Sunday, June 30, 2019

పునరుత్థానము-టాల్స్ టాయ్ Resurrection

"పునరుత్థానము"
(‘The Resurrection’ by Tolstoy.)

[ఈ నవల 1889లో రాశాడు టాల్స్టాయ్.ఇది చదువుతున్నపుడు అనిపిస్తుంది,ముఖ్యంగా కొన్ని ఘట్టాలలో,రష్యన్ విప్లవం ( 1917 ) దూరంలో లేదని.అగ్నికిరీటపు ధగధగలు కనబడడం లేదు.యజ్ఞహోమం భగభగలు లేవు.కాని సమిధల సమీకరణ కనిపిస్తుంది. ఈ  నవలలో  ప్రధాన విషయం విప్లవం కాదు.  ఇద్దరు  వ్యక్తులు వారి గమ్యాలు వెదుక్కొంటున్నారు. వారి కథ ప్రధానం.వారి  కథతో   విప్లవకారణాలు పెనవేసుకొని, రెండు కథలు కలిసి నడుస్తాయి.  ఆ యిద్దరూ వ్యక్తులుగా ఎదగడమే నవలలో ప్రధానవిషయం. ఎటువంటి అవ్యవస్థలో అణచివేతలో కూడా,మనిషి ఎదగవచ్చు, మనిషిని నిలుపవచ్చు,అని చూపగలిగేది సాహిత్యమే. సాహిత్యప్రయోజనమే అది.
    మన దేశంలోను 1917 లో విప్లవం కాదు కాని,విప్లవాత్మకమైన ఉద్యమం( చంపారన్ సత్యాగ్రహం) నడిచింది. దాని వెనుక ముందు ఏదైనా గొప్ప నవల వచ్చినట్టు తెలియదు.
    రచయితలు విప్లవాలను రచించ గలరు.విప్లవాలు రచయితలను సృష్టించలేవు.
    ఉద్యమాలు, విప్లవాలు వస్తాయి పోతాయి. నిలిచిపోయేది సాహిత్యం.]

     "ఆనా కెరినినా", "యుద్ధము, శాంతి" తరువాత   టాల్స్టాయ్  సుమారు పాతిక సంవత్సరాలకు  రాసిన  మరో నవల , అతని చివరి నవల, "పునరుత్థానము" (“Resurrection”) .సైబీరియాలో మగ్గుతుండిన 'దుఖోబోర్' అనే ఒక క్రైస్తవ తెగవారిని  పునరావాసం కొరకు కెనడాకు పంపడానికి  అవసరమైన నిధిసేకరణకొరకు రాశాడు ఈ నవల. కాని వాస్తవంలో ఇది ఆయన ఎవరి కొరకో రాసిన నవల కాదు. తన కొరకు రాసుకొన్నది.రాయకుండా ఉండలేక రాసినది. తన జీవితాన్ని, తన అసదృశమైన రచనాశక్తిని,  సార్థకం చేసుకోవలెనని రాసిన నవల. తనను ప్రపంచసాహిత్యంలో అగ్రశ్రేణిలో నిలబెట్టిన తన మొదటి నవలలు రెండు తనకు సంతృప్తినివ్వలేదు. అంటే ఈ చివరి నవల రాయడం రచయితగా వ్యక్తిగా ఆయనకు ఎంత అవసరమైందో తెలుస్తున్నది. దీనిని రాయడానికి  టాల్స్టాయ్ కి  పదకొండు సంవత్సరాలు పట్టిందట.  ఆయననుండి  మరో నవలకోసం పాతికేళ్ళు ఎదురుచూచిన పాఠకులు మహదానందంతో దాన్ని ఆదరించారు. మొదటి రెండు నవలలను మించి కాపీలు అమ్ముడుపోయాయి. 'టాల్స్టాయ్ రచనలలో అన్నిటికంటే ఉత్కృష్ట మైనది',  అన్నారు అందరూ ఆనాడు. ఈ నాడు దానికి అంత ఆదరణ లేదు. మొదటి రెండు నవలలతో పోల్చదగిన  సాహిత్యగుణాలు యిందులో లేవని అంటారు, చదివిన కొందరు. టాల్స్టాయ్ కూడా  ఈ నవల గూర్చి పూర్తి సంతృప్తి చెందలేదు. "ఆ నవల సంతృప్తికరమైన సంపూర్ణరూపం సంతరించుకొనే లోపలే బయటపడింది",అన్నాడు ఆయన స్వయంగా. రచయిత భావాన్నే బహుశా Percy Lubbock ప్రతిధ్వనించాడు:  “అది ఒక బృహద్రచనలోని శకలం",('the fragment of an epic')అని.('"The Craft of Fiction" by Percy Lubbock:Jonathan Cape,1921)
     ఇంతకూ ఈ నవలాశిల్పం గురించిన నిజం ఏమిటి? వయసుపైబడి, టాల్స్టాయ్ రచనాపటిమ జవసత్త్వాలుడిగిన కారణంగా ఈ నవల అతని మొదటి రచనల స్థాయిని అందుకో లేక పోయిందా? లేక,  వయసుతో పొందిన  మన:పరిపాకానికి అనుగుణంగా పరిణతమైన  ఆయన  శిల్పం మనం అర్థం చేసుకోలేకపోతున్నామా?  కొందరు రచయితలు, వారి మొదటి రచనలలో చూపిన ప్రతిభ తరువాతి రచనలలో చూపలేకపోయారు. కాని, షేక్స్పియరు  “The Tempest " రాసినప్పుడు ఆయన మంత్రశక్తి మందగించింది అనగలమా? టాల్స్టాయ్ చివరి రచన కూడా అటువంటిది కాదా? (ఇక్కడ సామ్యం, రచయిత పరిణతశిల్పంలో. షేక్స్పియరు వయసు పైబడక ముందే తన మంత్రదండాన్ని విసిరిపడేశాడు.అది వేరే విషయం.) గొప్పరచయితలు రచనల ప్రారంభదశలో సాధారణంగా శిల్పానికే  పెద్దపీట వేస్తారు. ‘వస్తువు కూడా శిల్పంలో అంతర్భవిస్తుంది, దానికి ప్రత్యేకమైన అస్తిత్వం లేదు’  అంటారు. కాని ఈ వాదము యీ కావ్యదృష్టి వయసు గడిచే కొద్దీ మారుతుంది. వస్తువు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇది రచనాపాటవం ఉడిగిన కారణంగా కాదు. జీవితానుభవంలో జీవితదృక్పథంలో  కలిగిన మార్పు దీనికి కారణం. అయినా తమలో కలిగిన ఈ  మార్పును చాలామంది రచయితలు  ఒప్పుకోలేరు. తమ రచనా శక్తి తగ్గడం కారణమని లోకం అనుకుంటుందేమోనన్న సంకోచము, శిల్పప్రాధాన్యాన్ని తక్కువ చేస్తున్నామేమోనన్న సంశయము ఒప్పుకోనివ్వవు. ప్రస్తుత నవలలో (“The Resurrection”) టాల్స్టాయి మొదటి రచనలలోని శిల్పం లోపించిందని, వస్తువు ప్రధానమై, రచయిత తన ధర్మాగ్రహం వ్యక్తం చేయడానికి నవలను  సాధనంగా వాడుకున్నాడని, ఒక  సాధారణభావం ఏర్పడింది.  ఈ భావం ఎంతవరకు సరి అయినది పరిశీలించవలె.
     
         ఈ నవలలో రెండు ప్రధాన పాత్రలు,కథానాయకుడు నెఖ్లుడోఫ్, కథానాయిక మేస్లోవా. మూడవ పాత్ర,  నవలను నిండి వ్యాపించిన  రచయిత ధర్మాగ్రహం. ఆ నాటి రాచరికపు అరాచకం, న్యాయవ్యవస్థను నిండిపోయిన అన్యాయం, అధికారుల అమానుషత్వం, మనిషిని మనిషిగా చూడని చూడనివ్వని రాజ్యం, మతిలేని మతం--వీటన్నిటిపై రచయిత ఆగ్రహం మరో ప్రధానపాత్ర. బైబిల్ లోని శామ్సన్ తానున్న మొత్తం భవనాన్ని  ఒక ఊపు ఊపి  కూలగొట్టి,  అందులోని వారినందరిని సర్వనాశనం చేస్తాడు, తానూ ఆ కుప్పలో కలిసిపోతాడు.  అటువంటి ధర్మాగ్రహమే ఈ నవలనంతా వ్యాపించి ఉంటుంది. నిజమే, ఈ ఆగ్రహం కథను కావ్యం కాకుండా చేసిందా? కాని ఈ ధర్మాగ్రహమే, దాని పర్యవసాయమే కావ్యవస్తువు ఎందుకు కారాదు?
         
  కథానాయకుడు,నెఖ్లుడోఫ్
   
      నవల ఒక న్యాయస్థానంలో ఒక హత్యానేరవిచారణ సన్నివేశంతో మొదలవుతుంది. మేస్లోవా ప్రధాననిందితురాలు. ఆమె ఒక వేశ్య. ఆమె వద్దకు వస్తూ ఉండే ఒక వ్యక్తిని అతడి డబ్బుకోసం ఆమె విషమిచ్చి చంపిందని ఆమెపై నేరం. జూరీసభ్యులలో ఒక రాకుమారుడు, నెఖ్లుడోఫ్, కూడా ఉన్నాడు. అతడు ఖైదీని గుర్తుపడతాడు. సుమారు పది సంవత్సరాల వెనుక ఆమెను తన ఆంటీల  యింట్లో కలిశాడు.వారు ఆమెను ఒక నిరుపేదకుటుంబంనుండి  తెచ్చుకొని  తోడుకోసం పెంచుకున్నారు. ఆ యింట్లో ఆమె  పనిపిల్లకంటే ఎక్కువ,  కూతురుకంటే తక్కువ.అక్కడ  నెఖ్లుడోఫ్ ఆమెను  గర్భవతిని చేసి, వంద రూబుల్స్ చేతిలో పెట్టి చేతులు తుడుచుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆమెను చూడడం ఇప్పుడు ఈ స్థితిలో. విచారణలో తెలిసింది, ఆమె ఆనాటి  కటూషా,( “కేటరీనా”ను కుదించిన పేరు) అని, ఆ తరువాత ఆమె వేశ్యావృత్తిలో జీవితం గడిపిందని.ఆమె ఈ దుస్స్థితికి తను ఆమెకు ఆనాడు చేసిన అన్యాయమే కారణమని,ఆమెను ఆ పాపకూపం నుండి బయటకు తెచ్చి ఆమెకు న్యాయం చేయవలె, అవసరమైతే ఆమెను పెళ్ళికూడా చేసుకోవలె, అనుకుంటాడు, నెఖ్లుడోఫ్.  అంటే, ప్రధానపాత్రలో పరివర్తన కథాప్రారంభంలోనే  జరిగిపోయింది.అతని అపరాధకారణంగా అతనిలో కలిగిన  అంతస్సంఘర్షణ, సంక్షోభము, వాటి ఫలితంగా అతనిలో కలిగిన  మార్పు,  కథా వస్తువు కాదు, దోస్తోవ్ స్కీ నవలలోలాగా. ఈ టాల్స్టాయ్ నవలలో వస్తువు , నేరము శిక్ష కాదు,  పాపము పశ్చాత్తాపము కాదు. ఇందులో ఇతివృత్తము,   పరివర్తన ప్రవర్తన. తన బాధ్యతారహితమైన జీవనవిధానంమీద అతనికి విరక్తి కలుగుతుంది. తన సుఖజీవనము,దానికి ఆధారమైన తన ఆస్తులు, సమాజంలో తన అంతస్తు    అన్నీ వదిలివేయవలె అని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి అనుగుణంగా వెంటనే చర్యలు మొదలుపెడతాడుకూడా.
     మేస్లోవాకు సైబీరియాలో ప్రవాసము, నాలుగు సంవత్సరాల కఠినశిక్ష విధించింది న్యాయస్థానం. నెఖ్లుడోఫ్  మేస్లోవాని కలిశాడు జైలులో. తన తప్పును క్షమించమని, తనను పెళ్ళిచేసుకుంటానని అంటాడు. అతన్ని గుర్తుపట్టిన వెంటనే ఆమె, ‘ వెళ్ళిపో,నేనో ఖైదీని.నీవు రాకుమారుడివి. నీకిక్కడేం పని. ..ఈ లోకంలో నీ అవసరానికి వాడుకున్నావు అప్పుడు .ఇప్పుడు పైలోకంలో నీ అవసరానికి నేను కావాలి నీకు. నీ ముఖం చూస్తే అసహ్యమేస్తుంది నాకు…నీ కళ్ళజోడు, నీ దిబ్బముఖం!’, అంటుంది.(తన జీవితాన్ని నాశనంచేసిన మనిషి, కనిపించడనుకున్నవాడు, ఇంత కాలానికి కనిపిస్తే,  ఆమె అలా అనకపోవడం  అసహజం.)
     ఇక్కడే మొదలు, అతని పరివర్తనకు పరీక్ష. అతడి త్యాగబుద్ధిని ప్రతి ఒక్కరు శంకిస్తారు, ప్రతి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ  తిరస్కరిస్తారు, ఒక్కొకరు ఒక్కొక కారణంగా. మొదటి తిరస్కారం  తన పరివర్తనకు నిమిత్తమైన మేస్లోవానుంచే కావడం విశేషం.కాని ఆ తిరస్కారంలో అతడు తన నిర్ణయాన్ని నిశ్చయాన్ని సడలనివ్వడు. అలా అని అతని పరివర్తన ఒక సరళరేఖలా సాగిందని అర్థం కాదు. తనలోను వెలుపలకూడా  ఘర్షణను  ఎదుర్కొన్నాడు. రాకుమార్తెలు, సంపన్నకుటుంబాల స్త్రీలు,పెళ్ళి అయినవాళ్ళు కావలసినవాళ్ళు,  అతన్ని పెళ్ళిచేసుకోవలె అని ఆరాటపడుతున్నారు. ‘ఆ చెడిపోయినదాన్ని చేసుకొని ఏం సుఖపడతావు’, అని   అక్క  అడుగుతుంది నెఖ్లుడోఫ్ ను.  ‘ ఇప్పుడు విషయం  సుఖం కాదు’ , అంటాడు.అతని మొదటి పని, మేస్లోవాకు న్యాయస్థానం అన్యాయంగా విధించిన శిక్షను తగ్గించడం. ఆ ప్రయత్నంలో అతడు తాను దూరమవాలనుకొన్న సమాజసభ్యులను, సమాజవ్వస్థను ఆశ్రయించవలసి వచ్చింది. అతనికి యిష్టంలేని పని అయినా , ఆమె కొరకు తనకు నచ్చని వారిని ఎందరినో సహాయం అడిగి తీసుకొనేనాడు. అతని ప్రయత్నం ఒకవైపు సాగుతూ ఉంటుంది.మరొకవైపు ప్రభుత్వం మేస్లోవాను, ఆమెతోపాటు అసంఖ్యాకమైన ఖైదీలను,  సైబీరియాకు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది.నెఖ్లుడోఫ్ మేస్లోవాకు తోడుగా ఉండడానికి సైబీరియా వెళ్ళవలె అని నిశ్చయించుకుంటాడు. అది తనకు తాను విధించుకొన్న  శిక్ష. వెళ్ళేలోపల యిక్కడ తనకు సాధారణజీవనానికి అవసరమైనంత మాత్రమే ఉంచుకొని, తక్కిన ఆస్తులు దానం చేసెయ్యాలనుకొంటాడు. తన భూములున్న గ్రామాలకు వెళుతాడు. తన పొలాలు వ్వవసాయంచేసుకునే రైతులకు ఉచితంగా యిచ్చేస్తాను అంటే, వారు నమ్మరు. ఇందులో ఏదో దురుద్దేశం ఉండి ఉంటుంది అని అనుమానిస్తారు. ఈ విధంగా అడుగడుగునా తన త్యాగబుద్ధిని శంకిస్తూనే ఉన్నా,   త్యాగాన్ని తిరస్కరిస్తూనే ఉన్నా, అతడు తన త్యాగబుద్ధిని, త్యాగాలను మానుకోడు.ఇది నిజమైన త్యాగానికి నికషం. త్యాగం ఒకరిని ఉద్ధరించడానికో, వారి మెప్పు కొరకో చేసేదికాదు. ఒకరి ఆమోదంపై ఆధారపడేదీ కాదు. ఆత్మోద్ధరణకొరకు చేసేది.
     మేస్లోవాను కలవడానికి తను తరచు జైలుకు వెళ్లడం, అక్కడి దుర్గంధం దుర్మార్గం దుస్థితి , యివి నవలలో సమాంతరంగా సాగే కథావస్తువులు. నిజానికి ఈ రెంటినీ పడుగుపేకగా అల్లిన రచయిత నైపుణ్యం అద్భుతం. ఖైదీలను సైబీరియాకు తరలించడం నవలలో చాలాభాగం ఆక్రమిస్తుంది.వివిధ జైళ్ళనుండి ఖైదీలను ఒకచోట చేర్చారు.అందులో చాలామంది ఏ నేరము చేయని వారే, మేస్లోవా వలె.  న్యాయనిర్ణయంలో నిర్లక్ష్యం వల్ల, విచారణలో లోపం వల్ల, ఎందరో జైళ్ళలో ఏళ్ళతరబడి మగ్గుతున్నారు- యువకులు,ముసళ్ళు, స్త్రీలు, తల్లులవెంట పసిపిల్లలు, రోగులు. అందరికీ కాళ్ళకు గొలుసులు. ఆ గొలుసులు ఈడ్చుకొంటూ వారిని రైలుస్టేషనుకు మండే ఎండలో నడిపిస్తారు. నడవలేని వాళ్ళు నడుమనే రాలిపోతారు, "నీళ్ళటాంకరునుండి నీళ్ళు దారి పొడుగునా ఒలికి పోయినట్టు." స్టేషనులో పధ్నాలుగు పెట్టెల  ట్రెయిన్ సిద్ధంగా ఉంది. ఒక పెట్టె  పోలీసులకు.పదమూడు పెట్టెలలో ఖైదీలు. కాళ్లకు  గొలుసులు, ఎండకు పెనంలా కాలిపోతున్న పెట్టెలు, మైళ్ళు నడిచి చెమటలు. ఆ ట్రెయిన్ కదులుతుంటే చూచినవారికి ‘ రష్యన్ విప్లవం ఎంతో దూరంలేదు’, అనిపిస్తుంది. ఈ ఖైదీల దుస్స్థితి  , మేస్లోవాతో కలిసి,  నెఖ్లుడోఫ్ జీవితగమనంలో భాగమవుతుంది.
     నెఖ్లుడోఫ్  ఖైదీ కాడు.కనుక ఖైదీల  ట్రెయిన్లో వెళ్ళనివ్వరు. మరో రెండు గంటలలో  వేరే ట్రెయిన్లో మేస్లోవాను అనుసరిస్తాడు. పెర్మ్ అనే స్టేషన్ సైబీరియా చేరడానికి ముందు, చివర ఆగవలసిన ప్రదేశం. అక్కడ మేస్లోవాను కలుస్తాడు.ప్రయాణంలో ఆమెకు కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. సిమన్సన్ ఆమెకు దగ్గరవుతాడు,పెళ్ళి చేసుకుంటానంటాడు. మేస్లోవా కాదనదు.సిమన్సన్  నెఖ్లుడోఫ్ అభిప్రాయం  అడుగుతాడు. ‘ఆమెకు స్వేచ్ఛ ఉంది. నాకు లేదు’,అంటాడు నెఖ్లుడోఫ్. అంటే, ఆమె తన త్యాగాన్ని స్వీకరించినా తిరస్కరించినా, తన పరివర్తనలో ప్రవర్తనలో  మార్పు ఉండదు, అని. మేస్లోవా కఠిన శిక్షను తగ్గించడానికి అతడు చేసిన ప్రయత్నాలు వాళ్ళు సైబీరియా దారిలో చివరి దశలో ఉండగా ఫలించాయి. కాని మేస్లోవా సైబీరియాలో సిమన్సన్ తో ఉండడానికే నిర్ణయించుకుంటుంది. నెఖ్లుడోఫ్ కు సంతోషాన్నిచ్చే పరిణామం కాదు.కాని అతని జీవితలక్ష్యం యిప్పుడు సంతోషం కాదు,పరమార్థసాధన. కథానాయకుడి   సుదీర్ఘమైన ధర్మచింతనతో, బైబిల్ లోని దశనిర్దేశాల మననంలో, ఆ దిశలో తన జీవితాన్ని నడిపించవలె అన్న అతడి సంకల్పంతో నవల ముగుస్తుంది.
      నెఖ్లుడోఫ్ పరివర్తన  త్యాగము, నవల ముగిసినప్పటి అతని మన:పరిపాకము అతనిని చాలా ఎత్తులో నిలుపుతాయి. ‘తనది’(’మమ’) త్యాగం చెయ్యడం నవలలో ఆద్యంతము ప్రధాన కథావస్తువు.ఇక, ‘తనను’(‘అహం’) త్యాగం చేసే దారిలో నడిచే సంకల్పంతో,   నవల ముగుస్తుంది.
         మరి ‘చెడిపోయిన’ మేస్లోవా కథ?

మేస్లోవా

    మేస్లోవా అసలు పేరు కేటరీనా. పెంచిన వారు అంత గొప్ప పేరుతో పిలవడం యిష్టంలేక,  కటూషా అనేవాళ్ళు. ఆమె తల్లి బానిస(serf),అవివాహిత. అయిదుగురు పిల్లలను కనవలసివచ్చింది,తన యిష్టానిష్టాలతో సంబంధం లేకుండా. కన్నపిల్లల్ని పెంచలేక వదిలేసింది. వాళ్ళు చనిపోయారు.ఆరవపిల్ల కేటరీనా. ఈమెకూడా వారిలాగే పోవలసిందే.  కాని, ఊరిలోని యిద్దరు సంపన్నస్త్రీలు, (మేరీ, సోఫియా) ఆ పిల్ల పోషణకు తల్లికి సహాయం చేశారు. ఆ పిల్ల మూడో ఏట, తల్లి పోయింది. మేరీ, సోఫియాలు ఆ పిల్లను యింటికి  తెచ్చుకుంటారు.ఆ యిద్దరిలో ఒకరు ఆ పిల్లను కూతురుగా చూస్తే, రెండవ ఆమె పనిపిల్లగా పెంచింది. వాళ్ళిద్దరూ కథానాయకుడికి ఆంటీలు. నెఖ్లుడోఫ్ ఒకసారి  వాళ్ళ యింటికి వస్తాడు, సెలవులు గడపడానికి. అప్పుడు కటూషాను చూస్తాడు,  ప్రేమిస్తాడు.అప్పటికి అతడికి  ప్రేమ అంటే ఒక స్వచ్ఛమైన భావమే.ముద్దుతో ఆగిపోతారిద్దరు. మూడు సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తాడు.ఈ సారి ముద్దుతో ఆగడు. మరో అడుగు ముందుకు వేస్తాడు.  (అతని మొదటి ముద్దుకు రెండవ ముద్దుకు మధ్య, నవలలో ఒక అధ్యాయం అంతరాయం ఉంది. ఆ రెండు ముద్దులకు అంతరం ఆ అధ్యాయంలో ఉంది. ఆ అధ్యాయం పేరు, ‘సైన్యంలో జీవితం’.’Life in the Army’. దీని చర్చ తరువాత చేద్దాం.)కథానాయకుడు  తిరిగివెళ్ళేలోపు ఆమెను గర్భవతిని చేస్తాడు.(అదే కథకు బీజం.)  వెళ్ళిపోతూ ఆమె చేతిలో బలవంతంగా వంద రూబుల్స్ పెట్టి వెడతాడు. (అతడు రాకుమారుడు.అంతకంటే తక్కువ యివ్వలేడు!). ఆ తరువాత పది సంవత్సరాలకు ఆమెను చూడడం  కోర్టులో.ఈ మధ్య పది సంవత్సరాలలో ఆమె బిడ్డ పుట్టి పోవడం, బతుకు గడవడంకోసం ఆమె వేశ్యగా మారడం, చేయని హత్యకు  జైలుకు వెళ్లడం,యిప్పుడు   ఈ హత్యానేరవిచారణ-- యివన్నీ జరిగిపోయాయి.  ఇక్కడ అసలు కథ మొదలవుతుంది.
      నెఖ్లుడోఫ్ తన తప్పును సరిదిద్దుకోవాలనుకొంటాడు.మేస్లోవాను క్షమించమంటాడు. ఆమె  హేయమైన గతాన్ని తెలిసికూడా,  ఆమెకిష్టమైతే ఆమెను పెళ్ళి చేసుకొంటానంటాడు. అతడు రాకుమారుడు.మేస్లోవా తను జన్మలో ఊహించని స్థాయి అతడు  కల్పిస్తానంటే ఎగిరి గంతేసిందా?లేదు.ఆమె తిరస్కరించింది. ఆ క్షణంలో అది ఆపుకోలేని ఉద్వేగం కావచ్చు. ఉద్వేగం క్షణికమే, కాని నిర్ణయం చివరి వరకు, నవల ముగిసే వరకు, మారదు. కాలం గడిచి ఉద్వేగం ఉడిగి, అతని త్యాగతత్త్వం అర్థం చేసుకొన్నది మేస్లోవా.  కాని నిర్ణయం మార్చుకోలేదు. అతడూ  తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.అతడు ‘ఒక సారి అడిగాను, చాలు.ఇంక ఎన్ని సార్లు అడగాలి?’, అనుకోలేదు. ఆమెను జైలులో చాలా సార్లు కలిశాడు, ఆమెకు ఊరట కలిగించడానికి, అవసరమైన సహాయం చేద్దామని. జైలులో ఆమెను కలవడం అంత సులభం కాదు. అనుమతి కొరకు ఎంత మందినో ఆశ్రయించాలి. ఇంత కష్టపడి ఆమెను కలిస్తే, ఆమె తన కొరకు ఏమీ కోరేది కాదు. తోటి ఖైదీల కష్టాలు చెప్పి, అతడికి ఈ సహాయం చేయగలరా, ఆమెకు ఆ సహాయం చేయగలరా, అని అడిగేది. నెఖ్లుడోఫ్  ప్రిన్స్ అని, పలుకుబడిగలవాడని తెలిసి, ఖైదీలు మేస్లోవాను తమ తరఫున అడగమనేవారు. అతడు చేయగలిగినది చేసేవాడు కూడా. నెఖ్లుడోఫ్ , మేస్లోవా  ఇద్దరూ ఒకే దిశలో ఎదుగుతున్నారు. ఆ ఎదుగుదలలో యిద్దరూ ఒకరికొకరు దూరమైపోతున్నారు. వైముఖ్యంతో కాదు,అనాసక్తతతో. ప్రేమ విలువ తెలియక కాదు,ప్రేమ పరిధులు విశాలమై.
      అతడు  చాలామార్లు  ఆమెను చేసుకొంటానంటాడు. అడిగినప్పుడల్లా ఆమె తిరస్కరిస్తూనే ఉంది. కాని ఆ తిరస్కారస్వరూపం కాలక్రమంలో  మారుతూంటుంది. మొదటి తిరస్కారం కోపంలో ఉద్వేగంలో కలిగింది. తరువాతి తిరస్కారం అతని త్యాగము  ప్రేమతత్త్వము  తెలిసి, అతని జీవితాన్ని తన గతంతో మలినం చేయలేక, కృతజ్ఞతతో  ప్రేమతో చేసిన తిరస్కారం. నెఖ్లుడోఫ్ ఆమె శిక్షను తగ్గించే ప్రయత్నాలు పట్టువిడవక చేస్తూనే పోయాడు. చివరకు, ప్రయాణపు చివరి దశలో, సైబీరియా  సరిహద్దులు చేరుకొన్నాక, అతని ప్రయత్నం ఫలించి, ఆమె కఠినశిక్షను సాధారణశిక్షగా తగ్గిస్తూ ఉత్తరువు వచ్చింది. ఆమె సైబీరియా వెళ్ళనవసరం లేదు. నెఖ్ల్లుడోఫ్  మళ్ళీ అడిగాడు పెళ్ళిచేసుకొంటానని. ఆమె మళ్ళీ కాదన్నది.కాని అప్పటి కారణం, ఆమెకు పెళ్ళిపై కోరిక రాలిపోయింది. సిమన్సన్ అనే ఒక ఖైదీ ఆమెను చేసుకొంటానన్నాడు. ఆమె అతనితో సైబీరియా వెళ్ళిపోవలెనని నిశ్చయించుకొన్నది. నెఖ్లుడోఫ్  మేస్లోవాను ప్రేమించడం అతని కొరకు, ఆత్మార్థం.సిమన్సన్  ఆమెను  ఆమె  కొరకు యిష్టపడుతున్నాడు.ఆమెకు తెలుసు,తనను చేసుకున్నవాడికి జీవితంలో సంతోషం ఉండదని. నెఖ్లుడోఫ్  ఆమెను అడిగాడు, 'సిమన్సన్ ను పెళ్ళిచేసుకోడం నీకు యిష్టమేనా?' అని. ఆమె అన్నది, 'నా  గతంతో,  నేనతనికి  ఎటువంటి భార్యగా ఉండగలను?'   సిమన్సన్ ను పెళ్ళి చేసుకోవాలి అనుకోలేదు,
 సైబీరియాలో అతనికి తోడుగా ఉండాలనుకొన్నది, అతడు తనను కోరుకొంటున్నాడు కనుక.
        ఆమె శిక్షను  తగ్గించినా, ఆమె శిక్ష పూర్తిగా అనుభవించదలచుకుంది. తాను చేయని హత్యకు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వినిపించినపుడు ఆమె బాధపడలేదా?  ‘అవును.నాకు శిక్ష పడినప్పుడు నేను ఏడ్చాను.మరి? ఆ శిక్షకు భగవంతుడికి నేను బతికున్నంతకాలము దణ్ణం పెట్టుకోవాలి.’ ఆ తీర్పు తాను చేయని హత్యకు విధించిన అన్యాయమైన శిక్ష అనుకోలేదు ఆమె. తాను జీవించిన హేయమైన బతుకుకు భగవంతుడు విధించిన న్యాయమైన  శిక్ష అనుకుంది. ఆమె దృష్టిలో ఇన్నాళ్ళు ఆమె బతికిన బతుకు నిజమైన శిక్ష. న్యాయస్థానం విధించిన శిక్ష యథార్థమైన విముక్తి. ఆమె తన జీవితాన్ని శిక్షలో ప్రక్షాళనం చేయాలనుకొంది. సైబీరియా, ఆమెకు విధించిన శిక్ష కాదు,ఆమె ఎన్నుకున్న purgatorio.
        చివరి సారి నెఖ్లుడోఫ్ పెళ్ళి ప్రస్తావన తెచ్చినపుడు ఆమె అంది: ‘ప్రిన్స్ ! నన్ను క్షమించు. నీవు కోరింది నేను చేయలేదు. నా కోసం ఎంతో చేశావు.నాకు తెలుసు.కాని,  నీకూ ఒక జీవితం కావాలి…’, అంతకంటే ఏమీ అనలేకపోయింది, మరో విధమైన ఉద్వేగంలో. ‘నీకూ ఒక జీవితం కావాలి’, అదీ ఆమె చివరి తిరస్కారస్వరూపం.  అది ఆ "పతిత" ఎదిగిన ఎత్తు.
      ఇద్దరి త్యాగాలలో ఎవరి త్యాగం గొప్పది? ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగారు? ఇద్దరూ కలిసి ఎదిగారు, కలవలేనంత ఎత్తుకు ఎదిగారు.

మూడవ పాత్ర

     ఇప్పుడు కథలో మూడవ ప్రధానపాత్ర, కథను ఆద్యంతము నడిపించిన కనిపించని పాత్ర, రచయిత ధర్మాగ్రహం. ఈ ఆగ్రహం  టాల్స్టాయ్ కి  సహజమైన వ్యంగ్యంలో వ్యక్తమవుతుంది. వ్యంగ్యం (satire) సహజగుణమైన రచయితకు, దాన్ని అధిగమించడం కష్టం. ఈ కష్టానికి ఉదాహరణగా  మన రావి శాస్త్రిని చెప్పుకోవచ్చు. హాస్యం నుండి విషాదంలోకి నడిపించడం సులభమనిపిస్తుంది, షేక్స్పియరుకులాగా.  టాల్స్టాయ్ అనాయాసంగా  వ్యంగ్యంలోనుండి విషాదాన్ని అందుకోగలడు.
      మొదటి  కోర్టుసీనులోనే  వ్యంగ్య విషాదం ఉంది. చేయని హత్యకు మేస్లోవాకు శిక్షవిధించడంలోనే న్యాయవ్యవస్థ పనితీరుపై తన ఆగ్రహం వ్యంగ్యరూపంలో వ్యక్తం చేస్తాడు టాల్స్టాయ్. నిందితురాలికి అది జీవన్మరణసమస్య.కాని, జూరీసభ్యులకు, ప్రధానన్యాయమూర్తికి,  అది ఆ రోజు మూసేయవలసిన మరొక  కోర్ట్ ఫైల్.జూరీసభ్యులు హాజరుకాక తప్పదు కనుక,  ఆ రోజు వాళ్ళవాళ్ళ పనులు మానుకోవలసినందుకు తిట్టుకుంటూ కోర్టుకు వచ్చారు.విచారణ ప్రారంభం అయే లోపు వాళ్ళు దేనిని గురించి ఆలోచిస్తున్నారు? జూరీలలో యిద్దరు వ్యాపారస్థులు, ఉన్ని ధర ఎలా ఉంది అని మాట్లాడుకొంటున్నారు. కొందరు వాతావరణం గురించి మాట్లాడుకొంటున్నారు.ఒక జూరీ సభ్యుడు మరొకణ్ణి పలకరిస్తూ, ‘నీవూ యిరక్కపోయావా? తప్పించకోడం వీలుకాలేదా?’, అని అడుగుతాడు హేళనగా. ప్రధానన్యాయమూర్తి ఆ రోజు విచారణ త్వరగా ముగించి వెళ్ళిపోయే తొందరలో ఉన్నాడు.ఆయనకు ప్రియురాలినుండి పిలుపు వచ్చింది, సాయంత్రం ఆరు లోపల కలుసుకొమ్మని. మరో జూరీసభ్యుడు, రావడం ఆలస్యమైంది. ఆ రోజు ఆయన భార్య యింటి ఖర్చుకు మరి కొంత డబ్బు కావాలంది. ఇవ్వకపోతే ఈ రోజుకు వంట లేదు అన్నది. ఇదీ,  ఒక హత్యానేరవిచారణ చేయడానికి వచ్చినవారి శ్రద్ధ, ప్రధాననిందితురాలి జీవన్మరణ నిర్ణయసమయంలో వారి మనస్స్థితి. జడ్జి తీర్పులో రాయవలసిన ఒక  మాటను వదిలివేశాడు.  ‘నిందితురాలు నేరం చేసినట్టు ఋజువయింది’. కాని “ఆ నేరం బుద్ధిపూర్వకంగా చేసినదికాదు” అన్నమాట చేర్చనందువలన , ఆ లోపాన్ని ఆమె లాయరుగాని,  జూరీగాని  గమనించనందున,  సామాన్యమైన శిక్ష  కఠినశిక్షగా మారింది!
     ఏ సమాజవ్వవస్థ కూడా మనిషిని మనిషిగా చూడడంలేదు, సహానుభూతి చచ్చిపోయింది, అన్న ఆవేదన వ్యంగ్యంలో దాచి ప్రదర్శిస్తాడు టాల్స్టాయ్. ప్రభుత్వయంత్రాంగమంతా ఒకే పనిలో తత్పరమై పనిచేస్తుంది.ఏమిటా పని? మనిషిలోని మనిషిని చంపడం, వేతనాలిచ్చి చంపించడం.  నవల ప్రారంభంలో చెప్పుకున్న రెండు ముద్దుల ముచ్చట యిక్కడ ప్రస్తుతం. మొదటి ముద్దు  నెఖ్లుడోఫ్ సహజస్వచ్ఛభావాలు గల వయసులో,స్థితిలో జరిగింది. రెండవ ముద్దు అతడు ఆర్మీలో మూడుసంవత్సరాలు  పనిచేసిన తరువాత. మిలిటరీసర్వీసులో  అతడు ‘ఆరోగ్యవంతమైన పశువు’గా తీర్చి దిద్దబడ్డాడు. అదీ, మిలిటరీ సర్వీస్ ప్రభావం. మనిషిని పశువుగా మార్చేది ఒక్క మిలిటరీసర్వీసు మాత్రమే కాదు.  అన్ని రాజ్యవ్యవస్థలు చేసేది అదే పని. రచయిత  ఆవేదన  క్రమంగా ఆగ్రహంగా మారి సమాజవ్వస్థలనన్నిటిని ఆక్రమిస్తుంది--.జైళ్ళు, పోలీసు,సైన్యం, ప్రభుత్వపరిపాలనానిర్వహణ, చివరకు  రాజు. రాజ్యాంగంతో ఆగదు.మతము,  మతాధిపతుల హైన్యము వంచన కూడా  టాల్స్టాయ్ ఆవేదనకు ఆగ్రహానికి గురి అవుతాయి.   జైళ్ళలో దుర్గంధము, అధికారుల అమానుషత్వము అవినీతి నెఖ్లుడోఫ్ ప్రత్యక్షంగా అనుభవించాడు. చిన్నచిన్న నేరాలకు ( ఒక భూస్వామి పొలంలో ఎవడిదో పశువు మేస్తుండినదని, వాడికి  ఏళ్ళతరబడి జైలుశిక్ష. ) మేస్లోవాను సైబీరియాకు తీసుకుపోతున్నపుడు, ఆమెను  అనుసరిస్తూ నెఖ్లుడోఫ్ చూచిన దృశ్యాలు, వాటిని  టాల్స్టాయ్ వర్ణించిన విధం ఆయన ఆవేదనను  ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తాయి. ముఖ్యంగా, వేలమంది ఖైదీలను సైబీరియాకు తరలించే దృశ్యం,  మరచిపోలేని విధంగా, అసదృశంగా వర్ణిస్తాడు. టాల్స్టాయ్  వర్ణన అంటే తన మాటలలో చెప్పడం ఉండదు. ఆయన దృశ్యాన్ని మన ముందుంచుతాడు.దీనిని గురించి పైన చెప్పుకొన్నాం.
             పశువులలా ఖైదీలు. పశువులలా పోలీసులు.ఎవరిని చూసి జాలిపడవలె?(అందుకే అన్నారేమో, సమజమని!)
      ఈ ఆగ్రహప్రయాణవర్ణన ప్రయోజనం? టాల్స్టాయ్ రష్యన్ ప్రజలలో విప్లవజ్వాలలు రేకెత్తించవలె అని  రాసిన నవలా యిది?
       టాల్స్టాయ్ ఆగ్రహం లౌకికవ్వవస్థలతో ఆగిపోదు. పారలౌకికాన్ని కూడా ఆవహిస్తుంది. చర్చిని,  క్రైస్తవమతప్రచారంలోని ఆత్మవంచనను కూడా ఎండగడతాడు, నవల చివరిభాగంలో ఒక అధ్యాయంలో. ఒక ఆంగ్లక్రైస్తవప్రచారకుడు,  గవర్నర్ ను తాను అక్కడి  జైళ్ళలోని స్థితిగతులను అధ్యయనం చేయడానికి వచ్చానని, అనుమతించవలె అని అడిగి, అనుమతిపొందుతాడు.కాని  జైలులో అతడు రహస్యంగా బైబిల్ కాపీలు పంచుతాడు ఖైదీలకు. క్రీస్తుసందేశాన్ని  ప్రచారం చేయడానికి, అసత్యాన్ని  కాపట్యాన్ని అవలంబిస్తాడు. అంటే రాజ్యవ్యవస్థలే  కాదు, చర్చి కూడా  కుళ్ళుతో  కాపట్యంతో నిండిపోయింది. అన్ని వ్యవస్థలపై అసహ్యము ఆగ్రహము కలుగుతోంది నెఖ్లుడోఫ్ కు. టాల్స్టాయ్ ని  "క్రైస్తవ అరాచకవాది" (“Christian Anarchist”,) అనడానికి, ఈ ఆగ్రహమే కారణం.
    నవలలో వెనుక ఒక  అధ్యాయంలో  ( “JUST A WORTHLESS TRAMP”)ఇటువంటి  "క్రైస్తవ అరాచకవాది" పాత్రను ప్రవేశపెడతాడు టాల్స్టాయ్.సమస్త రాజ్యవ్యవస్థలనే కాదు, మతవ్యవస్థను కూడా “నేతినేతి” అనుకొంటూ సర్వావస్థావర్జితుడైన “ఒక క్రైస్తవసూఫీ” లేక ఒక సిద్ధుడు ఆ  Tramp పాత్ర.  ఇక్కడ ఒక ప్రశ్న.టాల్స్టాయ్ “అరాచకవాదే” అయితే, ఆయన ఈ నవలలో ఉద్దేశించింది అదే అయితే, ఈ “క్రైస్తవసూఫీ” (Tramp) అధ్యాయంతో నవల ముగించిఉండవలె కదా? కాని, నవలను  యిక్కడ ముగించలేదు.

ముగింపు

    నవల చివరి అధ్యాయం. నెఖ్లుడోఫ్ ఆరోజు జైలునుండి తన గదికి వచ్చాడు. కోటు విప్పుతూ, కోటుజేబులోని బైబిల్ కాపీ, ఆ ఆంగ్లక్రైస్తవప్రచారకుడు జైలులో యిచ్చినది, విసుగుగా విసిరి టేబుల్ మీద పడేశాడు. కటూషాతో తన కథ ముగిసింది. ఆమె నిరాకరణ అతనికి బాధగాను అవమానంగాను కూడా ఉంది. అది ఒక వైపు. ఈ మధ్య జైళ్ళలో, ఖైదీల కష్టాలు, అధికారుల అమానుషత్వం అతని మనసును మథిస్తున్నాయి. సమాజంలో చెడు విర్రవీగుతోంది. దానిని ఎలా  అణచాలి? అసలు వీలవుతుందా? తన జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఇప్పుడు అతడి జీవితంలో ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవలసిన క్షణం.టేబుల్ మీద ఉన్న  బైబిల్ ను అందుకున్నాడు.దానిలో Sermon on the Mount భాగం తీసి అందులో క్రీస్తు బోధలను చదివి, వాటికి అనుగుణంగా నడచుకోవడం ఒక్కటే మార్గమని, ఆమార్గంలో నడవాలని నిశ్చయించుకుంటాడు. క్రైస్తవమతాన్ని, మతప్రచారంలోని  కాపట్యాన్ని అసహ్యించి అవహేళన చేసిన టాల్స్టాయ్, నవలను ఈ సుదీర్ఘమైన బైబిల్ పాఠంతో ముగించడంలో పరమార్థమేమిటి?ఆయన “క్రైస్తవ అరాచకం”లో క్రైస్తవమెంత, అరాచకమెంత? ఏమిటి ఈ నవల ముగింపులోని సందేశం?
          నెఖ్లుడోఫ్ టేబుల్ మీద ఉన్న ఆ బైబిల్  కాపీని అందుకోడంలో ఒక కీలకమైన, నవలకు ప్రాణభూతమైన,  సంకేతం ఉంది. ఆ బైబిల్  ఆంగ్లక్రైస్తవప్రచారకుడు జైలులో ఖైదీలకు  పంచుతూ తనకూ యిచ్చిన కాపీ. తన గదికి వస్తూనే,కోటువిప్పుతూ తన కోటు జేబులోనుండి తీసి టేబుల్ మీదికి విసుగుగా విసిరి వేసిన కాపీ. ఆ బైబిల్ కాపీనే నెఖ్లుడోఫ్ తన చేతిలోకి తీసుకోవడం ఒక సంకేతం.ఆ తీసుకోవడం,  తాను వెనుక "విసిగి విసిరివేసిన" చర్చిని క్రైస్తవాన్ని   స్వీకరించడానికి మాత్రమే  సంకేతం కాదు. ఆ కాపీ తాను తన మనసులో ఒక క్షణం క్రితం వరకు తిరస్కరించిన  సమస్తసామాజికవ్యవస్థలకు ఉపలక్షకం. అంటే, వెనుక తిరస్కరించినవాటినన్నిటినీ స్వీకరిస్తున్నాడని సంకేతమా? వెనుక ఆగ్రహకారణాలైన అన్యాయాలకన్నిటికీ తలవొగ్గమనే అర్థమా? కాదు.అన్యాయంపట్ల అమానుషత్వం పట్ల  అసహ్యము ఆగ్రహము కలగకపోవడం అసహజం. మానవత లోపించడమే. కాని,ఏ సమాజంలోనూ  ఏ కాలంలోనూ  అవ్యవస్థ అన్యాయం  అమానుషత్వం ఉంటూనే ఉంటాయి.వ్యక్తి  వాటిపై ఆగ్రహిస్తూ వాటిని ఎదురిస్తూ ఉండవలసిందే. పోలీసు, కోర్టులు, సైన్యము, పరిపాలనాయంత్రాంగము, ఈ వ్యవస్థలనన్నిటినీ నడిపించే అమానవత, యివన్నీ ఏదో ఒక రూపంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి."హుష్ కాకి" అంటే ఎగిరి పోయేవి కావు. మనిషిలోని మానవతకు పరీక్షగా నిలిచిఉంటాయి. కాని,  ఎటువంటి అవ్యవస్థలోనూ వ్యక్తి  వ్యక్తిగా ఎదగగలడు, ఎదగవలె. ముక్తి  వ్యక్తికే గాని, వ్యవస్థకు లేదు.సృష్టిలో  ద్వైవిధ్యం  వదలదు, వదిలిపోవలసింది ద్వైధీభావం.  వ్యక్తికి  ఈ  ఎరుక ఎలా కలుగుతుందో ఎప్పుడు కలుగుతుందో తెలీదు. అది ఒక్క క్షణంలో, మెరుపులాగా కలుగుతుంది. నెఖ్లుడోఫ్ కు  ఆ "ఎరుకమెరుపు" మెరిసింది.("అది అయింది","It happened ") ఆ తరువాత జీవితం మరో జీవితమే, పునరుత్థానమే."Resurrection."
     

నవల:రూపము, వస్తువు (Form and Content)

    ఈ నవల గురించి సాధారణ అభిప్రాయం, ఇది రచయిత తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక పాత్రను సృష్టించుకొన్నాడు, కనుక నవల ఒక ఉపన్యాసంగా ఒక సామాజికకరపత్రంగా తయారైంది అని. ఇది సరి అయిన అభిప్రాయం కాదు. నిజానికి, ఈ నవలలో ప్రసిద్ధమైన తక్కిన రెండు నవలలో వలె ఉపన్యాసాలు లేవనే చెప్పాలి. ఈ నవలలో రచయిత అభిప్రాయాలు వాస్తవంలో కథానాయకుడి అంతర్మథనంలో అంతర్భాగమే.పాత్ర ఎదుగుదలలో భాగం. ఇక, ఈ నవల రాసేనాటికి  టాల్స్టాయ్  సృజనాత్మకప్రజ్ఞ మందగించిందని, కళాత్మకంగా వస్తువును ఆవిష్కరించలేకపోయాడని కూడా సాధారణ అభిప్రాయం. ఇది కూడా,పాఠకుడు రచనలోని శిల్పాన్ని, ముగింపులోని ప్రాణభూతమైన సంకేతాన్ని , గుర్తించలేకపోవడమేగాని,రచయిత  ప్రజ్ఞ మందగించడం కాదనిపిస్తుంది. రచయిత  అనుకున్నట్టు  నవల నెలలు నిండకముందే బయటపడలేదు, విమర్శకులన్నట్టు  అది ఒక బృహద్గ్రంథంలోని  శకలము కాదు. అది సకలము సంపూర్ణము.
      టాల్స్టాయ్  ప్రజ్ఞ ఏమాత్రము తరగలేదు.వయ:పరిపాకంతో జీవితదృక్పథం పరిణతమై, అనుగుణంగా శిల్పం పదునైంది. మేస్లోవా నెఖ్లుడోఫ్ ల ముగ్ధప్రథమప్రణయసన్నివేశవర్ణనలలో టాల్స్టాయ్   పాటవం ఏ మాత్రము తగ్గలేదు.ఆ పాత్రలవలె , ప్రేమలో ఎదిగి ఒదిగినవారు సాహిత్యంలో అరుదు.జార్ ప్రభుత్వంలోని అమానుషత్వాన్ని, ఆ పరిస్థితులలో పాత్రలు ఎలా నలిగారు, ఎలా ఎదిగారో, ఈ రెంటినీ పడుగుపేకలలాగా అల్లడంలో అద్భుతమైన రచనా శిల్పాన్ని ప్రదర్శించాడు టాల్స్టాయ్.  రూపము వస్తువు కలిసి ఎదిగిన అపురూపరచన  టాల్స్టాయ్  నవల.
    టాల్స్టాయ్ పై దోస్తోవ్ స్కీ ప్రభావం   ఈ నవలలో బలంగా కనిపిస్తుంది. ( కథలో, నెఖ్లుడోఫ్ మొదటిసారి కటూషాను కలిసినపుడు ఆమెకు దోస్తోవ్ స్కీ నవలలు యిస్తాడు.) కాని ఎవరి శైలి వారిదే. నెఖ్లుడోఫ్  రాస్కోల్నికోఫ్ కాడు, డిమిట్రి కాడు. ఇతనిలో వారిలో వలె తీవ్రమైన అంతర్మథనం ఉండదు. క్రమంగా బుద్ధిని శిక్షించి తనను తాను మలచుకుంటాడు.
     ఖైదీల కష్టాలను మరీ దీర్ఘంగా వివరిస్తున్నాడు అనిపించ వచ్చు, అక్కడక్కడా.చివరి బైబిల్ పాఠం మరీ స్కూలుపిల్లల పాఠంలా అనిపించవచ్చు. మొదటి సారి నవల చదివేటప్పుడు ఆ భాగాలను దాటెయ్యవచ్చు. మహాభారతం మొదటిసారి చదినప్పుడు శాంతిసప్తకం ఎంతమంది చదువుతారు? కాని భారతంలో ఆ శాంతిని తొలగించగలమా? "" యుద్ధషట్కము శాంతిసప్తకము పడుగుపేకగా అల్లిన నవల "పునరుత్థానం",(The Resurrection )
     కావ్యానికి పరమప్రయోజనం పాఠకుడి శిక్షితచిత్తం. ( మహాభారతాన్ని ముగిస్తూ తిక్కన యిదే అంటాడు, "శిక్షితచిత్తులార!", అని.) టాల్స్టాయ్  నవలకు  ఫలం ఆ శిక్షితచిత్తమే. శిక్షలో ప్రక్షాళనమై చిత్తం శాంతస్స్థితిని పొందుతుంది. ఆ శాంతంలోనే పర్యవసిస్తుంది  ఈ నవల.
         " యుద్ధము శాంతి" కంటే ఈ నవల ఎక్కువ కష్టం కాదు,చదవడం.  చదవకపోవడం గొప్ప నష్టం.

No comments:

Post a Comment