Sunday, June 30, 2019

వాసుతో కాసేపు:

వాసుతో "కాసేపు"

ఆ రోజుల్లో కృష్ణశాస్త్రిని కదిలిస్తే కవిత్వం రాలేదని అంటారు.
కృష్ణశాస్త్రినే కాదు, ఎవరినైనా కదిలిస్తేనే కవిత్వం రాలేది, కదిలించే కవిత్వం.

" కాసేపు" వాసు అలా కదిలి రాసిన కవిత. ఆయన మరి కొంతసేపు కదలాలి అని కోరుకోవలసిన కవితలు. మేమిద్దరం ఒకే సంవత్సరం రిటైరయినట్టున్నాము, ఆయన కవిత్వంనుండి (1987-1992), నేను అధ్యాపకవృత్తి నుండి( 1993 ).ఆయన రిటైర్ కాలేదని , కాకూడదని అనుకొంటున్నాను. కాలేడు. సంచారిణీ దీపశిఖ  కొంటెగా కొంగు విసిరింది.అంటుకున్న కవి, వెంటపడకుండడం సాధ్యం కాదు.
     ఎవడన్నాడో కాని కరుణ ఒకటే రసమని, శోకం శ్లోకమవుతుందని, నన్ను మనసారగా ఏడ్వనీరు మీరు  అని, బాధ కవిత్వానికి పర్యాయపదమని ,మళ్ళీ  "మళ్ళీ బాధ గురించే" వాసు కవిత.ఏమిటా బాధ? "దూరంగా వినువీధుల్లో విహరించే అందని" అందమైన కవితకోసం కాదు.
    "   కెరటాలపై తేలుతున్న పువ్వులానో
        అగ్నిపర్వతపుటంచుపై
        అచంచలంగా మెరుస్తూన్న ఇంద్రధనుస్సులానో
         ................
         క్షణప్రభలా
         అనుక్షణభ్రమలా...
         ఆ సంచారిణీదీపశిఖాంచలస్పర్శకోసం".

బాధలో కవిత  ఆవిర్భవించినప్పుడు,  కవితకొరకైన బాధలో  కవిత కదిలిరాదా? అయితే  సముద్రమథనం జరగాలి. కాఠిన్యము ఆర్ద్రత సాధనాలుగా( "సముద్ర కాఠిన్యంతో సజలశరీరంతో" ) మథిస్తే , సహస్రారంనుండి మేరుదండంలోకి  కవితామృతస్ఖలనం అవుతుంది.("వెన్నులోకి  స్ఖలిస్తాయి  విద్యుత్ సర్పాలు".)
     కవిత్వమంటే బాల్యంలోకి ఎదగడమే, గతానికి  రంగులద్ది గీతంగా పాడడమే.కాని  వానవెలిసిన ఎండలో
ఇంద్రధనుస్సు చూస్తే కవిత్వమెలా అవుతుంది?

"బాల్యం ఇంద్రధనుస్సై
వెన్నెల్ని రంగుల్తో కలబోసేది"

వెన్నెట్లో ఇంద్రధనుస్సు చూశారా ఎపుడైనా? ఈ కవి చూపిస్తున్నాడు. " ఎగరడానికి రెక్కలక్కర్లేని వయసు"లో ఆకాశానికెగిరి రంగులద్దుతాడు కవి.

"ఆ జ్ఞాపకాలు ఒక్కొక్కటీ లోపల రాజుకుని
ఒక్కసారిగా మొహంలో పేలిపోతే
నేనో కంపిస్తున్న కన్నీళ్ళ పర్వతాన్నైపోతాను."

"లోపల రాజుకుని". అది మామూలు పర్వతం కాదు. అగ్ని పర్వతం. అది కార్చేది లావా జలం. అగ్నిజలపాతం.

అంతా అగ్నిపాతమే కాదు, జలపాతం కూడా దర్శించాడు కవి.ఆ జలపాతదృశ్యం ఎదుట కవి కన్నీటితో కరిగిపోయాడు. ఎందుకు ధారాపాతంగా ఏడుస్తోంది ఈ కొండ?పాపం, ఎవరేమన్నారు ? లోకానికి ఇంత ధారపోసినా,

"ఎవరీ ఆర్ద్రనయనిని  దోషిని చేశారు?
  బోనులో పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు? "

అలా అని, మరీ దగ్గర అవకండి.

"యిది గురక పెడుతున్న క్రూరమృగం"

జలపాతం ముందు మనం " తుంపరలం".

ఈ కవితాసంపుటిలో నన్ను నిలబెట్టిన , నన్నేమిటి ఎవరినైనా  నిలబెట్టే,  కవిత " ఎర్రగన్నేరు".పెద్ద చెట్టేమీ కాదు. కాని చెట్టు. చెట్టుకు కవిత్వానికి అనాది సంబంధం, అవినాభావ సంబంధం. మరి కొందరికి చెట్టుకవులని కూడా ప్రసిద్ధి. కాని కవులందరూ చెట్టుకవులే.( కాని వాళ్ళు "చెట్ట" కవులా?) ఇక వాసు చెట్టును ఆశ్రయిద్దాం. ఎలా?

" పరశురాముడు విల్లు అందించినట్టు
   చెట్టుకు నేను చేతినందిస్తాను."

చెట్టుకు నీవు  చేయూతనివ్వడం  కాదు. నీ  అవతారపరిసమాప్తి చేసుకోడం.  నీవు నీవుగా ఏమీ మిగుల్చుకోకుండా యిచ్చుకోడం. చెట్టును నేను నిలబెట్టలేను. "చెట్టు నీడన నుంచుంటాను."

"చెట్టును ఏమడగాలన్నా
 అది చెట్టుకు దూరంగా ఉన్నంతసేపే-"

చెట్టు ను కాదు, మరెవరినైనా " ఏమడగాలన్నా....దూరంగా ఉన్నంతసేపే".దగ్గరైతే ప్రశ్నలు దూరం.

"రెండు మౌన సముద్రాలను కలిపే
 అంతర్వాహిని తప్ప మరేం ఉండదు."

ఆత్మీయతలో మౌనం, మౌనంలో ప్రశ్నలు లీనం.

ఆ చెట్టుకు మనిషి చేసే చెట్ట:

"ఎవరో చెట్టుకున్నవన్నీ వొలిచేసి
మోకాళ్ళమీద కూచోబెట్టారు"

"మోకాళ్ళ" వరకు నరికేసిన చెట్టు ఒక చిత్రం. చెట్టుకు మోకాళ్ళుండవు కదా? అది మరొక చిత్రం. దానికి "వొలిచేసి" కలిపితే ? దానికి " భోగి" ని చేరిస్తే? మరో దృశ్యం. రాక్షసకృత్యం.

" నా పిచ్చిగాని ఇది చెట్టా?
 నరికి భోగిమంటలో పారేసే కట్టె"

"ఎర్రగన్నేరు" కే కాదు, ఈ కవితాసంపుటికే పతాకమనదగిన పంక్తులు:

""ఏమయిందం"టూ నేనూ అడగను
"ఏమయిందంటే"అంటూ చెట్టూ చెప్పదు"

ఉన్నదున్నట్టు జీవితాన్ని స్వీకరించడం అంటే యిదే.ప్రశ్నలు లేవు, ప్రశ్నించడం లేదు.ఇంతకంటే జీవితంలో, జీవితంతో , సాధించగలిగిన చిత్తసమాధానమేముంటుంది! ఇంత పరిణతిని పొందిన కవి ఇంతలో విరమించకూడదు.
         
"కాసేపు":(కవితాసంపుటి) న్యాయపతి శ్రీనివాసరావు.

( ఈ కవితాసంపుటిలో అన్ని కవితలను నేను స్పృశించలేదు. అన్నీ చదువవలసినవే.ఈ సంపుటికి ఇద్దరు ప్రసిద్ధులు ముందుమాటలు రాశారు: వాడ్రేవు చినవీరభద్రుడు, తంగిరాల వెంకట సుబ్బారావు. వాటిని ఇక చదువుతాను. మీరు ఎలాగు చదువుతారు.)

No comments:

Post a Comment