగుజ్జు తిరస్కారపూర్వకంగా. “ నిజం ఎప్పుడూ వక్రం, కాలమే చక్రం.”

నీచ ప్రతి వచనము “ వక్రం” . అవునన్న ప్రతిదీ కాదనడం అతని ఆలోచనావిధానం.ఇక్కడ “తిన్ననిది ప్రతిదీ అబద్ధం”,అంటే సాధారణప్రవచనంగా, దీని అర్థం, లోకం నమ్మే నిజాలన్నీ అబద్ధాలని. (Contrarian) తన ‘వక్రప్రవచనాలు’ నిజమైన నిజాలు.కాని ప్రస్తుతసందర్భంలో యీ “తిన్నని”కి అర్థం సూటిగా. కాలం సరళరేఖలా సాగదు. అది వలయంలా తిరుగుతుంది, “కాలమే చక్రం.”

వెనుక మనం చూచినట్టు, కాలచక్రగతి కొన్ని సంస్కృతులలో సామాన్యవిశ్వాసం. క్రైస్తవవిశ్వాసంకాదు. విజ్ఞానశాస్త్రవిశ్వాసమూ కాదు. నీచకు కూడా యిది “విశ్వాసమే”. అన్ని విశ్వాసాలను విధ్వంసం చేసే నీచ దీనిని విశ్వసించడం వింతగా అనిపిస్తుంది. ఇది అతనికి కలిగిన ఒక అనుభూతి ఆధారంగా ఏర్పడింది.ఆలోచనాఫలం కాదు.  కాలమనేది ఉందా? కాలం ఎప్పుడు మొదలైంది? నీచ కాలాన్ని చూచాడా? అతడికి కాలచక్రదర్శనం అయిందా? ఈ ప్రశ్నలు మనం అడగవలసినవి కావు.నల్లబొక్కలు (Black Holes), కాళశక్తి (Dark Energy), Big Bang,పరిశోధించేవారు (Hubble Space Research Station) అడగవలసినవి. కావ్యచర్చలో యీ ప్రశ్నలు అప్రస్తుతం.


****
పునరావర్తనం అంటే  ఉన్నచోటనే గానుగెద్దులా తిరగడం  కాదు, ఊర్ధ్వముఖమై సుడిలా ఎగరడం,  ఎదగడం (spiral movement) . నీచలో స్వవచోవ్యాఘాతమనిపించిన ప్రతి సందర్భంలోను, మనిషి జీవితలక్ష్యం తనను తాను అధిగమించడమే  అన్న దృష్టితో సమన్వయం చేసుకోవలె. అతిమానవత (Ubermensch ), ఉత్సాహం (Dionysian ) , బలం ( will to power) , కాలావర్తనం,—అన్నిటిని  అదే దృష్టితో చూడవలె. “నిన్ను నీవు అధిగమించడానికి నీవేం చేశావు”, అని నీచ మనిషిని అడిగే ఏకైక ప్రశ్న. ఆ ఆత్మోద్ధరణకై ఏమైనా చెయ్, అంటాడు. ఏది చేసినా సమ్మతమే. ఏమేమి చేయగలవో   చెప్పేదే , అతని ప్రతి పదము. 

“అతిశాయి! —నీవు యిక ఎంతమాత్రము ప్రార్థన చేయవు, ఎంతమాత్రము అర్చించవు, ఎంతమాత్రము అంతులేని శ్రద్ధయందు విశ్రమించవు.ఏదో ఒక పరమప్రజ్ఞానంముందు నిశ్చలంగా నిలిచి, నీ జ్ఞానాన్ని బలి యివ్వవు.నీ ఏడు ఏకాంతాలలో ఏ తోడూ  కోరవు.గుండెలో అగ్నిని దాచి, ఒంటిని మంచుతో కప్పే కొండలా ఉండవు. నిన్ను ఓదార్చేవాడుండడు.నిన్ను చివరగా సరిదిద్ది పరిపూర్ణుణ్ణి చేసేవాడుండడు. ఏది జరిగినా దానితో కారణం ఉండదు, జరగబోయేదానిలో ప్రేమ ఉండదు. అలసిన నీ ఎదకు సేదదీర్చుకునే చోటుండదు. ఆర్జించవలసిందే తప్ప అర్థించగలిగింది ఉండదు.ఏవిధమైన పరమప్రశాంతికి నీవు విముఖుడవు.యుద్ధము శాంతి నిరంతరం ఆవర్తనం అవ్వాలని నీవు కోరుతావు.సన్యాసీ! యివన్నీ నీవు సన్యసించగలవా? నీకు అంతటి శక్తిని యిచ్చేవాడెవడు? అంత శక్తి కలిగినవాడెవ్వడూ యింతవరకు లేడు.”-ఒక సరసుంది.ఒకరోజు అది “నేను ప్రవహించను”,అని ఆనకట్ట కట్టుకుంది.అప్పటినుండి ఆ సరస్సు అంతకంతకూ పెరిగింది.బహుశా త్యాగమే త్యాగాన్ని భరించగలిగిన శక్తినిస్తుందేమో! మనిషి దేవుని వైపు ప్రవహించకుంటే, బహుశా దానిలానే  యింకా యింకా ఎదుగుతాడేమో?”(GS:285.)

                                                       ***
ఈ ఎదగడం నీచ ప్రవచనాలలో నిరంతరవిషయం.

“ఇంతవరకు అన్ని ప్రాణులు వాటి దశను దాటి వెళ్ళాయి. మీరేం చేశారు, మనిషిని దాటి వెళ్ళడానికి? “(Z.Pr.2)

   “ఈ మనిషిజాతి మొండి జాతి. ఎంతకూ అంతమయేది కాదు. చివరి మనిషి బొద్దింకలా చిరాయువు.”( Z: Pr. 5)   
     
ఈ భూమిపై సమస్తప్రాణులు అంతరించిన తరువాతకూడా మిగిలి ఉండే ప్రాణి బొద్దింక. బొద్దింకలా చిరకాలం యీ భూమిపై తిరుగుతూ ఉంటావా? మనిషిగా ఎదుగుతావా? కాలం వలయంలా తిరుగుతూ నా జీవితాన్ని తిరిగి తిరిగి నా దగ్గరకే తెస్తుంది అన్న భావంలో ముఖ్యాంశం ఏమిటంటే, నీవు జీవితాన్ని ప్రేమిస్తున్నావా? లేక నీకు బతుకు భయమా? ఇది తేల్చుకోడానికి యిది ఒక నిదానసాధనం ( diagnostic tool). బతకడం చేతనైనవాడివైతే, జారుడుమంచుకొండకొనపై  నృత్యం చేయగల నేర్పరివైతే, యీ జీవితం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటావు.అప్పుడు కాలచక్రం పరిభ్రమద్గ్రహసంగీతం. పాడినపాటే అయినా నిత్యనూతనస్వరకల్పన.

ఇంతకూ  నీచ సందేశం ఏమిటి? 
దేవుని అకాలమరణంతో లోకంలో శూన్యనైరాశ్యం (nihilism) ఏర్పడింది.ఆ శూన్యాన్ని నింపి నైరాశ్యాన్ని తొలగించాలంటే, మనిషి దేవుడు కావలె.( “మనమే దేవతలు కావద్దా?””పిచ్చివాడు”) ఇక మన ఆశ అతిమానవుడిపై.(“దేవతలందరూ చచ్చిపోయారు: ఇకపై మనం అతిమానవుడు జీవించాలని కోరుకుందాం.” : “On the gift-giving virtue” ) 
తండ్రికి అంత్యక్రియలు జరిపి, కొడుకు తండ్రి స్థానం పూరించాలి.(“పితావై పుత్రనామాసి”.) మనిషి దేవుడి స్థానం పూరించాలి.

ఈ కాలచక్రభావన యిచ్చాశక్తితో లేక సంకల్పబలంతో   (will to power) సంబంధించింది.సంకల్పబలం మానవుడిని అతిమానవుడుగా చేస్తుంది. అది బంధనాలను బద్దలుచేసి మనిషిని ముక్తుణ్ణి చేస్తుంది.

అతిమానవమార్గంలో  అతిపెద్ద బంధనమేది? ప్రతీకారవాంఛ.ప్రతీకారం గతస్మృతులనుండి కలుగుతుంది.

“జరిగిపోయినదాని విషయంలో నిస్సహాయుడై, గడచినదానిపట్ల ఉద్విగ్నసాక్షి అతడు.సంకల్పం వెనక్కు సంకల్పించలేదు.” (“Cannot will back wards”.On Redemption II.20).

“సమానత్వం ప్రబోధించేవారందరి ఆత్మలలో ప్రతీకారం తిష్ఠవేసుకుని ఉంటుంది.”(On the Tarantulas II.7)

గతం గతః.దానికి న్యాయం చేయలేవు.  దాన్ని విడిపించలేవు. భవిష్యత్తును మాత్రమే విడిపించగలవు. కనుక సంకల్పబలాన్ని గతం నుండి భవిష్యత్తుకు తిప్పవలె. ఆ భవిష్యత్తును బంధనాలనుండి విడిపించడమే అతిమానవుడి ధ్యేయం.ఇది ఎప్పుడు సాధ్యం? భవిష్యత్ దర్శనంలో. ఆ దర్శనం కాలచక్రగతివలననే సాధ్యం. గతం పునరాగతమౌతుంది. అప్పుడు మనిషి సంకల్పబలంతో  అతిమానవుడిగా స్పందిస్తాడు. అపుడది జరిగిపోయిన అన్యాయానికి ప్రతీకారం కాదు. ప్రతీకారవాంఛనుండి ముక్తుడైనవాడే నిజమైన ముక్తుడు. వాడే అతిమానవుడు.

“ ప్రతీకారబుద్ధినుండి ముక్తి- అది అత్యుత్తమ ఆశయానికి వంతెన, ఝంఝావర్షాంతాన యింద్రధనుసులా.”  (On the Tarantulas II.7). 

అతిమానవుడి ఆవిర్భావానికి అడ్డుగా ఉన్న.  ప్రతీకారవాంఛనుండి మనిషి ఎలా ముక్తుడౌతాడు? 

“వర్తమానం, గతం—అయ్యో, మిత్రలారా, అది నాకు అత్యంతము దుర్భరమైనది: రాబోయేది తెలుసుకోలేకపోతే , ఎలా బతకగలనో తెలియదు. ఒక ద్రష్ట , ఒక స్రష్ట , సంకల్పించగలవాడు, - అతడు భవిష్యత్తు, భవిష్యత్తుకు వారధి.” (On Redemption II.20).

భవిష్యత్ ద్రష్ట అయినపుడే,అపుడు మాత్రమే,  ద్రష్ట తన సంకల్పబలంతో స్రష్టకూడా కాగలుగుతాడు.

కనుక యీ “శాశ్వతకాలపునరావర్తనం” (Eternal Recurrence) కూడా అతిమానవుడి ఆవిర్భావంలో అంతర్భవించిన భావమే. 

అయితే, యిక్కడ ఒక ప్రశ్న. ఈశ్వరుణ్ణి  కాదని, ప్రకృతిని పట్టుకుంటున్నాడా నీచ ? అలాగే అనిపిస్తుంది.అతడికి కాలం ఒక మహారాక్షసశక్తిగా దర్శనమిస్తుంది. 

                                                  ***


మనిషి ఎప్పుడో మరచిపోయిన దేవుణ్ణి నీచ గుర్తుచేశాడు.  మనిషి దైవాన్ని మరచిన విషయం మరచి, భౌతికమైనఅవసరాలతో భౌతికజీవితం గడుపుతున్నాడు. అది గుర్తు చేశాడు నీచ.ఆస్తికులు నాస్తికులు ఒకే బతుకు బతుకుతున్నారు. నిజంగా నాస్తికుడవైతే నిరీశ్వరుడవై, నిన్ను యీశనం చేశావాడు లేడన్నట్లు, బతుకు.( “ న పుణ్యం న పాపం”. “Beyond Good and Evil” ). కష్టాల్ నష్టాల్ రానీ , అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి అని బతుకు. ఈ సృష్టిలో ఏది జరిగినా నిందించడానికి నీవు తప్ప, మనిషి కాక, మరొకడు లేడు. లేదు,  ఆస్తికుడవా? మంచి చెడు అన్నీ నీవు నమ్మిన యీశ్వరుడికి వదిలేయ్. దేవుడున్నాడని నిశ్చింతగా ఆనందతాండవం చేయ్. అంతేకాని, రెంటినీ కలిపి, జీవితాన్ని కల్తీ చేయకు.ఇది నీచ ప్రవచనాలనుండి మనం గ్రహించవలసింది.

కాలం స్వేచ్చగా తిరిగే చక్రం,"self-willed wheel."జడప్రకృతి కాదు. 

                                              ***

ఈ కాలచక్రభావం అస్తిత్వవాదులలో  కామ్యూను ఎక్కువగా ప్రభావితం చేసింది (Albert Camus: “The Myth of Sisyphus.” ) ( కామ్యూ తనపై  అస్తిత్వవాదముద్రను అంగీకరించకపోవడం వేరే విషయం. ఆ మాటకొస్తే, యీనాడు అస్తిత్వవాదులని మనం అంటున్న ఎవరూ యీ ముద్రను ఒప్పుకోలేదు, చివరకు సార్త్ర్ కూడా. అతడు చివర  తాను మార్క్సిస్టునన్నాడు.) ఎవరేమన్నా అస్తిత్వవాదంలో మనిషి ముఖ్యం, మట్టి ముఖ్యం. స్వర్గం యిదే నరకం యిదే .మనిషే రాక్షసుడైనా దేవుడైనా. ఎదగడానికి మనిషి తొందర పడడంలేదనేది,  ఏమీ చేయడంలేదనేది నీచ ఆవేదన, ఆక్రోశం.

                                              ***

     












1 comment:

  1. అద్భుతం గురువు గారూ! మీరు నీచ...అని రాస్తూ వుంటారు.. నీషే... అంటే మన "నీచ"(మైన) అని పొరబడే వీలుండదు కదా.

    ReplyDelete