Sunday, June 30, 2019

గ్రంథసంగం -

4.గ్రంథసంగం

'ఒరేయ్ గన్నాయ్ , ఏమిట్రా ఆ చేట? అస్తమానం ఆ పొట్టమీద పెట్టుకొని దాని లోపలికి గుడ్లప్పగించి చూస్తుంటావ్? మరో లోకం లేదా నీకు? ఒకే చూపు చూస్తుంటే చేటకు తూటు పడుతుందేమో!'

గన్ను, తలెత్తి ఒక చూపు చూసి, ఒక నవ్వు నవ్వి, మళ్ళీ తల దూర్చాడు తన లోకంలో.

'నేను వెళుతున్నా.ఈవేళ ఎక్కడికెళుతున్నానో తెలుసా? యేల్ యూనివర్శిటీ లైబ్రరీ! ఎప్పుడైనా విన్నావా? '

'వెళ్ళిరా!వెళ్ళిరా!నిన్న ఎక్కడి కెళ్ళానన్నావ్?'

' అదే గుర్తులేదా నీకు? వేస్ట్.మార్క్సిజమ్ పుట్టిల్లు!బ్రిటిష్ మ్యూసియమ్ లైబ్రరీ!'

'సరే సరే! త్వరగా వెళ్ళు.లైబ్రరీ మూసేస్తారేమో? '
........
'ఈ సారి ఎక్కడికి ప్రయాణం?'

నేషనల్ లైబ్రరీ అఫ్ ఫ్రాంస్?బ్యూటిఫుల్ బిల్డింగ్! పుస్తకం చదివితే అక్కడే చదవాలి !'
.........
'అలెక్సాండ్రియా  నుండి వస్తున్నాను.అలిసిపోయానన్నయ్యా!'

'తగలబడిన ఉద్గ్రంథాల బూడిద ఊడ్చడానికెళ్ళావా? '

'నీ మొహం! నీ కేం తెలుసు? అప్పటి లైబ్రరీని మించిన లైబ్రరీ ఉంది యిప్పుడక్కడ! ఎన్ని పుస్తకాలు! ఎన్ని పుస్తకాలు!'

' నెక్స్ట్ ? ఏ దేశం?ఎన్ని లైబ్రరీలు మిగిలిపోయాయి?'

'ఎన్నని? చాలా మిగిలిపోయాయి.నేను చదివిందెంత? టైమ్ లేదు.వెళ్ళాలి.వస్తా.'
..........
'ఎన్ని  దేశాలు తరిగి వస్తున్నావు? ఏమిట్రా ఆ నవ్వు!పొట్ట పగిలేను, జాగ్రత్త!'

' ఆగడం లేదురా గన్నయ్యా, నిన్నటినుండి యిదే నవ్వు. '

'ఎందుకు?'

'మొన్న బ్యూనస్ అయిరిస్ లో లైబ్రరీకి వెళ్ళి ఓ పుస్తకం అడిగాను. అక్కడ లైబ్రేరియన్ ఏమన్నాడో తెలుసా! బాబోయ్ నవ్వాగడం లేదు. ఏమన్నాడో తెలుసా! ఇప్పుడే మీ గన్నన్న వచ్చి ఆ పుస్తకం పట్టుకెళ్ళాడన్నాడు! ఆయనేదో మాంత్రిక కథలు రాస్తాడట. నాకూ ఓ కథ చెబుదామనుకొని ఉంటాడు. బాబోయ్! ఏమి జోక్! '

' ఎవరూ? బోర్హెసా? '

'నీకెట్లా తెలుసాయన పేరు?'

' కుమ్మూ, ఆ లైబ్రేరియన్ ఏమన్నాడో తెలుసా? '

'ఏమన్నాడు?'

'One has seen everything,read every book.Even those written in unknown languages.All books are but one.'

'అలా అన్నాడా! నీ పొట్టమీద  చేటభారతం ఆ 'ఒక్క గ్రంథ'మేనా !మళ్ళీ నవ్వించకు.నా వల్ల కాదు.'

'ఒరేయ్, ఈ చేటలో  లేంది మరెక్కడా లేదు.మరెక్కడేది ఎవడు రాసిందైనా యిందులో ఉంది. నిజమే.కాని, రహస్యం చెప్పనా, కుమ్మూ! ఆ బోర్హెస్ చదివినన్ని పుస్తకాలు భూలోకంలో ఎవడూ చదివి ఉండడు! ఇంకో రహస్యం చెబుతా. నాకూ  అన్నీ చదవాలనే ఉంటుందిరా!'

('యద్వేత్థ తేన మోపాసీద తతస్త ఊర్ధ్వం వక్ష్యామి...'ఛాం.ఉప.7.1.1.)సనత్కుమారుడు నారదుడితో:'నీవేమి తెలుసుకొన్నావో అది చెప్పు.ఆ తరువాతది నేను చెబుతాను.')

No comments:

Post a Comment