Sunday, June 30, 2019

శ్రీయనగౌరినా

పేరులో ఏముంది?  

  'ఒకప్పుడు శివశబ్దం వినబడితే "హరి హరి" అని చెంపలు వాయించుకునే వారు కొందరు.మరి కొందరు, హరిశబ్దం చెవిసోకితే "శివ శివ" అంటూ చెవులు మూసుకునే వారు.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ కాలంలో హరిహరులకు అద్వైతం. హరి, శివ - ఏ శబ్దం వినబడినా చెంపలు వాయించి చెవులు మూస్తారు.'
      ఇది కొంత కాలం క్రితం నేను ఒక కవి కోరగా ఆయన  కవితా సంపుటికి రాసిన ముందు మాటలోని మొదటి వాక్యాలు.కాని ఆ మాటలలో హాస్యం ఉన్నదో లేదో కాని, ఆశించిన సత్యం లేదనిపిస్తోంది.  జాతిని చీల్చడానికి పనికొచ్చే  వైరభక్తి కంటే నాస్తికత మేలనుకొన్నాను. కాని నాస్తికాద్వైతం నేనాశించినంత ప్రబలంగా వ్యాపించలేదు. జాతిని చీల్చడానికి పనికొస్తే , నాస్తికతను ఆగమని, హరిహరులను వాడుకోవచ్చు  అన్న  అనాది భక్తిసూత్రం యింకా పని చేస్తూనే ఉంది. ఈ వీరవైరభక్తి  జాతిని చీల్చడానికి బలమైన సూత్రంగా యుగయుగాలుగా  పనిచేస్తూనే ఉన్నది.  ఆంధ్రమహాభారత రచనను కొనసాగించడానికి మహాకవి  తిక్కన తొలగించుకోవలసి ఉండిన పెద్ద అడ్డు  ఈ  వైరభక్తియే  అని మనకు తెలుసు. అందుకోసం ఆయన ఉన్న దేవుళ్ళు చాలరన్నట్టు , రెండు విగ్రహాలు కరగించి, కొత్త పోతలో ఒక  కొత్త వింతమూర్తిని  సృష్టించి యిచ్చాడు. (కరగించి కొత్త పోతలు పోసే 'రస'విద్యలో ఆయన గట్టి.(" ఒక్కటి కాగ కరగిన గట్టియనగ")ఆ  compound god  కు మరో compound goddess ను కూడా సృష్టించవలసివచ్చింది.

శ్రీయన గౌరి నాఁ బరఁగు  చెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరం బగురూపము దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని  పల్కెడు భక్తజనంబువైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చుపరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్‌.

"విష్ణురూపాయ నమశ్శివాయ". విష్ణు రూపంలో ఉన్న శివునకు నమస్కారము. శివునిహృదయంలో విష్ణువు, విష్ణువుహృదయంలో శివుడు ఉంటాడని అనాదిగా నిత్యమూ జపం చేస్తూనే ఉన్నది ఈ జాతి. ఆయనకు రెండు పేర్లు. ఆయన  భార్యకుకూడా శ్రీ అని గౌరి అని రెండు పేర్లు . ఇద్దరున్నారన్న ద్వైతంలో భయం ఏర్పడుతుంది. "ద్వితీయాద్వై భయం భవతి"  అని కదా అంటున్నది ఉపనిషత్తు. ఆ భయము అభద్రతాభావము తొలగించగలిగిన హరిహరుడు "భద్రాయితమూర్తియై" సాక్షాత్కరిస్తున్నాడు జాతికి.
           కాని,మహాకవి సృష్టించిన  ఈ మూర్తి ఎంత "గట్టి"  ? అదీ కాలగర్భంలో కరిగిపోయింది. సృష్టిలో ఎప్పుడూ రెండవది లేకుండాపోదు,ఎప్పుడూ పోదు.పోవలసింది, రెండవది ఉన్నది అన్న దృష్టి.అది ఉన్నంతకాలం శివకేశవులే కాదు,  విడదీయరాని అర్థనారీశ్వరులుకూడా విడిపోతారు, శివసేనగా  గౌరీసేనగా.
       ఆత్మీయత లోపించడమే అభద్రత.

No comments:

Post a Comment