Sunday, June 30, 2019

వసంతం (వచనకవిత)

3.వసంతం

వెదుకుతూనే  ఉన్నాను.వసంతం ఎక్కడుంటుందని. వనాలలో  ఉపవనాలలో కొమ్మలలో కొండలలో రెమ్మలలో వేపపూతలో  కోయిలకూతలో పంచాంగాలలో పచ్చితాటాకుల చలిపందిరిలో
చంద్రబింబాలలో మామిడితోపులనీడలలో  మంద్రస్వరాలలో పులుసులోకి తరిగిన ముణగకాడముక్కల్లో  రవీంద్రభారతిరంగస్థలంలో సుగంధబంధురసమీరంలో ఉగాది కవిసమ్మేళనంలో వెదుకుతూనే ఉన్నాను.
వసంతం ఎక్కడుంటుంది?నీవు పూస్తే వాకిట్లో చెట్టు కూస్తే అది వసంతమా? నీవు కూస్తే కొమ్మ పూస్తే అది వసంతమా? ఏ రూపంలో వస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎట్లా వస్తుంది?
ఇంటికొచ్చిన చుట్టం సంచి సర్దుకొని జిప్పులాగుతూ వెళ్ళొస్తానంటే,”ఈవేళ ఉండిపోలేవా, రేపు వెళ్లరాదా,” అన్నానా, ఎప్పుడైనా? వసంతం ఎక్కడుంటుంది? వెదికివెదికి అలసిపోయాను. కన్ను మూశాను. అప్పుడు చూశాను చూశాను పూసిన కూసిన వసంతాన్ని శింశుపశాఖపై.
వసంతం కొమ్మ దిగివచ్చి వెళ్ళొస్తానంటే ‘ఈవేళ ఉండిపోలేవా, రేపు వెళ్ళవా”అన్నాను, గడపదాకా  నడిచి వచ్చి, వాకిలి వద్ద ఆగిపోయిన కన్నుల కడలిని రెప్పలతో కప్పుతూ.
ఎవరో అన్నారు, వసంతం కోతిరూపంలో తిరుగతూంటుందని. చరద్వసంతం ఋతువెరుగని శరద్వసంతం.

[యది త్వం మన్యసే తాత వసైకాహమిహానఘ।క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంత: శ్వో గమిష్యసి॥సుందరకాండ:56.3.’ఇవేళ ఉండు, రేపు వెళ్ళు’ అనలేదు జానకి హనుమతో. ‘ఒక్కపూట ఉండిపోవా,నీకు కష్టం లేకపోతే (యది త్వం మన్యసే తాత)’, అంటోంది. వాల్మీకి ఆమె మనస్స్థితిని యింతకంటే కదిలించే విధంగా వందలశ్లోకాలలో వివరించినా చెప్పలేడు.]

1 comment:

  1. చూపుడు వేలు చంద మామ కాదు.. వసంతం అంటే ఏమిటో చాలా బాగా చెప్పారు సర్
    ప్రతాప చంద్ర శేఖర్

    ReplyDelete