Sunday, June 30, 2019

అనశనం: ముండకోపనిషత్తుపై

అనశనం

ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్య: పిప్పలం స్వాద్వత్తి అనశనన్నభిచాకశీతి।।ముండకోపనిషత్తు.3.1.1.
వేదాలు, వేదాంతము ( అంటే, ఉపనిషత్తులు), ఆత్మ ఒక్కటే ఉన్నది అంటాయి. ఈ ఉన్న ఒక్క ఆత్మ

మూడుగా, (జీవుడు జగత్తు ఈశ్వరుడుగా) కనిపిస్తుంది. ఎలా? ఏ ఉపనిషత్తులోనైనా విషయం యిదే.

ఈ ముండక మంత్రం మూడును రెండు చేసి చెబుతున్నది.( "ద్వా"," ద్వౌ"కు వైదికరూపం. 'ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ' అని అర్థం చేసుకేవలె. )ఉపనిషత్తులలో చెట్టు ఉపమానంగా గ్రహించడంలో ఆశ్చర్యం లేదు. అడవులను  ఆశ్రమాలుగా ఆశ్రయాలుగా చేసుకున్న ఋషులకు కన్ను తెరిస్తే కనిపించేవి చెట్లే కదా! "న్యగ్రోధోదుంబర" వృక్షాలు తరచు మంత్రాలలో కనిపిస్తాయి. వేళ్ళు పైకి పాకి, కొమ్మలు కిందికి వేలాడే అశ్వత్థవృక్షం కఠంలోను గీతలోను ప్రసిద్ధమే.

     ఇక ఈ ముండకమంత్రవిషయం. ఒక చెట్టు,ఆ చెట్టుమీద రెండు పిట్టలు. రెండు పిట్టలలో ఒకటి జీవాత్మ(విజ్ఞానాత్మ),మరొకటి ఈశ్వరుడు (పరమాత్మ). రెంటికీ ఆశ్రయం చెట్టు. అంటే చెట్టు జీవుని శరీరానికి, ఈశ్వరుని జగత్తుకు, అంటే సర్వసృష్టికి, కూడా సంకేతం. (మూడవది, ఈశ్వరుని శరీరమైన జగత్తు, కూడా చెప్పినట్టే కదా.) ఈ రెండు పిట్టలు అన్యోన్యంగా ఉంటాయి. అన్యోన్యమంటే, ఎప్పుడూ కలిసే ఉంటాయి.విడదీయలేనంతగా కలిసి ఉంటాయి. అంటే ఈశ్వరచైతన్యం వినా జీవుడికి జీవత్వం లేదు. జీవుడు వినా ఈశ్వరుడికి భోజనం లేదు. ( భోక్తృత్వం లేదు.)సమస్తసృష్టిలోని సర్వప్రాణుల  భోజనమే ఆయన భోజనం. అనుభవమే ఆయన అనుభవం.('భుజ్' అంటే తినడం మాత్రమే కాదు.అన్ని యింద్రియాలద్వారా గ్రహించే సర్వము ఆహారమే.అంటే ప్రాణుల సర్వేంద్రియవ్యాపారాలు సర్వానుభవాలు ఆయనవే, ప్రాణులద్వారా. అంటే, వాస్తవంలో ఈశ్వరుడు భోక్త కాడు. సర్వ ప్రాణులకు, వారి కర్మానుగుణంగా, భోజనం కల్పించేవాడు ఈశ్వరుడు, కర్మఫలప్రదాత. బిడ్డలు తింటుంటే ఊరక చూస్తూఉంటాడు.ఇద్దర పిల్లలు, ఒకడు కోటీశ్వరుడు.మరొకడు కూలివాడు. ఇద్దరూ బిడ్డలే. ఎవరి తిండి వాడు తింటాడు. తండ్రి చూస్తూ ఉంటాడు. ('అభిచాకశీతి') సాక్షిమాత్రుడు.జీవుడు తన శరీరంలో పరిమితమై అనుభవిస్తాడు. ఈశ్వరుడు సమస్తసృష్టిని వ్యాపించి సర్వప్రాణులహృదయాలలో ('ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి'.గీత.) ఉండి వాటిద్వారా అనుభవిస్తాడు.అంటే, అనుభవం ఆయనదికాదు, ఆయన ఎవరెవరి హృదయాలలో ఉన్నాడో వారిది ఆ కష్టము సుఖము పుణ్యము పాపము.  అదే చెబుతున్నది, ఈ మంత్రం. 'తయోరన్య: పిప్పలం స్వాద్వత్తి'.

ఒక పిట్ట, జీవుడు, ఆ సంసారవృక్షం యిచ్చే రుచికరమైన (స్వాదు)ఫలాలను తింటున్నది.అన్ని ఫలాలూ స్వాదుగానే ఉంటాయా? కొన్ని చేదుగా ఉండవా? ఉండవనే అంటున్నది మంత్రం. చేదుపండుకూడా

స్వాదుగా ఉండడమే సంసారలక్షణం. ఈ చేదు స్వాదు వద్దు , అనగలిగిన వైరాగ్యం కలిగితే యిక సంసారమేముంది? కనుక కష్టమైనా యిష్టమే అంటున్నాం కాని, సుఖదు:ఖరూపమైన ద్వంద్వంనుండి ముక్తిని కోరుకోడం లేనంతకాలం, 'స్వాద్వత్తి.' సంసారం రుచిగానే ఉంటుంది, సారవంతంగానే అనిపిస్తుంది. ఇది ఒక పిట్ట విషయం. రెండవది, ఈశ్వరుడు. ఆయనది 'అనశనం'. (అనశ్నన్నన్యోభిచాకశీతి.)తినడు,  జీవుడు తింటూఉంటే ఊరకే చూస్తూ ఉంటాడు. తిని తిని ఎప్పటికైనా తిండిమీద విరక్తి కలిగి, పక్కనే తినకుండా ఊరకే చూస్తూ ఉన్న నా వైపు చూడకపోతాడా, అని. చూసినప్పుడు తెలుస్తుంది, ఆ రెండవ పక్షి అంత చిదానందంగా ఎలా ఉండగలుగుతున్నదో. అనశనంలో ఉంది ఆ చిదానందరహస్యం. ఇంద్రియసుఖాలవెంట పడక, తనలో తాను రమించగలిగితే తాను ఈశ్వరుడే. అది తెలుసుకొన్నప్పుడు, ప్రతిబింబం బింబంలో కలిసిపోతుంది. అంటే తాను ప్రతిబింబమేనని తెలుసుకొంటుంది. అంటే తాను, తన సుఖదు:ఖాలు వాస్తవంకాదు.

      ఈ శరీరమనే కర్మాగారం, కర్మక్షేత్రం,సుఖదు:ఖాలకాశ్రయం. అంటే కర్మఫలాలను అనుభవించడానికి ఈ శరీరం అవసరం. కర్మలు కర్మఫలాలు లేనపుడు శరీరంతో పని లేదు. నిజమే, జీవుడికి శరీరంతో పని లేదు. ఈశ్వరుడికి? ఆయన శరీరం, జగత్తు, ఉంటుంది. అంటే, ఈశ్వరుడికి ముక్తి లేదా? అది వేరే ప్రశ్న.

No comments:

Post a Comment