Sunday, June 30, 2019

కాళిదాసు-మలార్మె

1.కాళిదాసు:గంగాగౌరీసారూప్యం:మలార్మె.
   
   “కుమారసంభవం” మరో సారి చదువుదామనిపించే కావ్యం.  “రఘువంశం” picture gallery అయితే, “కుమారసంభవం” చలనచిత్రం. ఒకటి మనం కదులుతూ చూడవలసినది, మరొకటి కదులుతూ కనిపించేది.

కాళిదాసు “కుమారసంభవం” లోని యీ శ్లోకాలు ప్రసిద్ధమైనవి.

ఇతో గమిష్యామ్యథవేతి వాదినీ
చచాల బాలా స్తనభిన్నవల్కలా
స్వరూపమాస్థాయ చ తాం కృతస్మిత:
సమాలలంబే వృషరాజకేతన:  .

తం వీక్ష్య వేపథుమతీ సరసాంగయష్టి:
నిక్షేపణాయ పదముద్ధృతముద్వహంతీ
మార్గాచలవ్యతికరాకులితేవ సింధు:
శైలాధిరాజతనయా న యయౌ న తస్థౌ.

               (కుమారసంభవమ్.5: 84,85.)

   శివుని భర్తగా పొందడానికి పార్వతి  తపించింది. ఆ సందర్భంలో మాయావటువు రూపంలో శివుడు సరదాకు ఆమెను Eve teasing చేయడం, లోకంలో ప్రసిద్ధమైన సన్నివేశమే.తెలుగులో శ్రీనాథుడు కూడా తన “హరవిలాసం”లో  యీ సన్నివేశాన్ని వర్ణించడం తెలిసిందే.
    మాయావటుడు  శివనింద చాలా చేశాడు. పార్వతి అతని నోరు మూయించడానికి చెప్పవలసింది  చెప్పింది.కాని,ఆయన మళ్ళీ నోరు తెరచే ప్రయత్నం చేయడం చూసింది.చెలితో చెప్పింది, 'తిరిగి నోరు తెరిచే ప్రయత్నం చేస్తున్నాడు.ఆపు",అని (“పునర్వివక్షు: స్ఫురితోత్తరాధర:”83.) “మహాత్ములను నిందించడమే కాదు, ఆ నిందవినడం కూడా పాపమే”, అని అక్కడనుండి వెళ్ళిపోవలెనని, విసురుగా లేచింది. ఆ విసురులో పైట జారింది. శివుని ఆట ఆగిపోయింది. ఆయన అసలు రూపం బయటపడింది. (“స్వరూపమాస్థాయ”)అప్పుడు ఆమె చేయి పట్టుకున్నాడు.పతికోసం తపించిన కన్నెపిల్లకు,  హఠాత్తుగా తన తప:ఫలం సాక్షాత్కరించినపుడు, పెళ్లికొడుకు ఏకంగా పాణిగ్రహణం చేసినపుడు, ఆమె స్థితి ఎట్లా ఉంటుంది? కోపం, ఆశ్చర్యం , సంతోషం. ఆమె కోపవేగం ఆగలేదు.ఆశ్చర్యం నిలవనీదు.సంతోషం కదలనీయదు. ఆ కల్లోలస్థితిని వర్ణించగల ఉపమ కల్లోలినియే కావలె. పర్వతశిఖరంనుండి దూకుడుగా వస్తున్న నదికి మార్గంలో కొండ అడ్డం వస్తే, నదీవేగం వెంటనే ఆగదు, ముందుకు సాగనూ లేదు (“న యయౌ న తస్థౌ”.)అదీ పార్వతి స్థితి.ఇక్కడ పార్వతిని కవి “శైలాధిరాజతనయా” అనడం సార్థకం. పర్వతశిఖరాలలో పుట్టి ప్రవహించే గంగతో సారూప్యం చెబుతున్నాడు గౌరికి. గంగ, గౌరి యిద్దరూ శైలాధిరాజతనయలే కదా!
“వేపథుమతీ” (కంపము),”సరసాంగయష్టి”(స్వేదము),ప్రియుని కరస్పర్శతో కలిగిన సాత్విక భావోదయాన్ని చెబుతాయి. నిజమే, కాని అవి నది విషయంలో రసము(“సరసాంగయష్టి”),కల్లోలము (“ఆకులిత”)కూడా స్ఫురింపచేయడం మరింత సార్థకం.
  (“శైలాధిరాజము,శైలము ఒకటి కావు.కాని యీ జడజంగమభేదం కాళిదాసుగాని తరువాతి కవులుగాని పాటించలేదు.కావ్యప్రారంభశ్లోకంలోనే “హిమాలయోనామనగాధిరాజ:”అన్నాడు కాని, ఆయన ఆ ప్రారంభశ్లోకాలలో  వర్ణించింది, హిమాలయమే కాని, అధిష్ఠానదేవత నగాధిరాజును కాదు.పెద్దన ప్రయోగం “శైలతనయాస్తనదుగ్ధములానువేళ” ప్రసిద్ధమే.)
  “పదముద్ధృతం” (ఎత్తిన పాదం),శివశక్తుల సామరస్యంలో సృష్టికార్యోన్ముఖమైన శక్తి ఎత్తిన మొదటి అడుగు.
  ప్రథమస్పందనలోని సంరంభాన్ని చెప్పే “మార్గాచలవ్యతికరాకులితేవ సింధు:, ... న యయౌ న తస్థౌ” అద్భుతమైన  ఉపమ. ప్రమాణంలో (scale), ప్రాధాన్యంలో , ప్రభావంలో ”దీపశఖ” కూడా దీనికి దీటు కాదనిపిస్తుంది.

మలార్మె:
  సందర్భం వేరు, ప్రయోజనంవేరు.కాని, “న యయౌ న తస్థౌ” వంటి ఏకత్రస్థితవిరుద్ధస్థితులను అభివ్యక్తం చేస్తూ ఫ్రెంచి కవి మలార్మె ఒక కవిత రాశాడు,తన కూతురు చేతిలో  విసనకర్రపై, “మాద్ మ్వాసెల్ మలార్మె మరో విసనకర్ర”, ( Autre éventail de Mademoiselle Mallarmé" :Stéphane Mallarmé) . కవిత పేరు చూస్తే అదేదో ఆషామాషా కవిత అనిపిస్తుంది.కాని అసాధ్యమైన రచన. దాని వివరించే సందర్భం కాదు.కాని కొన్ని పోలికలు:

-“నా రెక్క (లు) నీ చేతిలో”(mon aile dans ta main , my wing in your hand);
-“స్తబ్ధస్ఫురణం”(le coup prisonnier , imprisoned flutter );
-“బద్దలవలేదు బద్ధపడలేదు”(Ne peut jaillir ni s'apaiser , can neither/Burst out or be soothed like this.ఇది “ న యయౌ న తస్థౌ” ను గుర్తు తెస్తుంది.)
-“ముడిచిన రెక్కలకదలిక”(“vol fermé , closed flight).

అనంతస్పందనశక్తిని అరచేతిలో ఆపి ఉంచిన స్ఫురణ యీ ఉపమలలో ఉన్నది .

ఈ మలార్మె కవితలోని విసనకర్ర సామాన్యమైనది అనుకోలేము.

à chaque battement
Dont le coup prisonnier recule
L'horizon délicatement.

at every beat,
Its captive stroke with delicate care
Drives the horizon to retreat. (-Tr.Blackmore:Oxford World Classics)

(“ ప్రతి వీవెన విసురులో
ఆ స్తబ్ధస్ఫురణ మృదువుగా సరిదిద్దు
దిగంతాల సరిహద్దు.”)

ఇది విసనకర్ర కాదు!

ఇక్కడ మలార్మెను వదిలేద్దాం.

పై కాళిదాసు పద్యాలకు నా ఆంగ్లానువాదం:

‘Or, hence I remove me’, saying, she rushed.
The cover from her breasts slipped.
The smiling Siva dismissed his disguise  
And took her hand in his.

Seeing Him, she, born of the  Mountain King,
All sweat and trembling,
One foot in the air,stumbled
As a river rushing  down,
Stopped by a sudden rock, confused,
Neither stood nor moved.

No comments:

Post a Comment