Sunday, June 30, 2019

బోద్ లేర్: గుడ్లగూబలు Les Hiboux

బోద్లేర్ కవిత " గుడ్లగూబలు"పై ఇటీవల నేను రాసిన వ్యాసాన్ని  పరిష్కరించి యిక్కడ తిరిగి ప్రచురిస్తున్నాను.

"యా నిశా సర్వభూతానాం"

గుడ్లగూబలు:బోద్ లేర్

నల్లని యూ చెట్ల నీడన
గుడ్లగూబలు బారులుతీరి ఉన్నాయి
ప్రవాస దేవతల్లా
రూక్షాక్షులు రువ్వుతూ.అవి ధ్యానం చేస్తున్నాయి.

నిశ్చలంగా నిలిచి నిరీక్షిస్తాయి
విషాదఘడియలు వచ్చేవరకు
వాలుతున్న సూర్యుణ్ణి తోసేసి
చీకట్లు  చిక్కబడి  స్థిరపడతాయి .

 వాటి తీరు చెబుతుంది వివేకికి
 ఈ లోకంలో,  భయపడమని
సంచలనాలకు సంఘర్షణలకు

కదిలిపోయే నీడల వెంటపడేవాడు
ఉన్నచోటునుండి కదలాలనుకున్నందుకు
శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు.

Les hiboux

Sous les ifs noirs qui les abritent,
Les hiboux se tiennent rangés,
Ainsi que des dieux étrangers,
Dardant leur œil rouge. Ils méditent.

Sans remuer ils se tiendront
Jusqu'à l'heure mélancolique
Où, poussant le soleil oblique,
Les ténèbres s'établiront.

Leur attitude au sage enseigne
Qu'il faut en ce monde qu'il craigne
Le tumulte et le mouvement,

L'homme ivre d'une ombre qui passe
Porte toujours le châtiment
D'avoir voulu changer de place.
                      -- Charles Baudelaire: Fleurs du Mal.
చీకటిరాత్రి. శ్మశానము. గుడ్లగూబలు. ఈ  కవిత  చదివిన వెంటనే కలిగే స్ఫురణ, ఇది  నిశిని నిశ్చైతన్యాన్ని,నిశాచరభావాన్ని  చెబుతున్నది, అని . అది మాత్రమేనా?  మరేమైనా కూడా చెబుతున్నదా? వెలుగును ప్రేమించి, యిరులను ద్వేషిస్తూ వచ్చిన కవితను బోద్ లేర్ దారి మళ్ళించాడు, అదృష్టంనుండి  దృష్టం వైపుకు,  శుకపికాలనుండి గుడ్లగూబలవైపుకు, అని అంటారు. అవునా? అలా కనిపిస్తాడు, అంతే. నిదానించి చూస్తే, ఈ కవితలో అశుభదృశ్యం మన ముందుంచి, ఆ అశుభంలో  శుభాన్ని పొదుగుతున్నాడు. దృష్టం నుండి అదృష్టానికి దృష్టి  మళ్ళిస్తాడు  కవి.

"గుడ్లగూబలు"
(Les Hiboux:The Owls)

     ముందుగా గమనించవలసింది, ఈ కవిత శీర్షిక బహువచనంలో ఉంది. అంటే ఇక్కడ గుడ్లగూబ చిత్రం (image)కాదు, ప్రతీక(symbol).దేనికి ప్రతీక? రెండు జీవితవైరుద్ధ్యాలకు-- అశాంతి శాంతి, అంతం అనంతం, మృత్యువు అమరణము, స్థితి గతి.

"నల్లని యూ చెట్ల నీడన"
(les ifs noirs qui les abritent:the dark  yews that shelter them)

నిశాశ్మశాన దృశ్యం. (యూ (yew)చెట్లు శ్మశానంలో ఉంటాయి.) ప్రారంభంలోనే   కవితపై  చీకటి, నల్లని నీడలు పరచుకుంటాయి. కాని నల్లని నీడలు, మృత్యువు నిశి నిశ్చైతన్యాలను సంకేతించినట్టే ఆశ్రయాన్ని కూడా  చెబుతున్నాయి. నీడనివ్వడం ఆశ్రయం యివ్వడమే కదా ( abritent,shelter)?
ఏది విగుణమో అది సగుణం కూడా.శ్మశానంలో ఉండే యూ (yew) చెట్టు  మరణానికి, శాశ్వతత్వానికి కూడా ప్రతీక. కనుక, ప్రారంభంలోనే, కవిత ఆధారం అందిస్తోంది, యిందులో రెండు విరుద్ధముఖాలుంటాయి అని.

"బారులు తీరి"
(se tiennent rangés:sitting in a row)

   'బారులు తీరి' ఒక క్రమపద్ధతిని, సంకల్పాన్ని సంఘటితసంసిద్ధతను చెబుతున్నది.శీర్షికలోని బహువచనం, గుడ్లగూబ వ్యక్తి కాదు అని చెబితే, ఈ " బారులు తీరి"  వ్యక్తిని  ఒక  సంఘటితశక్తిగా ప్రదర్శిస్తున్నది.పగటి ప్రభుత్వాన్ని పడదోసి చీకటిసామ్రాజ్యాన్ని స్థాపించే ఉద్యమసూచన ఉంది.  అలాగే,  ఇందుకు విరుద్ధమైన దృష్టి కూడా. పగటి జీవితంలోని అలజడి ఆందోళన మృత్యుసదృశం; శ్మశానం ఒక ఆరామము, రాత్రి విరామము, అని కూడా సంకేతం ఉంది.

"ప్రవాసదేవతల్లా"
 (dieux étrangers:strange (alien) gods)

ప్రవాసంలో ఉండి అభద్రతతో  భయంతో ఉన్నాయా? లేక,  భయపెడుతున్నాయా? రెండు స్ఫురణలూ ఉన్నాయి. చీకటిసామ్రాజ్యాన్ని అధిష్ఠించి శ్మశానాలను శాసించే దుష్టదైవాలా?  తెలిసిన ముఖాలు కావు, లోకసామాన్యం ఉపాసిస్తున్న దేవతలు కావు. ('నేదం యదిదముపాసతే'.కేనోపనిషత్తు.) కొత్త దేవతలు, పరదేవతలు, alien gods. పూర్వదేవతల పరిపాలనను కూలదోసి, అపూర్వదైవవ్యవస్థను సంస్థాపించగోరే దివ్యశక్తులు.

"రూక్షాక్షులు రువ్వుతూ.ధ్యానం చేస్తున్నాయి "
( Dardant leur œil rouge, Ils méditent: Darting their red  eye. They
meditate)

 'బారులు తీరి', స్థితిని చెబితే, 'రూక్షేక్షులు రువ్వుతూ' గతిని చెబుతున్నాయి.  చలద్రక్తారుణాక్షులు. రక్తారుణిమ,  చలనము ఉన్నాయి వాటి చూపులలో. ఈ గుడ్లగూబలు దైవాలా  దయ్యాలా ? వాటి కళ్ళు అజ్ఞానారణ్యాలను కాల్చివేసే అగ్ని గోళాలు, చూపులు  శ్మశానతామసాన్ని దహించే యోగాగ్ని, Blake కవితలోని పులి కళ్ళలాగా. (' Tiger!Tiger! Burning bright!/In the forests of the night!') అట్లాగే, "రువ్వుతూ" చలనాన్ని అస్తిమితాన్ని చెబితే, వెంటనే  స్తిమితాన్ని సూచించే అచలధ్యానం, medite. ఈ ధ్యానానికీ  రెండర్థాలుండవచ్చు. ప్రణాలిక పన్నడం కావచ్చు, అంతర్ముఖసాధన కావచ్చు. అలజడిని సృష్టించడానికి రహస్యమంతనమా, పగలు సంకేతించే అలజడి ఆందోళనలను కూలదోసి స్థిరశాంతిని సంస్థాపించే  ఆలోచనా?

"నిశ్చలంగా నిలిచి నిరీక్షిస్తాయి"
(Sans remuer ils se tiendront:
motionless, they hold themselves )

నైశ్చల్యము, నిరీక్షణ కూడా  రెండు అర్ధాలు యివ్వగలవు. దౌష్ట్యానికి దివ్యశక్తులకు కూడా ఈ రెండు లక్షణాలు ఉంటాయి. దుష్టవ్యూహరచనచేసేవారు నైశ్చల్యమవలంబిస్తారు, వారి కదలికలు ఎవరినీ గమనించనీయరు. విప్లవానికి అనువైన సమయంకోసం నిరీక్షిస్తారు. అట్లాగే,దివ్యసాధన, దేవతావాహన కూడా నిశ్చలస్థితిలోనే, నివాతదీపంలా, సాగుతుంది. పగటిపూట సచేతనము  క్రియాత్మకము అని మనం సాధారణంగా అనుకునే వ్యర్థవ్యాపారాలనుండి విరమించి నిష్క్రియస్థితిని ") అవలంబించడాన్నే భగవద్గీత చెప్పింది కూడా. ప్రాణిసామాన్యానికి అది నిశ, నిద్రాసమయం.సంయమికి అది మెలకువ.( 'యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ/ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే:'.గీత.2.69.)

'విషాదఘడియలు'
(l'heure melancolique:the melancholic hour )

" విషాదం" కేవలం అశుభాన్ని చెప్పడం లేదు. శమితస్థితిని కూడా చెబుతున్నది. అంతర్ముఖత్వం ఆధ్యాత్మికత ధ్యానోన్ముఖత  కూడా "విషాదం"లో  స్ఫురిస్తాయి.

"వాలుతున్న సూర్యుణ్ణి తోసేసి
చీకట్లు చిక్కబడి స్థిరపడతాయి"
(...poussant le soleil oblique,
Les ténèbres s'établiront:
pushing the slanting sun
the dark night establishes itself.)

వెలుగును ద్వేషించే శక్తులు పడిపోతున్న సూర్యుణ్ణి ఒక తోపు తోసి, తమ సామ్రాజ్యాన్ని సంస్థాపించుకుంటాయి, ఇక తమదే రాజ్యమని. ఇది ప్రకటార్థం. దీనికి  మరో ముఖం. బయటి వెలుగు లేని లోకానికి చీకటిరాత్రి, కాని  సంయమికి అది ఆత్మప్రకాశం. తన వెలుగులో దారి చూసుకొని నడుస్తాడు. అక్కడ సూర్యుడు వెలుగడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, వెలిగించుకోడానికి అగ్గిపుల్లా లేదు. ('న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం ...' కఠోపనిషత్తు.)

 వాటి తీరు చెబుతుంది వివేకికి
 ఈ లోకంలో,  భయపడమని
సంచలనాలకు సంఘర్షణలకు.
(Leur attitude au sage enseigne
Qu'il faut en ce monde qu'il craigne
Le tumulte et le mouvement:
Their attitude teaches the wise
That in this world, one should be weary
Of tumult and movement.)

"Craindre",to be afraid of. అంటే, మెలకువగా, అప్రమత్తంగా, ఉండడమని. ఎవరికి చెబుతున్నాయి, ఈ గుడ్లగూబలు? "au sage", వివేకికి, గ్రహించగలిగిన వివేకం కలవాడికి.  ఏమిటి చెబుతున్నాయి? ఉద్యమాలకు ఆందోళనలకు దూరంగా ఉండమని. పగటి అలజడి ఆందోళన ఆగి, రాత్రిపూట స్తిమితస్థితిని పొందడం చెబుతున్నది. బోధిస్తున్నాయట ( "enseigne", teach) గుడ్లగూబలు! ఎట్లా బోధిస్తున్నాయి? మాటలలో పాఠాలు కాదు. వాటి "తీరు" బోధచేస్తోంది. చిన్ముద్ర, మౌనవ్యాఖ్య. ఏమిటి బోధ?

కదిలిపోయే  నీడల  వెంటపడేవాడు
ఉన్నచోటునుండి కదలాలనుకున్నందుకు
శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు.
(L'homme ivre d'une ombre qui passe
Porte toujours le châtiment
D'avoir voulu changer de place.
:the drunken man of the passing shadow
Always carries the punishment
For wanting to change the place.)

గుడ్లగూబల బోధ ఏమిటి? నిత్యానిత్యవస్తువివేకమే వివేకం. పగటిపూట మన వెంటపడే, మనం వెంటపడే నీడలు కదిలిపోయేవి, అశాశ్వతాలు. వాటి వెంటపడేవాడు అనుభవించే  "శిక్ష"కు అంతం ఉండదు.("toujours", always,ever),దానికి పరిహారంలేదు. అలా నీడల వెంటపడనివాడు వివేకి, నిత్యానిత్యవస్తువివేకం  ఉన్నవాడు.వాడికే ఈ గుడ్లగూబల పాఠం.
      ఈ పక్షులు  గురుస్థానంలో ఉండి నడిపిస్తున్న అదృష్టాధ్వగమననిర్దేశకులు,దేశికులు. ("il faut ", one must , అంటూ శ్రుతివచనంలాగా, "ఏతదనుశాసనమ్" అని  శాసిస్తున్నది.) ఒక గురువాణిని, ఒక  ప్రవక్త చేస్తున్న  భవిష్యదర్థనిర్ణయాన్ని ( "s'etabliront", స్థిరపడుతాయి,future tense) కూడా ఈ కవితలో వినవచ్చు.
       బోద్ లేర్ కు భగవద్గీతకు ముడిపెట్టడమా, అనవచ్చు.  ఒక ముడి కాదు, మూడుముళ్ళు? అసదృశాలను చేర్చి ముడిపెట్టడమే కదా, కవిత అయినా వ్యాఖ్యానమైనా చేసేది? కవిత ఆధారంగా, కవితలోని పదాలు ప్రమాణంగా సాధించగలిగిన    ఏ అర్థమైనా వ్యర్ధం కాదు,సార్థకమే.
     బోద్ లేర్  ఫ్రెంచికవిత్వచరిత్రలో ఒక కొత్త యుగానికి ప్రవక్తగా ప్రసిద్ధుడు. అతనిది ఒక కొత్త స్వరం.అపస్వరం అని కూడా అన్నారు. అపూర్వస్వరం అపస్వరంగా వినిపించక తప్పదు. అది ఒక మహాకవికి, ఒక యుగకవికి అవసరమైన కావ్యప్రక్రియ. యుగకవి ఒక కొత్త వాణితో బాణితో తనను తాను ప్రకటించుకుంటాడు. కాని మహాకవి ధర్మం అతనిని వదలదు. అతడు సిఫిలిజేషన్ చెప్పబోతే అది  సివిలిజేషనవుతుంది. కోతిని గీయబోతే అయ్యవారవుతుంది. దయ్యాన్ని ఆవాహన చేస్తే  దైవం సాక్షాత్కరిస్తుంది. కావ్యధర్మం అంటూ ఒకటి ఉంటుంది. అది కవిపై, మహాకవిపై మరీ బలంగా, తన బలాన్ని చూపుతుంది. ఈ కవిధర్మం కవిపై ఎంతగా విజయం సాధించగలిగితే, కవిత అంతగా పరిపుష్టమైనట్టు.

No comments:

Post a Comment