Sunday, June 30, 2019

కవిత-వెంకటప్పయ్య యిల్లు

2.వెంకటప్పయ్య యిల్లు

వెంకటప్పయ్య  ఒంటరి
పెద్ద పెంకుటిల్లు
ఇంటిముందు  చిన్న అడివి
ఊరందరికి పూలతోట
పెద్దల పూజకు పొద్దున పిల్లల వేట.

మంచురేకుల శంకుపూలు
ఎర్ర  గన్నేరులు
మల్లెలు
బాదం చెట్టు చుట్టూ
పాదాలకింద  పండుటాకులు
నూనె పూసుకున్నట్టు నున్నని  గండుచీమలు
నీలం శంకులు
కాశీరత్నాలు
నందివర్ధనాలు
సంపెంగలు
పారిజాతాలు.

“ముల్లు”, అని నా ఏడుపుకేక.
“అటెందుకు వెళ్ళావు”,అన్నయ్య అరుపు.
ఒంటికాలిపై కుంటుతున్నా.
తుమ్మముల్లు తీసి, చూసి,”విరగలా”, అన్నాడు
విరగబడి నవ్వుతూ.
తెల్లగా కొనదేలిన ముల్లు.
అందంగా కనిపించిందేమో
జేబులో వేసుకున్నాడు, కాగితాలు కుట్టొచ్చని.
నాకు మండింది,
“మామకు చెబుతా ముళ్లకంప పీకెయ్యమని.”
“పీకడు. పూవుకు ముల్లుంది.తోటకుండదా?”

ఇప్పుడు వెంకటప్పయ్య లేడు
ఆ అన్నయ్య లేడు
ఆ తోటా లేదు
అది ముళ్ళ అడివి
అనేకం ఏకమయింది.

శుశ్రుతుని సూది
విస్తృత కంటకం.

పూవుకు ముల్లుంది
ముల్లుకు పూవుండదు.

No comments:

Post a Comment