Sunday, June 30, 2019

అస్తిత్వవాదసాహిత్యం-2


 అస్తిత్వవాదసాహిత్యం: కీర్క్ గార్డ్ నుండి కామ్యూ వరకు-2                                                  

2.కీర్క్ గార్డ్
 (1813-1855) Soren Aabaye Kierkegaard (/ˈsɒrən ˈkɪərkəɡɑːrd/. (Denmark).

(డోస్టోవ్ స్కీ నవల “నోట్స్”(Notes from the Underground) అస్తిత్వవాదుల ఆదికావ్యమైనా, కీర్క్ గార్డ్ ఆ వాదానికి ఆదికవి అని చెప్పవచ్చు.)

ఇరవయ్యో శతాబ్దంలోని ప్రధాన తత్త్వసిద్ధాంతాలకు,సాహిత్యధోరణులకు కీర్క్ గార్డ్ రచనలు ప్రేరణ. ఈ నాడు అతడొక యుగకర్త. ఈనాటి “అరాచకసాహిత్యానికి రాచబాట” వేసినవాడు అని కూడా అనవచ్చు. డోస్టోవ్ స్కీ , కాఫ్కా, కామ్యూ, గార్సియా- యీ సాహిత్యపరంపరకు అతడు ఆద్యుడు.(డోస్టోవ్ స్కీ , కీర్క్ గార్డ్ తత్త్వంలోను సాహిత్యంలోను, కవలలని  చెప్పవచ్చు.విషయంలో సామ్యం మాత్రమే కాదు, అంతకంటే ఆశ్చర్యం విధానంలోనూ, సామ్యం ఉండడం.) కీర్క్ గార్డ్ తన రచనలకు యింత ప్రాచుర్యము ప్రాముఖ్యము కలుగుతాయని అనుకోలేదు. తను రాసిన మొదటి గ్రంథం “Either/Or” ఎవడూ చివరివరకు చదవడని కూడా  ఆయనే అన్నాడు. కాని తన రచనలలో  “Fear and Trembling” ఒక్కటీ  తప్పక నిలుస్తుందనే నమ్మాడు, అందులోని భయము, కరుణ (“frightful pathos”) కారణాలుగ. కీర్క్ గార్డ్ తాను తత్వవేత్తనుకానని కచ్చితంగా చెప్పుకున్నాడు.అతని రచనలలో ప్రధానంగా  కనిపించేది క్రైస్తవధర్మం పట్ల ఆర్తి. తాను కవినని, కాని అంతకంటే ముందే ధర్మం తనను సొంతం చేసుకున్నదని అంటాడు. (“I am a poet.But I was made for religion long before I became a poet.”) కనుక  దీన్ని  కావ్యంలానే చదవాలి, తత్త్వగ్రంథంగా కాదు.డోస్టోవ్ స్కీ నవలలు, ముఖ్యంగా “కరమజోవ్ సోదరులు”, వాటిలో ఎంత తాత్త్విక చర్చలున్నా, నవలలుగానే చదువుతాం. అలాగే కీర్క్ గార్డ్o

                                                       *****













-ప్రవేశిక

ఛాందసపు శాస్త్రులు-చాదస్తపు పెళ్ళాం
(హెచ్చరిక: ఇవి కథలు. నిజాలు కావు. వీటిని అనుకరించడం చట్టవ్యతిరేకము.శిక్షార్హము.)

పురాణం శాస్త్రులుగారి భార్య అప్పుడే టివి కట్టేసింది.ఆమె కళ్ళు యింకా తడిగానే ఉన్నాయి.భర్త వచ్చేలోపల వంట చేయాలి. పైగా యీవేళ ఆయనతో  మరో యిద్దరు వస్తారట భోజనానికి.ఆనాడు ఆమె భర్త ప్రవచనం భక్త శిరియాళుడి కథ.  టివిలో కొన్నివేలమంది విని ఉంటారు. ప్రత్యక్షంగా విన్నవారు సరే, పరవశులై విన్నారు. కథ చెబుతూ ఆమె భర్త అతి కష్టంమీద కన్నీళ్ళాపుకున్నాడు.విన్నవారు కారుస్తూనే ఉండిపోయారు. కొందరు చేతులు పైకెత్తి ఆహాకారాలు చేశారు.ఆమె వంటగదిలోకెళ్ళి స్టౌ వెలిగించి, ఏం వంట చేయాలి అని ఆలోచించింది. కత్తి కళ్ళకద్దుకొని పైకెత్తింది.కత్తి దిగబోతోంది.ఇంట్లోకి వస్తున్న  భర్త వాకిట్లో  గావుకేక, “ ఏమైందే నీకు? ఏం చేస్తున్నావ్?పిచ్చెక్కిందా?”, అంటూ ఒక్క దూకులో వచ్చి ఆమె చేతిని పట్టుకొని, కత్తికింద ఉన్న పసివాడిని యివతలకు తీసుకున్నాడు.ఆవిడ, ఆయనతో వచ్చిన అతిథులవైపు చూసి, “ వీరేనా యీవేళ భోజనానికి వస్తారని చెప్పారు?”, అంటూ భర్తతో  వచ్చిన వారికి నమస్కారం చేసింది. శాస్త్రులు తల పట్టుకొని కూర్చున్నాడు.ప్రవచనం మధ్యలో పుచ్చుకొన్న మిరియాలపాలు గొంతులోకి వచ్చాయి.
   
ఈ పురాణశాస్త్రుల కథ యింతకు ముందొకసారి విన్నాం. ఆ రోజుకూడా ఆయన భార్యను కోప్పడ్డాడు, “ఉల్లిపాయలు తినవద్దని చెప్పింది లోకానికే! మనకు కాదు.ఉల్లిపాయ లేని తోటకూరపప్పేమిటి?” అప్పుడు ఆయన మాటకు నవ్వుకొన్నాం, “చెప్పడానికే నీతులు”, అని. మరి యిప్పుడు? శాస్త్రిగారు తప్పా, ఆయన భార్య తప్పా?
         
 ( ఈ కథ రాసినవాడు ఏదో వదిలేసినట్టున్నాడు.కథనంలో ఏదో లోపంలా ఉంది.)

షిరిడీ సాయి గురించి ఒక కథ.ఒకసారి మసీదుకు ఎవరో ఒక మేకను తీసుకొచ్చారు.అది కొన ఊపిరితో ఉంది. సాయి దాన్ని బలి యివ్వమన్నాడు.సాయి ఆదరించే బడేబాబా ఆయన పక్కనే ఉన్నాడు.అయినా మేకను చంపడానికి యిష్టపడలేదు.ఎలాగూ యిప్పుడో యింకాసేపటికో  దాని ప్రాణం పోతుంది. అనవసరంగా ఎందుకు చంపడం అనుకున్నాడు. మరొకాయన  పక్కయింటికెళ్ళి కత్తి తెచ్చాడు. కాని చంపలేదు. దీక్షిత్ వైపు చూశాడు  బాబా. దీక్షిత్ సద్బ్రాహ్మణుడు. ఏనాడు ఏ ప్రాణికి  చిన్న కష్టం కలిగించినవాడు కాడు. పంచె పైకి దోపుకొని, కత్తి తీసుకున్నాడు. మేక మెడమీదికి ఎత్తాడు. వేటువేసేలోపల, సాయి, “ఆగు! బ్రాహ్మణుడవైయుండి మేకను చంపుతావా?వద్దు”, అన్నాడు. దీక్షిత్, “బాబా, నాకు ఏ విధినిషేధాలు లేవు.నీ మాట నాకు వేదం”, అన్నాడు.
       
 ( ఈ కథ రాసినాయనకూడా ఏదో కాని, వదిలేశాడు.కథలో ఏదో కొరవ.)

కాళీపట్నం రామారావు కథ “యజ్ఞం” లో తన కొడుకు బానిసగా బతకడం యిష్టంలేని అప్పలరాముడి కొడుకు యింటికి పరుగెత్తికెళ్ళి తన కొడుకును రెండుగా  నరికి గోనెసంచిలో వేసి తెచ్చి పంచాయితీ సభ్యుల ముందు సంచి విదిలించాడు.పిల్లవాడి తల, మొండెము రెండుగా కింద పడ్డాయి. సభలో హాహా కారాలు!
         
 (ఈ కథలో కూడా ఏదో లోపించిందా? )

గ్రీకు పురాణకథలో ఆగమెమ్నాన్ తన కూతురు ఇఫిజీనియాను బలి యిచ్చిన కథ ఉంది. ఆగమెమ్నాన్ ఆర్టెమిస్ దేవత ఆగ్రహానికి గురి అయినాడు. ఆమెను శాంతపరచడానికి, తమ యుద్ధనౌకలకు అనుకూలపవనప్రాప్తికి, దేశక్షేమంకోరి  తన కూతురు ఇఫిజీనియాను ఆగమెమ్నాన్ బలి యిస్తాడు.

(ఈ కథ అనేకరూపాలలో వినపడుతుంది.కాని ఏ కథనంలోనూ  తండ్రి మథనం ప్రధానం కాదు.)

కురుక్షేత్రం మనకు తెలిసిన కథే. “వీళ్ళంతా నా వాళ్ళు, అన్నలు తమ్ములు. గుండెలమీద పెంచిన తాత.ధనుస్సు పట్టుకోడం నేర్పిన గురువు.వీళ్ళను చంపడమా! నా అవయవాలు పట్టు తప్పిపోతున్నాయి. నోట తడి ఆరిపోతిన్నది.ఒళ్ళు వణుకుతోంది.వెండ్రుకలు నిలబడుతున్నాయి. చర్మం కాలిపోతున్నది.తల తిరుగుతోంది.ధనుస్సు జారిపోతోంది”, అన్నాడు, అర్జునుడు.

ఈ కథచెప్పినాయనకు కథ చెప్పడం తెలిసినట్టే ఉంది- స్వేదము కంపము భ్రమ అన్నీ చెప్పాడు. వేదనకు, విషాదానికి ఒక యోగస్థాయి కల్పించాడు. ఈ విషాదమే ఆధ్యాత్మికంగా ఎదగడంలో మొదటి దశ.పైన చెప్పిన  కథలలో ఏదో లేదనుకున్నదీ యీ విషాదమే. చాదస్తపు పెళ్ళాం తన పసిబిడ్డను చంపడానికి కత్తి ఎత్తింది.అది చెబితే చాలా? అది మాత్రమే చెబితే, అది కథ మాత్రమే అవుతుంది. ఆమె కత్తి ఎత్తింది.ఎలా? ఆమె కళ్ళను నీరు కప్పేశాయి.(ఆమె కత్తితో  ఉల్లిపాయలు తరగడం లేదు.)  ఒళ్ళు వణుకుతోంది. చెమటలు కారుతున్నాయి. గుండె కొట్టుకోడం వినిపిస్తోంది, కనిపిస్తోంది. వణుకుతున్న చేతిని, మరో చేత్తో కదలకుండా పట్టుకుంది.కళ్ళు మూసుకుంది.ఆమె యీ మనస్స్థితిని చెప్పనపుడు,యిది వఠ్ఠి కథ. సాయిచరిత్రలో దీక్షిత్ కథ కూడా కథగానే మిగిలిపోతుంది. (“యజ్ఞం” లో కొడుకును చంపిన పాత్ర వేదన ప్రధానం కాదు.”తెలియ”వలసింది సీతారాముడు కాదు, పంచాయతీ సభ్యులు. )

జరిగిపోయిన ఒక ఘటనగురించి ఆలోచించడం వేరు. దాన్ని అనుభూతి పొంది  తెలియడం వేరు. వేదన,  విషాదం అనుభూతం కావలె. అనుభూతిలోనే ఏదైనా తెలుస్తుంది, ఆలోచనలో తెలియడం “తెలివి” కాదు. అనుభూతి, తెలివి  లేని బతుకునే ఎలియట్ , “like a patient etherized upon a table”, అంటాడు. బాధ తెలియకుండా మత్తుమందులతో బతుకు, బతుకుకాని బతుకు. వేదనలేని వేదం. “ఆత్మని  వేదనమ్”, “ఆత్మ  నివేదనమ్” అవుతుంది.
   
ఒక ఘటన,  కాలగమనంలో క్రమంగా వార్త అవుతుంది.వార్త  చరిత్ర అవుతుంది.చరిత్ర పురాణం అవుతుంది. కదిలించని కథగా మిగిలిపోతుంది. పురాణాన్ని ఎప్పటికప్పుడు “పురా నవం” చేసుకుని అనుభూతం చేసేది సాహిత్యం. ఏ యుగానికి ఆ యుగపురాణం సృష్టించగలవాడు కవి.
 పై కథలలోని వేదన, ఆత్మనివేదన వంటివి చెప్పే బైబిల్ కథ ఒకటి.

                                                 *****
































భయము కంపము ( Fear And Trembling)


అబ్రహాం వ్యథ

(అబ్పహాం  మూడు సంస్కృతులకు మూలపురుషుడు, ( యూదు, క్రైస్తవ, ఇస్లామ్). అబ్రహాం బిడ్డలు, ఇస్మైల్ , ఐజక్.)

యెహోవా  ఒక రోజు అబ్రహాంతో ‘నీ సంతతిని గొప్ప జాతిని చేస్తాను. వారు గొప్పవంశస్థాపకులై దేశాలేలుతారు. నీకు నేనొక దేశం చూపిస్తాను.నీవు నీ తండ్రిని నీ బంధువులను విడిచి  నేను చూపించే దేశానికి వెళ్ళు’, అన్నాడు. అబ్రహాం అలాగే, తండ్రిని ఉన్న ఊరును  వదిలి,  భార్య సారా (Sarah) తో  యెహోవా చూపిన స్థలానికి వెళ్ళిపోయాడు.అతడు సంపన్నుడైనాడు. రాజ్యమేలాడు. ఎంత సంపద ఉండి ఏం సంతోషం? సంతానం లేదు. అతనికి నూరేళ్ళు, అతని భార్యకు తొంభై ఏళ్ళు. అబ్రహాం భార్య సారా ,తన భర్తకు సంతానం కలగాలి అని, తన దాసి హాగర్ ( Hagar )  ను భర్తకు రెండవభార్యగా నియోగించింది. వారికి ఇస్మైల్  పుట్టాడు.కొడుకు కలుగగానే హాగర్ కు అభిమానం పెరిగి, సారాను చిన్నచూపు చూచింది. హాగర్ ను, ఆమె కొడుకును యింటినుండి వెళ్ళగొట్టమన్నది  సారా . తనకు యిష్టం లేకపోయినా అబ్రహాం ఆమె కోరినట్లే వాళ్ళను యింటినుండి పంపివేశాడు. యెహోవా  మరల కనిపించి, అబ్రహాంకు సారా వలన కొడుకు పుడతాడని వరమిచ్చాడు. అది విని తొంభై ఏళ్ళ సారా నవ్వింది. కాని యెహోవా  మాట ప్రకారం వారికి ఐజక్ పుట్టాడు.

                                                     ***

“భయము కంపము” (“Fear and Trembling”) :

[ కీర్క్ గార్డ్ (Kierkegaard:1813-1855) రాసిన “భయము కంపము” (“Fear and Trembling” : English tr. (of Danish original) by Alastair Hannay: Penguin) అనే పుస్తకంలో ప్రారంభభాగానికి నా స్వేచ్ఛానువాదం.]


“అనగనగా ఒక మనిషి తన చిన్నతనంలో బైబిల్ లోని అందమైన  అబ్రహాం కథను విన్నాడు, ఎలా భగవంతుడు అబ్రహాంను పరీక్షించిందీ, అబ్రహాం ఆ పరీక్షకు ఎలా నిలబడిందీ, ఎలా అబ్రహాం తన కొడుకును అనూహ్యమైన రీతిలో తిరిగి పొందిందీ.అతడు పెరిగి పెద్దయిన తరువాత ఆ కథను  మరింత మెచ్చుకునేవాడు. పెద్దవాడవుతున్నకొద్దీ అతడికి ఆ కథలో ఆసక్తి  బలమవుతూ వచ్చింది.కాని అవగాహన అంతకంతకూ తగ్గుతూవచ్చింది. చివరకు అతడు ఆ అబ్రహాంను  తప్ప  జీవితంలో తక్కినవాటినన్నిటినీ పక్కకు తోసేశాడు. ఒకే ఒక్క కోరిక అతన్ని ఆవహించింది.ఆ అబ్రహాంను, అతడానాడుండిన స్థితిని, మోరియా పర్వతంపై ఆ నాడు జరిగినదానిని ప్రత్యక్షంగా చూడగలిగి ఉంటే! అతడు చూడాలని కోరుకున్నది, ఆ అందమైన దేశాన్ని పర్వతాన్ని కాదు. ఒక తీర్థయాత్రలా  భౌగోళికపర్యాటనంలా  కాదు. తన ఒకే ఒక కొడుకు ఐజక్, పక్కన నడుస్తుండగా, అంతటి దుఃఖాన్ని మోస్తూ  అబ్రహాం మోరియాపర్వతానికి నడుస్తుండగా, వారిని చూస్తూ వారి వెనుక తను నడవాలని అతని కోరిక.అబ్రహాం దూరంనుండి తల ఎత్తి ఆ కొండను చూడడం, గాడిదలను పనిపిల్లలను కింద వదిలి, ఒంటరిగా ఐజక్ తో కొండపైకి ఎక్కడం, చూడవలె.కేవలం ఆ దృశ్యాన్ని ఊహించడం కాదు, ఆ భయము కంపము పొందాలి.
    అతడు మేధావికాదు.అతనికి విశ్వాసం చాలు. దాని కంటే ముందుకు వెళ్ళాలని కోరుకోడు.విశ్వాసజనకుడు (Father of Faith) అనిపించుకోడం కంటే లోకంలో  గొప్ప లేదు అనుకుంటాడు.దానికి మించి లోకంలో కోరదగినదేదీ లేదు, ఆ గొప్ప తనకు తప్ప మరెవరికీ తెలియకున్నా.
    అతడు పండితుడు భాష్యకారుడు కాడు.తత్త్వవేత్త కాడు.అతడికి హీబ్రూ భాష తెలియదు.తెలిసిఉంటే అబ్రహాం కథ యింకా సులభంగా అర్థమయేదేమో?

                                                          1

“భగవంతుడు అబ్రహాం నమ్మకాన్ని పరీక్షించదలచాడు.ఒకరోజు అతనితో, “ నీవు నీకు అత్యంత ప్రియమైన నీ  ఒక్కగానొక్క  కొడుకును మోరియకు తీసుకొని వెళ్ళు.అక్కడ నేను చెప్పిన కొండపై  నీ కొడుకును  నాకు బలిగా అగ్నిలో ఆహుతి  యివ్వు”, అన్నాడు.  
                                                                                              ( బైబిల్ ఆదికాండము.)


తెల్లవారుతూంది. అబ్రహాం వేళకు(1) లేచాడు.గాడిదలను సిద్ధం చేసి, గుడారం నుండి బయలుదేరాడు, ఐజక్ తో. భార్య సారా (Sarah) కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది,వాళ్ళు లోయ దిగి  వెళ్ళిపోయే వరకు. మూడు రోజులు ప్రయాణం చేశారు.మాట లేదు.నాలుగో రోజు ఉదయం.అప్పుడు కూడా అబ్రహాం ఒక్క  మాట లేదు.తలెత్తి దూరంగా కనిపిస్తున్న మోరియా కొండను చూశాడు. వెంట వచ్చిన పనిపిల్లలను కింద వదిలి, ఒక్కడే పైకి నడిచాడు,ఐజక్ ను తీసుకొని .అబ్రహాం అనుకున్నాడు,“ నేను ఐజక్ దగ్గర దాచను, యీ దారి అతన్ని ఎక్కడకు తీసుకెళుతుందో చెబుతాను.” నిశ్చలంగా నిలుచుని, ఐజక్ తలపై తన చేయి ఉంచాడు, ఆశీర్వదించడానికి. ఐజక్ ఆశీర్వాదం కోసం తల వంచాడు.అబ్రహాం ముఖంలో పితృవాత్సల్యము, చూపులో మార్దవము, మాటలో ఆశ్వాసము.కాని ఐజక్ కు అర్థం కాలేదు.అతని ఆత్మ ఉద్ధరింపబడలేదు. అతడు తండ్రి మోకాళ్ళకు  చుట్టుకొని ప్రార్థించాడు, తను పసివాడినని  సంతోషమయమైన జీవితాన్ని ఊహించుకున్నానని,  ప్రాణం తీయవద్దని. కుటుంబంలో ఉండిన ఆనందాన్ని గుర్తుచేశాడు. తరువాత  ఉండబోయే శూన్యము  శోకము చెప్పాడు. అబ్రహాం పిల్లవాణ్ణి లేవనెత్తి, అతని చేయిపట్టుకొని, అనునయిస్తూ, బోధచేస్తూ  అతనితో నడిచాడు. కాని ఐజక్ కు ఏమీ అర్థం కాలేదు.అబ్రహాం మోరియా కొండ ఎక్కాడు.అయినా ఐజక్ కు అర్థం కాలేదు.అబ్రహాం ఐజక్ నుండి ఒక్క క్షణం తల తిప్పుకున్నాడు. ఐజక్ మళ్ళీ  తండ్రి ముఖం చూచినప్పుడు,  ఆ ముఖం యింతవరకు తాను చూచింది కాదు.ఆ చూపులో  క్రౌర్యం.ముఖకవళికలో రౌద్రం. ఐజక్ ను పట్టి కిందకు పడదోసి, “మూర్ఖుడా! ఏమనుకొంటున్నావ్? నేను నీ తండ్రిననుకొంటున్నావా? నేనొక విగ్రహారాధకుణ్ణి! ఇది దేవుడి ఆజ్ఞ అనుకొంటున్నావా? కాదు, నేను  కోరి చేస్తున్నపని.” ఐజక్ వణికిపోయాడు.దుఃఖంతో దేవుణ్ణి ప్రార్థించాడు, “స్వర్గంలో ఉన్న  దేవుడా,నన్ను దయజూడు.అబ్రహాం దైవమా,యీ లోకంలో నాకు తండ్రి లేడు, పరలోకంలో నీవు నా తండ్రివి.” అబ్రహాం తనలో అనుకున్నాడు, “దేవా!వీడు నేను రాక్షసుణ్ణని నమ్మనీ.నాకు యిష్టమే.కాని వీడికి నీ పై నమ్మకం తొలగరాదు.”

                                                       *****

బిడ్డకు స్తన్యం మానిపించేటప్పుడు తల్లి,  స్తనాలకు మసి పూస్తుంది. పాలు తాగకూడనప్పుడు అవి అందంగా ఉండడం అన్యాయం కదా?బిడ్డ అనుకుంటాడు, స్తనాలు మారాయి, తల్లి మారలేదని. ఆమె చూపులో అదే ప్రేమ, అదే ఆప్యాయత. తల్లి వద్ద పాలు మాన్పించడానికి యింతకంటే భయంకరమైన ఉపాయాలు అవసరం కాని బిడ్డ ఎంత అదృష్టవంతుడు!”

                                                         2

తెల్లవారుతూంది.అబ్రహాం వేళకు  లేచాడు.భార్య సారాను కౌగిలించుకున్నాడు.సారా ఐజక్ ను ముద్దుపెట్టుకుంది. తనకు  గొడ్రాలన్న అవమానం తొలగించినవాడు వాడు. వంశోద్ధారకుడు.తనకు గర్వకారణం.తన ఆశాకిరణం.వాళ్ళు బయలుదేరారు.మాటలు లేవు.అబ్రహాం చూపు నేలవైపే.నాలుగోరోజు అబ్రహాం తలెత్తి దూరంగా కనిపిస్తున్న మోరియ కొండను చూశాడు.కాని వెంటనే చూపు నేలకు వాల్చాడు. మాటలేదు. కట్టెలు పేర్చాడు.ఐజక్ ను కట్టేశాడు. నిశ్శబ్దంగా కత్తి తీశాడు. అప్పుడు చూశాడు యెహోవా అక్కడ సిద్ధంగా ఉంచిన గొర్రెను.దాన్ని బలి యిచ్చి యింటికి తిరిగొచ్చాడు….ఆనాటినుండి అబ్రహాంను  ముసలితనం ఆవహించింది.అతడు మర్చిపోలేకపోయాడు, యెహోవా తనను యిది కోరాడని.ఐజక్  ఎప్పటిలా వృద్ధిలోకి వచ్చాడు.కాని అబ్రహాం కళ్ళు మసకబారాయి.అతనికిక జీవితంలో ఆనందం లేదు.

                                                            ***

బిడ్డను తల్లిపాలు మాన్పించవలసినపుడు తల్లి కన్యలా స్తనాలను కప్పేసుకుంటుంది. అప్పటినుండి బిడ్డకు తల్లి లేదు. మరోవిధంగా  తల్లిని పోగొట్టుకోని బిడ్డ ఎంత అదృష్టవంతుడు!

                                                                3

తెల్లవారుతూంది.అబ్రహాం వేళకు లేచాడు. ఐజక్ తల్లి  యువసారాను ముద్దుపెట్టుకున్నాడు.సారా ఐజక్ ను ముద్దు పెట్టుకుంది.వాడు తన చిరకాలపు సంతోషం ఆనందం.అబ్రహాం హాగర్ ను, తాను ఎడారిలోకి  తరిమేసిన కొడుకును తలుచుకుంటూ నడిచాడు. మోరియ కొండ ఎక్కి  కత్తి తీశాడు.
   
ప్రశాంతమైన సాయంకాలం.అబ్రహాం ఒక్కడే  బయలుదేరాడు.మోరియా కొండపైకి వెళ్ళాడు.సాష్టాంగపడి దేవుణ్ణి ప్రార్థించాడు, బిడ్డ పట్ల తండ్రి బాధ్యతను విస్మరించి  కొడుకును బలి యివ్వడానికి సిద్ధపడిన తన పాపాన్ని క్షమించమని. తరచు వెళ్ళేవాడు ఒక్కడూ. కాని అతనికి శాంతి లభించలేదు.లోకంలో తనకు ప్రాణం కన్నా ప్రియమైన తన కొడుకును బలి యివ్వడం పాపమెలా అవుతుందో అతనికి అర్థం కావడం లేదు. దానికి బదులు తన ప్రాణం ఎన్నిసార్లైనా యిష్టంగా యిచ్చేవాడు.మరి అది పాపమే అయితే, ఐజక్ ను తాను అంతగానూ ప్రేమించి  ఉండక పోతే, అది క్షమించగలిగింది ఎలా అవుతుంది?అంతకంటే ఘోరపాపం మరొకటి లేదు కదా?

                                                          ******

బిడ్డను పాలు మాన్పించవలసివచ్చినపుడు తల్లికి దుఃఖం కలగకపోదు. ఇక తను తన బిడ్డ మధ్య దూరం పెరుగుతుంది.కడుపులో  కొంతకాలం, గుండెకు చేరువై కొంతకాలం ఉండిన బిడ్డ యిక అంత దగ్గరగా రాలేడు. అలా యిద్దరికీ  యీ క్షణికదుఃఖం తప్పదు.బిడ్డను యింత దగ్గరగా పొంది, ఆపై మరెప్పుడూ దుఃఖం పొందనవసరం లేకపోవడం అదృష్టం!

                                                               4

తెల్లవారుతూంది.అబ్రహాం యింట్లో అతని ప్రయాణానికి  అన్నీ సిద్ధం చేశారు.సారాతో  వెళ్ళొస్తానన్నాడు అబ్రహాం.నమ్మిన బంటు ఎలీజర్ అతనితో కొంత దూరం నడిచి,  వెనక్కు వచ్చాడు.వాళ్ళిద్దరూ, అబ్రహాం ఐజక్, ఒకరికొకరు తోడుగా మోరియా కొండవరకు వెళ్లారు.అక్కడ, అబ్రహాం బలికి అంతా సిద్ధం చేశాడు, ప్రశాంతంగా నిశ్శబ్దంగా.కాని అతడు అటువైపు తిరిగినపుడు అబ్రహాం ఎడమచేయి  దుఃఖం వల్ల బిగుసుకుపోవడం, అతని శరీరంలో ఒక కంపము చూచాడు ఐజక్.అయినా, అబ్రహాం కత్తి తీశాడు.
   
ఆ తరువాత యింటిక వచ్చారు యిద్దరూ.సారా వాళ్ళకు  ఎదురు వెళ్లింది పరుగెత్తుతూ. కాని, ఐజక్ కు విశ్వాసం పోయింది. దాని గురించి లోకంలో ఒక్కమాట మాట్లాడినవాడు లేడు.ఐజక్ ఎవరితోనూ ఆ విషయం గురించి చెప్పలేదు.అబ్రహాంకు అనుమానం లేదు, ఎవరైనా అది చూశారేమోనని.

                                                       ******

బిడ్డకు  పాలు మాన్పించేటపుడు,తల్లి అంతకంటే పుష్టికరమైన ఆహారం సిద్ధంచేసి ఉంచుతుంది, బిడ్డకు నష్టం కలగకుండా.మరింత పౌష్టికాహారం పొందినవాడు అదృష్టవంతుడు కదా!

                                           ******

ఇలా యింకా వివిధవిధాలుగా మనం చెప్పుకొన్న  యీ మనిషి ( “There  was once a man”) ఆలోచించేవాడు.మోరియా కొండకు వెళ్ళి వచ్చినపుడల్లా అతడు అలసిపోయి కుప్పకూలేవాడు. చేతులు జోడించి అనేవాడు: “అయినా కూడా, అబ్రహామంతటి గొప్పవాడు మరొకడు లేడు.అతన్ని అర్థం చేసుకోడం ఎవరి తరం?”

                                                     *****





విశ్లేషణ

భయము కంపము” (“Fear and Trembling”) లో   ప్రధానవిషయాలు  విశ్వాసము (Faith), త్యాగము( Sacrifice). భయము కంపము వాటిలో ఆనుషంగికం. “భయము కంపము” ప్రపంచసాహిత్యంలో ఒక ప్రముఖస్థానం సంపాదించుకొంది.
   
మరొక ముఖ్యవిషయం.కీర్క్ గార్డ్ యీ గ్రంథంలో ఏ తాత్త్వికసిద్ధాంతము చేయడం లేదు.ఏ విషయంలోను తన నిర్ణయం యిది అని మనమీద రుద్దడం లేదు.  ప్లేటో సంభాషణలలో  సోక్రటీస్ ప్రశ్నకు సమాధానమివ్వడు.ప్రశ్న అడిగినవాణ్ణి సమాధానంవైపు నడిపిస్తాడు. కీర్క్ గార్డ్ ను  “డేనిష్ సోక్రటీస్” అంటారు. కాని అది కూడా సరికాదు. అతడు సమాధానం చెప్పడు, సమాధానం వైపు నడిపించడు కూడా.”ఇది దారి”, అంటాడు. ఎవడి నడక వాడితే. తన రచనలకు తనకు మధ్య  అతడు అనేక ప్రాకారాలు నిర్మించుకున్నాడు. ఆ ప్రాకారాలన్నింటికీ అవతల  తాను నిలబడతాడు.

కీర్క్ గార్డ్ రచనలను ప్రధానంగా రెండుగా విభజించవలె. ఒక రచయితను కల్పించి ఆ కల్పిత రచయిత రచనలుగా రాసినవి మొదటి విభాగం.  తన పేరుతో రాసినవి రెండవ విభాగం. “Either/Or”, “Fear and Trembling”,  మొదటి విభాగంలోని ప్రధానరచనలు.( “నేను ఎడం చేత్తో రాసిన పుస్తకాలు పట్టుకొని, కుడిచేత్తో రాసినవి వదిలేశారు”, అని వాపోయాడు కీర్క్ గార్డ్ తన చివరిరోజుల్లో.తన పేరుతో రాసినవి కుడిచేత్తో రాసినవి అని అర్థం చేసుకోవాలేమో?) ఈ  ఎడమచేతి రచనలలో రచయిత తనను తన రచనలకు చాలా దూరంలో నిలబెట్టుకున్నాడు. ఉదాహరణకు “భయము, కంపము” అన్న పుస్తక “రచయిత”,  “జాన్ ముని” (Johannes de silentio) అట! (“de silentio”, అంటే మౌనంగా ఉంటాడని అర్థం. చాలానే మాట్లాడుతాడు.కాని, అతడు మాట్లాడనిది ఎక్కువ అర్థవంతం. ఆ మౌనాన్ని అతి మెలకువతో పట్టుకోవలె  పాఠకుడు.ఇలా చాలా పుస్తకాలకు చాలామంది “రచయిత”లను సృష్టించుకున్నాడు కీర్క్ గార్డ్ ) “భయము, కంపము” లో కీర్క్ గార్డ్  తన రచనకు తనకు మధ్య ఎన్ని ప్రాకారాలు నిలబెట్టాడో  చూద్దాం.

# అబ్రహాం
# బైబిల్ చెప్పిన అబ్రహాం
# ఆ కథలోని అబ్రహాంను అర్థం చేసుకోవడంలో జీవితమంతా గడిపేస్తున్న “ అనగనగా ఒక మనిషి” (“There was once a man…”)
# ఆ వ్యక్తి అనుభూతిని కథగా చెబుతున్న “ రచయిత” ( “జాన్ ముని”,Johannes de silentio)
# ఆ జాన్ పాత్రను సృష్టించిన కీర్క్ గార్డ్.

ఇన్ని ప్రాకారాలు నిర్మిస్తాడు కీర్క్ గార్డ్.  కీర్క్ గార్డ్  తన ఒక్కొక పుస్తకానికి ఒక రచయిత పేరు పెడతాడు. ఒక్కొకసారి ఒక పుస్తకంలో యిద్దరు రచయితలు, వారు సృష్టించిన పాత్రలు, ఆ రచనలను ఒక పుస్తకంగా చేర్చిన సంపాదకుడు కూడా ఉంటారు. “వీరి అభిప్రాయాలు ఏవీ నావి  కావు. నావి కాకుండా పోవు కూడా ”,అని అంటాడు కీర్క్ గార్డ్.
నిజానికి అతని అభిప్రాయం ముఖ్యం కాదు. పాఠకుడు ఆలోచించి తన అభిప్రాయం ఏర్పరచుకోవలె అని కీర్క్ గార్డ్ ఆశయం. ఇది కీర్క్ గార్డ్ అస్తిత్వవాదంలో  ప్రధాన అంశమే. విషయరూపంలో కాక విధానంలోనూ యీ విషయాన్ని చెబుతాడు కీర్క్ గార్డ్ . ఎవడి సత్యం వాడే సాక్షాత్కరించుకోవలె. అంతే కాదు, అలా సాక్షాత్కరించుకొన్న సత్యం తనకు మాత్రమే సత్యం. సార్వకాలిక సార్వజనీనమైన సత్యం ఉండదు. “I must find a truth that is true for me.” (Kierkegaard: Journal entry, Gilleleie : 1 August 1835) ఇది వైయక్తికత కాదు, ఆత్మత. (అస్తిత్వవాదం వ్యక్తి ఆత్మను (Individual Self )ఆవిష్కరిస్తుంది. కాని ప్రాథమ్యం ,వ్యక్తిపై (Individual) కాదు, ఆత్మపై (Self).

రచయితలు ఉపరచయితలు లాగానే, ఈ పుస్తకానికి ఒక  ఉపనామం (subtitle)కూడా !  “Fear and Trembling:A Dialectical Lyric” (“గతితార్కిక గేయం”) అని.

అంతేనా! ఇంకా ఉంది. పుస్తకప్రారంభం “Attunement”! అంటే  సంగీతకచ్చేరీకిముందు వాయిద్యాలను శ్రుతిచేసుకోవడం.అంటే, యీ రచనను గేయంలా విని, సంగీతంలా అనుభవించవలె. సంగీతం అర్థంచేసుకొనేది కాదు.అనుభవించేది కనుక.

ఇన్ని హెచ్చరికలు చేస్తున్నాడు కీర్క్ గార్డ్.

అంతటితో అయిపోలేదు. పుస్తకానికి ముందు ఒక ఉల్లేఖనం (epigraph).

“అభిమానవంతుడైన టార్క్విన్ తన తోటలో గసాలపూలతో చెప్పింది తన కొడుకుకు అర్థమయింది కాని,  దూతకు కాలేదు.”(హేమన్.Hamann)

రోమ్ ప్రభువు టార్క్విన్, శత్రుదేశంతో యుద్ధంలో గెలవడానికి, తన కొడుకును శత్రుపక్షంలో చేరిపొమ్మని ఒకదూత ద్వారా సందేశం పంపుతాడు. ఆ సందేశపరమార్థం దూతకు అర్థం కాకూడదు. తన కొడుకు శత్రుపక్షంలో చేరి వారి సైనికులను యిలా చంపవలె అని తన తోటలోని గసాలమొక్కలతలలు నరికాడు టార్క్విన్. దూతకు టార్క్విన్ మాటలు మాత్రమే అర్థమయ్యాయి. పరమార్థం అందలేదు. అర్థం మాటలో లేదు, మాట వెలుపల మాటల మధ్య ఉంది. ఈ ఉల్లేఖనం( epigraph) పాఠకుడికి  మరో హెచ్చరిక. ఈ పుస్తకంలో  కూడా మాటలవెలుపలే సందేశం (అర్థం)  వెదుక్కోవలె. “ భయము,  కంపము” పుస్తకం పేరుకు తగ్గట్టే ఉంది! కాని ఆ భయకంపాలనే కీర్క్ గార్డ్ ఒక గొప్ప కావ్యంగా మలిచాడు. ఆ భయకంపాలే తరువాతి శతాబ్దంలో ప్రధానసాహిత్యవిషయాలైనాయి.

తిరిగి పుస్తకంలోకి వెళదాం. తాను కవినని, తన రచన గేయమని, సంగీతంలా శ్రుతి చేసుకొని చదవవలసిఉంటుందని హెచ్చరించాడు కదా! ప్రయత్నిద్దాం.(ఈ కథలోని “మనిషి”కి హీబ్రూ భాష తెలిసిఉంటే అబ్రహాం కథ బాగా అర్థమయేదేమో అన్నాడు “పుస్తకరచయిత” జాన్ ముని. మనకు కూడా డేనిష్ భాష తెలిస్తే  కీర్క్ గార్డ్ కథనశిల్పంలోని మరికొన్ని మెలకువలు తెలిసేవేమో? మనం చేయగలిగిన ప్రయత్నం చేద్దాం.)

“అనగనగా ఒక మనిషి”, అంటూ మొదలైన యీ కథ, లేక “గేయం”(“lyric”) “ఒకానొక మనిషి” కథ కాదు. అది “మనిషి”  కథ, వ్యష్టిగా సమష్టిగా కూడా.అంటే, కాలగమనంలో మనిషిని, మనిషిజీవితంలో కాలగమనాన్ని , రెంటినీ చెబుతున్నాడు రచయిత యీ “మనిషి” ద్వారా. అంటే, వ్యక్తి జీవితంలో వయోదశలు, సమాజచరిత్రలో దశలు కూడా.  ఒక ఘటన అది జరిగిన కాలంలో ఒక విధంగా అర్థమవుతుంది. కొంత కాలం గడిచిన తరువాత వేరొక విధంగా అర్థమవుతుంది. చాలా కాలం గడిచిన తరువాత  అర్థమైనట్టుంటుంది, కాని కాదు. ఘటన చరిత్ర అవుతుంది. చరిత్ర పురాణం అవుతుంది. ఇది కాలగమనంలో మనిషి విషయం. అనుభూతిరూపంగా అర్థమవడం తగ్గిపోతుంది కాలక్రమంలో. ఇక మనిషి జీవితంలో కాలగతి. చిన్నతనంలో విన్న కథలో “ అందం”  కనిపిస్తుంది. కొంత ఎదిగిన తరువాత అదే కథలో అందం బదులు, “ఆశ్చర్యం” కలుగుతుంది. మరి కొంత వయసైన స్థితిలో అందము ఆశ్చర్యము అణగిపోతాయి, “ఆసక్తి” ఉంటుంది. అంటే వయసుతో  క్రమక్రమంగా చిన్నతనపు అనుభూతి అణగిపోతుంది.మొదటి వాక్యంలోనే  “మనిషి” అన్న పదాన్ని యింత మెలకువతో ప్రయోగించాడు రచయిత. పుస్తకమంతా యింత మెలకువతో  చదవాలి.

కీర్క్ గార్డ్ యీనాటి “మనిషి”లో (సమాజం అనడు కీర్క్ గార్డ్) భావతీవ్రత లోపించడాన్ని నిరసిస్తాడు.ఈనాటి మనిషిలో చింతన ఎక్కువ, ఆర్తి తక్కువ.ఈ  ఉద్వేగరహితమైన జవము జీవము లేని బతుకు బతుకు కాదు అంటాడు కీర్క్ గార్డ్.శ్రద్ధ ఉద్వేగశిఖరం.(“Faith is the highest passion in a person" (p. 122). శ్రద్ధతోటి కలిగే భావతీవ్రతే నిన్ను భగవంతునివద్దకు దాటించగలదు (‘leap of faith’)

ప్రాంభవాక్యంలోని “మనిషి” పదప్రయోగంలో మరో ముఖం.  మనిషి అంటాడు కాని, సమాజం అనడు కీర్క్ గార్డ్. అతడికి సమాజం అంటే మంద.( “Crowd is the untruth", అన్నది అతని ప్రసిద్ధవాక్యం.) మనిషి మాత్రమే తరించగలడు (“ leap”). సమాజం ఎప్పటికీ సమజమే.దానికి సుఖం చాలు. సుఖము, ఆర్తి సహజీవనం చేయలేవు. ( "An easy life is the privilege of the slave." The Brothers Karamazov:Dostoevsky.)

కావ్యంలోని యీ ప్రారంభవాక్యప్రాముఖ్యాన్ని దాని విస్తృతిని చూద్దాం.

-ఒక ప్రశ్న. టి.వి.లో వ్యాపారప్రకటనల్లో కొన్ని సాహసాలు( stunts) చూపిస్తారు, ఒకడు బైక్ మీద ఒక కొండ కొననుండి మరో కొండపైకి దూకుతాడు. ఆ ప్రకటనతో ఒక హెచ్చరిక ఉంటుంది: “ మీరు చూస్తున్నది శిక్షణపొందినవారి పర్యవేక్షణలో చేసినది.ఎవరూ అనుకరించవద్దు.” అదే టి.వి., రామాయణకథలో హనుమ నూరుయోజనాల సముద్రం లంఘించడం చూపిస్తుంది.కాని అప్పుడు అనుకరించవద్దు అన్న హెచ్చరిక ఉండదు.కారణం?
   
ఒక సంఘటన ప్రత్యక్షంగా చూచినపుడు అది అనుభవం. విన్నప్పుడు అది వార్త.కంటితో చూచినప్పుడు ఆ ఘటన మనసుపై వేసే ముద్రకున్న బలం విన్నపుడుండదు. అట్లాగే, ఈనాడు పొందిన అనుభవం రేపుండదు. ఈవేళ పోతే రేపటికి రెండు అనే నానుడి ఉంది. మనిషి జీవితంలో లాగానే, సమాజంలోను. కాలగమనంతో ఒక ఘటన గురించిన మన అవగాహన మందం అవుతుంది, అనుభవతీవ్రత తగ్గుతుంది కనుక. అనుభవమే అవగాహన.ఏదైనా అర్థం చేసుకోవడమంటే, అనుభూతిపొందడమే, దానిని గురించిన ఆలోచన భావాలు సిద్ధాంతాలు కావు. అనుభవం వర్తమానం. రేపు వార్త.ఆ మరునాడు చరిత్ర. మరో యుగంలో పురాణం. అంటే కాలక్రమంలో అనుభూతి ఉండదు. హనుమ సముద్రం దాటడం కథ. అందులో భయంలేదు, సంశయం లేదు. కంపం కలగదు. ఉద్వేగం ఉండదు. “అయ్యో యిప్పుడు హనుమ ఏమైపోతాడు?”అన్న ఉద్వేగం ఉండదు. కనుక, హనుమ అప్పుడు ఏమి అనుభవించాడో మనకు అనుభవంకాదు. హనుమ తనను, తనలోనుండి తనను, బాణపుకొనతో నిశ్శేషంగా  కోసేసుకుని, కేవలం తనను కోసిన రామబాణంగా మిగిలిపోయాడు. (“యథా రాఘవనిర్ముక్త శ్వసనవిక్రమః”.)  ఆ కోత (angst) మనకు అనుభవం కాదు. మనకది కథ. ఇది ఉత్తి కథ అని మనం అనుకున్నట్టే ఆనాడు అబ్రహాం “ ఇది భగవంతుడు పెడుతున్న ఉత్తుత్తి పరీక్ష.ఇది నిజం కాదు, నేను నా ప్రియమైన కొడుకును బలి యివ్వవలసిరాదు”, అనుకునిఉంటే, ఆ భయము కంపము పొందకపోయిఉంటే,  అబ్రహాం కథ బైబిల్ లో ఉండేదా?  “ మనకు తెలుసు, మనందరికీ, అది వఠ్ఠి పరీక్ష అని.” (Fear and Trembling:tr.Hannay.Penguin: p.55) ఆ క్షణంలో  అబ్రహాం అనుభవించిన భయం, బాధ, ఉద్వేగం, కత్తి ఎత్తిన చేయి వణుకు, అన్నీ ఆ  పురాణకాలంలో  పురాణం కావు. నవవ్రణంగా  అనుభూతమయేవి. కనుక అర్థమయేవి.  బైబిల్ కథ చిన్నతనంలో వినడం, చరిత్రచిన్నతనంలో వినడం,  యుగాలు గడచిన తరువాత వినడం ఒకటి కావు. పైన కథాభాగంలో చెప్పింది అదే, అబ్రహాం కథ యీ నాడు కేవలం కథ. ఇదీ  “భయము, కంపము” కావ్యప్రారంభవాక్యప్రాముఖ్యం.ఎవడి  అనుభూతి వాడిది. అనుభూతమయిందే సత్యం.

జీవితానికి ప్రయోజనం, జీవితానికి అర్థం,  జీవితసత్యం ఎవడిది వాడికే. సార్వజనీనమైన సత్యం ఉండదు. సమస్తవిశ్వానికి ఒకే ధర్మం ఉండదు. ఒకే న్యాయం ఉండదు. ఉన్నా, అది ఎవడికి వాడు సాధించి సంపాదించుకోవలసిందే, అనుభవంలో తెలుసుకోవలసిందే. శ్రుతి చెప్పిందే అయినా (వేదం,బైబిల్, కురాన్ మరేదైనా) , ఆ శ్రుతి బయటనుండి కాదు, లోపల పలకాలి. అప్పుడే అది వేదం.( తరువాతి కాలంలో  ఈ కీర్క్ గార్డ్ వాక్యం నిజంగా వేదమయింది, అస్తిత్వవాదానికి (Existentialism), అసంబద్ధవాదానికి (Absurdism),యింకా అనేక వాదాలకు.

మరో ప్రశ్న. త్యాగంలో అంచెలుంటాయి. వరదలో నీ యిల్లు కూలబోతోంది. నీ బంగారం, నీ బ్యాంకు డిపాజిట్లు నీటిలో కొట్టుకుపోతున్నాయి. నీ బిడ్డ వరదలో చిక్కుకున్నాడు.ఆ పరిస్థితిలో నీవు ముందు దేనిని కాపాడవలెననుకుంటావు అని అడగక్కరలేదు. విశ్వామిత్రుడు,  “నీ కొడుకు రాముణ్ణి నాతో పంపు”,  అని అడిగినపుడు, దశరథుడు ఏమన్నాడు? “ రాముడు నాకు స్నానమగు రాముడు నాకు జపంబు ధ్యానమున్/రాముడె యెల్ల నా బ్రతుకు, రాముడు నన్నును గన్న తండ్రి యీ/ రాము వినా నిమేషమవురా మనజాలను, కాదయేని నీ రాముని వీడి యీ యఖిలరాజ్యము గాధిసుతా!గ్రహింపవే.”(కల్పవృక్షము:విశ్వనాథ) బాధ ఎక్కడ గాఢంగా కలుగుతుంది? రాజ్యం కన్నా ఎక్కువ కన్న కొడుకు. ఒక ధనవంతుడు క్రీస్తును అడిగాడు,” నేను స్వర్గం పొందవలెనంటే ఏం చేయమంటావు”, అని. “నీ ఆస్తులు అమ్మి నా వెంట రా”, అన్నాడు క్రీస్తు ( మాథ్యూ: 19:16-30). ఆ ధనవంతుడు తన ఆస్తులు అన్నీ అమ్మి పేదలకు దానాలు  చేసినా, అది గొప్ప కాదు. బిడ్డను బలి యివ్వడంతో  అది సమానం కాదు. అబ్రహాం కథలో మనం ప్రధానంగా  అర్థం చేసుకోవలసింది  అంచులుతాకిన అబ్రహాం వ్యథ.
     
అబ్రహాంకు  సమస్త సృష్టిలో  అత్యంతము ప్రియమైన వస్తువు తన బిడ్డ. (హాగర్ కు  తన వల్ల కలిగిన ఒక బిడ్డను,  భార్య సారా కోరికకు తల వంచి అడవులపాలు చేశాడు అంతకు ముందే.)ఐజక్  తనకు మిగిలిన ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డను  యెహోవా బలి కోరినప్పుడు,  అతడు, “ దేవా! నా కొడుకుకు బదులు నన్ను బలితీసుకో “, అని ప్రార్థించిఉండవచ్చు. అబ్రహాం తాను రాక్షసుడిగా మారినట్టు నటించవలసిన అవసరం ఏమిటి ? భగవంతుడు కరుణామయుడు అన్న నమ్మకం ఐజక్ లో చెడకూడదు. పసివాడి ప్రాణం బలికోరే వాడు దేవుడెలా అవుతాడు? పసివాడి మనసు క్రూరుడైన మనిషినుండి తొలగి, కరుణామయుడైన భగవంతునియందు నిలవాలి.తన తండ్రి రాక్షసుడనుకొన్నా ఫరవాలేదు, భగవంతుడు క్రూరుడు  అన్న భావం కలగకూడదు. బిడ్డకు తనమీద నమ్మకం పోనీ, భగవంతుని మీద నమ్మకం చెడకూడదు. ఇందులో రెండు అంశాలున్నాయి. ఒకటి, తండ్రికి బిడ్డపై నిజమైన ప్రేమ ఎలా ఉండాలి? రెండు, భగవంతునియందు అచంచలవిశ్వాసము. ఆ బిడ్డహృదయంలో తాను తొలగి, అక్కడ  భగవంతుని ప్రతిష్ఠించడం బిడ్డపై నిజమైన ప్రేమ. తన ప్రేయస్సుకంటే బిడ్డ శ్రేయస్సు కోరడం నిజమైన పుత్రవాత్సల్యం. కొడుకు తన తండ్రి  రాక్షసుడని నమ్మినా  మేలే. కాదు,తప్పక  నమ్మవలె. అప్పుడే అది గొప్పత్యాగం అవుతుంది.తను  రాక్షసుడని కొడుకు నమ్మడం ఎందుకు అవసరం? “దేవా!నాకు ప్రియమైన నా కొడుకు బదులు నన్ను బలి తీసుకో”, అని ఉంటే, అప్పుడు కొడుకు దృష్టిలో తాను దేవుడవుతాడు, దేవుడు దిగిపోతాడు. అలా అయితే అది భగవంతుని కించపరచడం, భగవంతునియందు తన విశ్వాసం చలించడం. అలా కాకూడదు. అలా అయితే తాను నిజంగానే రాక్షసుడైనట్టు. భగవంతుని కించపరచడం, భగవంతునియందు విశ్వాసం చలించడమే కదా రాక్షసుడిగా మారడమంటే ?తాను నిజంగా  రాక్షసుడిగా మారకూడదంటే, తను రాక్షసుడిగా మారినట్టు నటించవలె.తన తండ్రి  రాక్షసుడని తన కొడుకు నమ్మవలె. ఈ లోకంలోని తండ్రిపై ప్రేమ పరలోకంలోని తండ్రివైపుకు మళ్ళించవలెనంటే, అబ్రహాం తన ముఖానికి. రాక్షసత్వపు మసి పూసుకోవలె. (బిడ్డను స్తన్యం మాన్పించడానికి తల్లి స్తనాలకు మసిపూసుకున్నట్టు.) అది అబ్రహాం త్యాగంలోని  నిజతత్త్వం. అతడు బలి యివ్వడానికి సిద్ధమయింది కొడుకును కాదు, తనను. ఈ ఆత్మబలిలో ఒకేసారి రెండు సిద్ధించాయి, బిడ్డయందు ఉండవలసిన నిజమైన ప్రేమ, భగవంతునియందు చలించని విశ్వాసం. ఇంతకంటే గొప్ప బలి కాని, బలమైన కథనంగాని, ఏముంటుంది? ఈ కథలో కరుణ, భయము (“frightful pathos”) నిండి ఉన్నాయి. కదిలి కదిలించే కథ.
   
అబ్రహాం కథ తండ్రికొడుకుల అనుబంధవిషయం. అబ్రహాం త్యాగంలోని వైశిష్ట్యం, అతడు తనకు అత్యంతము ప్రియమైన ఒకే ఒక బిడ్డను బలి యివ్వడం కాదు. బలి యిచ్చిన తన బిడ్డను భగవంతుడు తనకు తిరిగి యిస్తాడన్న విశ్వాసం. బలి యిచ్చిన కొడుకు బతికిరావడం బుద్ధికందని, లోకం దృష్టిలో బుద్ధిలేని, విశ్వాసం. అది అసంభవం, అసంబద్ధం, అహేతుకం.అబ్రహాం విశ్వాసంలో మరో ముఖ్యాంశం,  అది ఐహికం కొరకు కాదు. అబ్రహాం లోకమందు విరక్తుడు కాడు. అతడు సన్యాసి కాడు. సన్యాసం వేరు, విశ్వాసం వేరు.ఇది  కీర్క్ గార్డ్ రచనలలోని తాత్పర్యం.
 
బైబిల్ లోని  అబ్రహాం కథను కీర్క్ గార్డ్ నాలుగు విధాలుగా చెప్పించాడు తన “రచయిత” జాన్ ముని చేత. నాలుగూ బైబిల్ మూలకథకంటే భిన్నంగా ఉంటాయి. ఈ నాలుగు కథల వ్యాఖ్య, విభిన్నార్థాల వివరణ జాన్ ముని రచనలో లేదు.                                                                                                                  

                                                          ***
     
ఇన్ని విధాలుగా కథ చెప్పడంలోని ప్రయోజనమేమిటి? శిల్పవైవిధ్యప్రదర్శనకా?  ముందు  నాలుగింటిలో సామాన్యమేమిటో చూచి, ఆ తరువాత వైవిధ్యమేమిటో  పరిశీలిద్దాం.

నాలుగింటిలోనూ మొదటి వాక్యం ఒకటే. “తెల్లవారుతూంది.”  ప్రత్యూషసమయం. ఏ సనాతనధర్మంలోనూ దైవకార్యానికి విశిష్టం. (ఉషస్సే బలిపశువు అని కదా ఉపనిషత్తు .” ఉషా వా అశ్వస్య మేధ్యస్య శిరః”.బృ.ఉ.)

నాలుగింటిలోనూ కథ, తల్లి బిడ్డను పాలుమాన్పించడమనే ఉపమానంతో ముగుస్తుంది.కథ తండ్రిని గురించి.కథ ముగింపు తల్లి ఉపమతో. కథలో తల్లి పాత్ర ఉంది, ఆమె మూగబాధ ఉంది.ముగింపులో ఆమె పాత్ర లేదు. కారణం? కథలో తల్లితండ్రులు వేరు, వారి బాధలు  వేరు. ముగింపులో  తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది. తండ్రి వ్యథను తనలో చేర్చుకున్న తల్లి, తల్లిప్రేమను తనలో నింపుకున్న తండ్రి  ఒకరైన తల్లి కథ. “త్వమేవ మాతాచ పితా త్వమేవ.”

మొదటి మూడు కథాంతరాలలోనూ అబ్రహాం వెళ్ళినంతదూరమూ అతని చూపు నేలవైపే.తల ఎత్తలేదు, మోరియా కొండ కనిపించేవరకు.నాలుగో కథలో యీ నేలచూపు ప్రస్తావించలేదు. ఇది ఒక సంకేతం. ఏమిటో తరువాత చూద్దాం.

ఇప్పుడు కథలలోని వైవిధ్యం. రెండవ కథ బైబిల్ లో ఉన్నట్టే ఉంది. ఒక్క తేడా.బైబిల్ కథలో అబ్రహాంకు యిహంలో  సంతోషం ప్రధానం. ఆ బలి కార్యక్రమం ముగిసిన తరువాత, అబ్రహాం జీవితం సుఖసంతోషాలతో గడచిపోయింది. అబ్రహాం కోరుకున్నది పరలోకంలో మన్నన కాదు. ఈ జీవితంలో మన్నన.ఇక్కడి సుఖము యిక్కడి సంతోషము.ఈ బైబిల్ కథకు భిన్నంగా విరుద్ధంగా, యిక్కడ అబ్రహాం జీవితంలో  ఉత్సాహం లేదు సంతోషం లేదు.కాని, కొడుకు ఐజక్ వృద్ధిలోకి వచ్చాడు. ఏమిటి దీని అర్థం?  మొదటి కథలో అబ్రహాం  ఏది చేయలేదు అనుకున్నామో అవి యీ కథలో అబ్రహాం చేసి ఉండవలె.కాని వాస్తవంగా ఆ నాడు ఆ బలి దృశ్యంలో అబ్రహాం ఏం చేశాడో, అది రెండు భాగాలుగా మూడు, నాలుగు కథలలో ఉన్నాయి. మొదటి కథలో అబ్రహాం చేయనివి రెండు చెప్పుకున్నాం.ఒకటి అబ్రహాం దేవుణ్ణి ప్రార్థిస్తాడు, “ దేవా ఎందుకు నాకీ పరీక్ష?నా ప్రాణాలు ఎన్ని సార్లైనా యిష్టంగా నీకు సమర్పించేవాణ్ణి కదా?” రెండవ అపరాధం, కత్తి ఎత్తిన చేయి  కరుణతో కదిలిపోవడం. ఈ రెండు అపరాధాలు విడివిడిగా చివరి రెండు కథలలో చెప్పాడు.దోషం లేకుండా నిర్వర్తించిన కర్మ మొదటి కథలో చెప్పి, జరిగిన అపరాధాలు రెండవ కథలో అనుమానానికి వదిలి, మూడు నాలుగు కథలలో జరిగిన అపరాధాలు చెప్పాడు.
   
రెండవ కథలో,  జరిగినది చెప్పలేదు. జరిగినదాని ఫలితాలు  చెప్పాడు.ఫలితాలనుబట్టి ఏమి జరిగిందో ఊహించుకోవలె. ఫలితాలు రెండు.అబ్రహాం జీవితంలో సంతోషం లేదు.కాని, ఐజక్ వృద్ధిలోకి వచ్చాడు.అంటే, అబ్రహాం అపరాధము, ఐజక్ ఆ అపరాధాన్ని గమనించకపోవడము అన్న రెండు ఘటనలు మనం అనుమానించవలసి (inference) ఉంటుంది. అబ్రహాం అపరాధం ఏమిటో మూడవ కథలో చెప్పాడు.అబ్రహాం,  “నా కొడుకు ప్రాణం బదులు నా ప్రాణం సంతోషంగా యిచ్చేవాడిని కదా”, అని ప్రార్థించాడు. అలా ప్రార్థించడం భగవంతుని ఆజ్ఞను,  ప్రజ్ఞను శంకించడమే. అది అబ్రహాం చేసిన అపరాధం. మరి, ఐజక్  వృద్ధిలోకి రావడమెట్లా? అతని విశ్వాసం చలించలేదు కనుక.ఎందుకు చలించలేదు? అబ్రహాం తనలో తాను చేసుకున్న  ప్రార్థన ఏమిటో తనకు తెలిసే అవకాశం లేదు కనుక. ఆ ప్రార్థనను తాను వినగలిగి  ఉంటే, తన తండ్రికి తనపై ప్రాణాధికమైన ప్రేమ అని తెలిసేది.అప్పుడు తన తండ్రి గొప్పవాడయేవాడు. దేవుడు తగ్గిపోయేవాడు. తండ్రి ప్రార్థన ఐజక్  వినలేడు కనుక, దేవునియందు ఐజక్ విశ్వాసం చలించలేదు.చలించకూడదనే, కొడుకు వినలేని విధంగా ప్రార్థించాడు అబ్రహాం. అపరాధభారం సర్వము తాను భరించి, అబ్రహాం కొడుకు అభ్యున్నతిని ఆశించాడు.
   
మూడవకథలో మరో అంశం ఉంది.అది తక్కిన మూడు కథలలాగా, బలి జరిగిననాటి వర్ణన కాదు. అది జరిగిపోయిన తరువాత అబ్రహాం ఆ ఘటనాస్థలానికి చాలా తరచుగా  ఒంటరిగా, వెళ్ళివచ్చేవాడు. ఆ కొండపైకి వెళ్ళినపుడు ప్రత్యూషం కాదు, ప్రదోషం. (“ప్రశాంతమైన సాయంకాలం.”) ఆ ఘటనను మళ్ళీమళ్ళీ తలచుకునేవాడు, తరచుకునేవాడు.( “తరచు వెళ్ళేవాడు ఒక్కడూ.”) కాని అప్పుడు కూడా కత్తి తీసేవాడు.ఎందుకు? ఆ ఘటనను మళ్ళీమళ్ళీ వాస్తవంగా అనుభూతి చెందడానికి.తలపు (reflection) వేరు, అనుభూతి తీవ్రత (passion) వేరు.
 
ఇక,  నాలుగో కథ.ఇందులో ముఖ్యమైన వాక్యం, “దానిని గురించి లోకంలో ఎవ్వడూ మాట్లాడలేదు.” కనుక, అక్కడ ఆ రోజు వాస్తవంగా ఏం జరిగిందో  తెలిసిన ఐజక్  ఎవ్వరికీ చెప్పలేదు. ఎవరైనా చూసిఉంటారన్న అనుమానం అబ్రహాంకు కలగలేదు.దీని పరమార్థం. ఏమిటి?మొదటి మూడు కథలలో తండ్రికొడుకుల విశ్వాసవిషయం.చివరిదైన యీ నాలుగోకథలో విషయం వ్యష్టినుండి సమష్టికి విస్తరించింది.ఇందులో కేవలం వ్యక్తుల విశ్వాసం నిలవడమో చలించడమో కాదు. లోకంలో దేవునిపై ఉన్న నమ్మకం చెడకుండడం నాలుగో కథలో విషయం. అబ్రహాం తన నమ్మకం చెడనీ, కాని కొడుకు నమ్మకం చెడకూడదని మొదటి మూడు కథలలో అనుకున్నట్లే, యీ నాలుగో కథలో తండ్రికొడుకులు యిద్దరూ తమ నమ్మకం చెడనీ, లోకం నమ్మకం నిలవాలని కోరుకున్నారు.ఈ భావం ఉనమునో (Unamuno) నవలిక “Saint Emmanuel the Good, Martyr” కు ప్రేరణ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆ నవలిక  ఒక పాస్టర్ కథ. అతడికి భగవంతుడిమీద విశ్వాసం ఉండదు.కాని, తన అవిశ్వాసాన్ని తనలో దాచుకుని తన పాస్టర విధులు నిర్వర్తిస్తాడు. లోకాన్ని మోసంచేయడానికి కాదు.లోకానికున్న విశ్వాసాన్ని కాపాడడానికి. (2)
   
మొదటి మూడు కథలలో అబ్రహాం నేలచూపు దేనికి సంకేతం? అబ్రహాం కోరుకున్నది యీ లోకంలో ఋద్ధి, పరలోకంలో ప్రవృద్ధి కాదు. అతని చూపు ఐహికంపై అన్నదానికి  సంకేతం అతడి నేలచూపు. నాలుగో కథలో దాని ప్రస్తావన లేకపోవడానికి అర్థం? నాలుగో కథ తండ్రికొడుకులకు పరిమితం కాదు.అది సమష్టివిషయం, లోకానికి సంబంధించింది.అక్కడ అబ్రహాం వ్యక్తిగతమైన చూపు ప్రసక్తి కాదు.
   
మరొక్క విషయం.అబ్రహాం, ఐజక్ ల విశ్వాసము అవిశ్వాసము  నాలుగింటిలోనూ ప్రసక్తం. మరి సారా విశ్వాసప్రసక్తి ఎక్కడైనా ఉందా?ఆమె మూగబాధ చెప్పాడు. ఆమె సంతోషం చూశాం, ఐజక్  మోరియా కొండనుండి తిరిగి వస్తున్నపుడు ఆమె ఎదురు పరుగెత్తడంలో.ఆమె విశ్వాసవిషయం ఎక్కడైనా చెప్పాడా? రెండవకథలో అబ్రహాం విశ్వాసం సడలడం, దాని ఫలం చెప్పాడు: “ఆనాటినుండి అబ్రహాంను  ముసలితనం ఆవహించింది.” దేవునియందు చలించని విశ్వాసం మనిషిని ముసలితనంనుండి కాపాడుతుంది. ఆ విశ్వాసమే కదా అబ్రహాంకు నూరేళ్ళు, సారాకు తొంభైఏళ్ళు వచ్చినా  సంతానం కలగడానికి కారణం!  ఆ విశ్వాసం సడలగానే అబ్రహాంను ముసలితనం ఆవహించింది. సారా విశ్వాసవిషయం నాలుగు కథలంతటా ఒకే ఒక్క విశేషణపదంలో ధ్వనింపజేశాడు: “యువ” ( “ఐజక్ తల్లి యువసారా”). ఆమె వీడనియవ్వనం ఆమె సడలని విశ్వాసానికి సాక్ష్యం.సుమారు రెండువేలపదాలకథనంలో, సారా విశ్వాసానికి సాక్ష్యం ఆ ఏకైక “యువ” పదం!  జాన్ ముని అనే  యీ రచయిత రచనాశిల్పానికి యింతకంటే నిగూఢనిదర్శనం ఏముంటుంది?
   
ఇంతకూ, కీర్క్ గార్డ్ యిన్నివిధాలుగా యీ కథను కల్పించి చెప్పడంలో ప్రయోజనం? అబ్రహాం ఎదుర్కొన్న సమస్యలోని సంక్లిష్టతను, నిర్ణయంలో సంఘర్షణను, ఉద్వేగాన్ని, సంక్షోభాన్ని అనుభూతం చేయడానికి. అబ్రహాంకు నాలుగింటిలో ఏ నిర్ణయం తీసుకోడానికైనా స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ ఉంది కనుకనే యింత ఘర్షణ.ఇదీ  అస్తిత్వమంటే.మనిషికి స్వేచ్ఛ ఒక శిక్ష.(“Man is condemned to be free.” Sartre.) ఆ స్వేచ్ఛారూపశిక్షే అతన్ని మనిషిని చేస్తుంది. ఆ అనుక్షణశిక్షే జీవితం. ఆ స్వేచ్ఛ ఉంటే మనిషి. లేకుంటే వాడు బాధలేని బండరాయి.
 
ఈ నాలుగు కథలలో సూచనప్రాయంగా చెప్పిన విషయాలనే మూడు ప్రధానసమస్యలుగా (problematic)  రూపించి వివరించాడు తరువాతి అధ్యాయాలలో.నాలుగు కథలు మూడు సమస్యలా? ఈ లెక్కలు, లాజిక్కు  వదిలేయమంటాడు కీర్క్ గార్డ్ .( రెండు రెండు కలిసి అయిదు ఎందుకు కాకూడదు, అంటాడు డోస్టోవ్ స్కీ (“నోట్స్”).కళ్ళు మూసుకొని దూకమంటాడు కీర్క్ గార్డ్ ( “leap of faith” ). కపి వారిధి దాటునా?దాటును.
     
లెక్కలు లాజిక్కు లౌకికంలో తప్పనిసరి.అలౌకికంలో  హేతువు అభ్యుదయనిరోధకం. ఆ హేతువే దాటవలసిన సేతువు, “leap of faith” .
 
కీర్క్ గార్డ్ ను చదవాలనుకునేవారు సాధారణంగా , “ భయము,కంపము”(“ Fear and Trembling”) తో మొదలుపెడతారు. అది చదివిస్తుంది. భయపడడం నేర్పిస్తుంది.చదివిన తరువాత చలి వదులుతుంది,వణుకు మిగిలిఉంటుంది. “ఇది కాదు, ఇంకో  మాట” చెప్పమంటారా?  “The Sickness unto Death” తో మొదలుపెట్టండి!
   
ఇంతవరకు మనం అబ్రహాం కథ  నాలుగు ముఖాలు చూశాం, కథనశిల్పపరిశీలనం ప్రధానంగా. ఆ వివిధకథనాల ఆశయమేమిటో చూద్దాం.కీర్క్ గార్డ్ రచనలన్నీ “సత్యం సహేతుకం”(“The real is the rational.”) అన్న  హెగెల్ తీర్మానాన్ని తిరస్కరించడానికే.అరిస్టాటిల్ నుండి హెగెల్ వరకూ పాశ్చాత్యతత్త్వశాస్త్రం ఆ హేతువాదపు పునాదిపై లేస్తూ వచ్చింది. ఆ పునాదిని  కీర్క్ గార్డ్ ఒక ఊపు ఊపాడు, వ్యంగ్యశైలిలో. “వ్యంగ్యం నాలో గుచ్చుకున్న బాణం”, అంటాడు కీర్క్ గార్డ్. “బాణం తీసెయ్,  ప్రాణం ఉండదు.”  కీర్క్ గార్డ్  తత్త్వం వివరించడమంటే, అతని శైలికి గుచ్చుకున్న  బాణం పీకేసి, పలికించడమే. అది ప్రాణంలేని పలుకు.హేతువాదంపై యీ వ్యంగ్యం అందుకున్నవాడు డోస్టోవ్ స్కీ. అతని నవల “నోట్స్ ఫ్రమ్ అండర గ్రౌండ్” అస్తిత్వవాదసాహిత్యానికి  ఆది కావ్యం అంటారు.(3)
   
వివరణ:
1. అబ్రహాం మొదటి కథలో, “అబ్రహాం వేళకు  లేచాడు”, (“Abraham rose in good time”).   అబ్రహాం “వేళకు” లేచాడు, “త్వరగా” లేవడు. కొడుకును బలి యివ్వడానికి ఎవడైనా తొందరపడతాడా?అలాగని, ఆలస్యం కూడా కాకూడదు,అది దైవకార్యం. అబ్రహాం త్వరగా లేవలేదు, ఆలస్యమూ చేయలేదు. “వేళకు లేచాడు”. “నిద్ర లేచాడు” అనలేదు. అబ్రహాం ఆ రాత్రి  నిద్ర పోయి ఉండడు అని మనకు గుర్తురాకుంటే, కథ చదవడం వ్యర్థం. గాడిదమీద  వెళ్ళాడు, నాలుగు రోజులు ప్రయాణం చేశాడు.ఈ వేదన సంక్షోభం సంశయం  సంఘర్షణ, లేకుంటే అబ్రహాం మనిషి కాడు,  బండ. అలాగే పాఠకుడివిషయంలోనూ. అతడి వేదన  సంక్షోభం సంశయం  సంఘర్షణ  మనకు అనుభూతం కానపుడు, అతనిది  పురాణకథలా మిగిలిపోతుంది. అబ్రహాం ‘త్వరగా లేచి’పోతాడు.

2.కీర్క్ గార్డ్ తన సోదరుడు అని చెప్పుకున్నాడు ఉనమునో: “అతనిలో నేనొక సోదరుణ్ణి చూచాను. ఇంచుమించు మరొక నేను. అతని ఆత్మను ఆలింగనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను.” (Miguel de Unamuno:preface to the Danish translation of Del sentimiento trágico de la vida)

వీరి సోదరభావానికి మరో మచ్చు: “హృదయంలో ఆర్తి లేదు, సంశయంలేదు,అనిశ్చయం లేదు,ఎన్నడూ నిస్పృహకలగదు,  కాని మాకు దేవునియందు విశ్వాసం ఉంది అని విశ్వసించేవారు,నిజంగా విశ్వసించేది దేవుని కాదు, దేవుడనే భావాన్నిమాత్రమే, ఎంతమాత్రము దేవుణ్ణికాదు.” ఉనమునో.

3.డోస్టోవ్  స్కీ , కీర్క్ గార్డ్ లు సమకాలికులు. కాని డోస్టోవ్ స్కీ  రాయడం మొదలుపెట్టేటప్పటికి కీర్క్ గార్డ్ రాయడం ముగించేశాడు. కనుక ప్రభావం అనడంకంటే, వారిద్దరిదీ  సమానస్వరమని చెప్పవచ్చు. డోస్టోవ్ స్కీ  ప్రారంభరచనల్లో (“Notes from the Underground”,”The Dream of a Ridiculous Man”)  కీర్క్ గార్డ్ లో లాగే వ్యంగ్యమే ప్రధానగుణం.కాని తన ప్రధాననవలల్లో ( “Crime and Punishment”, The Brothers Karamazov”) వ్యంగ్యాన్ని  దాటి విషాదగాంభీర్యం అందుకున్నాడు.

                                                        *****

 “భయము, కంపము” లోని అధ్యాయాలు:

1.ముందుమాట ( “రచయిత” Johannes de silentio)
2.ఉపక్రమం (Prelude; Attunement)
3.అబ్రహాం స్తుతిప్రసంగం
4. ప్రశ్నలు (Problemata: Preamble from the Heart/ Expectorations.
“Problemata” అనేది అరిస్టోటిల్ గ్రంథం. (రూఢిగా తెలియదు.) ప్రశ్న, సమాధానరూపంలో ఉంటుంది కనుక, ఆ కాలంలో తత్త్వగ్రంథాలు సాధారణంగా యీ సంభాషణారూపంలో ఉండేవి.)  (ఉదా. ప్లేటో “dialogues”)
5. మొదటి ప్రశ్న (Is there a teleological suspension of the ethical? “దీని కొరకు లోకనీతిని భగ్నంచేయదగును”, అన్న ఉత్తమ ప్రయోజనం , లోకనీతికి అతీతమైనది,  ఉంటుందా?
6.రెండవ ప్రశ్న ( Is there an absolute duty to God? దైవం పట్ల ఉల్లంఘించరాని కర్తవ్యం ఉందా? )
7.మూడవ ప్రశ్న (Was it ethically defensible of Abraham to conceal his purpose from Sarah, from Eliezar, from Isaac? అబ్రహాం తన కర్తవ్యం సారాకు గాని, ఎలీజర్ కుగాని, ఐజక్ కు గాని చెప్పకపోవడం న్యాయమా?)
8.ఉపసంహారం (Epilogue)

ఈ గ్రంథరచయిత ( జాన్ ముని,Johannes de silentio )  కేవలం ఒక దూత. అతడు మోస్తున్న సందేశార్థం తనకు తెలియదు.కీర్క్ గార్డ్ యీ గ్రంథరచయిత  ద్వారా  పంపుతున్న  సందేశం పాఠకుడు ( సీలు చేసిన కవరు) విప్పి చూచుకోవలె.
ఇక ఇప్పుడు గ్రంథ ఉపక్రమం( Preface)  చూద్దాం.

ఉపక్రమం (Preface)

““వ్యాపారంగంలో మాత్రమేకాదు, భావప్రపంచంలో కూడా,యీ కాలంలో సరుకుల అమ్మకం ముమ్మరంగా సాగుతోంది.బేరం చేయగలిగితే చౌకగా దొరకని వస్తువు లేదు.చివరకు కొనేవాడెవడైనా ఉంటాడా అన్నది అనుమానమే.”

ఇవి  యీ గ్రంథప్రారంభవాక్యాలు.యూరప్ లో తత్త్వశాస్త్రపారిశ్రామికరంగం ముమ్మరంగా ఉత్పత్తులు పెంచుతూన్న కాలం. “తాజా సరుకు! సరికొత్త దర్శనం!  సహేతుకం! ఇప్పుడే ఫ్యాక్టరీ నుండి వచ్చింది.సరసమైన ధరలు.భలేమంచి చౌకబేరము! ఆలసించిన ఆశాభంగం!దుకాణం మూసేస్తున్నాం!  రండి, కొనండి”, అంటూ వ్యాపారులు పోటీలుపడి అరుస్తున్నారు. కాని, యిలా ఉత్పత్తులు పెంచుకుంటూపోతే  కొంతకాలానికి  కొనేవాళ్ళు కరువైపోతారేమో, అంటాడు జాన్ ముని. ( తన శైలికి వ్యంగ్యం  గుచ్చుకున్న  బాణం, అది తన ప్రాణం అని కీర్క్ గార్డ్ చెప్పుకున్నాడు కదా!) “ దుకాణం మూసేస్తున్నాం!” (“clearance sale”) అనడమెందుకు? ఎందుకంటే, హెగెల్ తత్త్వశాస్త్రంలో తాను చివరిమాట చెప్పేశానని, తాను స్పృశించని విషయం, పరిష్కరించని సమస్య లేదని, తన తరువాత మరెవడూ తత్త్వశాస్త్రంలో రాయగలిగింది ఉండదని భావించాడని, కీర్క్ గార్డ్ వ్యంగ్యం.

ఈ రంగంలో  హెగెల్ ఆనాటి అంబానీ. పాశ్చాత్యతత్త్వశాస్త్రపు హేతువాదపు పునాదిపై తత్త్వవ్యాపారఆకాశహర్మ్యం ( Philosophy Trade Tower అనవచ్చునేమో ! ) నిర్మించాడు హెగెల్ . కీర్క్ గార్డ్  ప్రధానంగా ఆనాటి హెగెల్ హేతువాదంపై తన వ్యంగ్యాస్త్రం సంధించాడని చెప్పుకున్నాం. కాని యీ ముందుమాటలో హెగెల్ ను ప్రస్తావించలేదు. దెకార్త్ ( Descartes) ను ప్రశంసించాడు. నిజానికి హెగెల్, డెకార్ట్ లు యిద్దరూ హేతువాదులే.  డెకార్ట్ “నేను ఆలోచిస్తాను, కనుక నేనున్నాను” ( I think therefore I am, cogito ergo sum) అంటాడు.హెగెల్ “సత్యం సహేతుకం”, ( The real is the rational) అంటాడు. అంటే యిద్దరికీ బుద్ధి ప్రమాణం. కాని, హెగెల్  హేతువాదభవనం తలుపు దభీమని మూసేశాడు. డెకార్ట్ తన హేతువాదానికి తలుపు కొంత ఓరగా తెరచి ఉంచాడు, విశ్వాసం (faith) లోపలికి రాగలిగినంత.

“భగవంతుని విభూతిని  మనం విశ్వసించవలె, మనకు అర్థం కాకపోయినా. మనం యిది సాధ్యమా అని ఆశ్చర్య పడ కూడదు.ఎందుకంటే,మన బుద్ధి పరిమితం.భగవంతుని ప్రకృతి మన అర్థంచేసుకోలేనంత   అనూహ్యంగా అపరిమితం.పవిత్రత్రయగుహ్యతత్త్వం(The mystery of the Trinity)మనకు సహజాతం. “( Principles of Philosophy: Descartes)

సృష్టిలో  ప్రతిదీ బుద్ధికందదు. అందదు కనుక, అర్థంకానిదంతా అసత్యం అనరాదు, అంటున్నాడు డెకార్ట్ . (ఈ డెకార్ట్ వాక్యం హెగెల్ ఉదాహరించాడు కూడా, ( Hegel’ Lectures on the History of Philosophy: Section Two: Period of the Thinking Understanding/ Chapter I. — The Metaphysics of the Understanding/A 1. DESCARTES.) కాని, “ ప్రస్తుతానికి యీ విషయం అటుంచుదాం” (“This matter we shall not, however, enter upon at present.”) , అంటూ మాట దాటేశాడు.

ఈ డెకార్ట్   వాక్యంలో కీర్క్  గార్డ్ కు కావలసిన రెండు కీలకమైన అంశాలున్నాయి. ఒకటి,  బుద్ధికి లొంగని ప్రతిదీ అసత్యం  అనలేము అన్నది. రెండు, సత్యం ఆత్మగతం (Subjective).హెగెల్ కు  సత్యం బాహ్యంలో, దెకార్త్ కు భావంలో.  "I think"లో,  "I" ప్రధానం.ఈ డెకార్ట్ వాక్యంలో “నేను” గట్టిగా పట్టుకున్నాడు కీర్క్ గార్డ్. నేను, భగవంతుడు. అంతే, మా మధ్య ఎటువంటి మధ్యవర్తికి చోటు లేదు, అంటాడు. “నాకు మాత్రమే సత్యమేదో ఆ సత్యం కొరకు నా అన్వేషణ”, అంటాడు. సార్వకాలికము సార్వత్రికము అయిన సత్యం ఉండదు. నేను సాధించుకున్న సత్యం నీకు సత్యం కాలేదు. నీ సత్యం నీవు సాధించుకోవలసిందే. సత్యం అస్తిత్వంలోనుండి రావలె అన్నదే అస్తిత్వవాదం.

డెకార్ట్ చేసిన తత్త్వవిచారం, లోకం కోసం సృష్టించిన మరో దర్శనశాస్త్రం కాదు.అది తనకొరకు, తన వ్యక్తిగత సమస్యను సందేహాన్ని నివర్తించుకోడానికి, తాను అంతవరకు చదివిన శాస్త్రంతో తనకు కలిగిన అజీర్తిని నివారించుకోడానికి చేసింది. “మీ ఇంటికి నిప్పంటుకుంది, మేలుకోండి!” అని కాపలావాడిలా కేకలు వేయలేదు డెకార్ట్ . “దేనినీ నమ్మవద్దు. ప్రతిదానినీ అనుమానించండి, ప్రశ్నించండి”, అనలేదు. విశ్వాసం మూఢులకే అనలేదు. (“ He did not cry, "Fire!" nor did he make it a duty for everyone to doubt; for Descartes was a quiet and solitary thinker, not a bellowing night-watchman; he modestly admitted that his method had importance for him alone and was justified in part by the bungled knowledge of his earlier years.” Johannes: tr. Walter Lowrie)

ఈ ముందు మాటలో( preface) , కీలకమైన వాక్యం:

“ఈ కాలపు ప్రత్యేకత ఏమంటే,  విశ్వాసం వద్ద ఎవ్వరూ ఆగడం లేదు.ప్రతి ఒక్కడూ  దాన్ని దాటి ముందుకు వెళతానంటాడు.”(“ In our time nobody is content to stop with faith but wants to go further.”)

ఒకానొక కాలంలో ( ఉదా.సోక్రటీస్ కాలంలో)  విశ్వాసం కలగడమంటే అది ఒక జీవితకాలసాధన. అది ఒక గమ్యం, ఒక సాఫల్యం. ఈ కాలంలో, అది గమ్యం కాదు, ఓనమాలు. అది సాధనకు మొదలు. డెకార్ట్  యిక్కడికి , యీ ఓనమాలవద్దకు,  చేరుకోడానికి, తన జీవితకాలంలో సంపాదించుకున్నదంతా సన్యసించాడని ఎవరూ తెలుసుకోడం లేదు. ప్రతి దానిని ప్రశ్నించడం, కాదనడం, యిది యీనాటి విజ్ఞానం, తత్త్వజ్ఞానం.

జాన్ ముని తాను కవినని, తాత్త్వికుణ్ణి కానని,యింకా చెప్పాలంటే, ప్రతితాత్త్వికుణ్ణని (anti-philosopher) చెప్పుకున్నాడు. తాను ఏ తత్త్వదర్శనానికి అభిమానిని కానని, మరో సరికొత్త తత్త్వదర్శనశాస్త్రనిర్మాణం చేయవలెనని కోరడమూ లేదని అంటాడు. “ఇప్పుడున్న తత్త్వశాస్త్రసౌధం చిరకాలం భద్రంగా ఉండాలని, దీనిలో పెట్టుబడిపెట్టిన వాటాదారులు (shareholders) అందరూ లాభం పొందాలని,  నేను వేయిమంది దేవుళ్ళకు మొక్కుతాను.కాని నేను మాత్రం ఆ సౌధంలో ప్రవేశించను”, అంటాడు జాన్ ముని.

చివరగా, కలం పేరు “జాన్ ముని” గురించి.అలెస్టేర్ హానే (Alastair Hannay) యీ పేరు గ్రిమ్ రాసిన చిన్నపిల్లల కథ “ నమ్మిన బంటు”(The Faithful Servant)  లోనిది అని గుర్తించాడు. ఆ కథలో జాన్ ఒక రాజుకు బంటు. అతడికి తన ప్రభువుకు కలగబోయే మూడు ప్రమాదాలు తెలుసు. కాని అవి రాజుకు చెబితే, తాను శిలగా మారిపోతాడని కూడా తెలుసు. అయినా, వాడు రాజుకు అతనికి కలగబోయే ప్రమాదాలగురించి చెబుతాడు. ఆ తరువాత, రాజు శిలగా మారిన జాన్ ను తిరిగి బతికించడం కొరకు, తన కుమారులను బలి యిస్తాడు.తిరిగి బతికిన జాన్, బలి అయిన రాకుమారులను బతికిస్తాడు.

ఈ కలంపేరు ఎన్నుకోడంలో కీర్క్ గార్డ్ ఆశించిందేమిటి? మొదట, యిది పసిపిల్లల అద్భుతకథ (fairy tale).ఏ అద్భుతాన్నైనా  నమ్మగలిగిన పసిమనసులలోకి ఎదగమని సూచన.(“Whoever does not welcome the kingdom of God like a little child will certainly not enter it” (Mark 10:13-16).భాగవతసామ్రాజ్యంలోకి పసిమనసులకే ప్రవేశం.అంటే, కీర్క్ గార్డ్ భావనలో ప్రధానాంశమైన విశ్వాసం,  జాన్ అన్న కలం పేరులోనే పట్టుకున్నాడు.పైగా ఆ కథలో కూడా కథావస్తువు, అసంబద్ధమందు విశ్వాసం. బంటుకు తన ప్రాణం పోతుందని తెలిసికూడా  ప్రభువుకు నమ్మినబంటుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. తను చేసిన త్యాగానికి, రాజు తిరిగి ప్రత్యుపకారం చేస్తాడని, తన కొడుకులను బలి యిచ్చి తనను మరల బతికిస్తాడని ఆశించలేదు. అది నిజమైన విశ్వాసం. మరొకటి, శిల అయినవాడు, బలి అయిన వారు,  తిరిగి బతకడం అసంభవం.కాని ఆ అసంభవం సంభవమే అని నమ్మడమే (faith in  absurd) నిజమైన నమ్మకం. అసంభవంలో విశ్వాసం ( faith in the absurd) కీర్క్ గార్డ్ అస్తిత్వవాదంలో ప్రధానాంశం.
ఈ జాన్ , “ముని” . మౌనమెందుకు? ఎందుకంటే, విశ్వాసం అనేది అసంబద్ధం.అది బుద్ధికి అందేది అర్థమయేది కాదు. పూర్తిగా వైయక్తికం. ఒకడికి  చెప్పగలిగినది కాదు, చెబితే అర్థమయేదీ కాదు. ఒకడితో  పంచుకోగలిగినది కాదు. (షేర్, ఫర్వార్డ్ వసతి లేదు.) కనుక ముని, మౌనం.
ఈ జాన్ ముని కలం పేరులో మరో పరమార్థం. కథలో బంటుకు తాను తనకు తెలిసిన నిజం చెబితే, తన ప్రాణం పోతుందని తెలుసు. ఈ గ్రంథంలో కూడా జాన్ పరిస్థితి అటువంటిదే. తన రచనను లోకం ఆమోదించదని, మౌనంగా ఉండడమే మేలని తెలుసు. చెప్పినా ఎవడికీ అర్థం కాదని తెలుసు. కాని, ఉండలేడు, కథలో బంటులాగా.ప్రాణం పోయినా చెప్పకుండా ఉండలేడు. కాలం నిరవధికము, పృథివి విపులము. ఎవడో ఒకడు ఎక్కడో ఒకచోట ఏదో ఒకనాడు, యీ శిలకు తిరిగి ప్రాణంపోయకపోడు అన్న విశ్వాసంతో  కాదు రచనచేసింది, ప్రాణంపోయరన్న విశ్వాసంతో. (“He writes because for him it is a luxury which becomes the more agreeable and more evident, the fewer there are who buy and read what he writes….He foresees his fate–that he will be entirely ignored.”tr.Walter Lowrie)
ఇది “ రచయిత” జాన్ అభిప్రాయం.కాని, రచయిత కీర్క్ గార్డ్ అభిప్రాయం దీనికి పూర్తిగ విరుద్ధం:

"Oh, once I am dead, Fear and Trembling alone will be enough for an imperishable name as an author. Then it will be read, translated into foreign languages as well. The reader will almost shrink from the frightful pathos in the book"(Journals and Papers)

ఈ యిద్దరి రచయితల విరుద్ధాభిప్రాయాలను సమన్వయం చేసుకోవలసిన అవసరంలో మనకు యీ రచన గురించి మరో ముఖ్యవిషయం తెలుస్తుంది. జాన్ రచనలోని వాక్యాలను యథాతథంగా కీర్క్ గార్డ్ ఆభిప్రాయాలుగా గ్రహించరాదు. ఏది అవునో ఏది కాదో వివేచించుకోవలె.

“భయము, కంపము” ముందుమాటలో గ్రంథవిషయం వాచ్యంగా చెప్పకపోయినా,(జాన్,  కవి కదా!),స్పష్టంగానే సూచించాడు, ధర్మాన్ని  హేతువాదపు పిడికిలినుండి  విడిపించడం. ( క్రైస్తవధర్మమని అనలేదు.కాని ఆయనవాదం క్రైస్తవానికే పరిమితం కానక్కరలేదు.) ఈ ప్రయోజనం కొరకు,కీర్క్ గార్డ్  దెకార్త్ ను పాశ్చాత్యతత్త్వశాస్త్రవ్యాపారసౌధంనుండి వెలుపలికి తీసుకొచ్చాడు. అరిస్టోటిల్ నుండి హెగెల్ వరకు నిర్మించబడిన సౌధంనుండి దెకార్త్ ను వెలుపలికి తెచ్చి, అతన్ని సోక్రటీస్ తో కలిపాడు. సంశయంద్వారా సమాధానంపొందడం నేర్పినవాడు సోక్రటీస్. దెకార్త్ ఆధునికతత్త్వశాస్త్రానికి ఆద్యుడు.అతడు సంశయానికి జీవించే అవకాశం యిచ్చాడు. (“We must believe what is revealed to us by God, though we cannot understand it.”)సంశయమే విశ్వాసానికి  అవకాశం.

 ఈ ముందుమాటలో అతడు ప్రస్తావించిన మరో ముఖ్యాంశం, క్రైస్తవరాజ్యం ( Christendom) నుండి క్రైస్తవధర్మాన్ని ( Christianity) కాపాడి, దానిని సిద్ధాంతంనుండి ఆచరణవైపు ఆకర్షించడం.ధర్మం దస్త్రంలో దాచిన శాస్త్రం (doctor) కాదు. ధర్మం చెప్పేది కాదు, చేసేది. “ధర్మం చర.” "My task has continually been to provide the existential corrective ." (Journals and Papers: Kierkegaard) ఈ ఆచరణమే,  కీర్క్ గార్డ్ అస్తిత్వవాదంలో (Existentialism) ప్రధానాంశం.(ఈ పుస్తకంలో తరచు కనిపించే పదాలు,  “act,” “motion,” “gesture.”)

                                                          *****

ఐజక్ బలి, సామాజికసందేశం:

అబ్రహాం కథ సమాజంలో ఎటువంటి అనర్థకరపరిణామాలకు దారి తీయదా?అసలే ధర్మం (మతం) పేరుతో హింస పెరిగిపోతున్న యీ కాలంలో యిటువంటి కథలు ప్రవచనాలు ప్రమాదకరం కావా ? ఆధ్యాత్మిక అధికారం ఉన్న ఏ కొద్దిమందికో  మాత్రమే రహస్యంగా ఉపదేశించవలసినదా యీ  కథ? బాహాటంగా చర్చిలలో  ఆదివారాలలో పాస్టర్ భక్త్యావేశంతో, గంభీరస్వరంతో, ఉదాత్తానుదాత్తస్వరసహితంగా, యీ కథ చెబుతూనే ఉన్నాడు,వేలసంవత్సరాలుగా.ఎంతమంది తమ నిద్ర పోగొట్టుకున్నారు? కథ చెప్పిన పాస్టర్ , ప్రవచనానికి పదిహేను నిమిషాలముందు వరకు సుఖంగా నిద్రపోయాడు. కథ విని యింటికి వెళ్ళిన భక్తులు అరగంటలో  నిద్రపోయారు.నిద్రలో ఎవరూ కలవరించలేదు. తెల్లవారి ఎవరూ కథను తలవలేదు.

 పాస్టర్  ప్రవచనం మొదలుకాగానే భక్తులు నిద్రావస్థలోకి  వెళ్ళిపోతారు. వాళ్ళలో నిద్రపట్టని జబ్బు ఉన్నవాడొకడు కథ వింటాడు. కథ అయిపోయిన తరువాత  బిర్యాని  ప్రసాదంకోసం ఆగకుండా  వెళ్ళిపోయాడు. చర్చిలో బిర్యానీకార్యక్రమం పూర్తి అవుతుండగా, పాస్టర్ దగ్గరకు ఎవడో పరుగెత్తుకొంటూ వస్తాడు. తినడం మధ్యలో ఆపి పాస్టర్ పరుగున వెళ్ళి చూసి, వెర్రికేక వేస్తాడు, “నీకేమైనా. మతిపోయిందా ? ఏం చేస్తున్నావ్?”, అని. కొడుకును బలి యివ్వబోతున్న ఆ భక్తుడు,  “మీరు చెప్పిందే కదా,చేస్తున్నాను?”, అంటాడు. లోకంలో సాధారణంగా మనం వినే మాట, “జనాలు ప్రవచనాలు యీ చెవితో విని ఆ చెవితో  వదిలేస్త్తారు,ఒక్కడూ ఆచరించడు”, అని.ఆచరించడం లేదని సంతోషించాలి, అబ్రహాం కథ విషయంలో.
విశ్వాసి వలన లోకానికి అపకారం జరగదు.అతడు  లోకనీతిని వ్యతిక్రమించడు,అతిక్రమిస్తాడు. అతడు అధర్మం ఆచరించడంలో అశక్తుడు.అతడు ఆచరించింది  ధర్మం.

పాస్టరు చెప్పిన కథలో ఏమిటి లోపించింది? భయము కంపము.లోకంలో సాధారణంగా వింటుంటాం,ఒకడు ఏమీ కష్టపడకుండా రాత్రికి రాత్రి కోటీశ్వరుడైనాడని. ఆధ్యాత్మిక మార్గంలో అటువంటి అద్భుతాలు జరగవు.ఇక్కడ ప్రతిక్షణము చెమటోడ్చి  సంపాదించుకోవలసిందే. “అబ్రహం నిద్రపోతూ  గొప్పవాడైపోలేదు….కత్తి దూసినవాడే  ఐజక్ ను పొందుతాడు.”(పుట.57) లోకధర్మాన్ని అనుసరించి  అబ్రహాం చేసేది హత్య. కాని పారమార్థికదృష్టిలో అది దైవప్రీతికోసం జరిపే యజ్ఞం.ఈ వైరుధ్యంలో ఉన్నది,  నిద్రపోనివ్వని సంఘర్షణ, సంక్షోభం, కత్తికోత. ఆధ్యాత్మిక మార్గం అనుక్షణం కత్తి అంచుమీద  నడవడం వంటిదే.విశ్వాసమహాసి మనిషిని రెండుగా చీల్చిగాని రక్షించదు. అబ్రహాం కథనంలో లోపిస్తున్నది యీ  కత్తికోత.అది లేనిదే అబ్రహాం లేడు. ఈ కోత లేనిదే  మనిషికి జీవం లేదు.ఆ కత్తికోత అస్తిత్వధర్మం.

అబ్రహాం కథను వాచ్యార్థంలో ఎవరూ  గ్రహించరు. అందరికీ తెలుసు, అది ఒక రూపకం (allegory).రామాయణకథ విని ఎవడూ హనుమలా సముద్రం దాటే ప్రయత్నం చేయడు. “అబ్రహాం కథలో  గ్రహించవలసిన పాఠం హింస కాదు, విశ్వాసం.”(పుట.61) విశ్వాసం హత్యను  యజ్ఞంగా మారుస్తుంది.

అయితే, యీ అబ్రహాంను ఎలా తెలుసుకోవడం? అతడు ఎలా మాట్లాడుతాడు ( “కా భాషా”) ,ఏం తింటాడు,ఎలా ఉంటాడు?అతని తల వెనుక  ఒక వెలుగుచక్రం  తిరుగుతూ ఉంటుందా? ఉండదు. నీలాగా నాలాగా మీ పక్కింటి  బిల్ కలెక్టర్ లాగా,ఉప్పులో కలిసి కప్పురంలాగా ఉంటాడు. “ఓస్, వీడా!” అనేటట్టుంటాడు.జీవితకాలమంతా “వెదకిచూచినా”, అతడు ఎదురుగా నిలిచినా, అతన్ని మనం గుర్తించలేం.

                                                          ******

వైరాగ్యం, విశ్వాసం:

జాన్ యిద్దరు యోధులను చెబుతాడు: వైరాగ్యయోధుడు (Knight of Infinite Resignation) ,విశ్వాసయోధుడు,(Knight of Faith). కత్తి, డాలు ధరించి యుద్ధాలుచేసేవాడే కాదు యోధుడు.నిత్యము జీవితంలో ఏదో ఒక పోరాటం అవసరమవుతుంది. అయినా నిత్యమూ  మనం పోరాడం. సమస్యతో సంధిచేసుకుపోతాం. యోధుడు అలా రాజీ పడడు. పోరాడుతాడు.
ఈ పోరాటం రెండువిధాలు, ఒకటి. వైరాగ్యం, మరొకటి విశ్వాసం.వైరాగ్యం మనిషి సంకల్పం, మనిషి నిర్ణయం, మనిషి నిశ్చయం.విశ్వాసంలో నాదేమీ లేదు, అంతా భగవదిచ్ఛ.

రాగం లేని వస్తువును  వదులుకోడం  వైరాగ్యం కాదు. “ఇది విలువలేనిది”, లేక “దీనిపై నాకు విసుగు (bore) వస్తోంది”, అన్న భావంతో  వదులుకోడం వైరాగ్యం కాదు. విలువ తెలిసి, ప్రేమించిన వస్తువును వదలడమే నిజమైన వైరాగ్యం.అబ్రహాం లోకమంతటిలో తనకు అత్యంతప్రియమైన  ఐజక్ ను బలి యిస్తున్నాడు.ఐజక్ ను అంతగా ప్రేమించకపోతే, అతని త్యాగానికి విలువలేదు.
వైరాగ్యం సామాన్యవిషయంకాదు. ఎంతో ధీరుడు నిర్జితేంద్రియుడు అయితే కాని తన సర్వస్వాన్ని  “నాది కాదు” ( “న మమ”) అనలేడు. “అలా అనగలగడం తనను తాను శాశ్వతంగా గెలుచుకోడమే.శాశ్వతుడు  పరమాప్తుడు అయిన  పరమాత్మకు ప్రియమాచరించడమే.”(పుట.77) “

వైరాగ్యంలో లక్ష్యమూ  అల్పం కాదు కాని,  లక్ష్యం స్పష్టం.విశ్వాసంలో లక్ష్యం తెలియదు.అది భగవదిచ్ఛ. అబ్రహాంకు ముందే తెలుసా, తిరిగి తాను ఐజక్ ను పొందగలనని?  తెలియదు.బలి అయినవాడు తిరిగిరావడమేమిటి? అర్థంలేని మాట.అసంభవం అని తెలుసు.అయినా అతని విశ్వాసం చలించలేదు. అసంభవమని తెలిసి, సంభవమే అని  విశ్వసించడమే నిజమైన విశ్వాసం. సంభవమని విశ్వాసం, కాదు  అసంభవమని వాస్తవం సంఘర్షిస్తూనే ఉంటాయి.అబ్రహాం కథలో పాస్టర్ వదిలేసేది  యిదీ, యీ ఘర్షణ,వ్యథ. ఇదీ అస్తిత్వవాదంలో కీలకాంశం.

వైరాగ్యం తక్కువేమీ కాదు:

వైరాగ్యం విశ్వాసానికి మెట్టు, కాని సాగిపోవలసిన మెట్టు, ఆగిపోవలసిన మెట్టు కాదు. అబ్రహాం వైరాగ్యపు మెట్టు దగ్గరే ఆగిపోయిఉంటే కూడా, అతడి త్యాగం సామాన్యమైనదేమీ కాదు.వైరాగ్యంలో  కొడుకును భగవంతుడికి అర్పించిఉంటే కూడా, లోకం అతన్ని మహాత్ముడు అని కీర్తించేది. అలా కోరినవారిని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం.అబ్రహాం అలా ఆగిపోలేదు. అబ్రహాం విరాగి కాడు.”పితా నైవ మే నైవ మాతా చ జన్మ న బంధుర్న మిత్రం”, అని సన్యాసిగీతం పాడలేదు. “సుతునందు మోహవిచ్ఛేదము సేయుమయ్య”, అని ప్రార్థించలేదు. వైరాగ్యభావంతో  ఐజక్ ను బలి యివ్వడమంటే ఐజక్ , అబ్రహాంకు  అత్యంతప్రియమైన వస్తువు కాదనడమే  కదా ? అలా తనకు అనురాగం  లేని తన కొడుకును తిరిగి పొంది, అతనితో జీవితం అబ్రహాం ఆనందంగా గడపగలిగేవాడా? భగవంతుడికి నివేదనచేసేది నీకు అత్యంతము యిష్టమైన వస్తువు అయిఉండవలె. ఇష్టంలేని వస్తువు నివేదించి, ఆ నైవేద్యాన్ని ఏం చేస్తావు? తినలేవు, చెత్తలో వేయలేవు. ఇష్టంలేని కందదుంప కాశీలో వదిలినట్టు.ఇష్టమైన వస్తువు నివేదన చేస్తే నైవేద్యం ప్రసాదం, పూర్వాధికప్రియం. ఇష్టం లేని వస్తువు  ప్రసాదం కాదు, విషాదం. భగవత్ప్రసాదంగా తిరిగి పొందిన ఐజక్ తో అబ్రహాం  ఆనందంగా ఎలా జీవించగలడు? అబ్రహాం కోరింది పరలోకంలో మేలుకాదు.ఇహంలో ఆనందం. తనకు అత్యంతము ప్రియమైన ఐజక్ ను నివేదించాడు.కనుక, భగవంతుడు ఐజక్ ను తిరిగి తనకు యిచ్చినపుడు, మహాప్రసాదమని మహానందంతో స్వీకరించాడు.ప్రపంచాన్ని ప్రేమించు. దానిని భగవంతుడికి అర్పించు. అప్పుడు ప్రపంచం పూర్వాధికమధురప్రసాదమవుతుంది. వైరాగ్యం గొప్పదే. కాని  యీ విశ్వాసం దాని పైది. భగవంతునికి ఏదీ అసంభవం కాదు అన్న నమ్మకమే నిజమైన నమ్మకం (faith in the absurd).

వైరాగ్యానికి విశ్వాసం అవసరంకాదు. కాని విశ్వాసానికి వైరాగ్యం అవసరం. అది విశ్వాసానికి ముందుమెట్టు. “వైరాగ్యంలో  నేను సర్వమూ పరిత్యజిస్తున్నాను. కాని, విశ్వాసంలో  నేను ఏదీ వదులుకోడం లేదు.పైపెచ్చు, విశ్వాసంలో నేను సమస్తమూ పొందుతాను.”(పుట.77) ఈ  తిరిగిపొందడాన్నే కీర్క్ గార్డ్ “ఉభయచర్య” (“double movement”)అంటాడు. కాని, పొందడం అసంభవం అన్న వాస్తవం, సంశయం, భయం, కంపము అన్నీ ఆ విశ్వాసంలో భాగం. అవి లేని స్తిమితం అస్తిత్వం కాదు.ఇదే అస్తిత్వవాదం. సంశయం విశ్వాసంలో అంతర్భవించి ఉంటుంది. “సంశయాత్మా వినశ్యతి” అనడు కీర్క్ గార్డ్. “కలడో లేడో” అన్న సంశయం “నీవే తప్ప నితః పరంబెరుగ” అన్న విశ్వాసానికి నడిపిస్తుంది. నడిపించి, ఆ తరువాత వదిలిపోతుందా? పోదు, బంగారపు సొమ్ములో రాగిలా  ఉండిపోతుంది.

భక్తి, విశ్వాసం:

విశ్వాసంలో వైరాగ్యం ఉంది. భక్తికి  చోటుండదా? ఉంది, కాని విశ్వాసాన్ని మించికాదు. ఐజక్ ను బలికోరిన భగవంతుని ప్రేమించడం సులభంకాదు. అబ్రహాం ప్రేమించగలిగేవాడే. కాని, అప్పుడు అతడు భక్తుడు మాత్రమే. కాని, అబ్రహాం అతి సహజంగా సంతోషంగా  ఐజక్ తో తన జీవితాన్ని కొనసాగించాడు. “విశ్వాసంలేని భక్తిలో భక్తుడుంటాడు.విశ్వాసంతోటి  భక్తిలో భగవంతుడుంటాడు.”(పుట.66)  ఈ సృష్టిలోని చెడును అన్యాయాన్ని విషాదాన్ని చూచినపుడు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అనడం. ఈ సృష్టిలోని వైషమ్యం మనం అర్థం చేసుకోలేనిది. విశ్వాసంలో సమాధానాలుండవు, నిజమే.కాని, ప్రశ్నలూ ఉండవు.

కనుక భక్తిజ్ఞానవైరాగ్యాల త్రికూటానికి అవతలిది విశ్వాసశిఖరం.అబ్రహాం ఆ ఆధ్యాత్మికశిఖరంపై నిలిచి ఉన్నాడు.

“హెగెల్ ను అర్థంచేసుకోడం కష్టం. అబ్రహామా?  అతడేమి కష్టం? అబ్బో ! హెగెల్ ను మించిపోవడమంటే అదొక అద్భుతం. అబ్రహాంను మించడం, అదొక విషయమా? ”, అంటారు. మనకు అబ్రహాం అర్థం కాడు.హెగెల్ అర్థమవుతాడు! “హెగెల్ రాసింది అతనికైనా అర్థమయిందని నాకు నమ్మకం లేదు”, అంటాడు జాన్ ( పుట.62)

మనం విశ్వాసం వద్ద ఆగిపోవడం లేదు. దానిని దాటి పోవాలనుకొంటున్నాం.ఒకానొక కాలంలో విశ్వాసం ఒకజీవితకాలసాధన.దానిని మించి సాధించదగింది లేదు. ఈనాడు, “నేను విశ్వాసిని”, అని చెప్పుకోడానికి  సిగ్గుపడుతున్నాం. మనకు విశ్వాసం వద్దు.అది మూఢులకు.మనం మేధావులం.

“విశ్వాసం నీళ్ళను  మద్యంగా  మారుస్తుంది.మనకీనాడు మద్యం మంచినీళ్ళు.”(పుట.67)

మనకు మద్యం చాలు, నైవేద్యం వద్దు.

[ వైరాగ్యము విశ్వాసము భారతీయవేదాంతంలో తరచు వినిపించే మాటలు. భారతీయదృక్పథంలో   వాటిని స్థూలంగా పరిశీలించ వచ్చు. ముందుగా, పారిభాషికపదాలు. ఇక్కడ faith అన్న పదానికి తెలుగు సమానార్థకంగా  విశ్వాసం అన్న పదం వాడుతున్నాం.వైదికపరిభాషలో శ్రద్ధ అనే శబ్దం వాడుతారు.(“శ్రద్ధయాఆస్తిక్యబుద్ధ్యా”.శం.భా.గీత.6.37.ఆస్తిక్యబుద్ధి అంటే కేవలం భగవంతుడున్నాడన్న విశ్వాసం కాదు.భగవంతుడు, సర్వజ్ఞుడు సర్వవ్యాపి సర్వసమర్ధుడు అన్న విశ్వాసం.మనిషికి  అసంభవం అయింది, లోకం దృష్టిలో అసంబద్ధం అయింది,  భగవంతుడికి  సంభవమే. ఆయనకు ఏదీ అసంభవం, అసంబద్ధం కాదు.అది తెలియడమే  నిజమైన శ్రద్ధ ( faith in the absurd), అసంబద్ధమందు ఆస్తిక్యబుద్ధి.

“వైదికపరిభాషలో శ్రద్ధ, వైరాగ్యము- వీటి వివేచన ఎలా చేశారు? వైరాగ్యం మోక్షానికి ప్రథమకారణం అన్నారు.ఏమిటా వైరాగ్యం? నిత్యానిత్యవస్తువివేకఫలం.(“మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు.”వివేకచూడామణి.69.) జాన్ ఏమంటున్నాడు? “వైరాగ్యంలో  నేను సర్వమూ పరిత్యజిస్తున్నాను. విశ్వాసంలో  నేను ఏదీ వదులుకోడం లేదు.పైపెచ్చు, విశ్వాసంలో నేను సమస్తమూ పొందుతాను.” (పుట.77). సర్వపరిత్యాగంలో నేను తిరిగి సర్వము పొందుతాను అన్నది వైదికభావం కూడా.అనిత్యాన్ని  త్యాగం చేసి, నిత్యమేదో దానిని పొందుతాను.ఎలా? ఇదంతా యీశ్వరునిదే అన్న భావంతో ఆయనకు నివేదించి, తిరిగి దానిని ప్రసాదంగా పొందడం. “ తేన త్యక్తేన భుంజీథాః.” నా ఈశోపనిషత్తు వ్యాఖ్యకు ఉపశీర్షిక  “ప్రవృత్తి-నివృత్తి-ప్రవృత్తి”.ఇది కీర్క్ గార్డ్ చెబుతున్న “ ఉభయచర్య”, double movement.అల్పాన్ని వదిలి అనల్పాన్ని పొందడం మంచి బేరమే కదా? “యో వై భూమా తత్సుఖం. నాల్పే సుఖమస్తి.”( ఛాం.ఉప.7.23.1)

జాన్ మరో మాట చెబుతున్నాడు, విశ్వాసం పరం కొరకు యిహాన్ని వదులుకోదు అని.వైదికవైరాగ్యం యిహాన్ని అమ్ముకొని పరం కొనుక్కో అంటుంది.

“ఇహమే పరమ ని నమ్మి తిని
పరమే  పరులకు  అమ్మి తిని.
జ్ఞానతేజ శ్రీ వేంకటేశ
నా చింతదీర్చు చిద్విలాస” (వేటూరి)

 ఆపైన రెంటినీ వదలమంటుంది, “యిహాముత్ర ఫలవిరాగః”.(వి.చూ.) ఎందుకంటే,విద్వత్సంన్యాసికి,  అంటే జ్ఞానికి ( “జ్ఞానం సంన్యాసలక్షణం”.) యిహము పరము రెండూ వదలవలసినవే.

(సంన్యాసంలో రెండు దశలు, వివిదిషాసంన్యాసము, విద్వత్సంన్యాసము.మొదటిది సాధనదశ రెండవది సిద్ధి.మొదటి దశలో “నేను” సంన్యసిస్తాను.రెండవదశలో,  వదిలిన “నేను” వదిలిపోతుంది) ]

                                                      *****

మూడు  ప్రశ్నలు:( problemata 1,2,3.)
( Problemata: Preamble from the heart అని పెంగ్విన్ ప్రతి అనువాదం. లౌరీ (Walter Lowrie) తన అనువాదంలో, Preliminary Expectorations,అన్నాడు. (Latin ex + pectus, -oris, meaning "out of (or from) the breast (heart).హృదయంలో నుండి వచ్చిన మాట.)

తరువాతి  మూడు అధ్యాయాలలో జాన్ మూడు ప్రశ్నలను ఆవిష్కరించాడు. సాధ్యమైన సమాధానాలు సూచించి, నిర్ణయం పాఠకుడికి వదిలేశాడు.

ప్రశ్నలు:

1.ధర్మాన్ని అతిక్రమించవలసిన సందర్భం ఉంటుందా?
2.దైవం పట్ల ఉల్లంఘించరాని కర్తవ్యం ఉందా?
3.అబ్రహాం తన కర్తవ్యం సారాకు గాని, ఎలీజర్ కుగాని, ఐజక్ కు గాని చెప్పకపోవడం న్యాయమా?)

ఈ ప్రశ్నలను పరిశీలించే ముందు, పరిశీలనకు కావలసిన పరిభాషను నిర్ణయించుకోవడం అవసరం. ఈ అధ్యాయంలో ప్రధానవిషయవివరణకు ఉపయోగించిన రెండు పదాలు,ethics, religion. వీటికి సమానార్థకాలు తెలుగులో రూఢిగాలేవు.సమానార్థకాలను నిర్ణయించే ప్రయత్నంలో, సనాతనధర్మంలో తరచు వాడే ధర్మార్థకామమోక్షపదాలను పరిశీలిద్దాం.ఈ నాలుగింటిలో, మొదటి మూటికి  ప్రయోజనం లౌకికం .లౌకికమంటే, ఇహలోకం పరలోకం కూడా. చివరిదైన మోక్షం అలౌకికం.ధర్మమనే పదం కొందరు మతమన్న అర్థంలో ప్రయోగిస్తారు, ఉదా.క్రైస్తవధర్మం. కాని, ప్రస్తుతసందర్భంలో గమనించవలసిందేమంటే,  కీర్క్ గార్డ్ religion అన్న పదం మతము,  ధర్మము అన్న సామాన్యార్థంలో వాడడం లేదు. అతని religion, పురుషార్థాలలోని ధర్మం కూడా కాదు, అది లౌకికం కనుక. కీర్క్ గార్డ్ religion అన్న పదం, అలౌకికార్థంలో, వాడుతున్నాడు. అలా అని, పురుషార్థాలలో చివరిదైన మోక్షమనే అర్థంలో ప్రయోగిస్తున్నాడనవచ్చునా?అది కూడా అనలేము.  కీర్క్ గార్డ్ ఆశించేది  లౌకికాలనుండి ముక్తి కాదు.అతడు కోరేది, తనకు దైవానికి మధ్య అడ్డువచ్చే ఏ లౌకికమైనా, అది విశ్వమంత మహద్విషయమైనా, దానినుండి  ముక్తి.

“భయము, కంపము” లోని మూడు ప్రశ్నలలో మొదటిది: ధర్మాన్ని అతిక్రమించవలసిన సందర్భం ఉంటుందా?( Is there a teleological suspension of the ethical?)ధర్మాన్ని ఉపేక్షించవలసిన సందర్భం ఉన్నది అంటే, అది లౌకికప్రయోజనానికి మించిన ప్రయోజనమై ఉండవలె.

ఈ గ్రంథంలో చర్చించిన మూడు సమస్యలు (problemata) కూడా హెగెల్ వాదాన్ని ఖండించడం కొరకే. “ భయము, కంపము”లో ప్రధానవిషయం,నీతి, ధర్మము, (the ethical and the religious,) వీటి వివేచన.అయితే, కీర్క్ గార్డ్ హెగెల్ వాదం తప్పు అని ఖండించడు. పైగా, యీ గ్రంథరచయిత జాన్ (Johannes )  తాను హెగెల్ వాదాన్ని అనుసరించే వాడినే అంటాడు.( “నాకు హెగెల్ అర్థమవుతాడు, సాధారణవ్యక్తి అయిన అబ్రహాం ఎంతకూ అర్థం కాడు”,  అంటాడు.) కనుక, కీర్క్ గార్డ్ తీర్పు చెప్పడు.హెగెల్  తాత్త్వికవాదం ఒప్పైతే, అబ్రహాం చేసింది తప్పు. అబ్రహాం చేసింది ఒప్పైతే, హెగెల్  తాత్త్వికవాదం తప్పు.ఏది ఒప్పు ఏది తప్పు, మీరే నిర్ణయించుకోండి, అని పాఠకులకు వదిలేస్తాడు.

లోకధర్మాన్ని అనుసరించి, అబ్రహాం చేసింది హత్య.అబ్రహాం దృష్టిలో అది యజ్ఞం.హత్య యజ్ఞం ఎప్పుడవుతుంది? విశ్వాసంలో(faith). విశ్వాసమంటే యీ అసంబద్ధమే.  సమష్టి కంటే వ్యష్టి ఉన్నతుడు. ఎలా? సమష్టినుండి  విడివడి కాదు. సమష్టిలో అంగమై, ఆ అంగమే సమష్టిని పొదుగుకొని దానిని మించి ఎదగడం.  (“శ్రద్ధ అంటే వ్యక్తి, ఒక్కడు, సమష్టికంటే ఉన్నతుడు అన్న  యీ అసంబద్ధతే…సమష్టిలో అంగమై, ఆ ఒక్కడూ సమష్టినుండి విడిగా నిలబడతాడు, విశ్వానికి అతీతుడైన  విశిష్టుడిగా.” పుట.84 ) సమష్టిలో అంగమై, సమష్టిని దాటి పోవడమనేది తర్కానికి అందని అసంబద్ధం, absurdity, వైరుద్ధ్యం, paradox )
 
తండ్రి  తన  బిడ్డను బలి యిచ్చిన మూడు ఉదాహరణలు యిచ్చాడు జాన్. ఒకటి, ఆగమెమ్నాన్ తన కూతురు ఇఫిజీనియాను బలి యిచ్చాడు.ఒక  అపరాధం చేసి దేవతకు వెనుక తాను కోపకారణమైనాడు. గ్రీకులు ట్రోజన్ యుద్ధం గెలవాలంటే, వారి నౌకలు క్షేమంగా సముద్రంలో వెళ్ళగలగవలెనంటే, ఆ దేవతను ప్రసన్నం చేసుకోడం అవసరం.అందుకు, తన ప్రజలవిజయంకొరకు, తన కూతురును బలి యిచ్చాడు. అది వీరోచితమైన త్యాగం. ఆగమెమ్నాన్ ప్రజల క్షేమం కోసం తన కూతురినే బలి యిచ్చిన  వీరుడు.అటువంటిదే మరొకటి, జెఫ్తా  తాను అమొనైట్లను (Ammonites) యుద్ధంలో ఓడిస్తే, బలి యిస్తానని మొక్కుకున్నాడు. శత్రువులను గెలిచి, బలి యిచ్చి మొక్కు తీర్చాడు. ఇది కూడా ప్రజలమేలుకోసం యిచ్చిన బలి.మూడవది, జూనియస్ బ్రూటస్ దేశద్రోహనేరం చేసిన తన కొడుకులను చంపాడు.ఇది లోకకల్యాణం కోసం చేసింది. వీరందరు, లోకప్రయోజనం కొరకు స్వప్రయోజనాన్ని బలి యిచ్చిన వీరులు.వీరి త్యాగం అల్పమయిందేమీ కాదు. తన బిడ్డను తన చేతులతో బలి యివ్వడం ఏ కారణానికైనా సులభం కాదు. “ప్రభువుగా కాక సామాన్యపౌరుడిగా ఉండిఉంటే ఎంత అదృష్టవంతుణ్ణి ?కనీసం దుఃఖించడానికికూడా అవకాశం లేని దురవస్థ”, అని బాధపడే దుర్భరసందర్భం. అతడు వీరుడు.
     కాని, అబ్రహాం యిచ్చిన బలి ఎవరి కొరకు? లోకం కొరకు కాదు. పైగా లోకధర్మాన్ని  ధిక్కరించేది. లోకానికి అర్థం కానిది. లోకానికి  తెలియనిది. కేవలం తనకు దైవానికి సంబంధించింది. లోకానికి చెప్పలేనిది. అబ్రహాం వీరుడు కాడు. అతడు విశ్వాసయోధుడు (knight of faith ). అబ్రహాం బలికి  తక్కిన బలులకు తేడా ఉంది.తక్కిన వారు వారి బిడ్డలను తిరిగి పొందలేదు.అబ్రహాం తన బిడ్డను పొందగలిగాడు కదా? నిజమే, కాని,  ఒక  కర్మను దాని ఫలితాలను బట్టి నిర్ణయించలేము. దాని ప్రేరణను బట్టి ఆ పనిలో అతడనుభవించిన వ్యథాస్వరూపాన్ని బట్టి  నిర్ణయించవలె.
 
రెండవ ప్రశ్న, దైవం పట్ల  పరమమైన కర్తవ్యం ఉందా? (Is there an absolute duty to God? )
పరమము అంటే తిరిగి అదే అర్థం, లౌకికధర్మాన్ని ఉల్లంఘించవలసిన సందర్భం.హెగెల్ అంటాడు ( అతనికి ముందు కాంట్ అన్నదికూడా అదే.),  మన విధులు,  కర్తవ్యాలు అన్నీ లోకానికి. మానవసేవే మాధవసేవ.మాధవుడు మన ఎదుట నిలబడి నన్ను సేవించండి అనడు. ఈ హెగెల్ ను కాదనడం కష్టమే. అందుకే, హెగెల్ అర్థమైనట్లు, అబ్రహాం అర్థం కాడు మనకు.

మొదటి ప్రశ్నలో, ఎదుట కనిపిస్తున్న ప్రపంచం కంటే కనిపించనిదేదో శక్తి.రెండవ ప్రశ్నలో, బాహ్యాన్ని కాదని అంతరంగాన్ని అనుసరించడం విషయం.వ్యష్టి లోకాన్ని  కాక తన లోపలి ఆదేశాన్ని మన్నిస్తాడు.లోకం ఏమంటుంది? “తల్లితండ్రులను సేవించు.భార్యను పిల్లలను సోదరీసోదరులను  ప్రేమించు.వారి పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.” కాని, విశ్వాసం:

క్రీస్తు వాక్యం:

“నా వద్దకు వచ్చినవాడు ఎవడైనా, తన తల్లిని తండ్రిని భార్యను పిల్లలను తోబుట్టువులను ద్వేషించకపోతే, అతడు నా శిష్యుడు కాలేడు.”(Luke 14:26)

ఈ వాక్యాన్ని వ్యాఖ్యానిస్తూ సాధారణంగా “ద్వేషం”(“ hate”)అంటే ద్వేషం కాదు, తగుమాత్రం ప్రేమించు”,  అని అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది సరి కాదు, భగవంతుడు “ నీ భార్యను బిడ్డలను యింతగా ప్రేమించవద్దు, కొంచెం తక్కువప్రేమించండి”,  అనడం లేదు.అబ్రహాం ఐజక్ ను తక్కువ ప్రేమించలేదు.అతడికి ఐజక్ ని మించి ప్రపంచంలో ప్రియమైన వస్తువు లేదు. కాని, అతడు చేసింది లోకం దృష్టిలో కన్న కొడుకును దారుణంగా ద్వేషించి, చంపడమే.

మూడవ ప్రశ్న.అబ్రహాం తన కర్తవ్యం సారాకు గాని, ఎలీజర్ కుగాని, ఐజక్ కు గాని చెప్పకపోవడం న్యాయమా? (Was it ethically defensible of Abraham to conceal his purpose from Sarah, from Eliezar, from Isaac? )


ఈడిపస్ కథ ప్రసిద్ధమే.అందులో కథానాయకుడి అజ్ఞానం అతడి నిర్ణయం కాదు. అది విధి నిర్ణయం. కాని, యీనాటి నాటకాలలో, యీ రహస్యం కథానాయకుడి లేక నాయకురాలి స్వేచ్ఛానిర్ణయం. ఈ అధ్యాయంలో జాన్, గ్రీకు గాథలనుండి అనేక ఉదాహరణలను చర్చిస్తాడు.ఒకటి చూద్దాం.టోబియస్,  సారాను పెళ్ళి చేసుకోవలె అనుకుంటాడు.సారా ఏడుగురు భర్తలు పెళ్ళి జరిగిన రాత్రే  చనిపోయారు, సారా ప్రేమించిన ఒక రాక్షసుడు వారిని హత్య చేసేవాడు.ఇప్పుడు, సారా టోబియస్ ను పెళ్ళి చేసుకునే నిర్ణయం తీసుకోవాలా వద్దా? టోబియస్ కు తన పూర్వభర్తల గురించి చెప్పాలా వద్దా?తెలిసి కూడా,  టోబియస్ ఆమెను పెళ్ళి చేసుకోవలెనని నిర్ణయించుకుంటే, అతడు వీరుడే, లోకం దృష్టిలో.కాని, సారా నిర్ణయం ఆమెను అతిలోకస్థాయికి చేరుస్తుంది.ఎందుకు? టోబియస్ కు జరగబోయే దానికి బాధ్యత ఆమె స్వీకరిస్తున్నది.అతడు క్షేమంగా ఉంటే, ఆమె తన జీవితకాలమంతా అతడికి కృతజ్ఞతతో, కించనభావనతో ఉండిపోవలసి వస్తుంది.ఎంతో సానుభూతిని సహించవలసి ఉంటుంది.అతడికి ఋణపడి ఉన్నందుకు ఆమె అతనిని ద్వేషించకుండా ఉండగలను అని తనయందు విశ్వాసం ఉండవలె.ఆ విశ్వాసం దివ్యం, అలౌకికం.

ఈ మూడు ప్రశ్నలలోను, సామాన్యాంశం లౌకిక, అలౌకిక ధర్మవివేచన.హెగెల్ ధర్మం లౌకికమంటాడు.అది లోకానికంతటికి ఒకటే.అన్ని కాలాలలోను ఒకటే.అంతే కాదు, దానిని మించినది, దానిని ఉల్లంఘించేది ధర్మం లేదు అంటాడు.కీర్క్ గార్డ్ యిచ్చిన ఉదాహరణలలో అలౌకికమైనది, లోకం ఒప్పుకోలేనిది ధర్మం ఒకటి ఉన్నది, అది  వ్యక్తి ఆయా  సందర్భాన్ని బట్టి నిర్ణయించేది. ఆ నిర్ణయం లోకం దృష్టిలో అసంబద్ధము, అధర్మము కూడా.

స్థూలంగా, హెగెల్ తాత్త్వికదర్శనం భారతీయ ధర్మంతో సమానమనవచ్చు.వ్యష్టి తనను సమష్టిలో లయం చేసుకుని, సమష్టి శ్రేయస్సుకొరకు జీవించవలె అంటాడు. సనాతనధర్మం చెప్పేది కూడా అదే. కాని, సనాతనధర్మం యీ కర్మచక్రంతో ఆగిపోదు. “కర్మచక్రాన్ని మించి మరేమీ లేదు”  అనేవారిని భగవద్గీత ఖండించింది కూడా, “నాన్యదస్తీతి వాదినః”,అని. భగవద్గీతలోని కర్మయోగాధ్యాయమంతా యీ కర్మచక్రప్రవర్తకమైన ధర్మవిషయమే.కాని,అదే గీత,  “ధర్మాలనన్నిటినీ వదిలి నన్నే పట్టుకో, నిన్ను నేను కాపాడుతాను”, (“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ”) అంటుంది.అంటే “లోకధర్మాలేవీ పరమం కావు.వాటిని  వదిలి పరమాత్మను పొందు”, అని అంటుంది. గీతలోని  ఆ చరమవాక్యాన్నే కీర్క్ గార్డ్ ప్రతిధ్వనిస్తున్నాడు. హెగెల్  సమష్టిశ్రేయస్సు కోసం వ్యష్టిలయం చెబుతాడు.కీర్క్ గార్డ్ సమష్టిని స్వీకరించడు. గుంపులో గోవిందా, అతనికి నచ్చదు.మంద మందబుద్ధులకు అంటాడు. “మంద అసత్యం” ( “crowd is the untruth”) అనేది అతని ప్రసిద్ధవాక్యం.( “Everyone is the other and no one is himself.” "Every man is born as many men and dies as a single one”.Heidegger. మనిషిని మందనుండి వేరుచేసి నిలపడం అస్తిత్వవాదమూల సత్యం.ఇది విశృంఖలవైయక్తికత కాదు. వ్యష్టి సమష్టినుండి విడివడడం కాదు ముఖ్యం. మనిషి వ్యక్తిత్వం కంటే, అతని ఆత్మ (self) ముఖ్యం.) సత్యం ఎవడికి వాడు తెలుసుకోవలసింది, ప్రతి ఒక్కడూ.ఒకడు తెలుసుకున్న సత్యం మరొకడికి పనికిరాదు.తను అనుభవించిన సత్యానికి అనుగుణమైన నిర్ణయం తానే తీసుకోగలుగుతాడు. “యుగాలుగా ఎందరో అనుసరించారు, నీవూ యిదే అనుసరించు”, అనలేము. అలా అనడం ఎట్లా ఉంటుందంటే, “యీ కళ్ళజోడు మా తాతలకాలంనుండి వాడుతున్నది, నీవూ వాడు”, అనడం వంటిదే. ఇది, స్థూలంగా వ్యక్తివాదం.సమాజం పట్ల  ఏ మాత్రము బాధ్యతలేని విశృంఖలవైయక్తికత.కాని, కీర్క్ గార్డ్ ఆశయము ప్రయోజనము అది కాదు.అతడు కోరేది  వ్యక్తిముక్తి. ప్రతివ్యక్తి  భగవంతుడితో ఐకాంతిక అనుబంధం ఏర్పరచుకోవచ్చు, ఏర్పరచుకోవలె.మధ్యలో సమాజము, చర్చి  ప్రవేశించవలసిన అవసరం లేదు.అనర్థకరం కూడా.లోకధర్మం కంటే అతీతమైనది ఉన్నది.కాని, అదేదో నిర్వచించడం సాధ్యం కాదు.అర్థమయేటట్టు వివరించడం వీలుకాదు.లోకం దృష్టిలో అహేతుకము  అసంబద్ధము అసంభవము అయింది ఎలా సంభవమో బుద్ధికి అందదు, కనుక వివరించడమూ కుదరదు.

భారతీయసంస్కృతిలో, పురాణాలలో లోకధర్మానికి అతీతమైన ఆచరణ అపూర్వమేమీ కాదు.అనేక కథలున్నాయి.ప్రసిద్ధమైనది, భాగవతంలోని దశమస్కంధంలోని రాసక్రీడలు.కృష్ణునికై గోపికల ప్రేమ లోకధర్మానికి అతీతమైనది.లోకం దృష్టిలో నిర్ద్వంద్వంగా అధర్మమే. లోకం ఎన్నటికీ అర్థం చేసుకోలేనిది, సమర్థించలేనిది. రాసక్రీడలు స్త్రీపురుషులశృంగారం కాదని, అది జీవాత్మపరమాత్మల సంయోగాన్ని అన్యార్థంగా చెప్పడమని, చెప్పి తప్పుకుంటాం. అది తప్పుకోవడమే.  ఎందుకంటే, అలౌకికాన్ని ఆమోదించలేము, కథను కాదననూలేము.
   
భగవంతుని పిలుపు వినబడినవానికి, లోకధర్మం ఎంత పెద్దగా అరిచి చెప్పినా,  వినపడదు.ఆ వేణుగానం వినపడగానే, అత్త మామ భర్త బిడ్డ, లౌకిక బాధ్యతలు, అన్నీ విప్పి చలిమంటలో విసిరేసి పరుగెత్తుతారు. అయితే, ఆ వేణుగానం వినబడుతుందా? సమాజం, “లేదు”, అంటుంది. మానసికవైద్యుడు అంటాడు, “అది ఆమె వినడం కాదు, వినబడుతోందన్న జబ్బు” (“She is hearing voices.”) లోకం అర్థం చేసుకోలేనిది, వ్యక్తి తనకు తాను నిర్ణయించుకోకుండా ఉండలేనిది కీర్క్ గార్డ్ చెబుతున్న అసంబద్ధము.ఆ నిర్ణయం కేవలం తనకు దైవానికి సంబంధించింది.

తరువాతి అస్తిత్వవాదులు దైవాన్ని తొలగించి, మనిషిని నిలిపే ప్రయత్నం చేశారు.

                                                   *****



1 comment:

  1. మూర్తిగారికి
    నమస్తే...
    సార్ మీ పోస్ట్ లు చాలా బాగున్నాయి.
    నిజం చెప్పాలంటే అద్భుతం..


    ReplyDelete