Sunday, June 30, 2019

అస్తిత్వవాదసాహిత్యం-4 నీచ-3/7



                                    అస్తిత్వవాదసాహిత్యం-4
                                    :ఒక భారతీయపరిచయం
                                                నీచ-3/7

ఈ వ్యాసంలో నీచ రచనలకు సంకేతాలు:

GS- The Gay Science
EC- Ecce Homo ( Behold the man!)
Zara- Thus Spake Zarathustra
Z. Pro.-Thus Spake Zarathustra: Prologue
BGE- Beyond Good and Evil
AC-Antichrist


                                 అతిమానవుడు (పురుషోత్తముడు)
                            (Ubermensch, Overman, Superman )
                                       
                                                                “వాస్తవంలో నీవేదో అదే అవు”(E.C):
                                                                       “తత్త్వమసి”.(ఛాం.ఉప.)



    “పిచ్చివాడు” అన్న తన వచనంలో( GS.125)  నీచ, దేవుడి మరణాన్ని ప్రకటించి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా హత్యచేసిన మనిషే దేవుడు కావలె, అన్నాడు.(“మనమే దేవతలు కావద్దా?”) అంటే, దేవుడి సింహాసనం ఎప్పుడూ ఖాళీగా ఉండరాదు. రాజు  లేకపోవడం అరాచకం. “రాజు మరణించాడు, అమ్మయ్య పీడా వదిలింది, సుఖంగా ఉందాం”, అనడంలేదు నీచ. అయితే, అరాచకం హాయిగా ఉండదా? మరణించిన దేవుడి స్థానాన్ని మళ్ళీ మనిషి అధిష్ఠించడం ఎందుకు? ఎందుకంటే, మరణించింది రాజ్యం, పొందవలసింది స్వారాజ్యం.అది ద్వైతం, యిది అద్వైతం. అది దాసోహం, యిది సోహం. “వాస్తవంలో నీవేదో అదే అవు”(EC).  నీచ మనిషిని ఎదగమనడం ఏదో ఒక కొత్త స్థితికి కాదు, స్వస్థితికి. తానేమిటో తాను మర్చిపోయాడు. ఆ మరచిపోయిన మనిషిని మరల గుర్తు తెచ్చుకోవడమే వేదాంతం చెప్పేది కూడా. కనుక కొత్తగా తెచ్చుకొనేదేమీ లేదు, మరేదీ అయ్యేదీ లేదు. “వాస్తవంలో నీవేదో అదే అవు”(EC). (మరొక భాషలో దీన్నే “ తత్త్వమసి” అంటారు.) మనిషి గొప్పతనం ఏమిటంటే ఉన్న  స్థితినుండి ఉన్నతస్థితికి చేరుకోడానికి అతడు సాధనం. మనిషి “గమ్యం కాదు, వంతెన”(Zara.Pr. 3) అంటాడు నీచ. మానవుడు అతిమానవుడు కావడానికి శరీరమే ఆద్యసాధనం. మనిషి చేరవలసిన స్థానం కాదు, చేరడానికి ఉపయోగించుకోవలసిన వంతెన. నీచది రాజకీయపోరాటం కాదు, ఆధ్యాత్మిక ఆరాటం.

(వైదికధర్మం అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది. ఇది కేవలం ఆలంకారికమో, వ్యంగ్యమో  కాదు. అంగన్యాసకరన్యాసాదులు యీ సత్యాన్నే భావిస్తున్నాయి, పదునాలుగు భువనాలను దేహంలో దర్శించడమే వైదికదర్శనం. నీచ చెప్పేది యీ వైదికార్థం కాకపోవచ్చు. కాని అస్తిత్వవాదంలో శరీరమే ఆద్యసాధనము,  అంతిమసాధనము.“There is more reason in your body than in your best wisdom”.Zara: Ch. On the despisers of the body.)
                                                 ***
  ఈ అతిమానవుడి గురించి నీచ వచనాలు కొన్ని చూద్దాం.( Thus Spake Zarathustra: Prologue.ప్రారంభవచనాలు.

-జారతూస్ట్ర నాంది (Prologue) :

   “1.జారతూస్ట్రకు  ముప్పైఏళ్ళపుడు యిల్లు, యింటి కుంట వదిలి, కొండప్రాంతాలకు వెళ్ళిపోయాడు.అక్కడ ఏకాంతంలో అతని ఆత్మకు ఆనందం కలిగింది. పదిసంవత్సరాలున్నాడు. విసుగనిపించలేదు. కాని, చివరకు అతని మనసు మారింది.   ఒక ఉదయం లేవగానే, లేతగులాబీరంగు ప్రాతఃసంధ్యవేళలో, సూర్యుడికి ఎదురుగా వెళ్ళి, దానితో అన్నాడు: “ఓ మహా నక్షత్రమా! నీ సంతోషం ఏమవుతుంది, ఎవరికోసం నీవు వెలుగుతున్నావో ఆ మేము లేకుంటే! పది సంవత్సరాలు ప్రతిరోజు  కొండ ఎక్కి నా గుహకు వచ్చావు. కొండ ఎక్కి నీకు విసుగొచ్చేది, నీ వెలుగుపై నీకు విరక్తి కలిగేది, నేనే లేకుండి ఉంటే,నేనూ నా డేగ, నా పాము. కాని మేము ప్రతిరోజు నీకోసం ఎదురుచూసేవాళ్ళం, నీ పొంగును స్వీకరించాం, నిన్ను అనుగ్రహించాం.చూడు! -నాకు నా జ్ఞానంపై విసుగొస్తోంది, మించిన మధువును సేకరించిన మధుపానికి వలె. నా జ్ఞానాన్ని అందుకునే చాపినచేతులు కావాలి నాకు. పంచాలని ఉంది నా జ్ఞానాన్ని, జ్ఞానులు వారి మౌర్ఖ్యంలో పోగొట్టుకున్న ఆనందం తిరిగి పొందేవరకు, పేదలు వారి సంపదలో సంతోషం పొందేవరకు. కాబట్టి, నేను సముద్రంలో కుంకుతాను, నీలాగా. ప్రతి సాయంత్రము నీవు అత్యుల్లాసంతో సముద్రం వెనుకకు వెళ్ళి, అధోలోకాలకు వెలుగునిస్తావు కదా! నీలాగా నేను కూడా,  నీవు ఎవరికోసం అవతరిస్తావో వారికొరకు అంటారే, అలా కిందికి దిగాలి.కనుక నన్ను ఆశీర్వదించు,అత్యంతానందాన్ని చూచికూడా  అసూయచెందని ప్రశాంతసాక్షీ ! నీ దివ్యానందాన్ని  ప్రతిఫలిస్తూ, పొంగి పొర్లుతున్న నా కృపాపాత్రనుండి ప్రవహించే  సువర్ణజలాలు అందరికీ అందాలని ఆశీర్వదించు . చూడు! యీ పాత్ర తిరిగి ఖాళీ అవుతుంది. జారతూస్ట్ర తిరిగి మనిషి అవబోతున్నాడు.”అలా మొదలయింది జారతూస్ట్ర కిందికి దిగడం (అవతరణం)”. (Zara.Pro.1)


వ్యాఖ్య:

   క్రిందటి వ్యాసంలో (“దేవుడు మరణించాడు”) “జారతూస్ట్ర: నాంది” (Z. Pro.) లోని రెండవవచనం చూశాం. ఇప్పుడు మొదటి వచనం చూద్దాం. “జారతూస్ట్ర” నీచ రచనలలో ప్రధానమైంది. ఒక నవలలాగా, దీర్ఘకవితలాగా ప్రతీకలతో రూపకాలతో నిండి ఉంది.ఆ కావ్యశైలిని కావ్యార్థాన్ని పరిశీలిద్దాం.

-ఇల్లు, యింటి కుంట:

  జారతూస్ట్ర ముప్పై ఏళ్ళపుడు యిల్లు,  యింటి కుంట వదిలేసి కొండప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అంటే, ముప్పై ఏళ్ళు తన యిల్లే కైలాసశిఖరంగా, తన యింటి ముందు కుంట మానససరోవరంగా బతికాడు. ముప్పై ఏళ్ళు అతడు తన లోపలి ప్రపంచాన్ని మథించాడు. అంటే ముప్పైఏళ్ళపాటు, యింట్లోనే ఉన్నా, కొండలు అతన్ని పిలుస్తూనే ఉన్నాయి. అంతరంగంలోకి,  కొండా కోనా కొలనూ అన్నీ చేరిపోయాయి. ముప్పై ఏళ్లకు, అంతరంగంనుండి, అతడి రంగస్థలం బహిరంగం లోకి కదిలింది. అతడు యిల్లు వదిలి వెళ్ళిపోయాడు. అక్కడ పది సంవత్సరాలు ఏం చేశాడు? ఇల్లు వాకిలి వదిలి కొండలు కోనలు వెదుక్కుంటూ ఏం చెయ్యాలని వెళ్లాడో అదే చేశాడు.ఏమీ “చెయ్య”కుండా పది సంవత్సరాలు తన జ్ఞానపాత్రను నింపుతూ, ఏకాంతంలో ఆనందంగా గడిపాడు. (జ్ఞానం “చేసేది” కాదు. ) దేవుడిమరణంతో ఏర్పడిన శూన్యాన్ని ఎలా నింపాలి అని తపస్సు చేశాడు, బుద్ధుడైనాడు.తన తప:ఫలితాన్ని లోకానికి పంచాలనుకున్నాడు. తిరిగి జనావాసాలలోకి వెళ్ళాలనుకున్నాడు

-“ఒక  ఉదయం,లేతగులాబీరంగు ప్రాతఃసంధ్యవేళ” (the rosy dawn):

  దేవుణ్ణి పోగొట్టుకుని నిరాశనిండిన లోకంలో , ఒక కొత్త సూర్యుడు ఉదయించాడు.
ప్రత్యూషపవనాంకురాలు తాకుతున్న సుఖకరమైన బ్రాహ్మీముహూర్తమే కాదు, అది ఆశావహమైన ఉషోదయం కూడా. కేవలం ఆహ్లాదకరమైనరంగు కాదు, ఆశాస్ఫోరకం (rosy) కూడా.  ఒక నూతనప్రవక్త అవతరణాన్ని సూచిస్తున్నది. జారరతూస్ట్ర ఉదయిస్తున్న “సూర్యుడికి ఎదురుగా” నిల్చున్నాడు. (క్రైస్తవులు అగ్నిని ఆదిత్యుని ఆరాధించరు. అది తూర్పు సంస్కృతి. నీచ ప్రాగ్దిశాముఖమైనాడు.)

    (ఇది చదివినపుడు, మనకు మరో  “ప్రాక్ప్రవక్త” ఉమర్ ఖయ్యామ్ గుర్తురావచ్చు. “లెమ్మోయీ మదిరాతపస్వి, దిశలాలేఖ్యంబుగా మాఱె ”: రామిరెడ్డి “పానశాల”.  ప్రాగ్దేశాలలో చాలాకాలం వరకు జ్ఞానులే కాని, కొత్తమతాలు స్థాపించే ప్రవక్తలు రాలేదు.)

-“ఓ మహా నక్షత్రమా! నీ సంతోషం ఏమవుతుంది, ఎవరికోసం నీవు వెలుగుతున్నావో ఆ మేము   లేకుంటే!”

  “ఇంతగా సంతోషంతో వెలిగిపోతున్నావు.నీవు ఎవరికోసం వెలుగుతున్నావో ఆ మనుషులే లేకుంటే, నీ సంతోషం ఏమై పోవాలి?”, అని అడుగుతున్నాడు సూర్యుణ్ణి. మనిషిలేని  వఠ్ఠి మట్టిగోళాలచుట్టూ తిరిగితే సూర్యుడికి ఏమానందం? అస్తిత్వవాదంలో, మనిషి కొరకు సృష్టి కాని, సృష్టికొరకు మనిషి కాదు.ఇహం కొరకు పరం. మనిషి జీవితాన్ని ఉజ్జ్వలంచేయడానికి సౌరకాంతి. “పాదద్వంద్వము నేలమోపి ” నిలిచిన మనిషి చుట్టూ తిరగాలి భూగోళము ఖగోళము.(గజేంద్రుడు ఆర్తితో అరిచాడు. మొసలి పిలవనుకూడా లేదు, “పవనుంబంధించి” కూచుంది.వైకుంఠమే తన కుంటకు రావలె,తల తెగినా సరే మొసలి తన స్థానంనుండి కదల్లేదు, “నేలను” వదలలేదు.)

-“నేనూ నా డేగ, నా పాము”:

   పది సంవత్సరాలు కొండగుహలో ఏం చేశాడు? ఎలా గడిపాడు? తనతో తన డేగ,  తన పాము. ఒకటి నింగిని తాకుతుంది, మరొకటి నేలపై పాకుతుంది.జారతూస్ట్ర నింగిని నేలను కలిపి ధ్యానం చేశాడు. అతడి ఆధ్యాత్మికసాహసానికి ఆకాశం హద్దు. పాత తొడుగు వదిలి, కుబుసం విడిచిన పాములా కొత్త జీవము జవము పొందాడు.

   నీచ రచనల్లో పశుపక్ష్యాదులు యింద్రియశక్తికి ప్రతీకలు కూడా . పశువు ఆలోచనలలో ఆర్తిని నీరుగార్చదు.నేను “ఆలోచిస్తాను కనుక నేనున్నాను” ( “I think, therefore I am.” Descartes) కాదు. అనుభూతి చెందుతున్నాను కనుక నేనున్నాను.తీవ్రమైన ఆర్తి జీవలక్షణం అంటారు అస్తిత్వవాదులు,  (passion: “What we lack is passion.We live in an age of reflection.”Kierkegaard ).

-”నీకోసం ఎదురుచూసేవాళ్ళం, నీ పొంగును స్వీకరించాం, నిన్ను అనుగ్రహించాం.”

    జారతూస్ట్ర ఏమంటున్నాడు? పొంగిపొరలే వెలుగుతో వచ్చే సూర్యుడికోససం తను, తన డేగ, పాము రోజూ ఎదురుచూచేవారు. ఆ పొరలిపోతున్న  హిరణ్మయపాత్రనుండి ఒంపిన వెలుగు దోసిళ్ళతో తాగాడు. అలా అందుకున్నవాడు ఏం చేయాలి? కృతజ్ఞతతో వినమ్రుడు కావాలి. కాని, ఇతడు ఆ ఆదిత్యుని అనుగ్రహించాడట! అవును,  జ్ఞానాన్ని అందుకునేవాడుండం గురువు కోరుకునే అనుగ్రహం. ఉత్తమగురువుకోసం శిష్యుడు ఎంతగా తపిస్తాడో, ఉత్తమశిష్యుడికోసం గురువు అంతకంటే ఎక్కువ తపిస్తాడు. నచికేతుడు దొరకినందుకు యముడు ఎంత సంతోషించాడు! దొరకునా యిటువంటి శిష్యుడు, అన్నాడు కదా? (“త్వాదృక్ న భూయాత్ నచికేతః ప్రష్టా”.కఠ.ఉప.1.2.9.) జారతూస్ట్ర కొండదిగి జనాల్లోకివెళ్ళినపుడు తెలుస్తుంది, తను పంచదలచుకున్న వెలుగుకోసం ఎందరు ఆతురతతో చూస్తారో. శిరిడీ సాయి ఏమన్నాడు? “ నా వద్ద బండ్లకొద్దీ ధనం ఉంది.గునపాలతో వచ్చి తవ్వి తీసుకెళ్ళండిరా అంటే నా కొడుకు ఒక్కడూ రాడే?”  అదే కదా ఆశ్రమవాసి జారతూస్ట్రతో అన్నాడు, వ్యంగ్యంగా “ సరే, చూడు నీ సంపద వాళ్ళు స్వీకరిస్తారేమో!‘ ( Z.Pro.2.)

-“నాకు నా జ్ఞానంపై విసుగొస్తోంది, మించిన మధువును సేకరించిన మధుపానికి వలె.”

   అలా దోసిళ్ళతో తాగి తాగి జ్ఞానపూర్ణుడైనాడు జారతూస్ట్ర. మధుపం ఎంత కాలం మధువును తాగుతుంది? నింపుకోడం చాలు, యిక దీన్ని ఒంపుకునే వారిని వెతుక్కోవలె. అప్పుడు  కదా జ్ఞానానికి సార్థక్యం? సంపద నలుగురికీ అందకుండా నీ పెరట్లో గొయ్యి తవ్వి పాతిపెట్టుకుంటే, అంతకంటే సామాజికద్రోహం ఉంటుందా? తన పానపాత్ర పొంగి పొరలిపోతోంది. పంచాలి.

-“జ్ఞానులు వారి మౌర్ఖ్యంలో పోగొట్టుకున్న ఆనందం తిరిగి పొందేవరకు, పేదలు వారి సంపదలో సంతోషం పొందేవరకు”:

    ఎవరికి అవసరం తన జ్ఞానం ? జ్ఞానులకా, అజ్ఞానులకా? అజ్ఞానులకు సరే, జ్ఞానులకు కూడా ఎందుకు అవసరం? జ్ఞానులు ఒక పెద్ద అపోహలో పడి ఉన్నారు. జ్ఞానులు కనుక, వారి అపోహ మానవజాతినే అపోహలోకి తోసేసింది. ఏమిటా అపోహ? జ్ఞాని ఎప్పుడూ ఆనందంగా ఉండకూడదు. జ్ఞానము ఆనందము రెండు విరుద్ధధ్రువాలు. నవ్వుతూ జోకులేస్తూ నవ్విస్తూ ఉండే జ్ఞాని, జ్ఞాని ఎలా అవుతాడు? ఎప్పుడూ ముఖం వేలాడేసుకొని గంభీరంగా ఉండాలి. నీచ రెండు విరుద్ధ జీవితదృక్పథాలను సమన్వయిస్తున్నాడు. ఈ సమన్వయం అతని దర్శనంలో, చాలా ప్రధానమైన అంశం. పాశ్చాత్యసంస్కృతిలో రెండు పాయలు, ఒకటి విజ్ఞానదృష్టి (Apollonian), రెండు ఆనందదృష్టి (Dioyonesian). ఇంతకాలము యూరప్ లో సోక్రటీస్ ప్లేటోల విజ్ఞానదృష్టికి పెద్దపీట. క్రైస్తవమతప్రాచుర్యంతో  లోకంలో ఆనందం నిషేధించబడింది. అది నీచ క్రైస్తవవ్యతిరేకతకు ప్రధానకారణం. ఈ అంశం తరువాత వచ్చే మరొక వ్యాసంలో ( ఉత్సాహవంతుడు: Dioyonesian Man ) ప్రత్యేకంగా పరిశీలిద్దాం.

   ఇక పేదలవిషయం.వీరు ఏవిధమైన పేదలు? జ్ఞానంలోనా, ధనంలోనా? ముఖ్యంగా ధనవిషయమే ప్రస్తావిస్తున్నాడు నీచ. “వారి సంపదలో వారు ఆనందం పొందేవరకు”, అంటున్నాడు. వారి సంపద వారికి తెలియదు.ఇంట్లో  నడిచే నేలకింద బంగారుబిందెలున్నాయి. రోజూ వాటి పై నడుస్తున్నా, వేస్తున్న అడుగుల కింద ఉన్న బంగారం తెలియక దరిద్రులం అనుకుంటారు.అయితే పేదరికం నిర్మూలించాలి (గరీబీ హటావో) అంటున్నాడా నీచ. అనడం లేదు.  అస్తిత్వవాదం సుఖజీవనాన్ని కోరదు. సుఖం జీవితలక్ష్యం కాదు, కారాదు. (పైన చెప్పిన ఆనందం వేరు, యీ సుఖం వేరు.) దుఃఖస్పర్శలేని సుఖజీవనం అన్ని రాజకీయవర్గాలు ఆమోదించి వాగ్దానాలు చేస్తున్నాయి. పథకాలు అమలు చేస్తున్నాయి. నిర్నిరోధమైన విజ్ఞానశాస్త్రపురోగతితో, మానవుడు అంతకంతకూ సుఖంగా జీవించగలడు అన్నది యీ నాటి సామాజిక రాజకీయ దృష్టి. ఇటువంటి మరోప్రపంచాన్ని కల్పించి, (డోస్టోవ్ స్కీ తన (Notes from the Underground లో విమర్శించిన చెర్నెస్విస్కీ నవలలోని  The Crystal Palace: ), కనబడలేదా అని కవ్వించి కదం తొక్కించారు కొందరు. ఆ ఆదర్శం అసంభవమే కాదు, అవాంఛనీయం కూడా అంటుంది అస్తిత్వవాదం. “సుఖజీవనం బానిస హక్కు” (“Easy life is the privilege of the slave”) అన్నాడు కీర్క్ గార్డ్.ఈ అతిమానవవాదము, అందులో భాగమైన సమసమాజభావము, దాని ఆదర్శము మరికొంత వివరంగా,చూద్దాం, దీని తరువాత మనం చదువబోయే Z.Prologue 3 లో. ప్రస్తుతం నీచ పేదరికంలోని ఆనందాన్ని చెబుతున్నాడు. గొప్పచేయడం పేదరికాన్ని కాదు, ఆనందాన్ని. మనిషి ఆనందానికి విధి ఎలా అడ్డు రాకూడదో, పేదరికం కూడా అడ్డుకాకూడదు.మనిషి స్వస్వరూపం ఆనందం అంటాడు నీచ. (“ఆనందో  బ్రహ్మ”.)

-“కాబట్టి, నేను సముద్రంలో కుంకుతాను, నీలాగా.”

   ఈ వాక్యంలో నీచ మరో ముఖ్యమైన అపోహను తొలగిస్తున్నాడు. సాధారణదృష్టిలో  వైరుధ్యాలనుకునే వాటిని నీచ వైరుధ్యాలుగా చూడడు. సాధారణంగా మనం కింద, పైన అనే వాటిని  తక్కువ ఎక్కువ అనే భావంతో చూస్తాం. ఉదాహరణకు, ఊర్ధ్వలోకాలు అధోలోకాలు, నింగి నేల. ఈ ఎక్కువతక్కువలు వాస్తవం కావు.సూర్యుడు సాయంకాలం అపరాంబుధిలో అస్తమిస్తాడు, అంటే నశిస్తాడని అర్థంకాదుకదా? మునిగి”పోవడం” లేదు.అంతవరకు అంధకారంలో ఉండిన అధోలోకాలకు వెలుగును యివ్వడానికి “కుంకుతున్నాడు”. ఈ “అవతరణం” (Descent) లో కూడా మనిషి ప్రాధమ్యం ఉంది.మనిషి కోసం భగవంతుడైనా “దిగి” వస్తాడు, ప్రేమ చేత. ఆ దిగిరావడం అవమానకరమైనా ( “అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం.”గీత.9.11)

-“ప్రతి సాయంత్రము నీవు అత్యుల్లాసంతో సముద్రం వెనుకకు వెళ్ళి, అధోలోకాలకు వెలుగునిస్తావు కదా! “

   ప్రతి సాయంత్రము.ఇంకా ఎన్ని సాయంత్రాలు యిలా ఎక్కి దిగి ఎక్కి దిగి, అనడు సూర్యుడు.తిరిగిన తిరుగుడే తిరిగి తిరుగుతాడు. ఎలా ? ఉత్సాహంతో, అత్యుల్లాసంతో.ఈ జీవితానికి అర్థం లేదు.  ఏది ఎందుకు ఎప్పుడు జరుగుతుందో ఒక్కటీ అర్థం కాదు. కష్టము సుఖము నీతో ప్రమేయం లేదు.పునరపి జననం పునరపి మరణం. అయినా మనిషి యీ అర్థం లేని జీవితం మళ్ళీ మళ్ళీ మళ్ళీ జీవించవలసి ఉంటుంది, జీవించమంటున్నాడు నీచ.  ఎలా? అత్యుల్లాసంతో. సముద్రంలో వెనక్కు వెళ్ళిన అలలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ అదే ఉత్సాహంతో ఒడ్డుకు ఎగసిపడినట్టు. ఇది నీచ దర్శనంలో మరో ప్రధానాంశం కాలచక్రం ( Eternal Recurrence) . పాశ్చాత్యులభావంలో కాలం సరళరేఖలా సాగుతుంది.  భారతీయదృక్పథంలో కాలమొక చక్రం.ఈ అంశం ( Eternal Recurrence) యీ విషయమైన ప్రత్యేక వ్యాసంలో మరింత వివరంగా చూద్దాం.

-“అసూయచెందని  ప్రశాంతసాక్షీ ! పొంగి పొర్లుతున్న  నా కృపాపాత్రను ఆశీర్వదించు”:

   ఇంతకుముందు  జ్ఞానపాత్రనుండి గ్రహించి సూర్యుణ్ణి అనుగ్రహించానన్నాడు.ఇప్పుడు నా కృపాపాత్రను ఆశీర్వదించు అంటున్నాడు అదే సూర్యుడితో. అనుగ్రహించే శిష్యుడు, ఆశీర్వదించే గురువు! గురువు శిష్యుడు ఏకమయే గురుతు అదే. (“పూషన్నపావృణు”, (ఈశోపనిషత్తు.15.) “సూర్యుడా ! కాస్త పక్కకు తప్పుకో ! సత్యాన్ని దర్శిస్తాను  !” అనడంలేదా ఉపాసకుడు? అది ఏ స్థాయిలోని ఉపాసన! అలానే జారతూస్ట్ర సూర్యోపాసన.

   జారతూస్ట్ర తన కోసం ఏదీ కోరడంలేదు.తన విజ్ఞానాన్ని అందుకోగల విజ్ఞతను జనానికి యివ్వమంటున్నాడు. పరుల జ్ఞానసంపదను చూచి అసూయచెందకపోవడం చెబుతున్నాడు. జ్ఞాని మరొక జ్ఞానిని చూచి అసూయచెందడు. తన పాత్ర ఖాళీ కావలెనని ఆశీర్వదించమంటున్నాడు.ఎక్కువతక్కువలు లేక యిచ్చిపుచ్చుకోడం సృష్టితత్త్వంగా చెబుతున్నాడు నీచ.

-“పాత్ర తిరిగి ఖాళీ అవుతుంది. జారతూస్ట్ర తిరిగి మనిషి అవబోతున్నాడు.”

  ఇది కూడా కాలచక్రగతిని చెబుతోంది.కాలం వలయాకారంలో  తిరుగుతూ, తిరిగితిరిగి అదే జీవితాన్ని తెచ్చి పడేస్తుంది మనకు. జీవితం మారదు.ఇదే సుఖం యిదే కష్టం యిదే జ్ఞానం యిదే అజ్ఞానం యిదే అసంబద్ధత యిదే అర్థరాహిత్యం. జ్ఞాని తన జ్ఞానజ్యోతికలశాన్ని ఖాళీచేసుకుని,  తిరిగి పూర్వస్థితిని చేరుకుంటాడు.మళ్ళీ మళ్ళీ నింపుకోవాలి జీవితకలశాన్ని జ్ఞానజ్యోతితో.

-“అలా మొదలయింది జారతూస్ట్ర అవతరణం.”:

  అవతరణం (Going down) కూడా నీచ భావాలలో ప్రధానమయింది అని వెనుక చెప్పుకున్నాం. ప్రగతిలో అధోగతి అంతర్భవించి ఉంటుంది.అపరాంబుధిలో అస్తమిస్తున్న సూర్యుడిలో యిది చెప్పుకున్నాం. సూర్యాస్తమయం రెంటికి ప్రతీక, అంబుధిలో ఆత్మాహుతి, అధోగతి.( “నీవు ఎవరికోసం అవతరిస్తావో వారికొరకు అంటారే, అలా కిందికి దిగాలి.”)

  ఇలా యీ జారతూస్ట్ర నాంది వచనాలలోని  మొదటి వచనంలో (జారతూస్ట్ర ప్రధానగ్రంథప్రారంభవచనంలో) నీచ దర్శనంలోని ప్రధానాంశాలన్నీ పలకరిస్తాయి.

  ఇక ప్రస్తుతవ్యాసంలో ప్రత్యేకవిషయమైన అతిమానవుడు ( Ubermensh, Overman, Superman) గురించి మరికొంత దగ్గరగా, నీచ మాటల్లోనే, చూద్దాం.

[ Z.Pro.1; Z.1,3. కూడా అతిమానవవిషయాలే. Z.Pro.1 చూచాం. ( రెండవవచనం (“దేవుడు మరణించాడు”) వెనుకటివ్యాసంలో (“దైవము సత్యము”) లో చూచాం. ఇక అందులోని మూడవవచనం చూద్దాం.

  “జారతూస్ట్ర [కొండ దిగి] అడవి అంచున ఉన్న జనావాసం చేరుకున్నపుడు, అక్కడ గుమిగూడిన  జనసమూహాన్ని చూచాడు.అక్కడ ఒక రజ్జునృత్యప్రదర్శన (rope dance) జరుగబోతోంది . అది చూడడానికి వచ్చారు ఆ జనం .జారతూస్ట్ర ఆ జనాలతో  అన్నాడు: “నేను మీకు అతిమానవుణ్ణి ఉపదేశిస్తాను.” మనిషి  దాటిపోవలసినవాడు. మనిషిని అతిశయించడానికి మీరేం చేశారు? ఇంతవరకు అన్ని ప్రాణులు వాటి దశను దాటి వెళ్ళాయి. మీరేం చేశారు, మనిషిని దాటి వెళ్ళడానికి? ఆ గొప్పప్రవాహంలో మీరు పొంగులో కలుస్తారా, కుంగులోనా? వెనక్కు వెళ్ళి పశువవుతారా, మనిషిని దాటి వెళ్తారా? మనిషికి కోతి ఏమవుతుంది? అపహాస్యవస్తువు, అవమానకారణం.అతిమానవుడికి మనిషి అట్లే, అపహాస్యవస్తువు, అవమానకారణం.కీటం నుండి మనిషివరకు సాగావు.కాని మీలో ఎక్కువభాగం యింకా కీటదశలోనే ఉండిపోయింది. మీరు ఒకనాడు కోతులు, కాని మీలో చాలాభాగం యింకా కోతిని మించిన కోతిగానే ఉండిపోయింది.  మీలో జ్ఞానులనబడేవారుకూడా, మొక్కకు పిశాచానికి మధ్యలో ఉన్నారు.కాని నేను మిమ్మల్ని మొక్కలవమంటున్నానా, పిశాచాలవమంటున్నానా? చూడండి! నేను మీకు అతిమానవుణ్ణి ఉపదేశిస్తున్నాను! అతిమానవుడు యీ నేలకు సారం. మీరు సంకల్పించండి: “ఈ నేలకు అతిమానవుడు సారమగుగాక అని! నేను మిమ్మల్ని నిమంత్రిస్తున్నాను, సోదరులారా! [ మీరు నిలిచిన] నేలను నమ్ముకోండి. పరలోకపు ఆశలు చూపేవాళ్ళను  నమ్మవద్దు! వాళ్ళు తెలిసో తెలియకో విషప్రయోగం చేస్తారు.జీవితాన్ని చిన్నచూపు చూస్తారు.వారు విషమెక్కి నశిస్తున్నారు. ఈ నేల వారితో విసిగిపోయి ఉంది. కనుక, వాళ్ళను పోవివ్వండి.ఒకప్పుడు దైవద్రోహం ద్రోహాలలో పెద్ద ద్రోహం. కాని దేవుడు మరణించాడు, దేవుడితోపాటు దైవద్రోహులూ పోయారు.ఇప్పుడు యీ నేలను కాదనడం,ఒక అజ్ఞాతమైన పరవస్తువుకు  నేల కన్నా ఎక్కువ వెల కట్టడం.అది ద్రోహాలలో అన్నిటికన్నా భయంకరమైన ద్రోహం.ఒకప్పుడు ఆత్మ దేహాన్ని హేయంగా భావించేది. ఆ హేయభావం పరమం . దేహం అల్పమై, వికారమై, కృశించి ఉండాలంటుంది ఆత్మ.అలా చేసి, దేహంనుండి యీ లోకంనుండి పారిపోవాలనుకొనేది.ఓహ్! ఆ ఆత్మ తానే అల్పము వికారము అయి కృశించింది. [దేహ]హింస దాని ఆనందం. కాని మీరుకూడా, సోదరులారా, నాకు చెప్పండి: మీ దేహం మీ ఆత్మను గూర్చి ఏమంటుంది? మీ ఆత్మ దరిద్రం, కల్మషం, హేయమైన ఆత్మసంతృప్తి కాదా? నిజంగా, మనిషి ఒక మురుగుకాలువ.ఒక మురుగుకాలువను  నీలో కలుపుకొని నీవు కంపుకొట్టకుండా ఉండాలంటే, నీవు సముద్రం అవ్వాలి.చూడండి, నేను మీకు ఉపదేశించే అతిమానవుడు ఆ సముద్రం. అందులో మీ హేయదేహభావం ఎంతదైనా మునిగిపోతుంది.మీ అనుభూతుల్లో అతి గొప్పదేది? “ఇది అతిహేయము” అన్న భావం కలిగిన క్షణం.మీ ఆనందంకూడా, అలాగే మీ హేతుబుద్ధి, మీ సుగుణం కూడా అసహ్యమై తోచిన క్షణం. “ “ఈ నా సంతోషం వల్ల నాకేం ప్రయోజనం? ఇది దరిద్రం, కల్మషం, హేయమైన ఆత్మసంతృప్తి.నా అస్తిత్వాన్ని ఏది ఆమోదిస్తుందో అది నిజమైన మోదం!”, అన్న క్షణం. “నా బుద్ధిజ్ఞానంవల్ల నా కేం ప్రయోజనం? అది జ్ఞానం కోసం ఆకలితో ఉందా, ఆకలిగొన్న సింహంలా? లేదా, అది [ బుద్ధిజ్ఞానం] దరిద్రం,  కల్మషం, హేయమైన ఆత్మసంతృప్తి!”, అన్న క్షణం.”నా సుగుణం వల్ల నా కేం ప్రయోజనం? దాని వల్ల నాలో ఆర్తి కలగడంలేదు. నా పుణ్యపాపాలతో విసుగొస్తోంది! ఇదంతా దరిద్రం కల్మషం హేయమైన ఆత్మసంతృప్తి!”, అన్న క్షణం. “ నా న్యాయం వల్ల నాకేమి ప్రయోజనం? నేను ఆవేగం కాను,ఆజ్యం కాను. న్యాయమంటే ఆవేగము ఆజ్యము!”, అనిపించిన ఆ క్షణం. “ నా కరుణ వల్ల ఏం ప్రయోజనం? ఆ కరుణే కదా మనిషిని ప్రేమించిన వానికి శిలువవేసింది? కాని నా కరుణ శిలువ కాదు”, అన్న క్షణం.ఇలా ఎప్పుడైనా అన్నారా? ఇలా ఎప్పుడైనా రోదించారా? హా! అలాటి మీ రోదనం వినాలని నాకు! మీ పాపం కాదు— మీ ఆత్మసంతృప్తి పరలోకంలో వినపిస్తోంది.మీ పాపం కాదు, మీ పాపభీతి స్వర్గంలో రోదిస్తోంది! ఏదీ, నీ పాదాలను నాకే ఉరుములమెరుపు? ఎక్కడ, నీ వ్యాధినిరోధక ఉన్మత్త ఉత్సాహం? చూడండి, నేను మీకు అతిమానవుణ్ణి ఉపదేశిస్తాను ! అతడు ఆ ఉరిమే మెరుపు! అతడు ఆ ఉన్మత్త ఉత్సాహం!” —జారతూస్ట్ర అలా మాట్లాడిన తరువాత, జనంలోనుండి ఒకడు అరిచాడు: “ దొమ్మరి గురించి చాలా విన్నాం; యిక అతన్ని చూద్దాం!” జనాలు నవ్వారు జారతూస్ట్రవైపు  చూస్తూ. దొమ్మరి అంతవరకు జారతూస్ట్ర వర్ణించింది తననే అనుకొని, తన ప్రదర్శన మొదలుపెట్టాడు.” (Z.Prologue 3)

వ్యాఖ్య:

  ఈ వచనంలో నీచ అతిమానవుడి లక్షణాలు చెప్పాడు.

  “మనిషిని అతిశయించడానికి మీరేం చేశారు?”

  అతడు కొండదిగగానే ఒక జనసమూహాన్ని చూచాడు. వారు ఒక ప్రవక్తకు స్వాగతం చెప్పడంకోసం అక్కడ చేరలేదు.ఒక దొమ్మరి ప్రదర్శన చూడడానికి వచ్చారు. జనాలకు అర్థంకాలేదు, జారతూస్ట్ర ఎవరిగురించి మాట్లాడుతున్నాడో. దొమ్మరికి అర్థమయింది,జారతూస్ట్ర మాట్లాడింది తన గురించే అని.ఎలా? దొమ్మరివాడు తాటిమీద నడుస్తాడు, నృత్యం చేస్తాడు. ఆ విద్య అతడికి చిరకాల అభ్యాసంచేత కలిగింది. జీవితం అనే తాటిమీద నడవాలంటే అంతకంటే ఎక్కువ అభ్యాసమే చేయాలి. (అభ్యాసం చేసినవాడికి, తాటిమీద నడవడమూ, కత్తి అంచుమీద నడవడమూ (“ క్షురస్య ధారా.”) ఒకటే. మనిషి తనను తాను దాటి వెళ్ళాలంటే, చాలా కృషి చేయాలి. “మీరేం చేశారు?” అని అడుగుతున్నాడు జారతూస్ట్ర. ఒక ఉన్నతస్థితిని పొందాలంటే, తనను తాను అతిశయించాలంటే,  ఊరక రాదు. మనిషి ఉన్నతస్థితిని కోరుతున్నాడా? లేదు.పైగా యింకా బొద్దింకగా మారిపోతున్నాడు ( Metamorphosis). ఈ భూమిమీద ఎన్నో ప్రాణులు అంతరించిపోయాయి కాని, యీ మనిషి ఎంతకూ అంతరించడం లేదు. “ఈ భూమి అల్పమై పోతోంది. దానిమీద చివరి మనిషి [అల్పుడై] గెంతుతున్నాడు. వాడు యీ భూమిమీద ప్రతిదానిని తనలాగే అల్పమైనదిగా చేసేస్తాడు. ఈ మనిషిజాతి మొండి జాతి. ఎంతకూ అంతమయేది కాదు. చివరి మనిషి బొద్దింకలా చిరాయువు.”( Z: Pr. 5) ఈ మొండి బొద్దింకబతుకును అంతంచేసి కొత్త మనిషి ఆవిర్భవించవలె.

    “మనిషి గమ్యం కాదు, వంతెన”.ఈ వంతెనను ఉపయోగించుకొని గమ్యం చేరడం ఒక్కొక సంస్కృతిలో ఒక్కొక  విధానం, ఒక్కొక పరిభాష. అరవిందయోగి భాష, నీచ పరిభాష ఒకటి కావు.ఒక పరిభాషలో యీ వంతెనపై నడవడాన్ని  మూలాధారంనుండి శక్తిని సహస్రారానికి నడిపించడం అంటారు.”నీత్వా తాం కులకుండలీం లయవశాజ్జీవేనసార్థం హృది”.(షట్చక్రనిరూపణమ్).శక్తితో అడుగులో అడుగు కలుపుతూ,  లయబద్ధంగా నాట్యంచేస్తూ సహస్రారానికి నడిపించడం ఒక విధానం. ఇందులోని “లయ”ను నీచ గట్టిగా పట్టుకుంటాడు.అతడి రచనలలలో సంగీతము నాట్యము ప్రధాన జీవలక్షణంగా వర్ణిస్తాడు. మానవుడు అతిమానవుడుగా ఎదిగాడనడానికి యివి లక్షణాలంటాడు. అధోలోకాలను లయంచేసుకుంటూ ఊర్ధ్వలోకాలకు ఎదగడం లయవశమై నడవడం . లోకాలు బయట ఉండవు.మనిషిలో ఉంటాయి.

  మనిషి అతిమానవుడుగా ఎదగడం మరొక చోట( Z.1.1) యిలా చెప్పాడు నీచ :
ఆత్మ

             “మూడు మార్పులు.”(The Three Metamorphoses:Z.1.1.)

  ఆత్మ ఒంటెనుండి సింహంగా , సింహంనుండి శిశువుగా పరిణామం చెందుతుంది అంటాడు నీచ.ఒంటె దశలో మనిషి ఏం చేస్తాడు? బరువులు మోస్తాడు.”మీ భారములన్నియు నా పై వేయుడు, నేను మోసెదను”,అని మోకాళ్ళపై వంగి నిలబడతాడు. లోకం కోసం  కష్టపడడం, వారి భారాన్ని వినమ్రతతో వహించడం ఒక ఆధ్యాత్మిక సుగుణంగా, దాస్యం ఒక ఆధ్యాత్మిక ఆదర్శంగా బతుకుతాడు ఒంటెమనిషి.

   నిర్జనారణ్యాలలో   భారంతో ఒంటరిగా నడుస్తూ నడుస్తూ ఒంటెకు హఠాత్తుగ  సింహమై పోవాలనిపిస్తుంది. సింహస్వభావం ఏమిటి? అడవికి రాజు కావాలంటుంది.అప్పటి ప్రభువును  యుద్ధంలో జయించి కదా తాను రాజు కాగలుగుతుంది? అప్పుడు రాజ్యం చేస్తున్నది ఎవరు ? విధినిషేధాలతో శాసించే ప్రభువు ( Thou shalt, Thou shalt not). ఆ విధినిషేధాలను ధిక్కరించి అతిక్రమించినవాడే ప్రభువు కాగలడు. పాతవిలువలను రద్దుచేసి కొత్త విలువలను ‘సృష్టించుకోగలిగినవాడే’  నరసింహుడు. ‘సృష్టించుకోగలిగినవాడు’ ‘సృష్టించేవాడు కాదు’. అంటే తన విలువలు తనకోసం మాత్రమే సృష్టించుకుంటాడు. “ఈ విలువలు అందరికీ విలువైనవి, అందరూ పాటించవలసినవి”, అని, వెనుకటిలా యితరులను శాసించడు. అస్తిత్వవాదంలో మూలసిద్ధాంతం, సార్వత్రికము సార్వకాలికము సార్వజనీనము అయిన విలువలు లేవు, ఎవరి విలువలు వాడు సృష్టించుకోవలసిందే. (ఎవరి కళ్ళద్దాలు వారికే పనికొస్తాయి. పక్కవాడికి పనిచేయవు, ఆ అద్దాలు ఎంత విలువైనవైనా. విలువలైనా అంతే.)  ఈ కొత్త విలువల స్వరూపం ఏమిటి? మంచి చెడు, పుణ్యము పాపము అనే ద్వంద్వాలకు అతీతమైన (BGE) విలువలు.
  ఒంటె తన స్వభావం వదిలేసి సింహస్వభావం పొందడం మనిషి అతిమానవుడుగా ఎదగడంలో ఒక మహత్పరిణామం.  (Z. ప్రారంభంలో యింత ప్రముఖంగా ప్రతిపాదించిన అతిమానవవిషయం తరువాతి గ్రంథభాగంలో అంత ప్రాధాన్యం పొందలేదు.) వేలసంవత్సరాలనుండి పాటింపబడుతున్న విలువలను విధ్వంసంచేసిన వాడే మృగరాజు. మానవపరిణామమక్రమంలో యీ సింహదశ ఒక ముఖ్య దశ.కాని యిది అతిమానవదశకాదు. నీచ ఉపదేశించిన అతిమానవుడు , మనిషికి ఆత్మబలాన్ని ఉపదేశించేవాడు. బొద్దింకలలాగా, సందులలో పందులలాగా బతకవద్దని,  స్వేచ్ఛగా సంతోషంగా బతకమని చెప్పేవాడు.అంతే కాని, తన బలంతో పరులను హింసించేవాడు కాదు. తన విలువలను యితరులపై బలవంతంగా రుద్దేవాడు కాదు. జనాన్ని తనబలంతో బానిసలుగ చేసుకునేవాడు కాదు. ఎలా కాదు? సింహదశ అవసరమే కాని,అదే పరమదశ అనడంలేదు నీచ. పశువుగా ఆగిపొమ్మనడంలేదు, శిశువుగా ఎదగమంటున్నాడు. సింహంచేయలేనిది శిశువు ఏంచేస్తుంది? సింహం విధినిషేధాలను పాతవిలువలను విధ్వంసంచేయగలదు. కొత్తవిలువలు సృష్టించడానికి కావలసిన స్వేచ్ఛను సంపాదిస్తుంది కాని, కొత్తవిలువలు సృష్టించలేదు. కనుక సింహదశకూడా దాటిపోవలసినదే.శిశుదశ ఎటువంటిది?

-శిశువైన అతిమానవుణ్ణి ఎలా తెలియాలి?


“అమాయకత్వము, విస్మృతి, -, ఒక ఆట, స్వయంగా తిరిగే చక్రము,  మొదటి కదలిక, - - యివి శిశువంటే.” (Innocence is the child, and forgetfulness, a new beginning, a game, a self-rolling wheel, a first movement, a holy Yea.)

-అమాయకత్వము: పుణ్యపాపచింతలేనివాడు శిశువు.
-విస్మృతి:అచారిత్రకత ( living unhistorically),కిందటి క్షణం తాను ఏంచేశాడో జ్ఞాపకంలేకపోవడం.
-ఒక కొత్త ప్రారంభము:కిందటి క్షణం తాను ఏంచేశాడో జ్ఞాపకంలేనపుడు, ప్రతి క్షణము కొత్త క్షణం, ప్రతి పని ఒక కొత్త ప్రారంభం.అచారిత్రకంగా బతకడం.
-ఒక ఆట: పసివాడికి ప్రతిపని ఆటే. పుణ్యపాపచింతగాని, ప్రమాదభయంకాని, శిక్ష విధిస్తారేమో అన్న భయంకాని చేసేస్తాడు.
-స్వయంగా తిరిగే చక్రము:ఎవడో వాడి ఆటగా, వాడి ఆనందంకోసం, తిప్పితే తిరిగే చక్రం కాదు. దానంతట అది తిరగవలె , తిరగడం తన ఆటగా తిరిగే చక్రం.
-మొదటి కదలిక: ప్రతి పని సృష్టి ప్రారంభమన్నంత నూతనం.
-పవిత్రమైన ఆమోదము:విధిని పాటించి ఆచరించిన కర్మ  అపవిత్రకర్మ. అలా కాక, స్వేచ్ఛగా చేసే కర్మ పవిత్రం. మోదంలోనుండి కలిగే  ఆమోదం పవిత్ర ఆమోదం.

  ఈ లక్షణాలన్నీ వెనుకటి శిశుపశువిషయమైనశారీరకమీమాంసావ్యాసంలో (నీచ-1/7) చూశాం.

  విధినిషేధాల స్థానంలో యిపుడు స్వేచ్ఛావర్తనం. ఇష్టంగా సంతోషంగా పనులు చేసుకోడం. కర్మనుండి ముక్తి కాదు, కర్మలో ముక్తి.
 
   క్రూరమృగంలానో , హీనమైన బొద్దింకలానో  కాక, మనిషి గా బతికమని చెప్పడం నీచ అతిమానవతత్త్వోపదేశసారం. దీనిని రాజకీయప్రయోజనాలకు వాడుకుంటే అది అతని దోషంకాదు. ఒక మనిషిని మరొక మనిషిగాని, ఒక జాతి మరొక జాతిని కాని బలహీనపరచడం నీచ ఆశయంకాదు. అతని స్వభావము కాదు. ఒక గుర్రాన్ని హింసిస్తున్న దృశ్యం చూసి, దాన్ని కాపాడే ప్రయత్నంలో మతిపోగొట్టుకుని పిచ్చాసుపత్రిలో దయనీయంగా మరణించిన నీచ,  హింసను పరపీడనను ప్రేరేపిస్తాడు అనడం న్యాయంకాదు.జారతూస్ట్ర అతిమానవుడి నమూనా. అతన్ని గురించి అడవిలో ఆశ్రమవాసి ఏమన్నాడు ? “ అతని చూపు స్వచ్ఛం.ద్వేషం అతని నోటి దరిదాపుల తచ్చాడదు. అతడి నడక నర్తనంలా ఉండదూ? మారాడు జారతూస్ట్ర; జారతూస్ట్ర పసివాడైనాడు.”( Z.Prologue.1.2.) “ నేను మనిషిని ప్రేమిస్తాను”, అన్న జారతూస్ట్ర ఎటువంటి అతిమానవుడో అర్థంచేసుకోలేమా?  నీచ ఒక ఆధ్యాత్మిక ప్రవక్త. ఆ కోణంనుండి అతన్ని అర్థం చేసుకోవడమే న్యాయం.

  ఒక అలెక్సాండరో  నెపోలియనో హిట్లరో మనం  ప్రయత్నించి సృష్టించగలిగినవారు కారు. యాదృచ్ఛికంగా, అపవాదంగా కాలచక్రగతిలో  కలిగినవారు. (... a type of human being who has come by chance, as an exception, but never because he was aimed at": AC.). అలెక్సాండర్లు హిట్లర్లు మాత్రమే కాదు, అరవిందులు వివేకానందులు కూడా. ఒక వాల్మీకి ఒక మైకెలేంజిలో కూడా అతిమానవులే. చైతన్యం ఒకటే. కాని అది ఒకడిలో రాక్షసుడుగా ఎదుగుతుంది, మరొకడిలో  మహర్షిగా దిగుతుంది .

   దిగిపోవడం లోకదృష్టిలో అవమానకారణం, అపహాస్యవిషయం. ఇది నీచ రచనల్లో మరో ముఖ్యాంశం .అతిమానవుడు ఎత్తులకు ఎదగడు, లోతులకు దిగుతాడు.Thus spake Zarathustra ప్రారంభంలో, జారతూస్ట్ర సూర్యుణ్ణి ఉద్దేశించి అంటాడు:

“ ...నేను  లోపలికి దిగిపోవాలి, సాయంత్రం నీలాగా. నీవు అపరాంబుధిలోకి  దిగిపోయి అధోలోకాలకు వెలుగునిస్తావు కదా! అలాగా.(“Like thee must I GO DOWN”.Z:1 pro.1.)

    అతిమానవుడు అవతరిస్తాడు (“I GO DOWN”).అవతరణం అంటే దిగడం.లోకం దృష్టిలో  అది పతనం

-“పతనం

“వాడు కుంగుతున్నాడు, పడిపోతున్నాడు”,అంటావు  అపహసిస్తూ.
జాగ్రత్తగా చూడు. నీవున్న చోటుకే నడుస్తున్నాడు వాడు.
అమితానందభారంతో దిగుతున్నాడు.అతడి అమితప్రకాశంలో  నీ చీకటి చెల్లాచెదురు.”

              (సముల్లాసశాస్త్రం: 47.Preludes కు నా అనువాదం: GS:Preludes )

చీకటిలోకాలలో ఉన్న మనుషులను ఉద్ధరించడానికి అతిమానవుడు ఆదిత్యుడై అస్తమిస్తాడు.

      మనిషి ఎదగడం కేవలం కాలగతికే వదలవలసిందా? కాలం అప్పుడప్పుడూ ఒక అతిమానవుణ్ణి యీలోకంమీదికి విసిరేస్తుందా? మనిషి చేయగలిగిందేమీ లేదా? ఈ విషయమే నీచ చెబుతున్నాడు:  “చైతన్యాన్ని చిత్రహింసలు (“tyrannised over”) పెట్టారు తత్త్వశాస్త్రవేత్తలు, వారికి కావలసినవన్నీ దానిచేత పలికించారు.”( G.S.) దాని చేయి మెలితిప్పి కాకపోయినా, దాని నెత్తిన ఒక కిరీటం పెట్టి,  ఎలా పలికిస్తేనేం, పలికించారు. అందరిలో ఉన్నది ఒకే చైతన్యం,నిజమే. ఆ చైతన్యం పెంచుకుంటే పెరిగేదే కాని, అది ఒక సిద్ధవస్తువు కాదు (“a fixed, given” ), అంటాడు నీచ.అదే బొద్దింకకూ మనిషికి తేడా.అందుకే “జంతూనాం నరజన్మ దుర్లభం” , అన్నాడు శంకరుడు. తనను తాను ఉద్ధరించుకునే శక్తి మనిషికి మాత్రమే ఉంది.

  అయితే అస్తిత్వవాదులెవరూ ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు కారు. కీర్క్ గార్డ్ లా “ మంద అసత్యం” ( “Crowd is the untruth.”) అని నమ్మేవారే. (“మనిషి అనేకంగా పుడతాడు, ఒక్కటై చనిపోతాడు.” “Man is born as many, but dies as single.” Heidegger).
ప్రజలందరి సత్యము తన  సత్యంకాదు. తన సత్యం తానే సాక్షాత్కరించుకోవలె.( “ I must find the  truth that is true only for me”, అన్నది కీర్క్ గార్డ్ ప్రసిద్ధవాక్యం.ఇది అస్తిత్వవాదంలో ప్రధానాంశం.

  విలువలకు విలువకట్టేవాడు అతిమానవుడు. విలువలేని విలువలను కొని జీవితవ్యాపారంలో నష్టపోడు. పరలోకానికి యీలోకాన్ని, ఆత్మకు దేహాన్ని బలి యివ్వడు. ఇహమే పరమమని నమ్మేవాడు.దొరికిన బతుకును స్వీకరించి, కృతజ్ఞతతో సంతోషంగా స్వచ్ఛంగా  బతికేవాడు. ఈ కష్టాలు యీ సుఖాలు , యిదే బతుకు మళ్ళీ మళ్ళీ బతకడమా అన్న నిస్పృహ కాదు, బతుకుతాను (Eternal Recurrence ) అన్న నిశ్చయం ఉన్నవాడు అతిమానవుడు.

  అతిమానవుడు శూన్యవాది కాదు, దేవుడిమరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించేవాడు. అతిమానవుడు అరాచకవాది కాదు, నిరంకుశరాజ్యాన్ని కూలగొట్టి స్వరాజ్యం సంపాదించుకున్నవాడు.

   మనిషి మనిషి గా బతికితే  అతిమానవుడు. “ ఆత్మానం మానుషం మన్యే.” దిగివచ్చినదేవుడైనా సరే, నేలమీద మనిషిలా నడవవలసిందే. రాముడు తన సత్యాన్ని తన ధర్మాన్ని తాను దర్శించుకున్నాడు. తండ్రి, తల్లి, కులగురువు, భార్య- ఎవరు  ధర్మం చెప్పినా ఆ ధర్మం తన ధర్మం కాదని అనగలిగినవాడు. తన ధర్మమేదో తాను నిర్ణయించుకుని, తన దారి తాను నిర్మించుకుని నడిచినవాడు. (“ l want to find the truth that is true only for me.” Kierkegaard).  త్రేతాయుగపు పురుషోత్తముడు ఆనాటి అతిమానవుడు.

-ఆదికవివాల్మీకి ఆదిఅస్తిత్వవాదకవి:

“ఏ శాస్త్రమైనా (కావ్యమైనా) ఏ వస్తువును స్వీకరించినా, అడగవలసిన మొదటి ప్రశ్న: “యిది మనిషి బతుకుకు ఎలా ఉపయోగిస్తుంది?” (“...metaphysical inquiry must be posed as a whole and from the essential position of the existence [Dasein] that questions.”Heidegger: What is Metaphysics? )  అడగవలసిన ప్రశ్న మనిషిగురించి, యీ కాలంలో,  యీ లోకంలో మనిషిగురించి.వాల్మీకి అదే అడిగాడు.అదీ ఎలా అడిగాడు? దేశకాలాలను ముడివేసి అడిగాడు. “కోన్వస్మిన్ సాంప్రతంలోకే”: అస్మిన్ లోకే, సాంప్రతం అని అడగవలె. కాని వాల్మీకి అలా అడగలేదు.ఆ రెంటినీ మెలివేసి ఒకటిగా అల్లి, ‘అస్మిన్’ కు ‘లోకే’ కు మధ్యలో ‘సాంప్రతం’ బిగించాడు, జారిపోలేనంత గట్టిగా. హైడెగర్ తన Da-sein లో రెండు అంశాలను, ( ‘Da’[there], ‘sein’ [Being]) మధ్య ఒక మేకు (-) కొట్టాడు,  వాటిని విడదీశాడు. అస్తిత్వవాదపు ఆత్మ మనిషి, యీ కాలము,యీ లోకములోని మనిషి. ('లోకే' అంటే కేవలం యిహమని కాదు,location కూడా, ‘Da’ ). వాల్మీకి ఆదిఅస్తిత్వవాది కనుక, ఆదికవికూడా కనుక , దేశకాలాలను మెలివేశాడు. ఇలా అస్తిత్వప్రశ్నతో , దేశకాలాలలోని మనిషి గురించిన ప్రశ్నతో, మొదలైన కావ్యం బహుశా ప్రపంచంలోనే మరొకటి లేదేమో!



                                                    ***




 








No comments:

Post a Comment