Sunday, June 30, 2019

అస్తిత్వవాదసాహిత్యం-4: నీచ-2/7




                                        
                     అస్తిత్వవాదసాహిత్యం-4: నీచ-2/7
                                  

                                            “నా మేఘ ఉద్వేగం సామాన్యమయింది కాదు: మెరుపుల   అట్టహాసాల మధ్య అగాధాలలోకి వడగండ్లు విసిరేస్తాను.నా రొమ్ము  భయంకరంగా ఉబ్బుతుంది; పర్వతాలపై భీషణమైన తుఫానులు విసురుతుంది: అప్పుడు శాంతమవుతుంది.
    నిజంగా, తుఫానులా వస్తుంది నా ఆనందం, నా స్వేచ్ఛ ! కాని నా శత్రువులు అనుకుంటారు, సైతాను  మన తలలపై గర్జిస్తున్నాడని.” (నీచ:జార.రెండవభాగం.)

    “నా తర్వాత మాత్రమే తిరిగి ఆశ సాధ్యం.”(నీచ:Ecce Homo: “Why I am a Destiny”)



                          

                            దైవము, సత్యము

                           దేవుడు మరణించాడు.”



“పిచ్చివాడు:

   మీరు ఆ పిచ్చివాణ్ణిగురించి వినలేదా? వాడే, భళ్ళున తెల్లవారగానే లాంతరు వెలిగించుకొని, సంతకు పరుగెత్తి, ఆపకుండా అరిచాడు, “ ఎక్కడ దేవుడు? దేవుడెక్కడ?” అని,  వాడు. -- అక్కడ ఉన్నవాళ్లలో ఎక్కువమంది దేవుడిమీద నమ్మకం లేనివాళ్లు.ఇతణ్ణి చూచి వారు నవ్వుకున్నారు. ఒకడన్నాడు, తప్పిపోయాడా? పసిపిల్లాడేమో, దారి తెలియలేదు, అన్నాడు. మరొకడు ఎక్కడైనా దాక్కున్నాడేమో, మనకు భయపడి? యాత్రవెళ్ళుంటాడు.వలస వెళ్ళాడా? -- ఇలా పెద్దగా  అరుస్తూ అపహాస్యం చేశారు.

  పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ ఎక్కడికెళ్ళాడు దేవుడు?”, అని అరిచాడు;  “ నే చెబుతా.మనం చంపేశాం- -నీవు నేను.మనమంతా ఆయన హంతకులం.కాని, ఎలా చంపాం?సముద్రాన్ని ఎలా తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం?  సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా? పడిపోవడంలే మనం, పక్కకు వెనక్కు ముందుకు, ఎటుపడిపోతున్నామో తెలియకుండా ? ఇంకా పైకి  కిందికి అంటూ ఏమైనా ఉందా ?అనంతశూన్యంలో అగమ్యంగా వెళ్ళడంలేదా మనం? శూన్యాకాశపు వాసన రావడంలేదా? చలి కమ్ముకురావడంలే?చీకటిరాత్రి కమ్మేయడంలేదా ? ఉదయాన్నే లాంతర్లు వెలిగించుకోవలసి రావడంలేదా?వినబడడం లేదా, దేవుణ్ణి ఖననంచేయడానికి గుంత తవ్వుతున్నారు.శవం కుళ్ళినవాసన తెలియడంలేదా ?దేవుళ్ళుకూడా కుళ్ళిపోతారు.దేవుడు చచ్చిపోయాడు.చచ్చి పడి ఉన్నాడు. మనం చంపేశాం.

  ఏమని మనల్ని మనం ఓదార్చుకొందాం, హంతకులకు హంతకులం? మన సంపదలలోకెల్లా అతిపవిత్రము, అతిశక్తిమంతము అయినది ఆ దైవం.ఆ దైవాన్ని   కత్తులతో పొడిచి పొడిచి చంపేశాం.మన చేతులనెత్తురు ఎవరు కడిగేస్తారు? ఎన్ని నీళ్ళు సరిపోతాయి?ఏ పశ్చాత్తాపపర్వాలు, ఏ పవిత్రక్రీడలు కనిపెట్టాలి?ఇంతటి ఘనకార్యం మనకు మించిన ఘనత యివ్వడంలేదా? ఈ ఘనత దక్కించుకోవలెనంటే మనమే దేవతలు కావద్దా? ఇంతవరకు ఎన్నడూ జరగని ఘనకార్యం యిది. రాబోయే తరాలది చరిత్రలో అపూర్వమైన  ఒక గొప్ప శకం.

  ఇక్కడ ఆ పిచ్చివాడు మాట్లాడడం ఆపి, జనంవైపు చూశాడు.వాళ్ళకూ మాటలాగిపోయాయి విభ్రాంతులై అతణ్ణిచూస్తూ ఉండిపోయారు.చివరకు అతడు తన లాంతరును నేలకు కొట్టాడు.అది ముక్కలై,   దీపం ఆరిపోయింది. “ నేను రావలసిన సమయంకంటే చాలా ముందు వచ్చాను. ఈ మహాఘటన యింకా దారిలోనే ఉంది, అటూయిటూ తిరుగుతూ.వార్త యింకా వీరిని చేరలేదు.ఉరుముకు మెరుపుకు సమయం పడుతుంది.నక్ష్తత్రాలకాంతి నేలను తాకడానికి సమయం పడుతుంది.సంఘటనలు, జరిగిపోయినా, లోకానికి తెలియడానికి సమయం పడుతుంది.ఈ సంఘటన  వీరికి దూరపు నక్షత్రాలకంటే దూరంలో ఉంది. కాని, ( హత్య) చేసింది వీరే.

  ఆ తర్వాత ఆ పిచ్చివాడు చర్చిలలోకి తోసుకొని వెళ్ళి, అక్కడ దేవుని ఆత్మకు శాంతి కలుగుగాక అని ప్రార్థనలు చదివాడని జనం చెప్పుకున్నారు.అక్కడివాళ్ళు అతన్ని బయటకు లాగి, “ఏం చేస్తున్నావ్”, అని అడిగితే, అతడు ఒకటే జవాబు యిచ్చాడట, “ ఇక యిప్పుడు యీ చర్చిలన్నీ ఏమిటి, దేవుడిని పూడ్చిన గుంతలు  సమాధులు కావా?”, అని.”
       
                       (Friedrich Nietzsche, The Gay Science: Aphorism: వచనం:125)

                                                     ***

వ్యాఖ్య :

  దేవుడిమీద తిరుగుబాటు దేవుడంత సనాతనమైనది. అస్తిత్వవాద ఆవిర్భావకాలంలో, దేవుడిలేని సృష్టిని ఊహ చేయడం ప్రధానంగా డోస్టోవ్ స్కీతో మొదలయిందని చెప్పవచ్చు. అతడి నవల “కరమజోవ్ సోదరులు” లో ఇవాన్ అంటాడు:” “అద్భుతం దేవుడుండడం కాదు,  దుర్మార్గుడు రాక్షసుడు అయిన మనిషితలలోకి దేవుడున్నాడన్న ఆలోచన రావడం మహాద్భుతం.”  “కనుక దేవుణ్ణి నేను ఒప్పుకోనని కాదు.... అతడి యీ సృష్టిని నేను ఒప్పుకోను ఒప్పుకోలేను.”(Brothers Karamazov: ch.3)

   ఇవాన్ మాటలలో రెండు అంశాలున్నాయి: ఒకటి, మనిషి సృష్టించిన అద్భుతాలలో మహాద్భుతం దేవుడు.అతని మరణం సంతోషకారణం కాలేదు. రెండు, తగాదా దేవుడితో కాదు, ఆయన సృష్టితో. ఆయన సృష్టి ఒక అన్యాయం ఒక అరాచకం ఒక అసంబద్ధం. అదే పాత్ర ఇవాన్ అన్న మరో మాట కూడా అస్తిత్వవాదులకు పరమ ఆదరణీయం: “దేవుడు లేకుంటే, ఏ పనికీ అభ్యంతరం ఉండదు.”(“All things are permitted,if there is no God.”) స్వేచ్ఛ అస్తిత్వవాదుల ఊపిరి.ఇక నీచ వచనం ( Aphorism 125)  చూద్దాం.

-“తెల్లవారిన తరువాత లాంతరు వెలిగించుకొని…”:

  ఇందులోని పిచ్చివాడు దేవుడికోసం వెదుకుతున్నాడు. కనుక అతడు  నాస్తికుడు కాడు.కాని, ఎక్కడ వెదుకుతున్నాడు? దేవుణ్ణి నమ్మనివాళ్ళ మధ్య, సంతలో. ఇదొక పిచ్చిపని. దేవుడు చచ్చిపోయాడు, అని తెలుసు.మరి “ఎక్కడ ఎక్కడ దేవుడు? ” అని జనాలను అడగడమేమిటి? ఇది మరో పిచ్చిపని. ఈ నీతికథలో  పిచ్చివాడి పిచ్చి మొదటే తెలిసిపోతుంది. భళ్ళున తెల్లవారిన తరువాత లాంతరు వెలిగించుకొని సంతకు బయలుదేరాడు.ఇంతకంటే రోగనిదానం ఏముంటుంది! ప్రవక్తలందరూ పిచ్చివాళ్లేనేమో !
(ఆ లాంతరు వెలుగు తన కోసం కాదు, దేవుణ్ణి వెదకడానికి కాదు.అది “సంత”లోని జనం కొరకు.కాని వాళ్ళకు చీకటి చీకటి అని తెలియడం లేదు.)

  (ఖలీల్ జిబ్రాన్ కూడా ఒక కవిత  రాశాడు పిచ్చివాడి మీద, “నేను పిచ్చివాణ్ణెలా అయ్యాను”: “ ఒక రోజు నేను నిద్రలేచేటప్పటికి, నా ముసుగులన్నీ ఎవరో దొంగిలించారు, నేను ఏడు జన్మలలో సంపాదించుకొన్న ముసుగులు…ముసుగులు లేని నేను, “దొంగలు! దొంగలు!” అని అరుస్తూ  వీధుల్లో పరుగెత్తాను.జనాలు నన్ను చూసి నవ్వారు.కొందరు భయపడి యిళ్ళలోకి వెళ్ళిపోయారు.నేను సంతలోకి వెళ్ళగానే, అక్కడ యింటిమీద నిలబడినవాడొకడు నన్ను చూచి, “వాడు పిచ్చోడు”, అని అరిచాడు. అతన్ని చూడడానికి తలెత్తాను.ముసుగులేని నా ముఖాన్ని సూర్యుడు మొదటిసారి ముద్దుపెట్టుకున్నాడు…నా ముసుగులు దొంగిలించినవారెవరో కాని, వారు పుణ్యాత్ములు.అదుగో, అలా అయ్యాను పిచ్చివాణ్ణి.”

  ఈ జిబ్రాన్ కథలో ముసుగులను  వేదాంతులు కోశాలు అనవచ్చు. కాకపోతే వేదాంతులు ఏడుజన్మలకు పరిమితం చేయరు ముసుగులను.కొన్ని కోట్ల జన్మలలో ఏర్పడిన ముసుగులు.ఆ ముసుగులు దొంగిలించగలిగిన పుణ్యాత్ముడు కొన్ని కోట్ల జన్మలకుగాని దొరకడు.)

  “తెల్లవారిన తరువాత లాంతరు వెలిగించుకోడం” అంటే దేవుడు చనిపోయిన తరువాత సమస్తజగత్తు చీకటి కమ్మి ఉంది. అప్పుడు లాంతరు వెలిగించుకోడం అవసరం.లోకానికి చీకటి తెలియడంలేదు. జగద్వ్యాపారమంతా (సంత) చీకటిలో జరిగిపోతోంది.కొత్తవెలుగు (లాంతరు) తెచ్చినవాడు పిచ్చివాడు, అంటే ప్రవక్త.  ఈ చీకటి వెలుగులనే భగవద్గీత “యా నిశా సర్వభూతానాం …” అని చెప్పింది.

  నీచ కథలో  దేవుడిది చావుకాదు, హత్య అంటాడు పిచ్చివాడు. హత్య చేసిందెవరు? “నీవు నేను”, అంటాడు . అంటే,మనమందరమూ, ఆస్తికులు నాస్తికులు తాత్త్వికులు కూడా. నాస్తికులెలా హత్య చేస్తారు? వాళ్ళు దేవుడే లేడంటారు కదా? లేని దేవుణ్ణి హత్యచేయడమేమిటి? నాస్తికులు కాదనేది  దేవుణ్ణి మాత్రమే.ఆ దేవుడిపై నమ్మకం ఆధారంగా నిలిచిన తక్కిన వ్యవస్థలు విలువలు, వీటికి వివిధమైన పేర్లు--సామ్యవాదం ఉదారవాదం సంక్షేమవాదం-- యివి వారు వద్దనడం లేదు. కనుక వీరందరూ ఆస్తికులే. ఏదో ఒక విశ్వాసం లేనిదే వీరికి శ్వాసలేదు. భద్రతలేనిదే బతకలేడు మనిషి. కనుక దేవుడి మరణం కేవలం మతసంబంధం కాదు.దేవుడు కేవలం ఆదివారం  ఆలయాలలో లేడు, సోమవారం సంతలో కూడా దేవుడే. సమస్త సామాజికవ్యవస్థలు విలువలు దేవుడితో సంబంధించినవే, ఆయన పేరు మాత్రం పనికిరాదు. కనుక దేవుడి మరణంతో పాటు యివన్నీకూడా పోతాయి, పోవాలి. కాని, ఏమైనా పోయిందా? ఏదీ పోలేదు. ఒక్క దేవుడి పేరు మాత్రం పోయింది. దేవుడు చనిపోయినా,అతని నీడను చూపించి యింకా కొన్ని వేలసంవత్సరాలు జనాలను నమ్మిస్తారు,దేవుడు బతికే ఉన్నాడని.ఇలా ఎంతకాలం జనం తమ్ము తాము మోసం చేసుకుంటారు, శవాన్ని అలంకరించి సింహాసనంపై కూర్చోపెట్టి రాజ్యం  నడిపిస్తారు?

-“హంతకులకు హంతకులం.”:

    మరి దేవుణ్ణి చంపింది ఎవరు? దేవుడిది మరణం కాదు.అది హత్య. మనం, మన చేతులతో ఆయన్ను  దారుణంగా చంపుకున్నాం.(“And we have killed him. How shall we comfort ourselves, the murderers of all murderers?”) మనం మామూలు హంతకులమా? హంతకులకు హంతకులం,” the murderers of all murderers”.ఎందుకు? ఎలాంటి వాడిని చంపాం ? ఎలా చంపాం? పరమపవిత్రమైన (“holiest”) దైవాన్ని చంపుకున్నాం . ఆయన సర్వశక్తిమంతుడు, “mightiest of all”.అంత శక్తిమంతుణ్ణి  కూడా చంపగలిగాము అంటే, మన ఆసురశక్తి అంచనా వేయగలమా? ఎలా చంపాం? నెత్తురు కారేదాకా కత్తులతో పొడిచి పొడిచి చంపాం,( “bled to death under our knives”) ఈ చేతులనెత్తురు కడగడానికి ఎన్ని సముద్రాలజలం సరిపోతుంది?(“What water is there for us to clean ourselves?”) ఈ నెత్తుటి వాసన పోవడానికి ఎంత అరేబియా సుగంధం సరిపోతుంది? ఈ పాపానికి ఏ కొత్త ప్రాయశ్చిత్తం కల్పించాలి?(“What festivals of atonement, what sacred games”)  మానవజాతిని మొత్తం మేక్బెత్ స్థాయికి ఎత్తేశాడు ( లేక, దించేశాడా?) నీచ, పేరు చెప్పకుండా.
    
  ఈ మాటలు  నాస్తికుడు, లేక  దైవవిద్వేషి పలికినవి అని ఎవరనగలరు? ఎంత ప్రేమలో  ఎంత పశ్చాత్తప్తహృదయంలో నుండి వచ్చిన మాటలివి? ఈ పాపానికి ఒకటే ప్రాయశ్చిత్తం. “ప్రభువు చనిపోయాడు. ప్రభువు చిరకాలం జీవించుగాక!” (“The king is dead. Long live the king!) దేవుడు చనిపోయాడు. దేవుడు చిరకాలం జీవించుగాక.  “పాత దేవుడు మరణించాడు”( "old God is dead"), కొత్త దేవుడు ప్రతిష్ఠింపబడుగాక.”
   
  ఈ కొత్త దేవుడు ఎక్కడనుండి వస్తాడు? తిరిగి ప్రతిష్ఠించడం హత్య చేసినవాడి  బాధ్యత.హత్య చేసినవాడే ప్రాణం పోయవలె. (“Only as creators can we destroy.”GS.586 ) అతడే దేవుడు కావలె. (“ Must we ourselves not become gods simply to appear worthy of it?”) అదే అతని పాపానికి  నిజమైన ప్రాయశ్చిత్తం. “తత్త్వమసి” నుండి “ అహం బ్రహ్మాస్మి”.

    ఇంతకూ యితడు హత్యను, హంతకులను నిందిస్తున్నాడా? లేక హత్య   మంచిదే అంటున్నాడా? రెండూ అంటున్నాడు, పిచ్చివాడు కదా! ఒకవైపు, మనిషికి ఉండిన సంపదలలోకెల్ల దేవుడు గొప్పసంపద, అతన్ని చంపుకున్నాము, హంతకులలోకెల్ల హంతకులం మనం అంటాడు. అంతేకాదు, దేవుడు అతిశక్తిమంతుడు, అంతటి శక్తిమంతునికూడా చంపగలిగామంటే మనది ఎంతటి   రాక్షసబలం? అంటూ హత్యను నిందిస్తాడు.మరొకవైపు, “దేవుని హత్య యీ సృష్టిలో జరిగిన ఘనకార్యం, దానితో పోల్చదగినది లేదు. దాని ఘనతను మనం నిలుపుకోవద్దా”, అంటాడు.ఇంతకంటే విరుద్ధమైన పిచ్చవాగుడు ఏముంటుంది! ఇతనిది పిచ్చివాగుడా?

   నీచకు  పరలోకమందు తండ్రి కాదు ( My father in Heaven), నేలమీద నడిచే దేవుడు కావాలి. కనుక పైలోకాన్ని శూన్యం (Nihilism) చేసి, అక్కడి దైవాన్ని దివినుండి భువికి  దించాడు. బుద్ధుడిలా శూన్యంతో సంతృప్తి చెందలేదు నీచ. అతనికి మనిషి కావాలి, ( Overman, Superman, Beyond-man.ఈ అతిమానవుడిగురించి తరువాత.)


-“దేవుడు చచ్చిపోయాడు.చచ్చి పడి ఉన్నాడు.”:

  ‘చచ్చిపోయాడు’ అంటే చాలదా? ‘చచ్చి పడి ఉన్నాడు’, అని కూడా అనడమెందుకు?  నీచ ఆశయం ఏమిటో చూద్దాం. దేవుడు అంటే ఒక ఆకృతికాదు. సత్యమే దైవం.(.“...the old truth is approaching its end.” :(Twilight of the Idols, Friedrich Nietzsche. ) ;  దేవుడు ఎక్కడో బయట లేడు.మనిషిలోపల చైతన్యరూపంలో ఉంటాడు. చైతన్యం సిద్ధవస్తువుకాదు అన్నాడు నీచ.అంటే,ఏమిటి అర్థం? చైతన్యం పెంచుకుంటే పెరుగుతుంది. లేకుంటే జడంగా, అంటే నిర్జీవంగా మృతప్రాయంగా, “పడి”ఉంటుంది. (బాంకులో కోట్లుంటాయి. నీ అకౌంట్ లో ఉన్నదే నీది.) క్రైస్తవశరణాగతిని అద్వైతంలోకి మారుస్తున్నాడు నీచ, “ఉద్ధరేదాత్మనాత్మానం” అని.

   కొత్త “దేవుడు”  కలగాలంటే పాత దేవుడు మరణించాలి, ( 'the old God is dead' ( The Gay Science: Aphorism 343). పాతది పోవాలంటే ఊరకే పోదు.హింసనచణధ్వంసరచన చాలా జరుగుతుంది. అదే “నేతి నేతి” అంటూ, అడ్డమొచ్చిన జడవస్తువులన్నిటినీ  నిర్దయగా అడ్డంగా నరుక్కుంటూ ధ్వంసంచేస్తూ దగ్ధంచేస్తూ పోతాడు “పిచ్చివాడు”. బయట అన్నీ తగలేయడం ముగిసినతరువాత, ఆకలిగొన్న మంట ఎదురుగా వచ్చి ఆగుతుంది, యిక యిప్పుడేమి కాల్చాలి అంటూ. తగలేయడానికి తన దేహమే మిగిలిఉంది. అప్పుడు,

“ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ  వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు, నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు.”
                          ( The Gay Science: Preludes: 62)

  పాతదేవుడు,ఆ దేవుడిమీద మనం నిలబెట్టిన వ్యవస్థలు విలువలు అవన్నీ శవమయం అయాయి..” దేవుడు మరణించాడు”అన్న మహా వాక్యం, నీచ తన భాషలో చదివిన నమకం.శవాన్ని తిరిగి శివమయం  చేయవలె.
  
  పురిటినొప్పులు పడకుండా భవ్యభవిష్యత్తు పుట్టదు, (“overflowing energy pregnant with the future”): విధ్వంసం, విప్లవం, విపరిణామం- యివి  భవిష్యత్తును గర్భందాల్చిన ఒక మహాశక్తి యొక్క పురిటినొప్పులు, ఆ శక్తి పొంగిపొరలే అభివ్యక్తి.” (Aphorism: 370)

హత్య క్రూరమైన అవసరం: “Only as creators can we destroy.” (GS: Aphorism 59)

  ఏమిటి  దేవుడు చనిపోవడమంటే? దైవమందు మనిషి విశ్వాసం ఆచారం ఆరాధన యాంత్రికం అయిపోతాయి. ఆదివారం ఆలయానికి వెళ్ళడం, సంధ్యావందనం, అభిషేకం నిషేకం ( “exploring hands encounter no defence”: Eliot) - అన్నీ నిర్జీవక్రతువులుగా ( “ dead habit”: Tagore) మారిపోతాయి. ఏ ప్రవక్త అయినా ముందు యీ దైవగ్లానినే ధ్వంసం చేయటానికి అవతరిస్తాడు.

   అసత్యాన్ని అసత్యమని తెలియడం గొప్ప చారిత్రాత్మకఘటన.అప్పుడుగాని “అసతో మా సద్గమయ” అనలేడు. మృత్యువును మృత్యువుగా గుర్తించడం ఆధ్యాత్మికతలో ఒక గొప్ప దశ. (“శవం కుళ్ళినవాసన తెలియడంలేదా ?దేవుళ్ళుకూడా కుళ్ళిపోతారు.దేవుడు చచ్చిపోయాడు.చచ్చి పడి ఉన్నాడు.”) ఈ కుళ్ళువాసన తెలిస్తేగాని “మృత్యోర్మామృతం గమయ” అనలేడు. చీకటి కనిపించినపుడుగాని లాంతరు వెలిగించడు, “తమసో మా జ్యోతిర్గమయ”, అంటూ. ఎవడికి అసత్యం అసత్యంగా, తమస్సు తమస్సుగా, మృత్యువు మృత్యువుగా తెలుస్తాయో వాడు ప్రవక్త. వాడు శూన్యవాది.

  (“దేవుడు మరణించాడు” అన్న నీచ ప్రసిద్ధవాక్యం, అతని అనేక  గ్రంథాలలో కనిపిస్తుంది, The Gay Science: Aphorism 125 లో మాత్రమే కాదు . అందులోను ఒకేచోట కాదు. ఆ వాక్యం మొదట కనిపించేది Aphorism 108 లో.( వీటిని ఏమనాలో తెలియదు. Aphorisms అంటారు.కాని అవి సూత్రాలలాగా లేవు.ఒక వాక్యం నుండి యిరవై ముప్పై వాక్యాల వరకు  నిడివి ఉన్నవి. కొన్ని అభిప్రాయాలరూపంలో, కొన్ని వ్యాసాల రూపంలో,కొన్ని నీతికథలలా (parables) వివిధంగా ఉన్నాయి.) 108 నుండి 125 వరకు అన్నీ సూత్రాలు చదివినపుడు మాత్రమే “దేవుడిమరణం”లో నీచ ఆలోచనాధార, అతడు ఏం చెప్పదలచాడో తెలుస్తుంది.( ఈ Aphorisms ను వచనాలు అనవచ్చు.)

  “కొత్త పోరాటాలు:బుద్ధుడు మరణించినతరువాత, కొన్ని శతాబ్దాలవరకు ఆయన నీడను ఒక గుహలో చూపించారు. భీకరమైన పెనునీడ.దేవుడు మరణించాడు. కాని, యీ మనుషుల తత్త్వం ఎటువంటిదంటే, కొన్ని వేలసంవత్సరాలవరకు  ఆయన నీడను చూపించే గుహలుంటూనే ఉంటాయి.ఆ నీడను పడగొట్టడానికి మన పోరాటం సాగించవలసే ఉంటుంది.” (The Gay Science: Aphorism 108)

   ఒకవైపు దేవుని హత్య రాక్షస కృత్యమంటూనే,ఆ ఘనతను మనం. దక్కించుకోవద్దా, అంటున్నాడంటే,అది పిచ్చివాడి  విరుద్ధవచనం అనుకోవాలా? కాదు,దేవుని హత్య క్రూరమైన అవసరం అంటున్నాడు.కొత్త విలువలు సృష్టించుకోవాలంటే పాతది పోవాలి..(.“...the old truth is approaching its end.” :(Twilight of the Idols) ఆ సృష్టికి జనం సిద్ధంగా ఉన్నారా? దేవుడులేని శూన్యాన్ని ఎలా పూరించాలి? “మనమే దేవతలు కావద్దా?”,  అంటాడు పిచ్చివాడు.కాని జనం దేవతలు కావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకు చీకటి చీకటిగా తోచడంలేదు.పిచ్చివాడు తన లాంతరు నేలకేసి కొట్టాడు. లోకానికి (సంతలో జనాలకు) వెలుగు అక్కర్లేదు. తాను చాలా ముందు వచ్చాడు. ప్రవక్తలు ఎప్పుడూ ముందుగానే దిగి వస్తారు. వారికి ఆహ్వానం పలకడంలో యీలోకం ఎప్పుడూ  ఆలస్యమే చేస్తుంది, కొన్ని యుగాల ఆలస్యం.

   నిజానికి నీచ పరిచయం యిక్కడే ఆపేయవచ్చు మనం.ఎందుకంటే, కేవలం తత్త్వం కొరకు ఎవరినీ చదవవలసిన అవసరం లేదు. ఏ తాత్త్వికుడైనా వేదాంతి అయినా కొత్తగా చెప్పేదేమీ ఉండదు. ఎవరో ఒకరు ఏదో పేరుతో వెనుక చెప్పిందే. తెలిసి వాటిని ఎందుకు చదువుతామంటే, పోల్చడంలో ఉన్న కుతూహలంతో. రూమీని, బషోని, కబీర్ ని, రవీంద్రుణ్ణి , జిబ్రాన్ ని  తత్త్వంకోసం చదవం. వారి కవిత చదివిస్తుంది.కీర్క్ గార్డ్, నీచ వంటివారు కేవలం తాత్త్వికులు కారు.వారు కవులు. అందుకోసం వారిని చదువుతాం.

  దేవుడు మరణించాడు అన్న ప్రవచనంలోని పరమార్థం ఏమిటి?  అది ఒక్క వాక్యంలో తెలిసేది కాదు. దేవుడు లేనపుడు, పరమార్థము, దానిని  సాధించడమనే పురుషార్థము(జీవితలక్ష్యసాధన), సృష్టినంతా కలిపే ఏకతత్త్వము- యివేవీ ఉండవు. విలువలు ఏమైనా ఉంటే, అవి మనిషి నిర్మించుకోవలసినవి. పైనుంచి దించుకునేవి ఏవీ లేవు. మనిషి పుట్టుకకు తాను బాధ్యుడు కాడు.అది తానేమీ చేయలేని వాస్తవం (facticity అంటాడు సార్త్ర్.) కాని పుట్టిన తరువాత, తనను తాను తాను కోరినట్టు నిర్మించుకునే స్వేచ్ఛ మనిషికి ఉంది.ఆ స్వేచ్ఛే  శిక్ష అంటాడు సార్త్ర్.కాదు, ఆనందతాండవం అంటాడు నీచ. (ఇద్దరు యోగులు దర్శించేది ఒకే సత్యం.ఒక యోగి గుహ వెలుపలికి రాడు.మరొక యోగి, జీన్స్ వేసుకొని స్పోర్ట్స్ బైక్ మీద కొండలకోనలమీద విహరిస్తాడు. “ఏకం సత్ విప్రా బహుధా చరంతి.”

  అస్తిత్వవాదులూ అంతే.అందరూ మనిషిని ప్రతిష్ఠిస్తారు.అతడు ముక్తుడని, ప్రకటిస్తారు.కాని మనిషి ఆ స్వేచ్ఛను  ఎలా భావిస్తాడు, దానిని ఎలా వాడుకుంటాడు అనేది అనేకంగా ఉంటుంది.

  స్వేచ్ఛను మనిషి ఎలా పోగొట్టుకుంటాడు? డోస్టోవ్ స్కీ రచనల్లో చూశాం.భద్రతకోసం మనిషి స్వేచ్ఛను అమ్ముకొంటాడు. అభద్రతతో  జారుడుమంచుపై కొండకొనన ఆనందతాండవం చేయమంటాడు, నీచ!

“జారుడు  మంచు:
స్వర్గం,
నేర్చిననర్తకులకు.” (GS.Preludes: 13)

నృత్యం ఒక రోజులో నేర్చుకునేది కాదు. “ ఒకానొక  కాలంలో శ్రద్ధ ఒక జీవితకాలసాధనాఫలితం, రోజులలో వారాలలో నేర్చుకునే పని కాదు.” (Introduction:Fear and Trembling: Kierkegaard)

దేవుడున్నా లేకపోయినా మనిషి బతుకులో తేడా లేదు. అదే సాధన,  అదే శోధన.

                                               ***


మరో వచనంలో (GS. Aphorism 343)  లో నీచ యీ విషయమై భావించిన తీరు చూద్దాం:

                          “మా అభయానికి అర్థం”:

“ (భయంతో వణుకుతున్న తన దేహంతో అంటున్నాడు):
కార్కైస్, వణుకుతున్నావా?ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకుపోతున్నానో తెలిస్తే యింకా ఎక్కువ వణుకుతావు.( తూరెన్.1873)

   “ఇటీవలి కాలంలో జరిగిన గొప్ప సంఘటన, “దేవుడు చనిపోయాడు”.క్రైస్తవులు యింతకాలము విశ్వసించిన  దేవునియందు విశ్వాసం యిక ఏమాత్రము సాధ్యంకాదన్న విషయం యూరపును నీడలా ఆవరించడం మొదలయింది.చూపులో సందేహబలం ఉన్న కొందరైనా సూక్ష్మదర్శులు సూర్యుడు అస్తమించాడని చూడగలిగారు.పురాతనము గభీరము అయిన ఒక  విశ్వాసం సంశయంగా మారిందని తెలుసుకున్నారు...అది సామాన్యజనాలు వెంటనే గ్రహించలేనంత గొప్ప ఘటన.దాని ప్రాధాన్యాన్ని గ్రహించడం మాట అటుంచి, ఆ వార్తకూడా వారికి చేరలేనంత దూరంలో ఉంది…ఆ విశ్వాసం యింతకాలం తన బలంతో నిలిపి ఉంచిన సమస్తయూరపీయనైతికవ్యవస్థ భగ్నమయింది. కలగబోయే విధ్వంసము వినాశము ప్రకంపనము శైథిల్యము ఊహించగలిగిన వాడొకడు ఆచార్యబాధ్యతను, నైరాశ్యప్రవక్తపాత్రను వహించి, యింతవరకు కనీవినీ ఎరుగని ఒక సూర్యగ్రహణం రాబోతోందని  ప్రకటించవలె.
 నిజానికి, మా వేదాంతులకు, స్వేచ్ఛాబుద్ధులకు- ఏమనిపిస్తుందంటే, “పాత దేవుడు” చనిపోయాడు అన్న వార్త విన్నపుడు ఒక కొత్త ఉషోదయం అయినట్టు అనిపిస్తుంది.
సమస్యలను ఊహించగలిగిన మావంటివారు, కొండకొనలమీద కాపలా కాచేవాళ్ళు, పుట్టవలసినదానికంటే ముందే పుట్టినవాళ్ళు,... వారెందుకు తమకేమీ పట్టనట్లు, ఏ భయము లేకుండా ఎందుకున్నారు? ...ఎందుకంటే వారిమీద  ఆ మహద్ఘటన పరిణామాలు, జనసామాన్యం ఊహించినవాటికి విరుద్ధంగా ఉంటాయి కనుక. వాళ్ళలో ఎటువంటి విషాదము లేదు.వాళ్ళలో ఒక కొత్త వెలుగు, సంతోషము, ఉపశమనము, ఉల్లాసము, ఉత్సాహము...వారి మనసులు కృతజ్ఞతతో పొంగిపొర్లుతున్నాయి.జ్ఞానాన్ని ప్రేమించేవాడికి ఎంతటి సాహసానికైనా అనుమతి దొరుకుతుంది.దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు, కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇంతకాలానికి, మా నావలు బయలుదేరగలుగుతున్నాయి,ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాయి.ఇప్పుడు జ్ఞానాన్వేషణాప్రియులు చేయరాని సాహసం లేదు. సముద్రం, మన సముద్రం, మళ్ళీ  పిలుస్తోంది,ఏదీ దాచుకోకుండా. ఇంత స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం బహుశా మునుపెన్నడూ ఉండి ఉండదు.” (GS.5.343)

                                                        ***

వ్యాఖ్య :

   వచనం 125 లోని “దేవుడు మరణించాడు” చూచాం. ఇక్కడా  అదే విషయం. ”కొందరైనా సూక్ష్మదర్శులు సూర్యుడు అస్తమించాడని చూడగలిగారు”,అంటున్నాడు. సూర్యుడుండగా వెలుగు చూడలేని సాధారణ గుడ్డితనం కాదిది. సూర్యుడు అస్తమించినతరువాత యింకా వెలుగు ఉన్నదని నమ్ముతున్న గుడ్డితనం. అది చెప్పడానికే  వెనుకటి వచనం 125 లో, పిచ్చివాడు తెల్లవారగానే లాంతరు వెలిగించుకొని సంతలోకి వెళతాడు.( “యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ/ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః”.గీత.2.69 ) చనిపోయింది దేవుడు కాదని, దేవునియందు మనిషి శ్రద్ధ అని తెలుస్తోంది. కాని దేవునిమరణం వలన  ఏర్పడిన శూన్యం సాధారణజనాలకు యింకా అనుభవంలోకి రావడం లేదు. కొందరు సూక్ష్మదర్శులైన మహాత్ములకు మాత్రం తెలుస్తోంది. దేవుని యందు నమ్మకం సాధ్యం కానపుడు, మనిషి బరువు బాధ్యతలు పెరుగుతాయి. “సమస్తయూరపీయనైతికవ్యవస్థ భగ్నమయింది.” ఈ మహత్ శూన్యాన్ని ప్రకటించి ప్రవచించగల ఒక కొత్త ప్రవక్త అవతరించవలసిన అవసరం ఉంది.

  అయితే “మరణించిన దేవుడు” (125) యీ వచనంలో  (343) “పాతదేవుడు” అయినాడు. ఈ ‘పాత’ ఎందుకు? పాతదేవుడు అనగానే, ఒక కొత్తదేవుడు అన్న భావం కలగాలి కదా? దేవుణ్ణి ఎన్నిసార్లు హత్యచేసినా మరో దేవుడు ఆవిర్భవించవలసిందే. దేవుడి హత్య చాలా సార్లు జరిగింది.ఇకముందు జరగబోతుందికూడా.ఒక బుద్ధుడు మొత్తం ఒంపుతాడు, ఒక శంకరుడు తిరిగి నింపుతాడు. “ఒక కొత్త ఉషోదయం.” దేవుడు మరణించాడని “ఎటువంటి విషాదము లేదు.వాళ్ళలో ఒక కొత్త వెలుగు, సంతోషము, ఉపశమనము, ఉల్లాసము, ఉత్సాహము…” ఒక కొత్త అన్వేషణాస్వేచ్ఛ.
“జ్ఞానాన్ని ప్రేమించేవాడికి ఎంతటి సాహసానికైనా అనుమతి దొరుకుతుంది”. దేవుడిమరణానికి ముందు, అన్వేషణ లేదు, అన్వేషణ స్వేచ్ఛ లేదు. మతాధికారి ఏది చెబితే అది సత్యం. ఇప్పుడు సముద్రం మళ్ళీ పిలుస్తోంది.ఎంతటి సాహసానికైనా స్వేచ్ఛ ఉంది. ఎవడో యిచ్చిన సత్యం ప్రసాదంగా స్వీకరించవలసిన పనిలేదు.ఎవడి సత్యం వాడు వెదుక్కోవచ్చు. (“I want to find out the truth that is true only for me.” Kierkegaard)

  స్వేచ్ఛ ఉంది. నావలు సిద్ధంగా ఉన్నాయి. కాని, సమయం అనుకూలమా? “దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు, కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.” సముద్రం  భద్రమేనా? లేదు.పూర్వంకంటే యిప్పుడు సముద్రం ఏమాత్రము ప్రమాదరహితం కాదు.ఇప్పుడూ అది మృత్యుసంసారసాగగరమే.అంతే కాదు. నేనున్నాననే దైవంకూడా లేడు, ( “తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగగరాత్”.గీత.)  మునుగుతున్న నిన్ను ఉద్ధరించేవాడు లేడు. “ఉద్ధరేదాత్మనాత్మానమ్”.ఇపుడు నీ ముందుంది “స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం”.
మునిగినా తేలినా నీ బాధ్యత, నీ సాహసం, నీ స్వేచ్ఛ, నీ స్వచ్ఛత.

  ఏమిటి  అభయం?(“మా అభయానికి అర్థం” ) జ్ఞానాన్వేషణకు బంధం తొలగింది. ఇపుడు నిర్భయంగా జ్ఞానాన్వేషణాయానం చేయవచ్చు.స్వేచ్ఛ వలన కలిగిన అభయం. అభద్రమే, కాని బంధభయంలేదు.

  ఇది నీచ దేవుడి మరణవార్త మర్మం.ఇప్పుడు మనిషి ముక్తుడు.నీచపై హత్యానేరం మోపవచ్చా? బహుశా దేవుడే దీనంగా అడిగి ఉంటాడు, ఆక్సిజన్ ‘ముసుగు’ లాగేయమని! జనాలు తనతో ఆడుతున్న నాటకం అంతం చేయడానికి.

                                                    ***

  దేవుడికి చచ్చిపోవడం కొత్తేమీ కాదు. పుట్టడమూ కొత్తకాదు. ఎప్పుడెప్పుడు అవసరమైతే అప్పడప్పుడు, ఎలా భావిస్తే అలా పుడుతుంటాడు, (“సృజామ్యహం”).కనుక దేవుడిమరణం ఒక సంచలనాత్మక ప్రకటన మాత్రమే.ఆ ప్రకటన ప్రయోజనం మనం అర్థం చేసుకోవాలి.శ్రద్ధలో సంశయం అంతర్భవించి ఉంటుంది.”సంశయాత్మా వినశ్యతి”,అంటుంది గీత.కాని “కలడో లేడో”  అన్న గజేంద్రుడు నశించలేదు.సంశయంలో శ్రద్ధ పొదగబడి ఉంటుంది. ఎక్కడో వైకుంఠంలో, ఉన్నాడో లేడో తెలియని పరమాత్మ పరమేశ్వరితో ఆడుతున్న పాచికల ఆట ఆపి, తనకోసం ఆదరాబాదరా పరుగెత్తుకు వస్తాడని విశ్వసించడం ఎంత అబ్సర్డ్!
One must make movements toward faith, but the movement of faith itself must be made continually on the strength of the absurd.”: Kierkegaard)

  నీచ  కూడా పాత దేవుడికి ఉద్వాసన చెప్పి (“the old God is dead”) సంశయంలోనుంచి, శూన్యంలోనుంచి  ఒక కొత్త దేవుణ్ణి ఆవాహన చేస్తాడు. పాత దేవుడు చనిపోవడం అంటే, దేవుడంటే మనిషికున్న పాత అవగాహన తొలగి, కొత్త అవగాహన కలగడం. అంటే చచ్చిపుట్టడమంత కష్టం. అలా పుట్టినవాడు ద్విజుడు.

   అస్తిత్వవాదనాస్తికవిభాగానికి ఆద్యుడని చెప్పబడుతున్న హైడెగర్,  “భగవంతుడే మనలను రక్షించగలడు”, అన్నాడు ఒక యింటర్వ్యూలో.

   (“Only a god can save us. The only possibility available to us is that by thinknig and poetizing we prepare a readiness for the appearance of a god, or for the absence of a god in [our] decline, insofar as in view of the absent god we are in a state of decline.”  In an interview given by Martin Heidegger to Rudolf Augstein and Georg Wolff for Der Spiegel magazine on September 23, 1966)

   “the absence of a god in [our] decline” అంటే దేవుడు క్షయమయేది మనలో .అది మన క్షయం. ఒక కొత్త దేవుడి ఆవిర్భావానికి మనిషి సన్నద్ధం కావలె అంటున్నాడు  హైడెగర్.

                                               ***

ఇంతవరకు The GAY SCIENCE లోని దేవుడి మరణవార్త చదివాం.GS ముగింపుకు కొనసాగింపు Thus Spake Zarathustra. ఈ పుస్తకం గురించి వివరమైన పరిచయం తరువాత. ప్రస్తుతం అందులోని దేవుడి మరణవార్తావిషయం:


జారతూస్ట్ర ఉవాచ: నాందివచనాలు:( Thus Spake Zarathustra: Prologue:2)

“జారతూస్ట్ర కొండదిగాడు, ఒక్కడే. తనను కలవడానికి ఎవ్వరూ రాలేదు.కాని, అడవిలో అడుగుపెట్టగానే, ఉన్నట్టుండి అతడి ఎదుట ఒక వృద్ధుడు నిలబడ్డాడు.
ఆ వృద్ధుడు అతడి పవిత్రమంచంమీదినుండి లేచి కందమూలాలకై బయలుదేరాడు.జారతూస్ట్రతో  ఆ వృద్ధుడి మాటలు అలా మొదలయ్యాయి: ఈ దిమ్మరి నాకు అపరిచితుడేమీ కాడు.చాలాకాలం క్రితం యిటు వచ్చాడు.అతన్ని జారతూస్ట్ర అనేవారు.కాని, అతడు చాలా మారాడు.అప్పుడు నీ భస్మంతో  కొండలు చేరావు.ఇప్పుడు నీ నిప్పుతో లోయలోకి వెళ్తావా? దహనకాండకు పాలుపడినవాడి గతి ఏమవుతుందోనని భయంలేదా నీకు ? అవును, నేను జారతూస్ట్రను గుర్తుపట్టాను.అతని చూపు స్వచ్ఛం.ద్వేషం అతని నోటి దరిదాపుల తచ్చాడదు. అతడి నడక నర్తనంలా ఉండదూ? మారాడు జారతూస్ట్ర; జారతూస్ట్ర పసివాడైనాడు.జారతూస్ట్ర యిపుడు ప్రబుద్ధుడు. నిద్రపోతున్నవారిని నీవేం చేయగలవు? ఇన్నాళ్ళు నిన్ను కడుపులో దాచుకున్న కడలి, నిన్ను బయటకు తీసింది. అయ్యో! యిప్పుడు నీవు తీరం దాటిపోయి  తిరుగుతావా? అయ్యో! నీ దేహాన్ని నీవే యీడ్చుకుంటూపోతావా? జారతూస్ట్ర అన్నాడు: “ నేను మనిషిని ప్రేమిస్తాను.” ఆశ్రమవాసి అన్నాడు, “ నేనెందుకు వెళ్ళాననుకుంటున్నావు, అడవిలోకి ఎడారిలోకి? మనిషిని అమితంగా ప్రేమించాను కనుక కాదూ ? ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, మనిషిని ప్రేమించను.నాకు మనిషి మరీ అపరిపూర్ణుడు.అతన్ని ప్రేమించడం నాకు వినాశకరమవుతుంది.” “ ప్రేమ అన్నానా? కాదు, కానుకలు తెచ్చాను మనిషికి.” “వాళ్ళకేమీ యివ్వకు” అన్నాడు ఆశ్రమవాసి, “కావాలంటే వాళ్ళ బరువు కొంత తీసుకో, మోస్తూ వాళ్ళతో  నడువు.వాళ్ళకు అన్నిటికంటే కావలసిందదే. నీవు కోరుకునేది కూడా అదే ఆవునో కాదో ! కాదూ, వాళ్ళకేదైనా యివ్వవలసిందే అంటావా, యింత బిచ్చం పడెయ్.అదీ వాళ్ళు అడుక్కునే దాకా ఆగి!” “లేదు”, అన్నాడు జారతూస్ట్ర, “నేను బిచ్చం వేయను.నేనంత పేదవాణ్ణి కాదు.” సాధువు నవ్వి, అన్నాడు: “ సరే, చూడు నీ సంపద వాళ్ళు స్వీకరిస్తారేమో! ఆశ్రమవాసులను వారు నమ్మరు. మేము కానుకలు తెస్తామని నమ్మరు.మా అడుగుల చప్పుడుకు వారి వాడాలలో ఏ కోరికలు కదలవు . రాత్రులు, తెల్లవారడానికి చాలాముందు, ఎవరిదైనా అడుగుల చప్పుడైతే, వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు మా గురించి , “దొంగ బయలుదేరాడు ఎక్కడికో ?” ,అని. “మనుషులలోకి వెళ్ళకు, అడవిలో ఉండిపో.లేదా, పశువులతో గడుపు! నాలాగా ఉండలేవా—ఎలుగుల్లో ఎలుగులా, పక్షుల్లో పక్షిలా?”  “ మరి ఆశ్రమవాసి ఏం చేస్తాడు అడవిలో?”, అడిగాడు జారతూస్ట్ర.ఆశ్రమవాసి అన్నాడు: “ నేను భక్తిగీతాలు రాస్తాను, పాడుతాను; భక్తిగీతాలు రాస్తూ నేను నవ్వుతాను, ఏడుస్తాను, నాలో నేను గొణుక్కుంటాను: అలా దేవుణ్ణి స్తుతిస్తాను, నా దేవుణ్ణి. మరి మాకేం కానుకలు తెస్తావు?” ఆ మాట విని జారతూస్ట్ర, ఆ ఆశ్రమిముందు తలవంచి అన్నాడు: “నా దగ్గర ఏముంది నీకు యివ్వడానికి! నీదేదైనా తీసుకోకముందే, నేను యిక్కడినుండి త్వరగా వెళ్ళడం మంచిది !” — అలా ఆ యిద్దరూ విడిపోయారు, వృద్ధుడు, జారతూస్ట్ర, చిన్నబడిపిల్లల్లా నవ్వుతూ.ఆశ్రమి వెళ్ళిపోయిన తరువాత, జారతూస్ట్ర తనలో అనుకున్నాడు: “ నిజంగానా! ఈ అడవిలోని యీ వృద్ధ ఆశ్రమికి యింకా తెలియదా, దేవుడు మరణించాడని!”

                                                 ***
వ్యాఖ్య :

ఈ వచనంలో జారతూస్ట్ర ఒక అడవిలోని ఆశ్రమవాసిని కలుస్తాడు. వారిద్దరి  మధ్య జరిగిన సంభాషణ. జారతూస్ట్ర జ్ఞాని, ప్రవక్త. కాని నాస్తికప్రవక్త.ఆశ్రమవాసి? లోకానికి దూరంగా, అరణ్యాలలో ఎక్కడున్నాడో తెలియని దేవుడికోసం తపోధ్యానాదికాలు చేసుకుంటూ, కీర్తనలు రాసుకుంటూ, పాడుకుంటూ ఉంటారు. వీళ్ళు మనిషిని ప్రేమించలేరు. భగవంతుడికంటే కించిత్తు తక్కువ పరిపూర్ణమైన ప్రాణినికూడా ప్రేమించలేరు.కాని, వారి ప్రేమకు కూలి ఆశిస్తారు, “నేను భక్తిగీతాలు రాస్తాను, పాడుతాను; భక్తిగీతాలు రాస్తూ నేను నవ్వుతాను, ఏడుస్తాను, నాలో నేను గొణుక్కుంటాను: అలా దేవుణ్ణి స్తుతిస్తాను, నా దేవుణ్ణి. మరి మాకేం కానుకలు తెస్తావు?” (భజనబృందాలు,  వాళ్ళ రేట్లు ( terms and conditions) మనకు తెలుసు.) దేవుడు చనిపోయినా, ఆయన భజనచేస్తూ కానుకలకూలి ఆశిస్తారు వీరు. చివర, “...యీ వృద్ధ ఆశ్రమికి యింకా తెలియదా, దేవుడు మరణించాడని!” అని తనలో అనుకుంటాడు జారతూస్ట్ర. ఈ వచనప్రాముఖ్యం ఏమిటి? ఒకటి, వెనుక ( GS లో) దేవుడి మరణం పెద్ద పెద్ద అక్షరాలలో ‘అరిచి’  ప్రకటించబడింది.కాని ఆ వార్త జనపదాలకు దూరంగా అరణ్యాలలోని ఆశ్రమవాసులకు చేరినట్టులేదు అని జారతూస్ట్ర ఆశంక! ఇక్కడ గమనించవలసిన విషయం, దేవుడిమరణవార్తాప్రకటనలో వెనుకటి పారుష్యము తీవ్రత లేవు. ఇద్దరూ బడిపిల్లల్లా నవ్వులతో విడిపోయారు. ఏమిటి యీ మెత్తదనానికి అర్థం? అడవులలో ఆశ్రమాలలో దేవుడున్నా నష్టంలేదు, వాళ్ళ అజ్ఞానం వల్ల సమాజానికి నష్టం లేదనా?
“నా దగ్గర ఏముంది నీకు యివ్వడానికి! నీదేదైనా తీసుకోకముందే, నేను యిక్కడినుండి త్వరగా వెళ్ళడం మంచిది !”, అంటాడు జారతూస్ట్ర.ఆశ్రమవాసినుండి తాను తీసేసుకోగలిగిందేమిటి? అతడి ఆస్తిక్యబుద్ధిని,తన వెలుపల ఎక్కడో దేవుడున్నాడన్న అతని విశ్వాసం.

   ఇందులో కానుకలప్రసక్తి ఉంది.జారతూస్ట్ర తాను జనాలకోసం కానుకలు తెచ్చాను అన్నాడు.ఆశ్రమవాసి, “నేను దేవుణ్ణి యింతగా భజనచేస్తున్నాను, నాకేమీ కానుకలివ్వవా”, అంటాడు.ఆశ్రమవాసి ఆసించేది కూలి. జారతూస్ట్ర తెచ్చిన కానుక  రొట్టెముక్క కాదు, మనిషిని బిచ్చగాడి స్థితినుండి ఉద్ధరించే ఆత్మవిద్య. ఆశ్రమవాసి వెటకారంగా అంటాడు: “ సరే, చూడు నీ సంపద వాళ్ళు స్వీకరిస్తారేమో!” వాళ్ళకు ఆత్మవిద్య ఎందుకు? వాళ్ళడిగేది రొట్టెముక్క, అని అతని భావం. డోస్టోవ్ స్కీ నవల “కరమజోవ్ సోదరులు”లో  The Grand Inquisitor ఘట్టంలో క్రీస్తుతో న్యాయాధీశుడు యిదే అంటాడు.

  మనిషిని ప్రేమించేవాడు రొట్టెముక్కతో రాడు. ఆత్మవిద్యతో వస్తాడు, విద్యకు  అవిద్య అని పేరుమార్చి. కాలగమనంలో వాడివాడి భాష వాడి తగ్గుతుంది.భాషకు పదును పెట్టుకోవాలి. తాత్త్వికులు కూడా వారి పదాలు తోమి, పాదపదాలకు కొత్త అర్థాలు కల్పించవలసి ఉంటుంది.

                        “అవిద్యయా మృత్యుం తీర్త్వా”

పుణ్యపాపాలకవతల (Beyond Good and Evil)  నుండి:

“ముందుమాట (PREFACE): “సత్యం ఒక స్త్రీ అనుకుందాం.అప్పుడు ఏమవుతుంది? సత్యాన్ని ప్రేమించే తాత్త్వికులు స్త్రీని అర్థంచేసుకోలేదన్నట్టే  కదా? వీళ్ళ గంభీరమైన ముఖాలు,వీళ్ళ వికృతపు అభ్యర్థనలు-వీళ్ళకా ఆమె వశమవుతుంది? ముమ్మాటికీ ఆమె వీళ్ళను గెలుచుకోనివ్వలేదు.స్త్రీని గెలుచుకొనే కళలేవీ వీళ్ళకు తెలియవు.ఈ కాలంలో ఏ సిద్ధాంతం అయినా,ఆ సత్యం  ముందు ఏడుపుముఖం యీడుపుకాళ్ళు…అలా అని యీ సైద్ధాంతికులపట్ల మనం కృతఘ్నత చూపవద్దు- ఉదాహరణకు, ఆసియా వేదాంతము, యూరప్ లో ప్లేటో వాదము…”

Aphorism (వచనం)  1:

  “సరే, మనకు సత్యం కావాలి. పోనీ, అసత్యం ఎందుకు వద్దు? అనిశ్చయం? సరే,అజ్ఞానం ? సత్యం విలువ ఏమిటి  అనే ప్రశ్న మన ముందు నిలిచింది. లేక, మనమే దానిముందు నిలబడ్డామా? ఈడిపస్ ఎవరు? స్ఫింక్స్ (Sphinx) ఎవరు?
విలువల వైరుద్ధ్యం తాత్త్వికుల మూలవిశ్వాసం. “ ఏదైనా దాని విరుద్ధవస్తువునుండి ఎలా  రాగలుగుతుంది? ఉదా. అసత్యంలోనుండి సత్యం?వంచనలోనుండి సత్యాన్వేషణాసంకల్పం ? సత్యము, సత్యాన్ని తెలుసుకోవాలి అన్న కోర్కెకూడా ఏ నిత్యమైనసత్యలోకంలోనో , దాగినదేవుడిలోనో  కలగగలవు తప్ప, యీ మిథ్యాప్రపంచపు పెంటకుప్పలోనా ?”, అంటారు తాత్త్వికులు.”

Aphorism (వచనం) 2:

  “ఒక అభిప్రాయం అసత్యమైతేనేం?  అది మాకు అభ్యంతరం కాదు.ఇక్కడే మా కొత్త భాష వింతగా అనిపిస్తుంది.అసలు  ప్రశ్న ఏమిటంటే, ఒక అభిప్రాయం జీవితాన్ని ఎంత ముందుకు నడిపిస్తుంది, జీవితాన్ని కాపాడుతుంది, జాతిని నిలుపుతుంది, జాతిని పెంచుతుంది, అనేది. మా నమ్మకం ఏమిటంటే, అత్యంతము అసత్యమైన అభిప్రాయాలు ( యీ అసత్యంలోవే విజ్ఞానశాస్త్రవిశ్వాసాలు కూడా , the synthetic judgments a priori ) మనకు అత్యంతము అనివార్యమైనవి.ఈ హేతుబద్ధమైన కల్పనలను స్వీకరించకుండా,  నిత్యము శాశ్వతము అయిన కేవలం ఊహానిర్మితప్రపంచాన్ని వాస్తవంతో పోల్చకుండా, సంఖ్యలతో ప్రపంచాన్ని మిథ్యాభూతం చేయకుండా, మనిషి జీవించలేడు.అసత్యమైన అభిప్రాయాలను సన్యసించడమంటే జీవితాన్ని సన్యసించడమే, జీవితాన్ని కాదనడమే.అసత్యాన్ని జీవితసత్యంగా గుర్తించడం... సాంప్రదాయిక విలువలను దోషిగా నిలబెట్టి ప్రశ్నించడమే.ఒక తత్త్వదర్శనం ఆ విధమైన దోషారోపణ చేసిందంటే,అది ప్రమాదకరమైనచర్యే.కాని అలాటి సాహసం చేయగల తత్త్వదర్శనం మాత్రమే పుణ్యపాపాలను దాటగలదు.”
                                              ***

  వ్యాఖ్య :

(God is Truth.)

    మనం అప్పుడప్పుడూ అబద్ధాలు చెపుతాం, మరొకడు చెప్పింది అబద్ధమని తెలిసి, మన అవసరానికి,  నిజమని నమ్మేస్తాం. కాని యిక్కడ నీచ చేసిన సాహసం, తాత్త్వికప్రపంచంలో ఊహించడానికి కూడా ధైర్యంచాలని సాహసం! ఈ సమస్త జగత్తుకు అబద్ధమే ఆధారం అంటున్నాడు! అబద్ధం లేనిదే బతకడం అసాధ్యం అంటున్నాడు.

  ప్రాక్పశ్చిమాలలో ఏ తాత్త్వికదర్శనమైనా సత్యం అనే పునాదిపై నిర్మించబడిన సౌధమే. అన్ని దర్శనాలకు సత్యాన్వేషణే పరమావధి.నీచ యీ మూలసౌధంమీదికే దండెత్తుతువ్నాడు. దాని పునాదిరాయినే పీకేస్తున్నాడు.

   విజ్ఞానశాస్త్రం సత్యానికి  నికషం. విజ్ఞానశాస్త్రం ధృవీకరించనిదే ఏదీ సత్యం అనరాదు, అంటాం. ఆ విజ్ఞానశాస్త్రమే అసత్యాల ఆధారంపై నిలబడింది, అంటాడు నీచ.

  “విజ్ఞానశాస్త్రవిశ్వాసాలు కూడా ( ‘the synthetic judgments a priori’) అసత్యాధారితాలే, వాటిని నోరుమూసుకుని ఒప్పేసుకుంటున్నాం కదా”, అంటున్నాడు.

[‘the synthetic judgments a priori’ అంటే గణితశాస్త్రంలోనూ  భౌతికశాస్త్రంలోనూ ఋజువు లేకుండా మనం నమ్ముతున్న సత్యాలు. ఫలానారోజు సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో వస్తుందని సంవత్సరం ముందు చెబుతారు.మనం నమ్ముతాం. కాని ఎలా నమ్మగలుగుతున్నాం? వర్షం పడుతోంది అని ఎవడైనా  అంటే, నిజంగా పడుతోందో లేదో, కిటికీలోనుండి చేయి బయటపెట్టి చూసి “అవును,వర్షం పడుతోంది”, అంటాం. మరి ఏడాదికో పదేళ్ళకో ఫలానారోజు గ్రహణం అంటే, ఆ రోజు వచ్చేదాకా, మనం గ్రహణం చూసేదాకా, నమ్మకూడదు కదా? గ్రహణం నిజంగా వస్తుందో  రాదో తెలుసుకోడానికి వీలులేని నిర్ణయాన్ని నమ్ముతున్నాం, శాస్త్రీయమని. అంటే, అబద్ధం అవునో కాదో తెలియరాని విషయాలు మనం నిజమని నమ్మడం బతుకులో భాగం. నమ్మకపోతే,బతుకు అసంభవం అవుతుంది. ఈ నమ్మకాలనే కాంట్ (Immanuel Kant) synthetic a priori judgments అంటాడు.ఇది  ఆయన తత్త్వశాస్త్రంలో చాలా ప్రధానమైన తాత్వికాంశం.ఈ సిద్ధాంతాన్ని ఆధారంచేసుకుని నీచ మొత్తం తాత్త్వికసౌధాన్నే కూలగొడుతున్నాడు.]

  ఇంతకూ నీచ ఏం చెప్ప దలచుకున్నాడు? దేవుడు లేడు అన్నాడు( God is dead) . పోనీ అనుకున్నాం.సత్యమే దేవుడు కదా, (“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”అని ఉపనిషత్తు.) సరిపెట్టుకుందాం అనుకున్నాం.ఇప్పుడు “సత్యం కూడా అక్కరలేదు, అసత్యమే అక్కర; సత్యం వద్దు, అసత్యమే ముద్దు”, అంటున్నాడు.అసలేమిటి యితని ఆశయం? అసత్యమే “సత్యం”  అనడంలేదు నీచ.అలా అంటే,ఎడమచేత్తో తోసేసిన సత్యాన్ని కుడిచేత్తో తీసుకోడమే అవుతుంది. అసత్యమే అభినవసత్యమవుతుంది. భౌతికవాదులు, శూన్యవాదులు, యింకా అనేకులు నాస్తికులమని చెప్పుకునేవారు నిజంగా ఆస్తికులే, వారు సత్యమనేది వేరు, కాని వారు నమ్మేది వారు సత్యం అనుకునేదే. కాని నీచ ఆశయం అది కాదు.ఈ సత్యం వద్దు , మరో (అ)సత్యం మంచిది అనడం లేదు.సత్యం సాపేక్షం అంటాడు నీచ.నిజమైన నిజం (the-thing-in-itself) అంటూ లేదు.మన అవసరాలను బట్టి యీ సృష్టికి అర్థం చెబుతాం. మన స్థితిని బట్టి మన తత్వదర్శనాలు ఏర్పడుతాయి. మరీ స్థూలంగా చెప్పాలంటే,  జలుబు చేసినవాడి వేదాంతము, జ్వరం వచ్చినవాడి వేదాంతము వేరుగా ఉంటాయి.("Perspectivism." It is our needs that interpret the world; our drives and their For and Against.” The Will to Power, §481 ) నీచకు సత్యమా అసత్యమా అన్నది అప్రధానం. ఏ అభిప్రాయాన్ని అయినా స్వీకరించాలా తిరస్కరించాలా నిర్ణయించవలసింది, అది జీవితాన్ని ముందుకు నడిపిస్తుందా, జీవితం మెరుగుపరుస్తుందా? ఇది ముఖ్యం.

  ఇక్కడ నీచ కూడా శ్రద్ధను చెబుతున్నాడు. ఇది కీర్క్ గార్డ్ చెప్పే భగవంతునియందు శ్రద్ధ కాకపోవచ్చు.కాని దాని ధర్మాలు దీనికి ఉన్నాయి. శ్రద్ధ యిది సత్యమని నిర్ధారించదు. శ్రద్ధలో శంక అంతర్భాగం. అనేక మార్గాలుంటాయి.ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించుకోవలసింది నీవే. సత్యమొకటే, కాని దానికి  దారులనేకం.ఆ దారులు అసత్యపు దారులుకూడా కావచ్చు. నీచ సత్యాన్ని కాదనడం లేదు. అసత్యం కూడా ఒక జీవనసాధనం అంటున్నాడు. ఉపనిషత్తుకూడా యిదే కదా అంటుంది? సంసారరూపమైన మృత్యువును తరించడానికి అవిద్య మార్గమని ( “ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యాయామృతమశ్నుతే.”( ఈశ.ఉప.) అవిద్య అంటే అజ్ఞానం.)

   ఈ సత్యాసత్యచర్చ నీచ దర్శనంలో మరో ముఖ్యాంశంతో ముడిపడి ఉంది. నీచ, వైరుద్ధ్యాలను ఒప్పుకోడు. పుణ్యపాపాలుకాని, సత్యాసత్యాలుకాని ఒకదానికొకటి విరుద్ధం కావు.అవి ఒకే రేఖపై రెండు బిందువులు, రెండు స్థానాలు, రెండు స్థాయిలు. సత్యాసత్యాలుకూడా సాపేక్షాలు (relative). మెలకువలో కల అసత్యం. కలలో మెలకువ అసత్యం.

  స్వామి వివేకానందుడు అన్నాడు: “ అసత్యం ఒక స్థాయిలోని సత్యం. కింది సత్యంనుండి పై సత్యానికి నడవాలి.” అదే “అసతో మా సద్గమయ”.సత్యానికి నడిపించేది అసత్. ఇదే చెబుతున్నాడు నీచ.అందుకే ముందుగా, ప్లేటోకు వేదాంతానికి ఒక నమస్కారబాణం వదిలాడు,( “సైద్ధాంతికులపట్ల మనం కృతఘ్నత చూపవద్దు- ఉదాహరణకు, ఆసియా వేదాంతము, యూరప్ లో ప్లేటో వాదము…” BGE.Preface)

   జీవితానికి అర్థం ఉండదు, అర్థం మనిషి సృష్టించకోవలె. జీవితసత్యం మన వెలుపల ఉండదు. మన జీవించడానికి ఏది అవసరమో ఆ సత్యాన్ని మనం సృష్టించుకోవలె. (“Objective truth is existentially irrelevant.” kierkegaard.) జీవించడానికి యీ లోకపు వస్తువులు (things) కావాలి, పరవస్తువు (thing-in-itself) యీలోకంలో చెల్లదు.కుండకోసం వెళితే మట్టిముద్ద అమ్మినట్టుంటుంది.

                                                ***
ఉత్తరవచనం (postscript):

  ‘దేవుడు మరణించాడు’, ‘అసత్యమే ఆధారము’ వంటి నీచ సంచలనాత్మకవచనాలు అతనిపై  శూన్యవాది అరాచకవాది అన్న ముద్రలు వేశాయి. కాని, నీచ వాస్తవమైన ఆశయం ఏమిటి? అస్తిత్వవాదం  మనిషిని విడిపించడానికి ఆవిర్భవించింది. ( ఏ కాలంలోనైనా ఏ ఉద్యమమైనా అందుకే ఆవిర్భవిస్తుంది.) దేనినుండి విడిపించడానికి? ఒకటి మతంనుండి, రెండు తత్వశాస్త్రం నుండి. తత్త్వశాస్త్రం కూడా  ఈ రెండూ కూడా అనాదిగా మనిషికి బంధకారణాలు. ఈ రెంటినీ వ్యతిరేకించడం కీర్క్ గార్డ్ తో వాదరూపంలో, డోస్టోవ్ స్కీ తో సాహిత్యరూపంలోనూ మొదలయిందని చెప్పుకున్నాం.తరువాతి అస్తిత్వవాదులకు వారిద్దరూ బలమైన ప్రేరణ. కాని అస్తిత్వవాదం అన్న పేరు అంతస్పష్టంగా అప్పటికి  ఏర్పడలేదు. నీచ రాస్తున్న కాలంలో కూడా యిది ఒక వాదంగా గుర్తించబడలేదు.నీచ రచనల్లో యీ పదం ప్రముఖంగా కనిపించదు.కాని ప్రేరణ ఆ బంధముక్తే, మతంనుండి, ఆదర్శవాదతత్త్వశాస్త్రంనుండి.తత్త్వశాస్త్రంకూడా మనిషిని మతంనుండి విడిపించడానికే అంటుంది.కాని అది ఆ ప్రయత్నంలో హేతువాదపు నిరంకుశత్వానికి  బానిస అయిపోయింది.నీచ అరాచకశూన్యవాదాలుకూడా మనిషిని మతంనుండి తత్త్వశాస్త్రంనుండి విడిపించడానికే.

   అయితే, యీ రెండు అంశాలలో  అతనికి స్ఫూర్తి ఎటునుండి? నీచ చాలాకాలం షోపెన్ హోవర్ ప్రభావంలో ఉండినాడు అన్నది తెలిసినవిషయమే. ( తరువాతికాలంలో, ఆ ప్రభావంనుండి బయటపడ్డానన్నాడు.ఎంత, ఎలా బయటపడ్డాడు అన్నది జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం.) షోపెన్ హోవర్ ను ఉపనిషత్తులు అమితంగా ఆకర్షించాయి.(ప్రభావితంచేశాయి అంటే షోపెన్ హోవర్ ఒప్పుకోడు.నేను రాయడం ముగించాక ఉపనిషత్తులు చదివాను అన్నాడు. తన “The World as Will and Representation” అనే గ్రంథంలో ఛాందోగ్యోపనిషత్తులలోని మహావాక్యం “తత్త్వమసి” చాలాచోట్ల ప్రస్తావించాడు.) ఉపనిషత్తత్త్వం  ఎమర్సన్ (“Oversoul” )  ద్వారాకూడా నీచను చేరాయి అని వెనుక చెప్పుకున్నాం.కనుక నీచ అరాచకవాదానికి స్ఫూర్తి ఉపనిషత్తులనుండి అని చెప్పడానికి సందేహించనవసరం లేదు.

  ఉపనిషత్తులు అరాచకాన్ని శూన్యాన్ని ఉపదేశిస్తున్నాయా? అందులో సందేహం లేదు.
మరి, అవి యిక్కడ అలా ఎందుకు గుర్తింపబడలేదు అంటే, పశ్చిమంలో వలె ఆ భావాలు యిక్కడ విప్లవాత్మకము సంచలనాత్మకము అసాధారణము  కావు కనుక.

   ఇంకా లోతుగా తవ్వు, సనాతనధర్మభూమిపై  నిలబడతావు. ( “Dig deeper and you will find yourself standing on Catholic ground.”:Josef vonGörres)

 “నేతి నేతి”, అంటూ కాని వస్తువును చేరలేము. (“—and only when ye have all denied me, will I return unto you.” Zara.Part Two.)

   “న వర్ణా న వర్ణాశ్రమాచారధర్మాః”, అన్న శంకరుడు, నీచకన్నా పెద్ద అరాచకవాది.

  “బంధముక్తి, శారీరక మానసిక ఆధ్యాత్మిక బంధముక్తి, ఉపనిషత్తుల నినాదం.”( స్వామి వివేకానందుడు)

                                                         ***






No comments:

Post a Comment