Sunday, June 30, 2019

అస్తిత్వవాదసాహిత్యం-4 నీచ-1/7

                                     అస్తిత్వవాదసాహిత్యం-4                                




                                             నీచ (Nietzsche)
                            (Friedrich Wilhelm Nietzsche (/ˈniːtʃə’ /) ;)
                                             (1844-90; Prussia)

         
[నీచ పేరు ఉచ్చరించడం కష్టంగానే ఉంటుంది.కాని పేరు మార్చవలసిన అవసరం ఉందనుకోను. అష్టావక్రమహర్షి పేరు మార్చం కదా నీచ రచనలు తెలుగులో అనువాదమైనట్టు తెలియదు.ఈ వ్యాసంలో ఆ రచనలకు పేర్లు నేను  తెలుగుచేసినవి.ఆ పేర్లతో ఆ రచనలు దొరకవు.ఈ వ్యాసంలో ఉదాహరించిన నీచ వాక్యాలు, కామన్ (Common) ,Kaufman మొదలైన  వారు చేసిన ఆంగ్ల అనువాదాల ఆధారంగా నేను తెలుగుచేసినవి.దొరకని అనువాదాలకు తెలుగు సంకేతాలు వాడడంలో అర్థం లేదు.కనుక సంకేతాలు (References) ఇంగ్లీషులోనే యిచ్చాను.]


ఈ వ్యాసంలో వాడిన సంకేతాలు:

-GS: The Gay Science: Aphorisms:CambridgeTranslated by Josefine Nauckhoff.
-GSP:The Gay Science: Preludes: Cambridge:tr.Adrian Del Caro.
-Za: Thus Spake Zarathustra;tr.Common:
-Za.P: Thus Spake Zarathustra: Prologue.
-BGE: Beyond Good and Evil:
-AC:Anti-Christ:

                                                         ***

నీచ దేవుణ్ణి హత్యచేయలేదు.మరణవార్త చదివాడంతే,  (“దేవుడు మరణించాడు.”GS).ఆ రోజు టి.వి.స్టూడియోకు నల్లకోటు వేసుకొని వచ్చి ఉంటాడు.స్వరంలో కొంత విషాదాన్ని కూడా తెచ్చుకొని ఉంటాడు.అయినా,హత్యానేరంలో నీచను యిరికించారు. దేవుడు లేడనడం కొన్ని మతాలలో దైవద్రోహం.కాని భారతీయధర్మంలో  “దేవుడులేకుండా జ్ఞానోదయం”
 ("God Without Enlightenment",a commentary on Mandukya Upanishad: by Swami Rama) కొత్తకాదు, వింతకూడా కాదు.

శూన్యవాదం (Nihilism) కూడా నీచ ప్రవచనమే అన్నారు. శూన్యవాదం (nihilism)  బ్రహ్మవాదులతో,  భావవాదులతో ( Idealists ) మొదలయింది అంటాడు నీచ. (“క్రైస్తవమతం జనాలకొరకు వచ్చిన ప్లేటోవాదం.” BGE) వారికి  జగత్తు మిథ్య, అంటే శూన్యం. వాళ్ళు జగత్తుమొత్తాన్ని  చీపురుతో చిమ్మి అవతల పడేశారు.  కనుక  శూన్యం నేను సృష్టించలేదు. అనవసరంగా నన్ను ఆడిపోసుకోకండి’ , అంటాడు.

“ఆది అనైతికవాది” (“first Immoralist”:) అని నీచ తన గురించి  తానే చెప్పుకున్నాడు. (Za.కు అతని సోదరి ఎలిజబెత్ రాసిన ఉపోద్ఘాతంలో ఉదాహరించిన  నీచ వాక్యం.) పుణ్యపాపాలదుర్బలద్వంద్వంనుండి మనిషిని విడిపించడం అతని ఆశయం.

“నేను మానవాళిని ప్రేమిస్తాను”,(Za.) అన్నాడు, యీ “ఆది అనైతికవాది”! ఏమిటి ఆ ప్రేమస్వరూపం? “నేను మీకు పురుషోత్తముణ్ణి (Ubermensh, Overman, Superman) ఉపదేశిస్తాను.” అంటే, కీటకం బ్రహ్మముగా ఎదగడం చూడగోరేవాడు నీచ.( కీటము, బ్రహ్మము విరుద్ధద్వంద్వం కాదు.ఆకీటబ్రహ్మపర్యంతము ఏకసూత్రం. దానిపై కీటము, బ్రహ్మము రెండు స్థానాలు, స్థాయిలు.)

“నృత్యం చేయలేని దేవుడిపై నాకు నమ్మకంలేదు.”(GS.) ఇతడు నాస్తికుడా! పాపం! అపార్థం చేసుకున్నామేమో? పాపము,  శోకము మాత్రమే తెలిసిన లోకానికి, ఆనందనృత్యం నేర్పించాలనుకొన్న  నీచానందస్వామి!

                                                  ***




























కీర్క్ గార్డ్ తనది వ్యంగ్యశైలి అని చెప్పుకున్నాడు. ( “వ్యంగ్యం నాలో గుచ్చుకున్న బాణం, దానిని తొలగిస్తే  పోతుంది  నా ప్రాణం.” ) నీచ శైలిలో కూడా  వ్యంగ్యం ఉంది. కాని అతని శైలి,  కీర్క్ గార్డ్ శైలికంటే సూటిగా ఘాటుగా ఉరుములా మెరుపులా  ఉంటుంది. “ నా మేఘంలో  భరించలేనంత ఉద్వేగం.మెరుపుల నవ్వుల మధ్య అగాధాలలోకి వడగళ్ళు విసురుతాను. నా హృదయం పర్వతాలపైకి ప్రభంజనం ఊదుతుంది.అప్పుడుకాని అది శాంతించదు.” (Za.2వ భాగం.)

నీచ కవి.  అతనిది కావ్యశైలి.అతని రచనలు కావ్యాలు.వాటిని కావ్యాలుగానే చదవాలి.తత్త్వశాస్త్రగ్రంథాలుగా చదవడంవల్ల అపార్థం కలుగుతుంది.కలిగిందికూడా.

జర్మన్  భాషాసౌందర్యం గురించి, శబ్దరామణీయకత గురించి చాలా గొప్పగా చెబుతారు.ఇక నీచ దాన్ని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది! నిజానికి తాత్త్వికగ్రంథాలు కావ్యశైలిలో అరుదుగా ఉంటాయి. శంకరుడు గొప్ప కవి.కాని తన భాష్యరచనలో కావ్యశైలిని దూరంగా ఉంచుతాడు.జర్మన్ తత్త్వశాస్త్రరచనలు వాటి కావ్యగుణానికి చదవవలె అంటారు. చివరకు కార్ల్ మార్క్స్ రచనలు కూడా! తన పితృభాషగురించి యిలా పరవశిస్తున్నాడు నీచ:
(జర్మనులు మాతృదేశమనరు.అలాగే మాతృభాషకూడా అనుకుంటా.పైగా, నీచకు స్త్రీలంటే ఏమాత్రము సద్భావం లేదు.బహుశా అతడి మీసాలు కారణం కావచ్చు!అమ్మాయిలు పారిపోతే అది వాళ్ళ తప్పు కాదు.)

ఇక జర్మన్ భాషాసౌందర్యప్రసక్తి:

“. మూడవ  చెవి ఉన్నవాడికి జర్మన్ చదవడమంటే మామూలు హింసకాదు ! ... ప్రతి మంచి వాక్యంలో  కళ ఉందని- వాక్యం అర్థం కావాలంటే  అందులో ఊహతో అందుకోవలసిన కళ ఉందని-ఎంతమంది జర్మన్ లకు తెలుసు,ఎంతమంది  తెలుసుకోడం అవసరమనుకుంటారు? ఉదాహరణకు, వాక్యంలో గమనవేగం సరిగా పట్టుకోకపోతే, వాక్యానికి అపార్థం కలుగుతుంది.వేగాన్ని నియమించే అక్షరాలవిషయంలో అనిశ్చయం ఉండరాదు; వాక్యసౌష్ఠవభంగం ఉద్దేశించిందే,  సప్రయోజనమే అని ఆ  విరుపులోని సొగసు తెలియాలి ;ప్రతి ద్రుతము విలంబము చెవి ఒగ్గి వినగలగాలి. అచ్చులు సంధ్యాక్షరాలు యీ క్రమంలోనే కూర్చడానికి   అర్థమేమిటి? ఆ అక్షరాలను కొత్తరంగులతో సరికొత్తరంగులతో ఎంత సుకుమారంగా  సుందరంగా కూర్చవచ్చో- యివన్నీ తెలియాలి. జర్మన్ పాఠకులు ఎవరు యింత యిష్టంగా కష్టపడతారు?...,  [మరొకడి శైలి ] సాము  కత్తిలా బుస్సుబుస్సుమంటుంది;కాటువేయాలని ఊగిపోతుంది; కోసెయ్యాలని చూస్తుంది. కంపిస్తున్న  ఆ కత్తిలోని  ప్రమాదభరితదివ్యానందం నఖశిఖము  అనుభవిస్తాడు కలం పట్టుకున్న ఆ కవి.” (Aphorism 246: BGE)

ఇది చదివిన తరువాత,  జర్మన్ భాష తెలియకపోవడం ఎంత “ప్రమాదభరితదివ్యానందం” పోగొట్టుకోవడమో  అనిపించదా? కేవలం భాష తెలియడం కాదు, ఆ భాష వినడానికి ‘మూడో చెవి’ కూడా అవసరమంటున్నాడు. ఈ ‘మూడో చెవి’ ఏ భాషకైనా అవసరమేమో?



                                               ***



                      ఈ వ్యాసంలో ప్రస్తావించిన  నీచ ప్రధానరచనలు:

1874.              Untimely Meditations
1882               The Gay Science
1883               Thus Spake Zarathustra
1886               Beyond Good and Evil
1888               The Antichrist


వీటిలో మొదటి పుస్తకానికి (The Gay Science,la gaya  scianza) రెండవ ప్రతిలో, అయిదవ అధ్యాయం చేర్చాడు.ఆ తరువాత తాను రాయబోతున్న Thus Spake Zarathustra కు ఆ అధ్యాయం దారి చూపుతుంది.( The Gay Science) లోని “నాలుగవ పుస్తకం”, “జారతూస్ట్ర” లోని ప్రారంభభాగము యించుమించు ఒకటే.) ఈ రెండు రచనల్లో నీచ ప్రధానభావాలన్నీ వ్యక్తమైనాయి. అందులోను The Gay Science లో అతడి అన్ని భావాలబీజాలు ఉన్నాయి. అందులో “ పిచ్చివాడు” (125.స.శా.)  అన్న ఖండికలోనిదే “దేవుడు మరణించాడు” అన్న  అతని ప్రసిద్ధవాక్యం. ఈ ఒక్క  ఖండికలోనే కాదు, యింకా చాలా సందర్భాలలో దేవుడి మరణవిషయం ప్రస్తావించాడు నీచ.108 నుండి 125 వరకు, ఆ తరువాత గ్రంథాంతలో వచ్చే  343, అన్నీ ఖండికలు చదివినపుడు మాత్రమే “దేవుడిమరణం”లో  నీచ ఆలోచనాధార, అతడు ఏం చెప్పదలచాడో తెలుస్తుంది.(ఈ రచనలోనే   కాక, “జారతూస్ట్ర” ప్రారంభభాగంలో కూడా యీ దేవుడి మరణవార్త వినిపిస్తుంది.) ఈ గ్రంథంలో (GS) నీచ దర్శనంలోని అన్ని  ప్రధాన భావాలకు బీజాలు చూడవచ్చు.

“సముల్లాసశాస్త్రం” (The Gay Science లేక The Joyful Wisdom ) పేరు విచిత్రం. శాస్త్రము, సముల్లాసము కలిసి పలికే విషయాలు కావని మనకు ఒక అభిప్రాయం. శాస్త్రం అనగానే మనం  విజ్ఞానశాస్త్రము, గాజు గరాటాలు మైక్రోస్కోపులు అనుకుంటాం.వాటికి ఉల్లాసానికి ఎంత దూరం! కాని సంగీతం కూడా శాస్త్రమే కదా?  నీచ తన పుస్తకానికి యీ పేరు పెట్టినపుడు, తను మధ్యయుగంనాటి  దక్షిణయూరప్ లోని( ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్”)  గాయకబృందాలను (troubadours) ఉద్దేశించానని చెప్పుకున్నాడు.ఆ ప్రాంతపు ఉల్లాసభరితజీవితవిధానం నీచకు యిష్టం. నీచకు తెలుసునో లేదో కాని,  కీట్స్ కూడా యీ ప్రాంతాన్నే స్మరించాడు, తన విషాదంలో.( “Dance, and Provençal song, and sunburnt mirth! O for a beaker full of the warm South”.Ode to a  Nightingale).

క్రైస్తవం ఎప్పుడూ ఏడుపే, “ నా కోసం ఏడవకండి.మీ కోసం మీ పిల్లలకోసం ఏడవండి”. జీవితం ఏడవడానికేనా? జర్మన్ల తాత్వికగాంభీర్యం కూడా నీచ యిష్టపడలేదు. కనుక, తన రచనకు Gay Science (సముల్లాస శాస్త్రం”) అన్న ఆ పేరు. ఈ పుస్తకం పేరులో గాయకుడు, యోధుడు, స్వేచ్ఛాత్మ (free spirit), ముగ్గురి కలయిక ఉంది.జీవితానికి అర్థం లేదు. అలా అని షోపెన్ హోవర్ లాగా నిరాశావేదాంతాన్ని వల్లెవేస్తూ కూర్చోనవసరం లేదు. అర్థంలేని జీవితంలో అర్థం సృష్టించుకుని ఆనందనృత్యం చేయాలంటాడు నీచ. ఈ అర్థంలేని జీవితం మళ్ళీ మళ్ళీ కలగాలని, యిదే జీవితం, సరిగ్గా యిలాంటి అర్థంలేని జీవితమే, మళ్ళీ మళ్ళీ కలగాలని,కోరుకోవాలి అంటాడు నీచ. (Eternal Recurrence) నిజమైన జ్ఞానం ఉల్లాసంలో కలుగుతుంది అంటాడు.

అంతేకాదు,యీ పుస్తకానికి ముందుమాట (Preludes) పద్యాలరూపంలో రాశాడు.నీచది కావ్యశైలి అని చెప్పుకున్నాం కదా! అతని పద్యాలలో కంటే అతని వచనంలోనే ( ముఖ్యంగా “జారతూస్ట్ర”లో)  కవితాగుణం ఎక్కువ అంటారు కొందరు.కాని, అది ఎక్కువతక్కువల విషయంకాదు. వచనంలో కవిత ప్రవాహం, పర్వతశిఖరంపైనుండి పది దిక్కులకు పరవళ్ళుగా పారే ప్రవాహం.పద్యాలలో కవిత,  పిడికిట పిడుగు.

                                                   ***


కీర్క్ గార్డ్, నీచ- చైతన్యప్రసంగం: దాసోహం, సోహం.

నీచ  పరామర్శ ప్రారంభించే ముందు, కీర్క్ గార్డ్ కు వీడ్కోలు చెబుదాం.
     
కీర్క్ గార్డ్ ,నీచ ( Nietzsche) సాధారణంగా యీ యిద్దరినీ అస్తిత్వవాదప్రవక్తలుగా చెబుతుంటారు.  కనుక, చైతన్యం గురించి వారి ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం.

కీర్క్ గార్డ్ “భయము, కంపము” లోని  చైతన్యప్రసంగం  మళ్ళీ ఒకసారి చూదాం:

“మనిషిలో నిత్యచైతన్యమే  లేకపోతే, ఈ సమస్తసృష్టికీ , అందులో అల్పమైనదిగాని అనల్పమైనదిగాని , అన్నిటికీ ఆధారం,  ఉద్వేగాలతో ఉడికిపోయే ఒక అవ్యక్తమైన అంధశక్తి మాత్రమే అయి ఉంటే; ప్రతి వస్తువు వెనుక  ఉన్నది ఒక అంతులేని శూన్యము, దాని ఆరని దాహం  మాత్రమే అయితే, జీవితంలో నిస్పృహ తప్ప ఏముంటుంది?  అదే నిజమయితే, మనుషులను కలిపి ఉంచే పవిత్రబంధమేదీ  లేకుంటే,  మనుషులు ఒక తరం తరువాత మరో తరం అడవిలో చెట్ల ఆకుల్లా రాలిపోయి తిరిగిపుడుతుంటే, ఒక తరం స్థానంలో మరో  తరం,  అడవిలో పక్షుల పాటల్లా ఆగి ఆగి  వినిపిస్తుంటే, మనుషులు యీ ప్రపంచంలో సముద్రంపై నావల్లా, ఎడారిలో గాలిలా, ఆలోచనలు ఆశయాలు లేకుండా ప్రయాణిస్తూఉంటే,  ఒక అవ్యక్తశక్తి  ఆకలితో ఆహారంకోసం శాశ్వతంగా పొంచి ఉంటే, దాని కోరలనుండి కాపాడగలిగిన ఒక  గొప్పశక్తి  లేకపోతే, జీవితం ఎంత శూన్యం! ఎంత నిష్ఫలం!”

 చైతన్యమే లేకుంటే చెట్టుకు మనిషికి  తేడా ఏముంటుంది, మనిషి జీవితంలో నిస్పృహతప్ప ఏముంటుంది అంటున్నాడు కీర్క్ గార్డ్.ఈ మాటను  నీచ ఒప్పుకోడు. అతని జీవితకాలమంతా  దీనిని ఖండిస్తూనే వచ్చాడు.


“ చైతన్యం నిరంకుశత్వానికి  వశమైపోయింది.అదీ ఎలా? దానిని గొప్ప చేస్తూ.మనిషి సారమంతా యీ చైతన్యంలోనే ఉందన్నారు.అది అనాది, నిత్యము శాశ్వతము పరమము అన్నారు. చైతన్యం ఒక సిద్ధవస్తువు అన్నారు. దానికి ఎక్కువతక్కువలుంటాయని, ఉండడం పోవడంకూడా  ఉంటుందనీ ఒప్పుకోరు. ప్రాణిని ఒకటిగా ఉంచేది చైతన్యమేనంటారు! ఇలా దానిని గొప్పచేయడం హాస్యాస్పదం, అపార్థం చేసుకోడం కూడా.”( G.S.A.)

 
నీచ  అంటాడు, చైతన్యమనేది ఒక సిద్ధవస్తువు (“a fixed, given” ) కాదు;అది క్రమపరిణామశీలము; పైగా అది నిరంతరం కాదు. మూలభావంలోనే యింత వైరుద్ధ్యం ఉన్న యీ యిద్దరూ , (కీర్క్ గార్డ్, నీచ) ఒకే తాత్విక వాదానికి ప్రవక్తలెట్లా అయినారు? వారి వైరుధ్యం లోతు ఎంత? వారి ఆలోచనలలో  ఉన్న సామాన్యాంశాలు ఏవి? ఇవి సావధానంగా పరిశీలించవలసిన విషయాలు. ఈ సందర్భంలో సవివరంగా పరిశీలించలేము. కాని కొంత స్థూలంగా చూద్దాం. (కీర్క్ గార్డ్ కూడా చైతన్యం అంతటా అందరిలో ఒకే విధంగా ఉంటుంది అనడు. (“ విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని । శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః” . గీత: 5.18. గాడిదలో ఉన్న చైతన్యమే గుర్రంలోనూ ఉంది.కాని, గాడిద గాడిదే, గుర్రం గుర్రమే.) ఇద్దరి  అస్తిత్వవాదుల అసంతృప్తికి కారణం ఒకటే. వ్యవస్థ -  రాజకీయవ్యవస్థ, మతవ్యవస్థ, సామాజికవ్యవస్థ-వ్యక్తి వ్యక్తిత్వాన్ని హరిస్తున్నది. వ్యక్తిని వ్యవస్థనుండి కాపాడి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టడం యిద్దరి ఆశయం. సమస్య యిద్దరిదీ ఒకటే,  కాని,  పరిష్కారం ఎవరిది  వారిది.
   
ముందుగా, వీరిద్దరిదృక్పథాలలోని సామాన్యాంశాలు, ముఖ్యంగా అస్తిత్వవాదులు ఉపయోగించుకోగలిగినవి, చూద్దాం. సామూహిక సత్యం యిద్దరూ అంగీకరించరు.నీచ, “దృక్పథం”  (perspective) అంటాడు. ఎవడి దృక్పథాన్ని బట్టి వాడికి తెలిసింది  సత్యం. కనుక, లోకానికంతటికీ ఒక సత్యం (universal truth) ఉండదు. కీర్క్ గార్డ్ ప్రసిద్ధవాక్యం: “నాకు మాత్రమే సత్యమైన సత్యాన్ని నేను తెలుసుకోవలె”(I must find a truth that is true for me”). అంటే సత్యం మందలో దొరకదు,  ఆ మంద సామాజికమైనా, రాజకీయమైనా, మఠమైనా. (“Crowd is the untruth”, అంటాడు కీర్క్ గార్డ్. నీచ “ herd” అంటాడు. ) వీరిద్దరూ చెప్పదలచిందేమంటే, సార్వకాలికము సార్వజనీనము అయిన సత్యం ఉండదు అని మాత్రమే కాదు. ఒక వేళ అటువంటి సత్యమొకటి ఉన్నా అది ఎవడికి వాడు సంపాదించుకోవలసిందే. ఆ సత్యసాక్షాత్కారం కొరకు ఎవడి యాతన వాడు పడవలసిందే. అప్పుడే అది వాడిదవుతుంది. ఒకడు సంపాదించి మరొకడికి యిచ్చేది కాదు. సత్యాన్వేషణ ఒంటరి ప్రయాణం.(“ఏకాకీ యతచిత్తాత్మా”.(గీత). సిద్ధిలోనే కాదు, సాధనలో కూడా ఏకాకి; ఆరూఢుడే కాదు, ఆరురుక్షువు కూడా.) అంటే వ్యక్తిని అన్ని బంధాలనుండి విడిపించి అతన్ని ముక్తుణ్ణి చేయవలె అనే ఆర్తి యిద్దరిదీ. కాని అంతటితో వారి సామ్యం ముగుస్తుంది.
 
[ఈ చర్చను కొనసాగించేముందు,  పరిశీలనకు అవసరమైన పరిభాషను సరిచూసుకోవలె. తత్త్వశాస్త్రం, దర్శనం, వేదాంతం అన్నవి వేరు వేరా? సాధారణంగా వేదాంతం అన్న పదం philosophy కి సమానార్థకంగా వాడుతున్నారు.  నేటి మెటఫిజిక్స్ , ఓంటోలజీ, ఎపిస్టెమోలజీ, వంటి పదాలన్నీ చేరుతాయి వేదాంతంలో (ఫిలాసఫీలో) .(వేదాంతం అన్న పదం అవైదికసంస్కృతులచర్చలో వాడవచ్చా? ఈనాడు ఆ పదం ఆ అర్థంలో స్థిరపడినట్లే ఉంది, వైదికవాసనలు వదిలించుకొని.) కాంట్, హెగెల్ మొదలైన వారంతా తాము వేదాంతులమనే (philosophers) చెప్పుకున్నారు.కాని, యీనాడు వారిని తాత్త్వికులు ( Metaphysicians)  అంటారేమో? స్థూలంగా, తాత్త్వికుడంటే  తెలియని దాని (noumenon,  thing-in-itself) గురించి విచారణ చేసేవాడు. వేదాంతి తెలిసినదాని ( phenomenon) గురించి విచారణ చేస్తాడు. సృష్టి ఎలా జరిగింది ఎలాగూ తెలియదు.( ఈ సృష్టిరహస్యవిషయం భౌతికశాస్త్రం (physics) , అధిభౌతికశాస్త్రం  (metaphysics) , వీటి మధ్య తిరుగుతూంటుంది, యిటునుండి అటు, అటునుండి యిటు.)  తెలియని దానిని గురించిన  భిన్నాభిప్రాయాలనే  దర్శనాలు ( systems) అంటున్నారు.
 
మరొక విభాగం కూడా ఉంది, ఫిలాసఫీ (వేదాంతం),మెటఫిజిక్స్  (తత్త్వశాస్త్రం).అంటే,ఫిలాసఫీ అన్న పదం సముదాయార్థంలోను,ప్రత్యేకార్థంలోను ( తెలియని దానికంటే వేరుచేస్తూ, తెలిసినదాని విచారణ) కూడా వాడుతున్నారు.]

కనుక,తెలిసిన యీ సృష్టితో ఎలా వ్యవహరించ వలె అనేది వేదాంతవిషయం.ఈ సృష్టివిషయంలో  మూడువిధాల స్పందన మనం వింటుంటాం .ఒకటి, “యీ సృష్టి  మనం చేసినది  కాదు. ఎవడో సృష్టించి మన మీద ప్రయోగించాడు. మనం పరాధీనులం కనుక, యిక్కడి కష్టాలు పడదాం.ఆ పైవాడు కరుణించి పైలోకంలో మనలను దయజూస్తాడు”, అని శరణాగతి చెందడం.ఇందులో, యీ లోకానికి విలువ లేదు, యిది కేవలం పరలోకప్రయాణీకులు  “వేచియుండు గది.” ఈ వర్గంలో క్రైస్తవ ఇస్లామ్ వైష్ణవ మొదలైన ద్వైతమతాలన్నీ  వస్తాయి.మరి కొందరంటారు “ ఈ జీవితం మనకు విధించబడింది.దాన్ని గురించి సణగడమెందుకు? కష్టమే యిష్టమని అనుభవిద్దాం ( stoics)” .  మరి కొందరికి,  మన ప్రమేయం లేకుండా దీనిని సృష్టించి,మనమీద ప్రయోగించినవాడిపై,వాడి సృష్టిపై  కోపం, బాధ, తిరుగుబాటు, నిస్పృహ. వీటికి  గుర్తింపు యిచ్చి, పేర్లు  పెట్టినవారు యీనాటి అస్తిత్వవాదులు అసంబద్ధవాదులు.
 
నీచ అంటాడు, యింతకాలంగా యిన్ని విధాలుగా సృష్టికి స్పందించారు కాని, నిందించని తాత్త్వికుడూ ఒక్కడూ  లేడా? ఈ సృష్టిలో ఆనందంగా బతుకవచ్చు అన్నవాడొక్కడూ లేడా? ఎప్పుడో తత్త్వశాస్త్రం పుట్టకముందు, ఎపిక్యూరస్ అన్నాడు.(ఎపిక్యూరస్ గురించి సాధారణ అభిప్రాయం, “ తిను తాగు సుఖమనుభవించు” అన్నది అతని వేదాంతమని. ఇది అతని తత్త్వాన్ని గురించిన వాస్తవం కాదు. ఈ విషయం మరో సారి చూద్దాం.) అతని తరువాత, వేదాంతి అంటే విషమో ఆముదమో  తాగిన ముఖం వేసుకుని కూర్చునేవాడేనా? జీవితమంటే ఏడుపు ముఖం యీడుపు కాళ్ళా?  వేదాంతంలో  నవ్వుపై  నిషేధమా? నీచ మొదటి రచన “The Birth of Tragedy”. అందులో,జీవితాన్ని ఒక నాటకంగా భావించమంటాడు. నాటకంలో  నటులకు  కథారచనలో స్వాతంత్ర్యం ఉండదు. కాని, కథలోని కష్టసుఖాలతో సంబంధంలేకుండా,నటించి  జీవితాన్ని  కళాత్మకము రసమయము  చేసుకుంటారు. మనిషి అలాగే జీవించాలి, అంటాడు నీచ.
   
అయితే యింతకాలంగా వచ్చిన తాత్త్వికులందరికీ, ఆనందంగా జీవించడం సాధ్యమే అన్న ఆలోచన ఎందుకు కలగలేదు? వారందరిదీ ద్వైతదర్శనం. “నేను వేరు, యీ సృష్టి వేరు.దీన్ని వేరెవడో  సృష్టించి నా మీద ప్రయోగిస్తున్నాడు, నేను వీడికి దొరికిపోయాను”,  అన్నపుడు, కోపము, బాధ, నిరాశ  కలుగుతాయి. నీచకు యివి కలగక పోవడానికి కారణం, అతడిది ద్వైతదర్శనం కాదు.అతడు అద్వైతి.

నీచ ప్రధానరచన “జారతూస్ట్ర యిలా అన్నాడు” (Thus Spake Zarathustra).జారతూస్ట్ర ( లేక జొరోస్టర్) నీచను ఎందుకు ఆకర్షించాడు? పడమటి జాతులు, ప్రధానంగా క్రైస్తవప్రపంచం,తూర్పుకు తిరుగుతున్నకాలం అది. భారత-పారసీ (Indo-Iranian) సంస్కృతులవైపు వారి దృష్టి పడుతుండిన కాలం. క్రైస్తవమతం పాపము శోకము తప్ప ఏమీ యివ్వడంలేదు. పైగా మనిషిని వ్యవస్థ అనే చట్రంలో బిగించివేసింది.నీచ తన యవ్వనదశలో షోపెన్ హోవర్ ను  ఎక్కువగా అభిమానించాడు. ( నీచకు మరో హీరో వేగ్నర్. ఇద్దరినీ కొంతకాలం బుజాలమీద మోసి, ఆ  తరువాత యిద్దరినీ దించేశాడు.షోపెన్హోవర్ నిరాశావాదం  నీచ మోయలేకపోయాడు.) షోపెన్ హోవర్  భారతీయసంస్కృతివైపు మొగ్గితే, నీచ పారసీవైపు చూశాడు. పారసీ సంస్కృతి,  స్వేచ్ఛను సంతోషాన్ని యిస్తోంది.(భారతీయులకు సూఫీతత్త్వం, కావ్యాలు ఆదరణీయాలు. ఉమరఖయామ్,  రూమీ వంటి వారు యిక్కడ ఆదరింపబడతారు.) క్రైస్తవవిముఖుడైన నీచ ఒక కొత్త ఉషోదయం కోరుకున్నాడు. అతని ప్రసిద్ధరచన Thus Spake Zarathustra, ఆ ప్రత్యూషంతోనే ప్రారంభం అవుతుంది.

“...rising one morning with the rosy dawn, he went before the sun, and spake thus unto it: Thou great star! What would be thy happiness if thou hadst not those for whom thou shinest!” (Z.P.1)

(ఇది చదివినపుడు, మనకు మరో పారసీ ప్రవక్త ఉమర్ ఖయ్యామ్ గుర్తురావచ్చు. “లెమ్మోయీ మదిరాతపస్వి, దిశలాలేఖ్యంబుగా మాఱెఁ”: (రామిరెడ్డి “పానశాల”)

కాని, నీచ కావ్యంలోని  యీ మొదటి గీతంలో, ప్రారంభవాక్యంలో  మనం గమనించవలసింది, the rosy dawn. ప్రత్యూషపవనాంకురాలు తాకుతున్న సుఖకరమైన బ్రాహ్మీముహూర్తమే కాదు, అది ఆశావహమైన ఉషోదయం కూడా,”the rosy dawn”. rosy కేవలం రంగు కాదు, ఆశావహంకూడా.

ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిల్చున్నాడు. ( క్రైస్తవులు అగ్నిని ఆదిత్యుని ఆరాధించరు. అది తూర్పు సంస్కృతి. ). “ఇంతగా సంతోషంతో వెలిగిపోతున్నావు.నీవు ఎవరికోసం వెలుగుతున్నావో ఆ మనుషులే లేకుంటే, నీ సంతోషం ఏమై పోవాలి?”, అని అడుగుతున్నాడు సూర్యుణ్ణి.

అస్తిత్వవాదంలో, మనిషి కొరకు సృష్టి, సృష్టికొరకు మనిషి కాదు.

నీచ అస్తిత్వవాదంలో, మరో ముఖ్యాంశం, క్రైస్తవవ్యతిరేకత. “క్రైస్తవం యూదుమతానికి జరిగిన గర్భస్రావం”, అంటాడు నీచ. మనిషిని మతాన్ని యిహంలో కలపడానికి నీచ మతం సనాతనమూలాలలోకి వెళుతాడు. ”పరమొ గిరమ్మొ దాని తలపైనొక దోసెడు మన్ను జల్లి”, యిహం వైపుకు దృష్టి మళ్ళించే పారశీకం అతన్ని ఆకర్షించింది. నీచకు జొరోస్టర్ వ్యక్తి కాదు, ఆరాధించదగిన ప్రవక్త కాదు. క్రైస్తవంనుండి తప్పించగల ఒక ప్రతీక.కీర్క్ గార్డ్ “పాత నిబంధన”(Old Testament) వైపుకు, యూదు సంస్కృతివైపుకు మొగ్గు చూపాడు. కాని చర్చిని, మత వ్యవస్థను తిరస్కరించాడు.  నీచ క్రైస్తవమతవ్యవస్థను మాత్రమే కాదు, యూదు-క్రైస్తవమతసమ్మేళనసంస్కృతినే తిరస్కరించాడు.పాతనిబంధనలను (Old Testament) కొత్తనిబంధనలతో ( New Testament) కలిపి కుట్టి ‘బైండు’ చేయించడం ఒక పెద్ద చారిత్రకకుట్ర అంటాడునీచ. బలహీనులను అదుపులో ఉంచుకోడానికి సృష్టించిన వ్యవస్థ క్రైస్తవమతం అనడు. బలహీనులు స్వయంగా తమ భద్రతకొరకు సృష్టించుకున్న వ్యవస్థ అంటాడు (Antichrist). తమ రక్షణభారాన్ని ఒక రక్షకప్రవక్తపై వేసి, బాధ్యత వదిలించుకున్నది క్రైస్తవమతం.బలహీనులను దుర్బలులుగానే ఉంచడం ధర్మంకాదు అధర్మం అంటాడు.ఒక క్రైస్తవంలోనే కాదు, ఏ మతంలోనైనా రెండు మతాలుంటాయి.ఒకటి “ఉద్ధరేదాత్మనాత్మానం”అంటే, రెండవది “వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ. స్వనుష్ఠీయతాం”, అంటుంది. నీచ మొదటిదే అంటాడు.కీర్క్ గార్డ్ దాసోహం అంటే, నీచ సోహం అంటాడు.

“ఏది చెడు? బలహీనతలోనుండి వచ్చేదంతా చెడు.”(Zara.Argument 2)
“నాయమాత్మా బలహీనేన లభ్యతే.”

                                                   ***
“జారతూస్ట్ర” కు ముందు రచన “సముల్లాసశాస్త్రం”( “The Gay Science”).ఇందులోదే  అతని ప్రసిద్ధ వాక్యం, “ దేవుడు మరణించాడు”. ఈ వాక్యం “జారతూస్ట్ర”లో కూడా వస్తుంది. (“సముల్లాసశాస్త్రం”, కొనసాగింపు “ జారతూస్ట్ర”.)
ఈ వాక్యాన్ని చాలా వివరంగా పరిశీలించవలసి ఉంటుంది, దాని పరమార్థమేమిటో గ్రహించడానికి.

దానికి ముందు, నీచ అద్వైతవ్యాఖ్య.నీచ ప్రధానరచనలలో ఒకటి, “సముల్లాసశాస్త్రం” (The Gay Science).ఇది చిన్న చిన్న వచనఖండాలరూపంలో ఉంది. ఆ ఖండాలు కొన్ని రెండు మూడు వాక్యాలు, మరికొన్ని వ్యాసాలు. అందులోనుండి ఒక ఖండం, దృగ్దృశ్యవివేకవిషయం. దృశ్యం నశించేదని, కలలా కరిగిపోయేదని,  ద్రష్ట నిత్యమని అంటారు అద్వైతులు. కనుక జడము  నశ్వరము అయిన దృశ్యం అప్రధానమని వారి తాత్పర్యం. కాని, దృశ్యం కల అంటూనే, నీచ ఆ కలకు యిచ్చే ప్రాముఖ్యం విశిష్టం.

“54. సచేతనదృశ్యం (Consciousness of Appearance)

దృశ్యజగత్తు నాకు  సజీవము, వాస్తవము.ఎంత వాస్తవమంటే, “యిది కల, భ్రాంతి, భూతాల నృత్యం మాత్రమే”, అని నాకు తెలిసిపోయేటంతగా  అది తనను తాను ప్రకటించుకుంటుంది. ఈ స్వప్నంలోని వాళ్ళలాగ నేనూ ఒక స్వప్నపురుషుణ్ణి, యిది కల అని తెలిసినవాణ్ణి, నేనూ వారితో కలిసి నృత్యం చేస్తున్నాను; కల అని తెలిసినవాడు కూడా  భూమిపై యీ కల కొనసాగడానికి కారణం.ఇలా తెలిసినవాడు, అస్తిత్వమనే ఉత్సవానికి  ప్రయోక్తలలో ఒకడు.వ్యావహారికజ్ఞానంలోని యీ పారస్పర్యం, యీ విశ్వస్వప్నాన్ని నిలిపిఉంచడానికి, కలగనే అందరి పరస్పరావగాహనకు, కల కొనసాగడానికి   అత్యుత్తమసాధనం.”(G.S.)

నీచ జగన్మిథ్యాత్వాన్ని కాదనడం లేదు.జగత్తు మిథ్యే.అయితే ఏమిటట? అది నీ కల.అందమైన కల.  నీ కల మరొకడి సృష్టి కాదు. నీ కల నీవే కంటావు.దానిలోని కష్టసుఖాలు స్వయంకృతాలు, వాటికి వేరెవరో కారణం కాదు. వేరెవరినీ నిందించలేవు.
మనకు వెంటనే గుర్తు వచ్చేది “విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా…”. ఈ సృష్టి ఒక కల వంటిది.మన లోపలిది, “నిజాంతర్గతం”. మనకు తెలియని మన పూర్వవాసనలే దీనిని కల్పించాయి.వాడెవడో మనపై కసితో సృష్టించింది కాదు.  ఇది కల అని తెలిసికూడా, మనం కల కనవలసిందే, కలను కళగా భావించి.ఈ కల,  కాంట్ ( Kant) అన్న ట్టు, ఒక తెర కాదు, తెర తొలగించి దాని వెనుక వాస్తవమేదో ( thing-in- itself)  దర్శించడానికి. తెరమీదిదే వాస్తవం, ( thing-in- itself). అంటే, నీచ అచ్చం  అద్వైతం మాట్లాడుతున్నాడు.ఇప్పుడు అతడి ప్రసిద్ధవాక్యం, “దేవుడు మరణించాడు” ( “God is dead” )  చూద్దాం.
 
“...వినబడడం లేదా, దేవుణ్ణి ఖననంచేయడానికి గుంత తవ్వుతున్నారు.శవం కుళ్ళినవాసన తెలియడంలేదా ?దేవుళ్ళుకూడా కుళ్ళిపోతారు.దేవుడు చచ్చిపోయాడు.చచ్చి పడి ఉన్నాడు. మనం చంపేశాం.

ఏమని మనల్ని మనం ఓదార్చుకొందాం, హంతకులకు హంతకులం? మన సంపదలలోకెల్లా అతిపవిత్రము, అతిశక్తిమంతము అయినది ఆ దైవం. చివరి నెత్తుటిబొట్టు కారేవరకు  ఆ దైవాన్ని   కత్తులతో పొడిచి పొడిచి చంపేశాం.మన చేతులనెత్తురు ఎవరు కడిగేస్తారు? ఎన్ని నీళ్ళు సరిపోతాయి?ఏ పశ్చాత్తాపపర్వాలు, ఏ పవిత్రక్రీడలు కనిపెట్టాలి?” ( G.S.125.)

(ఈ వాక్యం మొదటిసారి అతడి The Gay Science లో కనిపిస్తుంది.( ఆ తరువాత అదే గ్రంథంలో యీ వాక్యాన్ని సవరించి “పాతదేవుడు మరణించాడు”,అన్నాడు.ఆ సవరణ తరువాత. చూద్దాం.)

సాధారణంగా యీ వాక్యం నాస్తికుడి  నోట వింటాం. అలానే అర్థం  చేసుకుంటాం, వాక్యాన్ని విడిగా  విన్నప్పుడు.  “నేను దేవుణ్ణి చంపేశాను”, అని రాక్షసానందతాండవం చేయడం లేదు నీచ. “ దేవుడు మరణించాడు”. వెంటనే, తరువాతి వాక్యంలో “చనిపోయి ఉన్నాడు”,  అంటున్నాడు. రెండవవాక్యం పునరుక్తి కాదా? కాదు. నీచను తక్కువ రచయితగా అంచనా వేయవద్దు.( అతడు కవి కూడా.వచనకవి మాత్రమే కాదు, పద్యాలు కూడా రాశాడు. ) వ్యర్థపదం వాడుతాడు అని ఎందుకు అనుకోవలె?  “చనిపోయి ఉన్నాడు”, అనడం పునరుక్తి కాదు. మనిషిలోని శివం శవంలానే పడి ఉంటుంది. ఆ  శవాన్ని శివుడిగా మార్చుకోడం ఉత్తమపురుషార్థం. అంటే, మనిషి దేవుడిగా ఎదగవలె. అంతవరకు, శవమై పడిఉంటాడు,. ఇది అద్వైతార్థం. క్రైస్తవంలో, యిది పునరుత్థానం, resurrection. నీచ అభిప్రాయంలో యూదుమతగర్భస్రావమే  క్రైస్తవం. క్రీస్తును మనం శిలువమీదినుంచి దించుకొని, మరల పునరుత్థానం చేసుకునేవరకు ఆయన ప్రాణంలేకుండా పడిఉంటాడు, .అంటే, నీచ  క్రైస్తవశరణాగతిని అద్వైతంలోకి మారుస్తున్నాడు, “ఉద్ధరేదాత్మనాత్మానం” అని.
 
మరి దేవుణ్ణి చంపింది ఎవరు? దేవుడిది మరణం కాదు.అది హత్య. మనం, మన చేతులతో ఆయన్ను  దారుణంగా చంపుకున్నాం. మనం మామూలు హంతకులమా? “హంతకులకు హంతకులం”.ఎందుకు? ఎలాంటి వాడిని చంపాం ? ఎలా చంపాం? “పరమపవిత్ర”మైన దైవాన్ని చంపుకున్నాం . ఆయన “సర్వశక్తిమంతుడు”.అంత శక్తిమంతుణ్ణి  కూడా చంపగలిగాము అంటే, మన ఆసురశక్తి అంచనా వేయగలమా? ఎలా చంపాం? చివరి నెత్తురు బొట్టు కారేదాకా కత్తులతో పొడిచి పొడిచి చంపాం.  ఈ చేతులనెత్తురు కడగడానికి ఎన్ని సముద్రాలజలం సరిపోతుంది? ఈ నెత్తుటి వాసన పోవడానికి ఎంత అరేబియా సుగంధం సరిపోతుంది? ఈ పాపానికి ఏ కొత్త ప్రాయశ్చిత్తం కల్పించాలి? మానవజాతిని మొత్తం మేక్బెత్ స్థాయికి ఎత్తేశాడు నీచ, పేరు చెప్పకుండా.
   
ఈ మాటలు  నాస్తికుడు, లేక  దైవవిద్వేషి  పలికినవి అని ఎవరనగలరు? ఎంత ప్రేమలో  ఎంత పశ్చాత్తప్తహృదయంలో నుండి వచ్చిన మాటలివి? ఈ పాపానికి ఒకటే ప్రాయశ్చిత్తం. “ప్రభువు చనిపోయాడు. ప్రభువు చిరకాలం జీవించుగాక!” (“The king is dead. Long live the king!అంటాం కదా? ) దేవుడు చనిపోయాడు. దేవుడు చిరకాలం జీవించుగాక.  “పాత దేవుడు మరణించాడు”, కొత్త దేవుడు ప్రతిష్ఠింపబడుగాక.”
 
ఈ కొత్త దేవుడు ఎక్కడనుండి వస్తాడు? తిరిగి ప్రతిష్ఠించడం హత్య చేసినవాడి  బాధ్యత.దేవుణ్ణి హత్యచేసిననేరానికి అతడే దేవుడు కావలె. అదే అతని పాపానికి  నిజమైన  ప్రాయశ్చిత్తం.పాపం కాకపోవచ్చు. అపూర్వమైన ఘనకార్యమే అది. ఆ ఘనతను మనం దక్కించుకోవద్దా?

(ఈ వాక్యం పూర్తి సందర్భాన్ని (G.S. 125) తరువాత చర్చిద్దాం.)

అయితే యీ సారి దేవుడు పేరు మార్చుకొని వస్తాడు.ఇప్పుడతని పేరు Ubermensch, Overman.అంటే ప్రతి మనిషి  తన జీవితంలో చేయవలసిన ప్రాయశ్చిత్తం ఒకటే, తనలో శవమై పడిఉన్న దేవునికి  శివమెత్తించడం. అదే పురుషోత్తమప్రాప్తియోగం, పురుషుడు పురుషోత్తముడుగా, లేక అతిమానవుడుగా, ఎదగడం, తనకు తానుగా ఎదగడం.
   
మనిషి, ముందు తనను తాను, మతవ్యవస్థ రాజకీయవ్యవస్థ సామాజికవ్యవస్థ వంటి అన్ని బాహ్యబంధనాలనుండి విడిపించుకొని (“న వర్ణా న వర్ణాశ్రమాచారధర్మా”), ఏ మందలోనూ చేరక ఏకాకియై (“ఏకాకీ యతచిత్తాత్మా”) తపించవలె. అతని సంస్కృతి వేరు కనుక, నీచ పరిభాష కూడా వేరుగా ఉంటుంది.కాని  భావం భారతీయభాషలో యిమిడిపోతుంది. భారతీయేతర కాదు, ఏ సనాతనతత్త్వభాషలోనైనా యిమిడిపోతుంది. మతాలు పుట్టకపూర్వం భాషలో  భావంలో యింత వైరుద్ధ్యం ఉండేది కాదు. నీచ మతం పుట్టని కాలానికి వెళ్ళాడు, భాష వెదుక్కుంటూ. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మతం ఎలా పుడుతుంది? ఇహపరాలను రెండుగా చీల్చి ఆ చీలికలో ఆవిర్భవిస్తుంది. ఆ రెంటినీ తిరిగి కలపవలెనంటే వెనక్కు వెళ్లాలి కదా?

అయితే, యిప్పటి “యిక్కడి”  భాషకూడా ఒకటికాదు కదా! పురుషుడు ఎదగడం శూన్యంలోకి అయితే అది బౌద్ధం. పురుషోత్తముడిలోకి  ఎదగడమైతే  అద్వైతం. కీర్క్ గార్డ్  దైవం బాహ్యంలో, నీచదైవం  భావంలో. కీర్క్ గార్డ్ భాష ద్వైతం.నీచది అద్వైతం.  నీచ  దైవం విచిత్రసమ్నేళనం. ఆ దైవం శూన్యము,  పురుషోత్తముడు కూడా. ఎందుకంటే,  నీచకు స్వర్గంలో తండ్రి కాదు ( My father in Heaven), నేలమీద నడిచే దేవుడు కావాలి. కనుక పైలోకాన్ని శూన్యం (Nihilism) చేసి, అక్కడి దైవాన్ని దివినుండి భువికి  దించాడు. బుద్ధుడిలా  శూన్యంతో సంతృప్తి చెందలేదు నీచ. అతనికి మనిషి కావాలి, ( Overman, Superman, Beyond-man).

“ నేను మీకు అతిమానవుణ్ణి ఉపదేశిస్తాను.మనిషి అధిగమించ వలసిన స్థితి.మనిషిని అధిగమించడానికి నీవు ఏం చేశావు? ...ప్రతి ప్రాణి తనను తాను దాటి వెళ్లింది. మరి నీవు? ఈ ఉత్క్రమణపు ఆటుపోటుల్లో, ముందుకు మనిషిని ముంచుకుపోతావా, వెనక్కు  వెళ్ళి పశువుల్లో చేరిపోతావా? మనిషికి కోతి ఏమిటి? దాని చేష్టలకు నవ్వుకుంటాం. లేక, నా పూర్వీకుడా అని యిబ్బంది పడతాం. అతిమానవుడు మనిషిని చూసి అదే అనుకుంటాడు.నవ్వుతాడు, లేక “వీడా నా పూర్వీకుడు”, అని అవమానం పొందుతాడు.కీటకదశనుండి యీ దశకు ఎదిగావు.కాని నీలో యిప్పటికీ చాలా భాగం కీటకమే. ఒకప్పుడు నీవు కోతివి. ఇప్పటికీ చాలా వరకు కోతివే.కోతులకంటే కోతివి...అతిమానవుడు యీ భువికి అర్థం.నీవు సంకల్పించు: అతిమానవుడు యీ భువికి అర్థమని….మనిషి పశువును అతిమానవుడిని కలిపి కట్టిన ఒక తాడు.మధ్య అగాధం...మనిషి గొప్పతనం ఏమంటే, అతడు వంతెన, ఒడ్డు కాదు.”(Thus Spoke Zarathustra, Zarathustra's Prologue, part 3 - 4)

మనిషి దరి కాదు, దారి. అతిమానవుణ్ణి చేరుకోడానికి వంతెన.ఈ మానుషజన్మ అతిమానుషస్థితిపొందడానికి ధర్మసాధనం. జీవపరిణామక్రమం కోతితో ఆగిపోలేదు, మనిషితో కూడా ఆగిపోదు, ఆగిపోరాదు.చైతన్యం ఒక సిద్ధ వస్తువని, పుట్టుకతో వస్తుందని, దానిగురించి చింత అవసరంలేదని, యిక దానిని వృద్ధి చేసుకోవలసిన అవసరంలేదని మనిషి అనుకుంటున్నాడు, తత్త్వశాస్త్రవేత్తలు అదే కదా చెబుతున్నారు! చైతన్యస్థాయిని నిరంతరం పెంచుకోవలసిన అవసరం ఉందంటాడు నీచ.అరవిందుడు అదే అంటున్నాడు:

“ఉత్క్రమణం(evolution)  ముగియలేదు.తర్కం అనుత్తమం కాదు, తార్కికజీవి సృష్టిలో పరమోత్తమ ప్రాణి కాదు.పశువునుండి మనిషి ఎదిగినట్టు, మనిషినుండి అతిమానవుడు వస్తాడు.(Sri Aurobindo, Thoughts and Aphorisms:1913)

చైతన్యం మనిషి వెలుపల కాదు, మనిషిలోపల ఉంది. దానిని పెంచుకోవలె. చైతన్యం మనిషిని ఉన్మనీషిని (Ubermensch, Overman) చేస్తుంది. సృష్టి సర్వము చైతన్య స్వరూపమే . అయినా,మనం ఎంత చైతన్యం మనలో నింపుకోగలము అన్నది ముఖ్యం.జలపాతంలో ఎంత విద్యుత్ శక్తి ఉందన్నది  కాదు, మనం ఆ శక్తి  ఎంత  ఉత్పాదన చేయగలము ? చైతన్యం మనలోపలికి  ఎంత దించుకోగలము? దానిని బట్టి, అమీబాకు మనిషికి, మనిషికి మనిషికి, మనిషికి ఉన్మనీషికి, అహంబ్రహ్మలకు తేడా.ఈ తేడా తుడిచేయవచ్చును, తుడిచేయమంటాడు నీచ. (“ప్రతి జీవాత్మ నిగూఢమైన  దివ్యాత్మ”.( “Every soul is potentially divine.” ) అని స్వామి వివేకానందుడన్న వేదార్థమే  నీచ విన్నది, అన్నది. నీచ మాట G.B. Shaw “ Man and Superman” గా అర్థంచేసుకున్నాడు.)

అందుకే “దేవుడు మరణించాడు”,  అని ప్రకటించిన నీచ యిదే గ్రంథంలో ఆ తరువాత:  “పాతకాలపు దేవుడు మరణించాడు”, అని సవరణను, కాదు వివరణను,  కూడా ప్రకటించాడు.

స్వేచ్ఛాభావులము, వేదాంతులము అయిన మాకు ,“పాత దేవుడు మరణించాడు” అన్న వార్త ఒక అరుణోదయం.ఆ నవోదయకాంతుల్లో మేము ఉద్దీప్తులం అయినట్టు అనిపించింది.  కృతజ్ఞతాభావము, ఆశ్చర్యము, ఆందోళన, ఆశలతో మా హృదయాలు పొంగి పొర్లుతున్నాయి.చివరకు, దిగంతాలు తెరచుకున్నాయి.నిజమే, అంతా ఆశావహం కాదు. ప్రమాదాలుండనీ, మన నావలు సముద్రజలాలో  ప్రయాణం మొదలుపెట్టవచ్చు. ప్రతి విపత్తును ఎదిరిస్తుంది వివేకం.సముద్రం, మన సముద్రం, తిరిగి తెరచుకొంది మన ముందు.బహుశా మునుపెప్పుడూ సముద్రం యిలాటి స్వేచ్ఛాసముద్రం ఉండిఉండలేదు.(G.S.)

దేవుడి మరణంతో మనిషి ముక్తుడైనాడు.ఇప్పుడతడు ఏదైనా చేయగలడు.( డోస్టోవ్ స్కీ యిదే కదా అన్నాడు: If God did not exist,all things are permitted.) సముద్రంలో ఒక్క  ప్రమాదమూ  తొలగలేదు.కాని ఎదిరించడానికి తానిప్పుడు స్వతంత్రుడు.

క్రీస్తు మన పాపాలనుండి మనలను కాపాడుతాడు అన్న మాట నీచకు యిష్టం కాదు. ఎవడి పాపాలు వాడే కడిగేసుకోవలె. ఎవడిని వాడే పునీతుని చేసుకోవలె అంటాడు నీచ. క్రీస్తు ఎప్పుడూ శిలువపైనే ఉంటాడు.. ఆయనను  శిలువమీదినుంచి దించి కాపాడుకోవలసింది మనం. ఆ పునరుత్థానం ( Resurrection ), పునరాగమనం (The second coming) మనం సాధించేవరకు, క్రీస్తు శిలువమీదనే ఉంటాడు, “చనిపోయి”.

కీర్క్ గార్డ్ “నేనూ, భగవంతుడూ. మూడవవానికి చోటులేదు”, అంటాడు. నీచ “నేను మాత్రమే...నేనే అతిమానుషస్థితికి ఎదుగుతాను”,అంటాడు. అద్వైతికి రెండూ సమ్మతమే. అస్తిత్వమంటే ఉన్నచోట బండలా పడిఉండడం కాదు, ఎదగడమని కదా అద్వైతమంటుంది. “అహం బ్రహ్మాస్మి” అంటే నేను బ్రహ్మమును అని అర్థం కాదు. నేను బ్రహ్మమును అని తెలుసుకుునేవరకు బ్రహ్మమును కాను . Every soul is not divine, every soul  is potentially divine . నిద్రాణమై ఉన్న ఆ చైతన్యాన్ని  నిద్రలేపడమే ,పురుషుడు పురుషోత్తముడుగా ఎదగడం.

ఏ వాక్యాన్నైనా దాని సందర్భంలోనుండి వెలుపలికి లాగి వాడితే అది ఎంత అసత్యప్రచారం చేస్తుందో కదా! దేవుడు మరణించాడు అన్న నీచ వాక్యానికి  సరి అయిన  అర్థం యిది. మనిషి దివ్యత్వం అందుకోవలె అన్నది నీచ ఆశయం. అతడి ఆగ్రహం దేవుడిమీద కాదు, దేవుడికి మనిషికి మధ్య అడ్డుగా నిలిచిన మతంపై. అందుకే, మతాలు పుట్టని కాలాలకు వలస వెళ్ళి జొరోస్టర్ ను పట్టుకున్నాడు.)

మూడు విధాల జీవితదృక్పథాలను తిరస్కరిస్తాడు నీచ.ఒకడు, యీ సృష్టిపై తిరగబడతానంటాడు.మరొకడు, తప్పనప్పుడు సణగకుండా, యిష్టంగానే కష్టాలు అనుభవిద్దామంటాడు,  ఎంత కష్టం అనుభవించగలిగితే అంత గొప్ప (stoics). మరొకడు యీలోకానికి విలువే లేదంటాడు, పరలోకం కొరకు ప్రార్థిద్దామంటాడు. అంతేకాని, యీ లోకంలో ఆనందంగా బతకవచ్చని ఒక్కడూ, ఒక్క తాత్త్వికుడూ, అనడేమి?

కీర్క్ గార్డ్ కూడా , ద్వైతవాదే. కాని, అతడు  పరం కొరకు యిహాన్ని వదలుకోడు. ఈ విషయం ఐజక్ బలి సందర్భంలో చెప్పుకున్నాం.అబ్రహాంకు శ్రద్ధ ఉంది, యిహం కొరకు శ్రద్ధ.( “But Abraham had faith,and had faith for this life.”(Fear and Trembling:tr.Hannay: Penguin)

                                           ***








                                        నీచ రచనలనుండి

-From  “On the Uses and Disadvantages of History for Life”: By Friedrich Wilhelm Nietzsche (From Untimely Meditations): 1874
(“చరిత్ర- ప్రయోజనాలు, ప్రమాదాలు” ) నుండి: నీచ : 49 పేజీలు:రచనాకాలం:1874(Ian Johnstone ఆంగ్లానువాదానికి నా తెలుగు.)
-
























-From  “On the Uses and Disadvantages of History for Life”: By Friedrich Wilhelm Nietzsche (From Untimely Meditations): 1874
(“చరిత్ర- ప్రయోజనాలు, ప్రమాదాలు” ) నుండి: నీచ : 49 పేజీలు:రచనాకాలం:1874(Ian Johnstone ఆంగ్లానువాదానికి నా తెలుగు.)

                                                                       “శిశుర్వేత్తి  పశుర్వేత్తి”



                                   “శిశుర్వేత్తి  పశుర్వేత్తి”

నీ పక్కనే గడ్డి మేస్తున్న పశువులమందను గమనించు.పశువుకు  నిన్న ఏదో యీవేళ ఏదో తెలియదు.అంతటా గెంతుతుంది, తింటుంది పడుకుంటుంది,నెమరేస్తుంది,చివ్వున లేస్తుంది.పొద్దస్తమానము అదే. దాని యిష్టాయిష్టాలు ఏ క్షణానికి ఆ క్షణం.దుఃఖంలేదు విసుగు లేదు.ఇది చూసినపుడు మనిషికి కష్టంగా ఉంటుంది.ఎందుకు? పశువుకన్నా  మనిషి మేలు అని గొప్ప చెప్పుకుంటాడు కదా? కాని ఆ పశువు సంతోషం చూసి అసూయపడతాడు.మనిషికి పశువులా బతకాలని ఉంటుంది, విసుగేమిటో బాధేమిటో  తెలియకుండా.కాని అతని కోరిక చెల్లదు.పశువులా అతడు సంకల్పించడు కనుక.ఒక రోజు మనిషి పశువును అడుగుతాడు: “నా వైపు చూస్తావు.కాని నాతో ఎందుకు మాట్లాడవు?” పశువు జవాబు చెబుదామని అనుకుంటుంది: “ అదీ అదీ అదేమౌతుందంటే, నేను చెబుదామనుకున్నది వెంటనే మర్చిపోతాను.” కాని అప్పటికే అది ఆ మాటకూడా మరచిపోయింది.మౌనంగా ఉండిపోయింది.మనిషికి మళ్ళీ ఆశ్చర్యం.

కాని మనిషి తన గురించి ఆశ్చర్యపోతాడు.తాను మరచిపోలేడు, ఎప్పుడూ గతాన్ని నెమరేసుకుంటాడు. అతడు ఎంతదూరం ఎంత వేగంగా పరుగెత్తినా, యీ తాడు తనతో వస్తూనే ఉంటుంది.ఆశ్చర్యం! ఒక్కొక క్షణం, ఒక కదలిక  , యింతలో మాయం.ఆ క్షణానికి ముందు ఏమీ లేదు, తర్వాత ఏమీ లేదు.కాని దయ్యంలా వెనక్కు వస్తుంది, తరువాతి ప్రతిక్షణపు ప్రశాంతిని భగ్నంచేస్తుంది.

కాలమనే పుస్తకంలోనుండి ఒక పుట ఊడి, గాలిలో ఆడి, ఉన్నట్టుండి మనిషి ఒడిలో వచ్చి పడుతుంది.మనిషిని వెదుక్కుంటూ ఎందుకొస్తుంది? “నాకు గుర్తొచ్చింది” అంటాడు కనుక, పశువునుచూసి అసూయపడతాడు కనుక.పశువు వెంటనే మరచిపోతుంది, ప్రతిక్షణము నశించి నింగిలో నిశిలో శాశ్వతంగా  కలిసిపోవడం చూస్తుంది. అలా, పశువు “అచారిత్రకంగా”(unhistorically) బతుకుతుంది…కనుక పశువుది  ఋజువర్తనం, అది మరోలా ప్రవర్తించలేదు.దానితో పోల్చినపుడు, మనిషి అంతకంతకూ పెరిగిపోయే గతభారాన్ని మోస్తూ వంగిపోతాడు, లేక కుంగిపోతాడు. అతడి దారి దుర్గమం  అవుతుంది.బయటపడకుండా ఉండడానికి, అతడు, “ అబ్బే! నేనెప్పటిదప్పుడు మర్చిపోతాను”, అంటాడు.విన్నవాళ్ళు నిజమే అనుకొని అసూయపడతారు.లేదని, కాదని అనడానికి ఏ గతమూ లేని పశువునో శిశువునో చూచినప్పుడు, తాను పోగొట్టుకున్న స్వర్గం స్మరణకొస్తుంది మనిషికి..సంతోషానికి నిర్వచనం “అచారిత్రకంగా” బతకగలగడం.

గతాన్ని పూర్తిగా మరచిపోయి,క్షణమనే శిఖరంపై, విజయదేవతలాగా భయభ్రాంతుడు కాకుండా నిలబడలేనివాడు  సంతోషమంటే ఏమిటో తెలుసుకోలేడు. అంతకంటే హేయం, అతడు యితరులను సంతోషపెట్టలేడు.
            -(“చరిత్ర- ప్రయోజనాలు, ప్రమాదాలు” ) నుండి: నీచ : 49 పేజీలు:రచనాకాలం:1874(Ian Johnstone ఆంగ్లానువాదానికి నా తెలుగు.)

                                                              ***

ఇది (“చరిత్ర- ప్రయోజనాలు, ప్రమాదాలు” ) చదువుతూనే యిది కేవలం చరిత్రగురించి కాదని తెలుస్తోంది. ఏం చెబుతున్నాడు? నీచ తన స్వాభావికశైలిలో  ఒక గొప్ప తాత్త్వికసత్యం చెబుతున్నాడు. మనిషి జీవితవిధానాన్ని పశువులజీవితవిధానంతో పోలుస్తున్నాడు. పశువుకు అన్నీ క్షణికమే.అంటే అశాశ్వతమని కాదు. పశువుకు యిది శాశ్వతము యిది అశాశ్వతము అన్న ఆలోచన కలగదు. ఏ ఆలోచన కలగదు. మనిషికి అన్నీ ఆలోచనలే. పశువుకు ఏ క్షణానికి ఏది అవసరమైతే అది చేస్తుంది. చేసిన పని గురించి మరో క్షణం ఆలోచించదు. మరుక్షణం మరచిపోతుంది. మనిషి మరచిపోలేడు. మరపు మనిషికివ్యాధి. మరవలేకపోవడం మహావ్యాధి. అయితే, మనం పశువుల్లా బతికేయాలి అంటాడా నీచ? అనడు. మనమూ అనం. కాని పైకి అనక పోయినా, మనిషికి పశుప్రవృత్తిపట్ల అసూయ లేదనగలమా? కుక్కబతుకు ఎవడూ కోరడు.కాని కుక్కలో తాను పోగొట్టుకున్న స్వర్గం కనిపించదా? స్వర్గం అంటే పుణ్యపాపచింత లేక స్వేచ్ఛగా ప్రవర్తించడమే కదా? నీచ మనిషిని  పశువుగా దిగజారమనడం లేదు, స్వర్గంలోకి ఎదగమంటున్నాడు. తన మలమూత్రాలలో  కేరింతలుకొట్టే శిశువుగా మారమనడం లేదు.శౌచాశౌచద్వంద్వాన్ని దాటమంటున్నాడు. పశువు శిశువు అచారిత్రకంగా (unhistorically) ప్రవర్తిస్తారు. అంటే వారికి కాలజ్ఞానం ఉండదు. కనుక పుణ్యపాపచింతకూడా ఉండదు. ఆ సుఖం, “శిశుర్వేత్తి  పశుర్వేత్తి”.

నీచ రచనలలో పశువులు ఆర్తికి (passion) ప్రతీకలు. “జారతూస్ట్ర” ముందుమాటలో (Prologue) జారతూస్ట్రకు తన గుహలో తోడు ఒక డేగ, ఒక పాము. (వీటి ప్రత్యేక ప్రతీకార్థాలు ఆ సందర్భంలో చూద్దాం.) పశుపక్ష్యాదులకు  యింద్రియసుఖాలే కాని, ఆలోచన ఉండదు. ఇంద్రియప్రచోదనాన్ని వెంటనే అనుసరిస్తాయి. దీనినే కీర్క్ గార్డ్ తాత్కాలికత ( immediacy) అంటాడు. మనిషికి ఆలోచన ఎక్కువ, ఆర్తి తక్కువ. (కాళీపట్నం రామారావు కథ ‘ఆర్తి’లో ఆర్తిని సామాజికకోణంనుండి చూపాడు.) కీర్క్ గార్డ్ అంటాడు: “కాలం దుర్మార్గం అయింది అంటారు అందరూ. నా కొరవ అది కాదు, యీ కాలలక్షణం అల్పత్వం, ఆర్తి (passion) లేదు.”... “ఒక చింతనాయుగంలో (age of reflection) మనం జీవిస్తున్నాం.”

“మనిషి ఎంతైనా ఎదగవచ్చు, తన రతిని దాని నిరతిని వెంట ఉంచుకొని.” (వచనం 75.BGE)

“పశువునో శిశువునో చూచినప్పుడు, తాను పోగొట్టుకున్న స్వర్గం స్మరణకొస్తుంది మనిషికి”, అంటున్నాడు నీచ. పుణ్యపాపచింతలేకపోవడమే స్వర్గం. స్వర్గారోహణంలో కుక్కను వదలనక్కరలేదు.ఇంద్రియసుఖాన్ని, సుఖతీవ్రతను త్యజించకుండానే స్వర్గాధిపత్యం సంపాదించడమే ఐంద్రం.ఆ ఆధిపత్యం సాధించడమే ఇంద్రపదవి.

ఈ విషయంలో సాధారణంగా వినిపించే ప్రశ్న: పరాశరవ్యాసులు యింకా యితరులనేకులు చేస్తే తప్పు కానిది,  (శ్రీకృష్ణలీలలు, సడలని శివుని శక్తిసంగము ప్రస్తుతానికి వదిలేద్దాం) మరొకరు చేస్తే తప్పు ఎలా అవుతుంది? దీనికి అస్తిత్వవాదం యిచ్చే సమాధానం చాలా ముఖ్యమయింది. తప్పో ఒప్పో తేల్చుకోవలసింది నీవు. మరొకడి ధార్మికకొలతలు నీకు ఉపయోగించవు.నీకు ఏది ధర్మమని తోస్తే అది చేసెయ్. కాని , నీవు చేసినపనిని  మరొకడి పేరు, అతడు ఎంతటి మహాత్ముడైనా,  వాడుకొని సమర్థించుకోవద్దు. మద్దతు దొరకదు.అలాగే, నీ ధర్మాధర్మనిర్ణయం మరొకడికి పనికిరాదు.ఎవడి ధర్మం వాడు తెలుసుకోవలె.వాడు తెలుసుకున్న ధర్మం వాడికి మాత్రమే ధర్మం.ఎవడి సత్యం వాడు సాక్షాత్కరించుకోవలె.వెనక వేల సంవత్సరాలు తపించేవారు, ఆ సత్యసాక్షాత్కారంకోసం.ఎవడి తపన తపస్సు వాడిదే.ఇద్దరికీ సాక్షాత్కరించిన సత్యం ఒకటే.(‘ఏకం సత్’.) కాని ఎవడి సత్యం వాడికిమాత్రమే సత్యం.("I want to find out the truth which is true only for me." Kierkegaard)

“అచారిత్రకంగా బతకడం”: కాలం అంటే, భూతభవిష్యత్తులే. వర్తమానం కాలం కాదు. భూతభవిష్యత్తులు లయమయే క్షణం, కాలం కాదు, కాలాతీతస్థితి. చిత్త్తమంటే కాలమే. గడచిన ప్రతిక్షణం వెనక్కువచ్చి వేధిస్తుంది.ముందుకు పరుగులుతీస్తుంది. అలా పరుగులు తీయడమే చిత్తం, (Memory and desire). భూతభవిష్యత్తులను వర్తమానక్షణంలో లయం చేయడమే యోగసమాధి. అదే చెబుతున్నాడు నీచ.ఈ భాష అతడికి నచ్చకపోవచ్చు. కాని అతడు చెబుతున్న విషయం అదే.

                                   

                                                       ***
                                           




                                   
                                                                 











                           








                             The Gay Science (1882)
                                   (సముల్లాసశాస్త్రం)



                                              -దేవుడు మరణించాడు
                                              -సముల్లాసశాస్త్రం

































                             దేవుడు మరణించాడు



పిచ్చివాడు:

మీరు ఆ పిచ్చివాణ్ణిగురించి వినలేదా? వాడే, భళ్ళున తెల్లవారగానే లాంతరు వెలిగించుకొని, సంతకు పరుగెత్తి, ఆపకుండా అరిచాడు, “ ఎక్కడ దేవుడు? దేవుడెక్కడ?” అని,  వాడు. - - అక్కడ ఉన్నవాళ్లలో ఎక్కువమంది దేవుడిమీద నమ్మకం లేనివాళ్లు.ఇతణ్ణి చూచి వారు నవ్వుకున్నారు. ఒకడన్నాడు, తప్పిపోయాడా? పసిపిల్లాడేమో, దారి తెలియలేదు, అన్నాడు. మరొకడు ఎక్కడైనా దాక్కున్నాడేమో, మనకు భయపడి? యాత్రవెళ్ళుంటాడు.వలస వెళ్ళాడా? - - ఇలా పెద్దగా  అరుస్తూ  అపహాస్యం  చేశారు.

పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ ఎక్కడికెళ్ళాడు దేవుడు? ”, అని అరిచాడు;  “ నే చెబుతా.మనం చంపేశాం- -నీవు నేను.మనమంతా ఆయన హంతకులం.కాని, ఎలా చంపాం?సముద్రాన్ని ఎలా  తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం?  సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా? పడిపోవడంలే మనం, పక్కకు వెనక్కు ముందుకు, ఎటుపడిపోతున్నామో తెలియకుండా ? ఇంకా పైకి  కిందికి అంటూ ఏమైనా ఉందా ?అనంతశూన్యంలో అగమ్యంగా వెళ్ళడంలేదా మనం? శూన్యాకాశపు వాసన రావడంలేదా? చలి కమ్ముకురావడంలే?చీకటిరాత్రి కమ్మేయడంలేదా ? ఉదయాన్నే లాంతర్లు వెలిగించుకోవలసి రావడంలేదా?వినబడడం లేదా, దేవుణ్ణి ఖననంచేయడానికి గుంత తవ్వుతున్నారు.శవం కుళ్ళినవాసన తెలియడంలేదా ?దేవుళ్ళుకూడా కుళ్ళిపోతారు.దేవుడు చచ్చిపోయాడు.చచ్చి పడి ఉన్నాడు. మనం చంపేశాం.

ఏమని మనల్ని మనం ఓదార్చుకొందాం, హంతకులకు హంతకులం? మన సంపదలలోకెల్లా అతిపవిత్రము, అతిశక్తిమంతము అయినది ఆ దైవం.ఆ దైవాన్ని   కత్తులతో పొడిచి పొడిచి చంపేశాం.మన చేతులనెత్తురు ఎవరు కడిగేస్తారు? ఎన్ని నీళ్ళు సరిపోతాయి?ఏ పశ్చాత్తాపపర్వాలు, ఏ పవిత్రక్రీడలు కనిపెట్టాలి?ఇంతటి ఘనకార్యం మనకు మించిన ఘనత యివ్వడంలేదా? ఈ ఘనత దక్కించుకోవలెనంటే మనమే దేవతలు కావద్దా? ఇంతవరకు ఎన్నడూ జరగని ఘనకార్యం యిది. రాబోయే తరాలది చరిత్రలో అపూర్వమైన  ఒక గొప్ప శకం.

ఇక్కడ ఆ పిచ్చివాడు మాట్లాడడం ఆపి, జనంవైపు చూశాడు.వాళ్ళకూ మాటలాగిపోయాయి విభ్రాంతులై అతణ్ణిచూస్తూ ఉండిపోయారు.చివరకు అతడు తన లాంతరును నేలకు కొట్టాడు.అది ముక్కలై,   దీపం ఆరిపోయింది. “ నేను రావలసిన సమయంకంటే చాలా ముందు వచ్చాను. ఈ మహాఘటన  యింకా దారిలోనే ఉంది, అటూయిటూ తిరుగుతూ.వార్త యింకా వీరిని చేరలేదు.ఉరుముకు  మెరుపుకు సమయం పడుతుంది.నక్ష్తత్రాలకాంతి నేలను తాకడానికి సమయం పడుతుంది.సంఘటనలు, జరిగిపోయినా, లోకానికి తెలియడానికి సమయం పడుతుంది.ఈ సంఘటన  వీరికి దూరపు నక్షత్రాలకంటే దూరంలో ఉంది. కాని, ( హత్య) చేసింది వీరే.

ఆ తర్వాత ఆ పిచ్చివాడు చర్చిలలోకి తోసుకొని వెళ్ళి, అక్కడ దేవుని ఆత్మకు శాంతి కలుగుగాక అని ప్రార్థనలు చదివాడని జనం చెప్పుకున్నారు.అక్కడివాళ్ళు అతన్ని బయటకు లాగి, “ఏం చేస్తున్నావ్”, అని అడిగితే, అతడు ఒకటే జవాబు యిచ్చాడట, “ ఇక యిప్పుడు యీ చర్చిలన్నీ ఏమిటి, దేవుడిని పూడ్చిన గుంతలు  సమాధులు  కావా?”, అని.”
         (Friedrich Nietzsche, The Gay Science: Aphorism: వచనం:125)

***

ఇతడు పిచ్చివాడు అనిపించుకోగలిగిన అర్హతలు కలవాడేనా?

ఇతడు దేవుడికోసం వెదుకుతున్నాడు. కనుక అతడు  నాస్తికుడు కాడు.కాని, ఎక్కడ వెదుకుతున్నాడు? దేవుణ్ణి నమ్మనివాళ్ళ మధ్య, సంతలో. ఇదొక పిచ్చిపని.

దేవుడు చచ్చిపోయాడు, అని తెలుసు.మరి “ఎక్కడ ఎక్కడ” అని జనాలను అడగడమేమిటి? ఇది మరో పిచ్చిపని.

ఈ నీతికథలో  పిచ్చివాడి పిచ్చి మొదటే తెలిసిపోతుంది. భళ్ళున తెల్లవారిన తరువాత లాంతరు వెలిగించుకొని సంతకు బయలుదేరాడు.ఇంతకంటే రోగనిదానం  ఏముంటుంది! ప్రవక్తలందరూ పిచ్చివాళ్లేనేమో !

(ఖలీల్ జిబ్రాన్ కూడా ఒక కవిత  రాశాడు పిచ్చివాడి మీద, “నేను పిచ్చివాణ్ణెలా అయ్యాను”: “ ఒక రోజు నేను నిద్రలేచేటప్పటికి, నా ముసుగులన్నీ ఎవరో దొంగిలించారు, నేను ఏడు జన్మలలో సంపాదించుకొన్న ముసుగులు…ముసుగులు లేని నేను, “దొంగలు! దొంగలు!” అని అరుస్తూ  వీధుల్లో పరుగెత్తాను.జనాలు నన్ను చూసి నవ్వారు.కొందరు భయపడి యిళ్ళలోకి వెళ్ళిపోయారు.నేను సంతలోకి వెళ్ళగానే, అక్కడ యింటిమీద నిలబడినవాడొకడు నన్ను చూచి, “వాడు పిచ్చోడు”, అని అరిచాడు. అతన్ని చూడడానికి తలెత్తాను.ముసుగులేని నా ముఖాన్ని సూర్యుడు మొదటిసారి ముద్దుపెట్టుకున్నాడు…నా ముసుగులు దొంగిలించినవారెవరో కాని, వారు పుణ్యాత్ములు.అదుగో, అలా అయ్యాను పిచ్చివాణ్ణి.”

ఈ జిబ్రాన్ కథలో ముసుగులను  వేదాంతులు కోశాలు అనవచ్చు. కాకపోతే వేదాంతులు ఏడుజన్మలకు పరిమితం చేయరు ముసుగులను.కొన్ని కోట్ల జన్మలలో ఏర్పడిన ముసుగులు.ఆ ముసుగులు దొంగిలించగలిగిన పుణ్యాత్ముడు కొన్ని కోట్ల జన్మలకుగాని దొరకడు.)

నీచ కథలో పిచ్చివాడు,  దేవుడిది చావుకాదు, హత్య అంటాడు. హత్య చేసిందెవరు? “నీవు నేను”, అంటాడు . అంటే,మనమందరమూ, ఆస్తికులు నాస్తికులు కూడా. నాస్తికులెలా హత్య చేస్తారు? వాళ్ళు దేవుడే లేడంటారు కదా? లేని దేవుణ్ణి హత్యచేయడమేమిటి?

సరే, ఆస్తికులెందుకు ఎలా  హత్య చేస్తారు?

ఇంతకూ యితడు హత్యను, హంతకులను నిందిస్తున్నాడా? లేక హత్య   మంచిదే అంటున్నాడా? రెండూ అంటున్నాడు, పిచ్చివాడు కదా! ఒకవైపు, మనిషికి ఉండిన సంపదలలోకెల్ల దేవుడు గొప్పసంపద, అతన్ని చంపుకున్నాము, హంతకులలోకెల్ల హంతకులం మనం అంటాడు. అంతేకాదు, దేవుడు అతిశక్తిమంతుడు, అంతటి శక్తిమంతునికూడా చంపగలిగామంటే మనది ఎంతటి   రాక్షసబలం?అంటూ హత్యను నిందిస్తాడు.మరొకవైపు, “దేవుని హత్య యీ సృష్టిలో  జరిగిన ఘనకార్యం, దానితో పోల్చదగినది లేదు. దాని ఘనతను మనం నిలుపుకోవద్దా”,  అంటాడు.ఇంతకంటే విరుద్ధమైన పిచ్చవాగుడు ఏముంటుంది! ఇతనిది పిచ్చివాగుడా?

దేవుడు చచ్చిపోయాడు:

నీచ ఆశయం ఏమిటో చూద్దాం. దేవుడు అంటే ఒక ఆకృతికాదు. సత్యమే దైవం.(.“...the old truth is approaching its end.” :(Twilight of the Idols, Friedrich Nietzsche) ;  దేవుడు ఎక్కడో బయట లేడు.మనిషిలోపల  చైతన్యరూపంలో ఉంటాడు. అదే మనం వెనుక చూశాం.చైతన్యం సిద్ధవస్తువుకాదు అన్నాడు నీచ.అంటే,ఏమిటి అర్థం? చైతన్యం పెంచుకుంటే పెరుగుతుంది. లేకుంటే జడంగా, అంటే నిర్జీవంగా మృతప్రాయంగా, ఉంటుంది. కొత్త “దేవుడు”  కలగాలంటే పాత దేవుడు మరణించాలి, ( 'the old God is dead' ( The Gay Science: Aphorism 343). పాతది పోవాలంటే ఊరకే పోదు.హింసనచణధ్వంసరచన చాలా జరుగుతుంది. అదే “నేతి నేతి” అంటూ, అడ్డమొచ్చిన జడవస్తువులన్నిటినీ  నిర్దయగా అడ్డంగా నరుక్కుంటూ ధ్వంసంచేస్తూ దగ్ధంచేస్తూ పోతాడు “పిచ్చివాడు”. బయట అన్నీ తగలేయడం ముగిసినతరువాత, ఆకలిగొన్న మంట ఎదురుగా  వచ్చి ఆగుతుంది,  యిక యిప్పుడేమి కాల్చాలి అంటూ. తగలేయడానికి తన దేహమే మిగిలిఉంది. అప్పుడు,

“ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ  వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు, నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు.”
                           ( The Gay Science: Preludes: 62)


పాతదేవుడు,ఆ దేవుడిమీద మనం నిలబెట్టిన వ్యవస్థలు విలువలు అవన్నీ శవమయం అయాయి..” దేవుడు మరణించాడు”అన్న మహా వాక్యం, నీచ తన భాషలో చదివిన నమకం.దాన్ని తిరిగి శివమయం  చేయవలె.ఆ చమకం ఎలా చదివాడో  తరువాత.

పురిటినొప్పులు పడకుండా భవ్యభవిష్యత్తు పుట్టదు,(“overflowing energy pregnant with the future”):

“The desire for destruction, for change and for becoming can be the expression of an overflowing energy pregnant with the future…" (Aphorism: 370)

“Only as creators can we destroy.”

ఏమిటి  దేవుడు చనిపోవడమంటే? దైవమందు మనిషి విశ్వాసం ఆచారం ఆరాధన యాంత్రికం అయిపోతాయి. ఆదివారం ఆలయానికి వెళ్ళడం, సంధ్యావందనం, అభిషేకం నిషేకం ( “exploring hands encounter no defence”: Eliot) - అన్నీ నిర్జీవక్రతువులుగా ( “ dead habit”: Tagore) మారిపోతాయి. ఏ ప్రవక్త అయినా ముందు యీ దైవగ్లానినే ధ్వంసం చేయటానికి అవతరిస్తాడు.

 అసత్యాన్ని అసత్యమని తెలియడం గొప్ప చారిత్రాత్మకఘటన.అప్పుడుగాని “అసతో మా సద్గమయ” అనలేడు. మృత్యువును మృత్యువుగా గుర్తించడం ఆధ్యాత్మికతలో ఒక గొప్ప దశ. (“శవం కుళ్ళినవాసన తెలియడంలేదా ?దేవుళ్ళుకూడా కుళ్ళిపోతారు.దేవుడు చచ్చిపోయాడు.చచ్చి పడి ఉన్నాడు.”) ఈ కుళ్ళువాసన తెలిస్తేగాని “మృత్యోర్మామృతం గమయ” అనలేడు. చీకటి కనిపించినపుడుగాని లాంతరు వెలిగించడు, “తమసో మా జ్యోతిర్గమయ”, అంటూ. ఎవడికి అసత్యం అసత్యంగా, తమస్సు తమస్సుగా, మృత్యువు మృత్యువుగా తెలుస్తాయో వాడు ప్రవక్త. వాడు శూన్యవాది.

“నీవు, నేను”

దేవుణ్ణి ఎవరు హత్య చేశారు? “ నీవు,నేను” అంటాడు పిచ్చివాడు.నీవెవరు,నేనెవరు? ఆస్తికులు నాస్తికులు కూడా.అదెలా? నాస్తికులు కాదనేది  దేవుణ్ణి మాత్రమే.ఆ దేవుడిపై  నమ్మకం ఆధారంగా  నిలిచిన తక్కిన వ్యవస్థలు విలువలు, వీటికి వివిధమైన పేర్లు--సామ్యవాదం ఉదారవాదం సంక్షేమవాదం-- యివి వారు వద్దనడం  లేదు. కనుక  వీరందరూ ఆస్తికులే. ఏదో ఒక విశ్వాసం లేనిదే వీరికి శ్వాసలేదు. భద్రతలేనిదే బతకలేడు మనిషి. కనుక దేవుడి మరణం కేవలం మతసంబంధం కాదు.దేవుడు కేవలం ఆదివారం  ఆలయాలలో లేడు, సోమవారం సంతలో కూడా దేవుడే. సమస్త సామాజికవ్యవస్థలు  విలువలు  దేవుడితో సంబంధించినవే, ఆయన పేరు మాత్రం పనికిరాదు. కనుక  దేవుడి మరణంతో పాటు యివన్నీకూడా పోతాయి, పోవాలి.కాని, ఏమైనా పోయిందా? ఏదీ పోలేదు. ఒక్క దేవుడి పేరు మాత్రం పోయింది. దేవుడు చనిపోయినా,అతని నీడను చూపించి యింకా కొన్ని వేలసంవత్సరాలు జనాలను నమ్మిస్తారు,దేవుడు బతికే ఉన్నాడని.ఇలా ఎంతకాలం జనం తమ్ము తాము మోసం చేసుకుంటారు, శవాన్ని అలంకరించి సింహాసనంపై కూర్చోపెట్టి రాజ్యం  నడిపిస్తారు?

(“దేవుడు మరణించాడు” అన్న నీచ ప్రసిద్ధవాక్యం, అతని అనేక  గ్రంథాలలో  కనిపిస్తుంది, The Gay Science: Aphorism 125 లో మాత్రమే కాదు . అందులోను ఒకేచోట కాదు. ఆ వాక్యం మొదట కనిపించేది Aphorism 108 లో.( వీటిని ఏమనాలో తెలియదు. Aphorisms అంటారు.కాని అవి సూత్రాలలాగా లేవు.ఒక వాక్యం నుండి యిరవై ముప్పై వాక్యాల వరకు  నిడివి ఉన్నవి. కొన్ని అభిప్రాయాలరూపంలో, కొన్ని వ్యాసాల రూపంలో,కొన్ని నీతికథలలా (parables) వివిధంగా ఉన్నాయి.)  108 నుండి 125 వరకు అన్నీ సూత్రాలు చదివినపుడు మాత్రమే “దేవుడిమరణం”లో  నీచ ఆలోచనాధార, అతడు ఏం చెప్పదలచాడో తెలుస్తుంది.

“కొత్త పోరాటాలు:బుద్ధుడు మరణించినతరువాత, కొన్ని శతాబ్దాలవరకు ఆయన నీడను ఒక గుహలో చూపించారు. భీకరమైన పెనునీడ.దేవుడు మరణించాడు. కాని, యీ మనుషుల తత్త్వం ఎటువంటిదంటే, కొన్ని వేలసంవత్సరాలవరకు  ఆయన నీడను చూపించే గుహలుంటూనే ఉంటాయి.ఆ నీడను పడగొట్టడానికి మన పోరాటం సాగించవలసే ఉంటుంది.”
                                                                     (The Gay Science: Aphorism 108)

హత్య క్రూరమైన అవసరం:
“Only as creators can we destroy.” (GS: Aphorism 59)

ఒకవైపు దేవుని హత్య రాక్షస కృత్యమంటూనే,ఆ ఘనతను మనం. దక్కించుకోవద్దా, అంటున్నాడంటే,అది పిచ్చివాడి  విరుద్ధవచనం  అనుకోవాలా? కాదు,దేవుని హత్య  క్రూరమైన అవసరం అంటున్నాడు.కొత్త విలువలు సృష్టించుకోవాలంటే పాతది పోవాలి..(.“...the old truth is approaching its end.” :(Twilight of the Idols) ఆ సృష్టికి జనం సిద్ధంగా ఉన్నారా? దేవుడిలేని శూన్యాన్ని ఎలా పూరించాలి? “మనమే దేవతలు కావద్దా?”,  అంటాడు పిచ్చివాడు.కాని జనం దేవతలు కావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకు చీకటి చీకటిగా తోచడంలేదు.పిచ్చివాడు తన లాంతరు నేలకేసి కొట్టాడు. తాను చాలా ముందు వచ్చాడు. ప్రవక్తలు ఎప్పుడూ ముందుగానే దిగి వస్తారు. వారికి ఆహ్వానం పలకడంలో  యీలోకం  ఎప్పుడూ  ఆలస్యమే చేస్తుంది, కొన్ని యుగాల ఆలస్యం.

నిజానికి నీచ పరిచయం యిక్కడే ఆపేయవచ్చు మనం.ఎందుకంటే, కేవలం తత్త్వం కొరకు ఎవరినీ చదవవలసిన అవసరం లేదు. ఏ తాత్త్వికుడైనా వేదాంతి అయినా కొత్తగా చెప్పేదేమీ ఉండదు. ఎవరో ఒకరు ఏదో పేరుతో వెనుక చెప్పిందే. తెలిసి వాటిని ఎందుకు చదువుతామంటే, పోల్చడంలో ఉన్న కుతూహలంతో. రూమీని, బషోని, కబీర్ ని, రవీంద్రుణ్ణి , జిబ్రాన్ ని  తత్త్వంకోసం చదవం. వారి కవిత చదివిస్తుంది.కీర్క్ గార్డ్, నీచ వంటివారు కేవలం తాత్త్వికులు కారు.వారు కవులు. అందుకోసం వారిని చదువుతాం.

దేవుడు మరణించాడు అన్న ప్రవచనంలోని పరమార్థం ఏమిటి?  అది ఒక్క వాక్యంలో తెలిసేది కాదు. మరో Aphorism లో నీచ యీ విషయమై భావించిన తీరు:

343.
(భయంతో వణుకుతున్న తన దేహంతో అంటున్నాడు):
కార్కైస్, వణుకుతున్నావా?ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకుపోతున్నానో తెలిస్తే యింకా ఎక్కువ వణుకుతావు.( తూరెన్.1873)

మా అభయానికి అర్థం:

ఇటీవలి కాలంలో జరిగిన గొప్ప సంఘటన, “దేవుడు చనిపోయాడు”.క్రైస్తవులు యింతకాలము విశ్వసించిన  దేవునియందు విశ్వాసం  యిక ఏమాత్రము సాధ్యంకాదన్న విషయం యూరపును  నీడలా  ఆవరించడం మొదలయింది.చూపులో సందేహబలం ఉన్న కొందరైనా సూక్ష్మదర్శులు సూర్యుడు అస్తమించాడని చూడగలిగారు.పురాతనము గభీరము అయిన ఒక  విశ్వాసం సంశయంగా మారిందని తెలుసుకున్నారు...అది సామాన్యజనాలు వెంటనే గ్రహించలేనంత గొప్ప ఘటన.దాని ప్రాధాన్యాన్ని గ్రహించడంల మాట అటుంచి, ఆ వార్తకూడా వారికి చేరలేనంత దూరంలో ఉంది…ఆ విశ్వాసం యింతకాలం తన బలంతో నిలిపి ఉంచిన సమస్తయూరపీయనైతికవ్యవస్థ భగ్నమయింది. కలగబోయే విధ్వంసము వినాశము ప్రకంపనము శైథిల్యము ఊహించగలిగిన వాడొకడు ఆచార్యబాధ్యతను, నైరాశ్యప్రవక్తపాత్రను వహించి, యింతవరకు కనీవినీ ఎరుగని ఒక సూర్యగ్రహణం రాబోతోందని  ప్రకటించవలె.
నిజానికి, మా వేదాంతులకు, స్వేచ్ఛాబుద్ధులకు- ఏమనిపిస్తుందంటే, “పాత దేవుడు” చనిపోయాడు అన్న వార్త విన్నపుడు ఒక కొత్త ఉషోదయం అయినట్టు అనిపిస్తుంది.
సమస్యలను ఊహించగలిగిన మావంటివారు, కొండకొనలమీద కాపలా కాచేవాళ్ళు, పుట్టవలసినదానికంటే ముందే పుట్టినవాళ్ళు,... వారెందుకు తమకేమీ పట్టనట్లు, ఏ భయము లేకుండా ఎందుకున్నారు? ...ఎందుకంటే వారిమీద  ఆ మహద్ఘటన పరిణామాలు, జనసామాన్యం ఊహించినవాటికి  విరుద్ధంగా  ఉంటాయి కనుక. వాళ్ళలో ఎటువంటి విషాదము లేదు.వాళ్ళలో ఒక కొత్త వెలుగు, సంతోషము, ఉపశమనము, ఉల్లాసము, ఉత్సాహము...వారి మనసులు కృతజ్ఞతతో పొంగిపొర్లుతున్నాయి.జ్ఞానాన్ని ప్రేమించేవాడికి ఎంతటి సాహసానికైనా అనుమతి దొరుకుతుంది.దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు, కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇంతకాలానికి, మా నావలు బయలుదేరగలుగుతున్నాయి,ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాయి.ఇప్పుడు జ్ఞానాన్వేషణాప్రియులు చేయరాని సాహసం లేదు. సముద్రం, మన సముద్రం, మళ్ళీ  పిలుస్తోంది,ఏదీ దాచుకోకుండా. ఇంత స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం బహుశా మునుపెన్నడూ ఉండి ఉండదు.( స.శా.5.343)

                                          ***

--“దేవుడు మరణించాడు”
:శూన్యవాదము (Nihilism), అరాచకవాదము (Anarchism)

దేశంలోని  ఒక  ముక్కకు ముఖ్యమంత్రి మరణిస్తే వేలమందికి జీవితం శూన్యమై పోయి, అరాచకవిధ్వంసానికి పూనుకొంటారు,వేలమంది ఆత్మహత్య లు చేసుకుంటారు.మరి దేవుడు మరణిస్తే ఎంతటి శూన్య ము, ఎంత అరాచకము ఉండాలి! ఆ నైరాశ్యంలో,అరాచకంలో ఆవిర్భవిస్తాడు ప్రవక్త. వాటిని తొలగించడానికి, సృష్టించడానికి కాదు. కాని ఎలా వస్తాడు? నైరాశ్యాన్ని అరాచకాన్ని  కాల్చివేయగలిగిన నిప్పుతో వస్తాడు.ఆ నిప్పు,  ముందు దావానలమై కాలుస్తుంది, ఆ తరువాత వెలుగునిస్తుంది. కనుక ప్రవక్త, ముందు విధ్వంసం చేస్తాడు.ఆ విధ్వంసమే కొందరిని ఆకర్షిస్తుంది.నీచ విషయంలోకూడా అదే ఆకర్షించింది.

నీచ దర్శనాన్ని యీనాటి అరాచకశూన్యవాదులు తమ స్వంతం చేసేసుకున్నారు. అతన్ని తమ ప్రవక్తగా ప్రకటించుకున్నారు.ఇతని ప్రవచనాలలో వాళ్ళను ఆకర్షించగలిగినవి అనేకం ఉన్నాయి. రాజ్యమంటే అతనికున్న వ్యతిరేకత;దేవుణ్ణి  (“దేవుడు మరణించాడు”), దేవుని కుమారుణ్ణి కూడా  కాదనడం ( Anti-Christ); మందమనస్తత్త్వం పట్ల అతనికున్న అసహ్యం;పెరిగిపోతున్న వ్యాపారదృష్టి, నశిస్తున్న కళాదృష్టి;  పుణ్యపాపాలకు స్వామిభృత్యసంబంధాలకు అతీతమైన అతిమానవుడిపై అతడి ఆశాభావం. ఇవన్నీ వారిని అతనివైపు ఆకర్షించాయి, అతనిని తమ  వాణ్ణిగా వారు ప్రకటించుకున్నారు.

కనుక  నీచపై  శూన్యవాది అరాచకవాది అన్న ముద్ర స్థిరంగా పడిపోయింది.ఏమిటి అతని శూన్యవాదం? “దేవుడు చచ్చిపోయాడు, క్రీస్తు పనికిరాడు, మీరు చెప్పే మంచితనం,కరుణ - యివన్నీ మనిషిని అసమర్థుణ్ణి చేస్తున్నాయి. మీరు నమ్ముతున్న దేవుడు లేడు, మీరు చెబుతున్న జీవితపు విలువలకు విలువ లేదు.”  ఇది అతని అరాచకశూన్యవాదం. ఇది ఒక్క నీచ మాత్రమే ఘోషించిన వాదమా? ఇది ప్రతి ప్రవక్త మాట్లాడే భాష. కాని జనాలకు తెలివి “తెల్లవారింది”. తెల్లవారగానే నీడలు పొడుగు. “దేవతలనీడలన్నీ తుడిచిపెట్టుకుపోయే మట్టమధ్యాహ్ణపు పట్టపగటికి” ( Z )  యింకా చాలా సమయం పడుతుంది.అప్పటివరకు ప్రవక్త శూన్యవాదే. ఏ ప్రవచనమైనా శూన్యవాదమే, “నేతి నేతి”, కూడా.  ఉన్నది కాదంటేకాని, ఉన్నతి లేదు. అందుకే, లోకధర్మాన్ని కాదంటే కాని మోక్షధర్మాన్ని అందుకోలేడు మనిషి.నేను  “అక్రీస్తు”ను  (Anti-Christ) అనడం శూన్యవాదము ధర్మధిక్కారము అయితే,  ఆదిశంకరాచార్యుడు కూడా శూన్యవాది,  ధర్మవ్యతిరేకి. “న వేదా న యజ్ఞా న తీర్థం  బ్రువంతి…”(దశశ్లోకీ: “వేదం లేదు యజ్ఞం లేదు తీర్థమని చెప్పరు.”) వేదాలనే కాదనడం చిన్న ధిక్కారం కాదు. పాతదేవుడు గతించాక పాతవిలువలు పనికిరానివైనపుడు, కొత్త దేవుడు కొత్త విలువలు సృష్టించుకోవలసిన అవసరంలో సత్యదర్శనం చేసినవాడెవడైనా మాట్లాడే భాష,  శూన్యము ధిక్కారము నకారము. మరోప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలలో యీ ప్రపంచం చీకటైపోతుంది.

శూన్యవాదమంటే, చీకటిని చీకటి అని ప్రకటించడం, లాంతరు వెలిగించి. కుళ్ళును కుళ్ళని చెప్పడం,( “ శవం కుళ్ళినవాసన తెలియడంలేదా ?దేవుళ్ళుకూడా కుళ్ళిపోతారు.”) నీచ చేసిందదే. అటువంటి ప్రకటన చేయడమంటే  “చరిత్రను రెండు ముక్కలు చేస్తూ ఒక డైనమైట్ పేల్చడమే”.(EH. “Why I am a Destiny”)

 “నీ లోపల అరాచకం తాండవం చేసినపుడే , నీనుండి  ఒక నక్షత్రం  నాట్యం చేస్తూ ఆవిర్భవిస్తుంది.” (Z:P.5.)

 ఈ అరాచకస్వరూపం ఏమిటి?

“ మనిషి పొందగలిగిన అతి గొప్ప అనుభవం ఏది? అత్యంతతీవ్రమైన ఏహ్యభావం కలిగిన క్షణం. చివరకు నీ సంతోషంకూడా నీకు అసహ్యమైన క్షణం. ఏ క్షణం “ నా యీ సంతోషంవల్ల ఏం ప్రయోజనం.ఇది దారిద్ర్యం, కుళ్ళు, హేయమైన ఆత్మసంతృప్తి.” ( Z.Pr.P.3)

నా సద్గుణాలు, నా న్యాయబుద్ధి, నా కరుణ ( యీ కరుణే కదా, నిన్ను శిలువపైకి ఎక్కించింది !),నా పాపం నా పుణ్యం- వీటన్నిటి డొల్లతనం అనుభవమైనపుడు, చీకటి చీకటిగా కనిపిస్తుంది. అప్పుడు గాని నీవు తమసో మా జ్యోతిర్గమయ అన్న వెర్రికేక వెయ్యవు. అలాటి  వెర్రివాళ్ళే ప్రవక్తలందరూ.

“దేవుడు మరణించాడు” అన్న వాక్యంలో మనం గమనించవలసింది, ఆ వాక్యంలో కర్త దేవుడు కాదు, “నీవు,  నేను”. అందులో మరణం మనది, మనిషిది. అది  జీవన్మరణం. తనలోని దేవుణ్ణి  హత్యచేసిన మనిషి, ఆ స్థానాన్ని పూరించవలె, తానే దేవతగా ఎదగవలె.

--“మనమే దేవతలు కావద్దా?”
:అతిమానవుడు (Ubermensch, Overman)

“ దేవతలందరూ చచ్చిపోయారు: యిక అతిమానవుడు బతకాలి అని కోరుకుందాం.”(Z:I.22:) దేవుణ్ణి హత్యచేసినపాపానికి ప్రాయశ్చిత్తంగా  మనమే దేవతలు కావద్దా? ఇంతవరకు ఎన్నడూ జరగని ఘనకార్యం యిది. రాబోయే తరాలది చరిత్రలో అపూర్వమైన  ఒక గొప్ప శకం.”(GS:A125) ఒక గొప్ప శకానికి స్వాగతం చెబుతున్నాడు నీచ.అంతే కాని, విలువలను విధ్వంసం చేయడం లేదు. కొత్తవిలువలసృష్టికై  పిలుపునిస్తున్నాడు. ఆ కొత్త విలువల స్వరూపం ఏమిటి? మంచి చెడు, పుణ్యము పాపము అనే ద్వంద్వాలకు అతీతమైన (BGE) విలువలు.

 “ సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది?”

భూమికి సంకెళ్ళు  తెగగొట్టడం అంటే, దీనికి పరలోకపారతంత్ర్యంనుండి విముక్తిని సంపాదించడం. ఇప్పుడు యీ భూమి  “సూర్యుడి చుట్టూ” తిరగక్కరలేదు. తన చుట్టూ, తన కోసం తిరగాలి.

“సోదరులారా! నేలను నమ్ముకోండి.పరలోకం గురించిన ఆశచూపేవారిని నమ్మవద్దు.”(Z.pr.3)

భూలోకం స్వతంత్రమయింది. ఇక ఆదేశాలు పైనుండి రావు. కొత్త ప్రవర్తననియమాలు మట్టికి, మనిషికి దగ్గరకావాలి. మనిషిని  అతిమానవుడిగా ఎదగనివ్వాలి.అలా ఎదగడం నీచ తిరుగుబాటులో ప్రధానప్రయోజనం. పరిణామవాదవైజ్ఞానికులు మనిషి ఎదిగాడు అంటారు. అమీబాదశనుండి ఎదిగాము అంటారు.

సర్సి (Circe): “ అసత్యం పశువులను మనుషులుగా మార్చింది.సత్యం మనిషిని పశువులుగా మార్చగలిగితే ఎంత బాగుండును!”(Human all too Human)

“కాని మీలో యింకా చాలా భాగం  అమీబా దశలోనే ఉంది. ఒకప్పుడు మీరు కోతులు. ఇప్పుడు మీరు కోతులను మించిన కోతులు.” (Z: Pr.3.)

కాని మనిషికి ఎదగాలన్న కోరిక కలుగుతుందా?

 “ నేను మీకు అతిమానవుణ్ణి ఉపదేశిస్తాను.మనిషి తనను తాను దాటిపోవలసినవాడు. మిమ్మల్ని మీరు అతిశయించడానికి మీరేం  చేశారు?” (Z.Pr.3)

ఉపదేశం వినడానికి మనిషి మిగిలితే కదా!

“మనిషి మురుగు కాలువ అయిపోతున్నాడు. మురుగుకాలువలను తనలో కలుపుకోగలగాలంటే, మనిషి సముద్రం కావలె.” (Z.Pr.3) (“ ఆపూర్యమాణమచలప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్”.గీత.2.70. “నిండు సముద్రం.అచలంగా ఉండిపోయేది.”)

మురుగుకాలువలో  ఉండిపోవడానికే మనిషి సిద్ధపడిపోయాడు.ఈ భూమిమీద ఎన్నో ప్రాణులు అంతరించిపోయాయి కాని, యీ మనిషి ఎంతకూ అంతరించడం లేదు.

“ ఈ భూమి చిన్నదై పోతోంది. దానిమీద చివరి మనిషి గెంతుతున్నాడు. వాడు యీ భూమిమీద ప్రతిదానిని తనలాగే అల్పమైనదిగా చేసేస్తాడు. ఈ మనిషిజాతి మొండి జాతి. ఎంతకూ అంతమయేది కాదు. చివరి మనిషి బొద్దింకలా చిరాయువు.”( Z: Pr. 5)

ఈ మొండి బొద్దింకబతుకును అంతంచేసి కొత్త మనిషి ఆవిర్భవించవలె. నీచ  మనిషిని ఎదగమనడం ఏదో ఒక కొత్త స్థితికి కాదు, స్వస్థితికి. తానేమిటో తాను మర్చిపోయాడు.  ఆ మరచిపోయిన మనిషిని మరల గుర్తు తెచ్చుకోవడమే వేదాంతం చెప్పేది కూడా. కనుక కొత్తగా తెచ్చుకొనేదేమీ లేదు. “వాస్తవంలో నీవేదో అదే అవు”(EC). (మరొక భాషలో దీన్నే “తత్త్వమసి” అంటారు.)  మనిషి గొప్పతనం ఏమిటంటే ఉన్న  స్థితినుండి ఉన్నతస్థితికి చేరుకోడానికి అతడు సాధనం. మనిషి “ గమ్యం కాదు, వంతెన”(Z.Pr. 3) అంటాడు నీచ. మనిషి  చేరవలసిన స్థానం కాదు, చేరడానికి ఉపయోగించవలసిన  వంతెన.

“మనిషి గమ్యం కాదు, వంతెన”.ఈ వంతెనను ఉపయోగించుకొని గమ్యం చేరడం ఒక్కొక సంస్కృతిలో ఒక్కొక  విధానం,  ఒక్కొక పరిభాష.అరవిందుడి భాష, నీచ పరిభాష ఒకటి కావు.ఒక పరిభాషలో యీ వంతెనపై నడవడాన్ని  మూలాధారంనుండి శక్తిని సహస్రారానికి నడిపించడం అంటారు.”నీత్వా తాం కులకుండలీం లయవశాజ్జీవేనసార్థం హృది”.(షట్చక్రనిరూపణమ్).శక్తితో అడుగులో అడుగు కలుపుతూ,  లయబద్ధంగా  నాట్యంచేస్తూ సహస్రారానికి  నడిపించడం ఒక విధానం. ఇందులోని “లయ”ను  నీచ గట్టిగా పట్టుకుంటాడు.అతడి రచనలలలో సంగీతము నాట్యము ప్రధాన జీవలక్షణంగా  వర్ణిస్తాడు. మానవుడు అతిమానవుడుగా ఎదిగాడనడానికి యివి లక్షణాలంటాడు.లయ, అధోలోకాలను లయంచేసుకుంటూ ఊర్ధ్వలోకాలకు ఎదుగుతుంది. లోకాలు బయట ఉండవు.మనిషిలో ఉంటాయి.

లయ, నాట్యము,యోగము:

నీచకు ఆరాధ్యుడు డయోనీసియస్ (Dionysius). ప్రాచీనకాలంలో గ్రీకులు ప్రకృతిలో కలిసిపోయేవిధంగా  నాటకాలు ప్రదర్శించి,  ప్రకృతితో  ఒకటైపోయేవారు. అటువంటి  రసానుభవం  నీచ భావించాడు. ఈ విధంగా జీవితాన్ని ఒక కళగా భావించినపుడు, ఆ ప్రదర్శనలోని సుఖదుఃఖాలు మనం సృష్టించుకున్నవే అవుతాయి. ఏ దేవుణ్ణీ నిందించవలసిన అవసరం ఉండదు. అప్పుడు “విధిరాత” మన రాతగా మారిపోతుంది. మనం రాసుకున్న నాటకం కష్టమైనా మనకిష్టమే. విషాదంకూడా రసానందమే. కళలో కష్టంకూడా యిష్టమవుతుంది.(నాట్యకళను ఒక యోగంగా భారతీయఆలంకారికులుకూడా భావించారు. ) సంగీతంకూడా ఒక అతిమానుషఆనందస్థితిని కలిగిస్తుందని నీచ భావించాడు. నీచ వేగ్నర్ సంగీతంలో సమ్మోహితుడైన కాలంలో సంగీతజ్ఞానము వినా సన్మార్గము కలదా అనుకున్నాడు.  ఆ రసానందస్థితిలో, సృష్టి సమస్తము ఆత్మలీల. జీవితంలో ఎవరియందు దేనియందు వ్యతిరేకభావం ఉండదు. మన విధి (fate)కి మనం కర్తలం, కనుక  మనం ప్రేమిస్తాం (amor fati, love fate) ).సణుగుడు అణగిపోతుంది. ఇది తన Birth of Tragedy లో విషయం. ఈ దృక్పథం నీచ వేగ్నర్ ను ఆరాధించిన కాలంలోది.

అతిమానవుడిగా ఎదగడం ఒక నర్తనం, కళాత్మకవర్తనం.కాని, ఆ కళ ఎటువంటిది?  కత్తి అంచుమీద నడవడం లాంటిది. నీచ “క్షురస్యధారా” అనడు,  తాడుమీద నాట్యంచేయడం అంటాడు. “జారతూస్ట్ర” లో అతడు వాడిన ఉపమ, రెండు కొండకొమ్ములను కలుపుతూ కట్టిన తాడుపై  నాట్యంచేయడం.  ఆ కళాత్మకజీవితంలో అడుగడుగుకు కింద ఒక అగాధం నోరు తెరచుకొని ఉంది. ఆ తాడుమీద లయాన్వితంగా అడుగులు వేయగలిగినవాడే అతిమానవుడు.(rope dancer: Z: Pr.3)

ఇది నీచ వేగ్నర్ ను ఆరాధించిన కాలంలో అతడి దృక్పథం. కాని, కొంతకాలం తరువాత, వేగ్నర్ ఆరాధన తగ్గి, నీచ కళ సాధనం అన్న యీ అభిప్రాయం మార్చుకున్నాడు.

నీచ వయసులో ఉన్నప్పుడు వేగ్నర్ ను ఒక భుజంమీద,  షోపెన్హోవర్ ను మరో భుజంమీద మోశాడు. ఆ తరువాత యిద్దరినీ దించేశాడు.ఈ దించడం అతిమానవుడిగా ఎదగడంలో భాగమనవచ్చేమో? ఒంటె తన బరువు దించేసి, నేను సింహమని ప్రకటించడం!

జారతూస్ట్ర అతిమానవుడి ఆవిష్కారానికి  చెప్పిన మరో మార్గం ఏమిటి?

“ అది ( ఆ ఉత్క్రాంతి) సంగీతం ద్వారానో దివ్యసాక్షాత్కారం ద్వారానో కలిగేది కాదు.మరి ఎలా సాధించవలె? ఒంటె, సింహము, పసిబిడ్డ.”(“మూడు మార్పులు”: Z. Pr.4.)

ఒంటె మోకాళ్ళపై నిలబడి  బరువంతా  తన వీపుమీద పెట్టమంటుంది.ఎంత బరువైనా మోయగలను అని దానికి గర్వం. కాని  ఆ బరువుమోస్తూ ఉండగా, ఎప్పుడో  ఒంటెకు  ఒంటరితనం అనుభవమవుతుంది.అప్పుడు  అది సింహం అవుతుంది.స్వేచ్ఛను కోరుతుంది. ఒంటె స్వభావమైన విధేయత వినయము సహనము వదిలేస్తుంది. నేను యీ బరువు ఎందుకు మోయాలి? ఈ అడవికి నేను రాజునంటుంది.ఒంటె ఎందుకు సింహం కావలె?  కొత్త విలువలు సృష్టించుకోడానికి.తన స్వేచ్ఛను తాను సృష్టించుకోడానికి.తన  విధులను కూడా కాదనగల స్వేచ్ఛ కొరకు. మరి  సింహంలానే ఉండిపోవచ్చుగా? సింహం చేయలేనిది, పసిబిడ్డ ఏం చేయగలుగుతుంది? కాదనగల స్వేచ్ఛనుండి అవుననగల పవిత్రమనస్సుకు ఎదగగలిగితే పసిబిడ్డ. పసిబిడ్డ  అంటే  అమాయకత్వం, ఆట, తనంతతాను దొర్లే చక్రం. జీవితంలో  యీ పవిత్రమైన స్వేచ్ఛ కోరదగింది. కర్తవ్యం విధిగా కాక స్వేచ్ఛగా, ఆటగా ఆచరించవలె. ఇది నీచ దృష్టిలో మనిషి  అతిమానవుడిగా ఎదగడం.

ఒంటె తన స్వభావం వదిలేసి సింహస్వభావం పొందడం మనిషి అతిమానవుడుగా ఎదగడంలో ఒక మహత్పరిణామం. ఈ పరిణామాలు  అల్పమైనవి కావు. కొత్త విలువలు సృష్టించుకోడం అంటే ఏమిటో, అది లోకాన్ని ఎలా ఊపేస్తుందో,ఎంత  కల్లోలకారణమో,  “పిచ్చివాడు” కథలో సూచించాడు నీచ:

“సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా? పడిపోవడంలే మనం, పక్కకు వెనక్కు ముందుకు, ఎటుపడిపోతున్నామో తెలియకుండా ? ఇంకా పైకి  కిందికి అంటూ ఏమైనా ఉందా ?అనంతశూన్యంలో అగమ్యంగా వెళ్ళడంలేదా మనం?శూన్యాకాశపు వాసన రావడంలేదా? చలి కమ్ముకురావడంలే?చీకటిరాత్రి కమ్మేయడంలేదా ?”(పిచ్చివాడు)

ఈ ఎదగడం గురించి మరో విషయం:

అతిమానవుడు ఎత్తులకు ఎదగడు, లోతులకు దిగుతాడు. “జారతూస్ట్ర” కావ్యప్రారంభంలో, జారతూస్ట్ర సూర్యుణ్ణి ఉద్దేశించి అంటాడు:

“ ...నేను  లోపలికి  దిగిపోవాలి, సాయంత్రం నీలాగా. నీవు అపరాంబుధిలోకి  అస్తమించి అధోలోకాలకు వెలుగునిస్తావు కదా! అలాగా.(“Like thee must I GO DOWN”.Z:1 pro.1.)

అతిమానవుడు అవతరిస్తాడు (“I GO DOWN”). అవతరణం అంటే దిగడం.లోకం దృష్టిలో  అది పతనం

 -“పతనం

“వాడు కుంగుతున్నాడు, పడిపోతున్నాడు”,అంటావు  అపహసిస్తూ.
జాగ్రత్తగా చూడు. నీవున్న చోటుకే నడుస్తున్నాడు వాడు.
అమితానందభారంతో దిగుతున్నాడు.అతడి అమితప్రకాశంలో  నీ చీకటి  చెల్లాచెదురు.”

               (సముల్లాసశాస్త్రం: 47.GSP: నా అనువాదం. )

లోపలికి దిగడమంటే గొయ్యిలో పడిపోవడం కాదు, ఊట బావిలోని జీవజలాలను చేరడం.

-“ధృతి

నీవున్నచోట లోతుగా తవ్వి చూడు!లోపల ఉంది నుయ్యి.
మూఢులను  ఏడవనీ: అక్కడ ఉందని గొయ్యి.”
         
               ( సముల్లాసశాస్త్రం:3. Preludes కు నా అనువాదం)GS:Preludes )

చీకటిలోకాలలో ఉన్న మనుషులను ఉద్ధరించడానికి అతిమానవుడు ఆదిత్యుడై అస్తమిస్తాడు.

అసలు అతిమానవుడు అంటే ఎట్లా ఉండవలెనని, ఎట్లా ప్రవర్తించవలెనని నీచ అభిప్రాయం? అతిమానవుడంటే అతిలోకశక్తిసామర్థ్యం ఉన్నవాడు కాదు.స్వేచ్ఛగా ఆనందంగా మనిషిగా బతుకగలిగినవాడు. అంటే దుఃఖంలేని జీవితమా ?దుఃఖంలేని జీవితం ఉండదు.ఉంటుందన్న ఊహే నిరాశావాదానికి ఆధారం. షోపెన్ హోవర్ నిరాశాదృక్పథానికి కారణం అతడికి దుఃఖం అనుభవంకాలేదు కనుక అంటాడు నీచ. దుఃఖస్పర్శలేని జీవితాన్ని ఆశించడమే నిరాశకు నిస్పృహకు నిజమైన కారణం అంటాడు నీచ. ఈ దుఃఖానికి మందు దుఃఖమే. (“Well, the recipe against this "misery" is: misery.”GS:48) మనిషి కోరుకోవలసింది దుఃఖంలేని జీవితంకాదు.బాధే సౌఖ్యమని భావించడం కాదు.దుఃఖాన్ని జీవితంలో భాగంగా స్వీకరించగలగడం. సుఖదుఃఖాలకు అతీతమైనది ఆనందం. నీచ చెప్పేది యీ ఆనందం. రాజకీయనాయకులు మాత్రమే కాదు, నాయకులందరూ జనాలను మోసంచేస్తున్నారు యీవిషయంలో. దుఃఖం జీవితంలో భాగం అని చెప్పగలిగిన నాయకుడు  లేడు. చెప్పగలిగినవాడు నాయకుడు కాడు, ప్రవక్త.


-ఇచ్ఛాశక్తి (Will to Power)

నీచ ఆలోచనలను   నాజీతత్త్వానికి (Nazism) ముడిపెట్టిన  విషయం ప్రసిద్ధమే. అందుకు ప్రధానకారణం అతడి సోదరి.ఆమె భర్త యూదుద్వేషి. నీచ మరణానంతరం ఆమె నీచ రచనలను స్వాధీనం చేసుకొని, కొన్ని  మార్పులు చేసి, కొంత అపవ్యాఖ్య చేసి నీచ భావాలు నాజీతత్త్వానికి ప్రోత్సాహకాలు అన్న అపోహ కలిగించింది.కాని అది నిజం కాదు.(దురదృష్టమేమంటే యీ “పిచ్చివాడు” రాసిన నీచ చివరి రోజులలో నిజంగా పిచ్చివాడైపోయాడు, పిచ్చాసుపత్రిలోనే పోయాడు. అతని రచనలవలన అతనికి కలిగిన కీర్తి తెలుసుకోకుండానే పోయాడు, తన సంగీతానికి శ్రోతల కరతాళధ్వనులు వినలేని బీథోవన్ లాగా.) నీచ భావాలలో నాజీతత్త్వం అనుమానించగలగడానికి కారణం ఇచ్ఛాశక్తి గురించి అతడి భావాలు.అతడు చెప్పిన  ఇచ్ఛాశక్తి మరొకడిని లొంగదీసుకోడానికి కాదు. తాను ఎదగడానికి. మందలో మందతో ఉండిపోకుండా, ఆ మందను అతిక్రమించడానికి.కీర్క్ గార్డ్ కూడా మందతత్త్వాన్ని కాదంటాడు. అతడి ప్రసిద్ధవాక్యం “అసత్యం మంద”(“ Crowd is the untruth”).అయితే, యిద్దరిలోను మందపై ఆధిక్యం కొరకు కాదు. తనను తాను అధిగమించడానికి. దీనికి చాలా అతిమానుషమైన ఆత్మబలం కావాలి. దానినే నీచ ఇచ్ఛాశక్తి (Will to Power) అన్నాడు. ఒకడు మరొకణ్ణి అనుసరించడమే అంగీకరించని నీచ, మరొకడిపై ఆధిక్యాన్ని ఎలా ఆమోదిస్తాడు? “నన్ను  అనుసరించ వద్దు”,  అనే ఏ ప్రవక్త అయినా చెబుతాడు. కాని ఎవరూ వినరు.జిడ్డు కృష్ణమూర్తి అన్నాడు, బుద్ధుని అనుసరించేవాడు బౌద్ధుడు కాడు అని. నిన్ను నీవు అనుసరించు, నీవు బుద్ధుడవు. నీచ అదే అంటాడు:

-కాలచక్రం (Eternal Recurrence)

నీచ దర్శనంలో మరో ప్రధానాంశం కాలచక్రం. పాశ్చాత్యులభబావంలో   కాలం  సరళరేఖలా సాగుతుంది.  భారతీయదృక్పథంలో  కాలమొక  చక్రం.

 “This life as you now live it and have lived it, you will have to live once more and innumerable times more; and there will be nothing new in it, but every pain and every joy and every thought and sigh and everything unutterably small or great in your life will have to return to you, all in the same succession and sequence—even this spider and this moonlight between the trees, and even this moment and I myself. The eternal hourglass of existence is turned upside down again and again, and you with it, speck of dust!” (GS 341.tr.Kaufman).

ఈ భావం GS లో చివరి వాక్యానికి ముందుది, Z లో ప్రారంభం.

“And do you know what “the world” is to me? Shall I show it to you in my mirror? This world: a monster of energy, without beginning, without end…as force throughout, as a play of forces and waves of forces…a sea of forces flowing and rushing together, eternally changing and eternally flooding back with tremendous years of recurrence…out of the play of contradictions back to the joy of concord, still blessing itself as that which must return eternally, as a becoming that knows no satiety, no disgust, no weariness; this my Dionysian world of the eternally self-creating, the eternally self-destroying, this mystery world of the two-fold voluptuous delight, my “beyond good and evil,” without goal, unless the joy of the circle is itself a goal….This world is the will to power—and nothing besides! And you yourselves are also this will to power—and nothing besides!( Z:tr. Thomas Common)

“a monster of energy”! ఇది నీచ చేసిన విశ్వరూపసందర్శనమా!

గీతలో అర్జునుడు విశ్వరూపం చూచి, చూడలేక “ కృష్ణా! ఈ భయంకరరూపాన్ని ఉపసంహరించు” అని వేడుకున్నాడు. కాని నీచ ఆ రూపాన్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నాడు.

ఆధ్యాత్మిక సాధనలో చరమవాక్యం  జన్మరాహిత్యం. కాని నీచ జన్మరాహిత్యం కోరడం లేదు. ఎన్ని యుగాలు గడవనీ ఎన్ని కల్పాలు  ఆవర్తనం కానీ,యీ జన్మ నాకు మళ్ళీ మళ్ళీ కలగాలని,యివే  కష్టసుఖాలతో యిలాగే వేలజన్మలు రానీ,అంటున్నాడు.రానీ కాదు,రావాలని నేను సంకల్పిస్తాను అంటున్నాడు.ఇలా అనగలిగినవాడు ప్రాచ్యపాశ్చాత్యాలలో మరొకడు లేడేమో? (కంచి పరమాచార్య చంద్రశేఖరసరస్వతి అన్నారు.)


-ఉత్సాహవంతుడు (Dionysian Man)

నీచ కవి అని మరొకసారి గుర్తుచేసుకుందాం.అతని వాక్యాలకు వాచ్యార్థం చెప్పడం వలన అనర్థం కలుగుతుంది.అతని “దేవుడు మరణించాడు”వాక్యంలో కర్త దేవుడు కాదు, “నీవు నేను.”నీలో నాలో ఉన్న దేవుడు మరణించాడు. అతని అక్రీస్తులో ( Anti-Christ) దాగి ఉన్నవాడు క్రీస్తు.అతడు ఒంటె.( “మీ భారములన్నియు నాపై వేయుడు.నేను మోసెదను.”) అతడు సింహం.( ఒకసారి పెద్దపులి కూడా, ‘Burning bright’: Blake; “In the juvescence of the year came the tiger.”T.S.Eliot). అతడు శిశువు.ఇది ప్రసిద్ధమే కదా! నీచ అన్వేషణ దేవుడికొరకు, ఒక కొత్త దేవుడికొరకు, ఒక కొత్త క్రీస్తుకొరకు. ఆర్తితో దేవుడికొరకు పిచ్చివాడిలా  కేకలు వేస్తున్నాడు నీచ. అతడికి దేవుడు కావాలి.కాని ఎటువంటి దేవుడు?

“అనుక్షణం ఆనంద తాండవం చేయగలిగిన  దేవుణ్ణి మాత్రమే నేను నమ్ముతాను.”( “Z:I.7)

ఇదీ, నీచ నిరీశ్వరనైరాశ్యంలోని చిదంబర రహస్యం.కైలాసశిఖరం కొండకొమ్ముపై  ఒళ్ళుమరచి ఆనందంగా నృత్యం చేయి. పాదం తడబడితే పాతాళంలో పడిపోతావా? భయమెందుకు? అదీ శివమే. “ఆపాతాళనభస్స్థలాంతభువనబ్రహ్నాండ”మంతా శివమయమైనవాడికి భయమెందుకు? భద్రత దేనినుండి? అభద్రతే జీవితం.(“ Vulnerability is what life is.”J.K. “Commentaries on Living” )

“జారుడు  మంచు:
స్వర్గం,
నేర్చిననర్తకులకు.”

( సముల్లాసశాస్త్రం: 13.GS Preludes కు నా అనువాదం)

నీచ దర్శించింది యీ సర్వతోభద్రమైన అభద్ర ఆనందతాండవం.

                                                 
దేనినుండి  భద్రత? కైలాసశిఖరం కొండకొమ్ముపై తాగి నృత్యం చేయి, “సాగరసంగమం”లో హీరోలా. పాదం తడబడితే పాతాళంలో పడిపోతావా? భయమెందుకు? అదీ శివమే. “ఆపాతాళనభస్స్థలాంతభువనబ్రహ్నాండ”మంతా శివమయమైనవాడికి భయమెందుకు? భద్రత దేనినుండి?
“అనుక్షణం ఆనంద తాండవం చేసే దేవుణ్ణి మాత్రమే నేను నమ్ముతాను.”( “I would only believe in a God that knows how to dance.” Zarathustra Part I, Chapter 7)
ఇదీ, నీచ నిరీశ్వరనైరాశ్యంలోని చిదంబర రహస్యం.

ఈ స్వేచ్ఛా సముద్రంలో ప్రయాణానికి జనం సిద్ధంగా లేరు. ప్రవక్తలు ఎప్పుడూ ముందు వస్తారు. లోకానికి యింకా చీకటి కనిపించదు. “ యా నిశా సర్వభూతానాం, తస్యాం జాగర్తి సంయమీ।యస్మిన్ జాగ్రతి భూతాని, సా నిశా పశ్యతో మునేః”॥గీత.”సర్వప్రాణులకు ఏది రాత్రో అప్పుడు జ్ఞాని మేలుకొని ఉంటాడు.సర్వప్రాణులు మేలుకొని ఉన్న సమయం  జ్ఞానికి రాత్రి.)అందుకే పిచ్చివాడు  లాంతరు నేలకేసి పగలకొట్టాడు.


లేక, దేవుడు ఎమర్జన్సీ వార్డులో ఆక్సిజన్ సహాయంతో ఉన్నాడు. కొంచెం కొంచెం చచ్చిపోతున్న దేవుడి ఆక్సిజన్ మాస్క్ ,ఒక మంచిరోజు చూసి లాగేశాడు నీచ. హాస్పిటల్ బయటకు వచ్చి, ఆధికారికంగా ధృవపరుస్తూ వైద్యనివేదిక చదివేశాడు, “ దేవుడు మరణించాడు”, ( “ God is dead ”) అని.

కాని, దేశాధినేత చనిపోయాడన్న ప్రకటనతో, మరొకడు పదవీస్వీకారప్రమాణం చేస్తున్న వార్తకూడా వస్తుంది.(The king is dead.Long live the king.) మనిషిచేత పదవీస్వీకారప్రమాణం చేయించాడు నీచ. పురుషుడు పురుషోత్తముడైనాడు, (Ubermensch, Overman).

దేవుడి మరణవార్త GS తరువాత నీచ రాసిన జారతూస్ట్ర ప్రారంభభాగంలోకూడా వస్తుంది.  తిరిగి అక్కడ చూద్దాం.

సముల్లాసశాస్త్రం

O, for a draught of vintage! that hath been
         Cool'd a long age in the deep-delved earth,
Tasting of Flora and the country green,
         Dance, and Provençal song, and sunburnt mirth!
O for a beaker full of the warm South,
         Full of the true, the blushful Hippocrene,...( Keats: Ode to a Nightingale)

సముల్లాసశాస్త్రం  (  The Preludes :The Gay Science )

1.ఆహ్వానం

వాడి చూడండి,మీ ముందుంచుతున్న సరుకు~
నా వాగ్దానం, యిది మీకు నచ్చుతుంది
ఈ వేళ కాకుంటే రేపు, యీ రోజుకంటే రేపు.
అప్పుడు మీరు  మరికొంత కోరితే,
ఈ విజయం నాకిచ్చే  ధైర్యంతో  సరికొత్త సరుకు అరువు తెచ్చి మీముందుకొస్తాను.

2.నా అదృష్టం.

వెదకి విసిగిపోయాను.
కాదని, కనుగొనడం నేర్చుకున్నాను.
ఒక గట్టి గాలి కొట్టి వెనక్కు విసిరేసింది,
ఇక యిప్పుడు గాలి ఎటు విసిరితే అటు.

( గాలిలో అవశమై  ఎగిరే ఎండుటాకును నేను అంటున్నాడా? కాదు. సిద్ధాంతాల కట్టుబడినుండి విడివడి స్వేచ్ఛ పొందడం మొదటి మెట్టు.రెండు పదాలు కీలకం: “వెదకి”, “కనుగొను” . మొదటిది వెదకడం, “వాడేం చెప్పాడు,వీడేం చెప్పాడు”,అని. దానిలో విసుగు తప్ప వెలుగు కలగదు. వెదకడం ఆపితే, తనకే తెలుస్తుంది.ఇది అస్తిత్వవాదంలో మూలతత్త్వం. ఎవడి కనుగొన్న సత్యం వాడికి మాత్రమే సత్యం, మరొకడికి పనికిరాదు.( “I must find a truth that is true for me.” (Kierkegaard: Journal entry, Gilleleie : 1 August 1835) ఇది వైయక్తికత కాదు, ఆత్మత. (అస్తిత్వవాదం వ్యక్తి ఆత్మను (Individual Self) ఆవిష్కరిస్తుంది. కాని ప్రాథమ్యం ,వ్యక్తిపై (Individual) కాదు, ఆత్మపై (Self).

తరువాత, “యిప్పుడు గాలి ఎటు విసిరితే అటు”, ఏ సిద్ధాంతానికీ  విముఖత లేకుండా అన్నిటితో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళడం, చివరకు  తన సిద్ధాంతాలైనా చివరివరకూ అంటిపెట్టుకోరాదు. నీచ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకొంటూ వెళ్ళాడు.నావి కదా అని గుండెలకు హత్తుకోలేదు.)

3.ధృతి

నీవున్నచోట లోతుగా తవ్వి చూడు! నీ కింద ఉన్నది నుయ్యి!
మూఢులను  ఏడవనీ: “కింద ఉండేది గొయ్యి” .

(ఈ పద్యంలో నీచ ప్రసిద్ధభావాలు రెండు వ్యక్తమయ్యాయి. నీచ ద్వంద్వాలను (binaries) ఒప్పుకోడు. మంచి చెడు, పుణ్యం పాపం, స్వర్గం నరకం అనేవి విరుద్ధాలు కావు. తారతమ్యాలు అంటాడు నీచ.

కింద, పైన అనేవి కూడా అటువంటి ద్వంద్వమే. పైన ఎప్పుడూ మంచిది ( నుయ్యి, ఊటబావి),కింద ఎప్పుడూ చెడు ( గొయ్యి, నీవు పడిపోవడానికి) అనే సాధారణభావాన్ని కాదంటున్నాడు.

“న చోర్ధ్వం న చాధః”(దశశ్లోకీ”).గీతగీచుకుంటే ఆద్యంతాలు, అధోర్ధ్వాలు. గీత తుడిచేస్తే లేవు ద్వంద్వాలు.

లోపలికి దిగడమంటే గొయ్యిలో పడిపోవడం కాదు, ఊట బావిలోని జీవజలాలను చేరడం.

“జారతూస్ట్ర” ప్రారంభభాగంలో కూడా యీ “కిందికి దిగిపోవడం” గురించి చెబుతాడు:

“అతడు (జారతూస్ట్ర ఊరు విడిచి ఊరి సరసన విడిచి కొండల్లోక నడిచి) సూర్యుడికి ఎదురుగా నిలిచి యిలా అన్నాడు: ...కనుక నేను అపరాంబుధిలోకి అస్తమిస్తాను,సాయంకాలం నీవు సముద్రం వెనుక దిగిపోయి అధోలోకాలకు వెలుగునిచ్చినట్టు, ఓ ఉత్సాహభరితనక్షత్రమా!కనుక నీలాగా నేనూ దిగిపోతాను.అంటుంటారే, ఎవరికోసం అవతరిస్తారో వారి ముందు...అలా జరిగింది జారాతూస్ట్ర దిగిపోవడం.” (జార.1.1.)

నీవు దేవుడికంటే గొప్పవాడివి కావు కదా! మనిషిని ఉద్ధరించవలె అనుకుంటే, దేవుడు మనిషిగా “దిగి” వస్తాడు.)

4.సంభాషణ

నాకు జబ్బు చేసిందా? కోలుకున్నానా?
నా వైద్యుడెవరో కనుక్కొన్నారా?
ఎలా మరచిపోయాను అంతా?

ఇప్పుడు నీవు కోలుకున్నావు:
మరచినవాడు స్వస్థుడు.

(మన సంభాషణలలో తరచు విషయం మన ప్రియమైన అస్వస్థత. ఎంత చెప్పినా తనివితీరదు. అస్వస్థత మన ఘనత  కాదు, పదిలపరచుకొని పదేపదే నలుగురితో పలవరించడానికి.)

5.సాధువుకు

మన సుగుణాలు హుషారుగా అడుగులు వేయాలి యిటు అటు:
హోమర్ చరణాలలా, వస్తూ పోతూ.

“సాధువు హుషారుగా ఉండరాదు, ఎప్పుడూ గంభీరముద్రతో ఉండవలెను”, అనే అభిప్రాయాన్ని కాదంటున్నాడు.వేసిన అడుగులో ఆనందం ప్రకటం కావాలి.)

6.లౌక్యం

పల్లపుప్రాంతాలలో యిల్లు కట్టుకోకు!
ఆకాశంలో మేడలు కట్టకు!
మధ్య భూమిలో నిలబడి చూడు
లోకం ఆలోకనీయం!

7.కరపుస్తకం

( మూలంలో  శీర్షిక “vade mecum”,అంటే “నాతో రా” అని అర్థం. Handbook )

నా దారి,  నా మాట నచ్చాయి నీకు. నన్ననుసరిస్తావా?
నీ దారిని నమ్మి నడువు : నా దారికొస్తావు.

( సత్యం ఏకమే అయినా, ఎవడి సాధన శోధన వాడిదే. గమ్యం ఒకటే అయినా, ఎవడి దారి వాడు చేసుకోవలసిందే.ఒకడు చేసిన దారి మరొకడికి పనికిరాదు.కాని,  ‘ఎవడి దారి వాడిది’, అన్న అనైక్యం  కాదు అర్థం.)

8.మూడవ కుబుసం

నా చర్మం పగులుతోంది
నాలోపల పాము కోరికతో రగులుతోంది,
తిన్న మట్టి  ఆకలి రేపింది.
మరింత  మట్టికై  దాహం.
పొదలకు ప్రవాహానికి మధ్య పాకిపోతుంటాను.
దహించే ఆకలి, అయినా ఉత్సాహంతో
తిన్నదే తింటూ: ఓ! మట్టీ! పాముకు పుష్టి!

( మన్నుతిన్న పామును  స్తబ్ధతకు చెబుతారు. కాని,నీచ ఆ మట్టి చాలు, అది నాకు పుష్టి అంటాడు. ఈ ప్రపంచం తినుచున్న మట్టినే తినుచూ హాయిగా బతకొచ్చు, “ఎందుకు సణుగుతావు?”, అంటాడు నీచ. ఏ విషయంలోనూ లోకం గురించి సణగవద్దు గొణగవద్దు అనేది నీచ జీవితదృక్పథం.ఉన్నదానితో సరిపెట్టుకో అని అనడం లేదు. ఉన్నదానితో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించు అంటాడు.)

9. నా గులాబీలు

అవును! మీ వినోదం కొరకు నా ఆనందం.
ఏ ఆనందానికైనా  అదే ధ్యేయం.
 నా గులాబీని, ఆనందాన్ని తుంచేస్తావా?

ఇరుకు దారుల్లో వంగి వెదకాలి,
ముళ్ళ కంచెల్లో  తొంగి చూడాలి,
మెడలు సాచాలి.

పిచ్చెక్కించడం నా ఆనందం.
పైశునం నా గుణం.
నా గులాబీని, ఆనందాన్ని తుంచేస్తావా?

10.తిరస్కారం

చాలానే ఒలికిస్తాను నేను.
తిరస్కారమనుకుంటారు మీరు.
మీ పానపాత్ర నిండినపుడు
చాలానే ఒలుకుతుంది.
మద్యాన్ని నిందించరు.

11.నా నుడి.

సునిశితము సున్నితము, మందము తీక్ష్ణము, అపరిచితము సుపరిచితము.
పండితుడు పామరుడు కలుసుకునే చోటు.
ఇదీ నేను.మొదటినుండి నేనిలా-
నాలోపల పాము, పావురము, సూకరము సహజీవనం.

( ద్వంద్వాలను అంగీకరించడు  నీచ.పండితుడు పామరుడు విరుద్ధాలు కారు.వారు ఒకే తాటికి రెండు కొనలు.)

12.వెలుగు చెలికాడు

నీ కళ్ళు, మనసు భద్రం.
నీడలో నడుస్తూ సూర్యుణ్ణి అనుసరించు

13.నర్తకులకు

జారుడు  మంచు
స్వర్గం,
నేర్చిననర్తకులకు.

(ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా  తేవాలంటే, “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు (“జారుడు మంచు కైలాసం”). మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు ! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది,ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర  ఆహార అభద్రతకు ప్రతీక. జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం,  జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో  ఆనందం ఉంది.రవీంద్రభారతిరంగస్థలంపై  దొరకని ఆనందం.

అభద్రతలోని ఆనందాన్ని కోరుకో.ప్రమాదాలను ఎదిరించే సాహసజీవితం కోరుకో.

జీవితంలో భద్రతను కోరకు,అంటాడు నీచ. భద్రత కావాలంటే స్వేచ్ఛను పణంగా పెట్టాలి.
ఈ నాటి రాజకీయంలో జరుగుతున్నది అదే, భద్రతకోసం జనం స్వేచ్ఛను పణంగా పెడుతున్నారు.

“దిగంతాలు ఉజ్జ్వలంగా లేవు, కాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఇంతకాలానికి, మా నావలు బయలుదేరగలుగుతున్నాయి,ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాయి.ఇప్పుడు జ్ఞానాన్వేషణాప్రియులు చేయరాని సాహసం లేదు. సముద్రం, మన సముద్రం, మళ్ళీ  పిలుస్తోంది,ఏదీ దాచుకోకుండా. ఇంత స్వచ్ఛస్వేచ్ఛాసముద్రం బహుశా మునుపెన్నడూ ఉండి ఉండదు.( స.శా.5.343)

సముద్రం స్వచ్ఛంగా ఉంది.ప్రయాణానికి స్వేచ్ఛ ఉంది మనిషికి. కాని మునుపటి ప్రమాదాలు అలాగే ఉన్నాయి.లేకపోతే అది సముద్రప్రయాణం ఎట్లా అవుతుంది? అందులో సాహసమేముంది? సముల్లాసమేముంది?

జీవితం మంచుకొండ, మహాసముద్రం. ఎదురించి జీవించడమే జీవితం.అదే సముల్లాసం.)

16.పైకి

“ఈ కొండ ఎక్కడమెలా?” “ఎక్కు , ఆలోచించకు.ఎక్కినా ఎక్కగలవు.”

28.ఆ పిల్లను చూడు, పందులమధ్య, నిస్సహాయంగా, సుద్దముద్దలా  పాలిపోయిన ముఖం.
ఎప్పుడూ ఏడుపు ఏడుపు.
ఎప్పటికైనా లేచి నడుస్తుందా?
నిరాశ చెందకు! నిట్టూర్పులు ఆపు! త్వరలో నృత్యం చేస్తుంది చూడు, పగలూ రాత్రీ.
కాళ్ళు పనిచేస్తాయని తెలిసింది, యిక తలపై నిలబడి  నిన్ను చూసి నవ్వుతుంది.

29.తారలనంటే అహం

గుండ్రటి పీపా నేను, ఆగకుండా దొర్లకపోతే,
మండే సూర్యుడి వెంటబడే నేను, ఎలా మండకుండా ఉండగలను?

30.పొరుగువాడు

పొరుగువాణ్ణి ప్రేమించను,
అందని దూరంలో అందనంత ఎత్తులో అతడుండాలని.
అప్పుడు కదా,అతడు నా అందమైన తార!

31.ముసుగులో మహాత్ముడు

నీ ఆనందం భరించలేము
దయ్యంలా జడలు ధరించు
దయ్యంలా  మాటాడు  దయ్యంలా వెయ్యి వేషం.
ఎన్ని వేషాలు వేసినా ఏం లాభం?
నీ చూపులో  వేలుపుల  వెలుగు.

32.బద్ధుడు

ఆగి చెవి ఒగ్గుతాడు:ఏమి వినబడుతోంది వాడికి?
వాడి చెవుల్లో  ఏమిటా  రొద?
ఎందుకలా పడిపోయాడు? ఏమిటా చచ్చే భయం?
ఒకసారి  వాడు సంకెళ్ళు మోస్తే,  వాడి వెనుక ఎప్పుడూ సంకెళ్ళ  చప్పుడు

52.పదరచయితలు

నేను చేత్తో మాత్రమే రాయను.నా కాలు నేనూ ఓ చేయి వేస్తానంటుంది.
స్థిరంగా స్వేచ్ఛగా నా పాదాలు ధైర్యంగా పరుగెత్తుతాయి
పుటలపై పచ్చికపొలాలపై.

39.వేసవిలో

చెమటలు పట్టిన శ్రమలో, ఏమీ తినవద్దంటాడు తెలిసిన వైద్యుడు.
మిణుకుతూ కనుగీటు కృత్తిక  ఏమంటోంది ?
మద్యం చుక్కతో సేదదీరమంటోంది.

40.అనసూయ

అతడి చూపులో అసూయ లేదు:  అందుకు నీవతన్ని మెచ్చుకుంటావు.
నీ మెప్పు అతనికి పట్టదు.
అతడిది గద్ద చూపు దూరపు  వస్తువుపై.
నిన్ను చూడడు.నక్షత్రాలపై దృష్టి.

41.హెరాక్లిటస్ తత్త్వం

సంతోషానికి  పురిటినేల  యుద్ధభూమి.
మందుగుండును మించి  స్నేహానికి  లేదు మందు.
నలుగురిలో ముగ్గురుమిత్రులు, ఆపదలో ఆప్తులు,
పగవాడితో పోరులో  ఒక్కటవుతారు.
మృత్యుముఖంలో ముక్తులు.

42.నాగరికసూత్రం

మునికాళ్ళపై నిలిచి చూడు, మోకాళ్ళపై పాకకు.
తాళరంధ్రంలోంచి గమనించు, తెరచిన తలుపులోంచి కాదు.

44.వేళ్ళూనినవాడు

పండితుణ్ణంటారా? నా కటువంటి ప్రతిభ లేదు.
నేను కొంచెం బరువు, అంతే.
నేను పడిపోతుంటాను, పడిపోయి పడిపోయి అట్టడుగును అందుకుంటాను.

59. కలం గీకుతుంది

నా కలం ఏదో గీకుతూనే ఉంటుంది.నరకం!
ఇలా గీకుతూ ఉండడం నా విధిరాతా?
ధైర్యంగా బుడ్డిలో ముంచి పెద్ద పెద్ద ఏరులు రాసేస్తా.
చూడు! ఎలా నిండుగా  స్వచ్ఛంగా పారుతోందో!
నేను గీచిన ప్రతి గీతా ఎలా సఫలమవుతోందో చూడు!
రచన స్పష్టంగా లేదు, నిజమే-
అయితేనేం? నేను రాసింది ఎవడూ చదవడుగా!

60.ఉన్నతులు

అతడు చాలా పైకి ఎక్కాడు.మెచ్చుకోవలసిందే.
కాని, ఆ యింకొకడున్నాడు, అతడు పైనుంచే వస్తాడు.
నీ మెప్పు అంత పైకి వెళ్ళి అతన్ని అందుకోలేదు.
అతడు తరణికిరణం!

61.నిత్యశంకితుడు

నీ  జీవితం సగం ముగిసింది.గడియారం ముల్లు కదులూతూనే ఉంది.చాలా తిరిగావు, ఎంతో వెదికావు.ఏమీ దొరకలేదు-
నీ ఆత్మ వణుకుతోంది ! యిప్పుడీ విచికిత్స.
నీ  జీవితం సగం ముగిసింది.బాధలో తప్పటడుగుల్లో ఎలా కాలం పాకింది!
ఎందుకు వదిలెయ్యలేవు?
సరిగ్గా అదే తెలియాలి నేను. ఇదంతా ఎందుకు?

62.చూడండి యీ మనిషిని

అవును! నాకు తెలుసు నేనెక్కడి వాడినో!
ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ  వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు, నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు.

(జర్మన్ మూలంలో  యీ పద్యానికి శీర్షిక “Ecce homo”  ("behold the man", Classical Latin: [ˈɛkkɛ ˈhɔmoː]) జీసస్ ను శిలువ వేసేముందు, అతని తలపై ముళ్ళకిరీటం ఉంచి, జనాలకు ఆయనను చూపిస్తూ,  పోంటియస్ పైలెట్ అన్న మాటలు. )

63.తారల నీతి

తారాపథంలో తిరగాలని నీకాదేశం. నీకెందుకు చీకటి చింత?
బ్రహ్మానందంలో సాగనీ నీ భ్రమణం మా మానవ జీవితాల దుఃఖాలు యిలా సాగనీ.
సుదూరలోకాలకు పంచు నీ ప్రకాశం.జాలి పనికిరాదు నీకు, పాపంలా  ఉచ్చాటన చెయ్.
కాని, ఒక తప్పరాని నియమం,  స్వచ్ఛంగా ఉండు.

నీచ (Nietzsche)-2


కీర్క్ గార్డ్ , నీచ ( Nietzsche)

:దాసోహం, సోహం

కీర్క్ గార్డ్ , నీచ ( Nietzsche) - సాధారణంగా యీ యిద్దరినీ అస్తిత్వవాదప్రవక్తలుగా చెబుతుంటారు. కాని, అస్తిత్వవాదులు తీసేసుకున్న అంశాలు వదిలేసిన తరువాత, వీరిద్దరి దృక్పథాలలోని భేదం తెలుసుకోడం అవసరం. వెనుక, ఒకసారి చెప్పుకున్నాం, కీర్క్ గార్డ్ విశిష్టాద్వైతి, నీచ అద్వైతి అని. ముందు, చైతన్యం గురించి వారి ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం.

(నీచ(1844 - 1900)  కీర్క్ గార్డ్ (1813 -1855) రచనలు చదివినట్టు లేదు. కాని దోస్తోవ్ స్కీ తనను ప్రభావితం చేసినట్టు, అతనిని నుండి తాను మనిషి మనస్తత్త్వం చాలా తెలుసుకున్నానని అన్నాడు నీచ. కీర్క్ గార్డ్, దోస్తోవ్ స్కీ తత్వంలోను  రచనావిధానంలోనూ యించుమించు కవలలు.)

కీర్క్ గార్డ్ “భయము, కంపము” లోని  చైతన్యప్రసంగం  (“ భయము, కంపము”- 5 వ వ్యాసంలోది ) మళ్ళీ ఒకసారి చూదాం:

“మనిషిలో నిత్యచైతన్యమే  లేకపోతే, ఈ సమస్తసృష్టికీ , అందులో అల్పమైనదిగాని అనల్పమైనదిగాని , అన్నిటికీ ఆధారం,  ఉద్వేగాలతో ఉడికిపోయే ఒక అవ్యక్తమైన అంధశక్తి మాత్రమే అయి ఉంటే; ప్రతి వస్తువు వెనుక  ఉన్నది ఒక అంతులేని శూన్యము, దాని ఆరని దాహం  మాత్రమే అయితే, జీవితంలో నిస్పృహ తప్ప ఏముంటుంది?  అదే నిజమయితే, మనుషులను కలిపి ఉంచే పవిత్రబంధమేదీ  లేకుంటే,  మనుషులు ఒక తరం తరువాత మరో తరం అడవిలో చెట్ల ఆకుల్లా రాలిపోయి తిరిగిపుడుతుంటే, ఒక తరం స్థానంలో మరో  తరం,  అడవిలో పక్షుల పాటల్లా ఆగి ఆగి  వినిపిస్తుంటే, మనుషులు యీ ప్రపంచంలో సముద్రంపై నావల్లా, ఎడారిలో గాలిలా, ఆలోచనలు ఆశయాలు లేకుండా ప్రయాణిస్తూఉంటే,  ఒక అవ్యక్తశక్తి  ఆకలితో ఆహారంకోసం శాశ్వతంగా పొంచి ఉంటే, దాని కోరలనుండి కాపాడగలిగిన ఒక  గొప్పశక్తి  లేకపోతే, జీవితం ఎంత శూన్యం! ఎంత నిష్ఫలం!”

 చైతన్యమే లేకుంటే చెట్టుకు మనిషికి  తేడా ఏముంటుంది, మనిషి జీవితంలో నిస్పృహతప్ప ఏముంటుంది అంటున్నాడు కీర్క్ గార్డ్.ఈ మాటను  నీచ ఒప్పుకోడు. అతని జీవితకాలమంతా  దీనిని ఖండిస్తూనే వచ్చాడు.

“ Consciousness is thus thoroughly tyrannised over—and not least by the pride in it! It is thought that here is the quintessence of man; that which is enduring, eternal, ultimate, and most original in him! Consciousness is regarded as a fixed, given magnitude! Its growth and intermittences are denied! It is accepted as the "unity of the organism"!—This ludicrous overvaluation and misconception of consciousness, ….”.( The Gay Science (German: Die fröhliche Wissenschaft) or The Joyful Wisdom)

    “చైతన్యాన్ని చిత్రహింసలు (“tyrannised over”) పెట్టారు తత్త్వశాస్త్రవేత్తలు, వారికి కావలసినవన్నీ దానిచేత పలికించారు”,  అంటాడు నీచ. దాని చేయి  మెలితిప్పి కాకపోయినా, దాని నెత్తిన ఒక కిరీటం పెట్టి.  ఎలా పలికిస్తేనేం, పలికించారు.నీచ  అంటాడు, చైతన్యమనేది ఒక సిద్ధవస్తువుగా (“a fixed, given” ) వచ్చింది కాదు;అది క్రమపరిణామశీలము; పైగా అది నిరంతరం కాదు, అని. మూలభావంలోనే యింత వైరుద్ధ్యం ఉన్న యీ యిద్దరూ , ఒకే తాత్విక వాదానికి ప్రవక్తలెట్లా అయినారు? వారి వైరుధ్యం లోతు ఎంత? వారి ఆలోచనలలో  ఉన్న సామాన్యాంశాలు ఏవి? ఇవి సావధానంగా పరిశీలించవలసిన విషయాలు. ఈ సందర్భంలో సవివరంగా పరిశీలించలేము. కాని కొంత స్థూలంగా చూద్దాం. ఇద్దరి  అసంతృప్తికి కారణం ఒకటే. వ్యవస్థ అనేకరూపాలలో, మతవ్యవస్థ రాజకీయవ్యవస్థ సామాజికవ్యవస్థ,  వ్యక్తి వ్యక్తిత్వాన్ని హరిస్తున్నది. వ్యక్తిని వ్యవస్థనుండి కాపాడి, వ్యక్తిత్వాన్ని నిలబెట్టడం యిద్దరి ఆశయం. సమస్య యిద్దరిదీ ఒకటే,  కాని,  పరిష్కారం ఎవరిది  వారిది.
     ముందుగా, వీరిద్దరిదృక్పథాలలోని సామాన్యాంశాలు, ముఖ్యంగా అస్తిత్వవాదులు ఉపయోగించుకోగలిగినవి, చూద్దాం. సామూహిక సత్యం యిద్దరూ అంగీకరించరు.నీచ, “దృక్పథం”  (perspective) అంటాడు. ఎవడి దృక్పథాన్ని బట్టి వాడికి తెలిసింది  సత్యం.కనుక, లోకానికంతటికీ ఒక సత్యం (universal truth) ఉండదు. కీర్క్ గార్డ్ ప్రసిద్ధవాక్యం: “నాకు మాత్రమే సత్యమైన సత్యాన్ని నేను తెలుసుకోవలె”(I must find a truth that is true for me”). అంటే సత్యం మందలో దొరకదు,  ఆ మంద సామాజికమైనా, రాజకీయమైనా, మఠమైనా. (“Crowd is the untruth”, అంటాడు కీర్క్ గార్డ్. నీచ “ herd” అంటాడు. ) వీరిద్దరూ చెప్పదలచిందేమంటే, సార్వకాలికము సార్వజనీనము అయిన సత్యం ఉండదు అని మాత్రమే కాదు. ఒక వేళ అటువంటి సత్యమొకటి ఉన్నా అది ఎవడికి వాడు సంపాదించుకోవలసిందే. ఆ సత్యసాక్షాత్కారం కొరకు ఎవడి యాతన వాడు పడవలసిందే. అప్పుడే అది వాడిదవుతుంది. ఒకడు సంపాదించి మరొకడికి యిచ్చేది కాదు. సత్యాన్వేషణ ఒంటరి ప్రయాణం.(“ఏకాకీ యతచిత్తాత్మా”.(గీత). సిద్ధిలోనే కాదు, సాధనలో కూడా ఏకాకి; ఆరూఢుడే కాదు, ఆరురుక్షువు కూడా.) అంటే వ్యక్తిని అన్ని బంధాలనుండి విడిపించి అతన్ని ముక్తుణ్ణి చేయవలె అనే ఆర్తి యిద్దరిదీ. కాని అంతటితో వారి సామ్యం ముగుస్తుంది.కీర్క్ గార్డ్ దాసోహం అంటే, నీచ సోహం అంటాడు. కీర్క్ గార్డ్ భగవంతుడికి భక్తుడికి మధ్య మరొకడికి చోటులేదు అన్నా, గురువుకు చోటిచ్చాడు.అయితే, ఆ గురువు సాక్షాత్తూ దేవుడే, మూడవ వస్తువు కాదు.

"His love is a love of the learner, and his aim is to win him. For it is only in love that the unequal can be made equal, and it is only in equality or unity that an understanding can be effected, and without a perfect understanding the Teacher is not the God, unless the obstacle comes wholly from the side of the learner, in his refusing to realize that which had been made possible for him."(Philosophical Fragments)

“ఆచార్యవాన్ పురుషో  వేద”(ఛాందోగ్యం),అని (“అన్యథా చ జ్ఞానప్రాప్త్యభావాత్”(ఉపదేశసాహస్రి) అంటూ,”గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా”,   అని తన భాషలో అంటున్నాడు కీర్క్ గార్డ్.  నీచ, దేవుణ్ణే కాదన్నవాడు, గురువునేం ఒప్పుకుంటాడు?

  [ ఈ చర్చను కొనసాగించేముందు,  పరిశీలనకు అవసరమైన పరిభాషను సరిచూసుకోవలె. తత్త్వశాస్త్రం, దర్శనం, వేదాంతం అన్నవి వేరు వేరా? సాధారణంగా వేదాంతం అన్న పదం philosophy కి సమానార్థకంగా వాడుతున్నారు.  నేటి మెటఫిజిక్స్ , ఓంటోలజీ, ఎపిస్టెమోలజీ, వంటి పదాలన్నీ చేరుతాయి వేదాంతంలో (ఫిలాసఫీలో) .(వేదాంతం అన్న పదం అవైదికసంస్కృతులచర్చలో వాడవచ్చా? ఈనాడు ఆ పదం ఆ అర్థంలో స్థిరపడినట్లే ఉంది, వైదికవాసనలు వదిలించుకొని.) కాంట్, హెగెల్ మొదలైన వారంతా తాము వేదాంతులమనే (philosophers) చెప్పుకున్నారు.కాని, యీనాడు వారిని తాత్త్వికులు ( Metaphysicians)  అంటారేమో? స్థూలంగా, తాత్త్వికుడంటే  తెలియని దాని (noumenon,  thing-in-itself) గురించి విచారణ చేసేవాడు. వేదాంతి తెలిసినదాని ( phenomenon) గురించి విచారణ చేస్తాడు. సృష్టి ఎలా జరిగింది ఎలాగూ తెలియదు.( ఈ సృష్టిరహస్యవిషయం భౌతికశాస్త్రం (physics) , అధిభౌతికశాస్త్రం  (metaphysics) , వీటి మధ్య తిరుగుతూంటుంది, యిటునుండి అటు, అటునుండి యిటు.)  తెలియని దానిని గురించిన  భిన్నాభిప్రాయాలనే  దర్శనాలు ( systems) అంటున్నారు.
    మరొక విభాగం కూడా ఉంది, ఫిలాసఫీ (వేదాంతం),మెటఫిజిక్స్  (తత్త్వశాస్త్రం).అంటే,ఫిలాసఫీ అన్న పదం సముదాయార్థంలోను,ప్రత్యేకార్థంలోను ( తెలియని దానికంటే వేరుచేస్తూ, తెలిసినదాని విచారణ) కూడా వాడుతున్నారు.]

     కనుక,తెలిసిన యీ సృష్టితో ఎలా వ్యవహరించ వలె అనేది వేదాంతవిషయం.ఈ సృష్టివిషయంలో  మూడువిధాల స్పందన మనం వింటుంటాం .ఒకటి, “యీ సృష్టి  మనం చేసినది  కాదు. ఎవడో సృష్టించి మన మీద ప్రయోగించాడు. మనం పరాధీనులం కనుక, యిక్కడి కష్టాలు పడదాం.ఆ పై వాడు కరుణించి పైలోకంలో మనలను దయజూస్తాడు”, అని శరణాగతి చెందడం.ఇందులో, యీ లోకానికి విలువ లేదు, యిది కేవలం పరలోకప్రయాణీకులు  “వేచియుండు గది.” ఈ వర్గంలో క్రైస్తవ ఇస్లామ్ వైష్ణవ మొదలైన ద్వైతమతాలన్నీ  వస్తాయి.మరి కొందరంటారు “ ఈ జీవితం మనకు విధించబడింది .దాన్ని గురించి సణగడమెందుకు? కష్టమే యిష్టమని అనుభవిద్దాం ( stoics)” .  మరి కొందరికి,  మన ప్రమేయం లేకుండా దీనిని సృష్టించి,మనమీద ప్రయోగించినవాడిపై,వాడి సృష్టిపై  కోపం, బాధ, తిరుగుబాటు, నిస్పృహ కలుగుతాయి. వీటికి  గుర్తింపు యిచ్చి, పేర్లు  పెట్టినవారు యీనాటి అస్తిత్వవాదులు అసంబద్ధవాదులు.
    నీచ అంటాడు, యింతకాలంగా యిన్ని విధాలుగా సృష్టికి స్పందించారు కాని, నిందించని తాత్త్వికుడూ ఒక్కడూ  లేడా? ఈ సృష్టిలో ఆనందంగా బతుకవచ్చు అన్నవాడొక్కడూ లేడా? ఎప్పుడో తత్త్వశాస్త్రం పుట్టకముందు, ఎపిక్యూరస్ అన్నాడు.(ఎపిక్యూరస్ గురించి సాధారణ అభిప్రాయం, “ తిను తాగు సుఖమనుభవించు” అన్నది అతని వేదాంతమని. ఇది అతని తత్త్వాన్ని గురించిన వాస్తవం కాదు. ఈ విషయం మరో సారి చూద్దాం.) అతని తరువాత,   వేదాంతి అంటే విషమో ఆముదమో  తాగిన ముఖం వేసుకుని కూర్చునేవాడేనా? జీవితమంటే ఏడుపు ముఖం యీడుపు కాళ్ళా?  వేదాంతంలో  నవ్వుపై  నిషేధమా? నీచ మొదటి రచన “The Birth of Tragedy”. అందులో,జీవితాన్ని ఒక నాటకంగా భావించమంటాడు. నాటకంలో  నటులకు  కథారచనలో స్వాతంత్ర్యం ఉండదు. కాని, కథలోని కష్టసుఖాలతో సంబంధంలేకుండా,నటించి  జీవితాన్ని  కళాత్మకము రసమయము  చేసుకుంటారు. మనిషి అలాగే జీవించాలి, అంటాడు నీచ.
     అయితే యింతకాలంగా వచ్చిన తాత్త్వికులందరికీ, ఆనందంగా జీవించడం సాధ్యమే అన్న ఆలోచన ఎందుకు కలగలేదు? వారందరిదీ ద్వైతదర్శనం. “నేను వేరు, యీ సృష్టి వేరు.దీన్ని వేరెవడో  సృష్టించి నా మీద ప్రయోగిస్తున్నాడు”,  అన్నపుడు, కోపము, బాధ, నిరాశ  కలుగుతాయి. నీచకు కలగక పోవడానికి కారణం, అతడిది ద్వైతదర్శనం కాదు.అతడు అద్వైతి.ఈ సృష్టి ఒక కల. నీ కల మరొకడి సృష్టి కాదు. నీ కల నీవే కంటావు.దానిలోని కష్టసుఖాలు స్వయంకృతాలు, వాటికి వేరెవరో కారణం కాదు. నీచ ప్రధానరచనలలో ఒకటి, The Gay Science.ఇది చిన్న చిన్న వచనఖండాలరూపంలో ఉంది. అందులోనుండి ఒక ఖండం:

  “54. Consciousness of Appearance: Appearance is for me that which lives and is effective and goes so far in its self-mockery that it makes me feel that this is appearance and will-o'-the-wisp and a dance of spirits and nothing more--that among all these dreamers. I too. who "know/' am dancing my dance; that the knower is a means for prolonging the earthly dance and thus belongs to the masters of cere- mony of existence; and that the sublime consistency and inter- relatedness of all knowledge perhaps is and will be the highest means to preserve the universality of dreaming and the mutual comprehension of all dreamers and thus also the continuation of the dream....”

మనకు వెంటనే గుర్తు వచ్చేది “విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా…”. ఈ సృష్టి ఒక కల వంటిది.మన లోపలిది, “నిజాంతర్గతం”. మనకు తెలియని మన పూర్వవాసనలే దీనిని కల్పించాయి.వాడెవడో మనపై కసితో సృష్టించింది కాదు.  ఇది కల అని తెలిసికూడా, మనం కల కనవలసిందే, కలను కళగా భావించి.ఈ కల,  కాంట్ ( Kant) అన్న ట్టు, ఒక తెర కాదు, తెర తొలగించి దాని వెనుక వాస్తవమేదో ( thing-in- itself)  దర్శించడానికి.తెరమీదిదే వాస్తవం, ( thing-in- itself). అంటే, నీచ అచ్చం  అద్వైతం మాట్లాడుతున్నాడు.ఇప్పుడు అతడి ప్రసిద్ధవాక్యం, “దేవుడు మరణించాడు” ( “God is dead” )  చూద్దాం.
    “దేవుడు మరణించాడు” అన్న వాక్యం విన్నప్పుడు,  మనలో  పెద్దవయసువారికి,   సాధారణంగా గుర్తువచ్చేది ఏమిటి? టి.వి.రాని రోజుల్లో, మెరుపువార్త ఏదైనా అందినప్పుడు, వార్తాపత్రికలు అప్పటికప్పుడు నిమిషాలమీద ప్రత్యేక పత్రిక అచ్చువేసేవారు. 1953 లో, ఒక రోజు సాయంకాలం నేను మద్రాసులో మౌంట్ రోడ్డులో (అన్నా శాలై,  చెన్నై)  నడుస్తున్నా. వార్తాపత్రికలమ్మే పిల్లలు చంకలో పత్రికల కట్ట, ఒక పత్రిక కాపీ చేత్తో గాలిలో ఊపుతూ, స్టాలిన్ పోయాడు అని అరవంలో అరుస్తున్నారు. బొగ్గునలుపు, రాక్షసబొగ్గంత పెద్ద అక్షరాలు, Stalin Dead, ( మధ్యలో “is” లేదు,God is dead లో లాగా.) నేను మద్రాసులో ఉన్నాను కాబట్టి వెంటనే వార్త తెలిసింది నాకు.మా ఊళ్ళో యీ రోజు పేపర్ రేపు వచ్చేది.మరి, అరణ్యాలలో ఆశ్రమవాసులకు వార్తలు ఎప్పటికి చేరుతాయి? దేవుడు  ఎప్పుడో చచ్చిపోయాడని వాళ్ళకు ఎన్ని కాంతిసంవత్సరాల తరువాత వార్త అందుతుంది?( “Could it be possible! This old saint in the forest hath not yet heard of it, that God is dead!": Thus Spoke Zarathustra: A Book for All and None: Prologue, part 2) పాపం, దేవుడు యింకా బతికే ఉన్నాడనుకొని, వాళ్ళు ఆయనకోసం తపస్సు చేస్తూనే ఉంటారు!
     పేపర్లు అమ్మే ఆ పిల్లవాడికి పాపం, స్టాలిన్ మీద ఏం కోపం ద్వేషం లేవు. అలా అరిస్తే, పది పేపర్లు  అమ్ముడుపోతే ఒక పావలా మిగులుతుంది.నీచకు కూడా పాపం, దేవుడిమీద  ఏమీ ద్వేషం లేదు, పగ లేదు.ఆయన “కథ మనం కొంటే”  చాలు, ( buy his story).
   ఇంతకూ, ఏమిటా కథ?

“God is dead. God remains dead. And we have killed him. How shall we comfort ourselves, the murderers of all murderers? What was holiest and mightiest of all that the world has yet owned has bled to death under our knives: who will wipe this blood off us? What water is there for us to clean ourselves? What festivals of atonement, what sacred games shall we have to invent? Is not the greatness of this deed too great for us? Must we ourselves not become gods simply to appear worthy of it?”

(The Gay Science (German: Die fröhliche Wissenschaft) or The Joyful Wisdom)


(ఈ వాక్యం మొదటిసారి అతడి The Gay Science లో కనిపిస్తుంది.( ఆ తరువాత అదే గ్రంథంలో యీ వాక్యాన్ని సవరించి “పాతదేవుడు మరణించాడు”,అన్నాడు.ఆ సవరణ తరువాత  చూద్దాం.)

 ( ఈ భాగానికి  తెలుగు అనువాదం చేయలేదు నేను.ఆంగ్లానువాదం ప్రసిద్ధం కనుక, మరింత అధికారికంగా ఉంటుందని.)

    సాధారణంగా యీ వాక్యం నాస్తికుడి  నోట వింటాం. అలానే అర్థం  చేసుకుంటాం, వాక్యాన్ని విడిగా  విన్నప్పుడు.  “నేను దేవుణ్ణి చంపేశాను”, అని రాక్షసానందతాండవం చేయడం లేదు నీచ. “ దేవుడు మరణించాడు”, (“...is dead”) అన్న శోకవార్త ప్రకటిస్తున్నాడు. వెంటనే, తరువాతి వాక్యంలో “చనిపోయి ఉన్నాడు”, ( “remains dead”.)  అంటున్నాడు. రెండవవాక్యం పునరుక్తి కాదా? కాదు. నీచను తక్కువ రచయితగా అంచనా వేయవద్దు.( అతడు కవి కూడా.వచనకవి మాత్రమే కాదు, పద్యాలు కూడా రాశాడు. ) వ్యర్థపదం వాడుతాడు అని ఎందుకు అనుకోవలె?  “చనిపోయి ఉన్నాడు”, ( “remains dead”.) అనడం పునరుక్తి కాదు. మనిషిలోని శివం శవంలానే పడి ఉంటుంది. ఆ  శవాన్ని శివుడిగా మార్చుకోడం ఉత్తమపురుషార్థం. అంటే, మనిషి దేవుడిగా ఎదగవలె. అంతవరకు, శవమై పడిఉంటాడు,” remains dead”.ఇది అద్వైతార్థం.క్రైస్తవంలో, యిది పునరుత్థానం, resurrection. నీచ అభిప్రాయంలో యూదుమతగర్భస్రావమే  క్రైస్తవం. క్రీస్తును మనం శిలువమీదినుంచి దించుకొని, మరల పునరుత్థానం చేసుకునేవరకు ఆయన ప్రాణంలేకుండా పడిఉంటాడు, “remains dead”.అంటే,  క్రైస్తవశరణాగతిని అద్వైతంలోకి మారుస్తున్నాడు నీచ, “ఉద్ధరేదాత్మనాత్మానం” అని.
   మరి దేవుణ్ణి చంపింది ఎవరు? దేవుడిది మరణం కాదు.అది హత్య. మనం, మన చేతులతో ఆయన్ను  దారుణంగా చంపుకున్నాం.(“And we have killed him. How shall we comfort ourselves, the murderers of all murderers?”) మనం మామూలు హంతకులమా? హంతకులకు హంతకులం,” the murderers of all murderers”.ఎందుకు? ఎలాంటి వాడిని చంపాం ? ఎలా చంపాం? పరమపవిత్రమైన (“holiest”) దైవాన్ని చంపుకున్నాం . ఆయన సర్వశక్తిమంతుడు, “mightiest of all”.అంత శక్తిమంతుణ్ణి  కూడా చంపగలిగాము అంటే, మన ఆసురశక్తి అంచనా వేయగలమా? ఎలా చంపాం? నెత్తురు కారేదాకా కత్తులతో పొడిచి పొడిచి చంపాం,( “bled to death under our knives”) ఈ చేతులనెత్తురు కడగడానికి ఎన్ని సముద్రాలజలం సరిపోతుంది?(“What water is there for us to clean ourselves?”)  ఈ నెత్తుటి వాసన పోవడానికి ఎంత అరేబియా సుగంధం సరిపోతుంది? ఈ పాపానికి ఏ కొత్త ప్రాయశ్చిత్తం కల్పించాలి?(“What festivals of atonement, what sacred games”)  మానవజాతిని మొత్తం మేక్బెత్ స్థాయికి ఎత్తేశాడు నీచ, పేరు చెప్పకుండా.
     ఈ మాటలు  నాస్తికుడు, లేక  దైవవిద్వేషి  పలికినవి అని ఎవరనగలరు? ఎంత ప్రేమలో  ఎంత పశ్చాత్తప్తహృదయంలో నుండి వచ్చిన మాటలివి? ఈ పాపానికి ఒకటే ప్రాయశ్చిత్తం. “ప్రభువు చనిపోయాడు. ప్రభువు చిరకాలం జీవించుగాక!” (“The king is dead. Long live the king!) దేవుడు చనిపోయాడు. దేవుడు చిరకాలం జీవించుగాక.  “పాత దేవుడు మరణించాడు”( "old God is dead"), కొత్త దేవుడు ప్రతిష్ఠింపబడుగాక.”
    ఈ కొత్త దేవుడు ఎక్కడనుండి వస్తాడు? తిరిగి ప్రతిష్ఠించడం హత్య చేసినవాడి  బాధ్యత.హత్య చేసినవాడే ప్రాణం పోయవలె. అతడే దేవుడు కావలె. (“ Must we ourselves not become gods simply to appear worthy of it?”) అదే అతని పాపానికి  నిజమైన  ప్రాయశ్చిత్తం. “తత్త్వమసి” నుండి “ అహం బ్రహ్మాస్మి”.
     తిరిగి, చైతన్యం సిద్ధవస్తువు కాదు  అన్న యీ వ్యాసప్రారంభవచనం పరిశీలిద్దాం. ఇది, నీచ ప్రతిపాదించిన Ubermensch, (Overman) దగ్గరకు తీసుకెళుతుంది.

                                         (ఇంకా ఉంది)

ఉత్తరవచనం:

కీర్క్ గార్డ్ తాను కవినని ప్రకటించుకున్నాడు.( "గద్యం కవీనాం నికషం వదంతి") కీర్క్ గార్డ్ నిస్సందేహంగా కవి. నీచ కవినని ప్రకటించుకోలేదు కాని పద్యాల ఉత్సాహం ఉంది. “The Gay Science”కు ముందుమాట పద్యాలే, Preludes by Nietzsche(Joke, Cunning, and Revenge).(Gay అనే పదం యిప్పటి అర్థంలో కాదు. “సముల్లాసం”  యిక్కడి అర్థం. అది “సైన్స్” అట! ఈ పుస్తకం పేరు గురించి చాలా చెప్పుకోవలె.మరో సారి.)  పుస్తకం చివరకూడా గేయకవిత్వం చేర్చాడు. “ముందుమాట పద్యాలు”  కొన్ని:




సముల్లాసశాస్త్రం  (  The Preludes :The Gay Science )

1.ఆహ్వానం

వాడి చూడండి,మీ ముందుంచుతున్న సరుకు~
నా వాగ్దానం, యిది మీకు నచ్చుతుంది
ఈ వేళ కాకుంటే రేపు, యీ రోజుకంటే రేపు.
అప్పుడు మీరు  మరికొంత కోరితే,
ఈ విజయం నాకిచ్చే ధైర్యంతో  సరికొత్త సరుకు అరువు తెచ్చి మీముందుకొస్తాను.


2.నా అదృష్టం.

వెదకి విసిగిపోయాను.
కాదని, కనుగొనడం నేర్చుకున్నాను.
ఒక గట్టి గాలి కొట్టి వెనక్కు విసిరేసింది,
ఇక యిప్పుడు గాలి ఎటు విసిరితే అటు.

( గాలిలో అవశమై  ఎగిరే ఎండుటాకును అంటున్నాడా? కాదు. సిద్ధాంతాల కట్టుబడినుండి విడివడి స్వేచ్ఛ పొందడం మొదటి మెట్టు. తరువాత, ఏ సిద్ధాంతానికి విముఖత లేకుండా అన్నిటితో ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళడం, చివరకు  తన సిద్ధాంతాలైనా చివరివరకూ అంటిపెట్టుకోరాదు. నీచ తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకొంటూ వెళ్ళాడు.నావి కదా అని గుండెలకు హత్తుకోలేదు.)

3.ధృతి

నీవున్నచోట లోతుగా తవ్వి చూడు!లోపల ఉంది నుయ్యి.
మూఢులను  ఏడవనీ: అక్కడ ఉందని గొయ్యి.
టాయి.మచ్చుకు:

7.కరపుస్తకం

( మూలంలో  శీర్షిక “vade mecum”,అంటే “నాతో రా” అని అర్థం. Handbook )

నా దారి,  నా మాట నచ్చాయి నీకు. నన్ననుసరిస్తావా?
నీ దారిని నమ్మి నడువు : నా దారికొస్తావు.

8.మూడవ కుబుసం

నా చర్మం పగులుతోంది
నాలోపల పాము కోరికతో రగులుతోంది,
తిన్న మట్టి  ఆకలి రేపింది.
మరింత  మట్టికై  దాహం.
పొదలకు ప్రవాహానికి మధ్య పాకిపోతుంటాను.
దహించే ఆకలి, అయినా ఉత్సాహంతో
తిన్నదే తింటూ: ఓ! మట్టీ! పాముకు పుష్టి!

( మన్నుతిన్న పామును  స్తబ్ధతకు చెబుతారు. కాని,నీచ ఆ మట్టి చాలు, అది నాకు పుష్టి అంటాడు. ఈ ప్రపంచం తినుచున్న మట్టినే తినుచూ హాయిగా బతకొచ్చు, ఎందుకు సణుగుతావు?”, అంటాడు నీచ. ఏ విషయంలోనూ లోకం గురించి సణగవద్దు గొణగవద్దు అనేది నీచ జీవితదృక్పథం.ఉన్నదానితో సరిపెట్టుకో అని అనడం లేదు. ఉన్నదానితో ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించు అంటాడు.)

9. నా గులాబీలు

అవును! మీ వినోదం నా ఆనందం. ఏ ఆనందానికైనా  అదే ధ్యేయం. నా గులాబీలు కోసుకుంటారా?
ఇరుకు దారుల్లో వంగి వెదకాలి, ముళ్ళ కంచెల్లో  తొంగి చూడాలి, మెడలు సాచాలి.
పిచ్చెక్కించడం నా ఆనందం.
పైశునం నా గుణం.
కావాలా నా గులాబీలు?

10.తిరస్కారం

చాలానే ఒలికిస్తాను నేను.
తిరస్కారమనుకుంటారు మీరు.
మీ పానపాత్ర నిండినపుడు
చాలానే ఒలుకుతుంది.
మద్యాన్ని నిందించరు.

11.నా నుడి.

సునిశితము సున్నితము, మందము తీక్ష్ణము, అపరిచితము సుపరిచితము.
పండితుడు పామరుడు కలుసుకునే చోటు.
ఇదీ నేను.మొదటినుండి నేనిలా-
నాలోపల పాము, పావురము, సూకరము సహజీవనం.

12.వెలుగు చెలికాడు

నీ కళ్ళు మనసు భద్రం.
నీడలో నడుస్తూ సూర్యుణ్ణి అనుసరించు

13.జారుడు  మంచు


స్వర్గం,
నేర్చిననర్తకులకు.


16.పైకి

“ఈ కొండ ఎక్కడమెలా?” “ఎక్కు , ఆలోచించకు.ఎక్కినా ఎక్కగలవు.”

28.ఆ పిల్లను చూడు, పందులమధ్య, నిస్సహాయంగా, సుద్దముద్దలా  పాలిపోయిన ముఖం.
ఎప్పుడూ ఏడుపు ఏడుపు.
ఎప్పటికైనా లేచి నడుస్తుందా?
నిరాశ చెందకు! నిట్టూర్పులు ఆపు! త్వరలో నృత్యం చేస్తుంది చూడు, పగలూ రాత్రీ.
కాళ్ళు పనిచేస్తాయని తెలిసింది, యిక తలపై నిలబడి  నిన్ను చూసి నవ్వుతుంది.

29.తారలనంటే అహం

గుండ్రటి పీపా నేను, ఆగకుండా దొర్లకపోతే,
మండే సూర్యుడి వెంటబడే నేను, ఎలా మండకుండా ఉండగలను?

30.పొరుగువాడు

పొరుగువాణ్ణి ప్రేమించను,
అందని దూరంలో అందనంత ఎత్తులో అతడుండాలని.
అప్పుడు కదా,అతడు నా అందమైన తార!

31.ముసుగులో మహాత్ముడు


నీ ఆనందం భరించలేము
దయ్యంలా జడలు ధరించు
దయ్యంలా  మాటాడు  దయ్యంలా వెయ్యి వేషం.
ఎన్ని వేషాలు వేసినా ఏం లాభం?
నీ చూపులో  వేలుపుల  వెలుగు.

32.బద్ధుడు


ఆగి చెవి ఒగ్గుతాడు:ఏమి వినబడుతోంది వాడికి?
వాడి చెవుల్లో  ఏమిటా  రొద?
ఎందుకలా పడిపోయాడు? ఏమిటా చచ్చే భయం?
ఒకసారి  వాడు సంకెళ్ళు మోస్తే,  వాడి వెనుక ఎప్పుడూ సంకెళ్ళ  చప్పుడు


52.పదరచయితలు

నేను చేత్తో మాత్రమే రాయను.నా కాలు నేనూ ఓ చేయి వేస్తానంటుంది.
స్థిరంగా స్వేచ్ఛగా నా పాదాలు ధైర్యంగా పరుగెత్తుతాయి
పుటలపై పచ్చికపొలాలపై.

39.వేసవిలో

చెమటలు పట్టిన శ్రమలో, ఏమీ తినవద్దంటాడు తెలిసిన వైద్యుడు.
మిణుకుతూ కనుగీటు కృత్తిక  ఏమంటోంది ?
మద్యం చుక్కతో సేదదీరమంటోంది.

40.అనసూయ

అతడి చూపులో అసూయ లేదు:  అందుకు నీవతన్ని మెచ్చుకుంటావు.
నీ మెప్పు అతనికి పట్టదు.
అతడిది గద్ద చూపు దూరపు  వస్తువుపై.
నిన్ను చూడడు.నక్షత్రాలపై దృష్టి.

41.హెరాక్లిటస్ తత్త్వం

సంతోషానికి  పురిటినేల  యుద్ధభూమి.
మందుగుండును మించి  స్నేహానికి  లేదు మందు.
నలుగురిలో ముగ్గురుమిత్రులు, ఆపదలో ఆప్తులు,
పగవాడితో పోరులో  ఒక్కటవుతారు.
మృత్యుముఖంలో ముక్తులు.

42.నాగరికసూత్రం

మునికాళ్ళపై నిలిచి చూడు, మోకాళ్ళపై పాకకు.
తాళరంధ్రంలోంచి గమనించు, తెరచిన తలుపులోంచి కాదు.

44.వేళ్ళూనినవాడు

పండితుణ్ణంటారా? నా కటువంటి ప్రతిభ లేదు.
నేను కొంచెం బరువు, అంతే.
నేను పడిపోతుంటాను, పడిపోయి పడిపోయి అట్టడుగును అందుకుంటాను.

59. కలం గీకుతుంది

నా కలం ఏదో గీకుతూనే ఉంటుంది.నరకం!
ఇలా గీకుతూ ఉండడం నా విధిరాతా?
ధైర్యంగా బుడ్డిలో ముంచి పెద్ద పెద్ద ఏరులు రాసేస్తా.
చూడు! ఎలా నిండుగా  స్వచ్ఛంగా పారుతోందో!
నేను గీచిన ప్రతి గీతా ఎలా సఫలమవుతోందో చూడు!
రచన స్పష్టంగా లేదు, నిజమే-
అయితేనేం? నేను రాసింది ఎవడూ చదవడుగా!

60.ఉన్నతులు

అతడు చాలా పైకి ఎక్కాడు.మెచ్చుకోవలసిందే.
కాని, ఆ యింకొకడున్నాడు, అతడు పైనుంచే వస్తాడు.
నీ మెప్పు అంత పైకి వెళ్ళి అతన్ని అందుకోలేదు.
అతడు తరణికిరణం!

61.నిత్యశంకితుడు

నీ  జీవితం సగం ముగిసింది.గడియారం ముల్లు కదులూతూనే ఉంది.చాలా తిరిగావు, ఎంతో వెదికావు.ఏమీ దొరకలేదు-
నీ ఆత్మ వణుకుతోంది ! యిప్పుడీ విచికిత్స.
నీ  జీవితం సగం ముగిసింది.బాధలో తప్పటడుగుల్లో ఎలా కాలం పాకింది!
ఎందుకు వదిలెయ్యలేవు?
సరిగ్గా అదే తెలియాలి నేను. ఇదంతా ఎందుకు?




62.చూడండి యీ మనిషిని

అవును! నాకు తెలుసు నేనెక్కడి వాడినో!
ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ  వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు, నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు.


(జర్మన్ మూలంలో  యీ పద్యానికి శీర్షిక “Ecce homo”  ("behold the man", Classical Latin: [ˈɛkkɛ ˈhɔmoː]) జీసస్ ను శిలువ వేసేముందు, అతని తలపై ముళ్ళకిరీటం ఉంచి, జనాలకు ఆయనను చూపిస్తూ,  పోంటియస్ పైలెట్ అన్న మాటలు. )

63.తారల నీతి

తారాపథంలో తిరగాలని నీకాదేశం. నీకెందుకు చీకటి చింత?
బ్రహ్మానందంలో సాగనీ నీ భ్రమణం మా మానవ జీవితాల దుఃఖాలు యిలా సాగనీ.
సుదూరలోకాలకు పంచు నీ ప్రకాశం.జాలి పనికిరాదు నీకు, పాపంలా  ఉచ్చాటన చెయ్.
కాని, ఒక తప్పరాని నియమం,  స్వచ్ఛంగా ఉండు.































                                     








                                     






































 Thus Spake Zarathustra




































             













Beyond Good and Evil (1886)
( పుణ్యపాపాలకవతల)





   


















  “అవిద్యయా మృత్యుం తీర్త్వా”


PREFACE (ముందుమాట):

సత్యం ఒక స్త్రీ అనుకుందాం.అప్పుడు ఏమవుతుంది? సత్యాన్ని ప్రేమించే తాత్త్వికులు స్త్రీని అర్థంచేసుకోలేదన్నట్టే  కదా? వీళ్ళ గంభీరమైన ముఖాలు,వీళ్ళ వికృతపు అభ్యర్థనలు-వీళ్ళకా ఆమె వశమవుతుంది? ముమ్మాటికీ ఆమె  వీళ్ళను గెలుచుకోనివ్వలేదు.స్త్రీని గెలుచుకొనే కళలేవీ వీళ్ళకు తెలియవు.ఈ కాలంలో ఏ సిద్ధాంతం అయినా,ఆ సత్యం  ముందు ఏడుపుముఖం  యీడుపుకాళ్ళు…అలా అని యీ సైద్ధాంతికులపట్ల మనం కృతఘ్నత చూపవద్దు- ఉదాహరణకు, ఆసియా వేదాంతము, యూరప్ లో ప్లేటో వాదము…

Aphorism (వచనం)  1:

సరే, మనకు సత్యం కావాలి. పోనీ, అసత్యం ఎందుకు వద్దు? అనిశ్చయం? అజ్ఞానం కూడా పనికిరాదా ? సత్యం విలువ ఏమిటి  అనే ప్రశ్న మన ముందు నిలిచింది. లేక, మనమే దానిముందు నిలబడ్డామా?ఇక్కడ ఈడిపస్ ఎవరు? స్ఫింక్స్ (Sphinx)  ఎవరు?

విలువల వైరుద్ధ్యం తాత్త్వికుల మూలవిశ్వాసం. “ ఏదైనా దాని విరుద్ధవస్తువునుండి ఎలా  రాగలుగుతుంది? ఉదా. అసత్యంలోనుండి  సత్యం?వంచనలోనుండి సత్యాన్వేషణాసంకల్పం ? సత్యము, సత్యాన్ని తెలుసుకోవాలి అన్న కోర్కెకూడా ఏ నిత్యమైనసత్యలోకంలోనో , దాగినదేవుడిలోనో  కలగగలవు తప్ప, యీ మిథ్యాప్రపంచపు పెంటకుప్పలోనా ?”, అంటారు తాత్త్వికులు.

Aphorism (వచనం) 2:

ఒక అభిప్రాయం అసత్యమైతేనేం?  అది మాకు అభ్యంతరం కాదు.ఇక్కడే మా కొత్త భాష వింతగా అనిపిస్తుంది.అసలు  ప్రశ్న ఏమిటంటే, ఒక అభిప్రాయం జీవితాన్ని  ఎంత ముందుకు నడిపిస్తుంది, ఎంతగా జీవితాన్ని కాపాడుతుంది, ఎలా జాతిని నిలుపుతుంది, జాతిని పెంచుతుంది, అనేది. మా నమ్మకం ఏమిటంటే, అత్యంతము అసత్యమైన అభిప్రాయాలు ( యీ అసత్యంలోవే విజ్ఞానశాస్త్రవిశ్వాసాలు కూడా , the synthetic judgments a priori ) మనకు అత్యంతము అనివార్యమైనవి.ఈ హేతుబద్ధమైన కల్పనలను స్వీకరించకుండా,  నిత్యము శాశ్వతము అయిన కేవలం ఊహానిర్మితప్రపంచాన్ని వాస్తవంతో పోల్చకుండా, సంఖ్యలతో ప్రపంచాన్ని మిథ్యాభూతం చేయకుండా, మనిషి జీవించలేడు.అసత్యమైన అభిప్రాయాలను సన్యసించడమంటే జీవితాన్ని సన్యసించడమే, జీవితాన్ని కాదనడమే.నిజమే, అసత్యాన్ని  జీవితసత్యంగా గుర్తించమంటే... సాంప్రదాయిక విలువలను దోషిగా నిలబెట్టి ప్రశ్నించడమే.ఒక తత్త్వదర్శనం ఆ విధమైన దోషారోపణ చేసిందంటే,అది ప్రమాదకరమైనచర్యే. కాని అలాటి సాహసం చేయగల తత్త్వదర్శనం మాత్రమే పుణ్యపాపాలను దాటగలదు.

                                               ***
వ్యాఖ్య:

మనం అప్పుడప్పుడూ అబద్ధాలు చెపుతాం, మరొకడు చెప్పింది అబద్ధమని తెలిసి, మన అవసరానికి,  నిజమని నమ్మేస్తాం. కాని యిక్కడ నీచ చేసిన సాహసం,  తాత్త్వికప్రపంచంలో ఊహించడానికి కూడా ధైర్యంచాలని సాహసం! ఈ సమస్త జగత్తుకు అబద్ధమే ఆధారం అంటున్నాడు! అబద్ధం లేనిదే బతకడం అసాధ్యం అంటున్నాడు. విజ్ఞానశాస్త్రవిశ్వాసాలు కూడా ( ‘the synthetic judgments a priori’) అసత్యాధారితాలే, వాటిని నోరుమూసుకుని ఒప్పేసుకుంటున్నాం కదా”, అంటున్నాడు.

[‘the synthetic judgments a priori’ అంటే గణితశాస్త్రంలోనూ  భౌతికశాస్త్రంలోనూ ఋజువు లేకుండా మనం నమ్ముతున్న  సత్యాలు. ఫలానారోజు సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో వస్తుందని సంవత్సరం ముందు చెబుతారు.మనం నమ్ముతాం. కాని ఎలా నమ్మగలుగుతున్నాం? వర్షం పడుతోంది అని ఎవడైనా  అంటే, నిజంగా పడుతోందో లేదో, కిటికీలోనుండి చేయి బయటపెట్టి చూసి “అవును,వర్షం పడుతోంది”, అంటాం. మరి  ఏడాదికో పదేళ్ళకో ఫలానారోజు గ్రహణం అంటే, ఆ రోజు వచ్చేదాకా, మనం గ్రహణం చూసేదాకా,  నమ్మకూడదు కదా? గ్రహణం నిజంగా వస్తుందో  రాదో తెలుసుకోడానికి వీలులేని నిర్ణయాన్ని నమ్ముతున్నాం, శాస్త్రీయమని. అంటే, అబద్ధం అవునో కాదో తెలియరాని విషయాలు మనం నిజమని నమ్మడం బతుకులో భాగం. నమ్మకపోతే,బతుకు అసంభవం అవుతుంది. ఈ నమ్మకాలనే  కాంట్ (Immanuel Kant) synthetic a priori judgments అంటాడు.ఇది  ఆయన తత్త్వశాస్త్రంలో చాలా ప్రధానమైన తార్కిక తాత్విక సిద్ధాంతం.ఈ సిద్ధాంతాన్ని ఆధారంచేసుకుని నీచ మొత్తం తాత్త్వికసత్యసౌధాన్నే కూలగొడుతున్నాడు.]

ఇంతకూ నీచ ఏం చెప్ప దలచుకున్నాడు? దేవుడు లేడు అన్నాడు( God is dead) . పోనీ అనుకున్నాం.సత్యమే దేవుడు కదా, (“సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ”అని ఉపనిషత్తు.) సరిపెట్టుకుందాం అనుకున్నాం.ఇప్పుడు “సత్యం కూడా అక్కరలేదు, అసత్యమే అక్కర; సత్యం వద్దు, అసత్యమే ముద్దు”, అంటున్నాడు.అసలేమిటి యితని ఆశయం?

అసత్యమే “సత్యం”  అనడంలేదు నీచ.అలా అంటే, కుడికాలితో తోసేసిన సత్యాన్ని ఎడమకాలితో  లోపలికి లాక్కోడమే అవుతుంది. అసత్యమే సత్యమవుతుంది.భౌతికవాదులు, శూన్యవాదులు, యింకా అనేకులు నాస్తికులమని చెప్పుకునేవారు నిజంగా ఆస్తికులే, వారు సత్యమనేది వేరు, కాని వారు నమ్మేది వారు సత్యం అనుకునేదే. కాని నీచ ఆశయం అది కాదు.ఈ సత్యం వద్దు , మరో (అ)సత్యం మంచిది అనడం లేదు. అతడికి సత్యమా అసత్యమా అన్నది అప్రధానం. ఏ అభిప్రాయాన్ని అయినా స్వీకరించాలా తిరస్కరించాలా  నిర్ణయించవలసింది, అది  జీవితాన్ని ముందుకు నడిపిస్తుందా, జీవితం మెరుగుపరుస్తుందా? ఇది ముఖ్యం.

ఇక్కడ నీచ కూడా శ్రద్ధను చెబుతున్నాడు. ఇది కీర్క్ గార్డ్ చెప్పే భగవంతునియందు శ్రద్ధ కాకపోవచ్చు.కాని దాని ధర్మాలు దీనికి ఉన్నాయి. శ్రద్ధ యిది సత్యమని నిర్ధారించదు. శ్రద్ధలో శంక అంతర్భాగం. అనేక మార్గాలుంటాయి.ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించుకోవలసింది నీవే. సత్యమొకటే, కాని దానికి  దారులనేకం.ఆ దారులు అసత్యపు దారులుకూడా కావచ్చు.

నీచ సత్యాన్ని కాదనడం లేదు. అసత్యం కూడా ఒక జీవనసాధనం అంటున్నాడు. ఉపనిషత్తుకూడా యిదే కదా అంటుంది? సంసారరూపమైన మృత్యువును తరించడానికి అవిద్య మార్గమని ( “ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యాయామృతమశ్నుతే.” ఈశ.ఉప.అవిద్య అంటే అజ్ఞానం.)

ఈ సత్యాసత్యచర్చ నీచ దర్శనంలో మరో ముఖ్యాంశంతో ముడిపడి ఉంది. నీచ, వైరుద్ధ్యాలను ఒప్పుకోడు. పుణ్యపాపాలుకాని, సత్యాసత్యాలుకాని ఒకదానికొకటి విరుద్ధం కావు.అవి ఒకే రేఖపై రెండు బిందువులు, రెండు స్థానాలు, రెండు స్థాయిలు. సత్యాసత్యాలుకూడా సాపేక్షాలు (relative) .మెలకువలో కల అసత్యం. కలలో మెలకువ అసత్యం.

స్వామి వివేకానందుడు అన్నాడు: “ అసత్యం ఒక స్థాయిలోని సత్యం. కింది సత్యంనుండి పై సత్యానికి నడవాలి.” అదే “అసతో మా సద్గమయ”.సత్యానికి నడిపించేది అసత్.సత్యపదం చేరేవరకు అసదాలంబనం అనివార్యం.

ఇదే చెబుతున్నాడు నీచ.అందుకే ముందుగా, ప్లేటోకు వేదాంతానికి ఒక నమస్కారబాణం వదిలాడు.


-Arguing that untruth is sometimes a condition of life implies that truth is also sometimes a condition of life. It is undeniable that knowing the "truth" of where a cliff begins and ends can be very life-enhancing!


































No comments:

Post a Comment